అపోస్తలులు: వారి నుండి మనము నేర్చుకొనవలసినవి, మొదటి భాగము

ఈ రోజు అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి కొన్ని సత్యాలు చూద్దాము. అపోస్తలుల కార్యములు గ్రంథము మనము ధ్యానించుట ఏ సమయములోనైనా మంచిదే. మనము ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో చాలా మంచిది. అమెరికా లో జాక్ హైల్స్ అనే గొప్ప బాప్టిస్టు పాస్టర్ గారు ఉండేవాడు.ఆయన ప్రతి రోజూ కీర్తన గ్రంథములో కొంత భాగము, సామెతల గ్రంథము లో కొంత భాగము, అపోస్తలుల కార్యముల గ్రంథములో కొంత భాగము చదివేవాడంట. కీర్తనల గ్రంథము లో ప్రేమ ఉంది, సామెతల గ్రంథములో జ్ఞానము ఉంది, అపొస్తలుల కార్యముల గ్రంథములో శక్తి ఉంది. ప్రేమ కావాలంటే కీర్తనల గ్రంథము చదువు, జ్ఞానము కావాలంటే సామెతల గ్రంథము చదువు, శక్తి కావాలంటే అపొస్తలుల కార్యముల గ్రంథము చదువు అని ఆయన అంటూ ఉండేవాడు. మీ జీవితములో పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మీరు అపోస్తలుల కార్యముల గ్రంథము చదివితే మంచిది. పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తలులు చేసిన గొప్ప కార్యములను ఈ పుస్తకములో మనము చదువుతున్నాము.

       మొదటి అధ్యాయములో శిష్యులు ప్రభువైన యేసు క్రీస్తుతో యెరూషలేములో మనకు కనిపిస్తున్నారు. అక్కడ ఉన్న ఒలీవల కొండ మీద వారు కూడి ఉన్నారు. యెరూషలేములో యేసు ప్రభువు శ్రమపెట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగిలేచాడు.40 రోజుల పాటు శిష్యులకు అనేక సార్లు, అనేక చోట్ల కనిపించాడు. వారి అల్పవిశ్వాసాన్ని క్షమించాడు, వారిని ఆదరించాడు, బలపరచాడు.ఇప్పుడు వారి మధ్యలో నుండి పరలోకమునకు వెళ్లుచున్నాడు.ఆయన వారితో మాట్లాడాడు.

మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; 

  1. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.  అపో.కార్య 1:4-5 

మీరు యెరూషలేములోనే ఉండండి. నేను మీతో చెప్పిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఎదురుచూడండి. The Promise of God వారికి కావలసినది అదే. ప్రభువైన యేసు క్రీస్తు వారి మధ్యలో నుండి వెళ్లిపోయే సమయం అది, వారు ఆ కొండ మీద అనాథలుగా ఉన్నారు, వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. వారు చేష్టలుడిగి పోయి ఉన్నారు. అయితే వారికి కావలసినది ఒక్కటే: దేవుని వాగ్దానమును నమ్ముట.

    ఈ రోజు మనకు కావలసినది కూడా ఒక్కటే. దేవుని వాగ్దానము మనము నమ్మాలి. దేవుని మాట మనము నమ్మాలి.ఆ వాగ్దానము ఏమిటి? పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాడు, కానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు. అది ఎంతో గొప్ప బహుమానము. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము. 

యోహాను సువార్త14 అధ్యాయములో ఆయన శిష్యులకు చెప్పాడు: 

మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై

వేరొక ఆదరణకర్తను, అనగా 

సత్యస్వరూపి యగు ఆత్మను

మీకనుగ్రహించబడును.

అది ఎంత ఆశీర్వాదకరమైన వార్త! 

మనతో, మనలో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్దాత్మ దేవుడు ఈ భూమి మీదకు రాబోవుచున్నాడు.

