ప్రసంగి గ్రంథము పరిచయం

పరిచయం:

     ప్రసంగి గ్రంథము సొలొమోను వ్రాసిన తాత్విక పుస్తకము. సొలొమోను తన జీవితమును, తన సమాజమును పరిశీలించి, ఎంతో మధన పడుచూ ఈ పుస్తకం వ్రాశాడు. సుమేరియన్ నాగరికతలో  గిల్గామిష్ కావ్యము Epic of Gilgamesh అని ఉంది. ఈ కావ్యములో ‘ఎంకిడు’ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. మానవ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఎంకిడు ప్రపంచమంతా తిరుగుతాడు. ‘ప్రపంచమంతా తిరిగి, మానవ జీవితాన్ని అర్థం చేసుకొని తన కథను రాతి పలకల మీద చెక్కిస్తాడు. ప్రసంగి లో సొలొమోను ఒక ‘ఎంకిడు’ వలె మనకు కనిపిస్తున్నాడు. తన జీవితాన్ని, తన సమాజాన్ని బాగా పరిశీలించి, రాతి మీద కాకుండా, బైబిల్ లో ఒక పుస్తకంగా ‘ప్రసంగి’ గ్రంథాన్ని సొలొమోను మన కొరకు వ్రాశాడు.

   యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము – ఈ ఐదు పుస్తకములను ‘జ్ఞాన సాహిత్యము’ అని పిలిచారు. మన జీవితమునకు కావలసిన జ్ఞానము దేవుడు ఈ ఐదు పుస్తకములలో వ్రాయించాడు. యోబు, సామెతలు, ప్రసంగి గ్రంథాలు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాయి.జీవితానికి అర్థం ఉందా? సామెతలు గ్రంథం: ‘కొన్ని సూత్రాలు పాటిస్తే మన జీవితాన్ని అర్థ వంతముగా చేసుకోవచ్చు’ అంటుంది. ప్రసంగి గ్రంథం: ‘నువ్వు ఎంతో కష్టపడతావు, ఎంతో ప్రయాస పడతావు, కానీ ఏమి లాభం. ఒక రోజు నీవు చనిపోతావు. అంటుంది. యోబు గ్రంథం: ‘జీవితానికి అర్ధమే కాదు, న్యాయము కూడా లేదు, యోబు లాంటి నీతి మంతులు కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తారు’ అంటుంది. సామెతలు గ్రంథము లో ప్రోత్సాహము కనిపిస్తుంది., ‘కష్టపడు, మంచి ఫలితాలు సాధిస్తావు’. కానీ, ప్రసంగిలో వైరాగ్యం కనిపిస్తుంది. ‘కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ఏదో సాధించావు, నీకు తృప్తి లేదు. అంతా వ్యర్థం అంటున్నాడు.

    సొలొమోను ఈ సత్యము ఇప్పుడు గ్రహించాడు. ఈ ప్రపంచములో సుఖమైనవి, విలువైనవి అన్నీ నేను అనుభవించాను. అంతా వ్యర్థము అంటున్నాడు. ఇదంతా పాయింట్ లెస్, ఇదంతా మీనింగ్ లెస్ అంటున్నాడు. దేవుడు సొలొమోనును చూసి, అతని స్థితి చూసి ఆశ్చర్యపోలేదు. ఏదెను వనములో దేవుడు ఆదాముతో అన్నాడు, ‘ఆదాము, హవ్వ, నేను మీకిచ్చిన వాటితో మీరు సంతృప్తి పొందండి. నా సహవాసము, నా సన్నిధి, నా సమృద్ధి మీకు చాలు’. సాతానుడు ఆదాముకు ఒక మాట చెప్పాడు. నీకు అది చాలదు, నువ్వు దేవుడు వద్దు అన్న కాయ కూడా తినాలి. ఆదాము ఏమనుకొన్నాడు? నేను ఆ కాయ తినాలి. నేను ఆ కాయ తినాల్సిందే. అప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది’. ఆ కాయ తిన్నాడు. కానీ, అతనికి సంతృప్తి కలుగలేదు. అప్పటి వరకు ఉన్న ఆశీర్వాదాలు కూడా ఆయనను వదలివెళ్ళిపోయాయి. ఆనందము పోయింది, దుఃఖం మిగిలింది.

    ఈ రోజు సాతానుడు మన ముందు అనేక రకాల కాయలు పెడుతున్నాడు: డబ్బు, అధికారం, అంతస్తు, అందము, పాపులారిటీ, సెక్స్, డ్రగ్స్, సినిమాలు, పోర్నోగ్రఫీ. ప్రజలు ఈ కాయలు రోజంతా తింటున్నారు కానీ వారికి సంతృప్తి లేదు. వారి హృదయాల్లో ఉన్న శూన్యత అలాగే ఉంటున్నది. సొలొమోను ఆ కాయలన్నీ తిన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే (1:2). జీవితానికి అర్థం లేదు, ఇదంతా meaningless, pointless nonsense  అంటున్నాడు. జీవితానికి అర్థం ఎలా వస్తుంది? ఈ లోకములో ఉన్న మతాలు, ఫిలాసఫీ లు అనేక సమాధానాలు మనకు ఇస్తాయి. 

‘ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే’ అని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:19 లోవ్రాశాడు. ఈ లోక జ్ఞానము అంటే భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, గణిత శాస్త్రము, జీవ శాస్త్రము మొదలగు సైన్స్ శాస్త్రాలు కావు. సైన్స్ లో ఉన్న జ్ఞానము ప్రకృతిలో దేవుడు పెట్టినదే. ఈ లోక జ్ఞానము అంటే అది జీవిత శాస్త్రము. మన జీవితాన్ని ఎలా జీవించాలి? దేనిమీద మన దృష్టి పెట్టాలి? ఆనందము కోసము దేనిని వెదకాలి? సంతృప్తి కోసం దేనిని వెదకాలి? మన ప్రధాన లక్ష్యాలు ఎలా ఉండాలి? ఆ ప్రశ్నలకు ఈ లోకస్తులు ఇచ్చే సమాధానాలే ఈ లోక జ్ఞానము. ఈ లోకస్తులు ఇచ్చే సమాధానాలు దేవుని దృష్టిలో వెఱ్ఱితనమే. వాటిని జీవిత సత్యాలుగా మలచుకొని జీవిస్తే ప్రసంగి గ్రంథములో మనకు కనిపిస్తున్న సొలొమోను వలె మనము కూడా నిరాశ, నిస్పృహలతో కూడిన మనోవేదనలోకి కృంగిపోతాము.

‘వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే’ అనే మాటలతో ప్రసంగి గ్రంథము మొదలవుచున్నది. జీవితానికి అర్థం ఉందా? బాల్యము, యుక్త వయస్సు, మధ్య వయస్సు, వృద్ధాప్యము… ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు….. దేనికోసమో ఆరాటపడుతూ ఉంటాము. ఉన్న వాటితో సంతృప్తి ఉండదు, లేని వాటి కోసము తాపత్రయ పడుతాము. జీవన ప్రయాణము నిస్సారంగా సాగుతుంది. డబ్బు మనకు సంతృప్తి ఇవ్వదు, జ్ఞానము మనకు సంతృప్తి ఇవ్వదు, అధికారం మనకు సంతృప్తి ఇవ్వదు. మానవ కోణం నుండి చూస్తే మనిషి జీవితానికి అర్థం ఉండదు. అంతా వ్యర్థమే అనిపిస్తుంది. అయితే దేవుని కోణం నుండి మనము జీవితాన్ని చూడాలి. మన జీవితములో కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు ఉండవచ్చు, అయినప్పటికీ మనము జీవితాన్ని దేవుడు ఇచ్చిన కానుక గానే చూడాలి. ప్రతి దినం అర్థవంతముగా బ్రతకాలి. దేవుని దృక్పథములో నుండి చూస్తే, మన జీవితం వ్యర్థం కాదు. ఈ సందేశాన్ని ఈ ప్రసంగి గ్రంథము మనకు ఇస్తున్నది. 

         యూదులు పర్ణశాలల పండుగలో ఆనందముతో ఈ పుస్తకము చదువుతారు. ఈ పుస్తకము నిరాశతో నిండినట్లు కాదు. అది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహించు జీవిత పరమార్థం, ఆనందముల వైపు మనలను నడిపిస్తుంది.

