
ప్రేమ సందేశం వీక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు వర్ధిల్లుతున్నారని మేము తలంచుచున్నాము. మా వెబ్ సైట్ దర్శించండి. అనేక మంది మా వెబ్ సైట్ దర్శించి దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు. మీకు మా ధన్యవాదాలు. మా కార్యక్రమము బ్రాడ్ కాస్టింగ్ కి సహకారం అందిస్తున్న వారికి కూడా మా కృతఙ్ఞతలు. గత 7 సంవత్సరాలుగా 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం కార్యక్రమాలు చూడగలిగారు. అది మీ సహాయం వలనే సాధ్యపడింది. మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. మా ఇంగ్లీష్ సందేశాలు ఇప్పుడు www.sermonaudio.com వెబ్ సైట్ లో చూడవచ్చు, వినవచ్చు.

ఈ వారం మన ప్రపంచం ఉక్రెయిన్ యుద్ధం వైపు చూస్తూ ఉంది. ఈ రోజు బైబిలు ప్రవచనాల వెలుగులో ఉక్రెయిన్ యుద్ధం అనే అంశం మనం చూద్దాము. మన ప్రపంచం ఉక్రెయిన్ యుద్ధం వైపు చూస్తూ ఉంది. ఈ రోజు బైబిలు ప్రవచనాల వెలుగు లో ఈ సంఘటనలు ఎలా చూడాలి అనే అంశం మీద ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశ పడుతున్నాను. కొన్ని రోజుల క్రితం రష్యా దేశం ఉక్రెయిన్ దేశం మీద యుద్ధం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ తన సేనలతో ఉక్రెయిన్ ప్రజల మీద విరుచుకు పడ్డాడు. యుద్ధ విమానాల మోతలతో ఆ దేశం దద్దరిల్లుతున్నది. యుద్ధ ట్యాంకులు వాటి మార్గాలలో అడ్డువస్తున్న వాటిని ధ్వంసం చేస్తున్నాయి.

రష్యా ప్రయోగిస్తున్న క్షిపణులకు ఉక్రెయిన్ నగరాలలోని భవంతులు పేక ముక్కల్లాగా కూలి పోతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది ప్రజలు ఆ దేశం వదలి పారిపోతున్నారు. తప్పించు కోలేని వేలాది మంది ప్రజలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్ లలో రోగులు అల్లాడిపోతున్నారు. తల్లి దండ్రులు కోల్పోయిన వేలాది మంది చిన్నపిల్లల ఏడుపులు అన్ని చోట్లా వినిపిస్తున్నాయి. ఆహారం లేక అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజలు ధైర్యముతో రష్యా సైన్యాన్ని ఎదిరిస్తున్నారు. ఇది ఒక గ్లోబల్ వార్ గా మారింది. ప్రపంచం మొత్తం దృష్టిని ఈ యుద్ధం ఆకర్షించింది. ఉక్రెయిన్ లో చదువుకొందాం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు ఈ సంక్షోభము లో చిక్కుకున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గూగుల్, ఫేస్ బుక్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు సైబర్ దాడులకు లోనవుతున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ల మీద కూడా క్షిపణులతో దాడులు చేయడం మనం చూస్తున్నాము.

అమెరికా, యూరప్ దేశాలు రష్యా దేశం మీద ఆక్షల కొరడా వేశారు. అనేక వాణిజ్య సంస్థలు రష్యా దేశాన్ని తమ కార్యకలాపాల్లో నుండి తొలగించాయి. ఈ ఆంక్షల వలన రష్యా ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. నాకు తిక్క లెగిస్తే అణ్వస్త్రాలు కూడా ఉపయోగిస్తాను అని పుతిన్ హెచ్చరించాడు. అణ్వస్త్ర యుద్ధం ఎప్పుడైనా జరుగవచ్చు అనే భయం ఇప్పుడు పట్టుకొంది.

ఇలాంటి పరిస్థితుల గురించి బైబిల్ మనకు ఏమి బోధిస్తున్నది? ఇలాంటి రోజుల గురించి బైబిల్ ప్రవచనాలు ఏమి చెబుతున్నాయి? అనే విషయాలు మనం చూడాలి. మత్తయి సువార్త 24 అధ్యాయము లో యేసు ప్రభువు మనకు చాలా ముఖ్యమైన ప్రవచనాలు బోధించాడు. దీనిని ఒలివేట్ డిస్కోర్ర్స్ అన్నారు. ఒలీవల కొండ ప్రసంగము (Olivet Discourse) ఆ ప్రసంగములో మన ప్రియ రక్షకుడు చెప్పిన మాటలు చూద్దాము.


ఇవి జరిగిన తరువాతే ఈ ప్రపంచ అంతం వస్తుంది. మనిషికి ఎందుకు ఈ దుస్థితి పట్టింది? మత్తయి సువార్త 5 అధ్యాయములో యేసు ప్రభువు మరొక కొండ మీద ప్రసంగం చేసాడు. గలిలయ సముద్రం ఒడ్డున ఒక చక్కటి పర్వతం ఉంది. దాని మీద కూర్చుని యేసు ప్రభువు ‘sermon on the mount’ కొండ మీద ప్రసంగం చేశాడు.
2 అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
5 సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
10 నీతినిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
దీనత్వం, దేవుని కృప, దేవుని నీతి, కనికరం హృదయ శుద్ధి, సమాధానం వాటిని కోరుకో అని యేసు ప్రభువు ఆ కొండ మీద చెప్పాడు. మనిషి దీనత్వముతో ఆయన పాదాల కూర్చుని ఆయన మాటలు విని వాటిని పాటిస్తే మన ప్రపంచములో హింస, రక్తపాతం, యుద్ధాలు ఉండవు. మహాత్మా గాంధీ ‘కొండ మీద ప్రసంగం’ చేత ప్రభావితం చెంది దానిని ఆచరణలో పెట్టి అనేక విజయాలు సాధించాడు. అయితే రక్తపాతాన్ని కోరుకొనే వారు ఆ భావజాలాన్ని తృణీకరించారు. వారి అంతం ఎలా ఉంటుందో యేసు ప్రభువు ‘ఒలీవల కొండ ప్రసంగం’ లో వివరించాడు. రెండు కొండలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి.
గలిలయ కొండ – ఒలీవల కొండ
-గలిలయ కొండ దగ్గర దేవుని రాజ్యం ఉంది.
ఒలీవల కొండ దగ్గర మానవ రాజ్యం ఉంది.
-గలిలయ కొండ దగ్గర దేవుని దీనత్వం ఉంది.
ఒలీవల కొండ దగ్గర మానవుని గర్వం ఉంది.
-గలిలయ కొండ దగ్గర దేవుని నీతి ఉంది.
ఒలీవల కొండ దగ్గర మానవ పాపం ఉంది.
-గలిలయ కొండ దగ్గర దేవుని శాంతి ఉంది.
ఒలీవల కొండ దగ్గర మానవుని యుద్ధం ఉంది.
-గలిలయ కొండ దగ్గర దేవుని రక్షణ వుంది.
ఒలీవల కొండ దగ్గర మానవుని శిక్ష ఉంది.
గలిలయ కొండ మీద చేసిన ప్రసంగములో యేసు ప్రభువు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియజేశాడు. ఒలీవల కొండ మీద చేసిన ప్రసంగములో ఆయన మానవుని రాజ్యం ఎలా అంతం చెందుతుందో తెలియజేశాడు. మనిషి యేసు క్రీస్తు స్థానం లేని వ్యవస్థలు నిర్మించుకున్నాడు. ఒక రోజుల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ప్రపంచ చరిత్ర చెప్పుకొనేవారం. ఇప్పుడు కామన్ ఎరా CE, బిఫోర్ కామన్ ఎరా BCE అని అంటున్నారు. అంటే యేసు క్రీస్తు లేని ప్రపంచ చరిత్ర నీకు కావాలా? ఏంటి నీకు ఇంత అహంకారం? యేసు క్రీస్తు పేరు చూసి ఎందుకు కంగారు పడుతున్నావు?
కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును
కీర్తన 2:12
నా కుమారుని ముద్దు పెట్టుకోండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే భూరాజులు ఎలా స్పందించారు? అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.యేసు క్రీస్తు కు లోబడకుండా మనిషి తన వ్యవస్థలు నిర్మించుకున్నాడు. అవి ఏమిటంటే,
- దేవుడు లేని రాజకీయ వ్యవస్థ

1991 లో సోవియట్ యూనియన్ పతనం చెందడం గత శతాబ్దములోనే పెద్ద దుర్ఘటన అని వ్లాదిమిర్ పుటిన్ అంటున్నాడు. తిరిగి సోవియట్ సామ్రాజ్యం పునర్నిర్మించాలి అని అతడు కోరుకొంటున్నాడు. అది సాధ్యమేనా? అది మంచి మార్గమేనా? కార్ల్ మార్క్స్ సోవియెట్ యూనియన్ మార్క్సిజం మీద నిర్మించబడింది. ‘దేవుడు లేడు’ మానవుడు దేవుడు లేని సమాజం నిర్మించుకోవాలి అనే మూల సిద్ధాంతం మీద సోవియెట్ యూనియన్ నిర్మించబడింది. వారు వేలాది మంది పాస్టర్లను హతమార్చారు. వేలాది చర్చిలను ‘నాస్తిక మ్యూసియం’ లుగా మార్చివేశారు. బైబిలు ప్రతులను తగులబెట్టారు.

పరిశ్రమలు, విద్య, వైద్యం, గృహాలు, దుకాణాలు, బట్టలు, ఆహారం, వ్యవసాయం, బ్యాంకులు, రక్షణ – సమాజం లేని ప్రతి రంగం ప్రభుత్వమే నిర్వహించాలి, నడిపించాలి. దాని వలన ఏమి జరిగింది?
ఉక్రెయిన్ దేశం ఎంతో సారవంతమైన భూమి. స్టాలిన్ ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడు. రైతుల నుండి పొలాలను, పంటలను లాక్కున్నాడు. ఆ దేశములో కృత్రిమ కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో అలమటించారు. దాదాపు కోటి మంది ప్రజలు ఆకలి చావులు పొందారని స్టాలిన్ ఒక సందర్భములో విన్స్టన్ చర్చిల్ తో చెప్పాడు. ఎదిరించిన వారిని సైబీరియా చలి అరణ్యములో జైళ్లకు తరలించారు. వాటిని గులాగ్ అని పిలిచేవారు. వాటిల్లో కూడా అనేక లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

అలెగ్జాండర్ సోల్జ నిట్ సిన్ అనే రచయిత ‘గులాగ్ ఆర్కి పెలాగో’ అనే పుస్తకం వ్రాసాడు. అందులో ఆయన మనం దేవుడు లేని రాజకీయ వ్యవస్థ నిర్మించాము. అందుకనే మన దేశములో స్వాతంత్రం లేదు, వ్యక్తుల ప్రాథమిక హక్కులు లేవు, మత స్వాతంత్రము లేదు అని వ్రాశాడు. ఆ పుస్తకం ప్రచురణకు నోచుకోకుండా చాలా కాలం సోవియెట్ నాయకులు అడ్డుకొన్నారు. రష్యా చుట్టూ ఉన్న ఉక్రెయిన్ లాంటి చిన్న, చిన్న దేశాలు మేము సోవియెట్ యూనియన్ లో ఉండలేము. మా దారిన మమ్ములను పోనివ్వండి. మాకు స్వతంత్రం ఇవ్వండి అన్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వారి మాట వినలేదు. మీరు మాతో కలిసి ఉండాల్సిందే. లేకపోతే హింస తో మిమ్ములను అణచివేస్తాము అన్నాడు. దీనిని బ్రేజ్నెవ్ డాక్ట్రిన్ అన్నారు.

మికాయిల్ గోర్బచెవ్ 1991 లో సోవియెట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించాడు. బైబిలు సత్యాలు అనేకం నేర్చుకొన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ‘సోవియెట్ యూనియన్ ని మనం ఎంతో కాలం నడిపించలేము. మన ప్రజల్ని అణచివేసి ఎంతో కాలం ఉంచలేము. అమెరికా లాంటి దేశాలతో కూడా మనం ఎంతో కాలం పోటీ పడలేము. కాబట్టి సోవియెట్ యూనియన్ ని మనం అంతం చేద్దాము అన్నాడు. 1991 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజున సోవియెట్ యూనియన్ కుప్పకూలింది. ప్రజలు స్వేచ్ఛ ను తిరిగి పొందారు. చర్చిలు తలుపులు తెరచుకొన్నాయి. పాస్టర్లకు దేవుని వాక్యం బోధించే అవకాశం కలిగింది. 1991 లోనే ఉక్రెయిన్ దేశం కూడా స్వాతంత్రం పొందింది. అప్పటి నుండి వారు స్వేచ్ఛగా జీవించాలని కోరుకొంటున్నారు.

అయితే పుటిన్ సహించలేకపోతున్నాడు. గోర్బచెవ్ కు ఉన్న జ్ఞానం పుటిన్ కి లోపించింది. సోవియెట్ యూనియన్ నిలబడేది కాదు అని గోర్బచెవ్ దానికి ముగింపు పలికి, ఉక్రెయిన్ కి స్వాతంత్రము ఇచ్చాడు. దానికి భిన్నముగా పుటిన్ ఉక్రెయిన్ ని తిరిగి ఆక్రమించుకోవాలి అని యుద్ధం ప్రకటించాడు. హింసతో పొరుగు దేశాలను అణచివేయాలి అనే బ్రెజినెవ్ డాక్ట్రిన్ ని ఆయన అమలు చేస్తున్నాడు.

- దేవుడు లేని విద్యా వ్యవస్థ
మన ప్రపంచం చిన్నాభిన్నం కావడానికి రెండో కారణం దేవుడు లేని విద్యా వ్యవస్థ కూడా కారణం. బైబిల్ పునాదిగా మన విద్య ఉండాలి. హార్వర్డ్ యూనివర్సిటీ ని చూడండి. ప్యూరిటన్ లు బైబిల్ పునాదిగా వారి విద్యా వ్యవస్థను అక్కడ నిర్మించారు. అయితే నేటి కాలేజీలు, యూనివర్సిటీ లలో బైబిల్ జ్ఞానం లేదు. డార్విన్ పరిణామ సిద్ధాంతం మీద ఆధునిక విద్య నడుస్తూ ఉంది. ‘మనిషి ‘ఎవాల్యుషన్’ ద్వారా పుట్టాడు, దేవుడు మనలను సృష్టించలేదు’ అనే అబద్దం అది బోధిస్తూ ఉంది. ఆ అబద్ద ప్రచారం వలన చాలా మంది దేవుని కి దూరం అవుతున్నారు.
- దేవుడు లేని శాస్త్రీయ వ్యవస్థ
ఈ దేవుడు లేని విద్యావ్యవస్థ వలన దేవుడు లేని శాస్త్రీయ వ్యవస్థ రంగం పుట్టింది. చాలా మంది సైంటిస్టులు నాస్తికత్వాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. ఉక్రెయిన్ దేశములో ఒడెస్సా నగరము దగ్గరలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడులు జరిగినవి. ఈ ఒడెస్సా నగరములో జార్జ్ గామావ్ అనే శాస్త్రవేత్త జన్మించాడు (1904 – 1968). ఈయన గొప్ప న్యూక్లియర్ ఫిజిసిస్ట్. జీన్స్, DNA మీద కూడా ఈయన పరిశోధనలు చేశాడు.

లెనిన్ గ్రాడ్ యూనివర్సిటీ లో చదువు కొన్నాడు. లెనిన్ గ్రాడ్ ఒకప్పటి పేరు సెయింట్ పీటర్స్ బర్గ్. అపోస్తలుడైన పేతురు గారి పేరు మీద నిర్మించబడిన గొప్ప నగరం. దాని పేరును లెనిన్ గ్రాడ్ గా మార్చివేశారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిశోధనలు చేసి ఆటమ్ బాంబు నిర్మించడములో గామో పరిశోధనలు ఉపయోగపడ్డాయి. ఆయన అమెరికా లోని కొలొరాడొ లోని భూ ల్ డర్ లోని విశ్వవిద్యాలములో ప్రొఫెసర్ అయ్యాడు. బిగ్ బాంగ్ థియరీ ని రూపొందించాడు. దీని ప్రకారం కోట్లాది సంవత్సరముల క్రితం మన విశ్వం గొప్ప విస్ఫోటనములో పుట్టింది. దేవుడు లేకుండానే ఈ విశ్వం పుట్టింది అనే ప్రచారం చేశాడు.
‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను’ అని బైబిలు గ్రంథం మొదలవుతుంది. అయితే ఆ సత్యాన్ని గామో నమ్మలేదు. ఇలాంటి సైంటిస్ట్లు దేవుడు లేని సైన్స్ రంగం సృష్టించారు. వారు తయారు చేసిన అణు ఆయుధాలు పుటిన్ లాంటి వారి చేతుల్లోకి వెళ్లాయి. సైన్స్ పేరు మీద వీరు చెప్పిన బిగ్ బాంగ్ లాంటి అసత్య వాదనలు నమ్మి చాలా మంది దేవుని కు దూరం అయ్యారు.
మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
లూకా 18:8
అని యేసు ప్రభువు ఒక సారి ప్రశ్నించాడు. జార్జ్ గామో లాంటి వాళ్ళు వస్తారు. వీరు ప్రజలను సైన్స్ పేరుతో విశ్వాసం నుండి తొలగిస్తారు అని యేసు ప్రభువుకు తెలుసు. అందుకనే, నేను తిరిగి వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసం ఉన్న ఉంటారా? అని ఆయన ప్రశ్నించాడు. ఒక ‘అవిశ్వాస యుగం’ లో మనం ఉన్నాము. ఆ తరువాత, దేవుడు లేని వాణిజ్య వ్యవస్థ రంగం. రష్యా దేశములో పెట్రోలు విస్తారముగా ఉంది. రష్యా వారి ఎగుమతుల్లో 65 శాతం పెట్రోలు, నాటురల్ గ్యాస్. యూరప్ కి 40 శాతం పెట్రోలు రష్యా వారు సప్లై చేస్తున్నారు. ఆ సరఫరా చేసే పైప్ లైనులు 80 శాతం ఉక్రెయిన్ దేశం గుండా వెళ్తున్నాయి. పుటిన్ ఉక్రెయిన్ ని టార్గెట్ చేయటానికి అది ముఖ్య కారణం. తన వ్యాపార సామ్రాజ్యానికి ఉక్రెయిన్ గుండె కాయ లాంటిది.

ఈ పెట్రోలు వ్యాపారం ద్వారా పుటిన్, అతని స్నేహితులు లక్షలాది కోట్లు సంపాదించుకొన్నారు. యుద్ధాలు ప్రకటించడం, పెట్రోలు రేట్లు పెంచడం, ఆ డబ్బులన్నీ కూడగట్టుకోవడం వీరికి అలవాటుగా మారింది. దేవుని హెచ్చరికలు వారు మరచిపోతున్నారు. యాకోబు 5 తన పత్రికలో వ్రాశాడు: ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవ ములను గూర్చి ప్రలాపించి యేడువుడి.2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.3 మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. ధనవంతులారా, మీ ధనం చెడిపోతుంది. మీ బంగారం మీ శరీరములను తినివేస్తుంది. అంత్య దినాల్లో మీరు డబ్బు పోగుచేసుకొంటున్నారు. మీరు పని వారికి సరిగ్గా జీతాలు ఇవ్వరు. వారి కేకలు దేవుని చెవుల్లో మ్రోగుతున్నాయి.

రష్యా నాయకుల లైఫ్ స్టైల్ చూడండి: పెద్ద పెద్ద యాక్ట్ లు వారు కొనుక్కున్నారు. ఈ యాక్ట్ పెద్ద ఓడ వలె ఉంటుంది. అందుకొనే ఒక భవనం, పెద్ద స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, బార్ ఉంటాయి. అది ఒకొకటి రెండు మూడు వందల కోట్లు ఉంటుంది. అందులో ధనవంతుడు, అతని కుటుంబం, అతని స్నేహితులకు మాత్రమే ప్రవేశం. ఉక్రెయిన్ లో, రష్యాలో ఉన్న అనాధల గురించి వీరు పట్టించుకోరు. తమ విలాసాల గురించే వీరు ఆలోచిస్తారు. పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు – IMF, వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనై జేషన్ కూడా దేవుని వాక్యం పాటించడం లేదు. దేవుని ఉగ్రత గురించి ఆలోచించకుండా వీరు ధనం పోగు చేసుకొంటున్నారు.

4.దేవుడు లేని మత వ్యవస్థ
ఆ తరువాత దేవుడు లేని మత వ్యవస్థ: అంత్యదినాల్లో దేవుడు లేని మత వ్యవస్థ కూడా పెరిగిపోతుంది. ఒలీవల కొండ ప్రసంగం చేసేటప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవాలయం వైపు చూపించి తన శిష్యులతో ఒక మాట అన్నాడు:
రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడును (మత్తయి 24:2)

రాయి మీద రాయి కూడా మిగులకుండా ఈ ఆలయం కూల్చివేయబడుతుంది అని ఆయన చెప్పాడు. ఎందుకంటే అది దేవుడు లేని మత వ్యవస్థ గా మారిపోయింది. దేవుని మీద ఎటువంటి భక్తి, ప్రేమ లేకుండా మతాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో పుటిన్ కూడా ఒకడు. నేను కూడా క్రైస్తవుణ్ణే. నా మెడలో సిలువ వేసుకొంటాను అని పుటిన్ చెపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు పాస్టర్ లతో కలిసి ఫోటోలు కూడా తీయించుకొంటాడు. ఈ వేషాలన్నీ క్రైస్తవులను మభ్యపెట్టి వారిని బుట్టలో వేసుకోవాలనే కానీ అతనికి దేవుని మీద భయభక్తులు లేవు.
ఉక్రెయిన్ దేశము దాదాపు వేయి సంవత్సరాలుగా క్రైస్తవ దేశం గా ఉంది. ఒక రోజుల్లో వారంతా విగ్రహారాధన, నరబలి లాంటి పద్ధతుల్లో ఉండేవారు. అయితే ఇద్దరు మిషనరీలు – సిరిల్ (826 – 869), మెథోడియస్ (815-885) లు రష్యా దేశం వెళ్లి సువార్త ప్రకటించారు. జస్టీనియన్ చక్రవర్తి స్థాపించిన బైజాన్ టయిన్ సామ్రాజ్యం వీరిని పంపించింది. సిరిల్ బైబిల్ గ్రంథాన్ని రష్యా వారి కోసం తర్జుమా చేశాడు. అప్పుడు వారికి అక్షరాలు కూడా లేవు. Cyril invented the Glagolithic alphabet (Cyrillic) ఆయన వారి కోసం ప్రత్యేకముగా అక్షరాలు రూపొందించి వారి భాషలో బైబిల్ ను తర్జుమా చేసి అందించాడు. వారి పరిచర్య వలన రష్యా ప్రజలు యేసు క్రీస్తు సువార్త విన్నారు.

ఆ తరువాత వ్లాడిమిర్ రాజు కాలములో క్రైస్తవ్యం ఉక్రెయిన్ లో, రష్యా లో స్థిరపడింది. ఆయన కొంత మంది రాయబారులను కాంస్టాంటి నోపిల్ పంపాడు. అక్కడ ఉన్న హగియా సోఫియా చర్చి ని చూసి వారు ఆశ్చర్యపోయారు. దాని సౌందర్యం వారిని ముగ్ధులను చేసింది. అందులో వారు విన్న పాటలు, సంగీతం కూడా వారిని మైమరపించింది. అప్పుడు వారు క్రైస్తవులుగా మారారు. వ్లాడిమిర్ (1015-) బాప్తిస్మము తీసుకొని క్రైస్తవుడిగా మారాడు. రష్యా ప్రజలు, ఉక్రెయిన్ ప్రజలు కూడా క్రైస్తవులుగా మారారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఇక్కడ వృద్ధి చెందింది. అందులో నిజమైన విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అయితే క్రైస్తవ మతాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం రష్యన్ నాయకులు మొదలుపెట్టారు.

స్టాలిన్ లాంటి నాస్తికులు, కమ్యూనిస్టులు కూడా మత వ్యవస్థను తమ ఆశయాల కోసం (Symphonia) వాడుకొన్నారు. ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ కూడా వారి బాటలోనే నడుస్తున్నాడు. తన అధికార నియంత్రణ కోసం మతాన్ని వాడుకొంటున్నాడు. అటువంటి మత వ్యవస్థ రాయి మీద రాయి కూడా లేకుండా కూలిపోతుంది అని యేసు ప్రభువు అన్నాడు.
‘మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి’ అని బాప్తిస్మ మిచ్చే యోహాను నాయకులను హెచ్చరించాడు. పుటిన్ లో మారు మనస్సునకు తగిన ఫలములు మనకు కనిపించడం లేడు. తన రాజకీయ ప్రత్యర్థులను చంపించడం, వారికి విషం ఇవ్వడం, వారిని జైళ్లలో పెట్టి హింసించడం పుటిన్ చేస్తున్నాడు. స్టాలిన్ కూడా తన ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి చంపించేవాడు. సెప్టెంబర్ 5, 2005 ఉక్రెయిన్ అధ్యక్షుడు Viktor Yushchenko విక్టర్ యూషుచెంకో కి విషం ఇచ్చారు.
2014 జూలై 17 – ఆమ్ స్టర్ డామ్ నుండి కౌలా లంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఉక్రెయిన్ మీదుగా వెళ్తున్నప్పుడు పుటిన్ మనుష్యులు దానిని ఒక మిస్సైల్ తో పేల్చివేశారు. అనేక మంది మహిళలు, చిన్న పిల్లలతో సహా 298 మంది ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దానికి కారకుడు పుటిన్. తన అధికారం కోసం ఇటువంటి పనులు చేస్తున్న వ్యక్తి అప్పుడప్పుడూ చర్చి కి వెళ్లినంత మాత్రాన అతని విశ్వాసి అని పిలవలేము. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించిన వ్యక్తి మాత్రమే నిజమైన విశ్వాసి.

చివరిగా, దేవుడు లేని విదేశాంగ వ్యవస్థ
మన విదేశాంగ విధానం ఎలా ఉండాలి? దేవుడు దేశాలకు కూడా తీర్పు తీరుస్తాడు. దీనిని ‘judgment of nations’ అంటారు. ఏ దేశం ఎలా ప్రవర్తించింది, ముఖ్యముగా బలహీనమైన దేశాల పట్ల ఆ దేశం ఎలా ప్రవర్తించింది దేవుడు లెక్క అడుగుతాడు. పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు అనేక దేశాలకు, సామ్రాజ్యాలకు తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు దేశం, యూదా దేశం ఐగుప్తు దేశం, అస్సీరియా సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, పర్షియా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం వాటన్నిటికీ దేవుడు తీర్పు తీర్చాడు. మీరు చేసిన పాపాలు ఇవి, వాటికి మీకు వేస్తున్న శిక్ష ఇది అని స్పష్టముగా చెప్పి మరీ ఆ దేశాలను దేవుడు శిక్షించాడు. ఈ రోజు అనేక దేశాలు మా ఇష్టం వచ్చినట్లు చేస్తాము, మమ్మల్ని ప్రశ్నించేది ఎవరు? అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. అయితే, రష్యా దాని మిత్ర దేశాలకు నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు తన వాక్యములో తెలియజేశాడు.
యెహెఙ్కేలు గ్రంథం 38,39 అధ్యాయాలు చూస్తే అక్కడ రష్యా దేశం, దాని మిత్ర దేశాలు అంత్య దినాల్లో ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడం మనం చూస్తాము. 2500 సంవత్సరముల క్రితం యెహెఙ్కేలు ప్రవక్త దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అంత్య దినాల్లో తిరిగి సమకూర్చుతాడు అని ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరడం 1948 లో ప్రారంభం అయ్యింది. యూదులను దేవుడు ఒక దేశముగా సమకూర్చాడు. ఇక వారిని అక్కడ నుండి తరిమివేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. ఏ దేశమైనా ఇశ్రాయేలు ను ఆక్రమించు కోవాలని చూస్తే దేవుడు సహించడు. ఇశ్రాయేలీయులను పారద్రోలాలని ప్రయత్నిస్తే దేవుడు వారిని అడ్డుకొంటాడు.
రష్యా, దాని మిత్ర దేశాలు ఇశ్రాయేలు దేశం లోని సంపదను కొల్లగొట్టాలని, అక్కడ ఉన్న యూదులను తరిమివేయాలని ప్రయత్నిస్తాయి. ఉక్రెయిన్ దేశాన్ని, ఆక్రమించుకొని దాని సంపదను దోచు కొన్నట్లుగా ఇశ్రాయేలు ను కూడా దోచు కొందాము అని రష్యా దేశం ప్రయత్నిస్తుంది. అయితే దేవుడు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేస్తాడు. రష్యా, దాని మిత్ర దేశాల సైన్యాలను దేవుడు నిర్మూలము చేసి ఇశ్రాయేలు దేశాన్ని రక్షిస్తాడు. ఇది అన్య జనుల సమయం. దానియేలు ప్రవక్త చెప్పిన 70 వారముల ప్రవచనములో 69 వారములు గడిచినవి.
70 వారం – 7 సంవత్సరములు మహా శ్రమల కాలం గా మనకు కనిపిస్తున్నది. సాతాను శక్తులు ఎంత ప్రయత్నించినప్పటికీ దేవుని ప్రణాళికను అవి అడ్డుకోలేవు. ప్రపంచ దేశాలు దేవుని మార్గము నుండి ఎలా తొలగిపోయినాయో ఈ రోజు మనం చూశాము.
దేవుడు లేని రాజకీయ వ్యవస్థ,
దేవుడు లేని విద్యా వ్యవస్థ,
దేవుడు లేని శాస్త్రీయ వ్యవస్థ
దేవుడు లేని వాణిజ్య వ్యవస్థ,
దేవుడు లేని మత వ్యవస్థ
దేవుడు లేని విదేశాంగ వ్యవస్థ
ఈ వ్యవస్థలన్నిటినీ దేవుడు ఒక రోజు అంతం చేస్తాడు. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు
కీర్తన 2:9
ఇహ లోక రాజ్యాలను ప్రభువైన యేసు క్రీస్తు తన శక్తితో ముక్క చెక్కలుగా పగుల గొట్టి, రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మన ప్రపంచాన్ని పరిపాలించ బోవుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ యొద్దకు వచ్చి పాప క్షమాపణ పొంది, మనం రక్షణ పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.
References & Image Credits
https://www.christianitytoday.com/ct/2000/octoberweb-only/56.0b.html
By Kremlin.ru, CC BY 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=115643698
By John Jabez Edwin Mayal – International Institute of Social History, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=591288
By Anefo – http://proxy.handle.net/10648/abec18ec-d0b4-102d-bcf8-003048976d84, CC0, https://commons.wikimedia.org/w/index.php?curid=110260293
By not available – Original publication: not availableImmediate source: https://www.colorado.edu/physics/events/outreach/george-gamow-memorial-lecture-series, Fair use, https://en.wikipedia.org/w/index.php?curid=59519782
By Stanislav Dospevski (1823-1878) – http://www.pravoslavieto.com/art/shkoli/samokovska/1795_Stanislav_Dospevski.htm, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=3472619
-By Милютин Станислав Викторович – личная фотография, Public Domain, https://commons.wikimedia.org/w/index.php?curid=8726752
-By Testus – Own work, CC BY-SA 3.0, https://commons.wikimedia.org/w/index.php?curid=6854142