అపోస్తలుల నుండి నేర్చుకోవలసిన 10 సత్యాలు 

ఈ రోజు అపోస్తలుల కార్యముల గ్రంథం ను మనం చూద్దాము. 

4 సువార్తలకు, అపోస్తలులు వ్రాసిన పత్రికలకు మధ్య ఒక బ్రిడ్జి వలె ఈ పుస్తకం ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు మరణించి, తిరిగి లేచి, పరలోకం వెళ్లిపోయిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ప్రశ్నకు ఈ పుస్తకం జవాబు ఇస్తుంది. వైద్యుడైన లూకా గారు ఈ పుస్తకము వ్రాశాడు. లూకా సువార్తలో ఆయన యేసు క్రీస్తు ప్రభువు యొక్క జీవితము మనకు వివరించాడు. ఈ పుస్తకములో ఆయన స్థాపించిన క్రైస్తవ సంఘము ఎలా మొదలయ్యిందో, ఎలా విస్తరించిందో మనకు వివరించాడు. క్రీస్తు శకం 63 నుండి 70 ల మధ్య ఈ పుస్తకం వ్రాయబడి ఉండవచ్చు. 

    మొదటిగా అపోస్తలుడైన పేతురు గారి పరిచర్య, ఆ తరువాత పౌలు గారి పరిచర్యల మీద ఆయన తన దృష్టిని పెట్టాడు. లూకా గారు  పౌలు గారి తో కలిసి ఎంతో కాలము పరిచర్య చేశాడు. అందుకనే ఈ పుస్తకములో కొన్ని చోట్ల ‘మేము’ ‘మేము’ అనే పదం మనకు కనిపిస్తుంది. ప్రత్యక్షముగా వాటిని చూసి లూకా ఆ వాక్యభాగాలు వ్రాశాడు. ఈ పుస్తకములో ఉన్న 28 అధ్యాయాలు మీరు చదివితే లూకా ఒక గొప్ప చరిత్ర కారుడు అనే 

విషయము కూడా మనకు అర్థం అవుతుంది. అనేక అధికారులు, అనేక పదవులు, అనేక రకాల ప్రజలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు ఆయన ఖచ్చితముగా వివరించి వ్రాశాడంటే, ఎంతో శ్రమించి ఉంటాడు అనే విషయం కూడా మనకు అర్థం అవుతుంది. చరిత్ర పరిశోధకులు ఈ రోజుకు కూడా  ఈ పుస్తకము చదివి ఆశ్చర్య పోతున్నారు. అంత గొప్ప చరిత్ర ఈ పుస్తకములో ఉంది. 

   ఎన్నో గొప్ప సత్యాలు ఈ పుస్తకం చదివితే మనకు అర్థం అవుతాయి. దేవుడు ఎందుకు ఈ పుస్తకము మన కొరకు వ్రాయించాడు అనే ప్రశ్న మనకు రావచ్చు. ఈ రోజు ప్రపంచాన్ని మనకు చూస్తే క్రైస్తవ సంఘము ఎలా వుంది? ఆధునిక యుగములో అనేక ప్రాపంచిక పద్ధతులు క్రైస్తవ్యములో ప్రవేశించి దానిని కలుషితము చేశాయి. ఈ ప్రాపంచిక పద్ధతులు కాకుండా ఆది సంఘములో అపోస్తలులు వెళ్లిన బాటలో మనం కూడా నడవాలి అని దేవుని ఉద్దేశ్యం. ఈ గ్రంథములో నాకు కనిపించిన 10 సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 

Their Eyewitness 

మొదటిగా, వారి సాక్ష్యము. అపోస్తలులు పలికిన ఒక మాట మీరు గమనించండి. 

మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను; అందుకు మేము సాక్షులము.

   అపో. కార్య 3:15

జీవాధిపతి – Author of Life యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఒక మంచి పేరు జీవాధిపతి. చిన్న చిన్న బాక్టీరియా ల దగ్గర నుండి పెద్ద పెద్ద వేల్స్, డైనోసార్ లు, మానవులు – జీవం ఉన్న ప్రతిదీ యేసు క్రీస్తు వలనే ఉనికిని కలిగి ఉంది. ఆ జీవాధి పతి సిలువ వేయబడ్డాడు. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడు. అందుకు మేము సాక్షులము. తిరిగి లేచిన యేసు క్రీస్తు ను అపోస్తలులు చూశారు. ఆయనతో కలిసి నడిచారు. ఆయనతో కలిసి భోజనం చేసారు. ఆయన గాయాలు ముట్టుకొన్నారు. ఆయన మాటలు విన్నారు. ఆయన పరలోకం తిరిగి వెళ్లడం తమ కన్నులతో చూశారు. సజీవుడైన క్రీస్తును చూసిన తరువాత వారి సమూలముగా మారిపోవడం మనం గమనిస్తాము. 

Their Evidences – వారి ఆధారాలు 

రెండవదిగా, their evidences. వారి ఆధారాలు. 

మొదటి అధ్యాయములో మనం చదువుతాము. 

1:3 

ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు… అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.

    40 రోజుల పాటు ప్రభువైన యేసు క్రీస్తు వారికి అనేక సార్లు, అనేక చోట్ల అనేక సందర్భాల్లో కనిపించాడు. అనేక ప్రమాణాలు వారికి చూపించి నేను సజీవుడను అని వారికి స్పష్టముగా అర్థమయ్యేలా చేశాడు. వారికి ఆయన సుదీర్ఘ ప్రసంగాలు కూడా చేశాడు (లూకా 24). పాత నిబంధనలో మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తలు చేసిన ప్రవచనాలు తన యందు ఏ విధముగా నెరవేరాయో ఆయన వారికి వివరించి చెప్పాడు. 

   యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, ఆయన యందు నెరవేరిన దేవుని వాగ్దానాలు అపోస్తలులకు ఆధారాలుగా నిలిచాయి. అవే వారి యొక్క బోధలకు ముఖ్య అంశాలుగా మారాయి.సజీవుడైన క్రీస్తు, ఆయన యందు నెరవేరిన దేవుని ప్రవచనాలు. ఈ రోజు మన ప్రసంగాలలో కూడా అవే ముఖ్య అంశాలుగా ఉంటే మంచిది. 3:18  అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయ ములను ఈలాగు నెరవేర్చెను.

Their Empowerment – వారు శక్తిమంతులగుట 

మూడవదిగా, their empowerment 

వారు బలపరచబడ్డారు. పెంతెకోస్తు దినము రోజున పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము లో కూడుకొని ఉన్న విశ్వాసుల మీదకు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా వారు ఏమీ చేయలేరు. ‘మీ కోసం నేను ఒక ఆదరణ కర్తను మీ యొద్దకు పంపిస్తాను’ అని ప్రభువైన యేసు క్రీస్తు చేసిన వాగ్దానం ఆ రోజు నెరవేరింది. పరిశుద్ధాత్ముడు అనే పదం ఈ గ్రంథములో 50 సార్లు మనకు కనిపిస్తుంది. అపోస్తలులు పరిశుద్ధాత్ముని యొక్క నాయకత్వములో ముందుకు వెళ్లారు. వారు ఏ ఊరు వెళ్ళాలి, ఏమి బోధించాలి, ఎవరిని స్వస్థపరచాలి, ఏ పనులు చేయాలి అనే విషయాల్లో వారు ప్రార్ధన చేసి పరిశుద్ధాత్మ నడిపింపుకు తమను అప్పగించుకోవడం అనేక చోట్ల మనం చూస్తాము. 

Their Enlargement – వారి విస్తరణ 

నాలుగవదిగా, their Enlargement వారు విస్తరించడం కూడా మనం చూస్తాము. యూదా ఇస్కరియోతు ఆత్మ హత్య చేసుకొన్నాడు. అప్పుడు 11 మంది అపొస్తలులు మిగిలారు. 11 మంది ని దేవుడు కోట్ల మందిగా అభివృద్ధి చేశాడు. పెంతె కోస్తు దినము రోజున మూడు వేల మంది విశ్వాసులుగా మారడం 2 అధ్యాయములో మనం చూస్తాము. యెరూషలేము మొదలుకొని, యూదయ, సమరయ ఆ తరువాత భూదిగంతముల వరకు వారు విస్తరించడం మనం చూస్తాము. 

   వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

            2:46-47 

వారు ప్రతి దినం కూడుకొంటున్నారు. ‘అమ్మో, ప్రతి రోజూ మీటింగా? విసుగు పుట్టదా?’ అని వారు అనుకోలేదు. దేవుని వాక్యము, ఆరాధన, రొట్టె విరుచుట,  ఇతర విశ్వాసులతో సహవాసము వారికి ఎంతో ఆనందం కలిగించాయి. 

Their Evangelism 

ఐదవదిగా their evangelism వారి సువార్త ప్రకటన వారి యొక్క సువార్త ప్రకటన. ప్రతి రోజూ వారి ఎక్కడో ఒక చోట యేసు క్రీస్తు సువార్త ప్రకటించడం మనకు ఈ గ్రంథములో కనిపిస్తుంది. దేవాలయములో వారు యూదులకు సువార్త ప్రకటించారు, చెర శాలలో రోమన్ అధికారులకు దారిన పోయే వారికి రాజులకు, రాణీలకు, దాసులకు, దాసురాండ్రకు పండితులకు, పామరులకు వారు, వీరు అని తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరికీ యేసు క్రీస్తు ప్రభువు మీ రక్షకుడు ఆయనను నమ్మండి, పాప క్షమాపణ పొందండి అని వారు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించకుండా క్రైస్తవ్యము వృద్ధి చెందదు. మనం అన్ని సందర్భాల్లో సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. 

Their Exclusivity 

ఆరవదిగా their exclusivity 

వారి సువార్త చాలా స్పష్టమైనది. 4 అధ్యాయము 12 వచనము 

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము 

10 అధ్యాయము 36 వచనము 

యేసు క్రీస్తు అందరికి ప్రభువు. 

క్రైస్తవ సువార్తలో inclusivity, exclusivity రెండూ ఉన్నాయి. యేసు క్రీస్తూ అందరికీ ప్రభువు. ప్రపంచములో ఎవరయినా ఆయనను రక్షకునిగా, ప్రభువుగా ఒప్పుకోవచ్చు. అది inclusivity. యేసు క్రీస్తు తప్ప ఎవరూ మనలను మన పాపముల నుండి రక్షించలేరు. అది exclusivity. అపోస్తలులు అటువంటి సువార్త ప్రకటించారు. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. భూలోకమును తల క్రిందులు చేసేవారు అని అపోస్తలులు పిలువబడ్డారు. 

Their Engagement 

వారి కలయిక 

ఆ తరువాత their engagement అపోస్తలులు అందరి మీద దృష్టి పెట్టారు. యేసు క్రీస్తు సువార్త కేవలం యూదులకు మాత్రమే అని వారు కొంత కాలం భావించారు. అయితే 10 అధ్యాయములో దేవుడు పేతురు గారికి ఒక గొప్ప దర్శనం అనుగ్రహించాడు. ఆ దర్శనములో పేతురు పెద్ద దుప్పటి చూశాడు. అందులో అనేక జంతువులు, పక్షులు, పురుగులు కనిపించాయి. వాటిని చంపుకొని తిను అని ఒక స్వరం పేతురును వినిపించింది. ప్రభువా, అపవిత్రమైనవి నేను ముట్టుకోను అని పేతురు జవాబు చెప్పాడు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్దమైనవి గా ఎంచవద్దు అని ఒక స్వరం ఆయనకు వినిపించింది. 

ఆ దర్శనము చూసిన తరువాత పేతురు కొర్నేలీ ఇంటికి వెళ్లి అన్యజనులకు సువార్త ప్రకటించాడు. క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక గొప్ప మలుపు. యూదులు మాత్రమే కాదు, అన్య జనులు కూడా యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ, నిత్యజీవము పొందవచ్చు అనే సత్యము అపోస్తలులకు అప్పుడు అర్థం అయ్యింది. అపోస్తలులు అప్పటి నుండి యూదులకు, అన్య జనులకు ఇద్దరికీ సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. అపోస్తలుడైన పౌలు చేసిన గొప్ప సువార్త పరిచర్య అన్యజనులు లక్షలాదిగా యేసు క్రీస్తు శిష్యులు కావటానికి ఉపయోగపడింది. 

   ఇథియోపియా దేశానికి చెందిన ఒక అధికారి ఒక రథము మీద వెళ్తున్నాడు. యెషయా గ్రంథము చదువుతున్నాడు. 53 అధ్యాయం లో వధకు తేబడిన గొఱ్ఱె పిల్ల గురించి అతను చదువుతున్నాడు. ఈ గొఱ్ఱెపిల్ల ఎవరు? అనే ప్రశ్న ఆయనకు కలిగింది. ఆ సమయములో పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు ను ప్రేరేపించాడు. ఫిలిప్పు వెళ్లి ఆ నపుంసకుని రథము వెంట పరుగెత్తి, ఆ తరువాత దానిలో కూర్చొని ఆయనను సువార్త చెప్పాడు. యెషయా ప్రవచించిన ఈ వధకు తేబడిన గొర్రెపిల్ల ఎవరంటే సిలువ వేయబడిన యేసు క్రీస్తే అని అతనికి ప్రకటించాడు. ఆ నపుంసకుడు సువార్తను నమ్మి, పాప క్షమాపణ పొంది, బాప్తిస్మము పొందాడు. అపోస్తలుడైన పౌలు రోమన్ గవర్నర్ లకు సువార్త ప్రకటించాడు. రాజులకు సువార్త ప్రకటించాడు. ఏథెన్స్ వెళ్లి ఫిలాసఫర్ లకు సువార్త ప్రకటించాడు. 

     క్వీన్ ఎలిజబెత్ రాణి మరణించింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యము నకు ఎన్నో దశాబ్దాలు ఆమె రాణి గా ఉంది. యేసు క్రీస్తు సువార్త నాకు వెలుగు ను ఇచ్చింది అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఎవరో ఒకరు సువార్త ప్రకటించబట్టే ఆమె యేసు ప్రభువును నమ్ముకొంది. అపోస్తలులు రాజులకు, రాణులకు కూడా సువార్త ప్రకటించారు. ఈ సువార్త ప్రతి ఒక్కరికీ అవసరమే అని వారు గుర్తించారు. వారికి ప్రతిబంధకాలు ఎదురయినాయి. అగ్రిప్ప ఏమన్నాడు: ‘అంత తేలిగ్గా నన్ను క్రైస్తవునిగా మార్చగలవా? పౌలు?’ అన్నాడు. వీడొక వెఱ్ఱి వాడు, పిచ్చివాడు అని పౌలు ను ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పౌలు ఇతరులకు సువార్త చెప్పడం ఎప్పుడూ మానుకోలేదు. 

Their Empathy 

ఎనిమిదవదిగా, their empathy – వారి దయ అపోస్తలులు చూపించిన దయ మనకు 

ఈ పుస్తకములో అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వలె  వారు కూడా నశించిన వారి ని చూసి జాలి పడడం మనం చూస్తాము. అనేక రకాలైన రోగములతో బాధ పడుతున్న వారిని వారు స్వస్థపరచారు. దెయ్యాలు పట్టి వేదనలో ఉన్న వారికి, ఆ దెయ్యాలను వెళ్లగొట్టి వారు ఉపశమనం ఇచ్చారు. ఆహారము లేక ఆకలితో అలమటించే వారికి ఆహారం పెట్టారు. 6 అధ్యాయములో స్తెఫను ఆ పనికి నియమింపబడడం మనం చూస్తున్నాము. (6:2-4) 

4:32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.వారందరూ ఏక హృదయము, ఏకాత్మ తో గడిపారు. ఇది నాది, ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, ఇది నా పొలము, ఇది నా ఆహారం అని వారు అనుకోలేదు. ఎవరికి అవసరం ఉంటే వారికి తమ యొద్ద ఉన్న వాటిని పంచివేశారు. 

Their Enjoyment 

తొమ్మిదవదిగా their enjoyment 

Their Enjoyment – వారి ఆనందము వారిలో మనకు ఎంతో ఆనందం మనకు కనిపిస్తుంది. అపోస్తలులు అంటే సంతోషము లేకుండా తిరిగే వారు కాదు. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి. Acts 13:52 

పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఆనందభరితులయ్యారు. 

5:41-42 

ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు,యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.క్రీస్తు ను బట్టి వారికి అవమానము కలిగింది. అయితే దానిని బట్టి కూడా వారు సంతోషించారు. ‘క్రీస్తు కొరకు నేను ఎంతో కోల్పోయానండి నేను’ అని  ఏడుపు మొహం పెట్టుకొని తిరిగే వారిని మనం చూస్తూ ఉంటాము. అపోస్తలులు ఆ పని చేయలేదు. అవమానింపబడినప్పుడు కూడా వారు సంతోషించారు. శ్రమ పెట్టబడినప్పుడు కూడా వారు సంతోషించి ఆనందించారు. పౌలు సీలలు జైలులో ఉన్నారు. ఏడుస్తూ వారు కూర్చోలేదు. 

16:25 

అయితే మధ్య రాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.జైలులో వారు దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మీ సంతోషము పరిపూర్ణముగా ఉంటుంది అని యేసు ప్రభువు చేసిన వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరింది (యోహాను 16:24) 

Their Encouragement 

చివరిగా their encouragement 

వారు ఇచ్చిన ఆదరణ వారు ఇతరులకు ఇచ్చిన ఆదరణ, ధైర్యము మనకు అనేక చోట్ల ఈ పుస్తకములో కనిపిస్తుంది. త్రోయ అనే పట్టణములో పౌలు గారు ఒక దీర్ఘ ప్రసంగము చేస్తూ ఉన్నాడు. ఐతుకు అనే చిన్నవాడు మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. అయ్యో యెంత ఘోరం జరిగింది అని అక్కడ ఉన్న వారంతా శోకించారు. పౌలు వెళ్లి మృతులలో నుండి ఆ చిన్న వానిని బ్రతికించి వారికి అప్పజెప్పాడు. 

20:12 

వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.పౌలు రోమ్ నగరానికి ఒక ఓడలో వెళ్తున్నప్పుడు సముద్రములో పెద్ద తుఫాను బయలుదేరి ఆ ఓడ బద్దలయ్యింది. ఓడలో ఉన్న ప్రయాణికులు అందరూ జీవితము మీద ఆశలు వదులుకొన్నారు. ఆహారము తీసుకోవటానికి కూడా వారు ఇష్టపడలేదు. పౌలు వారిని బతిమాలాడు. కానీ వారు మాత్రం ఒప్పుకోలేదు. ‘కాసేపట్లో చనిపోతున్నాము. మనం తిని సాధించేది ఏముంది? అని వారు నిట్టూర్పులు విడిచారు. (27:34,35). ఆ సమయములో పౌలు వారిని బలపరచాడు. ‘ధైర్యము తెచ్చుకోండి. దేవుడు మిమ్ములను కాపాడుతాడు. ఆహారం పుచ్చుకోండి’ అని పౌలు వారిని ప్రోత్సహించాడు. ఒక రొట్టె పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారి ముందు తిన్నాడు. వారి యొక్క గొప్ప విశ్వాసము వారికి అటువంటి గొప్ప ధైర్యం ఇచ్చింది. అందుకనే ప్రాణాపాయ స్థితిలో కూడా వారు దేవుని స్తుతించారు. వారి చుట్టూ ఉన్న వారిని ఆదరించి బలపరిచారు. 

Leave a Reply