ప్రతి రోజూ సంతోషముగా ఎలా ఉండగలను?

Silhouette of a Man jump and rises arms up on a peak. The happiness and excitement of beeing successful. High quality photo

ఆనందకరమైన జీవితానికి 10 సూత్రాలు అనే అంశం ఈ రోజు మనం కొంతసేపు చూద్దాము. నా జీవితములో ఆనందము ఎలా పొందగలను? ప్రతి రోజూ సంతోషముగా ఎలా ఉండగలను? అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాము. 

    మన సమాజములో చాలా మందికి ఆనందం లేదు. డిప్రెషన్ పెరిగిపోతూ ఉంది. ఆత్మ హత్యలు చేసుకొనే వారు పెరిగిపోతున్నారు. వారికి నిరీక్షణ ఎలా దొరుకుతుంది? 

రోమా పత్రిక 15 అధ్యాయము నుండి 13 వచనం చూద్దాము: 

కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు

నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా 

సమస్తానందముతోను సమాధానముతోను

మిమ్మును నింపునుగాక. రోమా 15:13 

దేవుడు సమాధాన కర్త, ఆదరణ కర్త, నిరీక్షణ కర్త. నిరీక్షణ లేకుండా ఎవరూ ఆనందముగా ఉండలేరు. నిరీక్షణ దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఆనందం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. చాలా మంది ఏమనుకొంటారంటే, దేవుని దగ్గర ఎలాంటి ఆనందం, సంతోషం వుండవు. నాకు ఉన్న కాస్త ఆనందం కూడా దేవుడు పాడుచేస్తాడు అనుకొంటారు. అయితే అది తప్పు అభిప్రాయం. దేవుడు సంపూర్ణమైన ఆనందముతో నిండిఉన్నాడు. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య సంపూర్ణమైన ఆనందం ఉంది. తండ్రి, కుమారుడు అంటే తండ్రి కి కుమారుడు పుట్టాడు అని కాదు. అవి ఒక సంబంధాన్ని మనకు తెలియజేస్తున్నాయి. 

    నూతనముగా పుట్టిన బిడ్డ రెండు నెలల వయస్సు నుండి నవ్వటం ప్రారంభిస్తుంది. తల్లి మొహం చూసి ఆ బిడ్డ నవ్వుతుంది. Joy is interpersonal. ఆనందం అనేది వ్యక్తుల మధ్య ఉండేది. దైవిక త్రిత్వం లోని ముగ్గురు వ్యక్తుల మధ్య ఆ ఆనందం మనం చూస్తాము. 

తండ్రి అయిన కుమారుడైన దేవుని వైపు చూసి ఆనందిస్తాడు (మత్తయి 12:18, యెషయా 42:1) 

ఇదిగో ఈయన నా సేవకుడు … 

ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు

                మత్తయి 12:18, యెషయా 42:1

అవి తండ్రి తన కుమారుని గురించి  ఆనందముతో చెప్పిన మాటలు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని వైపు చూసి ఆనందించాడు. (మత్తయి 11:25). కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందించాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకుండా మనం దేవుని ఆనందం పొందలేము. పరిశుద్ధ ఆత్మ అనే పేరు వింటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఆయన వలన నాకు ఆనందం ఉండదు అని చాలా మంది అనుకొంటారు. అయితే పరిశుద్ధ ఆత్మ దేవుని ఆనందము మనకు ఇచ్చేవాడు. (కొలొస్స 1:6). అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

          అపోస్తలులు కార్యములు 13:52 

యేసు ప్రభువు శిష్యులు ఆనంద భరితులుగా జీవించారు. ఎందుకని? వారు పరిశుద్ధాత్మ చేత నిండి ఉన్నారు. ఆ విధముగా దేవుడు సంపూర్ణమైన ఆనందముతో నిండిఉన్నాడు. దేవుడు ఆనందించేవి అనేకం ఉన్నాయి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

                           కీర్తన 37:23 

తన ప్రజలను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు (కీర్తన 5:4) 

​దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? 

వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; 

ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

                    యెహెఙ్కేలు 18:23 

దుష్టులు నాశనం అయిపోవటం చూసి దేవుడు ఆనందించే వాడు కాదు. వారు కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి రక్షించ బడితే ఆయనకు ఆనందం కలుగుతుంది. పీటర్ లొంబార్డ్ గొప్ప క్రైస్తవ వేదాంతి. ఆయన  ఇటలీ దేశములో జన్మించాడు. 12 నుండి 16 శతాబ్దాల వరకు ఆయన వ్రాసిన sentences గ్రంథం గొప్ప కామెంటరీ గా ఉండేది.ఈ Sentences లో 4 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకములో లొంబార్డ్ దైవిక త్రిత్వం గురించి వ్రాశాడు. అందులో ఆయన యేమని వ్రాశాడంటే, దైవిక త్రిత్వము మాత్రమే మానవులకు నిజమైన ఆనందం ఇవ్వగలరు. దేవునికి వెలుపల ఉన్నవన్నీ ఆ ఆనందం వైపు మనలను నడిపించడానికే చేయబడ్డాయి. 

రెండవ పుస్తకములో సృష్టి గురించి వ్రాశాడు. ఇది దేవుడు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము (కీర్తన 118:24). దేవుడు సృష్టించినవి అన్నీ ఆనందము ఇవ్వటానికే సృష్టించబడ్డాయి. మనుష్యులను దుఃఖపరచడానికి, ఏడ్పించడానికి దేవుడు ఒక్కటి కూడా చేయలేదు. దేవుడు చేసిన సృష్టి మొత్తం ఆనందం కొరకే అని పీటర్ లోమ్బార్డ్ అన్నాడు. దేవుడు చేసిన పరలోకం కూడా ఆనందముతో నిండి ఉంది. C.S.Lewis గారు అన్నాడు: 

Joy is the serious business of heaven 

   C.S.Lewis 

పరలోకం యొక్క ఉద్దేశ్యం ఆనందం పంచడానికే. 

