బైబిల్ ప్రవచనాల్లో విశ్వం యొక్క అంతం

nuclearexplosion.png

ప్రభువైన యేసు క్రీస్తు వెయ్యేళ్ళ పాలన తరువాత రక్షణ పొందకుండా మరణించిన వారు సమాధులలో నుండి లేపబడి దేవుని యొక్క ధవళ సింహాసనము ముందు నిలబడి తీర్పు పొందుతారు. నరకములో త్రోయబడతారు. రక్షించబడిన విశ్వాసులు పరలోకము వెళ్తారు. ఈ విశ్వాన్ని దేవుడు నాశనము చేస్తాడు.

ఈ విశ్వము ఊహించలేనంత పెద్దది, ఆశ్చర్యమైనది, భయంకరమైనది. అయితే దేవుడు దీనిని అంతము చేస్తాడు. నమ్మశక్యముగా లేకపోయినా ఇది నిజము. అది ఎలా జరుగుతుందో పేతురు గారు ప్రవచించాడు.

అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి,

తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,

ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను?

పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును

సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి యున్నదే అని

చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను

ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు

నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన

కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.

ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు

దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై,

అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి.

ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను,

వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

  1. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును

గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును

నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు

మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

  1. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును.

ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,

పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును,

భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

  1. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు

రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు

మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,

  1. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు,

దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను

భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

  1. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి

క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు చున్నాము;

వాటియందు నీతి నివసించును. 2 పేతురు 3:3-13

 

ఈ వాక్య భాగములో నుండి 10 విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుచున్నాను.

 

1.అంత్య దినాలు

2.అపహాసకులు

3.అత్యాశ

4.అపోహ

5.అజ్ఞానం

6.అనర్ధం

7.అవకాశం

8.అర్దాంతరం

9.అగ్ని ప్రళయం

10.అపేక్ష

 

1.అంత్య దినాలు

ఇది అంత్యదినాలలో జరిగే ప్రళయం. దేవుడు మానవాళి పట్ల ఎంతో దీర్ఘశాంతముతో వ్యవహరించాడు. జలప్రళయము లో కూడా మానవాళిని రక్షించాడు. నోవహు సంతానము రక్షించబడింది కానీ తదుపరి తరములలోవారు దేవుని భయాన్ని కోల్పోయారు. పాపము లోకములో పెరిగిందే కానీ తగ్గలేదు. మనిషికి దేవుడు ఇచ్చిన సమయము అంత్య దినాల్లో ముగుస్తుంది. ఈ విశ్వాన్ని కూడా దేవుడు అప్పుడు భస్మము చేస్తాడు. మనిషి తరువాత ఈ విశ్వముతో దేవునికి పనిలేదు. దీనిని బట్టి మానవుల కోసమే దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అని మనకు అర్థం అవుచున్నది. అవిశ్వాసులకు ఈ సత్యము మింగుడు పడదు. వారి దృష్టిలో ఈ విశ్వములో మనిషి స్థానము చాలా అల్పమైనది, ఎన్నిక కానిది. విశ్వమే ఒక ప్రమాదం, జీవము దాని పరిణామము, చివరికి మానవులు విద్భవించుట ఇవన్నీ ప్రమాదాలే అని వారు అనుకొంటారు.

  ప్రసిద్ధ ఖగోళశాస్త్రవేత్త కార్ల్ శాగన్ తన జీవితములో సింహభాగం ఇతర గ్రహాల్లో జీవుల కోసం వెతుకుతూ గడిపాడు. వారి యొద్ద నుండి ఏమన్నా సంకేతాలు, సమాచారం మనకు అందుతుందేమో నని రేడియో టెలిస్కోపులు నిర్మించాడు. జీవితమంతా వెదుకుతూ, వేచి చూచినా ఆయనకు ఒక్క సంకేతము కూడా గ్రహాంతర జీవుల నుండి రాలేదు. లేని వారి కోసము జీవితమంతా వెదికిన ఈ పెద్ద మనిషి కి విశ్వాన్ని మనకోసము సృష్టించిన దేవుని వెదకుట కోసము ఒక్క గంట కూడా గడుపలేదు. ఆయన ‘Contact’ కాంటాక్ట్  అనే నవల వ్రాశాడు. అందులో కథానాయక ఎల్లి. ఆమె ఒక ఖగోళ శాస్త్రవేత్త. గ్రహాంతర వాసుల దగ్గర నుండి ఏమైనా సమాచారం వస్తుందా అని ఆమె రాత్రింబగళ్లు టెలిస్కోపుల దగ్గర గడుపుతుంది.

 ఆ సందర్భములో కార్ల్ శాగన్ కొన్ని మాటలు ఆ నవలలో వ్రాశాడు.

“So why had we received no signal? Could Dave possibly be right? No extraterrestrial civilizations anywhere? All those billions of worlds going to waste, lifeless, barren? Intelligent beings growing up only in this obscure corner of an incomprehensibly vast universe? No matter how valiantly she tried, Ellie couldn’t make herself take such a possibility seriously. It dovetailed perfectly with human fears and pretensions, with unproved doctrines about life-after-death, with such pseudosciences as astrology. It was the modern incarnation of the geocentric solipsism, the conceit that had captured our ancestors, the notion that we were the center of the universe.”

