ఇశ్రాయేలు చేసిన నాలుగు పాపాలు: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం 

క్రొత్త నిబంధన లోని పుస్తకాలను మనం ధ్యానం చేస్తున్నాము.  మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక లో నుండి  ఈ రోజు ఒక  ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ పత్రికలో నుండి కొన్ని ముఖ్యమైన సత్యాలు మనం చూద్దాము. 

మొదటిగా, ఇతర క్రైస్తవుల మీద కోర్టు కేసులు పెట్టడం. దీని గురించి దేవుని వాక్యం యేమని బోధిస్తున్నది? మొదటి కొరింథీ ఆరవ అధ్యాయం రెండవ వచనం చూడండి.

పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరా? 

మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, 

మిక్కిలి అల్ప మైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 

            1 కొరింథీ 6:2 

కొరింథీ సంఘములో అనేక సమస్యలు వున్నాయి. వాటిలో ఒకటి తోటి క్రైస్తవుల మీద కేసులు పెట్టి వారిని కోర్టులకు ఈడ్చుట.పౌలు గారు వారితో ఏమంటున్నాడంటే, దయచేసి ఆ పని చేయవద్దు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు తో కలిసి వారు అన్యజనులకు తీర్పు తీరుస్తారు. మనం ఒకరి మీద ఒకరం కేసులు పెట్టుకొని అన్యజనుల యెదుటికి పోకూడదు.మీ మధ్యలో వచ్చే గొడవలు తీర్చడానికి మీలో దేవుని ఆత్మ కలిగిన వాడు ఒక్కడు కూడా లేడా? నిష్పక్ష పాతముగా, సత్యము ననుస రించి మీకు న్యాయమైన తీర్పు చెప్పేవాడు మీలో ఒక్కడు కూడా లేడా?పౌలు వారికి యేమని బోధించాడంటే, ఎట్టి పరిస్థితుల్లో తోటి క్రైస్తవులను కోర్టుకు ఈడ్చ వద్దు. నీవు నష్టపోయినా, అన్యాయానికి గురైనా సరే – వాటిని ఓర్చుకో. అంతేతప్ప మీ గొడవలు అన్యజనుల కోర్టులకు తీసుకు వెళ్ళవద్దు.ఈ సత్యాలు మనం కూడా నేర్చుకొంటే మంచిది. క్రైస్తవులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం ఈ రోజు కూడా చూస్తున్నాము.

    ‘ఈ చర్చి స్థలం మాది, కాదు మాది’ అని కేసులు పెట్టుకోవడం, నన్ను పాస్టర్ గా తొలగించారు అని చెప్పి చర్చి మీద కేసు పెట్టడం, చందాలు సొంత ఖర్చులకు వాడుకొంటున్నారు అని సంఘ సభ్యుల మీద కేసులు పెట్టుకోవడం ఇవన్నీ మనం చూస్తూనే వున్నాము. అలా కేసులు పెట్టుకొని గొడవలు చేయడం వలన యేసు క్రీస్తు ప్రభువు పేరుకు చెడ్డ పేరు వస్తుందే కానీ మంచి పేరు రాదు. దేవునికి మహిమ కలుగదు.

విగ్రహములకు అర్పించిన వాటిని తినుట 

అపోస్తలుడైన పౌలు గారు విగ్రహములకు బలి ఇచ్చిన వాటి విషయములో వారికి స్పష్టమైన సత్యాలు చెప్పాడు. 1 కొరింథీ 8 అధ్యాయము, 1 వచనం చూడండి. 

విగ్రహములకు బలిగా

 అర్పించినవాటి విషయము: 

మనమందరము జ్ఞానముగలవారమని

 యెరుగుదుము. జ్ఞానము 

ఉప్పొంగజేయును గాని ప్రేమ

 క్షేమాభివృద్ధి కలుగజేయును.