   దేవుడు చేసిన దేవదూతలు కూడా ఆనందం పంచే వారిగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవదూతలు ఆనందముతో దేవుని స్తుతించి ఆ శుభవార్తను గొఱ్ఱెల కాపరులకు తెలియజేశారు. యేసు క్రీస్తు ప్రభువు ఆదివారం ఉదయం మరణం నుండి తిరిగి లేచినప్పుడు ఆ శుభవార్తను దేవదూతలు ఆయన సమాధి వద్దకు వెళ్లిన స్త్రీ, పురుషులకు తెలియజేశారు(మత్తయి 28:8).  ఎవరైనా రక్షణ పొందితే దేవదూతలు ఆనందము వ్యక్తం చేస్తారు. (లూకా 15:7). చెరసాలలో నుండి ఒక దేవదూత పేతురు గారిని విడిపించాడు. ఆయనను చూసి ఒక చిన్న పిల్ల ఎంతో సంతోషించింది (అపో కార్య 12:14) ఆ విధముగా దేవుని వ్యక్తిత్వం, దేవుడు చేసిన సృష్టి, దేవుడు చేసిన పరలోకం, దేవదూతలు – వాటన్నిటిలో ఆనందం మనకు కనిపిస్తుంది. 

    ఆనందం రెండు రకాలుగా ఉంది. ప్రకృతి సంబంధమైన ఆనందం, ఆత్మ సంబంధమైన ఆనందం

మొదటిది ప్రకృతి సంబంధమైన ఆనందం.

    ‘నాకు ఆనందం కలిగించేవి చాలా ఉన్నాయి లేవయ్యా. దేవుడు, బైబిల్ నాకు అక్కర లేదు’ అనే వారు ఉన్నారు. అయితే వారు గ్రహించాల్సిందే ఏమిటంటే, వాటన్నిటిని సృష్టించింది దేవుడే. 

చక్కటి సూర్యోదయం, 

పర్వత శిఖరాలు, 

అరణ్యాలు, నదులు, 

చెట్లు, జంతువులు, 

ఆహారం, నీరు 

మీ పిల్లలు, మీ స్నేహితులు 

  • మీకు ఆనందం ఇచ్చేది ఏదయినప్పటికీ అది దేవుని యొద్ద నుండి వచ్చినదే. 

అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6 అధ్యాయములో వ్రాశాడు: 

ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన 

ధనమునందు నమ్మిక యుంచక, సుఖముగా అనుభ వించుటకు

సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే 

నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము.

                    1 తిమోతి 6 :17 

   ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. ఇలాన్ మస్క్ ప్రపంచములో అందరికంటే ధనవంతుడు. ఈ  మధ్యలో ఆయన, ‘నేను పనిలో ఆనందం వెతుక్కొంటాను’ అన్నాడు. పనే మాకు దైవం, పనే మాకు ఆనందం అని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని అనుమతి లేకుండా మీరు ఒక్క రోజు కూడా పనిచేయలేరు. 

  అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ 500 మిలియన్ డాలర్లతో ఒక పెద్ద ప్లెషర్ బోట్ కొనుక్కున్నాడు. ఆ పెద్ద పడవలో వందల మంది సేవకులు వుంటారు. దేవుని అనుమతి లేకుండా ఒక్క రోజు కూడా జెఫ్ బెజోస్ ఆ పడవలో గడపలేడు. చాలా మంది ఏమనుకొంటున్నారు? నేను ఎంజాయ్ చేసేవి చాలా వున్నాయి నాకు దేవుడు అక్కర లేదు. పౌలు ఏమంటున్నాడంటే, అవి అస్థిర మైనవి. ‘సుఖముగా అను వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మిక యుంచుము’ మిమ్మును సుఖపెట్టే ప్రతిదీ, మీరు ఎంజాయ్ చేసే ప్రతి వస్తువు, మిమ్మును సంతోషపెట్టే ప్రతి రిలేషన్ షిప్, దేవుని యొద్ద నుండి వచ్చినదే. 

ప్రకృతి సంబంధమైన ఆనందం ఆత్మ సంబంధమైన ఆనందమునకు ఒక ఛాయగా ఉంది. యేసు క్రీస్తు ప్రభువు చేసిన మొదటి అద్భుతం ఏమిటి? నీటిని ద్రాక్షరసముగా ఆయన మార్చాడు. మనిషి జీవితాన్ని మధురముగా మార్చడానికి, వారికి దేవుని ఆనందం ఇవ్వడానికే ఆయన వచ్చాడు. 

ఒక చల్లటి పానీయం మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మనకు జీవజలం. 

ఒక మంచి విందు భోజనం మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మనకు జీవాహారం. 

మంచి విశ్రాంతి మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మన ఆత్మలకు విశ్రాంతి. 

ఒక మంచి స్నేహితుడు మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు నిజమైన స్నేహితుడు. 

మనకు ఆనందం ఇచ్చే ప్రకృతి సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన కొనసాగింపే యేసు క్రీస్తు. అందుకనే పాత నిబంధనలో కూడా యేసు క్రీస్తు సాదృశ్యాలు చాలా ఆనందకరమైనవి మనకు కనిపిస్తాయి. 

    ఉదాహరణకు పస్కా పండుగ లో ఒక మంచి విందు మనం చూస్తున్నాము. అది యేసు క్రీస్తుకు సాదృశ్యం. 

-ద్రాక్ష రస పాత్ర దేవుని ఆనందముకు గుర్తుగా ఉంది. అది యేసు క్రీస్తుకు సాదృశ్యం. 

-ఇశ్రాయేలీయులు దేవుడు పెట్టిన ఎన్నో పండుగలు ఆనందముతో చేసుకొనేవారు. అవన్నీ యేసు క్రీస్తును సూచిస్తున్నాయి. 

-అరణ్యములో వారి దాహం తీర్చడానికి దేవుడు వారి యొద్దకు మధురమైన నీటిని ఒక నదిగా పారించాడు. ఆ నది యేసు క్రీస్తుకు చిహ్నముగా ఉంది. 

-వారికి ఆకలి వేసినప్పుడు దేవుడు మన్నా ను వారి మీద కురిపించాడు. అది వారి ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టింది. ఆ మన్నా కూడా క్రీస్తుకు సాదృశ్యమే. 

   ప్రకృతి సంబంధమైన వాటితో ఆగిపోవద్దు. దేవుడు ఇచ్చే ఆత్మ సంభందమైన ఆనందం కూడా మనం పొందాలని దేవుని ఉద్దేశ్యం. ఈ ప్రకృతి సంబంధమైన ఆనందం దేవుడు అందరికీ ఇచ్చాడు. రెండవది ఆత్మ సంబంధమైన ఆనందం. ఈ ఆనందం మీకు కావాలంటే మీరు యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు రావాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆనందం ఎలా ఉంటుంది? దాని గురించి బైబిల్ ఏమి చెబుతుందో మనం చూద్దాము. 

