
నా సోదరుడు జాన్ కట్టుపల్లి ఈ మధ్యలో నూతన గృహ ప్రవేశం చేశాడు. దేవుడు అతనిని, అతని కుటుంబాన్ని వారి క్రొత్త ఇంటిలో దీవించాలని మా ప్రార్ధన. వారి ఇంటిలో జరిగిన మీటింగ్ లో క్రైస్తవ గృహం ఎలా ఉండాలి? అనే అంశం మేము ధ్యానించాము. నేటి కార్యక్రమములో క్రైస్తవ ఇల్లు ఎలా ఉండాలి? అనే అంశం మనం చూద్దాము.
నేటి ప్రేమ సందేశం లో క్రైస్తవ ఇల్లు ఎలా ఉండాలి? అనే అంశం మీతో పంచుకోవాలని నేను ఆశ పడుతున్నాను. Christian Home: How should it be? మానవ సమాజాన్ని దేవుడు కుటుంబములుగా నెలకొల్పాడు. ఫ్యామిలీ లుగా ఏర్పరచాడు. ఒకొక్క ఇంటిలో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ ల సముదాయమే సమాజం. ఈ కరోనా సమయములో ‘హాస్పిటల్’ లో ఉండాలంటే ఎవరూ ఇష్టపడరు. విజిటర్స్ లేకుండా ఒక రూమ్ లో మనమే ఒంటరిగా ఉండాలి. ఒక వ్యక్తి హాస్పిటల్ కి ఫోన్ చేసాడంట. నర్స్ ఫోన్ తీసుకొంది. ‘హలో, రూమ్ నెంబర్ 238 లో ఒక పేషెంట్ వున్నాడు. అతని పేరు రామ్ లాల్. అతని కండిషన్ ఎలా ఉంది సిస్టర్?’
నర్స్ చెప్పింది: ‘రామ్ లాల్ కండిషన్ చాలా బాగుంది. అతని బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది. బ్లడ్ ప్రెషర్ బాగుంది. ఇంకో రెండు రోజుల్లో అతని డిశ్చార్జ్ చేస్తాము’ ఆ వ్యక్తి, ‘సిస్టర్, చాలా మంచి న్యూస్ చెప్పారు, థాంక్యూ’ అన్నాడంట.
దానికి ఆ సిస్టర్, ‘మీరు రామ్ లాల్ ఫ్యామిలీ మెంబర్ లేక క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటారు. అవునా?’ అని అడిగింది. ఆ వ్యక్తి, ‘లేదు సిస్టర్, నేనే రామ్ లాల్ ని. నన్ను తెచ్చి ఈ రూమ్ లో పడేశారు. నా కండిషన్ ఎలా ఉందో ఎవరూ నాకు చెప్పరు. తెలుసుకొందామని మీకు ఫోన్ చేశాను’ అన్నాడంట.
ప్రస్తుతం చాలా హాస్పిటల్ లలో అలాంటి పరిస్థితి ఉంది. మన కండిషన్ ఎలా ఉందో మనకు చెప్పే వారు కూడా ఉండరు. మన ఇంట్లో నే ఉండాలని మనం కోరుకొంటాము.
క్రైస్తవ ఇల్లు – దాని గురించి 7 సత్యాలు ఈ రోజు మనం చూద్దాము.
మొదటిగా,
A Place of Reliance: అది ఆధారపడే స్థలము – సొలొమోను కట్టిన ఇల్లు: ఆధార పడే ఇల్లు
127 కీర్తన లో సొలొమోను ఒక మాట అంటున్నాడు: యెహోవా ఇల్లు కట్టించనియెడల
దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
127 కీర్తన:1
యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సొలొమోను జ్ఞాని ఈ మాటలు అంటున్నాడు: ఇల్లు కట్టే మీరు, మీ ప్రయాస సఫలం కావాలంటే, దేవుడు మీ ఇంటిని కట్టాలి.