“గ్రహాంతర జీవులు లేవా? కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు జీవం లేకుండా, పనికి రాకుండా, నిష్ప్రయోజనముగా పడి  ఉన్నాయా? ఊహకందనంత విస్తీర్ణములో ఉన్న ఈ విశ్వములో తెలివిగల జీవులు కేవలము ఈ బుల్లి భూ గ్రహమునకే పరిమితమయ్యారా? జ్ఞానము గల జీవులు ఈ భూమికే పరిమితమయ్యారు అనే ఆలోచనను ఎల్లి అంగీకరించలేకపోయింది. ఆ ఆలోచన మనిషి భయాల్లో నుండి పుట్టిందని ఆమె ఉద్దేశ్యము. మరణము తరువాత జీవము ఉన్నదనుకొనుట మూఢనమ్మకం. దానికి ఆధారాలు లేవు. అది వాస్తు శాస్త్రము వంటిది. మన పితరులకు అటువంటి పిచ్చి ఆలోచనలు ఉండేవి. ఈ విశ్వానికి తామే కేంద్రము అని వారు జీవించారు”

ఊహకందనంత విస్తీర్ణములో ఉన్న  ఈ విశ్వములో తెలివిగల జీవులు కేవలము ఈ బుల్లి భూ  గ్రహమునకే పరిమితమవ్వుట నేటి మేధావులకు ఒక మూఢ నమ్మకముగా కనిపిస్తుంది. మరణము తరువాత జీవం ఉన్నదనుకొనుట వాస్తును నమ్ముట వంటి పిచ్చి నమ్మకం అని వారు అనుకొంటారు. మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకమునకు వచ్చి అనేక మహిమ కార్యములు చేసి, ప్రవక్తల వాగ్దానాలు నెరవేర్చి, మరణమును జయించి తిరిగి లేచాడు. అంతకన్నా ఆధారాలు కావాలా? మానవాళి గ్రుడ్డిగా ఉద్భవించలేదని, వారిని దేవుడు ప్రత్యేకముగా సృష్టించాడని, వారిని ఎంతో ప్రేమించి వారి కోసము తన కుమారుణ్ణే త్యాగముచేశాడని యేసు ప్రభువు స్పష్టముగా చెప్పాడు. ఆయన మాటలు చాలవా? అవి వాస్తు శాస్త్రముతో సమానమా?

 విశ్వానికి మానవులు కేంద్రము అనుకొనుట పిచ్చి ఆలోచన కాదు. మానవ చరిత్ర తరువాత విశ్వమును అంతము చేస్తూ దేవుడు ఈ విశ్వము మానవుల కొరకే ఆయన చేశాడు అనే సత్యము మనకు తెలియజేస్తున్నాడు. ఇది మన తలకు మించిన ఆలోచనే అయినప్పటికీ అది సత్యము.

2.అపహాసకులు

ఒక రోజుల్లో దేవుని మీద నమ్మకము లేకపోయినా చాలా మంది మౌనముగా ఉండేవారు. అయితే ఇప్పుడు దేవుని నామాన్ని దూషించటం ఫ్యాషన్ అయ్యింది. ఒక రోజుల్లో యేసు ప్రభువు ను నమ్మకపోయినా ఆయనను గౌరవించేవారు. ఇప్పుడు ఆయన మీద జోక్ లు వేసి నవ్వుకోవటము మనము చూస్తున్నాము. టీవీ షోలలో క్రైస్తవ్యమును అపహాస్యము చేయుట పరిపాటి అయ్యింది. అంత్యదినాల్లో ఈ అపహాసకులు ఇంకా రెచ్చిపోతారు అని పేతురు గారు ఇక్కడ ప్రవచించాడు. ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరుట మనము చూస్తున్నాము.

3.అత్యాశ

“తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు..”

వీరు దేవుని మీద తిరుగబడి, ఆయన అధికారాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? ఎందుకంటే వీరు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొంటారు. వీరు తమ పాపమును ప్రేమిస్తారు. పరిశుద్దతను కోరుకొనే దేవుని సహవాసము వీరికి గిట్టదు.

  ఈ మధ్యలో శ్రీలంక లో ఇస్లామిక్ తీవ్రవాదులు చర్చిలలో బాంబులు పెట్టి వందలాది మంది క్రైస్తవులను పొట్టనపెట్టుకున్నారు. హిందువుడైన భారత ప్రధాని నరేంద్ర మోడీ వాటిల్లో ఒక చర్చి ని సందర్శించి తన సంతాపాన్ని తెలియజేశాడు. ఇంగ్లాండ్ లో అండి వెస్ట్ అని ఒక కమెడియన్ ఉన్నాడు. అతను మాత్రము, ‘క్రైస్తవుల కోసము ప్రార్ధన చేయవద్దు. క్రైస్తవ మిషనరీలు శ్రీ లంకలో బౌద్ధులైన చిన్న పిల్లలను క్రైస్తవులుగా మారుస్తున్నారు’ అన్నాడు. ఒక ఘోరమైన టెర్రరిస్ట్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన క్రైస్తవులకు కనీస సానుభూతి చూపించకుండా అండి వెస్ట్ పైశాచిక ఆనందము వెలిబుచ్చాడు. అతడు మరొక మగవాణ్ణి పెళ్లిచేసుకొన్నాడు. బైబిల్ స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకించుట జీర్ణించుకొనలేక క్రైస్తవులను, దేవుని ద్వేషించుటకు అండి వెస్ట్ లాంటి వారు అలవాటుపడ్డారు. వీరు దేవుని హెచ్చరికలు పట్టించుకోరు ఎందుకంటే వారు తమ స్వకీయ దురాశలు చొప్పున నడచుకొంటారు.