Joy & Perspective 

మొదటిగా Joy & Perspective 

ఆనందకరమైన జీవితానికి ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. మీ జీవితము మీద మీకు ఒక దృక్పథం ఉండాలి. యేసు క్రీస్తు సజీవుడై లేచిన తరువాత, ఆయన ఖాళీ సమాధి చూసిన తరువాత ఆయన అనుచరుల యొక్క జీవిత దృక్పథం కొన్ని క్షణాల్లో మారిపోయింది. మా రక్షకుడు సజీవుడు అని వారికి అర్థం అయిన తరువాత వారికి చెప్పలేనంత ఆనందం కలిగింది. దేవుని సత్యము మనకు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వదు. మన జీవితాలకు అది అర్థం, పరిపూర్ణత, ఆనందం ఇస్తుంది. ఫిలాసఫర్ లు సత్యానికి మూడు కోణాలు ఉంటాయి అంటారు. 

Logical Consistency 

Factual Sufficiency 

Existential Relevance 

మొదటిగా సత్యానికి Logical Consistency ఉండాలి. అది హేతుబద్ధముగా ఉండాలి. 

రెండవదిగా Factual Sufficiency ఉండాలి. అంటే దానికి వాస్తవిక ఆధారాలు ఉండాలి. 

మూడవదిగా existential relevance. వ్యక్తిగతముగా సత్యం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశం కూడా ముఖ్యం. 

   యేసు క్రీస్తు ఖాళీ సమాధి చూసిన తరువాత శిష్యులకు ఆ మూడూ లభించాయి. మొదటిగా  Logical Consistency. యేసు క్రీస్తు చెప్పిన మాటలు  ఆయన ఖాళీ సమాధి చూసిన తరువాత వారికి హేతుబద్ధముగా అనిపించాయి. నేను అది, ఇది నేను అంత, ఇంత అని ఈ యేసు క్రీస్తు చాలా మాటలు చెప్పాడు. ఏమో అనుకొన్నాము. ఈయన సామాన్యుడు కాదు. మరణం జయించి మాట నిలబెట్టుకున్నాడు అని వారికి అర్థం అయ్యింది. 

రెండవదిగా Factual Sufficiency. యేసు క్రీస్తు ఖాళీ సమాధి వారు చూసారు. ఆయన తిరిగి లేచాడు అనడానికి అనేక వాస్తవిక ఆధారాలు వారు చూశారు. సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువు వారితో కలిసి నడిచాడు. వారితో మాట్లాడాడు. వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. వారితో సహవాసం చేశాడు. వారితో కలిసి ఆయన భుజించాడు. ఆయన సజీవుడు అనడానికి స్పష్టమైన ఆధారాలు వారు చూశారు. 

మూడవదిగా Existential Relevance. యేసు క్రీస్తు సజీవుడు అనే సత్యము వారిని వ్యక్తిగతముగా ప్రభావితం చేసింది. పేతురు అబద్దాలు చెప్పి పారిపోయిన వాడు. 

అలాంటి వాడు ఇప్పుడు ధైర్యముతో ఆనందముతో జీవిస్తున్నాడు. మరియ దెయ్యాలు పట్టి చీకటిలో బ్రతుకుతున్న స్త్రీ. ఇప్పుడు ఆమె సాతానును జయించింది. ఇప్పుడు దేవుని వెలుగులో, ఆనందంలో జీవించింది. ఎవ్వరూ మీ యొద్ద నుండి తీసివేయలేని ఆనందం మీకు ఇస్తాను అని యేసు ప్రభువు వారికి వాగ్దానం చేశాడు. (యోహాను 16:22) మరణము నుండి తిరిగి లేచి ఆయన ఆ మాట నెరవేర్చాడు. ఆనందము మీ జీవితములో ఉండాలంటే మీకు సజీవుడైన క్రీస్తు ఇచ్చే జీవిత దృక్పధం ఉండాలి. 

రోమా పత్రిక 15 అధ్యాయము నుండి 13 వచనం మరొకసారి చూద్దాము. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా, సమస్తానందముతోనుసమాధానముతోను మిమ్మును నింపునుగాక.

నిరీక్షణ కర్త అగు దేవుడు మిమ్మును సమస్త ఆనందముతో నింపును. నిరీక్షణ లేకుండా ఎవరూ ఆనందముతో జీవించలేరు. దేవుడు ఇచ్చే నిరీక్షణ మనం పొందినప్పుడు జీవిత దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మన హృదయాలకు ఆనందం కలుగుతుంది. 

   యేసు క్రీస్తు సమాధిని చూద్దాము అని కొంత మంది స్త్రీలు ఆయన సమాధి యొద్దకు వెళ్లారు. దేవదూత వారితో యేమని చెప్పాడు? ‘ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు’ ఆ మాట విని ఆ మహిళలకు, ఆ తరువాత యేసు క్రీస్తు శిష్యులకు మహా ఆనందం కలిగింది (మత్తయి 28:8)

కొద్ది క్షణాల్లో వారి జీవిత దృక్పధం మారిపోయింది. నిరీక్షణ లేకుండా అక్కడకు వెళ్లారు. నిరీక్షణతో అక్కడ నుండి వెళ్లారు. దిగులుతో అక్కడకు వెళ్లారు. ఆనందముతో అక్కడ నుండి వెళ్లారు. కారణం ఏమిటంటే, మా రక్షకుడు సజీవుడు అని వారికి అర్థం అయ్యింది. వారు రక్షణ పొందారు. ఆ రక్షణ వలన మాకు ‘చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముతో కూడిన ఆనందం కలిగింది అని పేతురు గారు వ్రాశాడు (1 పేతురు 1:9-10). సజీవుడైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చి, మహిమాయుక్తమైన సంతోషం మనకు ఇచ్చాడు. 