హెబ్రీ 3:3 లో మనం చదువుతాము.
ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.
హెబ్రీ 3:3
ప్రతి ఇల్లు ఎవరో ఒకరు కట్టాలి. సమస్తమును కట్టిన వాడు దేవుడే. దేవుడు కట్టే ఇల్లు: ఆ ఆలోచన బాగానే వుంది. దానిని ఎలా కట్టగలను అని మీరు ప్రశ్నించవచ్చు. మత్తయి సువార్త 7 అధ్యాయము లో ఆ ప్రశ్నకు సమాధానం ఉంది. అక్కడ యేసు ప్రభువు ఏమంటాడంటే,
24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
మత్తయి సువార్త 7
రెండు ఇళ్లను గురించి చెప్పాడు. ఒక ఇల్లు బండ మీద పునాది వేయబడింది. మరొక ఇల్లు ఇసుక మీద వేయబడింది. వాన కురిసింది, వరద వచ్చింది, గాలి తుఫాను విసిరింది. బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. మీ ఇల్లు బలముగా ఉండాలంటే, మీరు ప్రభువైన యేసు క్రీస్తు మాట చొప్పున, దేవుని వాక్యం ప్రకారం దానిని నిర్మించాలి. సొలొమోను జ్ఞాని దేవుని మీద ఆధారపడే ఇల్లు గురించి మనకు చెప్పు తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
రెండవదిగా,
A House of Resolution: అది ప్రతిజ్ఞ చేసిన ఇల్లు
యెహోషువ ఇల్లు ఎలా ఉందో చూద్దాము. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వములో కనాను దేశమును జయించారు. ఆ దేశములో వారు ఇల్లు నిర్మించుకున్నారు. వారి చుట్టూ ఉన్న అన్య జనుల ప్రభావం వారి మీద తీవ్రముగా ఉంది. యెహోషువ ఇశ్రాయేలీయులతో ఒక మాట అన్నాడు: మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము
యెహోషువ 24:15
ఆ రోజు యెహోషువ ఒక ప్రతిజ్ఞ చేశాడు. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. యెహోషువ ఇల్లు దేవునికి ప్రతిష్ఠం చేయబడింది. చాలా మంది విగ్రహముల వైపుకు వెళ్ళిపోయినా అతని ఇల్లు దేవుని కోసం నిలబడింది. ఈ రోజు అనేక విగ్రహాలు మన ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. మా ఇంట్లో ఎలాంటి విగ్రహాలు లేవు అని మనం అనవచ్చు. ఈ విగ్రహాలు కంటికి కనిపించేవి కాదు.
ఇటీవల ఒక సినీ నటి తన భర్త నుండి విడాకులు తీసుకోవడం పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె క్రైస్తవ కుటుంబములో జన్మించింది. అయితే సినిమా పరిశ్రమకు ఆకర్షించబడింది. అది ఒక పెద్ద విగ్రహం. నాకు మంచి స్వరం ఉంది, సినిమా పాటలు పాడుతాను, నాకు మంచి కవిత్వం వుంది, సినిమా పాటలు వ్రాస్తాను నాకు అందం ఉంది, ఒక హీరోను అవుతాను, ఒక హీరోయిన్ అవుతాను, నాకు సంగీతం వచ్చు, టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను’ అనేక మంది క్రైస్తవులు ఈ రోజు ఇహలోక సంబంధమైన విగ్రహముల వైపు వెళ్లిపోతున్నారు.ఈ లోకం దృష్టిలో మీరు హీరోలు కావచ్చు. కానీ దేవుని దృష్టిలో జీరోలు గా మిగిలి పోతారు.