4.అపోహ

“పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి

యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను”

 అంత్యదినములలో అపహాసకులు వచ్చి, ‘సమస్త మును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు’ అని పేతురు గారు తెలియచేసాడు. దేవుడు ఈ విశ్వాన్ని

సృష్టించాడు. భూమిని జలముల లో నుండి సృష్టించాడు (ఆదికాండము 1:6-9). భూమి మీద బలాత్కారము పెరిగినప్పుడు సర్వ జీవులను జల ప్రళయములో నాశనము చేశాడు. అప్పుడు భూగోళము ఎన్నో గొప్ప మార్పులకు గురయ్యింది.

అయితే అపహాసకులు బైబిల్ చెప్పే చరిత్రను నమ్మరు. దేవుడు ఉన్నాడని, ఆయన జలప్రళయము తెచ్చాడని వారు విశ్వసించరు. దీనిని యూనిఫార్మిటేరియనిజం (Uniformitarianism) అని పిలుస్తారు. ప్రస్తుత భూమి, దాని మీద ఉన్న భౌతిక పరిస్థితులు, జీవ రాశి కోట్లాది సంవత్సరాలుగా జరిగిన చిన్న, చిన్న మార్పుల వలన వచ్చినవేనని వారి ప్రగాఢ నమ్మకము. దీనికి వారు సైన్స్ ముసుగు వేశారు.

   దేవుడు సైన్స్ కి వ్యతిరేకము కాదు. సైన్స్ యుగానికి పునాదులు వేసింది క్రైస్తవులైన శాస్త్రవేత్తలే. సైన్స్ కి పితామహులైన ఐజాక్ న్యూటన్, లైబ్ నిజ్, రాబర్ట్ బాయిల్, జేమ్స్ కార్ల్క్ మాక్స్వెల్, మైఖేల్ ఫారడే, లార్డ్ కెల్విన్ గొప్ప, గొప్ప సైంటిస్టులు దేవుని నమ్మినవారే, బైబిల్ చదివి దానిని నమ్మినవారే.

ఐజాక్ న్యూటన్ వంటి మేధావి ప్రపంచ చరిత్రలోనే లేడు. దేవుడు భౌతిక నియమాలను ఏర్పరచి

విశ్వం మొత్తాన్ని తన ఉద్దేశ్యం ప్రకారం నడిపిస్తున్నాడని న్యూటన్ నమ్మాడు. ఆ దృక్పధముతో

న్యూటన్ తన సైంటిఫిక్ సిద్దాంతములలో దేవునికి కూడా ఒక స్థానము కల్పించాడు.

 

   అయితే, న్యూటన్ సిద్దాంతములతో ప్రేరణ పొందిన కొంత మంది శాస్త్ర వేత్తలు విశ్వ సృష్టిలో నుండి దేవుని పాత్రను విస్మరించటం మొదలుపెట్టారు. వారికి ఆద్యుడు పియర్ సీమోన్ లప్లాస్ (1749-1827). సృష్టికి భౌతిక నియమాలు చాలని, దేవుడు అక్కర లేదని లప్లాస్ సిద్దాంతీకరించాడు.

విశ్వ సృష్టి మీద లప్లాస్ ‘సెలెస్టియల్ మెకానిక్స్’ అనే గ్రంధాన్ని వ్రాసాడు. దీనిలో భూమి ఒక పెద్ద

వాయు మేఘములో నుండి జనించినదని వ్రాసాడు. భూమి నీటిలో నుండి దేవుని చేత సృస్టించబడినదని తెలుపు బైబిలు సత్యాన్ని తృణీకరించాడు. ఆ పుస్తకావీష్కరణకు విచ్చేసిన, నెపోలియన్ బొనపార్ట్ (1769-1821) చక్రవర్తి, ‘గొప్ప సైన్స్ పుస్తకం వ్రాశావు. మంచిదే. కానీ, అందులో

ఒక్క సారయినా దేవుని గురించి ప్రస్తావించావా?’ అని లప్లాస్ ని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ, లప్లాస్, ‘సార్, నా సిద్దాంతానికి  దేవుడు అక్కరలేదు’ అని చెప్పాడు.

    ఎంత అహంకారమో చూడండి. దేవుడు మాకు అక్కరలేదు అని నెపోలియన్ చక్రవర్తితో అన్నాడంటే, వారికి అతిశయము, అహంకారము ఎంతగా తలకెక్కాయో మనం అర్థము చేసుకోవచ్చు. విశ్వం యొక్క ప్రతి అణువు యొక్క దశ, దిశ ఎప్పుడో నిర్ణయించ బడ్డాయని, విశ్వం ఎప్పటికీ యిలాగే ఉంటుందని లప్లాస్ వ్రాసాడు.

