పరిచయం:
దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానము బైబిల్. దానిని ప్రతి రోజూ ధ్యానిస్తే మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ సామెతలు గ్రంథము గురించి చూద్దాము. ఈ గ్రంథము యొక్క ముఖ్యమైన అంశము దేవుని జ్ఞానము. మానవ జ్ఞానానికి, దేవుని జ్ఞానానికి చాలా వ్యత్యాసముంది. మనిషి తన జ్ఞానము చెప్పటానికి ఒక విద్యాలయము స్థాపించాడనుకొందాము. అందులో అనేక మంది విద్యార్థులు చేరుతారు.
ఎంతో సమాచారము తమ అధ్యాపకుల నుండి నేర్చుకొంటారు. ఆ అధ్యాపకుడు ఎంతో చక్కగా అనేక విషయాలు బోధిస్తాడు. అయితే, ఆ అధ్యాపకుడు విద్యార్థితో వ్యక్తిగత సంబంధము పెట్టుకోడు. ఆ అధ్యాపకుడు ఆ విద్యార్థి గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకొంటాడు: ఆ విద్యార్థి పేరు, వయస్సు, ఊరు, బలాలు, బలహీనతలు తెలుసుకొంటాడు. ఆ విద్యార్థి గురించి పరిపూర్ణ మైన సమాచారం తెలుసుకొనే అవకాశము, సమయము, అవసరము ఆ అధ్యాపకునికి ఉండదు. తాను ఏ పాఠాలు చెప్పాలో, ఎంత సిలబస్ పూర్తి చేయాలో అవి పూర్తి చేసి ఆ అధ్యాపకుడు చేతులు దులుపుకొంటాడు. అయితే, దేవుడు అలాంటి అధ్యాపకుడు కాదు. మీకు సమాచారము ఇచ్చి, చెప్పదలచిన సిలబస్ పూర్తి చేసి మీ దారిన మిమ్మల్ని పంపడము దేవునికి ఇష్టము లేదు.
దేవుడు ముందు మనతో ఒక సంభందం పెట్టుకొని ప్రతి రోజూ తన జ్ఞానాన్ని మనకు ఇవ్వాలని ఆశ పడుతున్నాడు. ప్రతి రోజూ దేవుని జ్ఞానము పొందాలి అనే ఆసక్తి మనకు ఉండాలి. దేవుని జ్ఞానము ఎలా మొదలవుతుంది?
సామెతలు 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము
The fear of the Lord is the beginning of wisdom.
దేవుని భయముతో జ్ఞానము మొదలవుతుంది.
హెబ్రీ భాషలో ఏమని ఉందంటే,
yirat yahweh resit daat hakmah umusar
יִרְאַ֣ת יְ֭הוָה רֵאשִׁ֣ית דָּ֑עַת חָכְמָ֥ה וּ֝מוּסָ֗ר
తెలుగులో తెలివి అనే మాట ఉపయోగించారు.కానీ , హెబ్రీ భాషలో 3 మాటలు వాడాడు.
דָּ֑עַת దాత్: తెలివి
חָכְמָ֥ה హాక్మా: జ్ఞానము
וּ֝מוּסָ֗ר యుముసార్: ఉపదేశము
ఆ మూడూ దేవుని భయముతో మొదలవుతాయి అంటున్నాడు.
దాత్: తెలివి, అది సమాచారము
హాక్మా: జ్ఞానము, అది అనుభవ పూర్వకముగా తెలుసుకొనేది.
యుముసార్: ఉపదేశము, అది ఒక వ్యక్తిగత అధ్యాపకుడు మనకు ఇచ్చేది.
దేవుడు మనకు ఆ మూడూ ఇవ్వాలని ఆశ పడుతున్నాడు: తెలివి, జ్ఞానము, వ్యక్తిగత ఉపదేశము.మొన్న నేను ఒక టేబుల్ కొన్నాను. ఇంటికి తీసుకొని వెళ్లి ఆ బాక్స్ విప్పదీసి చూస్తే అందులో అనేక భాగాలు ఉన్నాయి. ఒక చిన్న పుస్తకము బాక్స్ లో ఉంది. ఏ భాగాన్ని దేనికి అమర్చాలో స్టెప్ బై స్టెప్ సూచనలు అందులో ఉన్నాయి. ఆ పుస్తకము చూస్తా అవన్నీ నేను బిగించాను.
నా చిన్న తనములో టేబుల్ కొంటే, మనకు దానిని అమ్మినవాడే దానిని ఇంటికి తీసుకు వచ్చి, చక్కగా అమర్చి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ సౌకర్యము తగ్గిపోయింది.ఇప్పుడు అన్నీ మనమే అమర్చుకోవాలి.ఆ టేబుల్ మీద చిన్న రంద్రాలు ఉన్నాయి.ఆ రంద్రాల్లో మేకులు కొట్టమని ఆ పుస్తకములో ఉంది. నేను అన్ని మేకులు కొట్టిన తరువాత ఒక మేకు మిగిలింది. ఆ మేకు పడవేయడము ఎందుకులే అని నేను దానిని కూడా ఒక చోట కొట్టాను. టేబుల్ పూర్తి చేసి దానిని పరిశీలించాను. అంతా బాగుంది కానీ నేను చివరి మేకు కొట్టిన ప్రదేశములో టేబుల్ చిట్లింది.దాని మీద ఉన్న పెయింట్ దెబ్బతింది.
ఆ మేకులు రంద్రాల్లో కొట్టు అని ఆ పుస్తకములో స్పష్టముగా ఉంది. కానీ నేను ఆ ఒక్క గమనికను పట్టించుకోలేదు. దానితో టేబుల్ పాడయ్యింది. జీవితములో కూడా మనము కొన్ని సార్లు దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞలు పట్టించుకోము. ఈ ఒక్క సారి నాకు తోచినట్లు చేస్తాను, ఫర్వాలేదులే అనుకొంటాము. దాని వలన మనకు జరిగిన నష్టము చూసి ఆ తరువాత మనము బాధపడుతాము. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నేను నీకు ఆ మూడూ ఇవ్వాలి అనుకొంటున్నాను:
దాత్: తెలివి, సమాచారం
హాక్మా: జ్ఞానము
యుముసార్: ఉపదేశము.
ఆ టేబుల్ అమర్చేటప్పుడు ఆ పుస్తకములో ఉన్న సమాచారం దాత్, అది సమాచారం. దానిని నేను అనుభవపూర్వకముగా తెలుసుకోవటం జ్ఞానము, హాక్మా. ఆ రోజు ఆ టేబుల్ చేసిన వాడు కూడా నా ప్రక్కన ఉండి నాకు సలహాలు ఇస్తే అది యుముసార్ – ఉపదేశము. దేవుడు ప్రతి రోజూ వ్యక్తిగతముగా మనతో సహవాసము చేస్తూ, తన తెలివిని, జ్ఞానమును మనకు అనుగ్రహిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆసియా లో సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే, ఆయన ఐరోపా వెళ్లాలని దేవుడి ప్రణాళిక లో ఉంది. అపోస్తలుల కార్యములు 16:9 లో మనము చదువుతాము.అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను.దేవుడు పౌలు ఎక్కడ సువార్త చెప్పాలో కూడా అతనికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాసిడోనియా వెళ్లి అక్కడ ప్రకటించు అనే ఉపదేశము దేవుని యొద్ద నుండి ఆయనకు అందినవి. యుముసార్ అంటే అదే.
అటువంటి దేవుని జ్ఞానము పౌలును నడిపించింది. పౌలు లాంటి మహా భక్తులనే కాకుండా, మన వంటి సామాన్యులను కూడా అనుదినము తన జ్ఞానముతో నడిపించాలని దేవుడు కోరుకొంటున్నాడు.
The fear of the Lord is the beginning of wisdom.
ఈ జ్ఞానము దేవుని యందు భయముతో మొదలవుతుంది. ఇక్కడ భయము అంటే వణకిపోవటం, కంపించిపోవటం అని కాదు. దేవుని భయము అంటే దేవుని మాటను వినడము, ఆయన సన్నిధిని లక్ష్యపెట్టడము. ఆయన అధికారాన్ని గౌరవించడము, ఆయన మాటను పాటించడము. అవి చేస్తే నిజమైన జ్ఞానము మీకు వస్తుంది. నిర్భయ హంతకులను ఇప్పుడు ఉరి శిక్షకు సిద్ధము చేస్తున్నారు.