   నిరీక్షణ కలిగిన వారై సంతోషించండి అని పౌలు వ్రాశాడు (రోమా 12:12) యెహోవాయందు నేను హర్షించుదును, ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును

                                   కీర్తన 35:9 

మన సంతోషానికి ప్రథమ కారణం దేవుడు మనకు ఇచ్చిన రక్షణే. ఆ తరువాత 

Joy & Purpose

   ఆనందకరమైన జీవితం మీకు కావాలంటే ఒక పర్పస్ ఉండాలి. మీ ముందు ఒక లక్ష్యం ఉండాలి. తన ప్రజలకు ఆనందం ఇవ్వాలి అనే లక్ష్యం దేవునికి ఉంది (యెషయా 35:10) 

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12 అధ్యాయము లో ఒక మాట చూద్దాము: 

మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును

 విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన 

యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో 

పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై 

అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

    హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12:1-2

   ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై…. యేసు క్రీస్తు ప్రభువు ఈ రోజు ఎంతో ఆనందముతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక లక్ష్యముతో జీవించాడు. ఆ లక్ష్యం సాధించడానికి ఆయన అవమానాలు భరించాడు, సిలువ సహించాడు, దేవుని సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యాడు. ఒక లక్ష్యముతో పనిచేశాడు కాబట్టే ఆయనకు ఆనందం దొరికింది. 

   అపోస్తలుడు ఇక్కడ మనతో  ఏమి చెబుతున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభువు వైపు చూడండి. ఆయన ఒక లక్ష్యముతో పనిచేశాడు. సిలువను సహించాడు. ఇప్పుడు పరలోకములో దేవుని సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. మీ జీవితములో ఆనందము ఉండాలంటే ప్రతి రోజూ, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం యేసు క్రీస్తు ప్రభువును చూడండి. 

   మత్తయి 13 లో ఒక మనుష్యుడు పొలములో ధనమును చూసాడు. ఆ ధనం చూసినప్పుడు అతనికి ఎంతో సంతోషం కలిగింది. అతడు ఏమిచేశాడంటే తనకు కలిగినవన్నీ అమ్మివేసి ఆ పొలం కొనుకొన్నాడు. నాకు ఆ పొలం కావాలి అనే లక్ష్యముతో అతడు జీవించాడు. ఆనందము కావాలంటే పరలోక రాజ్యం మీ లక్ష్యముగా ఉండాలి. 

మూడవదిగా, 

Joy  & Peace 

ఆనందం కావాలంటే మనకు శాంతి ఉండాలి. మనకు సమాధానం ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు సజీవుడై తిరిగి లేచిన తరువాత మన శిష్యులకు ప్రత్యక్షమై వారితో చెప్పిన మొదటి మాట ఏమిటి? 

మీకు సమాధానము కలుగును గాక. 

              లూకా 24:36-53

అప్పుడు వారికి మహా ఆనందం కలిగింది. సంతోషము పట్టలేకపోయారు. 

(లూకా 24:36-53). 

దేవుడు ముందు మనకు శాంతి ఇస్తాడు. ఆ శాంతిలో నుండే మనకు సంతోషం కలుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువు సిలువ దగ్గర మన పాపములు కొట్టివేయబడ్డాయి. 

ఆ సత్యము మనం గ్రహించాలి. అప్పుడే మనకు శాంతి దొరుకుతుంది. దేవుడు ఒక్క పాపం క్షమించకపోయినా మనకు శాంతి ఉండదు. మన సమస్త పాపాలు యేసు క్రీస్తు 

సిలువ మీద కొట్టివేశాడు. అందువలనే మనకు శాంతి కలిగింది. ఆ శాంతి పొందినప్పుడే మనకు సంతోషం కలుగుతుంది. ఇంగ్లీష్ లో ఒక చక్కటి పాట ఉంది. 

O what a wonderful, wonderful day – 

Day I will never forget 

After I’d wandered in darkness away, 

Jesus my Savior I met 

O what a tender, compassionate friend 

He met the need of my heart, 

Shadows dispelling, 

With joy I am telling, 

He made all the darkness depart! 

Heaven came down and glory filled my soul 

When at the cross the Savior made me whole 

My sins were washed away, and 

my night was turned to day. 

అయితే ఆత్మ ఫలమేమనగా,ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము,  విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22 

దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.రోమా 14:17 

శాంతి, ఆనందము – ఈ రెండూ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కానుకలే. ఆనందము ఉండాలంటే మనకు శాంతి, సమాధానం ఉండాలి. శాంతి లేకుండా ఏ ఒక్కరికీ ఆనందం ఉండదు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ దగ్గర ప్రతి మనిషికీ శాంతి లభిస్తుంది. ఆయన రక్తము వలన మన యొక్క ప్రతి పాపం దేవుడు క్షమించివేశాడు. పాప క్షమాపణ పొందిన వ్యక్తి మాత్రమే దేవుని సమాధానం పొందగలడు. దేవుని సమాధానం పొందిన వ్యక్తి మాత్రమే దేవుని ఆనందం పొందగలడు. 

 Joy & Precepts

నాలుగవదిగా Joy & Precepts 

మీకు ఆనందము కలగాలంటే మీరు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. మొదటి కీర్తనలో మనం చదువుతాము. 

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము 

దానిని ధ్యానించువాడు ధన్యుడు.అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన

కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును.

                     కీర్తన 1:1-3 

దేవుని వాక్యం నందు ఆనందించే వ్యక్తి ఒక మంచి చెట్టు వలె ఎదుగుతాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అన్నాడు. “ A Bible that is falling apart usually belongs to someone who is not”. నీ చేతుల్లో బైబిల్ బాగా నలిగితే, మీ జీవితం నలుగదు. అతని ఆనందము ప్రపంచ పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. 

యిర్మీయా ప్రవక్త ఏమన్నాడు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి.

                  యిర్మీయా 15:16 

దేవుని వాక్యమును మంచి భోజనాన్ని ఆశించినట్లుగా ఆయన ఆశించాడు. దేవుని వాక్యము ఆయనకు సంతోషము, ఆనందం కలిగించింది. ఆయన పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఇశ్రాయేలు దేశము చిన్నాభిన్నము గా ఉంది. రేపో, మాపో శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది అనే పరిస్థితిలో ఉంది. దేశమంతా తీవ్రమైన నిరాశ, నిస్పృహలు, నైరాశ్యం ఆవహించి ఉన్నాయి. అయినప్పటికీ యిర్మీయా దేవుని సంతోషం తో జీవించాడు ఎందుకంటే ఆయన దేవుని వాక్యము ను తన ఎదుట ఎప్పుడూ ఉంచుకొన్నాడు. (మరికొన్ని వచనాలు: రోమా 7:22, కీర్తన 119:16)

Joy & Power

ఆనందము మన జీవితములో ఉండాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ఉండాలి. 

   కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.రోమా 15:13 

   పరిశుద్ధాత్మ శక్తి వలన విస్తారమైన నిరీక్షణ మనకు కలుగుతుంది. అప్పుడే దేవుని ఆనందం, సమాధానం మనలను నింపుతాయి. నెహెమ్యా పర్షియా దేశములో రాజైన అర్తహషస్త ముందు సేవ చేస్తున్నాడు. యెరూషలేము గోడలు కూలిపోయాయి, అది చాలా దైన్య స్థితిలో వుంది అని ఆయనకు తెలిసింది. యెరూషలేము గోడలు తిరిగి కట్టాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన రాజు అనుమతి తీసుకొని యెరూషలేము వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రజలను పురికొల్పాడు. అతని శత్రువులు అతనికి తల నొప్పి కలిగించారు. అతని పనికి ఆటంకం కలిగించారు. నీ వల్ల ఏమవుతుంది? అని ఆయనను ఎగతాళి చేశారు. నెహెమ్యా ప్రజలతో ఏమన్నాడంటే, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు. 

నెహెమ్యా 8:10 

The Joy of the Lord is your strength. 

ఇశ్రాయేలీయులు పడిపోయిన యెరూషలేము గోడలు కట్టాలి అని నిర్ణయించుకొన్నారు. అయితే వారి శత్రువులు వారికి అనేక ఆటంకాలు కలుగజేశారు. వారి పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలందరూ ఏడుస్తున్నారు. వారు నీరసించిపోయారు. నెహెమ్యా వారితో ఒక మాట అన్నాడు. యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలము పొందుతారు. (నెహెమ్యా 8:10) 

   దేవుని ఆనందమే విశ్వాసికి శక్తి. విశ్వాసికి శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్ముడు కాబట్టి ఆనందము కావాలంటే మనకు పరిశుద్ధాత్మ అవసరం. రోమా 15:13 లో ఇంతకు ముందు మనం చూశాము. 

రోమా 15:13

మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక

   పరిశుద్ధాత్మ శక్తి వలన విస్తారమైన నిరీక్షణ మనకు కలుగుతుంది. అందులో నుండే మనకు ఆనందము వస్తుంది. అపోస్తలులను చూడండి. పెంతెకోస్తు దినము రోజున పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చాడు. ఆ రోజు నుండి వారి జీవితములో ఒక్క రోజు కూడా వారు నిరీక్షణ, ఆనందము లేకుండా వారు బ్రతకలేదు. 

లూకా 10:17

ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పారు. పరిశుద్ధాత్మ శక్తి వలన వారికి సంతోషం కలిగింది. 

Joy & Prayer 

   మన జీవితములో ఆనందము ఉండాలంటే కావలసిన మరొకటి ప్రార్థన. ఆనందకరమైన జీవితానికి మరొక రహస్యం ప్రార్థన. మన ఆనందము పాడుచేసిది ఆందోళన. ఆందోళనకు విరుగుడు ప్రార్ధన. ఆందోళన తక్కువగా ఉండాలి అంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు: 

మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

         యోహాను 16:24 

యేసు ప్రభువు తన శిష్యులతో ఆ మాట అన్నాడు. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. యోహాను సువార్త 16:24 

    యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యుల యొద్ద నుండి పరలోకం వెళ్లిపోయే సమయం దగ్గరపడింది. ఆయన శిష్యులు దిగులుతో ఉన్నారు. అప్పటి వరకు వారు ఆయన పేరు మీద దేవుని ఏమీ అడుగలేదు. యేసు ప్రభువు వారితో ఒక మాట అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకును. దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబులు ఇచ్చినప్పుడు మనకు ఆనందము కలుగుతుంది. 

మన జీవితములో ఆనందము ఉండాలంటే మనం దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తూ జవాబులు పొందుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప ప్రార్థనా వీరుడు. 

  మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచున్నాను.     ఫిలిప్పి 1:5 

ప్రార్థన, దాని ఫలితాలు ఆయన అనుభవించి ఎంతో సంతోషించాడు. ప్రార్థన లేని జీవితములో దేవుని ఆనందం ఉండదు. 

Joy & Purity 

ఆనందము కావాలి అంటే మనకు ఉండవలసిన మరొకటి పరిశుద్ధత. సాతానుడు చెప్పే పెద్ద అబద్ధాల్లో ఒకటి – ‘పరిశుద్ధత లో ఆనందము లేదు. పాపము చేస్తూ ఉండు. ఆనందము గా ఉంటావు’. అయితే విశ్వాసికి పాపము ఎప్పుడూ ఆనందం ఇవ్వలేదు. పాపము దేవుని ఆనందమును పాడుచేస్తుంది. దావీదును చూడండి. ఆయన ఒక రోజు బేత్షెబ ను మోహించాడు. ఆమె ఒక వివాహిత అని దావీదు రాజుకు తెలిసింది. అయితే నాకేంటి? ఆమెను నా దగ్గరకు తీసుకు రండి అన్నాడు. ఆమెతో పాపం చేశాడు. ఆమె భర్త అడ్డు వస్తాడు అనుకొని ఆమె భర్తను కూడా క్రూరమైన రీతిలో హత్య చేయించాడు. దావీదు తన జీవితములో ని ఆనందం పూర్తిగా కోల్పోయాడు. అప్పటి వరకు అతనికి ఉన్న ఆనందం ఒక్క సారిగా ఆవిరై పోయింది. 

కీర్తన 51:12 

నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము అని దావీదు దేవుని సన్నిధిలో మొఱ్ఱ పెట్టాడు. అతని ఆత్మ రోదన అక్కడ మనకు కనిపిస్తుంది. 

కీర్తన 16 లో దావీదు వ్రాశాడు 

నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు

          కీర్తన 16:11 

దేవుని సంతోషం అనుభవించిన దావీదు దానిని కోల్పోయినప్పుడు ఎంతో వేదన చెందాడు. అది 51 కీర్తన లో మనకు కనిపిస్తుంది. యోసేపు ఐగుప్తు దేశములో పోతీఫెర ఇంటిలో ఉన్నాడు. పోతీఫెర భార్య యోసేపు మీద కన్ను వేసింది. తనతో పండుకోమని యోసేపు ను ఆమె పదే పదే అడిగింది. యోసేపు ఆమె ను తిరస్కరించాడు. అలాంటి పాపము నేను చేయలేను అని ఆమెకు తెగేసి చెప్పాడు. ఆమె అతని మీద కోపం పెట్టుకొంది. అతని మీద లేని నేరాలు మోపి యోసేపు జైలుకు వెళ్ళేటట్టు చేసింది. అయితే యోసేపు హృదయము కల్మషం లేకుండా ఉంది. అతడు జైలులో ఉన్నప్పటికీ దేవుని ఆనందము అతని హృదయములో ఉంది. దావీదు అంతః పురములో ఉన్నాడు, కానీ అతనికి ఆనందం లేదు. యోసేపు జైలులో ఉన్నాడు. 