రచయిత: రాజైన సొలొమోను ఈ గ్రంథం వ్రాశాడు. ఈయనను ‘ఫిలాసఫర్-కింగ్’ అని మనము పిలవవచ్చు. రోమన్ చక్రవర్తి మార్కస్ అరెలియస్ ని మనము ‘ఫిలాసఫర్-కింగ్’ – ‘తత్వవేత్త- రాజు’. ఆయన చక్రవర్తిగా రోమన్ సామ్రాజ్యాన్ని పాలిస్తూనే ప్రజలకు తత్వశాస్తం బోధించాడు. ‘మెడిటేషన్స్’ అనే పుస్తకం వ్రాశాడు. సొలొమోను కూడా ఇశ్రాయేలీయులను పాలిస్తూనే వారికి తత్వశాస్త్రం బోధించాడు. తన జీవితాన్ని ఒక ఫిలాసఫీ గా ఇక్కడ మనకు  బోధిస్తున్నాడు , అందుకనే  ఈ ‘ప్రసంగి’ అనే పుస్తకం వ్రాశాడు. సొలొమోను ఆ విధముగా ఒక ‘ఫిలాసఫర్ – కింగ్’ 

వ్రాయబడిన కాలము: 931 BC 

వ్రాయబడిన స్థలము: యెరూషలేము 

ముఖ్య అంశాలు: 

జీవిత పరమార్థం: 

ఈ ప్రసంగి గ్రంథం యొక్క ముఖ్యమైన అంశము ‘జీవిత పరమార్థం’ Meaning of life. ప్రతి వ్యక్తికీ వచ్చే అతి ముఖ్యమైన ప్రశ్న అదే: ‘నా జీవితానికి అర్థం ఉందా?’ Does my life have any meaning? ఎక్సప్లనేషన్ వేరు, మీనింగ్ వేరు. ఒక సైంటిస్ట్ ఈ విశ్వము లో ప్రతి దాని గురించి మనకు వివరించవచ్చు. అయితే, విశ్వం యొక్క మీనింగ్  ఏ  సైంటిస్ట్  చెప్పలేడు. ఈ విశ్వం ఎందుకు సృష్టించబడింది? ఈ విశ్వం యొక్క అవసరం ఏమిటి? మనిషి ఎందుకు సృష్టించబడ్డాడు? మనిషి జీవితము ఎందుకు? ఆ ప్రశ్నలకు సైన్స్ సమాధానం చెప్పలేదు. ఇలాంటి సమయములో మనకు ఆ ప్రశ్నలు రావటం సహజం. కరోనా ఉధృతముగా ప్రపంచమంతా వీస్తూ ఉన్నది. ప్రతి రోజూ వేల  మందికి ఈ వైరస్ అంటుకొంటున్నది. కొద్ది సేపటి క్రితం ఒక సోదరి నాకు ఫోన్ చేసింది. ‘డాక్టర్, నాకు కరోనా వచ్చింది. గాలి కూడా పీల్చలేకపోతున్నాను. నాకు మందులు వ్రాయండి’. గాలి కూడా పీల్చలేని స్థితిలో ఆ సోదరి ఉంది. ఆమెకు వెంటనే మందులు వ్రాశాను. అటువంటి అనిశ్చితి మన చుట్టూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మనకు మనో వేదన కలుగ వచ్చు. ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఆత్మ హత్యలు చేసుకోవడం మనము చూస్తూ ఉన్నాము. 

ఆల్బర్ట్ కము అనే నాస్తిక  ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు, “There is (but) one truly serious philosophical problem and that is suicide. Judging whether life is or is not worth living amounts to answering the fundamental question of philosophy. All the rest comes aferwards” 

అతి ముఖ్యమైన తత్వ శోధన ఆత్మ హత్య గురించే. తత్వ శాస్త్రము యొక్క అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ‘జీవితానికి అర్థం ఉందా లేదా’? మిగిలిన ప్రశ్నలన్నీ ఆ ప్రశ్న తరువాతే. ఒక నాస్తికుడు ఆ మాటలు అన్నాడు. 

ఒక క్రైస్తవుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలడా? 

సొలొమోను రాజు తన జీవితం గురించి ఎంతో ఆలోచించాడు. ఎంతో జ్ఞానం, అధికారం, రాజరికం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం చవిచూసిన తరువాత అతని జీవితం ఎంతో ఖాళీగా కనిపించింది. నా జీవితానికి అర్థం ఏమైనా ఉందా? అని ప్రశ్నించుకొన్నాడు. 1 :14 లో చూద్దాము: సూర్యుని క్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.(1:14)

    సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూశాను. అవి అన్నీ వ్యర్థము. అవి  ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. “What has Athens to do with Jerusalem?” అనే ప్రశ్న మనకు రావచ్చు. ఏథెన్సుకు, యెరూషలేముకు సంబంధము ఏమిటి? గ్రీకు తత్వానికి, దేవుని ప్రత్యక్షతకు సంభంధం ఏమిటి? అని మనము అడుగవచ్చు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, బుద్ధుడు ఇలాంటి తత్వవేత్తలు ప్రశ్నలు అడిగారే కానీ వారి సమాధానాలు లేవు. సమాధానము కోసము మనము యేసు క్రీస్తు దగ్గరకు రావాలి. మనిషి చేసే అన్వేషణకు దేవుడు ఇచ్చిన సమాధానము యేసు క్రీస్తు. 

    మన జీవితమునకు అర్థము దేవుడు క్రీస్తు నందు మనకు అనుగ్రహించాడు. సొలొమోను వలె డబ్బు, జ్ఞానము, అధికారము, శృంగారము ల వైపు పరుగెడితే, వాటితో మనలను నింపుకొంటే మన జీవితములకు అర్థం రాదు. క్రీస్తు వైపు చూస్తే, మన జీవితములో ప్రతి రోజును దేవుడు అర్థవంతముగా, ఆనందకరముగా, ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచుతాడు.  యోహాను సువార్త 15 అధ్యాయములో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు  : మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను (యోహాను 15:11). మన జీవితానికి అర్ధాన్ని ఇచ్చి, మనకు సంతోషమును ఇవ్వాలని యేసు ప్రభువు కోరుకొంటున్నాడు.

    వ్యర్థము: 

ఈ ప్రసంగి గ్రంథములో అనేక సార్లు మనకు కనిపించే మాట ‘వ్యర్థము’. 1:2 లో మనము చదువుతున్నాము.వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే (1:2). జీవితానికి అర్థం లేదు, ఇదంతా మీనింగ్ లెస్ అంటున్నాడు. 2 అధ్యాయములో సొలొమోను తన జీవితాన్ని ఎలా గడిపాడో చెబుతున్నాడు. 

4. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.5. నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.6. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.7. పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.8. నాకొరకు నేను వెండి బంగార ములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని.9. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు.

  సొలొమోను వాటిలో ఆనందము వెదికాడు.అది దొరకనప్పుడు, ‘ఇదంతా వ్యర్ధము’ అని నిట్టూర్చాడు. అపొస్తలుడైన పౌలు ఒక్క సారి కూడా ఇది వ్యర్థం అని అనలేదు. సొలొమోను కు వలె పౌలుకు గొప్ప భవనాలు లేకపోవచ్చు, అందమైన ద్రాక్ష తోటలు, వేలాది మంది దాసులు, వందలాది మంది భార్యలు పౌలుకు లేరు. పౌలు ఒక మాట వ్రాశాడు. 

26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను,27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను. 1 కొరింథీ 9:26,27.

    సొలొమోను ఏమంటున్నాడంటే, ‘నా జీవితము గాలి కొరకు ప్రయాసపడినట్లు ఉంది’. పౌలు ఏమంటున్నాడంటే, ‘నా జీవితము గాలిని కొట్టినట్లు లేదు. నేను క్రీస్తు యొద్దకు పరుగెడుతున్నాను’. ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు మీరు పరుగెడుతున్నప్పుడు ఏదీ వ్యర్థమైనది కాదు – ఏ రోజూ, ఏ పూటా, ఏ పనీ, ఏ మాటా వ్యర్థం కాదు. 

ప్రయాస: 

ప్రసంగి 2:18, ‘సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని’. నేను ఎంతో ప్రయాసపడి ఎన్నో పనులు చేశాను. కానీ ఏమి లాభము?  నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటి యందు అసహ్యపడితిని అని అంటున్నాడు. నా తరువాత ఏమిటి? అని దేవుడు లేని వ్యక్తి ఆందోళన చెందుతాడు. అయితే, క్రైస్తవుడు ఆ విధముగా అలోచించాడు. నాది వ్యర్థమైన ప్రయాస అనుకోడు. మన చేసే పనుల యొక్క ఫలితాలు మన చేతిలో ఉండవు. 1 కొరింథీ 3:6-7 వచనాలు చూద్దాము. ఇక్కడ పౌలు ఒక మాట అంటున్నాడు: 

6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే 7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని,నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

పౌలు నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేసింది దేవుడే. నాటు వానిలో ఏమీ లేదు, నీళ్లు పోసే వానిలో ఏమీ లేదు, వృద్ధి కలుగ జేసే దేవునిలోనే అంతా ఉంది. సొలొమోను ఆ కోణాన్ని చూడలేకపోయాడు. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని అంటున్నాడు. మనము ఆ విధముగా నిసృహ చెందము. మీరు దేవుని వాక్యాన్ని విత్తితే, ఆ వాక్యాన్ని ఫలింపజేయుటకు దేవుడు నీళ్లు పోసే వ్యక్తిని మీ తరువాత పంపిస్తాడు.

