ప్రేమ సందేశం వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రొత్త సంవత్సరం వాతావరణం మనలను చుట్టుకొని ఉంది. ఈ రోజు నూతన సంవత్సరం సందేశము మీకు ఇవ్వాలని నేను ఆశపడుచున్నాను.ఈ క్రొత్త సంవత్సరాన్ని మనము ఎలాఎదుర్కోవాలి? ఈ రోజు 10 సత్యాలు మీకు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. నేను ప్రతిరోజూ కొన్ని వాట్సాప్ గ్రూప్ లను సందర్శిస్తాను. గుంటూరులో నాతో పాటు MBBS చదివిన వారందరూ ఒక గ్రూప్ పెట్టారు. వీరంతా ఇప్పుడు అనేక చోట్ల వైద్యులుగా పనిచేస్తున్నారు. ప్రతి రోజు మేము ఈ చాట్ గ్రూప్ లో మాట్లాడుకొంటాము. ఈ రోజు నా స్నేహితుడు ఒక మెసేజ్ పెట్టాడు.
‘జీవితము ఒక వృధా ప్రయాస.
బ్రతుకు తెరువు కోసం ఒక ఉద్యోగం,
కొంత ఆదాయము, కొంత
పొదుపు ఉంటే చాలు’
అతని మాటలు చదివినప్పుడు నాకు షేక్స్ పియర్ ఒక నాటకములో వ్రాసిన మాటలు గుర్తుకువచ్చాయి. మాక్ బెత్ అనే నాటకములో షేక్స్ పియర్ యేమని వ్రాశాడంటే,
జీవితము ఒక బుద్ధిహీనుడు చెప్పే కథ లాంటిది.
పూర్తిగా అరుపులు,
కేకలతో నిండిఉంది.దానికి అర్థం లేదు’ చాలా మంది జీవితాన్ని ఆ విధముగా చూస్తారు. life is futile, జీవితము ఒక వృథా ప్రయాస – ఒక ఉద్యోగం, కొంత ఆదాయము ఉంటే ఎలా గోలా జీవితము గడిచిపోతుంది అని అనుకొంటారు.
అది ఒక సర్వైవల్ మోడ్. నేను సర్వైవ్ అయితే చాలు అనుకొంటారు. అయితే ఆ విధముగా మనము జీవితాన్ని చూడడం దేవునికి ఇష్టము లేదు.బ్రతుకు జీవుడా అంటూ జీవితాన్ని ఈడ్చుకొని వెళ్ళుచూ నిరాశా నిస్పృహలతో జీవించడం దేవుని ఉద్దేశ్యము కాదు. మన పరిస్థితుల మీద ఆధారపడకుండా తన వైపు చూచుచూ మనము ఆయన యందు ఆనందముగా ఉండాలని దేవుడు కోరుకొంటున్నాడు. ఈ రోజు 1 పేతురు పత్రిక 1 అధ్యాయము నుండి కొన్ని విషయాలు మనము చూద్దాము.‘క్రొత్త సంవత్సరానికి 10 సూత్రాలు’ ఈ వాక్య భాగములో మీకు చూపించాలని నేను ఆశపడుచున్నాను. ఇక్కడ పేతురు గారు వ్రాసిన మాటలు మనము చదువుదాము.
ఈ మాటలు వ్రాసినప్పుడు పేతురు గారు రోమ్ నగరములో ఒక జైలులో ఉన్నాడు.ఆయన జీవితము చివరి దశలో ఉన్నాడు. గలిలయలో ఒక యువకునిగా ఉన్నప్పుడే యేసు ప్రభువు యొక్క ప్రియ శిష్యునిగా మారాడు. ఆయనను వెంబడించాడు. ఆయన బోధలు విన్నాడు.
ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యాలు చూశాడు. యేసు ప్రభువు యొక్క ముగ్గురు ఆంతరంగిక శిష్యులలో ఈయన ఒకడు. గొప్ప విశ్వాసము కలిగిన వాడు. గలిలయ సముద్రములో తుఫానులో నీళ్ల మీద నడిచాడు. అయితే కొన్నిసార్లు అభద్రతకు లోనయ్యాడు. అలలకు భయపడి సముద్రములో మునిగిపోయే పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రభువైన యేసు క్రీస్తు తన చేయి అందించి పేతురును కాపాడాడు. సిలువ దగ్గర కూడా పేతురు విశ్వాసాన్ని కోల్పోయాడు. ఒక అమ్మాయి ఆయనను ప్రశ్నించింది.‘నువ్వు, యేసు క్రీస్తు తో తిరిగిన వాడివి కాదా?’ పేతురు భయముతో కంపించిపోయాడు.‘యేసు క్రీస్తు ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వు నన్ను ఎవరిని చూసి ఎవరు అనుకొంటున్నావో’ అని మూడు సార్లు అబద్ధము చెప్పాడు. అయితే యేసు ప్రభువు మాటలు జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపపడ్డాడు. ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత పేతురు జీవితములో క్రొత్త అధ్యాయము ప్రారంభమయ్యింది. యేసు క్రీస్తు సువార్త అందరికీ చెప్పాలి అనే వేడి ఆయనలో ప్రారంభమయ్యింది.
అపొస్తలుల కార్యములు 2 అధ్యాయములో మనము చదువుతాము. పెంతెకోస్తు దినము రోజు పేతురు యెరూషలేములో గొప్ప బహిరంగ సభ పెట్టాడు. ‘ఈ యేసు క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు.దేవుని ప్రవచనములు నెరవేర్చినవాడు.మీరు ఆయనను సిలువ వేసి చంపారు. అయితే ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. దానికి మేము ప్రత్యక్ష సాక్ష్యులము. పేతురు ప్రసంగము విని మూడు వేలమంది ప్రజలు ఆ రోజు రక్షణ పొంది, సంఘములో చేర్చబడ్డారు. వారందరూ యూదులు. అయితే పేతురు కూడా ఊహించని గొప్ప కార్యాలు దేవుడు ఆయనచేత చేయించబోవుచున్నాడు.అన్యజనుల ముందు కూడా దేవుడు తన ద్వారము తెరవబోవుచున్నాడు.
అపొస్తలుల కార్యములు 8 అధ్యాయములో సమరయులు సంఘములో చేరారు.10 అధ్యాయములో అన్యజనులు సంఘములో చేరారు. పేతురు ద్వారా దేవుడు వేలాది మందిని రక్షణ మార్గములో నడిపించాడు. చివరి దశలో పేతురు రోమ్ లో ఒక చెఱసాలలో బంధించబడ్డాడు. రోమ్ నగరం వెళ్ళినప్పుడు నేను ఆ చెఱసాలను చూశాను. ఆ చెఱసాలలో కూర్చొని పేతురు ఈ పత్రిక వ్రాశాడు. నీరో చక్రవర్తి ఆ సమయములో రోమన్ సామ్రాజ్యానికి పాలకునిగా ఉన్నాడు.ఆయన పాలన క్రీ.శ 54 నుండి 68 వరకుసాగింది. రోమ్ నగరం నీరోకు ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించింది. ఒక క్రొత్త నగరాన్ని నిర్మించాలని నీరో అనుకొన్నాడు. రోమ్ నగరాన్ని తగలబెట్టించాడు.
