
ప్రసంగి గ్రంథము సొలొమోను వ్రాసిన తాత్విక పుస్తకము. సొలొమోను తన జీవితమును, తన సమాజమును పరిశీలించి, ఎంతో మధన పడుచూ ఈ పుస్తకం వ్రాశాడు. సుమేరియన్ నాగరికతలో గిల్గామిష్ కావ్యము Epic of Gilgamesh అని ఉంది. ఈ కావ్యములో ‘ఎంకిడు’ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. మానవ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఎంకిడు ప్రపంచమంతా తిరుగుతాడు. ‘ప్రపంచమంతా తిరిగి, మానవ జీవితాన్ని అర్థం చేసుకొని తన కథను రాతి పలకల మీద చెక్కిస్తాడు. ప్రసంగి లో సొలొమోను ఒక ‘ఎంకిడు’ వలె మనకు కనిపిస్తున్నాడు. తన జీవితాన్ని, తన సమాజాన్ని బాగా పరిశీలించి, రాతి మీద కాకుండా, బైబిల్ లో ఒక పుస్తకంగా ‘ప్రసంగి’ గ్రంథాన్ని సొలొమోను మన కొరకు వ్రాశాడు.
యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము – ఈ ఐదు పుస్తకములను‘జ్ఞాన సాహిత్యము’ అని పిలిచారు. మన జీవితమునకు కావలసిన జ్ఞానము దేవుడు ఈ ఐదు పుస్తకములలో వ్రాయించాడు. యోబు, సామెతలు, ప్రసంగి గ్రంథాలు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాయి.జీవితానికి అర్థం ఉందా? సామెతలు గ్రంథం: ‘కొన్ని సూత్రాలు పాటిస్తే మన జీవితాన్ని అర్థ వంతముగా చేసుకోవచ్చు’ అంటుంది.ప్రసంగి గ్రంథం: ‘నువ్వు ఎంతో కష్టపడతావు, ఎంతో ప్రయాస పడతావు, కానీ ఏమి లాభం. ఒక రోజు నీవు చనిపోతావు. అంటుంది. యోబు గ్రంథం: ‘జీవితానికి అర్ధమే కాదు, న్యాయము కూడా లేదు, యోబు లాంటి నీతి మంతులు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తారు’ అంటుంది.
సామెతలు గ్రంథము లో ప్రోత్సాహము కనిపిస్తుంది., ‘కష్టపడు, మంచి ఫలితాలుసాధిస్తావు’. కానీ, ప్రసంగిలో వైరాగ్యం కనిపిస్తుంది. ‘కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఏదో సాధించావు, నీకు తృప్తి లేదు. అంతా వ్యర్థం అంటున్నాడు. సొలొమోను ఈ సత్యము ఇప్పుడు గ్రహించాడు. ఈ ప్రపంచములో సుఖమైనవి, విలువైనవి అన్నీ నేను అనుభవించాను.అంతా వ్యర్థము అంటున్నాడు. ఇదంతా పాయింట్ లెస్, ఇదంతా మీనింగ్ లెస్ అంటున్నాడు.
దేవుడు సొలొమోనును చూసి,అతని స్థితి చూసి ఆశ్చర్యపోలేదు. ఏదెను వనములో దేవుడు ఆదాముతో అన్నాడు, ‘ఆదాము, హవ్వ, నేను మీకిచ్చిన వాటితో మీరు సంతృప్తి పొందండి. నా సహవాసము, నా సన్నిధి, నా సమృద్ధి మీకు చాలు’.
సాతానుడు ఆదాముకు ఒక మాట చెప్పాడు. నీకు అది చాలదు, నువ్వు దేవుడు వద్దు అన్న కాయ కూడా తినాలి. ఆదాము ఏమనుకొన్నాడు? నేను ఆ కాయ తినాలి. నేను ఆ కాయ తినాల్సిందే. అప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది’. ఆ కాయ తిన్నాడు. కానీ, అతనికి సంతృప్తి కలుగలేదు. అప్పటి వరకు ఉన్న ఆశీర్వాదాలు కూడా ఆయనను వదలివెళ్ళిపోయాయి. ఆనందము పోయింది, దుఃఖం మిగిలింది
ఈ రోజు సాతానుడు మన ముందు అనేక రకాల కాయలు పెడుతున్నాడు: డబ్బు, అధికారం, అంతస్తు, అందము, పాపులారిటీ, సెక్స్, డ్రగ్స్, సినిమాలు, పోర్నోగ్రఫీ. ప్రజలు ఈ కాయలు రోజంతా తింటున్నారు కానీ వారికి సంతృప్తి లేదు. వారి హృదయాల్లో ఉన్న శూన్యత అలాగే ఉంటున్నది. సొలొమోను ఆ కాయలన్నీ తిన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే (ప్రసంగి 1:2). జీవితానికి అర్థం లేదు, ఇదంతా meaningless, pointless nonsense అంటున్నాడు. జీవితానికి అర్థం ఎలా వస్తుంది?