నిరాసక్తి: 

ప్రసంగి 1:9  మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు. ప్రసంగిలో నిరాశక్తి మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది.ప్రొద్దునే లేచాను, మళ్ళీ రాత్రి అయ్యే వరకు రోజూ అవే పనులు చేయాలి, ఒకే రొటీన్, ఒకే పనులు, క్రొత్తదనం లేదు అంటున్నాడు. గ్రీకు పురాణాల్లో మనకు సిసిఫస్ అనే రాజు కనిపిస్తాడు. అతడు ఒక శాపానికి గురవుతాడు. ఆయన ఒక రాయిని లోయలో నుండి కొండ మీద వరకు దొర్లించాలి. కష్టపడి ఆ రాయిని కొండ మీద వరకు దొర్లిస్తాడు. అప్పుడు ఆ రాయి తిరిగి లోయలోకి జారిపోతుంది.  సిసిఫస్ మళ్ళీ ఆ రాయిని లోయలో నుండి కొండమీదకు దొర్లించి పైకి ఎక్కిస్తాడు. మళ్ళీ రాయి లోయలోకి జారిపోతుంది. దానికి ఇక అంతము ఉండదు. అది ఒక మోనోటని. ఒక చక్రం వలె నిరంతరమూ నిరాసక్తితో తిరుగుతూ ఉండే జీవితము. అయితే క్రైస్తవ విశ్వాసి ఆ విధముగా జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి రోజూ నూతన కార్యములు మన జీవితములో చేస్తాడు. దేవుని సహవాసములో మనము గడిపితే మనకు నిరాసక్తి ఉండదు. కీర్తన 16:11 లో 

నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు

in Thy presence is fullness of joy

   దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి దేవుని సంతోషాన్ని పొందుతాడు. ఆసక్తితో జీవిస్తాడు. ‘ప్రతి రోజూ ఇదే గొడవ, నాకు బోర్ కొడుతోంది, సూర్యుని క్రింద క్రొత్తదేమీ లేదు’ అనడు. 

1 కొరింథీ 15:58 లో ఒక మంచి వాక్యం మనం చూస్తాము.

58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.1 కొరింథీ 15:58 

పౌలు ఏమంటున్నాడంటే, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థం కాదు. స్థిరముగా ఉండండి. సిసిఫస్ వలె మీరు లోయలో నుండి కొండ మీదకు, కొండ మీద నుండి లోయలోకి నిత్యమూ రాయి దొర్లించే వారి వలె జీవించాల్సిన అవసరము లేదు. క్రీస్తు నందు మీకు దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చాడు. దేవుని కార్యముల యందు మీరు ఎప్పటికీ ఆసక్తితో ఉండవచ్చు’ అంటున్నాడు. 

సమయం:నిత్యత్వం 

3 అధ్యాయము 1 వచనము: సమయము: ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు (ప్రసంగి 3:1) ప్రతి దానికి సమయము కలదు. ముఖ్యమైన సంఘటనల మీద మనకు నియంత్రణ లేదు. ఈ సత్యము ఈ సమయములో మనకు స్పష్టముగా అర్థమవుతున్నది. ఈ సంవత్సరము ఇలా ఉంటుంది అని మనం ఊహించామా? మన జీవన విధానం అల్లకల్లోలమైంది. 

కరోనా వైరస్ మన జీవితములో అన్నిటినీ ప్రభావితం చేస్తున్నది. ఒకాయన నా దగ్గరకు వచ్చాడు. ‘డాక్టర్, నాకు కరోనా వచ్చిందేమో. టెస్ట్ చేయండి’ అన్నాడు. సరే కూర్చో అని ఆయనను కూర్చో పెట్టి కరోనా టెస్ట్ చేసాను. రిసల్ట్ వచ్చినప్పుడు ఫోన్ చేసి చెబుతాలే, ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఆయన రోజంతా నాకు ఫోన్లు చేస్తున్నాడు. ‘డాక్టర్, నాకు పోజిటివా, నెగటివా. నాకు ఆందోళనగా ఉంది’. రిసల్ట్ వచ్చినప్పుడు నేను నీకు ఫోన్ చేసిచెబుతాను. మీరు రెస్ట్ తీసుకోండి’ అన్నాను. అయితే, ఆయనకు నెమ్మది లేదు. ‘ఆ కరోనా నీకు రాకపోవచ్చు. ఈ ఆందోళనతో నీ గుండె ఆగిపోయేటట్టు ఉంది. దేవుని యందు విశ్వాసముంచు, క్రీస్తు నందు విశ్రాంతి తీసుకో.’ అని ఆయనకు

 చెప్పాను. ప్రసంగి మనకు ఏమని చెబుతున్నాడంటే, 

1. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.

2. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,

3. చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;4. ఏడ్చుటకు 

నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు

5. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

4. ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;5. రాళ్లను 

పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు;

6. వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

7. చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8. ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

జీవితానికి అర్థం ఎలా వస్తుంది? 

1. ప్రతిదానికి సమయము కలదు. దేవుడు కాల చక్రములో మనలను బిగించాడు. మనం అనుకొంటాము. ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ కరోనా వలన నేను అనుకొన్న పనులు చేయలేక పోయాను. నా ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అంతా వేస్ట్. అయితే, ఏదీ వేస్ట్ కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి దానికీ సమయము కలదు. ఈ సంవత్సరం మన ప్రపంచం ఇలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఇది మానవ తప్పిదాల వలన కలిగింది అనుకొన్నప్పటికీ దేవుడు దానిని అనుమతించాడు. ఇది వేస్ట్ అని మనం అనుకోకూడదు. ఈ సమయములో కూడా దేవుడు మనకు తన పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. 

    ‘మీనింగ్ ఆఫ్ లైఫ్’ లో ‘సమయము’ నకు ప్రాధాన్యత ఉంది. ఈ సమయములో నేను నేర్చుకొనేది ఏమీ లేదు అని మనకు అనిపించవచ్చు. నేను ఒక సారి పోలాండ్ దేశములో ఔస్క్ విట్జ్ అనే ఒక కాన్సంట్రేషన్ క్యాంపు కు వెళ్ళాను. రెండో ప్రపంచ యుద్ధ సమయములో దానిని నాజీలు నిర్మించారు. అనేక మంది యూదులను అక్కడ బంధించారు. వందలాది మందిని చిన్న గదుల్లో కుక్కారు. వారికి సరైన ఆహారం పెట్టేవారు కాదు. వారి చేత వెట్టి చాకిరి చేయించేవారు. అక్కడ వారు పడిన బాధలు వర్ణనాతీతం. ఆ ప్రాంతములో నేను నడుస్తూ ఉన్నప్పుడు నాకు విక్టర్ ఫ్రాంకెల్ అనే సైకియాట్రిస్ట్ గుర్తుకు వచ్చాడు. ఆయన Man’s Search for Meaning అనే పుస్తకం వ్రాశాడు. ఆ కాన్సంట్రేషన్ క్యాంపు లో ఆయన కూడా బంధీగా జీవించాడు. ఆ బాధలు పడుతున్నప్పుడే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది: మనిషి జీవితానికి అర్థం ఉందా? నా జీవితానికి అర్థం ఉందా? 

      ఆ క్యాంపు నుండి బయటపడిన తరువాత విక్టర్ ఫ్రాంకెల్ ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే పుస్తకం వ్రాశాడు. ఆ పుస్తకం కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడుపోయింది.అది మనందరికీ వచ్చే ప్రశ్నే: నా జీవితానికి అర్థం ఉందా? ఒక కాన్సంట్రేషన్ క్యాంపు లో అర్థం ఏమి ఉంది? ఆ బాధలో కూడా అర్థం ఉంది అని విక్టర్ ఫ్రాంకెల్ అన్నాడు.ఒక యూదుడు మాత్రమే అలాంటి పుస్తకం వ్రాయగలడు. సిలువ మీద నజరేయుడైన యేసు మనకు కనిపిస్తున్నాడు. అటువంటి క్రూరమరణాన్ని పొందిన వ్యక్తి జీవితానికి అర్థం ఉందా? అటువంటి సిలువకు కూడా దేవుడు అర్థం ఇస్తాడు. ‘ప్రతిదానికి సమయము కలదు’. దేవుని సమయములో నజరేయుడైన క్రీస్తు సిలువ మీద ఉన్నాడు. దానికి అర్థం ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మీరు ఇంట్లో ఉండొచ్చు, పనిలో ఉండొచ్చు, హాస్పిటల్ లో ఉండొచ్చు, జైలులో ఉండొచ్చు, మరొక చోట ఉండొచ్చు.మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దేవునితో మీ సమయాన్ని గడిపితే దానికి అర్థం ఉంది.

మరణపు నీడ: 

ప్రసంగి లో మనకు కనిపించే మరొక అంశం మరణపు నీడ. 3 అధ్యాయములో ఒక మాట చూద్దాము.

19. నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియుఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.20. సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.21. నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును? ప్రసంగి 3:19-21 

ప్రతి ఒక్కరూ, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే కదా.ఇదంతా ఎందుకు? జంతువుల వలెనె మనుష్యులు కూడా చనిపోతున్నారు.అని వైరాగ్యముతో, విరక్తితో ప్రసంగి ఇక్కడ మాటలాడుచున్నాడు.   పాల్ కళానిధి “When Breath Becomes Air” అని ఒక పుస్తకం వ్రాశాడు. ఆయన ఒక న్యూరో సర్జన్. నేనొక న్యూరో సర్జన్ కావాలి అని ఎన్నో సంవత్సరాలు ఆయనకు మరొక విషయం గురించి పట్టించుకోలేదు. ఆయన న్యూరో సర్జన్ అయిన తరువాత, ‘ఇప్పుడు నేను నా లక్ష్యం సాధించాను.ఇక ఇప్పటి నుండి నా జీవితము ఎలా జీవించాలో తెలుసుకొంటాను’ అన్నాడు. అప్పుడు ఆయనకు ఒక దుర్వార్త అందింది. నీకు కాన్సర్ వ్యాధి వచ్చింది. ఇక నువ్వు బ్రతికేది కొన్ని నెలలు మాత్రమే’. ఆ వార్త విని ఆయన షాక్ తిన్నాడు. ఆ పుస్తకములో,‘నేనొక  న్యూరో సర్జన్ కావాలని ఇంత కాలం నా జీవితం ఎలా జీవించాలో కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు నా జీవితములో స్థిరపడినప్పుడు, జీవితం ఎలా జీవించాలి అని అనికాకుండా, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి? అని ప్రశ్నకు సమాధానము కోసం వెదుకుతున్నాను’ అన్నాడు. ప్రసంగి గ్రంథములో సొలొమోనుఆ ప్రశ్నే అడుగుతున్నాడు. నువ్వు ఎంతో సాధించావు, శ్రమించావు, ప్రయాస పడ్డావు? అయితే, మరణము ముందు నువ్వు సాధించినవి అన్నీ వ్యర్థం కావా?

      నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; అంటున్నాడు. తరువాత ప్రసంగి మనుష్యులను, జంతువులను పోలుస్తున్నాడు. “నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.”దేవుడు లేకపోతే మనిషి కి, జంతువులకు తేడా లేదు. డార్విన్ సిద్ధాంతములో మనిషికి, జంతువులకు తేడా లేదు. మనిషి కూడా ఒక జంతువే. అయితే బైబిల్ దానికి ఒప్పుకోదు. దేవుడు మనిషిని మాత్రమే తన స్వరూపములో, ప్రత్యేకముగా  సృష్టించాడు.జంతువు చనిపోతే అది అంతం అయిపోయినట్లే.అయితే మనిషి చనిపోతే అంతం అయిపోయినట్లు కాదు. మనిషి ఆత్మకు చావు లేదు.

“సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను”పైకి చూస్తే సూర్యుడు కనిపిస్తున్నాడు. క్రిందకు చూస్తే సమాధి కనిపిస్తున్నది. దేవుడు లేని వ్యక్తికి కనిపించేవి అవే: సూర్యుడు, సమాధి. క్రైస్తవ విశ్వాసి సూర్యుడుకి పైన కూడా చూడగలడు, సమాధికి అవతల కూడా చూడగలడు.నీకు జీవితము అర్థం లేకుండా కనిపిస్తుందా? నీకు జీవితము వ్యర్థముగా కనిపిస్తుందా? నీకు జీవితము గాలి కోసము ప్రయాస పడినట్లు కనిపిస్తుందా? సూర్యుడు వైపు కాదు, నీతి సూర్యుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు చూడు.  

   గ్రీకు రచయిత హోమర్ ‘ఒడిస్సి’ అనే పురాణము వ్రాశాడు. ఈ పురాణములో‘ఒడిస్సియస్’ అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన భార్య పెనలోపి. పెనలోపి వృద్ధాప్యములో ఉంది. ‘ఒడిస్సియస్’ ఒక గ్రీకు వీరుడు. ఆ సమయములో కలిపసో అనే దేవత అతని మీద కన్ను వేస్తుంది. కలిప్స్లో ‘ఒడిస్సియస్’ ని ఒక ద్వీపానికికిడ్నాప్ చేసి అతని అక్కడ 7 సంవత్సరాలు బంధిస్తుంది. అతనితో ఏమంటుందంటే,

 ‘ఓ మానవా, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ఉంచుకొంటాను, నేను నిన్ను పెళ్లి చేసుకొంటాను. నీ భార్యను మరచిపో. నేను దేవతను.నా దగ్గర ఉంటే నీకు మరణము ఉండదు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు’.ఒడిస్సియస్ అప్పుడు ఆలోచిస్తాడు. ఈ దేవత దగ్గర అందం, ఆరోగ్యం, సుఖం ఉన్నాయి. భూమి మీద ఉన్న తన భార్య పెనలోపి వృధాప్యములో ఉంది. ఒడిస్సియస్ కలిప్స్లో కోరికను తిరస్కరిస్తాడు.

 ‘నేను నీ సెక్స్ బానిసగా ఉండను. నా భార్య పెనలోపి దగ్గరకు తిరిగి వెళ్తాను’ అంటాడు.గ్రీకులు జీవితానికి అలాంటి కోణములో చూశారు.  ఆ కథ యొక్క భావమేటిటంటే, ప్రేమ లేక పొతే స్వర్గానికి కూడా అర్థం లేదు. మానవ జీవితములో బాధలు, కన్నీళ్లు, మరణం ఉండవచ్చు. అయితే, ప్రేమ ఉంటే వాటికి కూడా అర్థం ఉంది. లాజరు సమాధి దగ్గర యేసు ప్రభువు కన్నీరు పెట్టాడు. దేవుని దృష్టిలో లాజరు 

మరణానికి కూడా విలువ ఉంది. మరణాన్ని దేవుడు మానవ జీవితములో భాగముగా పెట్టాడు. మరణం కూడా మనకు విలువను ఇస్తుంది, మరణం కూడా మనకు అర్థం  ఇస్తుంది . ఈ లోకములో ప్రతి రోజూ మనలను మరణమునకు దగ్గరగా తీసుకు వెళ్తుంది. మరోకోణములో మన రక్షకుడైన యేసు క్రీస్తు ను మనం చూసే రోజును కూడా అది మనకు దగ్గరగా తీసుకువస్తున్నది. మరణము కూడా జీవిత పరమార్థములో భాగమే.

నిత్యత్వము

ఆ తరువాత అంశం నిత్యత్వం. 3:11 లో ఒక మాట చదువుదాము.

ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు ( ప్రసంగి 3:11). 

ప్రసంగి ఇక్కడ చాలా ముఖ్యమైన సత్యము మనకు బోధిస్తున్నాడు. దేవుడు ‘నిత్యత్వము’ ను మన హృదయములో ఉంచాడు. జంతువులకు, పక్షులకు, చెట్లకు నిత్యత్వము లేదు. అవి కొంతకాలము ఉండి చనిపోతాయి. వాటికి పునరుత్తానము లేదు. అయితే మనిషి అస్థిత్వము మరణముతో ముగిసేది కాదు. మన హృదయములోదేవుడు తన నిత్యత్వాన్ని ఉంచాడు. దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి అని మనిషి హృదయము ఆరాటపడుతూనే ఉంటుంది. గ్రీకు తత్వవేత్త ప్లేటో మనుష్యులను ఒక గుహలో చిక్కుకొన్న  పోల్చాడు. ఈ బందీలకు ఆ గుహలో ఉన్న చీకటి మాత్రమే కనిపిస్తుంది. వారి ముందు ఉన్న గోడ మీద కొన్ని వస్తువుల, వ్యక్తుల నీడమాత్రమే వారికి కనిపిస్తుంది. ఆ గుహలో చిక్కుకొన్న మనుష్యులకు బయట ఉన్న సూర్యుడు కనిపించుట లేదు. వారికి ఉన్న కొద్దిపాటి వెలుగు సూర్యుని నుండి వచ్చిందే. ఆ గుహలో నుండి బయటపడినప్పుడే వారు సూర్యుని చూడగలరు. జీవిత చక్రములో బంధించబడిన వారు నిత్యత్వాన్ని తెలుసుకోలేకపోవుతున్నారు. వారు బయటకు వచ్చి దేవుని వెలుగును చూడాలి. నీతి సూర్యుడు యేసు క్రీస్తును చూడాలి. అదే నిజమైన విడుదల.

     సెయింట్ అగస్టిన్ తన జీవిత చరిత్ర ‘Confessions’ ‘ఒప్పుకోలు’ లో ఒక మాట వ్రాశాడు.“You stir man to take pleasure in praising you (God), because you have made us for yourself, and our heart is restless until it rests in you” 

‘ఓ దేవా, నిన్ను స్తుతించుటలోనే మనిషికి సంతోషం ఉంది, ఎందుకంటే నీ కోసమే నీవు మనిషిని సృష్టించావు నీలో విశ్రాంతి తీసుకొనే వరకు మా హృదయాలకు విశ్రాంతి లేదు’

     సెయింట్ అగస్టీన్ చెప్పిన ఆ మాటలు మీరు గమనించండి.

ఓ దేవా, నిన్ను స్తుతించుటలోనేమనిషికి సంతోషం ఉంది, 

ఎందుకంటే నీ కోసమే నీవు మనిషిని సృష్టించావు 

నీలో విశ్రాంతి తీసుకొనే వరకు మా హృదయాలకు విశ్రాంతి లేదు.

  మానవ హృదయాన్ని దేవుడు ఆ విధముగా సృష్టించాడు. క్రీస్తును తెలుసుకొన్నప్పుడే మన హృదయానికి విశ్రాంతి కలుగుతుంది. ఫ్రాన్స్ దేశానికి గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త బ్లెయిస్ పాస్కల్ (1623-1662). ఆయన ఒక మాట అన్నాడు. మనహృదయములలో ‘దేవుని పోలిన శూన్యత’ ఉంది. God-shaped vacuum. 

There is a God shaped vacuum in the heart of every man

మన హృదయములలో ‘దేవుని పోలిన శూన్యత’ ఉంది. మన హృదయములో ఉండే ఆశూన్యతను, ఆ ఖాళీ ప్రదేశాన్ని దేవుడు నింపకపోతే మన హృదయానికి విశ్రాంతి ఉండదు. దేవునితో కాకుండా ఈ లోక సంభందమైన వాటితో మన హృదయాల్లో ఉన్నశూన్యతను నింపుకోవాలని చూస్తే మనకు నిరాశ తప్పదు. రష్యా దేశానికి చెందిన గొప్ప నవలా రచయిత ఫోయోడర్ డొస్తావిస్కీ (1821-1881). 1872 లో ఆయన ‘దెయ్యాలు’ అనే నవల వ్రాశాడు. రష్యా దేశములో ప్రజలు తమ హృదయములను దేవునితోకాకుండా ఈ లోక సంభందమైన ఆలోచనలతో నింపుకొంటున్నారు. రష్యా దేశములో ఆత్మ హత్యలు పెరిగి పోవడానికి అదే కారణము అన్నాడు. సాతానుడు, దెయ్యాలు ఈ రోజు మనుష్యుల హృదయాలను వ్యర్థమైన వాటితో నింపివేస్తున్నారు. అందుకనే అనేకమంది డిప్రెషన్ కు గురై ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి మనం చూస్తున్నాము. కొంత సేపటి క్రితం ఒకాయన నా దగ్గరకు వచ్చాడు. ‘డాక్టర్, నాకు సలహా ఇవ్వండి. మా అబ్బాయి డ్రగ్స్ కి బానిసయ్యాడు’. అనేకమంది తల్లిదండ్రులు ఇప్పుడు ఆ వేదన అనుభవిస్తున్నారు.సాతానుడు యువతీయువకుల హృదయాల్లో ఉన్న శూన్యతను డ్రగ్స్ తో నింపి, వారి జీవితాలు పాడుచేస్తున్నాడు. రవి జకరియస్ గారు ఒక మాట అంటూఉండేవాడు.

‘Pleasure without God, without the sacred boundaries, will actually leave you emptier than before’ 

‘దేవుడు లేకుండా నీ కోరికలు నీవుతీర్చుకొంటూ పోతే, పరిశుద్ధమైనహద్దులు లేకుండా నీవు జీవిస్తే, నీ హృదయములో శూన్యత పెరిగిపోతుంది కానీ తగ్గదు’ శాశ్వత కాలమును దేవుడు మనిషి హృదయములో పెట్టాడు. అశాశ్వతమైన వాటితో నింపుకొంటే మనిషి జీవితానికి అర్థం ఉండదు. 

ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక ఆమేన్‌   కీర్తన 41:33

ఆమేన్‌. శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు ఉండేది దేవుడు మాత్రమే. ప్రసంగి మనతో ఏమంటున్నాడంటే, దేవుడు తన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో ఉంచాడు. కమ్యూనిస్టులకు ఈ జ్ఞానము లేదు. లెనిన్, స్టాలిన్ దేవుడు లేని నాస్తికులు. వారు చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టలేదు. వారి మృతదేహాలను కెమికల్స్ లో నింపి ఈజిప్షియన్ మమ్మీ ల వలె చేసి అద్దాల సమాధి పెట్టెల్లో పెట్టారు. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది. మనం అలాంటి పనులు చెయ్యము. వారు మృతదేహాలను అద్దాల పెట్టెల్లో పెట్టుకొన్నారు. దేవుడు లేని ఆ కమ్యూనిస్టులకు శరీరమే శాశ్వతము. నిత్యత్వాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. నిత్యత్వం కోసం సిద్ధపడదాం, పాప క్షమాపణ పొందుదాం అని వారికి అనిపించదు.

   అమెరికా దేశములో ఫ్రాన్సిస్ కొల్లిన్స్ అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన మానవ జీన్స్ మీద గొప్ప పరిశోధనలు చేశాడు. ఇప్పుడు కరోనా కు వాక్సిన్ చేసే పనిలో ఉన్నాడు. ఆయన ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు: “ఒక రోజు నేను ఉదయం పూట కాస్కేడ్ పర్వతాల్లో నడుచుకొంటూ వెళ్తున్నాను. ఒక గొప్ప మార్పు నా హృదయములో కలిగింది. అక్కడే మోకరించి యేసు ప్రభువును స్వీకరించాను. ప్రభువా, ఈ రోజు నుండి శాశ్వత కాలము వరకు నిన్ను వెంబడిస్తాను’ అని ప్రార్ధన చేశాను. ఫ్రాన్సిస్ కొల్లిన్స్ లాంటి గొప్ప సైంటిస్ట్ కూడా తన హృదయములోని శూన్యతను నింపుకోలేడు. అతడు క్రీస్తు యొద్దకు రావాల్సిందే.

     ప్రసంగి గ్రంథములో నుండి జీవితానికి అర్థం అనే అంశం ఈ రోజు చూశాము. ప్రసంగి రెండు విషయాలు ఇక్కడ చెప్పాడు: మొదటిగా, ప్రతి దానికీ సమయము కలదు.రెండవదిగా, దేవుడు శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు అన్నాడు. ఒక ప్రక్క సమయములో మనం బంధించబడిఉన్నాము. మరొక ప్రక్క నిత్యత్వము వైపు ఈడ్వబడుతున్నాము.ఒక ప్రక్క అశాశ్వతమైనవి మన దృష్టిని  ఆకర్షిస్తున్నాయి. మరొక ప్రక్క, దేవుడు ఇచ్చిన శాశ్వత కాల జ్ఞానము మనలను నడిపిస్తున్నది.మన హృదయాల్లో ఉన్న శూన్యత నింపబడితేనే మన జీవితానికి అర్థం వస్తుంది. అది యేసు క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించి, ఆయన సిలువ యొద్ద మన పాపములను ఒప్పుకొని దేవునితో సంబంధం పెట్టుకోవటం వలన మనకు కలుగుతుంది.

అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ 

బైబిల్ లో ప్రసంగి గ్రంథము చాలా ఆసక్తికరమైన పుస్తకం. మనిషి జీవితానికి అర్థం ఉందా? అనే ప్రశ్న ను ఈ పుస్తకము అడుగుతుంది. జీవిత అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ ఈ పుస్తకములో మనం చూస్తాము. ఈ రోజు మన సందేశం అదే: ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ Man’s Search for Meaning 

ప్రసంగి 9 అధ్యాయములో నుండి కొన్ని మాటలు చూద్దాము.9 అధ్యాయము, 7-9 వచనాలు

7. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము; ఎల్లప్పుడు తెల్లని వస్త్రములుధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.  9. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయునీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము, ఈ బ్రదుకునందు నీవు కష్టపడి చేసికొనిన దాని యంతటికి అదే నీకు కలుగు భాగము.  

     ఈ లోక సంభందమైన తత్వవేత్తలు ఏమని చెబుతారంటే, మనిషి జీవితానికి అర్థం ఇచ్చేది సుఖ సంతోషాలే.బాగా ఎంజాయ్ చేయి, అందులోనే నీ జీవితానికి మీనింగ్ ఉంది అంటుంది. ఎపిక్ అఫ్ గిల్గమెష్ అని ఒక కావ్యము ఉంది. దాదాపు 4 వేల సంవత్సరాల క్రితం అది వ్రాయబడింది. ఇందులో ఎంకిడు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ ఎంకిడు జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచమంతా తిరుగుతాడు.ఈ కావ్యము లో ఒక చోట ఏమని ఉంటుందంటే, ‘గిల్గమెష్, నీ కడుపు నింపుకో. రాత్రి పగలు సంతోషముగా ఉండు. స్నానము చేయి, తలకు నూనె పెట్టుకో, మంచి బట్టలు వేసుకో అందులోనే ఆనందము పొందు’ 

    నీ సంతోషములోనే నీ జీవితానికి అర్థం ఉంది. ప్రపంచ చరిత్రలో ఎక్కువ మంది నమ్మిన ఫిలాసఫీ ఇదే. దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించాడు. అరణ్యములో వారిని నడిపించాడు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించలేదు, సణుగు కొన్నారు, గొణుగుకున్నారు. మేము ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండేది! ఈ అరణ్యములో ఏముంది? ఎంజాయిమెంట్ అంతా ఐగుప్తు లో ఉంది. ఈ అరణ్యములో ఏముంది ఇసుక తప్ప! అని వారు అనుకొన్నారు. ఐగుప్తు లో దేవుడు లేదు, ఇక్కడ మాకు దేవుడు ఉన్నాడు, మాకు ఆయన చాలు అని వారు అనుకోలేదు.

    దేవుని దృష్టిలో ప్రశస్తమైనవి మానవుడు వ్యర్ధమైనవిగా చూస్తున్నాడు, దేవుని దృష్టిలో వ్యర్ధమైనవాటిని మానవుడు ప్రశస్తమైనవిగా చూస్తున్నాడు. వేటిని దేవుడు ప్రశస్తమైనవిగా చూస్తున్నాడో వాటిని మనం ప్రశస్తమైనవిగా చూస్తామో, వేటిని దేవుడు వ్యర్ధమైనవాటిగా చూస్తున్నాడో వాటిని మనం వ్యర్ధమైనవిగా చూస్తామో అప్పుడు మన జీవితానికి అర్థం కలుగుతుంది.

    దానియేలు గ్రంథం 5 అధ్యాయములో బెల్షజరు రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆయన వెయ్యి మంది ప్రముఖులకు పెద్ద విందు చేశాడు. వారందరూ ద్రాక్షరసము త్రాగుచున్నారు. అప్పుడు బెల్షజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు: యెరూషలేములో దేవుని ఆలయములో ఉండవలసిన బంగారు పాత్రలు తీసుకురండి. వాటిలో ద్రాక్ష రసం పోసుకొని త్రాగుదాము. వారు దేవుని పాత్రలను అతని ముందు పెట్టారు. అప్పుడు వారు వాటిలో ద్రాక్ష రసం పోసుకొని త్రాగారు.అవి దేవునికి ప్రతిష్టించబడిన వస్తువులు, అవి దేవుని ఆలయములో ఉండాల్సిన వస్తువులు, అవి దేవుని సేవలో ఉండాల్సిన వస్తువులు. వాటిలో మద్యం పోసుకొని త్రాగుతున్నావు. అది ఎంత పెద్ద పాపం.

మీ శరీరం, మీ ఆత్మ, మీ జీవితం, మీ సమయం, మీ సంబంధాలు అవి దేవుడు మీకు ఇచ్చిన ప్రతిష్ఠిత వస్తువులు. వాటిలో ఈ లోక సంబంధమైనవి మనం పోస్తే మన జీవితానికి అర్థం ఉండదు. బెల్షజరు దేవుని పాత్రలలో ద్రాక్ష రసంపోసుకొని త్రాగుతున్నప్పుడు దేవుని తీర్పు అతని మీదకు వచ్చింది. దేవుని వ్రేలుఅతని నగరము గోడ మీద ఒక మాట వ్రాసింది.మేనె మేనె టేకేల్ ఉఫార్సిన్ 

నేను త్రాసులో నిన్ను తూచినప్పుడు, నువ్వు తక్కువగా కనిపించావు.ఈ రోజు దేవుని ప్రతిష్ఠిత వస్తువులను మనము పాడుచేస్తే, దేవుడు అదే మాట మనతో అంటున్నాడు: మేనె మేనె టేకేల్ నేను త్రాసులో నిన్ను తూచినప్పుడు, నువ్వు తక్కువగా కనిపించావు.     నేను నీకిచ్చిన ప్రతిష్ఠిత వస్తువులను నువ్వు పాడు చేస్తున్నావు. నీ జీవితం వ్యర్థమైపోతుంది, జాగ్రత్త! 

     బెల్షజరు రాజు చేసిన తప్పు అదే. దేవుని ప్రతిష్ఠిత వస్తువులు తీసుకు రండి. వాటిలో నేను తింటాను, వాటిలో నేను త్రాగుతాను. ఎంజాయ్ చేస్తాను అనుకొన్నాడు. మన జీవితానికి అర్థం ఎలా వస్తుంది? యేసు క్రీస్తు ఒక మానవుడిగా మన మధ్యపెరిగాడు. దేవుని ప్రతిష్ఠిత వస్తువులను ఆయన కాపాడాడు. దేవాలయములో వ్యాపారం చేస్తున్న వారి మీద ఆయన ఆగ్రహం వ్యక్తము చేసాడు. దేవుని ప్రతిష్ఠిత వస్తువులను వారు పాడు చేస్తున్నారు. అది ఆయనకు తీవ్రమైన ఆగ్రహం కలిగించింది. ఏ పని అయినప్పటికీ దానిని చేయక ముందు ఆయన దేవుని స్తుతించేవాడు, దేవుని మహిమపరచేవాడు, జీవితానికి అర్థం ఇచ్చేది అదే. ప్రతి దినము దేవుని వైపు చూడడం. అయితే సాతానుడు దానిని ససేమిరా ఇష్టపడడు.ప్రసంగి ఒక మాట అంటున్నాడు: 

మనుష్యుల ప్రయాసమంతయువారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు (6:7). 

   తిండి, పానీయములతో సంతృప్తి రాదు. సాతానుడు యేసు ప్రభువు అరణ్యములో ఉన్నప్పుడు ఆయనను శోధించాడు. మూడు శోధనలు ఆయన ముందు పెట్టాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, దేవాలయం శిఖరం మీద నుండి క్రిందకు దూకు, ఈ లోక రాజ్యాలన్నీ నీకిస్తాను. నాకు సాగిలపడు, నన్ను మ్రొక్కు, నన్ను ఆరాధించు అన్నాడు. 

    యేసు ప్రభువు ఎలా స్పందించాడు? అందులోనే క్రైస్తవ జీవిత తత్వము ఉంది. మానవుడు తన జీవితానికి అర్ధాన్ని ఎలా పొందగలడు అనే ప్రశ్నకు అక్కడ యేసు ప్రభువు సమాధానము చెబుతున్నాడు.యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును (మత్తయి 4:4)

    సొలొమోను ఏమంటున్నాడు?, ‘మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు’ అన్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ‘మనుష్యుల ప్రయాస పడాల్సింది నోటి కోసం కాదు, వారి కోరికల కోసం కాదు, దేవుని చిత్తం జరిగించుట కొరకు’. సాతాను మాట ఆయన వినలేదు. రొట్టెలు చేసుకొని తన కడుపు నింపుకోవటం కంటే, దేవుని చిత్తాన్ని చేయడం ఆయనకు ముఖ్యం. రెండో శోధనలో, సాతానుడు యేసు ప్రభువుకు ఒక మాట చెప్పాడు: ‘దేవాలయము మీద నుండి క్రిందకు దూకు. దేవదూతలు నిన్ను పెట్టుకొంటారు’ యేసు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడు? నీ దేవుని శోధించకూడదు’ 

    సాతానుడు చేసే పని అదే. నేను దూకుతాను, దేవుడు వచ్చి నన్ను పట్టుకోవాలి. నేను దేవుని వెంబడించను, దేవుడే నన్ను వెంబడించాలి అనే తత్వము అందులో మనకు కనిపిస్తున్నది. అలాంటి జీవితములో అర్థం ఉండదు. యేసు ప్రభువు జీవితములో అనేక సార్లు వ్యక్తులు ఆయనను బలవంతం చేశారు. ‘నువ్వు మాకు రాజు కావాలి’ అని ఆయనను బలవంతము చేశారు. ఆయన దానింకి ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన దేవుని వెంబడిస్తున్నాడు.పేతురు ఆయనతో, ‘సిలువ నీకు వద్దు’ అన్నాడు. ఆయన వెంటనే పేతురును గద్దించాడు. ‘సాతానా, నా వెనుకకు పో’ అన్నాడు. పేతురు దేవుని శోధిస్తున్నాడు. అది సాతాను పని. అయితే, యేసు ప్రభువుమనుష్యులను వెంబడించుట లేదు. ఆయన దేవుని వెంబడిస్తున్నాడు. అక్కడే ఆయన మానవ జీవితానికి అర్థం ఉంది. సాతాను మార్గములో సుఖం ఉంది. దేవుని మార్గములో సిలువ ఉంది. అయితే యేసు క్రీస్తు దేవుని మార్గములో ఉన్నసిలువనే కోరుకున్నాడు. అక్కడ మనం నేర్చుకొనవలసిన సత్యం ఏమిటంటే, ‘సాతాను మార్గములో నడిచి సుఖపడడం కన్నా, దేవుని మార్గములో నడిచి శ్రమ పొందడం మంచిది’. ఆయన సిలువను కోరుకున్నాడు. ఎందుకంటే అది దేవుని మార్గము. అందులో నజరేయుడైన యేసు జీవితానికి అర్థం కలిగింది. 

The most meaningful time in the life of Jesus was when he was suffering on the cross

     ‘యేసు క్రీస్తు జీవితములో అత్యంత అర్థవంతమైన సమయము ఆయన సిలువ మీద గడిపిన సమయమే’ సిలువ మీద మరణములో నజరేయుడైన యేసు తన జీవితానికి అర్థం పొందాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు, పాపముల నుండి మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి ఆయన సిలువ వేయబడాలి. సిలువ లేకుండా ఆయన జీవితానికి అర్థం లేదు. సిలువ మీద మరణించే ముందు ‘సమాప్తము’ అని కేక వేశాడు.

It is finished 

   ఆ కేకలో ఆయన పొందిన సంతృప్తి ఉంది.ఆ కేకలో ఆయన జీవితానికి అర్థం ఉంది.ఈ ప్రపంచానికి ఆ సత్యం అర్థం కాదు.మన ప్రపంచం ఏమనుకొంటుందంటే, ‘అయ్యో, పాపం సిలువ, బాడ్ ఎండింగ్, దానికి మీనింగ్ లేదు’. విక్టర్ ఫ్రాంకెల్ నాజీలు నిర్మించిన ఔస్క్ విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపు లో ఎంతో నరకయాతన అనుభవించాడు. ఆ అనుభూతులలో నుండే ‘Man’s Search for meaning’ ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే పుస్తకం వ్రాశాడు. యూరప్ లో, అమెరికా లో ఇప్పుడు యూథనాసియా అనే విధానము డాక్టర్లు మొదలుపెట్టారు. అంటే ఒక కాన్సర్ రోగి లేక మరొక తీవ్రమైన వ్యాధి వచ్చిన వ్యక్తి, ‘డాక్టర్, నాకు జీవించాలని లేదు. నేను చనిపోతాను.నాకు సహాయం చేయండి’ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఆ వ్యక్తికి  ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీస్తాడు. పెద్ద, పెద్ద జబ్బులే కాకుండా చిన్న, చిన్న జబ్బులు వచ్చిన వారు కూడా డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఇంజక్షన్ వేయించుకొని ప్రాణం తీసుకొంటున్నారు. వారు ఒక పెద్ద అబద్దాన్ని నమ్ముతున్నారు. ‘సుఖం ఉంటేనే జీవితానికి అర్థం, ఆరోగ్యం ఉంటేనే జీవితానికి అర్థం, సుఖం లేనప్పుడు చనిపోవటం మంచింది, ఆరోగ్యం లేనప్పుడు యూథనాసియా చేయించుకోవటం మంచిది’ అనుకొంటున్నారు. అయితే దేవుడుఏమంటున్నాడంటే, ‘నీ సుఖములోనే కాదు, నీ దుఃఖంలో కూడా నేను నీకు అర్థం ఇస్తాను, నీ ఆరోగ్యములోనే కాదు, నీ అనారోగ్యములో కూడా నేను నీకు అర్థం ఇస్తాను’. అందుకనే యూథనాసియా ని మనం వ్యతిరేకించాలి. 

   మా నాన్న యోహాను గారు కొన్ని సంవత్సరాలు కాన్సర్ తో బాధ పడ్డాడు.ఆ బాధకు కూడా దేవుడు అర్ధాన్ని ఇచ్చాడు. కరోనా ప్రపంచం మీదకు వచ్చి 10 నెలలు కావస్తుంది. దీనికి అర్థం లేదు అని కొంతమంది అనుకొంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా కరోనా వచ్చింది. ప్రపంచములో అతి శక్తి మంతుడైన వ్యక్తికి కూడా దేవుడు తన సందేశాన్ని పంపిస్తున్నాడు. వైట్ హౌస్ లో కూర్చుని కూడా దేవుని పాఠాలు నేర్చుకోవచ్చు.

హెబ్రీ 5:8 లో మనము చదువుతాము: ఆయన కుమారుడై యుండియు తాను పొందినశ్రమలవలన విధేయతను నేర్చుకొనెను

     యేసు  క్రీస్తు శ్రమలలో  విధేయతను నేర్చుకొన్నాడు. మనం  కూడా అంతే. మన  శ్రమలలో విధేయతను నేర్చుకోవాలి. ఈ శ్రమలకు అర్థం లేదు, నా జీవితానికి అర్థం లేదు అని మనము అనుకోకూడదు. సాతాను మార్గము అదికాదు. నువ్వు ముందు దూకు, దేవదూత నిన్ను పట్టుకొంటాడు అన్నాడు. యేసు ప్రభువు ఏమని సమాధానం చెప్పాడు? నీ దేవుని శోధించకూడదు. మన జీవితానికి అర్థం ఉండాలంటే మనం దేవుని శోధించకూడదు. అంటే, దేవా, నన్ను వెంబడించు అని మనము దేవుని అడుగకూడదు. నేను దూకుతాను, దేవ దూతను పంపి నన్ను కాపాడు అనే తత్వముతో జీవిస్తే మన  జీవితానికి అర్థం ఉండదు. మూడో శోధనలో సాతాను యేసు ప్రభువుతో ఒక మాట అన్నాడు: ‘నువ్వు నాకు మ్రొక్కు, నేను నీకు ఈ లోకం మొత్తాన్ని ఇస్తాను’ సాతాను హృదయము ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థం అవుతున్నది. దేవుడే నాకు మ్రొక్కాలి అని సాతానుడు అనుకొంటున్నాడు. 

    ‘ఈ లోక అందాలు చూడు, ఇవన్నీ నీకు ఇస్తాను, నీవు నన్ను ఆరాధించు’ అన్నాడు. సాతాను ప్రసంగి ముందు అనేక శోధనలు పెట్టాడు. సొలొమోను సాతాను పెట్టిన శోధనలు తట్టుకోలేకపోయాడు. తన ఐశ్వర్యములో, రాజరికములో, జ్ఞానములోసంతృప్తిని వెదుకున్నాడు. 2:10 లో సొలొమోను ఏమంటున్నాడంటే,  నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. 

               ప్రసంగి 2:10 

    నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరముచేయలేదు. గొప్ప భవనాలు కట్టుకున్నాడు, అయినప్పటికీ ఆయనకు సంతృప్తి లేదు.300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు. అయినప్పటికీ ఆయన కన్నులకు సంతృప్తి లేదు. గొప్ప దేవాలయము కట్టాడు. కానీ ఆయనకు సంతృప్తి లేదు.విగ్రహారాధన కూడా మొదలు పెట్టాడు. ‘నా హృదయము నా పనులన్నిటినిబట్టిసంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు’. సొలొమోను ఫిలాసఫీ ఏమిటంటే, ‘నా హృదయం సంతోషముగా ఉండాలి,అది ఏమి అడిగితే నేను దానిని ఇస్తాను’. ఆ ఫిలాసఫీ చివరకు అతని జీవితాన్ని ఖాళీ చేసింది. అతనికి అసంతృప్తిని, నిరాశను, నిరాసక్తతను మిగిల్చింది. 

ఈ రోజు మన సమాజము కూడా అదే ఫిలాసఫీ ని అలవరచుకొంది. నా కన్నులు ఆశించినవి నేను పొందాలి, నా హృదయము కోరుకొన్నది నాకు కావాలి. అవసరమైతే నేను సాతానుకు సాగిలపడతాను.యేసు ప్రభువు సొలొమోను ఫిలాసఫీ ని పాటించలేదు.సాతానుడు ఈ ప్రపంచ అందాలు ఆయనకు చూపించాడు.ఆ సమయములో యేసు క్రీస్తు తన కన్నులను నియంత్రించుకొన్నాడు, తన హృదయాన్ని నిర్బందించుకొన్నాడు.

    ‘అవన్నీ నాకు వద్దు, దేవుని చిత్తాన్ని చేయడం నాకు ముఖ్యం, దేవుని వాక్యాన్ని పాటించడం నాకు ముఖ్యం.సాతానుడు మనతో ఏమంటాడంటే, మీరు నాకు మ్రొక్కండి, మీకు చాలా వస్తువులు నేను ఇస్తాను’ యేసు ప్రభువు మనతో ఏమంటున్నాడంటే, మీరు మ్రొక్కాల్సింది దేవుని మాత్రమే, మీరు ఆరాధించాల్సింది దేవుని మాత్రమే. అందులోనే మీ జీవితానికి అర్థం ఉంది. నిజమైన ఆరాధన చేసినప్పుడే మన  జీవితానికి అర్ధం వస్తుంది. సాతానుని ఆరాధించే వారి జీవితానికి అర్థం లేదు. ఆరాధన  చేసే వ్యక్తి దేవునితో సంభంధం కలిగిఉన్నాడు. 

ఆ కొండ మీద 3 శోధనల్లో 3 పాఠాలు ఉన్నాయి. 

1.దేవుని వాక్యాన్ని హత్తుకో 

2. దేవుని వెంబడించు 

3.దేవుని ఆరాధించు 

జీవితానికి అర్థం వాటిల్లోనే ఉంది. 

   అల్కహాలిక్ అనానిమస్ అని ఒక సంస్థ వుంది . మద్యపానానికి బానిసలైన వారికి ఆ సంస్థ చికిత్స చేస్తున్నది. ఆ చికిత్స లో వారు ఏమని చెబుతారంటే, నీకు మద్య పానము మీద విజయము కావాలంటే ముందు నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈ మధ్యలో   అల్కహాలిక్ అనానిమస్ కి వెళ్లిన  10,565 మంది మీద ఒక స్టడీ చేశారు.వారు ఏమని చెప్పారంటే, దేవునితో సంబంధం మద్య పానం నుండి మాకు విడుదల ఇచ్చింది. జీవితములో ఉండే శూన్యాన్ని మద్యముతో మనము నింపుకోలేము. చివరిగా 12 అధ్యాయములో ప్రసంగి ఎలా ముగిస్తున్నాడో చూద్దాము: 

నీ సృష్టికర్తను గుర్తుపెట్టుకో 12:1-7

1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాతమేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.3. ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు, కిటికీలలోగుండ చూచువారు కాన లేకయుందురు.4. తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్టయొక్క కూతకు ఒకడు లేచును; సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు.5. ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసర కాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రలా పించువారు వీధులలో తిరుగుదురు6. వెండి త్రాడు విడి పోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయొద్ద కుండ పగిలిపోవును, బావియొద్ద చక్రము పడిపోవును.7. మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకుమరల పోవును. 

   ఈ వచనాల్లో వృధాప్యము లో మన శరీరములో కలిగే మార్పులను గురించి ప్రసంగి మాట్లాడుతున్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఎంతో గొప్ప గాయకుడు. ఎప్పుడు చూసినా ఆయన మోహములో సంతోషం కనిపించేది. ఆయన జీవితాన్ని ఎంతో ప్రేమించాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఏమన్నాడంటే, ‘జీవితమంటే నాకెంతో ఇష్టం. ఒక వేళ భగవంతుడు కనుక వరమిస్తే ఎంతకాలమైనా జీవించాలనే కోరుకొంటాను’ జీవితాన్ని అంతగా ఇష్టపడ్డాడు. అయితే కరోనా వైరస్, వృద్ధాప్యం ఆయన ఆశల మీద నీళ్లు చల్లినాయి. సిద్ధార్థుడు తన ప్యాలస్ బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక వృద్ధుడు పడుతున్న బాధలు చూశాడు. ఎంతో ఆవేదన చెందాడు. గౌతమ బుద్ధుడు గా మారాడు. చాలా మంది తత్వవేత్తలు వృద్ధాప్యము గురించి మాట్లాడారు. 

ఆ వృధాప్యం గురించే ఇక్కడ ప్రసంగి మనతో చెబుతున్నాడు. 3. ఆ దినమున ఇంటి కావలివారు వణకు దురు: అంటే మన చేతులు వణకుతాయి  బలిష్ఠులు వంగుదురు: మన వెన్నెముక, కాళ్ళు, భుజాలు ఒంగుతాయి విసరువారు కొద్దిమంది యగుటచేత పని చాలించుకొందురు: విసరు వారు అంటే మన పళ్ళు; పళ్ళు ఊడిపోతాయి కిటికీలలోగుండ చూచువారు కానలేకయుందురు: మన కంటిచూపు తగ్గిపోతుంది తిరుగటిరాళ్ల ధ్వని తగ్గిపోవును: మన వినికిడి శక్తి తగ్గిపోతుంది వీధి తలుపులు మూయబడును: మాటలాడే శక్తి తగ్గిపోతుంది  పిట్టయొక్క కూతకు ఒకడు లేచును: సరిగ్గా నిద్ర పట్టదు, పిట్ట కూతకే మెలకువ వస్తుంది, ఇంకాసేపు నిద్ర పొతే బాగుంటుంది అనుకొంటాము కానీ నిద్ర పట్టదు సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్చబ్దముగా ఉంచబడుదురు: పాటలు పాడాలి, వినాలి అనిపించదు, నిశ్చబ్దముగా ఉండాలని కోరుకొంటాము ఎత్తు చోటులకు భయపడుదురు. మార్గములయందు భయంకరమైనవి కనబడును: ఎత్తైన ప్రదేశాలకు వెళ్లము; దూర ప్రయాణాలు అంటే భయపడతాము  బాదము వృక్షము పువ్వులు పూయును: జుట్టంతా బాదము పువ్వు వలె తెల్లబడిపోతుంది మిడుత బరువుగా ఉండును: చిన్న, చిన్న వస్తువులు కూడా బరువుగా ఉంటాయి బుడ్డబుడుసర కాయ పగులును;త్రాడు తెగింది; గిన్నె పగిలిందికుండ బద్దలయ్యింది చక్రము ఆగిపోయింది మరణము వచ్చింది 

మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును

ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపట్టునకు పోవుచున్నాడు: 

నిత్యమైన ఉనికి : His Long Home 

     నిత్యత్వానికి ఆ వ్యక్తి వెళ్లుచున్నాడు జీవితానికి అర్థము కావాలంటే నిత్యత్వము గురించి ఆలోచించు ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునుజీవితానికి అర్థము కావాలంటే నీ ఆత్మ ఒక రోజు దేవుని యొద్దకు తిరిగి వెళ్తుంది అని గుర్తు పెట్టుకో. నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుముజీవితానికి అర్థం కావాలంటే నీ బాల్య దినములయందే దేవుని యొద్దకు రా 

నీ బాల్యదినముల యందే యేసు క్రీస్తు దగ్గరకు రా. నీ శరీరములో బలము ఉండినప్పుడే దేవుని యొద్దకు రా, దేవుని మాటలు విను, దేవుని పని చేయి. దాని వలన నీ జీవితానికి అర్ధం వస్తుంది. 

     రోమ్ నగరములో మేమార్టిన్ జైలు కు నేను ఒకసారి వెళ్ళాను. అక్కడ అపోస్తలుడైన పౌలు చివరిగా గడిపిన జైలు గది ఉంది. అక్కడ కూర్చుని ఆయన తిమోతి పత్రిక వ్రాశాడు.‘మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని’ పౌలు యేసు క్రీస్తును హత్తుకొని వెంబడించాడు. క్రీస్తులో జీవితానికి అర్థం తెలుసుకొన్నాడు.

     ఇప్పుడు ముగింపులో ఒక వృద్ధ ఖైదీ గా రోమ్ లో ఉన్నాడు. ‘మంచి పోరాటం పోరాడితిని, I have nothing to regret అంటున్నాడు.ప్రసంగి గ్రంథము లో నుండి ఈ రోజు ‘అర్థం కోసం మనిషి చేసే అన్వేషణ’ అనే అంశం మనం చూశాము. సొలొమోను అనేక కోణాల నుండి ఆ అంశాన్ని పరిశీలించాడు. చివరకు ఏమన్నాడు? నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము

మన సృష్టికర్త ఐన యేసు క్రీస్తు దగ్గరకు మనం రావాలి, మన పాపములు ఒప్పుకొని, మారు మనస్సు పొంది రక్షణ పొందాలి. ఆయన సహవాసాన్ని పొందాలి, ఆయననుఆరాధించాలి. అదే మన జీవితానికి అర్ధాన్ని ఇస్తుంది.

ముఖ్య వ్యక్తులు: సొలొమోను, దేవుడు  

గ్రంథ విభజన: 

జీవన ప్రయాణము నిరాసక్తితో గడుస్తుంది 1:1-11

సమస్త జ్ఞానాభ్యాసము వ్యర్థమైనదే 1:12-18 

ఐశ్వర్యము వలన సంతృప్తి రాదు 2:1-11 

మరణము తథ్యం 2:12-23

నీ జీవితాన్ని ఆనందముతో గడుపు 2:24 

మన జీవన ప్రయాణాన్ని మనము పరీక్షించుకోవాలి 3:1-22

మన చుట్టూ జరిగే అన్యాయాలు 4:1-16 

ధన సమృద్ధి వలన సంతృప్తి రాదు 5:1-20

ఆహారం, పానీయములతో సంతృప్తి రాదు 6:1-12 

జ్ఞానము వలన కలిగే ప్రయోజనాలు 7:1-29 

కీడును ఎలా ఎదుర్కోవాలి? 8:1-17

మరణము తథ్యం 9:1-10

నీ శక్తిలోపము లేకుండ పనిచేయి 9:11-18 

అతిశయము వలన కలిగే అనర్ధాలు 10:1-20

ముగింపు

విశ్వాసముతో జీవించు 11:1-10 

నీ సృష్టికర్తను గుర్తుపెట్టుకో 12:1-7

తీర్పు దినము కోసము సిద్ధపడు 12:8-14 

ముఖ్య ప్రవచనాలు: 

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:  “సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి”  (1:14). అయితే, నీతి సూర్యుడు ప్రభువైన యేసు క్రీస్తు క్రింద మనము చేసే పనులు గాలికై ప్రయాసపడినట్టు కాదు. ఆయన కోసము మీరు చేసే ప్రతి పనిలో ఆనందం ఉంటుంది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.(కీర్తన 118:24) 

 ఇహలోక సంభందమైనవి సాతానుడు ప్రభువైన యేసు క్రీస్తుకు వాగ్దానం చేశాడు (మత్తయి 4). అయితే, క్రీస్తు వాటిని తిరస్కరించి దేవుని ప్రణాలికను హత్తుకున్నాడు. సాతానుడు ఇస్తానన్న వాటిల్లో సుఖభోగాలు ఉన్నాయి. దేవుని ప్రణాళికలో సిలువ ఉంది. అయినప్పటికీ, యేసు క్రీస్తు దేవుని సిలువనే కోరుకున్నాడు. దేవుడు తన జీవితమునకు ఉద్దేశించిన గొప్ప రక్షణ కార్యమును ముగించి, సిలువ మీద ‘సమాప్తము’ అని సంతృప్తితో కేక వేసి ప్రాణము విడిచాడు. ఎన్ని కష్టాలున్నా దేవుని చిత్తాన్ని చేయడములోనే జీవితానికి నిజమైన మీనింగ్, పరమార్థము కలుగుతాయని సిలువ దగ్గర మనకు బోధపడుతున్నది.

మనం నేర్చుకోవలసిన పాఠాలు: 

  1. సొలొమోను సంతృప్తి కోసం, గుర్తింపు కోసము ఇహలోక సంభందమైన వాటి వైపు పరుగెడుతూ తన జీవితములో చాలా సమయము వృథా చేశాడు. అలా కాకుండా, క్రీస్తు వలె ప్రతి దినం దేవుని చిత్తాన్ని జరిగించుచూ, దేవుని సన్నిధిలో దొరికే సంతృప్తి, సంతోషము, సహవాసములలో గడుపుట మన జీవితమునకు ఆశీర్వాదకరము.
  2. దేవుని తీర్పు దినము ముందు ఉన్నదని సొలొమోను హెచ్చరించాడు (12:14). ఆ రోజు రాక ముందే మనము ప్రభువైన యేసు యొద్దకు వచ్చి రక్షణ పొందాలి, ఇతరులకు సువార్త చెప్పాలి. ఒక వాక్సిన్ శక్తి ఎంత అని ఆ వాక్సిన్ సృష్టించిన సైంటిస్ట్ ని మనము అడుగుతాము. ఆ సైంటిస్ట్ మన వైపు చూసి, ‘ఈ వైరస్ నుండి నీ చావో, బ్రతుకో ఈ వాక్సిన్ నిర్ణయిస్తుంది’ అని చెబితే మనము ఆ వాక్సిన్ గురించి సీరియస్ గా ఆలోచించాలి. సిలువ యొక్క శక్తి ఎంత? అని మనం దేవుని అడిగితే, దేవుడు ఏమంటున్నాడు? ‘నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావో ఈ సిలువ నిర్ణయిస్తుంది. నీవు పరలోకానికి వెళ్తావో, నరకానికి వెళ్తావో సిలువ నిర్ణయిస్తుంది’. అందుకనే మనము సిలువ విషయములో ఎంత మాత్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకూడదు. వెంటనే యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి రక్షణ పొందాలి.

One thought

  1. దేవునికి స్తోత్రము. మంచి వివరణలతో వ్రాసినారు. వందనాలు 🙏 అన్న

Leave a Reply