ఆ నేరాన్ని క్రైస్తవుల మీద మోపాడు. ఈ క్రైస్తవులు మన సంస్కృతిని చెడగొట్టారు, ఇప్పుడు మన నగరాలను కూడా తగలబెడుతున్నారు అని దుష్ప్రచారం చేశాడు. రోమన్ ప్రజలలో మత సామరస్యం లేదు. ఈ మధ్యలో ఢిల్లీ లో ముస్లిములు ధర్నా చేస్తున్నారు. మధ్యలో వారు కాసేపు నమాజ్ చేసుకొన్నారు. అప్పుడు వారి చుట్టూ ఇతర మతాల వారు రక్షణగా నిలబడ్డారు. భారత దేశము యొక్క గొప్ప తనము నేను అందులో చూశాను. మనము మత స్వేచ్ఛను అనుభవించాలి, ఇతర మతస్తులకు కూడా అదే స్వేచ్ఛను ఇవ్వాలి. నీరో పాలనలో అటువంటి వాతావరణము లేదు. నీరో చెప్పిన అబద్ధాలు నమ్మి రోమన్ ప్రజలు క్రైస్తవులను హింసించారు. పేతురును, పౌలును చెరసాలలో వేసి బంధించారు. ఆ చెర శాలలో పేతురు కూర్చొని ఉన్నప్పుడు, ఆయన హృదయములో చేదు లేదు, దేవుని సమాధానం ఉంది.యెరూషలేములో చెర శాలలో ఉన్నప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపి ఆయనను విడిపించాడు. దేవా, అప్పుడు ఒక దేవదూతను పంపావు, చెర శాల బ్రద్దలు కొట్టావు, ఇప్పుడు కూడా ఒక దేవ దూతను పంపి ఈ చెరశాల లో నుండి నన్ను విడిపించు’ అని పేతురు దేవుని అడుగలేదు, డిమాండ్ చేయలేదు. దేవుడు ఒకే అద్భుతాన్ని మళ్ళీ, మళ్ళీ చేయకపోవచ్చు. పేతురు గురి అద్భుతాల మీద లేదు, దేవుని మీద ఉంది. తాను ఒక యాత్రలో ఉన్నాను అని పేతురుకు తెలుసు. ఆయన గమ్యము రోమ్ కాదు, పరలోకము. తన పత్రిక మొదలుపెట్టుచూ, ‘యాత్రికులకు’ అని వ్రాస్తున్నాడు. ఆ మాట మనము గుర్తుపెట్టుకోవాలి. మనము యాత్రికులము. క్రొత్త సంవత్సరాలు వస్తాయి, పోతాయి. ఇవి శాశ్వతము కాదు. ఆ సత్యము పేతురు ఇక్కడ మనకు గుర్తుచేస్తున్నాడు.
పది సూత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.
1.స్తుతి
“మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక”
పేతురు స్తుతితో మొదలుపెట్టుచున్నాడు. ఈ క్రొత్త సంవత్సరాన్ని మనము దేవుని స్తుతితో ప్రారంభించాలి. ప్రతి రోజూ, ప్రతి గంటా దేవుని స్తుతించితే మంచిది. స్తుతి మన జీవన పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. పేతురు గారి జీవన పరిస్థితులను దేవుడు మార్చలేదు. సామాజిక, రాజకీయ పరిస్థితులను దేవుడు మార్చలేదు. అయినప్పటికీ ఆయన దేవుని స్తుతించాడు. మనము ఏమనుకొంటామంటే, నాకు శ్రమలు పొతే నేను స్తుతిస్తాను నాకు ఈ అనారోగ్యము పొతే నేను స్తుతిస్తాను నాకు ఈ అప్పులు తీరిపోతే స్తుతిస్తాను. నాకు ఉద్యోగం వస్తే దేవుని స్తుతిస్తాను. అయితే, స్తుతి మన పరిస్థితుల మీద ఆధారపడిఉండదు.
2.నిరీక్షణ
‘మృతులలోనుండి యేసుక్రీస్తు
తిరిగి లేచుటవలన జీవముతో కూడిన
నిరీక్షణ మనకు కలుగునట్లు’
ఇది జీవముతో కూడిన నిరీక్షణ – Living Hope ఎంత చక్కటి మాట.