దేవుడు అక్కర లేని సైన్స్ – దేవుడు లేని విశ్వం

దేవుడు అంటే అక్కసు పెంచు కొన్న లప్లాస్ వంటి కొంత మంది శాస్త్ర వేత్తలు తమ సైన్స్ సిద్దాంతము

లలో దేవుడు లేని విశ్వాన్ని ఆవీష్కరించారు. ఈ సిద్దాంతములు తరువాత అనేక మంది నాస్తికులను

ఆకర్షించాయి. సమాజములోని చిన్న, చితక మేధావులు కూడా ఈ వాదాలను నమ్మి ప్రజలను సృష్టికర్త నుండి మరల్చారు. వీరంతా మన భూమి, విశ్వం కల కాలం ఇలాగే ఉంటాయని ప్రచారం

చేస్తున్నారు. బైబిలు లో దేవుడు చెప్పిన వాస్తవాలను అపహాస్యం చేయటం వీరికి నిత్యకృత్యం గా

మారింది. అయితే దేవుడు వీరికి వారు ఊహించని షాక్ ఇవ్వబోవుచున్నాడు. వీళ్లకు ఉన్న పెద్ద అపోహను పేతురు గారు ఇక్కడ వివరిస్తున్నాడు.

5.అజ్ఞానం

 

“ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు

నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు

బుద్ధిపూర్వకముగా మరతురు.ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో

మునిగి నశించెను”

 

వీరి యొక్క అజ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది? వీరి యొక్క అపోహలో నుండి వచ్చింది.

వారు తాము చాలా జ్ఞానులు అని అనుకొంటారు. అయితే వారిలో చాలా అజ్ఞానము ఉంది.

రెండు విషయాల్లో వీరి అజ్ఞానము స్పష్టముగా కనిపిస్తుంది:

  1. సృష్టి కార్యము
  2. జల ప్రళయము

 

  1. సృష్టి కార్యము:

 

“ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను

సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా

మరతురు.”

    ఈ అపహాసకులు దేవుడు సృష్టికర్త అన్న ప్రాథమిక సత్యాన్ని వ్యతిరేకిస్తారు. ఈ విశ్వము గణిత శాస్త్ర భాషలో వ్రాయబడింది అని గలిలియో శాస్త్రవేత్త అన్నాడు. గణిత భాషలో నిర్మితమైన ఈ విశ్వాన్ని గణిత భాషలో క్రోడీకరించగల శక్తి మానవ మైండ్ కి ఉంది. విశ్వము గ్రుడ్డిగా ఏర్పడితే, మానవ మైండ్ గ్రుడ్డిగా ఏర్పడితే ఇది సాధ్యపడేది కాదు.

కేంబ్రియన్ ఎక్సప్లోషన్: భూమిని త్రవ్వితే ఇంతకు ముందు చనిపోయిన జంతువుల శిలాజాలు మనకు కనిపిస్తాయి. జంతువుల శిలాజాలు తమ వర్గముల చొప్పున భూమి పొరల్లో ఒక్కసారే కనిపించుట సర్వసాధారణము. పరిణామము జరిగితే అవన్నీ ఒక్కసారే కనిపించవు. డార్విన్ చెప్పినట్లు పరిణామము జరిగి ఉన్నట్లయితే, ముందు ఏకకణ జీవులు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత బహుకణజీవులు, పురుగులు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత చేపలు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత కప్పలు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత బల్లులు వంటి జంతువులు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత పక్షులు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత క్షీరదాలు, ఆ తరువాత కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత మనిషి ఉద్భవించారు. నిజముగా, జీవ పరిణామము ఈ విధముగా జరిగితే ఫాసిల్ రికార్డు లో శిలాజాలు ఆ విధముగా ఉండాలి కదా?

    డార్విన్ చెప్పినట్లు జీవ పరిణామము జరిగి ఉంటే, విభిన్న తరగతుల జీవుల యొక్క శిలాజాలు భూమియొక్క పొరల్లో క్రమ క్రమముగా కనబడాలి. కానీ ఫాసిల్ రికార్డు ఆవిధముగా లేదు. విభిన్న తరగతుల జీవుల యొక్క శిలాజాలు భూమియొక్క పొరల్లో ఒకేసారి కనబడుతున్నాయి. బైబిల్ లో చెప్పినట్లు జీవ పరిణామము 6 రోజుల్లో జరిగింది కాబట్టి ఫాసిల్ రికార్డు ఆ విధముగా ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పరిణామ వాదులు ఎందుకు పట్టించుకోరు?

   పేతురు గారు ఏమన్నాడంటే, ‘వారు బుద్ధిపూర్వకముగా మరతురు’ (Willingly Ignorant of). వినేవాడికి చెప్పవచ్చు. ‘నాకు చెప్పొద్దు బాబోయ్’ అని చెవులు మూసుకొనే వాడికి చెప్పలేము కదా!

  1. జల ప్రళయము

రెండవదిగా, వారు జల ప్రళయమును మరచిపోతారు.

“ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను”

దేవుడు జోక్యము చేసుకోబట్టే కదా జల ప్రళయము వచ్చింది! అంత నీరు ఎక్కడ నుండి వచ్చింది?

2005 సంవత్సరములో అమెరికా దేశమునకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ NASA ఒక కామెట్ ని అధ్యయనము చేసింది. అది 330 అడుగుల పరిమాణము గల గుంటను ఏర్పరచింది.దానిలో 50 లక్షల కిలోల నీరు ఉంది. సౌర కుటుంబము ఏర్పడినప్పుడు దానిలో చాలా చోట్ల నీరు ఉండే అవకాశము ఉంది. ఒక్క భూమి మీదే నీరు ఉందని మనము అనుకోకూడదు. కొన్ని కామెట్స్ ని, భూమి అంతర్భాగాన్ని ఉపయోగించి దేవుడు భూమిని జలప్రళయములో నాశనము చేశాడు.