            1 కొరింథీ 8:1

కొరింథు నగరములో చాలా గ్రీకు దేవతల ఆలయాలు ఉన్నాయి. వాటిలో జంతువులను బలి ఇచ్చేవారు. వాటి మాంసం చౌకగా ప్రజలకు అమ్మేవారు. మార్కెట్ లో ఉండే మాంసం కన్నా ఇది చౌక ధరలో ప్రజలకు దొరికేది. కొంతమంది క్రైస్తవులు ఈ ఆలయములకు వెళ్లి దేవతలకు అర్పించ బడిన మాంసం కొని, వండుకొని తినేవారు. 

‘విగ్రహములు నిజమైనవి కావు. వాటిల్లో ఎటువంటి దైవత్వం లేదు కాబట్టి వాటికి అర్పించిన మాంసం తింటే తప్పు ఏమీ లేదు’ అని వారు అన్నారు. అయితే వీరిని చూసి అభ్యంతర పడే వారు కూడా ఉన్నారు. విగ్రహములకు అర్పించబడినవి మనం తినకూడదు అని వారు గట్టిగా వాదించారు. తినవచ్చు అని కొంత మంది, తినకూడదు అని కొంత మంది వాదించుకొంటున్నారు. 

    పౌలు గారు వారితో ఏమంటున్నాడంటే, ఆ విగ్రహాలు వట్టివే. వాటిలో దైవత్వం లేదు. నిజమే. కానీ ఆ జ్ఞానం మీకు వుంది. అందరికీ ఆ జ్ఞానం లేదు. జ్ఞానము ఉప్పొంగ జేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే మన ప్రవర్తన ప్రేమతో నిండి ఉండాలి. ‘నేను విగ్రహములకు అర్పించబడిన వాటిని తింటాను. ఆ విగ్రహం గురించి ఆలోచించను’ 

     కానీ నన్ను చూసి బలహీనుడైన క్రైస్తవుడు పాడైపోవచ్చు. అతడు విగ్రహారాధన లోకి వెళ్లిపోవచ్చు. ఆ బలహీనుడైన క్రైస్తవుడు పాడైపోవడం కంటే నేను మాంసం తినకపోవడమే మంచిది. 8:13 చూడండి. 

కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.

పౌలు మాటలు మనం గమనించాలి. నేను తినే వాటిని చూసి నా సోదరుడు అభ్యంతరపడితే, అతని కోసం నేను మాంసం తినడం మానుకొంటాను అని ఆయన అంటున్నాడు. 

     మాంసం అనే కాదు, మనకు ఇష్టమైనది ఏదయినప్పటికీ ఇతర క్రైస్తవులకు అది అభ్యంతరముగా ఉంటే మనం దానిని మానుకోవడం మంచిది. జ్ఞానం ఉప్పొంగజేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. క్రైస్తవ సంఘం యొక్క  క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయత్నించాలి కానీ మన స్వప్రయోజనాల కోసం దానిని పణంగా పెట్టకూడదు. 

ఇశ్రాయేలీయుల నుండి మనం నేర్చుకొనవలసిన పాఠాలు 

   మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయములో  ఇశ్రాయేలీయుల నుండి మనం  నేర్చుకొనవలసిన సత్యాలు ఏమిటో పౌలు మనకు వివరించాడు. 

4 విషయాలు ఆయన చెప్పాడు. 

మొదటిగా ఐగుప్తు నుండి విడుదల 

పాత  నిబంధనలో ప్రాముఖ్యముగా కనిపించే సంఘటన ఇశ్రాయేలీయుల విడుదల. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. అప్పుడు దేవుడు వారి యొద్దకు మోషేను పంపి వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. 