‘నాకు ప్రమోషన్ రావాలంటే నేను క్రైస్తవుని’ అని ఎవరికీ తెలియకూడదు’ ఆ వుద్యోగం, ఆ ప్రమోషన్ విగ్రహాలు గా మారిపోయినాయి. కుటుంబం దేవుడు పెట్టిన వ్యవస్థలలో ముఖ్యమైనది. ఆ క్రైస్తవ కుటుంబాన్ని కాపాడాలంటే, యెహోషువ వలె మనం ప్రతిజ్ఞ చేయాలి: మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము. యెహోషువ 24:15
3. A House of Reflection: అది ప్రతిబంబించే ఇల్లు
మూడవదిగా, అబ్రహాము కట్టిన ఇల్లు: అది ప్రతిబంబించే ఇల్లు హెబ్రీ 11:9-10 చూద్దాము.
9 విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలోనివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
హెబ్రీ 11:9-10
వాగ్దాన దేశములో అబ్రహాము నివసించాడు. ఆయన గుడారములలో నివసించాడు. ఎందుకంటే ఆయన నిరీక్షణ దేవుడు నిర్మించే ఇంటి మీద ఉంది. 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలీయులు గుడారములలో నివసించారు. వారి చూపు వాగ్దాన దేశము మీద ఉంది. మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అయితే అవి తాత్కాలికమైనవే, బలహీనమైనవే. అది ఎప్పటికైనా శిథిలం అయిపోయేదే. దేవుడు నిర్మించే నివాసం అలాంటిది కాదు. అపోస్తలుడైన పౌలు వ్రాశాడు.
భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. 2 కొరింథీ 5:1
మనం కట్టే ఇల్లు నిత్యమైనది కాదు. దేవుడు కట్టే ఇల్లు నిత్యమైనది. రష్యా దేశములో చర్చి భవనాలను మనం గమనిస్తే వారి మీద ఉల్లిపాయ రూపములో ఉండే బంగారు కప్పులు మనకు కనిపిస్తాయి. పూర్వం రష్యన్ ప్రజలు గుడారాల్లో నివసించేవారు. మనం భూమి మీద యాత్రికులం అనే ఆలోచనను అవి ప్రతిబింబిస్తాయి. వాటి యొక్క బంగారు రంగు పరలోకానికి చిహ్నముగా ఉంది. అబ్రహాము గుడారం పరలోకాన్ని ప్రతిబింబించింది, ఎందుకంటే ఆయన కోసం దేవుడు నిర్మిస్తున్న పరలోకపు ఇంటిని అది ఆయనకు గుర్తు చేసింది.
4. A House of Relationships: అది సంబంధాలు ఉండే ఇల్లు, యేసు క్రీస్తు ఇల్లు: అది సంబంధాలు ఉండే ఇల్లు
యోహాను సువార్త 14:2 లో
ప్రభువైన యేసు క్రీస్తు ఒక మాట అన్నాడు: నా తండ్రి యింట అనేక నివాసములు కలవు
యోహాను సువార్త 14:2
యేసు ప్రభువుకు కూడా ఒక ఇల్లు ఉంది. భూమి మీద ఆయనకు స్వంత ఇల్లు లేదు. తల వాల్చుటకు కూడా స్థలము లేని ఒక యాత్రికుని వలె ఆయన ఈ లోకములో జీవించాడు. ఆయనకు పరలోక సంబంధమైన ఇల్లు ఉంది. అది ఎంతో గొప్ప ఇల్లు.
నా తండ్రి యింట అనేక నివాసములు కలవు
In my Father’s house అది నా తండ్రి ఇల్లు
తండ్రి అయిన దేవునితో ఆయనకు ఉన్న అపురూపమైన సంబంధం మనకు అక్కడ కనిపిస్తుంది. మనం పెరిగిన ఇల్లు గుర్తుకు వస్తే మనకు అందులో మనం ఇతరులతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మన తాతలు, తాతమ్మలు, తల్లి దండ్రులు, అన్న దమ్ములు, అక్క చెల్లెల్లు, బంధువులు, స్నేహితులు వారితో మన సంబంధాలను ఆ జ్ఞాపకాలు గుర్తుకు తెస్తాయి.
