క్రిస్మస్ సందేశం 2022: డాక్టర్ పాల్ కట్టుపల్లి

ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని  తలంచుచున్నాను. ఈ క్రిస్మస్ సీజన్ లో మీరు దేవుని సంతోషాన్ని సమృద్ధిగా పొందాలని నా కోరిక. నా ప్రార్థన. బైబిల్ సమాచారం కోసం మా వెబ్ సైట్ దర్శించండి. www.doctorpaul.org మా కార్యక్రమం యాప్ మీ మొబైల్ ఫోన్ లో టీవీ లో డౌన్ లోడ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ లో మా సందేశాలు చూడండి. ఇప్పటి వరకు 270 ఎపిసోడ్ లు చేశాము. వాటన్నిటినీ మీరు మా యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చు. మా కార్యక్రమం బ్రాడ్ కాస్టింగ్ కి ఆర్థిక సహకారం అందించండి. 

     క్రిస్మము సందర్భముగా ఈ రోజు నేను ఒక క్రిస్మస్ సందేశాన్ని మీకు అందించాలని కోరుకొంటున్నాను. మత్తయి సువార్త 2 అధ్యాయములో ఒక చక్కటి క్రిస్మస్ స్టోరీ వ్రాయబడింది. ఈ రోజు దానిలో నుండి 7 విషయాలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. 

   యేసు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆయనను చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వెళ్లారు. క్రిస్మస్ కార్డులలో ముగ్గురు జ్ఞానులను మనం చూస్తాము. అయితే వారు ఖచ్చితముగా ఎంత మందో మనకు తెలియదు. ముగ్గురు వెళ్లారో, పది మంది వెళ్లారో, వంద మంది వెళ్లారో మనకు తెలియదు. ఎంతమంది వెళ్లారో, ఎక్కడ నుండి బయలు దేరి వెళ్లారో మనకు తెలియదు. ఎంత మంది అయినప్పటికీ వారు గొప్ప యాత్ర చేశారు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సుందరమైన పసి మొహాన్ని చూసే భాగ్యం వారికి కలిగింది. ఆయనను చూసి ఆరాధించే యోగ్యత వారికి దొరికింది. వారి అనుభవాల్లో నుండి 7 విషయాలు మనం చూద్దాము. 

Wisdom 

మొదటిగా the Wisdom of Christmas

 the Wisdom of Christmas – క్రిస్మస్ లో కనిపించే జ్ఞానం 

    యేసు క్రీస్తు యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరములో ఉన్న బెత్లెహేము అనే చిన్న గ్రామములో జన్మించాడు. ఆ సమయములో రోమన్ సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. వారి సామంత రాజు హేరోదు యూదయ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను దర్శనము చేసుకోవటానికి వెళ్లారు. వారు ‘జ్ఞానులు’ అని పిలువబడ్డారు. ‘జ్ఞానము కలిగిన వారు’ అని పిలువబడ్డారు. 

జ్ఞానము అంటే ఏమిటి? 

    ప్రతి విషయం గురించి సత్యము తెలుసుకోవడమే జ్ఞానము. సత్యము లేకుండా జ్ఞానము లేదు. సత్యము తెలుసుకొని దానిని ఆచరణలో పెట్టడమే  జ్ఞానం. సమస్త సత్యము దేవునికి చెందినదే. సమస్త జ్ఞానము దేవునికి చెందినదే. సత్యము ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ రూపము లో ఉన్నా అది దేవునికి చెందినదే. అదే విధముగా జ్ఞానము ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ రూపము లో ఉన్నా అది దేవునికి చెందినదే. ప్రతి వ్యక్తి జ్ఞానము సంపాయించుకోవాలి అని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెబుతున్నది. 

సామెతలు గ్రంథము లో మీరు చూడండి. 3 అధ్యాయము 13,14 వచనాలు 

జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, 

వివేచన కలిగిన నరుడు ధన్యుడు 

వెండి సంపాదించుటకంటే జ్ఞానము 

సంపాదించుట మేలు 

అపరంజి సంపాదించుట కంటే 

జ్ఞాన లాభము నొందుట మేలు. 