ఇది చచ్చిపోయిన నిరీక్షణ కాదు, వట్టి మాటల నిరీక్షణ కాదు, మనుష్యులు ఇచ్చే నిరీక్షణ కాదు.ఇది జీవముతో కూడిన నిరీక్షణ, ఇది దేవుని మాట నుండి వచ్చిన నిరీక్షణ, ఇది యేసు క్రీస్తు మృతులలో నుండి లేచుటవలన కలిగిన నిరీక్షణ. ఈ క్రొత్త సంవత్సరము. ప్రతిరోజూ మనము ఈ జీవపు నిరీక్షణతో ప్రారంభిస్తే మంచిది. ఈ లివింగ్ హోప్ తో ప్రతి రోజూ మనము గడిపితే మంచిది.
3.స్వాస్థ్యము
“అక్షయమైనదియు,
నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన
స్వాస్యము మనకు కలుగునట్లు”
దేవుడు ఎలాంటి స్వాస్యము మనకు ఇస్తున్నాడు? దేవుడు ఇచ్చే ఆస్తి ఎలాంటిది?
అది అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిది.
Incorruptible, Undefiled, Unfading
ఈ లోకము అలాంటి ఆస్తి మనకు ఇవ్వలేదు. ఈ రోజు భూమి మీద వేడి పెరిగిపోతున్నది, భవిష్యత్తులో భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది అని చాలామంది కలవరపడుతున్నారు.
ఆ సమస్య దేవునికి తెలుసు. రోమా పత్రికలో అపొస్తలుడైన పౌలు వ్రాశాడు:
సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా
మూలుగుచు ప్రసవవేదన
పడుచునున్నదని యెరుగుదుము.(రోమా 8:22)
ప్రకృతి ప్రసవ వేదన పడుతున్నది. వాతావరణము మూలుగుతున్నది. అది యేసు ప్రభువు కోసము ఎదురు చూస్తూ ఉన్నది.ప్రకృతిని దేవుడు భవిష్యత్తులో స్వస్థపరుస్తాడు. ఈ రోజున మన ప్రపంచము ఆ సత్యాన్ని గుర్తించడము లేదు. దేవుడు కాదు, ఈ ప్రకృతి ని మేము సంరక్షిస్తాము అని వీరు బయలుదేరుతున్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్ మీద గ్రెటా థర్న్ బర్గ్ అనే అమ్మాయి ఫోటో వేశారు.
Time Person of the Year అని ఈ అమ్మాయికి గుర్తింపు ఇచ్చారు. ఈ అమ్మాయి వయస్సు 16 సంవత్సరాలు. పర్యావరణాన్ని రక్షిస్తాను అని ఈ అమ్మాయి ఉద్యమం మొదలుపెట్టింది.16 సంవత్సరాల వయస్సులో పుస్తకాలు తీసుకొని ఏదన్నా స్కూల్ లో చేరి చదువుకోవాలి, ప్రపంచము సమస్యలు తీరుస్తాను అని రోడ్ల మీద తిరుగకూడదు.
ప్రకృతిని మనము సంరక్షించడము మంచిదే. అయితే, మన ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యము కాదు.మన ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యము కాదు, మన ప్రధాన సమస్య హృదయ కాలుష్యము.మన ప్రధాన సమస్య ఆత్మీయ కాలుష్యము.
మన ఆత్మలకు పట్టిన మురికి పోవాలి.హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అన్నాడు యేసు ప్రభువు తన కొండ మీద ప్రసంగములో. నీరో చేసిన తప్పు అదే. తన హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా భూలోక సంభందమైన ఆస్తుల కోసము ప్రాకులాడాడు. ఎన్నో భవంతులు కట్టుకున్నాడు.విగ్రహాలు కట్టుకున్నాడు, అయితే అతని జీవితములో దేవుడు ఇచ్చే సంతృప్తి లేదు, యేసు ప్రభువు ఇచ్చే ఆనందము లేదు, పిచ్చివాడై పోయి, ఆత్మ హత్య చేసుకొనే పరిస్థితి అతనికి కలిగింది.నీరో జీరో అయ్యాడు.
దేవుడు ఇచ్చే ఆస్తి ఆ విధముగా ఉండదు.అది అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిది. ఈ క్రొత్త సంవత్సరం దాని మీద మనము మన మనస్సు పెట్టుకొంటే మంచిది.
4.కనికరము
‘ఆయన తన విశేష కనికరముచొప్పున
దేవుని యొద్ద విశేషమైన కనికరం
మనకు లభించింది.
Abundant Mercy తప్పిపోయిన కుమారుడు పందుల మధ్యలో కడుపు నింపుకొనే స్థితికి వెళ్ళాడు.
అయితే బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి తిరిగివెళ్ళాడు. తండ్రి అతని చూచి పరుగెత్తుకొని వెళ్లి, ముద్దు పెట్టుకొని తన ఇంటిలోకి ఆహ్వానించాడు.
‘నేను నీ ఆస్తి మొత్తము తగలబెట్టాను’
తండ్రి కనికరించాడు.
‘నేను నీకు చెడ్డ పేరు తెచ్చాను’
తండ్రి కనికరించాడు.
‘నేను నా ఆరోగ్యము పాడు చేసుకొన్నాను’
తండ్రి కనికరించాడు.
‘నేను మురికి గుడ్డలతో వచ్చాను’
తండ్రి కనికరించాడు.
దేవుడు అటువంటి విశేషమైన కనికరముతో మనలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ క్రొత్త సంవత్సరము దేవుని కనికరంను మనము గుర్తుపెట్టుకొంటే మనకు చాలా ఆందోళన తగ్గిపోతుంది.
5.నూతన జన్మ
‘ఆయన తన విశేష కనికరముచొప్పున
‘మనలను మరల జన్మింప జేసెను’
దేవుడు మనకు నూతన జన్మను ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతని యొక్క మురికి వస్త్రాలు తీసివేశాడు.క్రొత్త వస్త్రాలు అతనికి ధరింపజేసాడు. ఈ మధ్యలో ఒక కాలేజీ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు, చాలా బలహీనంగా ఉన్నాడు.
నేను అతని నడిపించాల్సి వచ్చింది. పాతిక సంవత్సరాల వయస్సులో ఏంటి ఇంత బలహీనంగా ఉన్నావు? అని నేను అతని అడిగాను. నాకు సిఫిలిస్, గొనేరియా జబ్బులు వచ్చినాయి. అని చెప్పాడు. అతని చూసి నాకు చాలా బాధ వేసింది. చాలా మంది యువతీ యువకులు తమ శరీరాన్ని సాతానుకు రాసిస్తున్నారు. చెడు తిరుగుళ్ల వల్ల సిఫిలిస్, గొనేరియా వంటి జబ్బులు వారి శరీరాల్లో ప్రవేశిస్తున్నాయి. సాతానుడు. మనకు ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేస్తాడు.మనము ఎప్పుడూ మురికిలోనే ఉండాలని సాతాను కోరిక. అయితే దేవుడు నూతన జన్మను, నూతన జీవితాన్ని, నూతన ఆలోచనలను, నూతన కోరికలను మనకు ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరం ఆ సత్యము మనము గుర్తుపెట్టుకోవాలి.
6.రక్షణ
“కడవరి కాలమందు బయలుపరచబడుటకు
సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు”
గొప్ప రక్షణ మన ఎదుట ఉన్నది. రూపాంతర కొండ మీద పేతురు యేసు ప్రభువు మహిమను ఆయన యొక్క మహిమలో చూశాడు. అటువంటి గొప్ప మహికరమైన రక్షణ దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు.
7.విశ్వాసము
“విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత
కాపాడబడు మీకొరకు”
పేతురు యేసు ప్రభువు మీద విశ్వాసము పెట్టుకొన్నాడు. ఈ మధ్యలో ఒక మహిళ నా హాస్పిటల్ కు వచ్చింది. 8 సంవత్సరాల కుమార్తె ను తన వెంట తీసుకువచ్చింది. ‘ఏంటి సమస్య అని అడిగాను?’ ‘మా అమ్మాయికి కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నది. చాలా మంది డాక్టర్ లకు చూపించాము. చివరికి అలసి పోయి, నీ దగ్గరకు తీసుకువచ్చాము’ అంది. ‘నన్ను ఎందుకు నమ్ముతున్నావు?’ అని నేను ఆమెను అడిగాను. ఆమె చెప్పింది, ‘నాలుగు సంవత్సరాల క్రితము నేను చాలా అనారోగ్యముతో ఉన్నప్పుడు, నా భర్త నన్ను ఈ హాస్పిటల్ కి తీసుకు వచ్చాడు. నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయములో నువ్వు కాపాడావు. అప్పటి నుండి నీ మాట అంటే నాకు నమ్మకం’ అని చెప్పింది. 4 సంవత్సరాల క్రితము ఆమె ప్రాణా పాయ స్థితిలో హాస్పిటల్ కి వచ్చింది. నాతో మాట్లాడుతూనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.
నేను అర్జెంటు గా ఆమెకు వైద్యము చేసి ఆమె ప్రాణాలు కాపాడాను. అప్పటి నుండి ఆ కుటుంబం నా మాట నమ్ముతారు. పేతురు కూడా అంతే. గలిలయ సముద్రములో నేను అలల మధ్య చిక్కుకొని మునిగిపోయేటప్పుడు నన్ను కాపాడింది, ఈ యేసు క్రీస్తే, నన్ను ఎప్పటికీ కాపాడేది ఆయనే అని విశ్వాసముంచాడు.
8.శక్తి
“విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత
కాపాడబడు మీకొరకు”
మనము దేవుని మీద నమ్మకము ఉంచాలి, విశ్వాసము ఉంచాలి. అయితే శక్తి మన విశ్వాసములో లేదు, అది దేవునిలో ఉంది. మన కల్చర్ ఎలా ఉందంటే, Trust yourself, unleash the energy నిన్ను నువ్వు నమ్ము, నీలో ఉన్న శక్తి అప్పుడు బయటికి వస్తుంది. బైబిల్ చెప్పేది అదికాదు.నువ్వు దేవుని నమ్ము, దేవుని శక్తి నీలోకి వస్తుంది. అపొస్తలుడైన పౌలు చాలా బలహీనముగా ఉన్నాడు. స్వస్థత కోసము దేవుని ప్రార్ధించాడు. ప్రభువైన యేసు క్రీస్తు పౌలుతో అన్నాడు: ‘నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నది’ (2 కొరింథీ 12:9). దానిని బట్టి పౌలు ఏమన్నాడంటే, ‘నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను’
న్యూ యార్క్ టైమ్స్ పత్రికలో క్రిస్మస్ సందర్భముగా రచయిత పీటర్ వెనర్ ఒక వ్యాసము వ్రాశాడు.
Christmas Turns the World Upside Down.
అందులో ఆయన పారడాక్స్ PARADOX అనే మాట వాడాడు. యేసు క్రీస్తు ఒక శిశువుగా ఒక పశువుల తొట్టిలో చాలా సాధారణముగా మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆయన ద్వారా దేవుడు ఈ ప్రపంచాన్ని మార్చి వేశాడు. యేసు ప్రభువు రోమన్ గవర్నర్ ముందు మౌనముగా నిలబడ్డాడు.300 సంవత్సరాల తరువాత రోమన్ సామ్రాజ్యము యేసు ప్రభువుకు బానిస అయ్యింది
ఇంగ్లీష్ భాషలో PARADOX అనే పదము ఉంది. పరస్పర విరుద్ధమైన ఫలితాలు
అందులో మనకు కనిపిస్తాయి. క్రైస్తవ్యములో ఈ PARADOX అనేక చోట్ల మనకు కనిపిస్తుంది.
పేదలము, కానీ క్రీస్తులో ధనవంతులం
పాపులము, కానీ క్రీస్తులో పరిశుద్దులము
బానిసలం, కానీ క్రీస్తులో స్వతంత్రులము
అజ్ఞానులము, కానీ క్రీస్తులో జ్ఞానులము
తగ్గించబడినవారము, కానీ క్రీస్తులో హెచ్చించబడ్డాము.