మా నాన్న కట్టుపల్లి యోహాను గారు ఒక మాట అంటూ ఉండేవాడు. ప్రార్ధన చేసే కుటుంబము ఐక్యతతో ఉంటుంది. a family that prays together stays together తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు.
మత్తయి 12:25
ఐకమత్యం లేని ఇల్లు నిలబడదు. దేవుడు ఆశించే ఇంటిలో, దేవుడు సంతోషించే ఇంటిలో ఐకమత్యం ఉంటుంది. ఎందుకంటే అది మంచి సంబంధములతో నిండి ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని యేసు ప్రభువు ఆశించిన పరలోకపు ఇంటికి అది ఛాయ వలె ఉంటుంది.
ఐదవదిగా అది సమకూర్చే ఇల్లు
5. A House of Restoration: అది సమకూర్చే ఇల్లు
తప్పి పోయిన కుమారుని తండ్రి ఇల్లు: అది సమకూర్చే ఇల్లు
లూకా సువార్త 15 అధ్యాయములో ఒక తండ్రి మనకు కనిపిస్తాడు. ఆయనకు ఇద్దరు కుమారులు వుంటారు. చిన్న కుమారుడు తన తండ్రి ఆస్తిలో తన భాగం తీసుకొని దూర దేశానికి వెళ్తాడు. అక్కడ తన దుర్వ్య సనముల మీద తన ఆస్తి మొత్తం ఖర్చు చేస్తాడు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి అతనికి వస్తుంది. ఆకలితో అలమటిస్తూ పందుల తినే పొట్టు కోసం అతను పాకులాడుతాడు. అందరి యొక్క ఛీత్కరింపులకు గురి అవుతాడు. ఆ సమయములో అతనికి అనిపిస్తుంది: ‘నాకు ఎందుకు ఈ గతి పట్టింది? నేను ఎలాంటి ఇంటిలో పెరిగాను? నా తండ్రి ఇంటిలో ఒక పనివాడు కూడా నాకంటే మంచిగా బ్రతుకుతాడు. నేను నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తాను, క్షమాపణ అడుగుతాను అని తండ్రి ఇంటికి బయలు దేరి వెళ్తాడు. అతడు దూరముగా ఉన్నపుడు తండ్రి అతని చూసి, పరుగెత్తు కొని వెళ్లి, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, లోపలికి తీసుకొని వెళ్లి క్రొత్త బట్టలు వేసి, గొప్ప విందు చేస్తాడు.
ఈ తండ్రి ఇంటిలో దేవుని ప్రేమ, క్షమాపణ, కనికరం, సమకూర్పు మనకు కనిపిస్తాయి. ‘ఇంకో సారి నాకు నీ మొహం చూపించవద్దు ఇంకో సారి ఈ ఇంటి గడప తొక్కొద్దు ఇంకో సారి నా ఇంటి వాకిలికి రావద్దు గెట్ ఔట్, గెట్ అవుట్ అఫ్ మై హౌస్’
అలాంటి అరుపులు చాలా ఇళ్లలో మనకు వినిపిస్తాయి. వాటిలో సమకూర్పు ఉండదు. క్రైస్తవ ఇంటిలో ప్రేమ, క్షమాపణ, కనికరం, సమకూర్పు ఉండాలని దేవుని కోరిక. ఆరవదిగా క్రైస్తవ ఇల్లు విశ్రాంతి ఇచ్చే ఇల్లు గా ఉండాలి.
6. A House of Rest: అది విశ్రాంతి ఇచ్చే ఇల్లు, మరియ ఇల్లు: అది విశ్రాంతి ఇచ్చే ఇల్లు
లూకా సువార్త 10 అధ్యాయములో చూస్తే ఒక రోజు ప్రభువైన యేసు క్రీస్తు ఒక గ్రామములో ప్రయాణము చేస్తూ ఉన్నాడు. మార్త అనే మహిళ ఆయనను తన ఇంటికి ఆహ్వానించింది. యేసు ప్రభువు ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెకు ఒక సోదరి ఉంది. ఆమె పేరు మరియ. మరియ యేసు ప్రభువు పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంది. కానీ మార్త అలా చేయలేదు. విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె టెన్షన్ పడుతూ ఉంది. యేసు ప్రభువును ఇంటికి పిలిచింది ఆమే, కానీ ఆయన దగ్గర కూర్చొనే సమయం మాత్రం ఆమెకు లేదు. బ్రదర్, మీటింగ్స్ పెట్టాం, మాకు వాక్యం బోధించండి అని నన్ను కొంతమంది పిలుస్తారు. నేను ఆ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆర్గనైజర్ మీటింగ్స్ లో కూర్చోడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. మార్త కూడా యేసు ప్రభువు తో మీటింగ్ ఆర్గనైజ్ చేసింది కానీ ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు వినే పరిస్థితి ఆమెకు లేదు.
మరియ ప్రశాంతముగా యేసు ప్రభువు దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఆనందిస్తున్నది. ఆమెను చూసి మార్తకు చిర్రెక్కింది. అనేక పనుల వలన మార్తకు టెన్షన్ పెరిగిపోయింది. ఎంతో ఒత్తిడి వలన ఆమె బీపీ పెరిగిపోయింది. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళింది. ‘ప్రభువా, నేను ఒంటరిగా ఇంత శ్రమ పడుతున్నాను. మరియ మాత్రం నీ దగ్గర కూర్చొని ఉంది. నన్ను చూస్తే నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని మరియకు చెప్పు అంది.
అప్పుడు యేసు ప్రభువు మార్తకు ఒక మాట చెప్పాడు: మార్తా, మార్తా, నీవు అనేక పనులు పెట్టుకొని ఒత్తిడితో నలిగిపోతున్నావు. నీకు కావలసినది ఒక్కటే. మరియను చూడు. ఆమె మంచి పని చేస్తున్నది. ఆమెను దాని నుండి నేను వేరు చేయను.
మార్త యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించ గలిగింది కానీ ఆయన ఇచ్చే విశ్రాంతి అనుభవించలేక పోయింది. మనం కూడా అనేక సార్లు మార్త వలె ఉంటాము. మరియ వలె యేసు ప్రభువు పాదముల యొద్ద కూర్చొని విశ్రాంతి తీసుకొనుటమనం అలవాటు చేసుకోము. ప్రభువా, నా టెన్షన్ నీకు పట్టదా అని దేవుని ప్రశ్నిస్తాము. క్రైస్తవ ఇంటిలో మరియ వలె యేసు ప్రభువు పాదముల యొద్ద కూర్చొని మనం ఆయన ఇచ్చే శాంతిని, విశ్రాంతిని పొందాలని దేవుని ఉద్దేశ్యం.
చివరిగా, క్రైస్తవ ఇల్లు అది విమోచించే ఇల్లు.
7. A House of Redemption: అది విమోచించే ఇల్లు
జక్కయ్య ఇల్లు: విమోచించబడిన ఇల్లు
ఒక రోజు ప్రభువైన యేసు క్రీస్తు యెరికో అనే పట్టణములో గుండా వెళ్తున్నాడు. పెద్ద జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉంది. వారిలో జక్కయ్య అనే ఒక టాక్స్ ఆఫీసర్ ఉన్నాడు. యేసు ప్రభువును చూడాలి అని ఆయనకు ఆశ కలిగింది. అయితే ఆయన పొట్టివాడు కావడం వలన చూడలేక పోతున్నాడు. ఆయనకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న మేడి చెట్టు మీద ఎక్కాడు. అప్పుడు జక్కయ్య ఊహించని సంఘటన జరిగింది. ప్రభువైన యేసు క్రీస్తు ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చాడు. జక్కయ్యను చూశాడు. జక్కయ్యా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య సంతోషముతో యేసు ప్రభువు కు తన ఇంటిలో ఆతిధ్యం ఇచ్చాడు. యేసు ప్రభువు జక్కయ్యతో ఒక మాట అన్నాడు, ‘నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి యున్నది’ (లూకా 19:
ప్రతి ఇంటికి రక్షించాలని దేవుని ఉద్దేశ్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వెళ్లే ముందు దేవుడు వారికి పస్కా పండుగను నియమించాడు. ఆ పండుగ లో వారు ఒక గొఱ్ఱె పిల్లను అర్పించి దాని రక్తమును ప్రతి ఇంటి మీద గురుతుగా పూయాలి. దేవుడు వారితో ఒక మాట అన్నాడు:
మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటి పోయెదను. నిర్గమ 12:13
గొఱ్ఱె పిల్ల రక్తము ప్రతి ఇంటి మీద ఉండాలి. ఆ గొఱ్ఱె పిల్ల మన కొరకు సిలువ వేయబడిన ప్రభువైన యేసు క్రీస్తు కు సాదృశ్యముగా ఉంది. ఒక జైలు అధికారి అపొస్తలుడైన పౌలును అడిగాడు. పౌలు అతనితో చెప్పాడు: ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు.
అపో కార్యములు 16:31
క్రైస్తవ ఇల్లు ఎలా ఉండాలి? అనే అంశం ఈ రోజు మనం చూసాము.
- మొదటిగా, A House of Reliance
సొలొమోను ఇంటి వలె దేవుని మీద ఆధార పడే ఇల్లుగా అది ఉండాలి
- A House of Resolution
యెహోషువ ఇంటి వలె అది దేవుని కొరకు ప్రత్యేకముగా ఉండాలి
- A House of Reflection
అబ్రహాము ఇంటి వలె అది నిరీక్షణ తో నిండిఉండాలి
- A House of Relationships
ప్రభువైన యేసు క్రీస్తు ఇంటి వలె అది మంచి సంబంధములతో నిండి ఉండాలి
- A House of Restoration
తప్పి పోయిన కుమారుని తండ్రి ఇల్లు వలె అందులో ప్రేమ, క్షమాపణ, కృప, సమాధానం వుండాలి
- A House of Rest
మరియ ఇల్లు వలె అందులో యేసు క్రీస్తు ఇచ్చే విశ్రాంతి ఉండాలి
- A House of Redemption
జక్కయ్య ఇంటి వలె అది విమోచించబడాలి, దేవుని రక్షణ అందులో ఉండాలి.
అలాంటి మంచి క్రైస్తవ ఇంటిగా దేవుడు మీ ఇంటిని చేయాలని మా ప్రార్ధన.
అదే నేటి మా ప్రేమ సందేశం.
క్రైస్తవ ఇల్లు ఎలా ఉండాలి?
A House of Reliance: సొలొమోను ఇల్లు:: ఆధారపడే ఇల్లు
A House of Resolution: యెహోషువ ఇల్లు:: ప్రతిజ్ఞ చేసిన ఇల్లు
A House of Reflection: అబ్రహాము ఇల్లు:: ప్రతిబంబించే ఇల్లు
A House of Relationships: యేసు క్రీస్తు ఇల్లు:: సంబంధాలు ఉండే ఇల్లు
A House of Restoration: తప్పి పోయిన కుమారుని తండ్రి ఇల్లు:: సమకూర్చే ఇల్లు
A House of Rest: మరియ ఇల్లు:: అది విశ్రాంతి ఇచ్చే ఇల్లు
A House of Redemption: జక్కయ్య ఇల్లు:: విమోచించే ఇల్లు
What a wonderful explanation thank you so much anna
Chala అద్భుతముగా వివరించారు ఆత్మ నడిపింపు తో
Glory To God