కానీ దేవుడు అతనికి ఆనందం కలుగజేసాడు. దేవుని పరిశుద్ధులు ఎక్కడ ఉన్న సరే వారు దేవుని ఆనందం కలిగి వుంటారు. రోమన్ చక్రవర్తి నీరో గొప్ప ప్యాలస్ లో వున్నాడు. కానీ అతనికి ఆనందం లేదు. నీరో అపోస్తలుడైన పౌలును జైలులో పెట్టి వేధించాడు. కానీ పౌలు జైలులో కూడా  దేవుని ఆనందముతో గడిపాడు. 

    బబులోను రాజు దానియేలు ను సింహపు బోనులో త్రోయించాడు. సింహముల మధ్య కూడా దానియేలు దేవుని ఆనందముతో గడిపాడు. బబులోను రాజు అంతఃపురంలో ఉన్నాడనే కానీ ఆయనకు ఆనందం లేదు. నిద్ర కూడా పట్టక తెల్లారేసరికి పిచ్చిపట్టినట్లుగా తయారయ్యాడు. దావీదు కు, యోసేపు కు మధ్య ఉన్న తేడా ఏమిటంటే పరిశుద్ధత. పీటర్ లోమ్బార్డ్ sentences 4 వాళ్యూమ్ లో virtues గురించి వివరించాడు. పరిశుద్ధత నేర్చుకొంటే మనం దైవిక త్రిత్వానికి సన్నిహితముగా ఉంటాము. అప్పుడు మనకు దేవుని ఆనందం కలుగుతుంది. దైవిక సాన్నిహిత్యం విశ్వాసికి గొప్ప ఆనందం కలుగ జేస్తుంది. 

నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును.

                 సామెతలు 10:28 

రోమా 14:17 

దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. దేవుని నీతి, ఆనందము ఈ రెండూ కలిసి వెళ్లడం ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. 

Joy & Pain 

ఆ తరువాత Joy & Pain 

నేను శ్రమ పడుతున్నాను నా పరిస్థితి ఏమిటి? అని మీరు అడుగవచ్చు. బాధ లో ఉన్న వారు ఆనందముగా ఉండగలరా? అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా సంతోషముగానే వుంటారు. అయితే దేవుడు ఇచ్చే ఆనందం పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ప్రభువైన యేసు క్రీస్తు, అపోస్తలుడైన పౌలు గారు ఇద్దరూ ఆ సత్యం మనకు స్పష్టముగా బోధించారు. మొదటిగా యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన మాట చూడండి. 

అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.

                   యోహాను 16:22 

ఎవరూ మీ యొద్ద నుండి తీసివేయలేని సంతోషం నేను మీకు ఇస్తాను. 

ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు వ్రాశాడు. 

ఎల్లప్పుడును ప్రభువునందు

ఆనందించుడి,

మరల చెప్పుదును ఆనందించుడి.

                 ఫిలిప్పీ 4:4 

    ఎల్లప్పుడూ అనే మాట మనం గమనించాలి. అప్పుడప్పుడూ ఆనందిస్తూ వుండండి. ఆరోగ్యము ఉన్నప్పుడూ ఆనందించండి. డబ్బులు బాగా ఉన్నప్పుడు ఆనందించండి. ఉద్యోగం వున్నప్పుడు ఆనందించండి. కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు ఆనందించండి. అని ఆయన వ్రాయలేదు. 

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి అని వ్రాశాడు. అంటే అన్ని సందర్భాల్లో. అన్ని పరిస్తితుల్లో మీరు దేవుని యందు ఆనందించవచ్చు. శరీర సంబంధమైన బాధలో కూడా దేవుని యందు ఆనందించిన వ్యక్తి యోబు. 

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

              యోబు 19:25 

   యోబు శరీరమంతా పుండ్లు, చెప్పలేనంత వేదనలో ఉన్నాడు. అయినప్పటికీ అతనికి దేవుని యందు నిరీక్షణ నిలిచే ఉంది. ఆ నిరీక్షణ అతనికి ఆనందం ఇచ్చింది. అతడు నవ్వుతూ మనకు కనిపించక పోవచ్చు కానీ అతని హృదయములో దేవుని ఆనందం వుంది. 

   మన ఆరోగ్యం బాగున్నప్పటికీ మన బాహ్య పరిస్థితులు పాడైపోయి మనకు బాధ కలిగించవచ్చు. హబక్కూకు ప్రవక్త అటువంటి బాధ అనుభవించాడు. 

ఆయన మాటలు వినండి. 

అంజూరపు చెట్లు పూయకుండినను

ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను 

ఒలీవచెట్లు కాపులేకయుండినను

చేనిలోని పైరు పంటకు రాకపోయినను 

గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను

సాలలో పశువులు లేకపోయినను

నేను యెహోవాయందు 

ఆనందించెదను నా రక్షణకర్తయైన

నా దేవునియందు 

నేను సంతో షించెదను.

            హబక్కూకు 3:17-18 

హబక్కూకు ప్రవక్త తన పంటలు పండకపోయినా, తన ఆస్తులు కరిగిపోయినప్పటికీ దేవుని యందు ఆనందించాడు. క్రైస్తవ విశ్వాసి శ్రమలను సహించడమే కాకుండా వాటినుండి తన జీవితానికి ఆశీర్వాదకరమైన దేవుని పాఠాలు నేర్చుకొంటాడు. 

మొదటిగా విశ్వాసికి శ్రమల్లో వున్నప్పుడు దేవుని సన్నిధి మెండుగా లభిస్తుంది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.

                   కీర్తన 94:19 

ఆ దేవుని సన్నిధి మనకు ఆనందం కలిగిస్తుంది. యాకోబు గారు ఏమని వ్రాసాడు? 