      సామెతలు 3:13,14

వెండి, బంగారముల కంటే జ్ఞానము సంపాదించుట మంచిది. డబ్బు, పలుకుబడి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మంచిది. జ్ఞానము సంపాదించిన వ్యక్తి ధన్యుడు అని దేవుడు అంటున్నాడు. ఈ జ్ఞానము వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? అని మీరు అడగవచ్చు. సామెతలు గ్రంథము 4:6-7 వచనాలు చూద్దాము. 

జ్ఞానమును విడువక యుండిన యెడల 

అది నిన్ను కాపాడును 

దాని ప్రేమించిన యెడల అది 

నిన్ను రక్షించును. 

           సామెతలు గ్రంథము 4:6-7 

ఈ జ్ఞానము కాపాడేది ఈ జ్ఞానము రక్షించేది. ఈ జ్ఞానము మాకు కావాలి అని తూర్పు దేశపు జ్ఞానులు కోరుకున్నారు. ఎలాగైనా సరే యేసు క్రీస్తు ప్రభువు దర్శనము చేసు కోవాలి అని వారు యెరూషలేము వైపు ప్రయాణము చేశారు. యేసు క్రీస్తు ను తెలుసుకోవడమే జ్ఞానము. 

  అపోస్తలుడైన పౌలు వ్రాశాడు మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములో. 

దేవుని మూలముగా 

యేసు క్రీస్తు 

మనకు జ్ఞానమును, 

నీతియు, 

పరిశుద్ధతయు, 

విమోచనయు  ఆయెను. 

           1 కొరింథీ 1:31

దేవుని జ్ఞానము మీకు కావాలంటే, మీరు యేసు క్రీస్తు దగ్గరకు రావాలి. ఆయన దేవుని జ్ఞానము, నీతి, పరిశుద్ధత విమోచన గా మన యొద్దకు వచ్చాడు. 

యేసు క్రీస్తు అజ్ఞానముతో వున్న మనకు దేవుని జ్ఞానం 

అవినీతి లో ఉన్న మనకు దేవుని నీతి 

పాపములో ఉన్న మనకు దేవుని పరిశుద్ధత 

దాస్యములో ఉన్న మనకు దేవుని విమోచన 

    మొదటి క్రిస్మస్ రోజున తూర్పు దేశపు జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభువు దర్శనం చేసుకొని వాటిని పొందారు. ఇప్పుడు దేవుడు వాటిని మనకు కూడా అందిస్తున్నాడు. నేను జ్ఞానిని ఎలా అవుతాను? నా పేరు చివర PhD లేదు,నేను స్కాలర్ ని కాదు,నాకు ఫస్ట్ ర్యాంకు, ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ రాలేదు. నేనెలా జ్ఞాని ని అవుతాను? అని మీకు అనిపించ వచ్చు. అయితే యేసు క్రీస్తు ను తెలుసుకోవడమే జ్ఞానము. తూర్పు దేశపు జ్ఞానుల వలె యేసు క్రీస్తు ప్రభువు ను తెలుసుకొన్న ప్రతి వ్యక్తిని దేవుడు జ్ఞాని అని పిలుస్తున్నాడు. 

రెండవదిగా the wonder of Christmas 

the wonder of Christmas 

క్రిస్మస్ లో కనిపించే ఆశ్చర్యం 

   తూర్పు దేశపు జ్ఞానులు శిశువు గా ఉన్న క్రీస్తు ను చూడాలి అని అనుకొన్నారు. వారికి ఒక సమస్య వచ్చింది, ‘ఇంత పెద్ద దేశములో ఆయన ఏ ఇంటిలో పుట్టాడో కదా? ఆ ఇంటిని ఎలా కనుగొంటాము?’ అని వారు మధన పడ్డారు. ఆ సమయములో ఆకాశములో ఒక నక్షత్రం వెలసింది. ఆ నక్షత్రం వారి ముందు నడిచింది. దానిని చూసినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది! దానిని వెంబడిస్తూ వారు యెరూషలేము వైపు నడిచారు. ఆ నక్షత్రము చివరకు ఒక ఇంటి మీద నిలిచింది. వారు ఇంటిలోకి వెళ్లి యేసు క్రీస్తు ప్రభువు ను చూశారు. దేవుని ఆనందము, ఆశ్చర్యము తో వారు నిండిపోయారు. యెషయా గ్రంథము 9 అధ్యాయములో ఒక మాట మనం చదువుతాము: 