ఈ లోకములో ఉన్న మతాలు, ఫిలాసఫీ లు అనేక సమాధానాలు మనకు ఇస్తాయి. ‘ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే’ అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:19 లోవ్రాశాడు. ఈ లోక జ్ఞానము అంటే భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, గణిత శాస్త్రము, జీవ శాస్త్రము మొదలగు సైన్స్ శాస్త్రాలు కావు. సైన్స్ లో ఉన్న జ్ఞానము ప్రకృతిలో దేవుడు పెట్టినదే. ఈ లోక జ్ఞానము అంటే అది జీవిత శాస్త్రము. మన జీవితాన్ని ఎలా జీవించాలి? దేనిమీద మన దృష్టి పెట్టాలి? ఆనందము కోసము దేనిని వెదకాలి? సంతృప్తి కోసం దేనిని వెదకాలి? మన ప్రధాన లక్ష్యాలు ఎలా ఉండాలి? ఆ ప్రశ్నలకు ఈ లోకస్తులు ఇచ్చే సమాధానాలే ఈ లోక జ్ఞానము. ఈ లోకస్తులు ఇచ్చే సమాధానాలు దేవుని దృష్టిలో వెఱ్ఱితనమే. వాటిని జీవిత సత్యాలుగా మలచుకొని జీవిస్తే ప్రసంగి గ్రంథములో మనకు కనిపిస్తున్న సొలొమోను వలె మనము కూడా నిరాశ,నిస్పృహలతో కూడిన మనోవేదనలోకి కృంగిపోతాము.
‘వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే’ అనే మాటలతో ప్రసంగి గ్రంథము మొదలవుచున్నది. జీవితానికి అర్థం ఉందా? బాల్యము, యుక్త వయస్సు, మధ్య వయస్సు, వృద్ధాప్యము… ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు….. దేనికోసమో ఆరాటపడుతూ ఉంటాము. ఉన్న వాటితో సంతృప్తి ఉండదు, లేని వాటి కోసము తాపత్రయ పడుతాము. జీవన ప్రయాణము నిస్సారంగాసాగుతుంది. డబ్బు మనకు సంతృప్తి ఇవ్వదు, జ్ఞానము మనకు సంతృప్తి ఇవ్వదు, అధికారం మనకు సంతృప్తి ఇవ్వదు. మానవ కోణం నుండి చూస్తే మనిషి జీవితానికి అర్థం ఉండదు. అంతా వ్యర్థమే అనిపిస్తుంది. అయితే దేవుని కోణం నుండి మనము జీవితాన్ని చూడాలి. మన జీవితములో కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు ఉండవచ్చు, అయినప్పటికీ మనము జీవితాన్ని దేవుడు ఇచ్చిన కానుక గానే చూడాలి. ప్రతి దినం అర్థవంతముగా బ్రతకాలి. దేవుని దృక్పథములో నుండి చూస్తే, మన జీవితం వ్యర్థం కాదు. ఈ సందేశాన్ని ఈ ప్రసంగి గ్రంథము మనకు ఇస్తున్నది.
యూదులు పర్ణశాలల పండుగలో ఆనందముతో ఈ పుస్తకము చదువుతారు. ఈ పుస్తకము నిరాశతో నిండినట్లు కాదు. అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించు జీవిత పరమార్థం, ఆనందముల వైపు మనలను నడిపిస్తుంది.