2012 లో ఒక యువతి బస్సులో ప్రయాణము చేస్తుంది. ఆ బస్సులో ప్రయాణము చేస్తున్న ఆరుగురు వ్యక్తులు చాలా దారుణముగా ఆమె మీద అత్యాచారము చేసి, కొట్టారు.కొన్ని రోజుల తరువాత ఆ గాయాలకు ఆ యువతి హాస్పిటల్ లో ప్రాణము విడిచింది. నిర్భయ గా ఆ కేసు ను మనము గుర్తుపెట్టుకొంటున్నాము. ఆ కేసు దేశమంతా సంచలనం కలిగించింది. 6 దోషులలో ఒక యువకుడు ఆత్మ హత్య చేసుకొన్నాడు, మరొకనికి చిన్న వయస్సు అని జైలు శిక్ష వేశారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించారు. చిన్న వయస్సులోనే వారి జీవితములు ముగుస్తున్నాయి.ఆ రాత్రి వారు ఏమనుకొని ఉంటారు? ఆ ఈ భారత దేశములో ఎంత మంది రేప్ లు చేయటల్లేదు! ఎంత మంది శిక్ష పడకుండా తప్పించుకోవటల్లేదు? మనల్ని ఎవరూ ఏమిచేయరు. ఆ ఆలోచనే వారిని నాశనమునకు నడిపించింది.
ఆ రాత్రి వారికి దేవుడుకి భయపడితే వారు ఆ ఘోరం చేసేవారు కాదు. ఈ రోజు అందరూ బ్రతికి ఉండేవారు. ఆ యువతి కూడా బ్రతికే ఉండేది. ఇంకో రకముగా చెప్పుకోవాలంటే, దేవుని మాట వినుట వలన మన ప్రపంచములో జీవము పెరుగుతుంది, మరణము తగ్గుతుంది.సాతాను మాట వినుట వలన మన ప్రపంచములో జీవము తగ్గుతుంది, మరణము పెరుగుతుంది. ఏదెను వనములో ఆదాము దేవుని మాట వినలేదు. అందుకనే మరణము మన ప్రపంచములో ప్రవేశించింది. సాతాను తెలివి, మానవ జ్ఞానము చెడు ప్రవర్తనకు యువతీ, యువకులను నడిపిస్తాయి.
నాకు దగ్గరలో ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ విద్యార్థులు ఎలా ఉన్నారంటే, ఒకడు బూతులు తిడుతూ తిరుగుతాడు, ఇంకొకడు టీచర్ లను ఎదిరిస్తాడు, ఇంకొకడు తల్లిదండ్రులను అవమానిస్తాడు, ఇంకొకడు గుట్కాలు నములుతూ తిరుగుతాడు, మరొకడు పరీక్షల్లో కాపీలు కొడతాడు, మరొకడు లంచాలు కట్టి పాస్ మార్కులు వేయించుకొంటాడు, మరొకడు ఆడపిల్లలను వేధించుట, మభ్యపెట్టుటలో గడుపుతాడు, మరొకడు డ్రగ్స్ కి బానిస అవుతాడు, మరొకడు హింసతో చెలరేగిపోతాడు,మరొకడు వేశ్యల దగ్గరకు వెళ్లి ఎయిడ్స్ వంటి జబ్బులు అంటించుకొంటాడు, మరొకడు వ్యసనాలకు బలి అవుతాడు, మరొకడు దిగులుతో ఆత్మ హత్య చేసుకొంటాడు, మరొకడు జనాన్ని చంపుదామని తుపాకులు కొంటూ ఉంటాడు. ఇవి మనిషి జ్ఞానముతో నడిచే నేటి మన విద్యావ్యవస్థలోని కుసుమాలు.