రెండవదిగా మోషే ద్వారా బాప్తిస్మము 

అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి

    1 కొరింథీ 10:2 

     ఇశ్రాయేలీయులు మోషే ను బట్టి బాప్తిస్మము పొందారు. బాప్తిస్మము అంటే గుర్తింపు పొందుట. అది ఒక ఐడెంటిఫికేషన్. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఫరోతో ఐడెంటిఫై అయ్యారు. ఫరో క్రింద వారు ఉన్నారు. వారు బాప్తిస్మము పొందిన తరువాత ఈజిప్టు తో వారి సంబంధం తెగిపోయింది. ఇప్పుడు వారు మోషే తో ఐడెంటిఫై అయ్యారు. మోషే తో వారు ఐక్యం అయ్యారు. వారు మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి

    1 కొరింథీ 10:2 

     సముద్రము మరణానికి మేఘం పరలోకానికి గుర్తుగా ఉన్నాయి. బాప్తిస్మము పొందిన వ్యక్తి ఈ లోక సంభందమైన వాటి విషయములో మరణిస్తున్నాడు. పరలోక సంబంధమైన వాటి విషయములో జీవిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు తో మనము బాప్తిస్మము పొందాము. అంటే ఆయన యొక్క మరణము, పునరుత్తానము ల యందు మనము ఆయనతో ఐక్యం చెందుతున్నాము. ఈ లోకముతో కాకుండా క్రీస్తుతో మనం గుర్తింపు పొందుతున్నాము. ఆయనతో మనం ఐడెంటిఫై అవుతున్నాము. 

మూడవదిగా అరణ్యములో దేవుని పోషణ 

దేవుడు అరణ్యములో ఇశ్రాయేలీయులను 40 సంవత్సరముల పాటు ఎలా పోషించాడో పౌలు ఇక్కడ వివరించాడు. అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. 

                  1 కొరింథీ 10: 3-4 

ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.

                 1 కొరింథీ 10: 3-4 

     వారు ఒక్క సంవత్సరం కూడా భూమిని సేద్యం చేయలేదు. పంటలు పండించలేదు. దేవుడు 40 సంవత్సరాలు వారికి ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చాడు. ప్రతి రోజూ వారి మీద మన్నా ను కురిపించాడు. వారి దాహం తీర్చుకోవడానికి దేవుడు వారికి ఆత్మ సంబంధమైన పానీయమును ఇచ్చాడు. ఆత్మసంబంధమైన బండ వారిని వెంబడించింది. ఆ బండ వారికి సమృద్ధిగా నీటిని ఇచ్చింది. ఆ బండ క్రీస్తే. 

     కాబట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యములో పోషించింది ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన ఈ లోకానికి మానవ రూపములో రాక మునుపే ఆత్మ సంబంధమైన రూపములో ఇశ్రాయేలీయులకు సేవ చేశాడు. 

4. పాపముతో పోరాటం 

నాలుగవదిగా ఇశ్రాయేలీయులు అరణ్యములో పాపముతో పోరాటం చేశారు. 5 వచనం చూద్దాము. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగాఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి

   దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను దేశములో ఎక్కువ మంది ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే వారు పాపముతో ఆడుకున్నారు. పౌలు మనతో ఏమన్నాడంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటినిఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.

   1 కొరింథీ 10: 6

ఇశ్రాయేలీయుల చరిత్ర నుండి మీరు ఈ పాఠాలు నేర్చుకోండి అని పౌలు మనతో అంటున్నాడు. మొదటిగా, ఐగుప్తు నుండి విడుదల మనలను కూడా దేవుడు ఈ లోకము నుండి, దాని మీదకు రాబోయే తీర్పు నుండి విడిపించాడు. మోషే అనే రక్షకుని ద్వారా వారికి విడుదల కలిగింది. యేసు క్రీస్తు ప్రభువు అనే రక్షకుని ద్వారా మనకు విడుదల కలిగింది. 