రచయిత: రాజైన సొలొమోను ఈ గ్రంథం వ్రాశాడు. ఈయనను ‘ఫిలాసఫర్-కింగ్’అని మనము పిలవవచ్చు. రోమన్ చక్రవర్తి మార్కస్ అరెలియస్ ని మనము ‘ఫిలాసఫర్-కింగ్’ – ‘తత్వవేత్త- రాజు’. ఆయన చక్రవర్తిగా రోమన్ సామ్రాజ్యాన్నిపాలిస్తూనే ప్రజలకు తత్వశాస్తం బోధించాడు. ‘మెడిటేషన్స్’ అనే పుస్తకం వ్రాశాడు. సొలొమోను కూడా ఇశ్రాయేలీయులను పాలిస్తూనే వారికి తత్వశాస్త్రం బోధించాడు. తనజీవితాన్ని ఒక ఫిలాసఫీ గా ఇక్కడ మనకు బోధిస్తున్నాడు , అందుకనే ఈ ‘ప్రసంగి’ అనే పుస్తకం వ్రాశాడు. సొలొమోను ఆ విధముగా ఒక ‘ఫిలాసఫర్ – కింగ్’
వ్రాయబడిన కాలము: 931 BC
వ్రాయబడిన స్థలము: యెరూషలేము
ముఖ్య అంశాలు:
జీవిత పరమార్థం:
ఈ ప్రసంగి గ్రంథం యొక్క ముఖ్యమైన అంశము ‘జీవిత పరమార్థం’ Meaning of life. ప్రతి వ్యక్తికీ వచ్చే అతి ముఖ్యమైన ప్రశ్న అదే: ‘నా జీవితానికి అర్థం ఉందా?’ Does my life have any meaning? ఎక్సప్లనేషన్ వేరు, మీనింగ్ వేరు. ఒక సైంటిస్ట్ ఈ విశ్వము లో ప్రతి దాని గురించి మనకు వివరించవచ్చు. అయితే, విశ్వం యొక్క మీనింగ్ ఏ సైంటిస్ట్ చెప్పలేడు. ఈ విశ్వం ఎందుకు సృష్టించబడింది? ఈ విశ్వం యొక్క అవసరం ఏమిటి? మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు? మనిషి జీవితము ఎందుకు? ఆ ప్రశ్నలకు సైన్స్ సమాధానం చెప్పలేదు. ఇలాంటి సమయములో మనకు ఆ ప్రశ్నలు రావటం సహజం. కరోనా ఉధృతముగా ప్రపంచమంతా వీస్తూ ఉన్నది. ప్రతి రోజూ వేల మందికి ఈ వైరస్ అంటుకొంటున్నది. కొద్ది సేపటి క్రితం ఒక సోదరి నాకు ఫోన్ చేసింది. ‘డాక్టర్, నాకు కరోనా వచ్చింది. గాలి కూడా పీల్చలేకపోతున్నాను. నాకు మందులు వ్రాయండి’. గాలి కూడా పీల్చలేని స్థితిలో ఆ సోదరి ఉంది. ఆమెకు వెంటనే మందులు వ్రాశాను. అటువంటి అనిశ్చితి మన చుట్టూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మనకు మనో వేదన కలుగ వచ్చు. ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మ హత్యలు చేసుకోవడం మనము చూస్తూ ఉన్నాము.
ఆల్బర్ట్ కము అనే నాస్తిక ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు, “There is (but) one truly serious philosophical problem and that is suicide. Judging whether life is or is not worth living amounts to answering the fundamental question of philosophy. All the rest comes aferwards”
అతి ముఖ్యమైన తత్వ శోధన ఆత్మ హత్య గురించే. తత్వ శాస్త్రము యొక్క అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ‘జీవితానికి అర్థం ఉందా లేదా’? మిగిలిన ప్రశ్నలన్నీ ఆ ప్రశ్న తరువాతే. ఒక నాస్తికుడు ఆ మాటలు అన్నాడు. ఒక క్రైస్తవుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా? సొలొమోను రాజు తన జీవితం గురించి ఎంతో ఆలోచించాడు. ఎంతో జ్ఞానం, అధికారం, రాజరికం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం చవిచూసిన తరువాత అతని జీవితం ఎంతో ఖాళీగా కనిపించింది. నా జీవితానికిఅర్థం ఏమైనా ఉందా? అని ప్రశ్నించుకొన్నాడు.
1 :14 లో చూద్దాము: సూర్యుని క్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే,అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.(ప్రసంగి 1:14).
సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూశాను. అవి అన్నీ వ్యర్థము. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. “What has Athens to do with Jerusalem?” అనే ప్రశ్న మనకు రావచ్చు. ఏథెన్సుకు, యెరూషలేముకు సంబంధము ఏమిటి? గ్రీకు తత్వానికి, దేవుని ప్రత్యక్షతకు సంభంధం ఏమిటి?అని మనము అడుగవచ్చు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు ఇలాంటి తత్వవేత్తలు ప్రశ్నలు అడిగారే కానీ వారి సమాధానాలు లేవు. సమాధానము కోసము మనము యేసు క్రీస్తు దగ్గరకు రావాలి.
మనిషి చేసే అన్వేషణకు దేవుడు ఇచ్చిన సమాధానము యేసు క్రీస్తు.
మన జీవితమునకు అర్థము దేవుడు క్రీస్తు నందు మనకు అనుగ్రహించాడు. సొలొమోను వలె డబ్బు, జ్ఞానము, అధికారము, శృంగారము ల వైపు పరుగెడితే, వాటితో మనలను నింపుకొంటే మన జీవితములకు అర్థం రాదు. క్రీస్తు వైపు చూస్తే, మన జీవితములో ప్రతి రోజును దేవుడు అర్థవంతముగా, ఆనందకరముగా,ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. యోహాను సువార్త 15 అధ్యాయములో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు :
మీయందు నా సంతోషము
ఉండవలెననియు, మీ సంతోషము
పరిపూర్ణము కావలెననియు, ఈ
సంగతులు మీతో చెప్పుచున్నాను (యోహాను 15:11).
మన జీవితానికి అర్ధాన్ని ఇచ్చి, మనకు సంతోషమును ఇవ్వాలని యేసు ప్రభువు కోరుకొంటున్నాడు.
వ్యర్థము:
ఈ ప్రసంగి గ్రంథములో అనేక సార్లు మనకు కనిపించే మాట ‘వ్యర్థము’. 1:2 లోమనము చదువుతున్నాము.వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే (ప్రసంగి 1:2). జీవితానికి అర్థం లేదు, ఇదంతా మీనింగ్ లెస్ అంటున్నాడు. 2 అధ్యాయములో సొలొమోను తన జీవితాన్ని ఎలా గడిపాడో చెబుతున్నాడు. 4. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.5. నాకొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.6. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.7. పనివారినిపని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని
8. నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.
9. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై
అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. సొలొమోను వాటిలో ఆనందము వెదికాడు.అది దొరకనప్పుడు, ‘ఇదంతా వ్యర్ధము’ అని నిట్టూర్చాడు. అపొస్తలుడైన పౌలు ఒక్క సారి కూడా ఇది వ్యర్థం అని అనలేదు. సొలొమోను కు వలె పౌలుకు గొప్ప భవనాలు లేకపోవచ్చు, అందమైన ద్రాక్ష తోటలు, వేలాది మంది దాసులు, వందలాది మంది భార్యలు పౌలుకు లేరు. పౌలు ఒక మాట వ్రాశాడు.
26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,27. గాలిని
కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన
తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి,
దానిని లోపరచుకొనుచున్నాను. 1 కొరింథీ 9:26,27.
సొలొమోను ఏమంటున్నాడంటే, ‘నా జీవితము గాలి కొరకు ప్రయాసపడినట్లు ఉంది’. పౌలు ఏమంటున్నాడంటే, ‘నా జీవితము గాలిని కొట్టినట్లు లేదు. నేను క్రీస్తు యొద్దకు పరుగెడుతున్నాను’. ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు మీరు పరుగెడుతున్నప్పుడు ఏదీ వ్యర్థమైనది కాదు – ఏ రోజూ, ఏ పూటా, ఏ పనీ, ఏ మాటా వ్యర్థం కాదు.
ప్రయాస:
ప్రసంగి 2:18, ‘సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని’ . నేను ఎంతో ప్రయాసపడి ఎన్నో పనులు చేశాను. కానీ ఏమి లాభము? నా తరువాతవచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటి యందు అసహ్యపడితిని అని అంటున్నాడు. నా తరువాత ఏమిటి? అని దేవుడు లేని వ్యక్తి ఆందోళన చెందుతాడు. అయితే, క్రైస్తవుడు ఆ విధముగా అలోచించాడు. నాది వ్యర్థమైన ప్రయాస అనుకోడు. మన చేసే పనుల యొక్క ఫలితాలు మన చేతిలో ఉండవు.1 కొరింథీ 3:6-7 వచనాలు చూద్దాము. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు:
నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను,
వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
కాబట్టి వృద్ధి కలుగజేయు
దేవునిలోనే గాని,
నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలో
నైనను ఏమియులేదు.
1 కొరింథీ 3:6-7
పౌలు నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేసింది దేవుడే. నాటు వానిలో ఏమీ లేదు, నీళ్లు పోసే వానిలో ఏమీ లేదు, వృద్ధి కలుగ జేసే దేవునిలోనే అంతా ఉంది. సొలొమోను ఆ కోణాన్ని చూడలేకపోయాడు. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని
తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని అంటున్నాడు. మనము ఆ విధముగా నిసృహ చెందము. మీరు దేవుని వాక్యాన్ని విత్తితే, ఆ వాక్యాన్ని ఫలింపజేయుటకు దేవుడు నీళ్లు పోసే వ్యక్తిని మీ తరువాత పంపిస్తాడు.
నిరాసక్తి:
ప్రసంగి గ్రంథం 1:9
మునుపు ఉండినదే
ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని
క్రింద నూతనమైన దేదియు లేదు.
ప్రసంగి గ్రంథం 1:9
ప్రసంగిలో నిరాశక్తి మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది.ప్రొద్దునే లేచాను, మళ్ళీ రాత్రి అయ్యే వరకు రోజూ అవే పనులు చేయాలి, ఒకే రొటీన్, ఒకే పనులు, క్రొత్తదనం లేదు అంటున్నాడు. గ్రీకు పురాణాల్లో మనకు సిసిఫస్ అనే రాజు కనిపిస్తాడు. అతడు ఒక శాపానికి గురవుతాడు. ఆయన ఒక రాయిని లోయలో నుండి కొండ మీద వరకు దొర్లించాలి. కష్టపడి ఆ రాయిని కొండ మీద వరకు దొర్లిస్తాడు. అప్పుడు ఆ రాయి తిరిగి లోయలోకి జారిపోతుంది. సిసిఫస్ మళ్ళీ ఆ రాయిని లోయలో నుండి కొండమీదకు దొర్లించి పైకి ఎక్కిస్తాడు. మళ్ళీ రాయి లోయలోకి జారిపోతుంది. దానికి ఇక అంతము ఉండదు. అది ఒక మోనోటని. ఒక చక్రం వలె నిరంతరమూ నిరాసక్తితో తిరుగుతూ ఉండే జీవితము. అయితే క్రైస్తవ విశ్వాసి ఆ విధముగా జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి రోజూ నూతన కార్యములు మన జీవితములో చేస్తాడు. దేవుని సహవాసములో మనము గడిపితే మనకు నిరాసక్తి ఉండదు. కీర్తన 16:11 లో
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు
in Thy presence is fullness of joy
కీర్తన 16:11
దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి దేవుని సంతోషాన్ని పొందుతాడు. ఆసక్తితో జీవిస్తాడు. ‘ప్రతి రోజూ ఇదే గొడవ, నాకు బోర్ కొడుతోంది, సూర్యుని క్రింద క్రొత్తదేమీ లేదు’ అనడు.
1 కొరింథీ 15:58 లో ఒక మంచి వాక్యం మనం చూస్తాము.
58. కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు
వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును,
కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు
ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.1 కొరింథీ 15:58
పౌలు ఏమంటున్నాడంటే, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదు. స్థిరముగా ఉండండి. సిసిఫస్ వలె మీరు లోయలో నుండి కొండ మీదకు, కొండ మీద నుండి లోయలోకి నిత్యమూ రాయి దొర్లించే వారి వలె జీవించాల్సిన అవసరము లేదు. క్రీస్తు నందు మీకు దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చాడు. దేవుని కార్యముల యందు మీరు ఎప్పటికీ ఆసక్తితో ఉండవచ్చు’ అంటున్నాడు. ప్రసంగి గ్రంథము లో కొన్ని విషయాలు ఈ రోజు చూశాము. ప్రసంగి కి జీవితము నిస్సారముగా కనిపించింది. సిసిఫస్ వలె నిరాసక్తితో అతను జీవించాడు. అయితే దేవుడు మనకొరకు ఉద్దేశించిన జీవితం అదికాదు. మనము యేసు క్రీస్తు ను మన రక్షకునిగా స్వీకరించి, పాప క్షమాపణ పొంది, ఆనందమును పొందాలని దేవుడు కోరుకొంటున్నాడు.