మరోసారి భూమిని జలప్రళయము ద్వారా నాశనము చేయనని దేవుడు మానవులకు మాట ఇచ్చాడు.

జేమ్స్ హట్టన్ James Hutton (1726-1797) ఏమన్నాడంటే

Present is the key to the past  

‘గతాన్ని వర్తమానము వెలుగులో చూడాలి’ ఇది లోక నీతి. బైబిల్ దీనికి ఒప్పుకోదు. The Past is the key to the present and the future అని బైబిల్ చెబుతుంది. అంటే గతం ఆధారముగా ప్రస్తుతాన్ని, భవిష్యత్తును చూడాలి. గతములో దేవుడు భూమిని జల ప్రళయము ద్వారా నాశనము చేశాడు కాబట్టి, ఆయన హెచ్చరికలు నిరర్థకం కావు అని మనకు అర్థము అవుచున్నది.

6.అనర్ధం

వీళ్ళ అపోహలను, అజ్ఞానాన్ని, అపహాస్యాలను దేవుడు ఎంతో కాలము సహించడు. అనర్థము వస్తుంది.

అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. 2 పేతురు 3:7

 

సమస్త జీవరాశి దేవుని వాక్యము వలన పోషించబడుచున్నవి. అయితే భక్తిహీనులు ఒక్క నిమిషము కూడా దేవునికి  కృతఙ్ఞతలు చెప్పరు.అయితే ఈ ప్రకృతిని దేవుడు భద్రపరచడము ఆపి వేసిన తరువాత వారి మీదకు అకస్మాత్తుగా అనర్థము వస్తుంది.

7.అవకాశం

రక్షణ పొందుటకు దేవుడు ప్రస్తుతము ప్రతి వ్యక్తికీ అవకాశము ఇస్తున్నాడు.

“ ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి.

ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను,

వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు

ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు

గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక,

అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల

ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు” 2 పేతురు 3:8-9

     న్యూటన్ భౌతిక శాస్త్రములో సమయము స్థిరమైనది భావించబడింది. అల్బెర్ట్ అయిన్ స్టీన్ అనే శాస్త్రవేత్త సమయము స్థిరమైనది కాదు అని తన సాపేక్ష సిద్ధాంతములో తెలియజేశాడు.యూదుడైన అల్బెర్ట్ అయిన్ స్టీన్ ఆ సత్యాన్ని గ్రహించుటలో బైబిల్ పాత్ర కూడా ఉంది.కాలము స్థిరమైనది కాదని దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. ‘ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.’ దేవుడు నిత్యత్వములో ఉండేవాడు, ఆయన కాలమునకు అతీతుడు. రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చనిపోయాడు. అయితే, ‘నా కుమారుడు వీరి కోసము సిలువ వేయబడింది రెండు రోజుల క్రితమే కదా! వీరికి మరికొంత సమయము ఇద్దాము’ అని దేవుడు అనుకొంటాడు.

   అయితే దేవుడు ఇచ్చే సమయానికి కూడా ముగింపు ఉంది.సమయాన్ని దేవుడు ప్రకృతి నిర్మాణములోనే బంధించాడు.కాలము యొక్క స్వభావమే ఒక పెద్ద మిస్టరీ. భౌతిక నియమాలు ఎల్లప్పుడూ ఒకేలాగా వుంటాయి కానీ కాలం మాత్రం ఒక దిశ (unidirectionality of time) కలిగి ప్రయాణిస్తుంది. మనం బాల్యం, యవ్వనం, వృద్దాప్యం, మరణం నే జీవిత దశల గుండా వెళ్ళాల్సిందే. యవ్వనం తరువాత బాల్యం రాదు, వృద్దాప్యం తరువాత యవ్వనం రాదు. కోడి గ్రుడ్డు పగులగొట్టి ఆమ్లెట్ వేయగలము కానీ, ఆమ్లెట్ లోనుండి కోడి గ్రుడ్డును రాబట్టలేము కదా? కాఫీ లో పాలు కలుపగలము కాని ఆ తర్వాత కాఫీ లో నుండి పాలను వేరుచేయలేము కదా? ప్రకృతి లోని వస్తువులన్నీ ఇలా కాలధర్మం చెందాల్సిందే. దీనిని భౌతిక శాస్త్రం లో ‘సమయం యొక్క బాణం’ (Arrow of Time) అని పిలుస్తారు. బాణం ఒక దిశ కలిగి ప్రయాణిస్తున్నట్లు సమయం ప్రయాణిస్తున్నది.