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష 

ఓర్పును పుట్టించునని యెరిగి,మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

                  యాకోబు 1:2-3

   దేవుని ఆనందము కావాలంటే ఓర్పు కావాలి. ఓర్పు కావాలంటే శ్రమలు పడాల్సిందే. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును కలిగిస్తుంది కాబట్టి శ్రమల్లో కూడా మహానందం పొందండి అని యాకోబు వ్రాశాడు. మన బాధలను కూడా దేవుడు మనకు ఆత్మీయ మేలులు చేయడానికి ఉపయోగిస్తాడు. మన బాధలను మనకు ఓర్పు, సహనం నేర్పించడానికి దేవుడు వాడుకొంటాడు. దానిని బట్టి మీరు ఆనందించండి అని యాకోబు గారు వ్రాశాడు. 

దానికి మంచి ఉదాహరణ యేసు క్రీస్తే. ఆయన సిలువ శ్రమలు ఎంతో బాధాకరమైనవి. అయితే వాటిలో నుండి ఆయన విధేయతను, ఓర్పును, సహనాన్ని నేర్చుకొన్నాడు. అవి ఆయనకు శాశ్వతమైన ఆనందం కలిగించాయి. ఆయనకు మాత్రమే కాకుండా మనకు కూడా ఆయన శ్రమల వలన దేవుని ఆనందం దొరికింది. యేసు క్రీస్తు ప్రభువు సిలువ దగ్గరపడినప్పుడు శిష్యులు ఎంతో దుఃఖపడ్డారు. అయితే సిలువ శ్రమ దుఃఖానికి కారణం కాకుండా మన ఆనందానికి కారణం అయ్యింది. 

   మన ఆనందానికి పునాది యేసు క్రీస్తు సిలువే. యేసు క్రీస్తు ప్రభువు పడిన శ్రమల్లో నుండి మనకు దేవుని ఆనందం దొరికింది. శ్రమలను దేవుడు వృథా చేయడు అనే సత్యం సిలువ దగ్గర మనము నేర్చుకొంటున్నాము. మన శ్రమలను కూడా దేవుడు వృథా చేయడు. వాటిలో నుండి మనకు ఓర్పు, ధైర్యం, విశ్వాసం, ఆనందం ఆయన మనకు కలిగిస్తాడు. 

    యేసు ప్రభువు వారితో అన్నాడు. మిమ్మును మరల చూచెదను, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.యేసు క్రీస్తు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది. దానిని ఎవరూ మన యొద్దనుండి తీసివేయలేరు. విశ్వాసి శ్రమల్లో కూడా ఆనందముతో గడుపవచ్చు ఎందుకంటే యేసు క్రీస్తును పోలి నడుచుకోవడానికి శ్రమలు మనకు మంచి అవకాశాన్ని కలిగిస్తాయి. 

Joy & People 

ఆ తరువాత Joy & People 

ఆనందము మనకు కావాలంటే మనం ఇతరులను గూర్చి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తే మనకు దేవుని ఆనందం కలుగుతుంది. ఈ మధ్యలో నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను. అక్కడ పని చేస్తున్న వ్యక్తి ఎలా ఉన్నారు? అని నన్ను అడిగింది. నేను మీకు తెలుసా అని ఆమెను అడిగాను. ఆమె ఏమందంటే, చాలా కాలం క్రితం నీ హాస్పిటల్ కి వచ్చాను. నాకు వచ్చిన జబ్బు కాన్సర్ అని నీవు నాకు చెప్పావు. అప్పుడు నీవు నాకు ఇచ్చిన సలహా వలన నా ప్రాణాలు నిలిచాయి. చాలా వందనాలు అని ఆమె చెప్పింది. ఆమె మాటలు నాకు సంతోషం ఇచ్చాయి. 

మనం చేసే పనుల వలన ఇతరులకు ప్రయోజనం కలిగించి దేవుడు మన హృదయాలకు ఆనందం ఇస్తాడు. బైబిల్ లో ఈ సత్యం మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. 

   అపోస్తలులు ఇతరులకు సహాయం చేసి దేవుని సంతోషం పొందారు. మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. 2 కొరింథీ 1:24 

helpers of your joy. 

    అది ఎంతో చక్కటి మాట. ఇతరుల ఆనందానికి మేము సహకారులము అని అపోస్తలుడు ఇక్కడ వ్రాశాడు. పీటర్ లోమ్బార్డ్ తన గ్రంథం సెంటెన్సెస్ లో మూడో volume లో ఈ విషయం ప్రస్తావించాడు. ఇతరులకు ఆనందం పంచడానికి దేవుడు స్త్రీ, పురుషులను వాడుకొంటాడు. అపోస్తలులు ఇతరులను చూసి ఆనందించారు. 

నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

                       3 యోహాను 1:4

    నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంటే నాకు సంతోషం కలుగుతుంది అని యోహాను ఇక్కడ అంటున్నాడు. అన్నిటి కంటే ముఖ్యమైనది సత్యములో నడవడం. ఈ లోకములో మనకు అనేక అనుభవాలు వస్తాయి. అనేక రకాలైన మనుష్యులను మనం కలుస్తాయి. అనేక రకాలైన ఆలోచనలు మనము వింటాం. అనేక రకాలైన శ్రమలు వస్తాయి. అనేక రకాలైన శోధనలు వస్తాయి. అనేక రకాలైన అబద్ద బోధలు మనం వింటాం. వీటన్నిటిలో మనలను ముందుకు నడిపించేది ఏమిటంటే దేవుని సత్యమే. దేవుని సత్యము లేని వ్యక్తికి దేవుని ఆనందం ఉండదు. అందుకనే సత్యములో నడుచుకోవడమే నాకు ఆనందం అని యోహాను ఇక్కడ అంటున్నాడు. 

    మా ఫాథర్ ఒక మాట అంటూ ఉండేవాడు. ఆనందము నీకు కావాలంటే JOY అనే మాట గుర్తుపెట్టుకో. 

J అంటే Jesus, యేసు క్రీస్తు 

O అంటే others, ఇతరులు 

Y అంటే you, నీవు 

ముందు క్రీస్తు, తరువాత ఇతరులు చివరిగా నువ్వు … ఆ ఆర్డర్ లో వెళ్తే నీకు ఆనందం కలుగుతుంది. ఈ ప్రపంచం బోధించేది అది కాదు. నీకు ఆనందం కావాలంటే ముందు నీ గురించి ఆలోచించుకో. ప్రపంచం ఎలా పోతే నీకెందుకు అంటుంది. అయితే బైబిల్ బోధించేది అది కాదు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు కు  తన జీవితములో మొదటి స్థానం ఇచ్చాడు. రెండవ స్థానం ఇతరులకు ఇచ్చాడు. తన గురించి చివరిగా ఆలోచించాడు.  ఇతరులను తన ఆనందముగా భావించాడు. వారికి సేవ చేశాడు. వారి అవసరాలు తీర్చడానికి ఆయన ఎంతో శ్రమించాడు. 

1 థెస్సలొనీయక పత్రికలో ఆయన వ్రాసాడు

ఏలయనగా మా నిరీక్షణయైనను 

ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? 

మన ప్రభువైన యేసుయొక్క రాకడ

 సమయమున ఆయన యెదుట మీరే గదా.

నిశ్చయముగా మీరే మా 

మహిమయు ఆనందమునై యున్నారు.

         1 థెస్సలొనీయక 2:19-20

నా ఆనందం మీరే అని పౌలు ఇక్కడ అంటున్నాడు. మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున…. ఆ మాటలు మీరు గమనించండి. మీకు ఆనందం కలుగాలంటే, ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కొరకు మీరు ఎదురుచూడాలి. పౌలు ఆనందానికి కారణం అదే. ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కొరకు ఆయన ఎదురు చూశాడు. ఆ రాకడ సమయములో దేవుని ప్రజలే నాకు ఆనందం అని ఆయన అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ ను దృష్టిలో పెట్టుకొని నమ్మకముగా సేవ చేసే వారికి దేవుడు గొప్ప ఆనందమును వాగ్దానం చేశాడు. 

మత్తయి సువార్త 25 లో మనం చదువుతాము. ఒక దాసుడు ఎంతో నమ్మకముగా దేవునికి సేవ చేశాడు. యజమానుడు ఆ దాసునితో ఏ మన్నాడు? 

భళా, నమ్మక మైన మంచి దాసుడా, 

నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి,

 నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, 

నీ యజమానుని సంతోషములో 

పాలుపొందుము మత్తయి 25:21 

పౌలు ఇతరులకు సేవ చేసి ఆనందం పొందాడు. అయితే అది వన్ వే కాదు. ఇతరులు కూడా ఆయనకు ఎంతో సేవ చేశారు. అది కూడా ఆయనకు ఆనందం కలిగించింది. ఫిలేమోను కు పౌలు ఒక మాట వ్రాశాడు. 

సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు

నీ మూలముగా విశ్రాంతి పొందినందున

నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన 

ఆనందమును ఆదరణయు కలిగెను.

         ఫిలేమోను 1:7 

ఫిలేమోను ఎంతో ధనవంతుడు. కొలొస్సయి అనే ఊరిలో ఆయన వున్నాడు. ఆయనకు పెద్ద ఇల్లు ఉంది. ఆయన ఇంట్లోనే ఆ క్రైస్తవ సంఘం మీటింగ్ లు పెట్టుకొంటూ ఉంది. ఆయన అపోస్తలుడు కాదు, బోధకుడు కాదు, కాపరి కాదు. అయితే ఆయన తన ప్రేమతో అనేక మందికి ఉపకారం చేస్తూ ఉన్నాడు. పౌలు ఆయనతో ఏమంటున్నాడంటే, ‘ఫిలేమోను, నీ ప్రేమ వలన నా హృదయమునకు విశేషమైన ఆనందం, ఆదరణ కలిగినవి.’ ఆ విధముగా ఇతరులకు సేవ చేసే వారికి, 

చేయించుకునే వారికి దేవుడు ఆనందం కలిగిస్తున్నాడు. 

   ఈ మధ్యలో ఒక సైంటిఫిక్ స్టడీ లో తేలింది ఏమిటంటే ఇతరుల జోలికి వెళ్లకుండా ఒంటరిగా ఉండేవారికి అనేక ఆరోగ్య సమస్యలు పట్టుకొంటాయి. వారికి ఆందోళన, స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే రిస్క్ 29 శాతం, డిమెన్షియా వచ్చే రిస్క్ 50 శాతం, స్ట్రోక్ వచ్చే రిస్క్ 32 శాతం ఉంటుంది. ఆ విధముగా ఎవరితో సంభందాలు లేకుండా ఒంటరిగా ఉండేవారికి ఆనందం లేక పోవటం మాత్రమే కాదు, వారికి అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు పట్టుకొంటాయి. అందుకనే దేవుడు ఆనందం కావాలంటే ఇతరులతో కనెక్ట్ అవ్వండి, వారికి సేవ చేయండి, ఆదరించండి అని మనతో అంటున్నాడు. 

Joy & Praise 

చివరిగా Joy & Praise 

ఆనందమునకు మరొక గొప్ప రహస్యం దేవుని స్తుతించుట. లూకా సువార్త 24 అధ్యాయం చదవండి. యేసు క్రీస్తు శిష్యులు ఎంతో ఆనందముతో ఉన్నట్లు మనం చదువుతాము. వారు దేవుని స్తుతించుట మనకు అక్కడ వారు దేవుని స్తుతిస్తూ ఆనందం పొందారు. 

ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;

యెడతెగక ప్రార్థనచేయుడి;

ప్రతి విషయమునందును

కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 

ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు

మీ విషయములో దేవుని చిత్తము.

             1 థెస్సలొనీక 5:16-18 

ఆనందం, ప్రార్ధన, కృతజ్ఞతా స్తుతులు – ఈ మూడూ కలిసి వెళ్లడం మనం ఇక్కడ చూస్తున్నాము. అవి నిత్య కృత్యాలుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 

ఎల్లప్పుడూ… సంతోషముగా ఉండు

ఎడతెగక….ప్రార్థన చేస్తా ఉండు 

ప్రతి విషయములో… కృతజ్ఞతా స్తుతులు చెల్లించు. 

మా అమ్మ రాజా బాబు గారు ఎప్పుడూ స్తుతి గీతాలు వింటూ ఉండేది. అవి వింటే నాకు ఆనందం కలుగుతుంది అని ఆమె చెబుతూ ఉండేది. దేవుని స్తుతించడములో ఎంతో  ఆనందం ఉంది. చక్కటి క్రైస్తవ గీతాలు, సంగీతం వింటూ వుండండి. మీకు ఎంతో ఆనందం కలుగు తుంది. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చే ఈ గొప్ప ఆనందం మీకు కలుగాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply