
రోమా పత్రిక లో నుండి ఒక ఈ రోజు ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. రోమా పత్రిక బైబిల్ గ్రంథము లో చాలా ముఖ్యమైన పుస్తకం. దీనిని మనం కొన్ని వారాలుగా ధ్యానించాము. ఈ రోజు ఈ పుస్తకం ముగిద్దాము. ఈ పుస్తకములో
మనము 20 సంగతులు చూశాము. దేవుని గురించిన ఈ 20 సత్యాలు మనం అర్థం చేసుకొంటే క్రైస్తవ సువార్త మనకు సులభముగా బోధపడుతుంది.
మొదటిగా,
God is a God of Preeminence
దేవుడు అద్వితీయుడు అని రోమా 16:27 లో మనం చదువుతాము. దేవుడు అద్వితీయుడు. ఆయన వంటి వ్యక్తి మరొకరు లేరు. దేవుడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి.
తాను చేసే సమస్త కార్యములలో అత్యున్నతుడుగా ఉన్న దేవుడు. సమస్తమును తన వశము చేసుకొన్న దేవుడు. దేవుని యొక్క ప్రాముఖ్యత అపోస్తలుడు స్పష్టముగా మనకు
వివరిస్తున్నాడు. క్రైస్తవ సువార్త దేవుని యొక్క కార్యము. అది దేవుని చుట్టూ అల్లబడింది. అది దేవుని వ్యక్తిత్వం, ఆయన లక్షణముల మీద ఆధారపడింది. ఈ ప్రకృతి లో, మన ప్రపంచ చరిత్రలో మన రక్షణలో దేవుడు తన ప్రాముఖ్యతను స్పష్టముగా చాటుకున్నాడు. మనిషి దేవుని ప్రాముఖ్యతను ప్రక్కన పడేస్తాడు. నన్ను నేను రక్షించుకోగలను, నా సమాజాన్ని నేను బాగుచేసుకోగలను నాకు దేవుని అవసరం లేదు అని మనిషి అనుకొంటాడు. అయితే దేవుడు అత్యంత ప్రాముఖ్యత కలిగినవాడు. దేవుడు లేకుండా మనిషి తనను తాను రక్షించుకోలేడు.
తరువాత
God is a God of Perpetuity
దేవుడు నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. ఆయన తో పాటు అన్ని సమయాల్లో, అన్ని చోట్ల, అన్ని కార్యాల్లో ఎవరూ ఉండరు. కేవలం ఆయన మాత్రమే నిత్యునిగా ఉన్నాడు. సమస్తము తన దృష్టికి నచ్చినట్లు ఆయన జరిగిస్తున్నాడు. మనం కాలములో బంధించబడిన జీవులము. మనిషి తనను తాను రక్షించుకోలేడు అనడానికి అది
మరొక కారణం. మన రక్షణ కొరకు నిత్యుడగు దేవుని మీద మనం ఆధారపడవలసినదే.
తరువాత
God is a God of Perfection
దేవుడు పరిపూర్ణుడు. ఆ తరువాత దేవుని యొక్క పరిపూర్ణత గురించి అపోస్తలుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు పరిపూర్ణుడు గా ఉన్నాడు. ఆ తరువాత ఆయన పరిపూర్ణుడైన దేవుడు. ఆయనలో ఒక్క లోపము కూడా లేదు. ఆయనలో ఒక్క అక్రమము కూడా లేదు. పాపములో ఉన్న మనుష్యులు ఈ దేవుని ఎదుట అపరిపూర్ణులుగా ఉన్నారు. ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో,ఆయన మంచితనములో ఆయన శక్తిలో, ఆయన ప్రేమలో ఎటువంటి అపరిపూర్ణత లేదు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు.
ఏ భేదమును లేదు; అందరును
పాపముచేసి దేవుడు అనుగ్రహించు
మహిమను పొందలేక పోవుచున్నారు.
రోమా 3:23
ఏ భేదం లేదు, మనలో ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుని యొక్క పరిపూర్ణతను అందుకోలేని స్థితిలో ఉన్నారు. దేవుని పరిపూర్ణత ముందు మనం తూగలేము. దేవుని పరిపూర్ణతను మనం ఎప్పటికీ అందుకోలేము. దేవుడు మనకు ఒక గుడ్ న్యూస్ చెబుతున్నాడు. యేసు క్రీస్తు నందు మనము పరిపూర్ణత పొందుతున్నాము. తరువాత
God is a God of Possession
సమస్తము తన ఆధిపత్యములో ఉంచుకొన్న దేవుడు. విశ్వం, అందులోని ప్రతిదీ దేవునికి చెందినదే ఎందుకంటే వాటన్నిటినీ సృష్టించింది దేవుడే. ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఇది నా ఇల్లు, నా బిజినెస్, నా ఆస్తి, నా పొలం, నా శరీరం, నా ఆత్మ అని మనం అనుకొంటాము. అయితే ఏదీ నీది కాదు. నీ శరీరం కూడా దేవునిదే నీ ఆత్మ కూడా దేవునిదే. సమస్తము ఆయనకు చెందినవే. ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి దేవదూత, ప్రతి దెయ్యం, ప్రతి వస్తువు – దేవునికి చెందినవే. అవి ఆయన అధికారం క్రింద ఉండవలసినదే. రక్షించబడిన వ్యక్తి ఇక దెయ్యాలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దెయ్యాలు కూడా దేవుని ఆధిపత్యం క్రిందే ఉన్నాయి.
God is a God of Power
దేవుడు శక్తి గలిగిన వాడు.ఆయన కు ఉన్నంత శక్తి ఇంకెవ్వరికీ లేదు. దేవుడు సర్వశక్తి మంతుడు. దేవుని శక్తి లేకుండా ప్రకృతి, భౌతిక ప్రపంచం ఒక్క క్షణం కూడా కొనసాగలేవు. ఆయన శక్తి లేకుండా ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు. ఈ యూనివర్స్ కూడా తనను తాను సృష్టించుకోలేదు. దేవుని యొక్క గొప్ప శక్తి దాని సృష్టిలో,నిర్మాణములో, పనుల్లో మనకు కనిపిస్తున్నది. ఈ సృష్టి ని చూసినప్పుడు దానిలో ఆయన యొక్క అపరిమితమైన, మనం ఊహించలేనంత మన జ్ఞానమునకు అందనంత శక్తి అందులో మనకు కనిపిస్తుంది. నమ్మక ముంచిన ప్రతి వ్యక్తినీ రక్షించగలిగే దేవుని శక్తి యేసు క్రీస్తు సువార్తలో ఉంది. సృష్టిలో కనిపిస్తున్న దేవుని శక్తే యేసు క్రీస్తు సువార్తలో కూడా పనిచేసింది. దేవుని శక్తి లేకుండా ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందలేడు. రక్షణ పొందుట మనుష్యులకు అసాధ్యము. అన్ని మతాలు ఒక్కటే, ఏ మతమైనా మనలను రక్షించగలదు అనే వారు మనకు తరచూ కనిపిస్తూ వుంటారు. వారు నశించిన పాపి యొక్క స్థితి గమనించలేని స్థితిలో ఉన్నారు.
సాతాను శక్తిని అధికమించే శక్తి ఎవరికి ఉంది? పాప కూపము క్రింద ఇరుక్కుపోయిన మనిషిని బయటికి తీయాలంటే ఎంత శక్తి కావాలి? ఆ శక్తి ఎవరికి ఉంది? నరకము వైపు దూసుకొని వెళ్తున్న ఒక పాపిని రక్షించే శక్తి ఎవరికి ఉంది? యేసు క్రీస్తును మరణం నుండి జీవము లోనికి తెచ్చే శక్తి ఎవరికి ఉంది? (2 కొరింథీ 13:4. ఎఫెసీ 1:20) ఆ శక్తి కేవలం దేవునికి మాత్రమే వుంది.
God is a God of Preparation
ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మానవులను రక్షించాలి అని దేవుడు అప్పటి నుండే
ఒక ప్లాన్ వేసుకొన్నాడు. అనేక మంది వ్యక్తులను దేవుడు పిలిచాడు. అనేక కార్యాలు ఆయన చేసాడు. అనేక పద్ధతులు ఆయన నియమించాడు. అవన్నీ దేవుడు సిద్ధము చేసిన రక్షణ కార్యములో భాగమే. ఆదాము, నోవహు, అబ్రహాము, యాకోబు, మోషే, యెహోషువ, అనేక మంది ప్రవక్తలు, అపోస్తలులు వీరందరినీ దేవుడు కార్యక్రమం కోసం సిద్ధం చేశాడు. ఈ రోజు నేటి ప్రపంచములో మీరు జీవిస్తున్నారు. యేసు క్రీస్తు సువార్త మీరు విన్నారు. అది దేవుని ఏర్పాటే. ఆయన సిద్ధపరచే దేవుడు.
God is a God of Promise
దేవుడు వాగ్దానములు నెరవేర్చే దేవుడు. ఆయన ఒక ప్రామిస్ చేస్తే దానిని నిలబెట్టుకొంటాడు. మన రక్షణ కూడా దేవుని వాగ్దానమే. తన పరిశుద్ధ లేఖనముల యందు దేవుడు ప్రవక్తల ద్వారా యేసు క్రీస్తు గురించి వాగ్దానం చేశాడు.
యేసు క్రీస్తు బెత్లెహేము గ్రామములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త చెప్పాడు. మీకా 5:2
ఆయన కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు అని యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా 7:14
ఆయన యాకోబు సంతానము లో జన్మిస్తాడు అని బిలాము ప్రవచించాడు సంఖ్యా కాండము 24:17
ఆయన యూదా గోత్రములో జన్మిస్తాడు అని యాకోబు ప్రవచించాడు. ఆదికాండము 49:10
ఆయన దావీదు సంతానములో జన్మిస్తాడు అని నాతాను ప్రవచించాడు. 2 సమూయేలు 7:12-13
ఆయన సిలువ వేయబడతాడు అని దావీదు, యెషయాలు ప్రవచించారు (కీర్తన 22; యెషయా 53)
ఆయన సమాధి చేయబడి, మరణము నుండి తిరిగిలేస్తాడు అని దావీదు ప్రవచించాడు. కీర్తన 16:10
ఈ ప్రవచనాలు మొత్తం ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుడు నెరవేర్చాడు.
God is a God of Perseverance
దేవుడు పట్టువదలని వాడు. రోమా 11 అధ్యాయము చదవండి. రోమా పత్రిక 11 అధ్యాయము చూడండి. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా వెంబడిస్తున్నాడో అపోస్తలుడైన పౌలు మనకు వివరించాడు. ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవడం
చాలా ముఖ్యం ఎందుకంటే మనం యూదుల పట్ల దేవునికి గల ప్రణాళిక లను అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ప్రపంచములో పెరిగిపోతున్న ఒక ప్రధాన సమస్య antisemitism. యూదు ద్వేషం. దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు ఇశ్రాయేలీయులను లేక యూదులను విసర్జించాడా? విసర్జించలేదు అని పౌలు గారు స్పష్టముగా మనకు తెలియజేశాడు.
God is a God of Peace
తరువాత దేవుడు సమాధాన కర్త గా మనకు కనిపిస్తున్నాడు. ఆయన శాంతి ని మనకు ఇచ్చేవాడు. ఆయన God of Peace. దేవుడు శాంతిని కోరుకొనేవాడు అనే సత్యము అపోస్తలుడు మనకు బోధిస్తున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి. తలకు రక్షణ శిరస్త్రాణం, ఛాతీకి నీతి అనే వస్త్రం, నడుముకు సత్యం అనే దట్టి, ఒక చేతిలో విశ్వాసము అనే డాలు, మరొక చేతిలో దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం, పాదములకు సమాధాన సువార్త వల్లనైన సిద్ధ మనస్సు అనే చెప్పులు తొడుగుకోవాలి. సాతానుని ఎదుర్కోవాలంటే అవన్నీ విశ్వాసి ధరించాలి. విశ్వాసి దేవుని శాంతి అనే చెప్పులు తోడుకొన్నాడు. అవి లేకుండా ఏ విశ్వాసి ముందుకు నడవలేడు.
God is a God of Plurality
దేవుడు ఒక్కడే. అయితే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మన రక్షణ ఈ ముగ్గురు వ్యక్తుల సమిష్టి కృషి వలన మనకు లభించింది. ఈ ముగ్గురు వ్యక్తులను మనం ఆరాధించాలి, ముగ్గురినీ గౌరవించాలి, ప్రేమించాలి.
God is a God of Progress
ఆ తరువాత He is a God of Progress. నిజమైన ప్రోగ్రెస్ దేవుని వలనే వస్తుంది. అది వ్యక్తిగత వికాసం కావచ్చు లేక సామాజిక వికాసం కావచ్చు – అవి దేవుని వలన మాత్రమే వస్తాయి. ఈ రోజు మన ప్రపంచములో ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే, దేవుడు లేకుండా మనం ప్రగతి సాధించగలం. ప్రజలు దేవుని మీద నమ్మకం కోల్పోతే మన సమాజములో ప్రగతి వస్తుంది అని చాలా మంది మేధావులు అంటూ వుంటారు.
అయితే రోమా పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మనుష్యులు దేవునికి దూరముగా వెళ్లి పోయినప్పుడు వారు చెడిపోతారే కానీ బాగుపడరు అని అపోస్తలుడు అయిన పౌలు గారు వ్రాశాడు.
Truth rejected – Reprobate mind – Degeneration
Truth received – Renewed mind – Regeneration
ఆ తరువాత
God is a God of Perdition
పౌలు ఈ పత్రికలో దేవుని కోపం గురించి వివరముగా ప్రస్తావించాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుని ఉగ్రత గురించి, తీర్పు గురించి, నరకం గురించి అనేకసార్లు మనలను హెచ్చరించాడు. బైబిల్ లో అందరికంటే ఎక్కువగా నరకంగురించి బోధించింది యేసు క్రీస్తు ప్రభువే. అందువలన, ‘నరకం లేదు అనడం యేసు క్రీస్తును అబద్ధికునిగా చేయడమే. పాప క్షమాపణ పొందిన వారిని రక్షిస్తున్న దేవుడే దానిని పొందని వారిని కఠినముగా శిక్షిస్తున్నాడు. అయితే దేవుడు మనకు ఒక శుభవార్త పంపించాడు.
యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారిని దేవుడు రక్షిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని ఉగ్రత లో నుండి తప్పించుకొంటారు. రక్షణ పొందని వారు దేవుని ఉగ్రత కుమ్మరించబడే పాత్రలుగా ఉంటారు.
God is a God of Paternity
దేవుడు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినవారిని తనకు పిల్లలుగా చేసుకొన్నాడు.
దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు. మనలను అడాప్ట్ చేసుకొన్నాడు. ఇప్పుడు మనం ‘అబ్బా, తండ్రీ’ అని దేవుని పిలువవచ్చు. ‘అబ్బా, తండ్రీ’ అని ‘నాయనా, తండ్రీ’ అని యేసు ప్రభువు దేవుని పిలవడం క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది (మార్కు 14:36). ఈ రోజు అటువంటి యోగ్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు.
God is a God of Pity
దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఈ రోమా పత్రికలో దేవుని ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో వివరముగా వ్రాశాడు. రోమా 5:8 చూద్దాము.
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు;
ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
రోమా 5:8
ఆ మాటలు మీరు గమనించండి. మనము పాపములో ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ మీద మన పాపముల కొరకు చనిపోవడం దేవుడు మన మీద ప్రేమతో చేసిన త్యాగం.శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను – ఈ ప్రపంచములో ఏదీ దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయలేదు.