  ఒక వ్యవస్తలోని సామర్ద్యం, క్రమ పద్దతి సమయం తో పాటు తగ్గుతాయే తప్ప పెరుగవు. ఒక కారు యొక్క సామర్ద్యం కాలం తో పాటు తగ్గిపోతుందే కాని పెరుగదు. ఇల్లు చక్కగా శుబ్రం చేసిన తరువాత, కొన్ని రోజులకు ఆ ఇంటిలో శుభ్రత తగ్గుతుందే కాని పెరుగదు. ఒక వ్యవస్తలో వుండే ఈ ‘అక్రమము’ ను భౌతిక శాస్త్రములో ‘ఎంట్రపీ’ అని పిలుస్తారు. ఈ విశ్వం లో ఉన్న ‘అక్రమము’ లేదా ‘ఎంట్రపీ’ కాలం తో పాటు పెరుగుతుందే తప్ప తరుగదు. ఈ సూత్రం ఉష్ణగతి శాస్త్రం యొక్క రెండవ నియమం లో ఇమిడి వుంది. దేవుడు విశ్వాన్ని సృష్టించిన మొదటి క్షణములో ‘ఎంట్రపీ’ (entropy) లేదు. అయితే ఆదాము పాపము చేసిన తరువాత ‘ఎంట్రపీ’ పెరగడం ప్రారంభించింది. దాని ప్రకారం విశ్వం లోని ‘అక్రమం’ కాలముతో పాటుగా పెరుగుతుంది తప్ప తరుగదు. కాబట్టి, ఇక ముందు సంభవించే ఉపద్రవాలు, కరువులు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, సునామీలు, వరదలు యొక్క తీవ్రత ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ కాదు. దీనిని బట్టి, ప్రకృతిని రక్షించాలని ప్రయత్నించటం ప్రకృతి విరుద్దం అవుతుంది. భౌతిక ప్రపంచాన్ని బాగు చేయాలని మనిషి చేసే ప్రయత్నాలు ఫలించవు. ప్రకృతి దానికి సహకరించదు. భౌతిక ప్రపంచం దేవుడు దానికి నిర్ణయించిన అంతం వైపు దూసుకుపోతుంది. భౌతిక ప్రపంచములో పెరుగుతున్న ‘అక్రమము’ లేదా  ‘ఎంట్రపీ’ ను మనము ఆపలేము. అయితే దేవుడు తాను నిర్ణయించిన సమయములో, నైతిక, సామాజిక అక్రమాలను అంతం చేసినట్లే, భౌతిక ప్రపంచములో పెరుగుతున్న అక్రమానికి కూడా అంతం పలుకుతాడు. అది ఎలా జరుగుతుందో దేవుడు తన వాక్యములో మనకు తెలియచేసాడు.

8.అర్దాంతరం

అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. 2 పేతురు 3:10

ఈ లోక నటన అర్ధాంతరముగా ముగుస్తుంది. ‘అంతా బాగానే ఉంది, దేవుడు మాటే ఎత్తవద్దు’ అని భక్తిహీనులు అనుకొంటారు. అయితే వారి ప్రణాళికలు అర్ధాంతరముగా ముగుస్తాయి. ఎందుకంటే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది.వారు ఊహించని సమయములో దేవుడు వారి కార్యక్రమములకు ముగింపు పలుకుతాడు.

   క్రైస్తవ్యము ఒక చెర సాల లాంటిది అని వారు భావిస్తారు. అయితే క్రైస్తవ్యము చెరశాల  కాదు. అది ఒక హాస్పిటల్ లాంటిది. గుండె నొప్పి వచ్చిన వ్యక్తి హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ ఆ రోగికి చెబుతాడు: ‘నీకు హార్ట్ ఎటాక్ వచ్చింది. మేము వెంటనే నీకు చికిత్స చేయాలి. లేకపోతే నీవు చనిపోతావు’. ‘నాకు నీ చికిత్స అక్కరలేదు. నేను ఇంటికి వెళ్తాను’ అని ఆ రోగి అంటే, ఆ డాక్టర్ యేమని చెబుతాడు? ‘బాబూ, నీకు అంత సమయము లేదు. నీ ముందు రెండు మార్గాలే ఉన్నాయి. నేను నీకు చికిత్స చేస్తే బ్రతుకుతావు, చేయకపోతే చనిపోతావు. ఆపరేషన్ థియేటర్ లేక మార్చురీ. ఆ రెండిటిలో ఒకటి మాత్రమే నీవు కోరుకోగలవు’ డాక్టర్ ఆ రోగికి చెప్పాడు.

   క్రైస్తవ్యము కూడా పాపికి అదే చెబుతుంది. నీ స్థితి ఏమాత్రము బాగాలేదు. నీ పాపాల్లో చనిపోతే నీవు నరకానికి వెళ్ళిపోతావు. అయితే ఒక పరమ వైద్యుడు నీ కోసము వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. ఆయన నిన్ను రక్షిస్తాడు. పాపికి ఆ దారి ఇష్టము ఉండకపోవచ్చు. ‘నాకు క్రీస్తు రక్షణ అక్కర లేదు. నేను నా దారి నేను చూసుకొంటాను’. క్రైస్తవ్యము యేమని ఆ పాపికి చెబుతుంది. ‘బాబూ, నీకు అంత సమయము లేదు. నీ ముందు రెండు మార్గాలే ఉన్నాయి. క్రీస్తును హత్తుకొంటే నీవు నిత్యజీవము పొంది పరలోకము వెళ్తావు. ఆయనను హత్తుకొనకపోతే నరకానికి వెళ్తావు. పరలోకము లేక నరకము. ఆ రెండిటిలో ఒకటి మాత్రమే నీవు కోరుకోగలవు’.

  అయితే భక్తిహీనులు పరలోకాన్ని, నరకాన్ని నమ్మరు. ప్రభువు దినము దొంగ వలె వచ్చి వారి అతిశయాన్ని అణచివేస్తుంది.

9.అగ్ని ప్రళయం

దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. భూమిని జలములలో నుండి సృష్టించాడు (ఆదికాండము 1:6-9).