రెండవదిగా, ఇశ్రాయేలీయులు మోషే లో బాప్తిస్మము పొందినట్లుగా మనము కూడా క్రీస్తు నందు బాప్తిస్మము పొందాము. మూడవదిగా, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభువు అరణ్యములో అనుదినం పోషించినట్లు ఈ రోజు మనలను కూడా దేవుడు పోషిస్తున్నాడు. నాలుగవదిగా, ఇశ్రాయేలీయులు పాపముతో ఆడుకొని పెద్ద పరిహారం చెల్లించారు. 

పాపముతో ఆడుకొనుట 

పౌలు వారు చేసిన నాలుగు పాపాలు ఇక్కడ పేర్కొన్నాడు. 

విగ్రహారాధన 

వ్యభిచారం 

దేవుని శోధించుట 

సణుగుట 

ఇశ్రాయేలీయులు చేసిన 

మొదటి పాపం విగ్రహారాధన

వారి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి 

1 కొరింథీ 10: 7 

ఇశ్రాయేలీయులు ఈజిప్టు ను విడిచి పెట్టి బయటకు వచ్చారే కానీ వారి హృదయములో ఈజిప్ట్ దేవతల మీద అనురాగం ఉంచుకొన్నారు. దేవుని యొద్ద నుండి పది ఆజ్ఞలు అందుకోవడానికి మోషే గారు సీనాయి పర్వతం ఎక్కారు. దేవుని మహిమ దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కనిపించింది 

(నిర్గమ 24:17). 

     40 రోజులు మోషే సీనాయి పర్వతము మీద ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు సహనం నశించింది. వారు అహరోను గారిని పిలిచారు. ‘అహరోను, నీ అన్న మోషే ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. మా కోసం ఒక దేవతను చేసి మా ముందు నడిపించు’ అహరోను వారి మాటలు విని అందరి దగ్గర ఉన్న బంగారం ఒక చోట పోగుచేసి దానిని కరిగించి ఒక దూడ ఆకారములో ఉన్న దేవతను చేసి వారి ముందు నిలబెట్టాడు. 

ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని వారు కేకలు వేశారు. యెహోవా దేవునికి పండుగ చేశారు. బలిపీఠము కట్టి బలులు అర్పించారు. తినుటకు, త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు. ఏపీస్ బుల్ (apis bull) అంటే బఱ్ఱె రూపములో ఉండే దేవుడు ఈజిప్టు లో వారు చూసిన దేవుడు. ఆ బఱ్ఱె దేవత ను యెహోవా దేవునితో వారు కలిపారు. 

దేవుడు వేరు, ఈ సృష్టి వేరు. సృష్టించి బడిన దేని రూపములో కూడా మనం ఏ విగ్రహాలు చేసుకోకూడదు. వాటిని దేవునితో కలుపకూడదు. ఇశ్రాయేలీయులు చేసిన పెద్ద పాపం అదే. వారు ఈజిప్టు దేవత ను, యెహోవా దేవుని కలిపారు. ‘తినుటకు, త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు’ అని ఇక్కడ వ్రాయబడింది. తినుట, త్రాగుట, ఆడుకోవటం లో తప్పే ముంది అని మనకు అనిపించవచ్చు. వారు ఈ దేవతకు విందులు చేసుకొంటున్నారు. ఆడుకోవటం అంటే సెక్స్ వినోదం అని అర్థం.విగ్రహారాధన ఎప్పుడూ సెక్స్ వినోదం తో కలిసే ఉంది. కొరింథు నగరములో ఉన్న ఆఫ్రోడిటీ దేవతకు దేవదాసీలు ఉండేవారు. ఆమె దేవతకు ఆరాధన చేయడం, ఆ దేవదాసీలతో శృంగారం చేయడం ఆమె ఆలయాల్లో జరుగుతూ ఉండేది. కొరింథు సంఘములో ఉన్న కొంత మంది క్రైస్తవులు కూడా ఈ విగ్రహారాధన వైపు మళ్లారు. 

    పౌలు వారితో ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు అరణ్యములో విగ్రహారాధన చేసి దేవునికి కోపం తెప్పించారు. ఆ పాపం మీరు చేయబాకండి. 

ఇశ్రాయేలీయులు చేసిన రెండవ పాపం వ్యభిచారం 

మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.

   1 కొరింథీ 10: 8 

  ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేశారు. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వారిని తీవ్రముగా శిక్షించాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, మనం వారివలె వ్యభిచరింపక యుందము. తన ప్రజలు ప్రత్యేకముగా, పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకొంటున్నాడు. పది ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. వాటిని అతిక్రమించినప్పుడు దేవుడు తన ప్రజలను శిక్షించాడు. ఆ తరువాత, ఇశ్రాయేలీయులు చేరిన మూడవ పాపం చూడండి. 

దేవుని శోధించుట 

మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.

 1 కొరింథీ 10: 9 

వారు దేవుని శోధించారు. దేవుడు వారికి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను వారు జాగ్రత్తగా వాడుకోలేదు. ‘ఈ దేవుడు ఎంత ఓర్చుకొంటాడో చూద్దాము’ అని దేవుని పరీక్షిద్దాము అని వారు అనుకొన్నారు. దేవుని శోధించడం అంటే అదే. 

(సంఖ్యా కాండం 21:6-9) 

  దేవుని ఇష్టాయిష్టాలతో పని లేకుండా దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే దేవుని శోధించడం. దేవుడు నన్ను ఎంత వరకు ఓర్చు కొంటాడో చూస్తాను. నన్ను ఎంత వరకు భరిస్తాడో చూస్తాను అని కొంత మంది దేవుని సహనాన్ని పరీక్షిస్తారు. అది నిప్పుతో ఆడుకోవడమే. ఇశ్రాయేలీయులు దేవుని శోధించినప్పుడు దేవుడు వారి మధ్యకు పాములను పంపించి వారిని శిక్షించాడు. పాము సాతానుకు చిహ్నముగా ఉంది. సాతాను యేసు ప్రభువుతో అన్నాడు, ‘నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు’ ఆ మాటతో సాతాను దేవుని శోధించాడు. దేవుని శోధించడం అంటే అది సాతాను చేసే పని. ఆ పని మనం చేయకూడదు. 

ఇశ్రాయేలీయులు చేసిన నాలుగవ పాపం సణుగుట 

మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

 1 కొరింథీ 10:10 

ఇశ్రాయేలీయుల అవసరాలు దేవుడు తీర్చాడు. వారిని ఈజిప్టు లో బానిసత్వం నుండి విడిపించడం చాలా గొప్ప సంగతి. అయితే వారికి సంతృప్తి లేదు. ‘రోజూ ఈ మన్నా తిని మాకు విసుగు పుడుతోంది’ వారి అసంతృపి లో నుండి వారు సణగడం, గొణగడం చేశారు. 

   ఈ ప్రపంచములో మన కన్నా మంచి స్థితిలో ఉండేవారు ఎప్పుడూ ఉంటారు. అయితే మనం వారితో మనలను పోల్చుకోకూడదు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనం సంతృప్తి చెందాలి. లేకపోతే మనం దేవుని మీద సణగడం మొదలు పెడతాము. మనం సంతృప్తి గా ఉన్నప్పుడే దేవుని స్తుతించగలం. మనం అసంతృప్తితో ఉన్నప్పుడు దేవుని మీద సణుగుతాము. మన సణుగుడు దేవుని హృదయాన్ని బాధిస్తుంది. ఇశ్రాయేలీయులు సణుగుడు తో దేవునికి కోపం తెప్పించారు. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి.

ఇశ్రాయేలీయులు చేసిన 4 పాపాలు గురించి ఈ రోజు మనం చూసాము. 

విగ్రహారాధన 

వ్యభిచారం 

దేవుని శోధించుట 

సణుగుట 

ఈ నాలుగు పాపముల నుండి మనం రక్షించబడాలి. యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడి మారు మనస్సు పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply