
క్రొత్త నిబంధన లోని పత్రికలలో మొదటి పత్రిక రోమీయులకు వ్రాసిన పత్రిక. ఈ పత్రిక మొదటిగా మనం చదివి అర్ధం చేసుకోవాలని దేవుని ఉద్దేశ్యం. ఇందులో అనేక ప్రశస్తమైన సత్యాలు మనకు కనిపిస్తాయి. ఇది ఒక బంగారు ఖని వంటిది. దానిని త్రవ్వేకొద్దీ అనేక స్వర్ణాభరణాల వంటి సత్యాలు మనకు అందులో కనిపిస్తాయి. క్రైస్తవ్యము అర్థం కావాలంటే ఈ పత్రిక చదవాల్సిందే. దేవుడు ఎవరు? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ఆయన లక్షణాలు ఏమిటి? మానవుడు ఎవరు? మనిషి స్థితి ఏమిటి? మనిషి దేవునితో ఎలా సంబంధం పెట్టుకోగలడు? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అవసరం ఏమిటి? అలాంటివి మనకు అర్థం కావాలంటే ఈ పత్రిక మనం చదవాల్సిందే. దేవుని యొక్క 12 లక్షణాలు ఈ పత్రికలో మనకు కనిపిస్తున్నాయి. ఈ 20 లక్షణాలు మనం అర్ధం చేసుకొంటే, దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క పనులు మనకు స్పష్టముగా తెలుస్తాయి.
1.God of Preeminence
మొదటిగా, he is a God of Preeminence
దేవుడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి. తాను చేసే సమస్త కార్యములలో అత్యున్నతుడుగా ఉన్న దేవుడు. సమస్తమును తన వశము చేసుకొన్న దేవుడు. దేవుని యొక్క ప్రాముఖ్యత అపోస్తలుడు స్పష్టముగా మనకు వివరిస్తున్నాడు. క్రైస్తవ సువార్త దేవుని యొక్క కార్యము.అది దేవుని చుట్టూ అల్లబడింది. అది దేవుని వ్యక్తిత్వం, ఆయన లక్షణముల మీద ఆధారపడింది. క్రైస్తవ్యము అర్థం కావాలంటే మనం ముందుగా దేవుని గురించిన సత్యాలు తెలుసుకోవాలి. మనిషి యొక్క పతనము, మనిషి యొక్క పాప స్థితి, మనిషి మీద చేయబడిన నేరారోపణలు, మనిషి యొక్క విమోచన, యేసు క్రీస్తు యొక్క శరీర ధారణ, ఆయన యొక్క సిలువ, మరణం, పునరుత్తానము వీటన్నిటిలో దేవుడు ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తున్నాడు. దేవుడు లేకుండా వాటికి అర్థం లేదు. అందుకనే ఈ రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు దేవుని వ్యక్తిత్వాన్ని మనకు ప్రముఖముగా చూస్పితున్నాడు.
దేవుడు అద్వితీయుడు.(రోమా 16:27) అని వ్రాశాడు. ఆయన వంటి వ్యక్తి మరొకరు లేరు. నాలాంటి వ్యక్తులు కోట్ల మంది కనిపిస్తారు. మీ లాంటి వ్యక్తులు కోట్ల మంది కనిపిస్తారు. అయితే దేవుని వంటి వ్యక్తి మరొకరు మనకు కనిపించరు. దేవుడు ఇలాంటి పని చేశాడు ఏమిటి? దేవుడు ఇలాంటి మాట అన్నాడు ఏమిటి? దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటి? నాకెక్కడా ఇలాంటి వ్యక్తి కనిపించలేదు అని మనకు అనిపించవచ్చు. అయితే దేవుని తీసుకొని ఇంకే వ్యక్తితో మనం పోల్చకూడదు ఎందుకంటే, ఆయన అద్వితీయుడు. ఆయన వంటి వ్యక్తి మరొకరు లేరు. ఈ ప్రకృతి లో, మన ప్రపంచ చరిత్రలో మన రక్షణలో దేవుడు తన ప్రాముఖ్యతను స్పష్టముగా చాటుకున్నాడు. మనిషి దేవుని ప్రాముఖ్యతను ప్రక్కన పడేస్తాడు. నన్ను నేను రక్షించుకోగలను, నా సమాజాన్ని నేను బాగుచేసుకోగలను నాకు దేవుని అవసరం లేదు అని మనిషి అనుకొంటాడు. అయితే దేవుడు అత్యంత ప్రాముఖ్యత కలిగినవాడు. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు (యోహాను సువార్త 15:5) అన్నాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 15:5 అధ్యాయములో. ఎందుకంటే ఆయన అంత ప్రాముఖ్యత కలిగిన వాడు.
దేవుడు లేకుండా ఒక్క వ్యక్తి కూడా తనను తాను రక్షించుకోలేడు. ఆ సత్యము పౌలులో దీనత్వము కలిగించింది. ‘యేసు క్రీస్తు దాసుడు’ అనే పేరుతో అపోస్తలుడు తనను పిలుచుకొన్నాడు. దేవునికి చెందవలసిన పేరులతో అపోస్తలుడు తనను పిలుచుకోలేదు. ‘యేసు క్రీస్తు దాసుడను’ అని పిలుచుకొన్నాడు. పెద్ద పెద్ద పేరులు మనం మనకు పెట్టుకొంటాము. ‘నేను యేసు క్రీస్తు దాసుడను’ అని పిలుచుకునే వారు మనకు అరుదుగా కనిపిస్తారు. ‘యేసు క్రీస్తు ప్రభువు’ అని పిలవడం కూడా తగ్గిపోయింది. ‘యేసు ఇలా అన్నాడు’ ‘యేసు ఇలా చెప్పాడు’ ‘యేసు ఇలా చేసాడు’ అంటూ ఉంటారు. పౌలు అలా పిలువలేదు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన యేసు క్రీస్తు ప్రభువు. అయితే పౌలు నేను యేసు క్రీస్తు -నేను దాసుడను మాత్రమే, ఆయన నాకు ప్రభువు.
నేను ప్రభువును, దేవుడే నాకు దాసుడు కావాలి అనే మనస్తత్వం చాలా మందికి వుంది. పౌలు మాత్రం నేను దాసుడను అని తనను పిలుచుకొన్నాడు. నేను దాసుడను మాత్రమే, యేసు క్రీస్తు మాత్రమే ప్రాముఖ్యత కలిగిన వాడు అని ఆయన గుర్తించాడు. దేవుని యొక్క ప్రాముఖ్యత ఈ పత్రికలో మనకు స్పష్టముగా కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువుకు కూడా మానవ సృష్టిలో దేవుడు అంత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు.
ఆదాము ప్రకృతి సంబంధమైన సృష్టిలో మొదటి మనుష్యుడు. అయితే, యేసు క్రీస్తు ఆత్మ సంబంధమైన, పునరుత్తాన సంబంధమైన సృష్టిలో మొదటి మనుష్యుడు. (1 కొరింథీ 15:23)
ఆదాము దేవుని కుమారుడు అని పిలవబడ్డాడు (లూకా 3:38). యేసు క్రీస్తు కూడా దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు (యోహాను 1:14)
ఆదాము ను దేవుడు ఒక రాజుగా నియమించాడు (ఆది కాండము 1:28). యేసు క్రీస్తు కూడా దేవుని చేత అభిషక్తుడైన రాజు (మాథ్యూ 1:16)
ఆదాము మానవ జాతికి తండ్రి గా ఉన్నాడు. యేసు క్రీస్తు నూతన సృష్టికి తండ్రిగా ఉన్నాడు (ఆది 3:20; రోమా 5:12-24)
ఆదాము తన భార్య అయిన హవ్వతో కలిసి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. యేసు క్రీస్తు విధేయత చూపించి తన వధువైన క్రైస్తవ సంఘమును సంపాదించుకున్నాడు (ఆది 3:6; ప్రకటన 19:7-9)
ఆదాము సిగ్గుపరచబడ్డాడు. అది అతని పాపము వలనే. యేసు క్రీస్తు కూడా సిగ్గుపరచబడ్డాడు. అయితే అది మన పాపములను బట్టి (ఆది 3:21; మత్తయి 27:27-35)
ఆదాము పాపము వలన దేవుని యొద్ద నుండి మనం వెళ్లగొట్టబడ్డాము. పాపము, శాపము, ఒంటరి తనం, ద్వేషం, హత్యము, హింసా కాండ మానవ జాతిలో ప్రవేశించినవి. యేసు క్రీస్తు వలన మనం దేవుని యొద్దకు తేబడ్డాము. దేవుని పరిశుద్ధత, శాంతి, సమాధానం, సహవాసం, ప్రేమ మనకు లభించినవి. ఆదాము వలన పాపము మనకు సంక్రమించింది; యేసు క్రీస్తు వలన కృప మనకు సంక్రమించింది. ఆదాము వలన మరణం మనకు సంక్రమించింది. యేసు క్రీస్తు వలన జీవం మనకు సంక్రమించింది (రోమా 5:23; 1 యోహాను 5:11).