God is a God of Participation
దేవుడు ఎక్కడో కూర్చొని మన వైపు చూడడం లేదు. యేసు క్రీస్తు నందు దేవుడు మానవ రూపం దాల్చి ఈ భూమి మీద మనతో కలిసి నడిచాడు. ఈ రోజున ప్రతి విశ్వాసిలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని గా దేవుడు మనతో కలిసి నడుస్తున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుతాడు. ఈ పరిశుద్ధాత్ముడు భూమి మీద మనం ఉన్నంత కాలం మనతో కలిసి ఉంటాడు. ఆయన మనతో కలిసి నడుస్తాడు.
God is a God of Purpose
దేవుడు లక్ష్యముతో పనిచేసేవాడు. పర్పస్ లేకుండా దేవుడు ఏ పనీ చేయడు. మానవ జాతిని సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. నన్ను సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. నిన్ను సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది. మనలను రక్షించాలి అనే లక్ష్యముతో దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు ఒక లక్ష్యం పెట్టుకొంటే ఆయనను ఆపడం ఎవరికైనా సాధ్యపడుతుందా?
యేసు క్రీస్తు ప్రభువు లక్ష్యం ఏమిటి? సువార్తలు చదవండి. ఆయన జీవితం సిలువ వైపు సాగింది. సిలువ వేయబడటానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చాడు.
సిలువ వేయబడడం ఎంతో భయంకరమైన శిక్ష. అయితే అందులో నుండి కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేసాడు.
యేసు క్రీస్తు మరణములో నుండి మనకు జీవం లభించింది
యేసు క్రీస్తు దుఃఖంలో నుండి మనకు ఆనందం లభించింది
యేసు క్రీస్తు నరకములో నుండి మనకు పరలోకం లభించింది.
యేసు క్రీస్తు శాపములో నుండి మనకు ఆశీర్వాదం లభించింది.
యేసు క్రీస్తు నష్టం లో నుండి మనకు లాభం లభించింది.
God is a God of Philanthropy
రోమా పత్రిక 15 అధ్యాయం చదవండి. అక్కడ పౌలు గారు విరాళాలు సేకరించడం మనం చూస్తాము. దేవుని ప్రేమ మాటలతో కాదు, చేతల్లో చూపించాలి అని పౌలు జీవితం చూస్తే మనకు అర్థం అవుతుంది. పేద క్రైస్తవుల కోసం పౌలు విరాళాలు సేకరించి వారి ఆకలి తీర్చాడు. దేవుడు అక్కరలు తీర్చేవాడు.
God is a God of Providence
రోమా పత్రిక 13 అధ్యాయము చదవండి. పౌలు అక్కడ మనకు ఏమి బోధించాడంటే క్రైస్తవ విశ్వాసులు ప్రభుత్వమునకు లోబడి ఉండాలి. ప్రభుత్వం అనే వ్యవస్థను పెట్టింది దేవుడే. సమాజములో వ్యక్తుల సంక్షేమము కోసం, భద్రత కోసం దేవుడు ప్రభుత్వ వ్యవస్థను పెట్టాడు. ఈ ప్రభుత్వానికి విశ్వాసులు లోబడి ఉండాలి.
God is a God of Pleasure
దేవుడు సమస్త ఆనందమునకు కారకుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రజలకు ఆనందం ఇచ్చేవానిగా ఉన్నాడు. చివరిగా God is a God of Praise
రోమా పత్రిక చివరి వచనం చూడండి: అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.అపోస్తలుడు దేవుని స్తుతించడముతో ఈ పత్రిక ముగించాడు ఎందుకంటే అద్వితీయుడైన, జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలగాలి. మన రక్షణ కూడా దేవుని మహిమ కొరకే. దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి.
దేవుని గురించి 20 సత్యాలు ఈ రోజు మనం చూశాము. రక్షకుడైన యేసు క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన అనుగ్రహించే రక్షణ మీరు పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.