ఏలయనగా మనకు శిశువు పుట్టెను 

మనకు కుమారుడు అనుగ్రహింబపడెను 

ఆయన భుజము మీద రాజ్యభార ముండును 

ఆశ్చర్యకరుడు,ఆలోచన కర్త 

బలవంతుడైన దేవుడు,నిత్యుడగు తండ్రి 

సమాధాన కర్త అయిన అధిపతి 

అని అతనికి పేరు పెట్టబడును. 

                  యెషయా 9:6 

యేసు క్రీస్తు యొక్క ఒక పేరు ఆశ్చర్య కరుడు. He is Wonderful.క్రిస్మస్ కన్నా ఆశ్చర్యకరమైన రోజు మరొకటి లేదు. దేవుడు మానవ రూపము పొందుట కంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏముంది? దేవుడు ఒక పసివాడుగా జన్మించటం కంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏముంది? యేసు క్రీస్తు జననం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన జ్ఞానం చూసి పండితులు కూడా ఆశ్చర్యపోయారు

ఆయన గలిలయ సముద్రం లో నీటి మీద నడచినప్పుడు, శిష్యులు ఆశ్చర్యపోయారు 

5 రొట్టెలు, రెండు చేపలు వేలాది మందికి పంచినప్పుడు, వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

చనిపోయి సమాధిలో ఉన్న లాజరును పిలిచి, బయటికి రప్పించినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

రూపాంతరపు కొండ మీద మోషే, ఏలీయాలతో ఆయన మాట్లాడినప్పుడు వారికి ఎంత

ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

తుఫాను ను గద్దించి, గాలి వానను ఆపినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

సిలువ వేయబడి సమాధి చేయబడి, మూడు రోజుల తరువాత వారి మధ్యలో నిలిచినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

వారి కన్నుల ఎదుట ఆయన పరలోకం వెళ్లిపోవడం చూసినప్పుడు వారికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది? 

యేసు క్రీస్తు వ్యక్తిత్వం, ఆయన మాటలు, ఆయన క్రియలు చూసినప్పుడు వారు ఆశ్చర్య చకితులు అయ్యారు. 

జ్ఞానము యొక్క ఒక లక్షణం అది మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సైంటిస్ట్ ప్రకృతి రహస్యాలు చెబితే మనం ఆశ్చర్యపోతాము. 

‘జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను’  

        సామెతలు 3:19 

ఒక సైంటిస్ట్ కూడా ప్రకృతి వెనుక ఉన్న దేవుని జ్ఞానాన్నే చూస్తున్నాడు. సృష్టి లో కనిపించే ప్రకృతి నియమాలే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. దేవుడు అప్పుడప్పుడూ ఆ నియమాలను కూడా అధిగమించి అద్భుత కార్యాలు చేస్తే మనం మరింత ఆశ్చర్యానికి గురవుతాము. 

ఒక కన్యక గర్భవతి కావడం ఏమిటి? 

ఒక నక్షత్రం మనుష్యులకు దారి చూపించడం ఏమిటి? 

ఒక శిశువు జన్మిస్తే దేవదూతలు భూమి మీదకు వచ్చి పాటలు పాడడం ఏమిటి? 

అటువంటి ఆశ్చర్యకరమైన పనులు దేవుడు మొదటి క్రిస్మస్ సందర్భములో చేసాడు. ఈ రోజు కూడా తన యొద్దకు వచ్చే వారికి దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. 

   నేను టీనేజర్ గా ఉన్న రోజుల్లో చాలా బోర్ డమ్ లో ఉండేవాడిని. ఒక రోజు మా నాన్న యోహాను గారు నన్ను అడిగాడు, ‘ఎలా ఉన్నావు?’ ‘చాలా బోరింగ్ లో ఉన్నాను, ప్రతిదీ నాకు బోర్ డమ్ కలిగిస్తూ ఉంది’ అని చెప్పాను. దానికి మా ఫాదర్ నాతో ఒక మాట అన్నాడు. ‘నీవు బైబిల్ చదువు. దేవుడు నీకు ఆశ్చర్య కరమైన సంగతులు చూపిస్తాడు’ 

అన్నాడు. బైబిల్ చదవడం మొదలు పెట్టి, దేవుని కార్యముల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పటి నుండి నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. దేవుడు 

నాకు ఆశ్చర్యకరమైన సంగతులు నాకు చూపిస్తూ ఉన్నాడు. 

దానియేలు గ్రంథములో చెప్పబడినట్లు, 

దేవుని సూచక క్రియలు 

ఎంతో బ్రహ్మాండమైనవి, 

ఆయన అద్భుతములు 

ఎంతో ఘనమైనవి

         దానియేలు 4:3

మూడవదిగా the Way of Christmas 

the Way of Christmas 

క్రిస్మస్ లో కనిపించే మార్గము 

   ఈ జ్ఞానులకు ఆ నక్షత్రం ఒక మార్గం చూపించింది. ఆ మార్గము చివరకు వారిని యేసు క్రీస్తు ప్రభువు ఉన్న ఇంటికి నడిపించింది. క్రిస్మస్ ఒక పండుగ రోజు మాత్రమే కాదు. అది దేవుడు మన ఎదుట ఉంచిన మార్గము. రోమా పత్రికలో మనం చదువుతాము 

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల

బాహుళ్యము ఎంతో గంభీరం; 

ఆయన తీర్పులు 

శోధింపనెంతో అశక్యములు. 

ఆయన మార్గములెంతో 

అగమ్యములు. 

       రోమా 11:33

దేవుని జ్ఞానము మన ముందు ఒక మార్గము పెట్టింది. ‘జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. యదార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను’ 

   సామెతలు 4:11 

ఆ చీకటిలో వారు వెళ్తున్నప్పుడు ఆ జ్ఞానులకు దేవుడు ఒక మార్గము చూపించాడు. పూర్వము ప్రజలు నక్షత్రములు చూసు కొంటూ నడిచేవారు. సముద్రములో ఓడలు నడిపే వారు కూడా నక్షత్రములను బట్టి ఏ దిశలో ప్రయాణిస్తున్నది తెలుసు కొనేవారు. 

తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేవుడు వారికి చూపించిన నక్షత్రం చూస్తూ మార్గములో నడిచారు. క్రిస్మస్ అంటే అది ఒక పండుగ రోజు మాత్రమే కాదు. అది దేవుడు మన ఎదుట ఉంచిన మార్గము. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని యేసు క్రీస్తు అన్నాడు. సంవత్సరములో ఒక రోజు కాదు. మన జీవితములో ప్రతి రోజూ యేసు 

క్రీస్తు మార్గములో మనం నడవాలి. 

నాలుగవదిగా 

the writing of Christmas 

the writing of Christmas 

క్రిస్మస్ లో కనిపించే దేవుని ప్రవచనం 

ఈ జ్ఞానులు యెరూషలేము సమీపము నకు వెళ్ళగానే, ఆ నక్షత్రం వారిని బెత్లెహేము వైపు నడిపిస్తూ ఉంది. ‘ఇదేంటి. యూదుల రాజు యెరూషలేములో పుట్టి ఉండాలి. కానీ ఈ నక్షత్రం బెత్లెహేము వైపు వెళ్తున్నది ఏమిటి?’ అని వారు అనుకొన్నారు. సరాసరి వారు యెరూషలేము లో ఉన్న రాజ భవనం లోకి వెళ్లి అడిగారు. ‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము. ఆయనను పూజించాలని వచ్చాము’ అన్నారు. వారి మాటలు విని హేరోదు రాజు కలవరపడ్డాడు. 

‘యూదుల రాజును నేను కదా? నేను ఉండగా మరొక రాజు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరీ రాజు? యూదుల మత గ్రంథాలు ఆయన గురించి ఏమి చెబుతున్నాయి? అని అడిగాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు మీకా 

వ్రాసిన ప్రవచనం హేరోదు రాజుకు చూపించారు. 

ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా, 

నీవు యూదా ప్రధానులలో ఎంత 

మాత్రమును అల్పమైనదానవు కావు. 

ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు 

అధిపతి నీలో నుండి వచ్చును

                         మీకా 5:2 

రక్షకుడైన క్రీస్తు బెత్లెహేము అనే గ్రామములో జన్మిస్తాడు అని దేవుడు తన ప్రవక్త ద్వారా ముందుగానే తెలియజేశాడు. వ్రాయబడిన ఆ వాక్యం మొదటి క్రిస్మస్ రోజున నెరవేరింది. 

ఎక్కడో నజరేతు లో నివసిస్తున్న యోసేపు, మరియ లు బెత్లెహేము కు వెళ్లారు. అక్కడ ఆమె క్రీస్తు శిశువుకు జన్మ ఇచ్చింది. క్రిస్మస్ యొక్క ప్రత్యేకత అదే. దేవుడు తన ప్రవక్తల చేత రాయించిన ప్రవచనాలు ఆ రోజు నెరవేరాయి. 

ఐదవదిగా the worship of Christmas 

the worship of Christmas 

క్రిస్మస్ లో కనిపించే ఆరాధన 

ఆ జ్ఞానులు ఏమి చేశారో చూడండి. ‘వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై ఇంటి లోనికి వచ్చి, తల్లి యైన మరియను, ఆ శిశువును చూచి, సాగిల పడి, ఆయనను పూజించిరి’ 

                    మత్తయి 2:10-11 

వారు అత్యానందభరితులయ్యారు. యేసు క్రీస్తు శిశువు ఎదుట సాగిలపడ్డారు, ఆయనను ఆరాధించారు. యేసు క్రీస్తు ను చూడాలి అనే ఆశతో వారి ప్రయాణం మొదలయ్యింది. ఆయనను ఆరాధించుటతో వారి ప్రయాణం ముగిసింది. వారి అన్వేషణ ఆరాధనతో ముగిసింది. యేసు క్రీస్తు ప్రభువు ను ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఈ రోజు మీ క్రిస్మస్ ఎలా వుంది? చాలా మంది క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చుకొంటారు, మంచి విందులు చేసుకొంటారు, విహార యాత్రలు చేస్తారు. మంచిదే. అయితే యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించడం మరచిపోతారు. అటువంటి క్రిస్మస్ కి అర్థం  లేదు. 

మొదటి క్రిస్ట్మస్ లో ఆరాధన మనకు కనిపిస్తున్నది. తూర్పు దేశపు జ్ఞానుల వలె మనం 

కూడా యేసు క్రీస్తును ఆరాధించాలి. 

ఆరవదిగా, the Wealth of Christmas 

the Wealth of Christmas 

క్రిస్మస్ లో కనిపించే సంపద 

    తూర్పు దేశపు జ్ఞానులు యేసు క్రీస్తు శిశువును ఆరాధించిన తరువాత తమ పెట్టెలు విప్పి, బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఎంతో విలువైన కానుకలు జ్ఞానులు ప్రభువైన యేసు క్రీస్తుకు సమర్పించారు. 

2 కొరింథీ 8:9 

మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను 

ఎరుగుదురు గదా? ఆయన ధనవంతుడై 

యుండియు మీరు తన దారిద్ర్యము 

వలన ధనవంతులు కావలెనని, 

మీ నిమిత్తము దరిద్రుడాయెను. 

                     2 కొరింథీ 8:9 

యేసు క్రీస్తు ప్రభువు ఎంతో ధనవంతుడు. ఆయన కంటే ధనవంతుడు, ఆయన కంటే ఆస్తిపరుడు ఇంకెవరు లేరు. అయితే ఆయన వాటన్నిటిని ప్రక్కన పెట్టి, చాలా సామాన్యునిగా ఈ భూమి మీదకు వచ్చాడు. 

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు 

యేసు క్రీస్తు నందే గుప్తములై ఉన్నవి  

                             కొలొస్సి 2:3

అని వ్రాశాడు అపొస్తలుడైన పౌలు కొలొస్సి 2:3 స్సయులకు వ్రాసిన పత్రిక లో. 

సమస్త జ్ఞానము, సమస్త సత్యము యేసు క్రీస్తు నందు గుప్తములై ఉన్నవి. 

అదే wealth of christmas. క్రిస్మస్ లో కనిపించే ఐశ్వర్యం అదే. యేసు క్రీస్తు యొద్దకు వచ్చే వారికి దేవుడు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇచ్చాడు. 

చివరిగా, 

the Weeping of Christmas 

the Weeping of Christmas 

క్రిస్మస్ లో కనిపించే కన్నీరు. 

   హేరోదు రాజు కపటముతో ప్రవర్తించాడు. ‘జ్ఞానులారా, క్రీస్తు ను పూజించిన తరువాత నాకు కూడా ఆ సమాచారం పంపండి. నేను కూడా ఆయన దర్శనం చేసుకొంటాను’ అన్నాడు. జ్ఞానులు ఇచ్చిన సమాచారం ప్రకారం క్రీస్తు శిశువును చంపివేయాలి అని 

హేరోదు దుష్ట ప్రణాళిక రచించాడు. దేవుని దూత జ్ఞానులను హేరోదును కలవకుండా ఆపాడు. హేరోదు కు చాలా కోపం వచ్చింది. బేత్లెహేము ప్రాంతములో రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు కల మగపిల్లల నందరిని హేరోదు చంపించాడు. ఎంతో మంది తల్లులకు గర్భ శోకం కలిగించాడు. అధికారం కోసం కన్న బిడ్డలను కూడా చంపించిన చరిత్ర హేరోదు కు ఉంది. 

యెహోవా యందు

భయభక్తులు 

కలిగి ఉండుటయే

 జ్ఞానమునకు మూలము 

              సామెతలు 9:10 

    దేవుని జ్ఞానము దేవుని భయం మనకు కలిగిస్తుంది. హేరోదు కు దేవుని జ్ఞానం లేదు. దేవుని భయం అతని జీవితములో లేదు. ఈ లోక సంబంధమైన అధికారము, 

ఆస్తులు, భవనాలు వాటి మీదే అతను దృష్టి పెట్టాడు. దేవుని దృష్టిలో అతడు పెద్ద అజ్ఞాని. అతడు చేసిన దుర్మార్గము వలన మొదటి క్రిస్మస్ లో రక్తపాతం జరిగింది. 

అనేక మందికి తీరని శోకాన్ని హేరోదు కలిగించాడు. 

రామాలో అంగలార్పు వినబడెను, 

ఏడ్పును, మహా రోదనయు కలిగెను

రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు 

వారు లేనందున ఓదార్పు పొందనొల్లక 

ఉండెను.  మత్తయి 2:17-18 

   హేరోదు చేసిన దుర్మార్గపు పని వలన రాహేలు దుఃఖములో మునిగిపోయింది. ఆమెకు ఓదార్పు లేదు. అయితే రాహేలును ఓదార్చుట యేసు క్రీస్తు కే సాధ్యం. ‘ఏమి క్రిస్మస్ లేవయ్యా? నేను ఎంతో శ్రమల్లో ఉన్నాను?’ అని మీరు అనవచ్చు. యేసు క్రీస్తు ప్రభువు కు ఉన్న ఒక పేరు ‘ఆదరణ కర్త’. ఈ క్రిస్మస్ సమయములో మీరు దుఃఖంలో ఉంటే, మీకు ఆదరణ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీ కన్నీరు తుడవడానికి ఆయన సిద్ధముగా వున్నాడు. 

    తూర్పు దేశపు జ్ఞానుల వలె ఈ క్రిస్మస్ సమయములో మీరు కూడా యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ, ఆనందం, ఆదరణ పొందాలని మా కోరిక. అదే నేటి మా ప్రేమ సందేశము. 

Leave a Reply