దేవుని జ్ఞానము అటువంటింది కాదు. అది పరలోకము నుండి వచ్చినది. ఒక వస్తువు గురించి దానిని సృష్టించిన వాని కంటే ఎక్కువగా మనము తెలుసుకొనగలమా? మనలను సృష్టించిన దేవుని కంటే మన గురించి తెలిసినది ఎవరు? మన స్వభావము ఏమిటో, మన కోరికలు ఏమిటో, మనకు కావలసినది ఏమిటో, ఎలా జీవిస్తే మన జీవితాలకు సార్ధకత కలుగుతుందో దేవుని కంటే ఎక్కువగా తెలిసినది ఎవరు? ఆ దేవుడు తన జ్ఞానమును చిన్న, చిన్న వాక్యముల రూపములో మనకు ఇచ్చిన గ్రంథమే సామెతలు గ్రంథము. నేను కొన్న టేబుల్ గురించి నా కంటే ఆ టేబుల్ చేసినవాడికే తెలుస్తుంది. ఆ టేబుల్ అమర్చేటప్పుడు నేను అతని మాట వినాలి. వినకపోతే ఆ టేబుల్ పాడయిపోతుంది.
సౌర కుటుంబములో మధ్యలో సూర్యుడుఉన్నాడు. దాని చుట్టూ 8 గ్రహాలు, అనేక ఉపగ్రహాలు, లెక్కలేనన్ని ఆస్టెరాయిడ్లు ఉన్నాయి. సౌర కుటుంబములో సూర్యుడు ఒక్కడే 99.9 శాతము పదార్ధము కలిగిఉన్నాడు. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు మొత్తము మిగిలిన 0.1 శాతము పంచుకోవలసినదే. సూర్యుడు… 99.9, అందుకనే సూర్యుడు మన ప్రపంచములో ప్రతి దానిని నియంత్రిస్తాడు. ఎంత వేడి ఉండాలి?, ఎంత వర్షం పడాలి? ఎంత మంచు పడాలి?, ఎంత చీకటి ఉండాలి? ఎంత ఆక్సిజన్ ఉండాలి? సూర్యుడు లేకుండా ఒక్క పని కూడా జరుగదు, సూర్యుడు వెళ్ళిపోతే మొత్తము చీకటి పడిపోతుంది, గ్రహాలు వాటి కక్ష్యల్లో తిరుగలేవు. సూర్యుడు ఉంటేనే మన భూమి తన కక్ష్యలో స్థిరముగా తిరుగగలుగుతుంది.
సూర్యుడు లేకుండా ఈ భూమి మీద మనము ఒక్క క్షణము కూడా ఉండలేము, ఒక్క పని కూడా చేయలేము. దేవుడు సూర్యుడు లాంటి వాడు. ఆయన వలనే మన జీవితానికి స్థిరత్వము, మన పనులకు కావలసిన శక్తి మనకు కలుగుతున్నాయి. సామెతలు గ్రంథములో దేవుడు తన యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తున్నాడు.
నిజమైన జ్ఞానము ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా ఈ సామెతలు గ్రంథములో వివరించాడు.
జ్ఞానము ఎలా సంపాదించాలి?
వేశ్యలకు, చెడు స్త్రీలకు, చెడు పురుషులకు దూరముగా ఎలా ఉండాలి?
సత్యము ఎలా అనుసరించాలి?
అబద్ధాలు ఎందుకు మానుకోవాలి?
అవినీతిని మన జీవితము నుండి ఎలా తీసివేయాలి?
నాలుకను ఎలా నియంత్రించుకోవాలి?
సోమరి తనము మనలను ఎలా పాడుచేస్తుంది?
క్రమ శిక్షణ ఎందుకు అవసరం?
వివాహము వలన వచ్చే ప్రయోజనములు ఏమిటి?
తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి?
మద్యపానము వలన కలిగే దుష్పరిమాణాలు ఏమిటి?
అసూయ ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తుంది?
దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా జీవిస్తుంది? మొదలగు అంశాలు ఈ గ్రంథములో వివరించబడ్డాయి. వాటిలో ఉన్న సత్యములను తెలుసుకొని, పాటిస్తే మన జీవితములకు జ్ఞానముతో పాటుగా, ఎన్నో దీవెనలు కలుగుతాయి.
రచయిత: ప్రసంగి, పరమ గీతములతో పాటు, సామెతలు గ్రంథములో ఎక్కువ భాగము సొలొమోను వ్రాశాడు (10:1; 25:1), ప్రసంగి లో మానవ నిరాశ, పరమ గీతములో ప్రేమ, సామెతల గ్రంథములో జ్ఞానము అతని ప్రధాన అంశములుగా ఉన్నాయి. ఈ గ్రంథములో కొన్ని భాగములను అగురు, లెమూయేలు వ్రాశారు.
వ్రాయబడిన కాలము: సొలొమోను పరిపాలన కాలము. ఆయన క్రీ.పూ 970 లో తన తండ్రి అయిన దావీదు తరువాత సింహాసనము అధిష్టించాడు. ఆయన 3000 సామెతలు, 1005 కీర్తనలు వ్రాశాడు (1 రాజులు 4: 32). సామెతలు గ్రంథములో దాదాపు 900 సామెతలు ఉన్నాయి. హిజ్కియా రాజు కాలములో చివరి అధ్యాయాలు కలుపబడ్డాయి (25:1)
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము
ముఖ్య అంశాలు:
జ్ఞానము: జ్ఞానము పెద్ద, పెద్ద డిగ్రీలు చదివితే వచ్చేది కాదు. దేవుని యందు భయ భక్తులు కలిగి జీవించుట జ్ఞానమునకు తొలి పునాది (సామెతలు 1:7)
జ్ఞానోపదేశులు: దేవుడు తన జ్ఞానమును మన కిచ్చుటకు కొంత మంది జ్ఞానోపదేశులను మన యొద్దకు పంపుతాడు (4:11). వారి సలహాలను ఓర్పుతో, దీన మనస్సుతో వినాలి.
జీవన విధానము: సత్యము తెలుసుకొంటే సరిపోదు, దానిని ఆచరించుట ముఖ్యము. మన
జీవితము ఎలా జీవించాలో ఈ గ్రంథము వివరిస్తుంది. మన జీవితములో చివరి దినము వరకు ఈ దేవుని జ్ఞానమును ఒంటపట్టించుకొనుటకు మనము పాటుపడవలసినదే.
సంభందాలు: మనతో మన సంబంధము, ఇతరులతో మన సంబంధము బాగుండాలంటే ముందు దేవునితో మన సంబంధము బాగుండాలి.
వివాహము: వివాహము దేవుని ఎదుట చేసే నిబంధన (2:16-17). దానిని పవిత్రముగా కాపాడుకొనవలసిన బాధ్యత దంపతుల మీద ఉంది. దేవుడు నీకిచ్చిన జీవిత భాగస్వామిని ప్రేమించు, గౌరవించు, ఆదరించు. ఆమెతో సంతృప్తి కలిగి ఉండు (5:18-19)
సెక్స్ పాపాలు: సెక్స్ పాపములను ఎలా నిరోధించాలో వివరించబడింది (5,6 అధ్యాయములు). అవి వ్యక్తులను, వివాహములను, కుటుంబములను, పిల్లలను ఎలా పాడు చేస్తాయో వివరించబడింది. నీ చూపులను, ఆలోచనలను అదుపులో పెట్టుకో (6:25).నిప్పుతో ఆటలాడవద్దు.
హృదయమును కాపాడుకొనుట: మన హృదయములో నుండే జీవ ధారలు బయటకు ప్రవహిస్తాయి (4:23). దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే మన సంశయము అవిశ్వాసముగా, మన నేత్రాశ వ్యామోహముగా, మన కోపము క్రోధముగా, మన స్నేహాలు బంధకాలుగా మారే అవకాశము ఉంది.
కుటుంబ జీవితము: తల్లి దండ్రులు దేవుని పద్దతులను తమ పిల్లలకు ఎలా నేర్పించాలో చాలా చోట్ల వివరించబడింది.పిల్లలు తల్లి దండ్రుల పట్ల నిర్వర్తించవలసిన విధులు కూడా వివరించబడ్డాయి.
మాటలు: మన మాటలు అబద్ధములు, అహంకారము, అతిశయము లేకుండా సత్యముతో, దీనత్వము, సాత్వికముతో ఉండాలి.
పేదరికము: పేదలను వెక్కిరించు వాడు వారి సృష్టికర్తను నిందించువాడు (17:5); పేదలకు సహాయము చేయాలి కానీ వారిని అవమానించకూడదు.
ఐశ్వర్యము: డబ్బు సంపాదన తప్పు కాదు, అయితే అది నిజాయితీతో ఉండాలి (3:9-10)
పని: దొంగ త్రాసులు, అవి నీతి, దురాశ, సోమరి తనము లేకుండా మన పని ఎలా చేయాలో వివరించాడు
విజయము: ప్రణాళికా బద్ధముగా జీవించు (6:6-8). పొదుపు చేసుకో; క్రమ శిక్షణ లేకుండా
ఖర్చులు చేసి, అప్పులు పాలు కావద్దు. చీమల వంటి చిన్న, చిన్న జీవులు కూడా ఎంత ప్రణాళికాబద్ధముగా జీవిస్తాయో చూసి నేర్చుకో.
నిద్ర: ప్రశాంతముగా నిద్ర పోవుట కూడా ఒక దీవెనే (3:24). మన విచారములను, ఆందోళనలను దేవుని హస్తములకు అప్పగించి, ప్రభువైన యేసు పాదముల యొద్ద ప్రశాంతముగా నిద్రించుటయే నిజమైన జ్ఞానము.
ముఖ్య వ్యక్తులు: సొలొమోను, అగురు, లెమూయేలు, హిజ్కియా
గ్రంథ విభజన:
1.పరిచయము (1:1 – 7)
2.యువతీ, యువకులకు జ్ఞానోపదేశము (1:8 – 9:18)
3.అన్ని వయస్సుల వారికి జ్ఞానోపదేశము (10:1 – 24:34)
4.నాయకులకు జ్ఞానోపదేశము (25:1 – 31:31)
ముఖ్య ప్రవచనాలు: సామెతలు 8 అధ్యాయములో జ్ఞానము ఒక వ్యక్తి వలె చూపించబడింది. అది రాబోయే దేవుని జ్ఞాని ప్రభువైన యేసు క్రీస్తును సూచించుచున్నది.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం: సామెతలు గ్రంథము యొక్క ప్రధానాంశము దేవుని జ్ఞానము. ప్రభువైన యేసు క్రీస్తు మన జ్ఞానము (1 కొరింథీ 1:31)
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
-
- దేవుడు తన జ్ఞానమును మనకు ఇవ్వాలని కోరుకొంటున్నాడు. మన దృష్టిలో మనము జ్ఞానులము అనుకొనుచూ అంధకారములో జీవించే ప్రమాదం ఉంది (3:7). దాని నుండి బయట పడి, మనము దేవుని జ్ఞానమును దీన మనస్సుతో వెదకాలి.
- ప్రశాంతమైన నిద్ర నీకు కరువయ్యిందా? నిద్ర మాత్రలు వేసుకోవడము ఈ లోక జ్ఞానము; దేవుని యందు విశ్వాసముతో నీ ఆందోళనలను ప్రభువైన యేసు క్రీస్తు కు అప్పగించి ప్రశాంతముగా నిద్ర పోవుట దేవుని జ్ఞానము
- ఈ రోజు భారత దేశము అశ్లీల చిత్రాలు చూసే వారిలో ప్రపంచములోనే నెంబర్ 1 గా ఉంది; పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు మన హృదయములో పాపపు బీజములు వేసి సెక్స్ పాపముల వైపు నడిపిస్తాయి. వాటి నుండి కాపాడుకొనుటకు జాగ్రత్తలు తీసుకొన్నావా?
- పనిని నిబద్దతతో, నిజాయితీతో, చేయాలి
- దేవుడు మన జీవితములో, మన చుట్టు పట్ల ఉంచిన వ్యక్తుల పట్ల మన విధులు,బాధ్యతలు మనము సరిగా నిర్వర్తిస్తున్నామా?