పరలోకానికి వెళ్తున్నాము, కానీ భూలోకాన్ని మారుస్తున్నాము
పౌలు ఆ భావాన్నే ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు
‘నేనెప్పుడు బలహీనుడనో
అప్పుడే బలవంతుడను’
క్రీస్తు శక్తి ద్వారానే అది సాధ్యపడింది
9.భద్రత
“ఆ స్వాస్థ్యము
పరలోకమందు భద్రపరచబడియున్నది”
ఈ క్రొత్త సంవత్సరములో నాకు ఏ సమస్యలు వస్తాయో, ఎటువంటి అలజడులు వస్తాయో అని భయాలకు దేవుడు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, నేను నిన్ను క్రీస్తులో భద్రపరచాను. సీమోనుకు యేసు ప్రభువు ‘పేతురు’ అనే పేరు పెట్టాడు. అంటే రాయి. పేరును ఆయన ఒక రాయి లాగా చేసి ఆయన భద్రపరచాడు.
10.ఆనందము
“ఇందువలన మీరు మిక్కిలి
ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి
నానా విధములైన శోధనలచేత,
ప్రస్తుతమున కొంచెము కాలము
మీకు దుఃఖము కలుగుచున్నది.”
నానా విధములైన శోధనలు మనకు కలుగుతున్నాయి. లండన్ లో, న్యూ యార్క్ లో, టోక్యో లో గడియారం వేరు వేరుగా చూపిస్తుంది. క్రొత్త సంవత్సరంలోకి మనము వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు సమయాల్లో ప్రవేశిస్తాము.
ఏ రెండు జీవితాలు ఒకే విధముగా ఉండవు. మనకు కలిగే శోధనలు కూడా రక రకాలుగా ఉంటాయి. అయితే మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవుడు మనకు ఒక వాగ్దానము చేశాడు. అది ఏమిటంటే, మనమందరము దేవుని ఆనందంలో పాలుపొందవచ్చు.
మొన్న ఒకాయన అంటున్నాడు: ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడంట. మధ్యలో ట్రాఫిక్ జామ్ లో ఇరుకున్నాడంట. డిన్నర్ కి లేట్ అవుతాను కదా అని ఆయనకు విసుగు వచ్చిందంట.అప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చిందంట. నిజముగా దేవుడు ఉన్నాడా? ఈ ట్రాఫిక్ జామ్ లు ఎందుకు సృష్టించాడు? అనే ప్రశ్న ఆయనకు వచ్చిందంట.
పేతురు గారి భార్యను ఆయన కళ్ళ ముందే చంపారు. ఆయనను తల క్రిందులుగా సిలువ వేశారు. అటువంటి శ్రమల ముందు ట్రాఫిక్ జామ్ శ్రమ క్రిందకు రాదు.
పేతురు ఏమంటున్నదంటే, కొంత కాలము మీకు శ్రమలు వస్తాయి, అయితే అవి అవసరము బట్టి మాత్రమే వస్తాయి. ఆ శ్రమలలో కూడా దేవుడు మీకు తన ఆనందాన్ని ఇస్తాడు.
1 పేతురు పత్రిక నుండి క్రొత్త సంవత్సరానికి
10 సూత్రాలు అనే అంశాన్ని ఈ రోజు
మనము చూశాము.
1.స్తుతి
2.నిరీక్షణ
3.స్వాస్థ్యము
4.కనికరము
5.నూతన జన్మ
6.రక్షణ
7.విశ్వాసము
8.శక్తి
9.భద్రత
10.ఆనందము
క్రొత్త సంవత్సరములో దేవుడు తన సన్నిధిని, సహవాసాన్ని, కృపను, ఆనందాన్ని, ఆశీర్వాదాలను
మీకు అందించాలని మేము కోరుకొంటున్నాము.
We wish you a Happy New Year
https://www.nytimes.com/2019/12/24/opinion/christ-meaning-of-christmas.html?searchResultPosition=10