శిష్యులు పరిశుద్ధాత్మ గురించి విని యేసు ప్రభువును అడిగారు: 

ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? ఆయన వారికి పరిశుద్ధాత్ముడు త్వరలో రాబోవుతున్నాడు అని చెప్పినప్పుడు, పరిశుద్ధాత్ముడు వస్తున్నాడా? ఎంత సంతోషము! ఎప్పుడు వస్తున్నాడు? అని అనలేదు. వారి మనస్సు వేరొక చోట ఉంది. ఇశ్రాయేలు కు రాజ్యమును మరల ఎప్పుడు ఇస్తావు?  నువ్వు మరణించి తిరిగి లేచావు.ఇక ఇశ్రాయేలు కు రాజువు కాకుండా నిన్ను ఆపేది ఎవ్వరు? ఈ రోమన్లను వెళ్లగొట్టు, వారి బానిసత్వములో నుండి మమ్ములను విడిపించు అన్నారు. యేసు ప్రభువు వారు కోరుకున్నట్లుగా రాజకీయ అధికారము తీసుకోలేదు. దేవుని కార్యక్రమములో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రావాలి.ఆయన ఒకటి చెబుతుంటే వారు ఇంకొకటి అడుగుతున్నారు ఎందుకంటే వారికి ఏది కావాలో, ఏది అవసరమో వారికి సరైన అవగాహన లేదు. ఈ రోజు మనము కూడా అంతే. 

మనకు కావాలసినది ఇంకా ఎక్కువ డబ్బు కాదు

మనకు కావలసినది ఇంకా ఎక్కువ సమయం కాదు 

మనకు కావలసినది ఇంకా ఎక్కువ అధికారము కాదు

మనకు కావలసినది ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కాదు, ఇంకా ఎక్కువ పబ్లిసిటీ కాదు. 

మనకు కావలసినది పరిశుద్ధాత్ముడు, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క నింపుదల. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు క్రైస్తవ సంఘమునకు పునాది వేస్తున్నపుడు పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేశాడు. ఆయన వారితో ఏమన్నాడంటే, 

“7. కాలములను సమయములను 

తండ్రి తన స్వాధీనమందుంచుకొని 

యున్నాడు; వాటిని తెలిసికొనుట

 మీ పనికాదు.8. అయినను పరిశుద్ధాత్మ 

మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి

నొందెదరు గనుక మీరు యెరూషలేములోను,

 యూదయ సమరయ దేశముల 

యందంతటను భూదిగంతముల వరకును 

నాకు సాక్షులై ఉంటారు.” 

    వారి మైండ్ ఇశ్రాయేలు దేశముకు అధికారము వైపుకు వెళ్ళింది. ఆయన వారిని పరిశుద్దాత్మ వైపుకు తిరిగి తీసుకువచ్చాడు.పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు అన్నాడు.ఇంకో పది రోజుల తరువాత పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు రాబోవుచున్నాడు. ప్రతి సంఘటన దేవుని ప్రణాళిక ప్రకారము జరుగుతున్నది.

లేవీయ కాండము 23 అధ్యాయములో మనము దేవుని 7 పండుగలు చూస్తున్నాము.

ఈ 7 పండుగలు సంవత్సరము మొత్తము వెదజల్లబడి ఉన్నాయి.

పస్కా పండుగ, 

పులియని రొట్టెల పండుగ,

ప్రథమ ఫలముల పండుగ

పెంతెకోస్తు పండుగ,

బూరల పండుగ, 

ప్రాయశ్చిత్త దిన పండుగ, 

గుడారాల పండుగ,

మొదటి నాలుగు  పండుగల్లో ప్రభువైన యేసు క్రీస్తు మొదటి రాకడ మనకు కనిపిస్తే, తరువాత మూడు పండుగల్లో ఆయన రెండవ రాకడ మనకు కనిపిస్తుంది. ఈ చార్ట్ కావాలంటే మా వెబ్ సైట్ www.doctorpaul.org కి వెళ్లి బైబిల్ చార్టులు అనే పేజీ చూడండి. ఒక్కొక్క పండుగను దేవుడు యేసు క్రీస్తు నందు నెరవేరుస్తూ ఈ ప్రపంచ చరిత్రను ముందుకు నడిపిస్తున్నాడు. 

పస్కా పండుగలో క్రీస్తు మరణము, 

పులియని రొట్టెల పండుగలో క్రీస్తు సమాధి, 

ప్రథమ ఫలముల పండుగ లో

క్రీస్తు పునరుత్తానము, 

పెంతెకోస్తు పండుగలో క్రీస్తు సంఘము, 

బూరల పండుగలో క్రీస్తు రాకడ, 

ప్రాయశ్చిత్త దిన పండుగలో యూదులు క్రీస్తును గుర్తించుట, 

గుడారాల    పండుగలో క్రీస్తు వెయ్యేళ్ళ పాలన మనకు కనిపిస్తున్నాయి.

 

    మనము ఇప్పుడు 4 – 5 పండుగల మధ్యలో ఉన్నాము. ప్రస్తుత క్రైస్తవ సంఘ కాలము 4-5 పండుగల మధ్యలో ఉంది. ఈ ఒలీవల కొండ మీద శిష్యులు ఇశ్రాయేలు కు రాజ్యము ఎప్పుడు ఇస్తావు? అని యేసు ప్రభువును అడుగుతున్నారు. అది ఆరో పండుగ, ఏడవ పండుగల్లో జరిగేది. ఆరో పండుగ ప్రాయశ్చిత్త దిన పండుగ లో యూదులు ప్రభువైన యేసు క్రీస్తును గుర్తించాలి, పాప క్షమాపణ పొందాలి, ఆ తరువాత ఏడో పండుగ, గుడారాల పండుగలో ఆయన వారి మధ్య నివసిస్తాడు, వారికి రాజ్యము ఇస్తాడు. కాబట్టి శిష్యులు ఎదురుచూడాల్సిన పండుగ పెంతెకోస్తు పండుగ, ఈ రోజు మనము ఎదురు చూడాల్సిన పండుగ 5 పండుగ – బూరల పండుగ. బూరల పండుగ అంటే ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ. ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో రాబోయే ఆయన రెండవ రాకడ కోసము మనము ఎదురుచూడాలి. 

    వారితో మాటలాడిన తరువాత ప్రభువైన యేసు క్రీస్తు వారి కన్నుల ఎదుట పరలోకమునకు వెళ్ళాడు. అది ఒక కల కాదు, కథ కాదు, అది ఒక చారిత్రిక సంఘటన. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు కావటము, గాంధీ భారత దేశానికి స్వాతంత్రము తేవటం, డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావటం, నరేంద్ర మోడీ భారత దేశానికి ప్రధాన మంత్రి కావటం ఇవన్నీ చారిత్రిక సంఘటనలు, రక్త మాంసములు ధరించిన వ్యక్తులు చేసిన పనులు. యేసు క్రీస్తు రక్త మాంసములు ధరించి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు. ఆ సిలువ వేయబడడం, మరణించి, సమాధి చేయబడి, మూడవ దినమున తిరిగి లేవడం చారిత్రిక సంఘటనలు. ఆయన పరలోకానికి తిరిగి వెళ్లడం కూడా ఒక చారిత్రిక సంఘటన.

  ఇప్పుడు కొంత సేపు ఈ గ్రంథ రచయిత లూకా గురించి కూడా మనము చూద్దాము.ఓ థియోఫిలా, అని ఈ పుస్తకము మొదలు పెట్టాడు. లూకా సువార్తను కూడా ఆయనకే వ్రాశాడు. ఆయన రోమన్ సామ్రాజ్యములో అధికారి అయి ఉండవచ్చు. ఆయన గురించిన వివరాలు మనకు బైబిల్ లో లేవు. థియోఫిల అంటే దేవుని ప్రేమించేవాడు. ఎంత మంచి పేరు! 

     లూకా సువార్త, అపొస్తలుల కార్యములు వీటిని ఒకే పుస్తకములో రెండు భాగాలుగా మనము చూస్తే మంచిది. మొదటి భాగములో ప్రభువైన యేసు క్రీస్తు చేసిన కార్యములు, రెండవ భాగములోపరిశుద్ధాత్ముడు చేసిన కార్యములు వ్రాశాడు.ఒక భౌగోళిక క్రమము వాటిలో మనకు కనిపిస్తున్నాయి. లూకా సువార్తలో పైనుండి క్రిందకు తీసుకువెళ్ళాడు.గలిలయ ప్రాంతము, సమరయ ప్రాంతము, క్రింద యూదయ ప్రాంతములో యెరూషలేములో ముగించాడు.అపొస్తలుల కార్యముల గ్రంథములో క్రింద నుండి పైకి తీసుకువెళ్లాడు.యెరూషలేము లో మొదలు పెట్టి, సమరయ, తరువాత గలిలయ ఆ తరువాత ప్రపంచము మొత్తము సువార్త ఎలా వెళ్లిందో వివరించాడు.చక్కటి వివరాలు ఈ పుస్తకాల్లో వ్రాసాడు.

     లూకా ఒక వైద్యుడు. ఒక వైద్యుడు ఏది వ్రాసినా వివరముగా రాయాలి.ఒక వ్యక్తి నా దగ్గరకు కుట్లు వేయించుకోవటానికి వస్తే నేను మెడికల్ రికార్డు లోవ్రాయాలి. ఈయన వ్రేలు మీద కుట్లు వేశాను అని వ్రాస్తే సరిపోదు.ఏ వ్రేలు: బొటన వ్రేలా, చూపుడు వ్రేలా, మధ్య వ్రేలా వ్రాయాలి.కుడి చేయా, ఎడమ చేయా? వ్రేలుకు ముందా, వెనుకా? గాయము ఎంత పొడవు ఉంది? ఎంత లోతు ఉంది? గాయాన్ని దేనితో శుభ్రము చేసావు? ఏ మత్తు మందు ఇచ్చావు? ఎంత మత్తు మందు ఇచ్చావు? ఏ సైజు సూదితో ఇచ్చావు? కుట్లు వేయటానికి ఈ సైజు దారము వాడావు? ఎన్ని కుట్లు వేశావు? అవన్నీ వ్రాయాలి, సరైన మెడికల్ రికార్డులో ఆ వివరాలు అన్నీ ఉంటాయి.లూకా వ్రాసిన పుస్తకాల్లో అటువంటి చక్కని వివరాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక ఉదాహరణ చూద్దాము: 

  1. తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ

 సంవత్సరమందు యూదయకు 

పొంతిపిలాతు అధిపతిగాను,

 గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను,

 ఇతూరయ త్రకోనీతి దేశ ములకు 

అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను,

 అబి లేనే దేశమునకు లుసానియ

 అధిపతిగాను,

  1. అన్నయు, కయపయు ప్రధాన 

యాజకులుగాను, ఉన్నకాలమున 

అరణ్యములోనున్న 

జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు 

దేవుని వాక్యము వచ్చెను.(లూకా 3:1-2) 

ఎవరెవరు ఎక్కడ పరిపాలన చేస్తున్నారో చక్కటి వివరాలు వ్రాశాడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితము యూదుల చరిత్ర, రోమన్ల చరిత్ర తెలుసుకోవాలనుకునే చరిత్ర  కారులు లూకా వ్రాసిన పుస్తకములను క్షుణ్ణముగా అధ్యయనము చేస్తారు. ప్రపంచ చరిత్రలోనే గొప్ప చరిత్రకారుల్లో ఒకనిగా లూకా గారిని చెప్పుకోవచ్చు. అంత చక్కగా, శాస్త్రీయముగా లూకా సువార్తను, అపొస్తలుల కార్యముల గ్రంథములను ఆయన వ్రాశాడు. గత 200 సంవత్సరాలుగా ఆర్కియాలజిస్టులు త్రవ్వకాలు జరిపి వెలికితీసిన పురాతన వస్తువులు లూకా చెప్పిన విషయాలను దృఢపరుస్తున్నాయి. 

    తిరిగి మనము ఈ వాక్యభాగానికి వద్దాము. ప్రభువైన యేసు క్రీస్తు పరలోకమునకు వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులు, మిగిలిన విశ్వాసులు యెరూషలేము తిరిగివెళ్ళారు. యూదా ఇస్కరియోతు స్థానములో మరొక వ్యక్తిని వారు ఎన్నుకొన్నారు. దేవుడు వారికి గొప్ప బాధ్యత అప్పగించాడు. అదేమిటంటే యేసు క్రీస్తు మిగిల్చిన పని. యేసు క్రీస్తు యొక్క పనులు రెండు: 

  1. రక్షణ కార్యము 
  2. సువార్త కార్యము. 

ఆయన రక్షణ కార్యము ముగిసింది. 

సువార్త కార్యము ముగియలేదు. 

ఆయన మన రక్షణ కార్యము ముగించాడు. పరిపూర్ణముగా ముగించాడు. దానికి మనము ఏమీ కలుపలేము. అయితే ఆయన సువార్త కార్యము ముగించలేదు. రెండో వచనము చూద్దాము: ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని…. ఆయన ఆరంభించి వెళ్ళిపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన, ఆయన శిష్యులు సువార్త ప్రకటించారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ్యత ఆయన శిష్యులకు అప్పగించి వెళ్ళాడు.ఆయన శిష్యులు తరువాతి తరమునకు అప్పగించారు. వారు తరమునకు అప్పగించారు. అది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రతి విశ్వాసి, ప్రతి సువార్తికుడు ఆ గొప్ప వారసత్వాన్ని పొందాడు.దానిని గొప్ప గౌరవముగ మనము భావించాలి.

   నేను MD చదివే రోజుల్లో ఒక గొప్ప సర్జన్ ఉండేవాడు.ఆయన ఆపరేషన్ చేస్తుంటే నేను ప్రక్కన నిలబడి ఆయనకు అసిస్టెంట్ గా ఉండేవాణ్ణి. ఆయన బిజీ గా ఉండే రోజుల్లో ఆపరేషన్ చివర్లో, ‘ఆపరేషన్ నువ్వు ముగించు, నేను తరువాత కేసు చూస్తాను’ అని వెళ్ళేవాడు.ఆపరేషన్ నేను ముగించేవాణ్ణి. దాన్ని ఒక ఘనతగా చెప్పుకొనేవాణ్ణి. యేసు ప్రభువు కూడా ఆయన మొదలుపెట్టిన ఆపరేషన్ మనకు అప్పజెప్పి వెళ్ళాడు. ‘నా ఆపరేషన్ మీరు ముగించండి’ అని ఆయన మనకు చెపుతున్నాడు. దీని కన్నా గొప్ప ఆపరేషన్ లేదు. పాప రోగముతో బాధ పడుతున్న వారికి రక్షణ స్వస్థత ఇవ్వటానికి పరలోక వైద్యుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు 2 వేల సంవత్సరాల క్రితము మొదలుపెట్టిన ఆపరేషన్ మనము కొనసాగిస్తున్నాము.దాని కన్నా గొప్ప భాగ్యము ఇంకొకటి ఏముంది? దాని కన్నా గొప్ప ఘనత ఇంకొకటి ఏముంది? ‘ఆ సువార్త చెబుతున్నాములే’ అని నీరసముగా, నిరుత్సాహముతో, నిరాశతో మనము మాట్లాడకూడదు. ఆసక్తితో, ఉత్సాహముతో చెప్పాలి.It is a great honor to preach the gospel of our Lord Jesus Christ.సువార్త ప్రకటించడము గొప్ప ఘనత. ‘సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను’ అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ గొప్ప సువార్తను మీరు నమ్మి, మీ పాపములు ఒప్పుకొని, ప్రభువైన యేసు క్రీస్తును మీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

One thought

  1. Brother, గ్రంథ పరిచయాలు నేర్చుకునే స్థాయి లో ఉన్న మాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి.
    -ధన్యవాదాలు

Leave a Reply