  సర్ ఇసాక్ న్యూటన్ వంటి మహా శాస్త్రవేత్తలు ఈ సత్యాన్ని అంగీకరించారు. దేవుడు భౌతిక నియమాలను ఏర్పరచి విశ్వం మొత్తాన్ని తన ఉద్దేశ్యం ప్రకారం నడిపిస్తున్నాడని న్యూటన్ నమ్మాడు. ఆ దృక్పధముతో న్యూటన్ తన సైంటిఫిక్ సిద్దాంతములలో దేవునికి కూడా ఒక స్థానము కల్పించాడు.

   అయితే, న్యూటన్ సిద్దాంతములతో ప్రేరణ పొందిన కొంత మంది శాస్త్ర వేత్తలు విశ్వ సృష్టిలో నుండి దేవుని పాత్రను విస్మరించటం మొదలుపెట్టారు. వారికి ఆద్యుడు పియర్ సీమోన్ లప్లాస్ (1749-1827). సృష్టికి భౌతిక నియమాలు చాలని, దేవుడు అక్కర లేదని లప్లాస్ సిద్దాంతీకరించాడు. విశ్వ సృష్టి మీద లప్లాస్ ‘సెలెస్టియల్ మెకానిక్స్’ అనే గ్రంధాన్ని వ్రాసాడు. దీనిలో భూమి ఒక పెద్ద వాయు మేఘములో నుండి జనించినదని వ్రాసాడు. భూమి నీటిలో నుండి దేవుని చేత సృస్టించబడినదని తెలుపు బైబిలు సత్యాన్ని తృణీకరించాడు. ఆ పుస్తకావీష్కరణకు విచ్చేసిన, నెపోలియన్ చక్రవర్తి, ‘గొప్ప సైన్స్ పుస్తకం వ్రాశావు. మంచిదే. కానీ, అందులో ఒక్క సారయినా దేవుని గురించి ప్రస్తావించావా?’ అని లప్లాస్ ని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ, లప్లాస్, ‘సార్, నా సిద్దాంతానికి  దేవుడు అక్కరలేదు’ అని చెప్పాడు. విశ్వం యొక్క ప్రతి అణువు యొక్క దశ, దిశ ఎప్పుడో నిర్ణయించ బడ్డాయని, విశ్వం ఎప్పటికీ యిలాగే ఉంటుందని లప్లాస్ వ్రాసాడు.

 దేవుడు అంటే అక్కసు పెంచు కొన్న లప్లాస్ వంటి కొంత మంది శాస్త్ర వేత్తలు తమ సైన్స్ సిద్దాంతము లలో దేవుడు లేని విశ్వాన్ని ఆవీష్కరించారు. ఈ సిద్దాంతములు తరువాత అనేక మంది నాస్తికులను ఆకర్షించాయి. వీరంతా మన భూమి, విశ్వం కల కాలం ఇలాగే ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ విశ్వము ఏవిధముగా అంతమవుతుందో దేవుడు మనకు ఇక్కడ తెలియజేశాడు.

ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును,

పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో

లయమైపోవును, భూమియు దానిమీద నున్న కృత్యములును కాలిపోవును.

ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక,

ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు,

పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవును 2 పేతురు 3:10-11

ఆ దినము ఊహించుటకే భయంకరముగా ఉంది. ఒక సారి నేను హవాయి దీవులకు వెళ్ళాను.

ఒక రోజు కాఫీ త్రాగుతూ ఉంటే ఆ దీవులలో నివసించే వ్యక్తి నాతో అన్నాడు: ‘ఒకసారి, అగ్ని పర్వతాలు ప్రేలి లావా ఈ రోడ్డు మీదకు వచ్చింది’.ఆ మాటలు విని నాకు ఒళ్ళు జలదరించింది. ఏదో, గాలి పటం ఎగిరివచ్చింది అన్నంత ఈజీ గా చెబుతున్నావు! లావా ఇక్కడ దాకా వచ్చిందా?  అని అడిగాను.

అతను అన్నాడు: ‘రోడ్డు ఏమిటి? ఇళ్లల్లోకి కూడా వస్తుంది.చాలా మంది జనము ఇల్లు వదలి పారిపోయారు’ అన్నాడు.

   మరుసటి రోజు నేను ఒక హెలికాప్టర్ లో సమీపములో ఉన్న అగ్ని పర్వతము మీదకు వెళ్ళాను. 2000 వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో లావా ఆ అగ్ని పర్వతములో నుండి బయటకు వస్తూ నాకు కనిపించింది. కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తూ ఈ లావా సమస్తాన్ని దహించివేస్తున్నది. ఈ భూమి లోపల ఇంత శక్తి ఉందా అని నాకు అనిపించింది.

దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ప్రపంచాన్ని నాశనము చేయటకు భూమి కడుపులో ఉన్న అగ్ని పర్వతాలకు కొన్ని నిమిషాలు చాలు.  

అల్బెర్ట్ అయిన్ స్టీన్ యొక్క ప్రఖ్యాత సమీకరణము మనకు తెలిసిందే.

E = mC²

 

E – Energy, శక్తి

m – Mass, ద్రవ్య రాశి

C – కాంతి వేగము

ఈ సమీకరణము ఉపయోగించి ద్రవ్య రాశిని మనము శక్తిగా మార్చగలుగుచున్నాము. రెండో ప్రపంచ యుద్ధములో జపాన్ నగరాల మీద వేయబడిన అణుబాంబులు ఈ సమీకరణము ద్వారా తయారుచేసినవే.అణువులో నిద్రాణమయి ఉన్న శక్తి ని వుపయోగించి మనిషి గొప్ప వినాశనం కలుగ చేసే ఆటం  బాంబులు సృష్టించాడు. ఇక దేవుడు ప్రతి అణువు లోని శక్తి ని బయటికి తీస్తే కలిగే విస్ఫోటం ఏ విధంగా వుంటుందో ఊహించగలమా?

 హైడ్రోజన్ బాంబులు న్యూక్లియర్ ఫ్యూషన్ ద్వారా శక్తిని కలిగిస్తాయి. ఈ సత్యాన్ని మానవులు ఈ మధ్యనే తెలుసుకొన్నారు. అయితే ప్రతి సెకండ్ సూర్యునిలో కొన్ని కోట్ల హైడ్రోజన్ బాంబుల శక్తి విడుదల అవుచున్నది. సూర్యుడు ఒక పెద్ద హైడ్రోజన్ బాంబ్.

  ఇల్లు కట్టినవాడికి దానికి కూల్చివేయటము చేత కాదా? విశ్వాన్ని సృష్టించిన దేవునికి దానిని అంతము చేయడము కష్టము కాదు. 11 వచనము చూద్దాము:

ఆకాశములు రవులుకొని లయమైపోవును

పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవును

అణువులో ఎంతో శక్తి ఉంది. అణువులో ఒక కేంద్రము ఉంది. ఆ కేంద్రములో ప్రోటాన్లు, న్యూట్రాన్ లు ఉన్నాయి. కేంద్రము చుట్టూ అనేక కక్ష్యలలో ఎలెక్ట్రాన్ లు పరిభ్రమిస్తున్నాయి. ప్రోటాన్లలో క్వార్కులు, లెప్టాన్లు ఉన్నాయి. అంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. జెనీవా నగరంలోని CERN సైన్స్ పరిశోధన కేంద్రములో చేసిన ప్రయోగములలో జులై 4, 2012 లో హిగ్స్ బోసాన్ కనుగొనబడింది. దీని వలన హిగ్స్ ఫీల్డ్ ఉందని అర్ధము అవుచున్నది.

  ఈ భౌతికత దేని మీద నిర్మించబడింది? కణాల మీద కాకుండా శక్తి క్షేత్రముల మీద అది నిర్మించబడింది అని హిగ్స్ ఫీల్డ్ వలన అర్ధ మవుచున్నది. దేవుడు సమస్తమును శక్తి లో నుండే కలుగజేశాడు. గలాక్షీలు, నక్షత్రాలు, సౌర కుటుంబము, భూమి, జంతువులు, వృక్షాలు, మీరు, నేను – అన్నీ ఆ శక్తిలో నుండి పుట్టినవే. ఆ శక్తి లో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడే కాలము సంపూర్ణ మయినప్పుడు సమస్తమును కొద్ది క్షణాల్లో ఆ శక్తిలోకి మార్చివేస్తాడు.

10.అపేక్ష

రక్షించబడిన వారికి ఈ సత్యాలు విచారము కలిగించవు.ఎందుకంటే దేవుడు వారికి ఒక శుభవార్త ఇస్తున్నాడు. 12 వచనము నుండి చదువుతాము.

  1. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు,

దానిని ఆశతో అపేక్షించుచు,

మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

  1. అయినను మనమాయన వాగ్దానమునుబట్టి

క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టు చున్నాము;

వాటియందు నీతి నివసించును.

క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుని ప్రణాళికలో ఉన్నాయి. దర్శకుడు మెల్ గిబ్సన్ క్రీస్తు శ్రమల మీద

తీసిన చిత్రములో ఒక సన్నివేశము ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు తన సిలువను మోసుకొంటూ కల్వరియొద్దకు తొట్రుపడుచూ నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఒక చోట ఆయన దాహముతో క్రింద పడిపోతాడు.ఆయన తల్లి ఆ సంఘటనలు చూసి తట్టుకోలేకపోతుంది. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని యేసు ప్రభువు నోటికి అందిస్తుంది. అప్పుడు ఆయన తన తల్లితో అంటాడు: ‘అమ్మా, నేను సమస్తమును క్రొత్తవి చేస్తాను’

  ఆ మాటలు ఊహాజనితమయినవే కానీ అందులో ఒక గొప్ప బైబిల్ సత్యము ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు సృష్టి మొత్తాన్నీ పునరుద్దరించనున్నాడు. రక్షణ కార్యముతో పోల్చితే అది ఆయనకు కష్టమేమీ కాదు.

 మనలను క్రొత్త సృష్టిగా చేయుటకు ఆయన సిలువ వేయబడవలసి వచ్చింది. అంత శ్రమ లేకుండానే ఆయన క్రొత్త విశ్వాన్ని సృష్టించగలడు.

 గతములో జరిగిన జలప్రళయము వచ్చినప్పుడు నోవహు ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు.

భవిష్యత్తులో జరిగే అగ్నిప్రళయములో క్రీస్తు అనే ఓడలో ఉన్న వారు మాత్రమే రక్షించబడతారు.

మిత్రమా, క్రీస్తు అనే ఓడలో నీవు ప్రవేశించావా? నీవు రక్షించబడకపోతే మరొక నిమిషము కూడా వృధా చేయవద్దు. ఈ క్షణమే మోకరించి ప్రభువైన యేసు క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించి, ఆయనను ప్రభువుగా నీ జీవితములోకి ఆహ్వానించు.

డాక్టర్ పాల్ కట్టుపల్లి MD

Please make a donation to our ministry

We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.

$20.00

Leave a Reply