2.God of Perpetuity
రెండవదిగా He is a God of Perpetuity. ఆయన నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. ఆయన తో పాటు అన్ని సమయాల్లో, అన్ని చోట్ల, అన్ని కార్యాల్లో ఎవరూ ఉండరు. కేవలం ఆయన మాత్రమే నిత్యునిగా ఉన్నాడు. సమస్తము తన దృష్టికి నచ్చినట్లు ఆయన జరిగిస్తున్నాడు.
16 అధ్యాయము లో చూడండి:
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది.
రోమా 16:25
ఈ రక్షణ కార్యము నిత్య దేవుని యొక్క పని. నేను నా జీవిత కాలము లో చేయగలిగిన పనులు మాత్రమే ఆలోచించగలను. వచ్చే సంవత్సరం ఈ పని చేయాలని నాకు ఉంది, పది సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్ట్ ముగించాలని నాకు ఉంది, ఇరవై సంవత్సరాల తరువాత రిటైర్ మెంట్ తీసుకోవాలని నాకు ఉంది అని నేను చెప్పగలను. ఇంకో వంద సంవత్సరాల తరువాత ‘ఈ పని చేస్తాను’ అని నేను చెప్పలేను. ఇంకో వంద సంవత్సరాల తరువాత ఈ ప్రపంచాన్ని ప్రత్యక్షముగా మనము ప్రభావితం చేయగలమా? వంద సంవత్సరాలకు ముందు మనం ఈ లోకములో లేము. ఇంకో వంద సంవత్సరాల తరువాత మనం ఈ లోకములో ఉండము. తాత్కాలికమైన ఓ మనిషీ, నిత్యుడగు దేవుని ప్రశ్నించే జ్ఞానము నీకు ఉందా? అని పౌలు గారు ఈ పత్రికలో ప్రశ్నించాడు.
‘దేవుడు ఈ మాట అనాల్సింది కాదండి. దేవుడు ఇలా ప్రవర్తించాల్సింది కాదండి. దేవుడు ఆ పని చేయడం ఏమీ బాగోలేదు’ ఇలాంటి కామెంట్స్ మనం చాలా సార్లు వింటూ ఉంటాము. అయితే దేవుడు నిత్యుడగు దేవుడు అని మనం గుర్తించుకోవాలి. దేవునితో పోల్చుకొంటే మన అనుభవం చాలా తక్కువ. మన జ్ఞానం చాలా తక్కువ. ‘అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము’నిత్యుడగు దేవుడు ఈ సువార్త ను రహస్యముగా ఉంచాడు. ఇప్పుడు దానిని మనకు ప్రత్యక్షం చేసాడు. ఏ పని ఏ సమయములో చేయాలో ఆయనకు తెలుసు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
రోమా 11:33 – 34
నిత్యుడగు దేవుని జ్ఞానము, ఆయన తీర్పులు, ఆయన మార్గములు శోధించే శక్తి మనకు ఉందా? అని పౌలు ఆ మాటల్లో అడుగుతున్నాడు. రక్షణ కార్యము కూడా దేవుని యొక్క నిత్యత్వముతో ముడి పడి ఉంది. ఇది ‘5 సంవత్సరముల రక్షణ కాదు’ ‘పది సంవత్సరముల రక్షణ కార్యము’ కాదు. ఇది శాశ్వతమైనది ఎందుకంటే ఇది నిత్యుడగు దేవుడు చేసిన కార్యము.
God, being eternal, should be the object of all our time. God, being the Spirit, should be the object of all our worship. God, being love, should be the basis of all our emotions. God, being holy, should be the basis of all our morality.
3.God of Perfection
దేవుడు పరిపూర్ణుడు. ఆ తరువాత దేవుని యొక్క పరిపూర్ణత గురించి అపోస్తలుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు పరిపూర్ణుడు గా ఉన్నాడు. ఆ తరువాత ఆయన పరిపూర్ణుడైన దేవుడు. ఆయనలో ఒక్క లోపము కూడా లేదు. ఆయనలో ఒక్క అక్రమము కూడా లేదు. పాపములో ఉన్న మనుష్యులు ఈ దేవుని ఎదుట అపరిపూర్ణులుగా ఉన్నారు. ఆయన పరిశుద్ధతలో, ఆయన నీతిలో,ఆయన మంచితనములో ఆయన శక్తిలో, ఆయన ప్రేమలో ఎటువంటి అపరిపూర్ణత లేదు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు.
దేవునికి దగ్గరగా వెళ్తేనే మనకు పరిపూర్ణత కలుగుతుంది. దేవుడు లేకుండా నేను పరిపూర్ణత పొందగలను అనుకోవడం అవివేకం. మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును
మత్తయి 4:4
దేవుని వాక్యం లేని మనిషి అపరిపూర్ణముగా ఉన్నాడు. రొట్టె, బట్ట, ఇల్లు, వాకిలి విద్య, ఉద్యోగం సినిమాలు, షికార్లు – మనిషి వికాసానికి అవి చాలు అనుకొనే వారు చాలా మంది ఉన్నారు. అవన్నీ ‘materialism’ క్రిందకే వస్తాయి. అవి మనిషి ని ముందుకు నడిపించలేవు. చాలా నగరాల్లో మీరు చూడండి. అక్కడ ఎంతో డబ్బు ఉంటుంది,పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీ లు ఉంటాయి, పెద్ద పెద్ద ఎయిర్ పోర్టులు ఉంటాయి. అయినప్పటికీ అక్కడ ఎంతో హింస, ఎంతో డ్రగ్స్ వాడకం, ఎంతో మద్యపానం, ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు ఎన్నో ఆత్మహత్యలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క పరిపూర్ణత లేకుండా మనిషి ఎప్పటికీ పరిపూర్ణత సాధించలేడు. దేవుని కి దూరముగా వెళ్లిపోయే వ్యక్తి పరిపూర్ణత ఎప్పటికీ పొందలేడు.
వారి పరిస్థితి ఎలా ఉంది? వారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును,
రోమా 1:30-31
దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకము లాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
రోమా 1:30-31
దేవుని కి దూరముగా వెళ్లిపోయే సమాజము అటువంటి వ్యక్తులతో నిండిపోతుంది. దేవుని పరిపూర్ణత ముందు మనిషి లోప భూయిష్ఠుడుగా ఉన్నాడు. అపోస్తలుడు ఆ సత్యము మనకు ఈ పత్రికలో స్పష్టముగా వివరిస్తున్నాడు. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
రోమా 3:23
ఏ భేదం లేదు, మనలో ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుని యొక్క పరిపూర్ణతను అందుకోలేని స్థితిలో ఉన్నారు. మన మంతా ఒక టెస్ట్ వ్రాశామనుకొందాము. పాస్ మార్కులు 50 మార్కులు. 10 మార్కులు వచ్చిన వాడు ఫెయిల్ అయినట్లే. 30 మార్కులు వచ్చిన వాడు ఫెయిల్ అయినట్లే. 49 మార్కులు వచ్చిన వాడు ఫెయిల్ అయినట్లే. 49 మార్కులు వచ్చిన వాడు 10 మార్కులు వచ్చిన వాడిని చూసి గర్వించవచ్చు. కానీ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మనం కూడా ‘చాలా మందితో పోల్చుకొంటే నేను చాలా మంచి వాణ్ని. నేనెవర్ని హత్య చేయలేదు, నేనెర్ని రేప్ చేయలేదు. నన్ను పాపి అని పిలవవద్దు. నేను పాపిని కాదు’ అని అనుకోవచ్చు. అయితే దేవుని పరిపూర్ణత ముందు మనం తూగలేము. దేవుని పరిపూర్ణతను మనం ఎప్పటికీ అందుకోలేము.
దేవుడు మనకు ఒక గుడ్ న్యూస్ చెబుతున్నాడు. యేసు క్రీస్తు నందు మనము పరిపూర్ణత పొందుతున్నాము. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
రోమా 3:23-24
అక్కడ కృప అనే మాట మనం గమనించాలి. ఇంగ్లీష్ లో Grace అంటాము.
God’s
Riches
At
Christ’s
Expense
ప్రభువైన యేసు క్రీస్తు చెల్లించిన విమోచన క్రయధనము వలన దేవుడు మనకు ఉచితముగా తన పరిపూర్ణతను ఇచ్చాడు. మనకు ఉచితముగా తన ఐశ్వర్యమును ఇచ్చాడు. దేవునికి పక్షపాతము లేదు
(రోమా 2:11)
అడిగిన ప్రతివారికీ ఆయన తన పరిపూర్ణ మైన కృపను ఇస్తున్నాడు. అబ్రహాము చేసింది అదే. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను (రోమా 4:3). అబ్రహాము దేవుని మీద విశ్వాసముంచి ఆ పరిపూర్ణత పొందాడు. ఈ రోజు దేవుడు మనకు కూడా ఆ పరిపూర్ణత ఉచితముగా ఇస్తున్నాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని,దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
రోమా 10:9
హృదయములో నమ్ము, నోటితో ఒప్పుకో….దేవుని వాక్యం ప్రకారం జీవించు. దేవుని పరిపూర్ణత పొందటానికి అవి చాలు.
4.God of Possession
సమస్తము తన ఆధిపత్యములో ఉంచుకొన్న దేవుడు. మూడవదిగా అపోస్తలుడు దేవుని యొక్క ఆధిపత్యము మనకు చూపిస్తున్నాడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
రోమా 11:36
విశ్వం, అందులోని ప్రతిదీ దేవునికి చెందినదే ఎందుకంటే వాటన్నిటినీ సృష్టించింది దేవుడే. ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. డార్విన్ సిద్ధాంతము నమ్మే వ్యక్తి ఈ విశ్వము ఎందుకు చేయబడిందో చెప్ప లేడు. ఈ విశ్వం ఎవరి కోసం చేయబడిందో చెప్పలేడు. ఎందుకంటే దేవుని వాక్యం అతడు తెలుసుకోలేదు. ఈ విశ్వము లో ఉన్న సమస్తము దేవుని కొరకు సృష్టించబడినవి అని అపోస్తలుడు అంటున్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.
రోమా 3:29
దేవుడు ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో దేవుడు కాదు. మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు – వారు ఎక్కడ పుట్టినా, పెరిగినా వారందరికీ ఆయన దేవుడే. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడలకృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.
రోమా 10:12
సమస్తము దేవునికి చెందినదే సమస్త ప్రజలు దేవుని సృష్టే. దేవుని యొక్క ఐశ్వర్యం అపోస్తలుడు మనకు చూపిస్తున్నాడు. ఇది నా ఇల్లు, నా బిజినెస్, నా ఆస్తి, నా పొలం, నా శరీరం, నా ఆత్మ అని మనం అనుకొంటాము. అయితే ఏదీ నీది కాదు. నీ శరీరం కూడా దేవునిదే నీ ఆత్మ కూడా దేవునిదే.
సమస్తము ఆయనకు చెందినవే. ‘నాకు, దేవునికి ఏ మాత్రం సంబంధం లేదు. దేవునికి నా మీద ఏ అధికారం లేదు’ అని ఎవరూ అనకూడదు. ప్రతి జీవి, ప్రతి మనిషి, ప్రతి దేవదూత, ప్రతి దెయ్యం, ప్రతి వస్తువు – దేవునికి చెందినవే. అవి ఆయన అధికారం క్రింద ఉండవలసినదే.
5.God of Power
దేవుడు శక్తి గలిగిన వాడు.ఆయన కు ఉన్నంత శక్తి ఇంకెవ్వరికీ లేదు. దేవుడు సర్వశక్తి మంతుడు. దేవుని శక్తి లేకుండా ప్రకృతి, భౌతిక ప్రపంచం ఒక్క క్షణం కూడా కొనసాగలేవు. ఆయన శక్తి లేకుండా ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు.
రోమా పత్రిక 1 అధ్యాయము 20 వచనము చూద్దాము.
దేవుని యొక్క అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును,జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి
రోమా 1:20
దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటే ఆయన యొక్క శక్తి ఆయన యొక్క దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి. ఒక మంచి వస్తువు ను మనం చూసినప్పుడు, ఉదాహరణకు ఒక కెమెరా మనం చూసినప్పుడు, అది చక్కటి ఫోటోలు తీస్తుంది, మన జుట్టు, మన మొహం, మన నవ్వు సమస్తం అది ఫొటోలో చూపించగలదు, అది మన స్వరం కూడా రికార్డు చేస్తుంది. ఈ కెమెరా ని సృష్టించిన వాడు ఎంతో సృజనాత్మకత, జ్ఞానం కలిగిన వాడు అని మనం అనుకొంటాము. ఈ సృష్టిని మనం చూసినప్పుడు, అందులో కనిపిస్తున్న చక్కటి నిర్మాణం దాని యొక్క సృష్టికర్త యొక్క జ్ఞానం మనకు చూపిస్తుంది.
ఒక ఆటమ్ ని మీరు చూస్తే అందులో ఉన్న చక్కటి నిర్మాణం,
ఒక DNA కణం మీరు చూస్తే అందులో కనిపించే చక్కటి వ్యవస్థ
ఒక ప్లానెట్ తన ఆర్బిట్ లో ప్రయాణించే నిర్దిష్ట వేగం
ఒక జంతువులో కనిపించే అందం
ఒక మనిషిలో కనిపించే రేషనాలిటీ
ఇవన్నీ దేవుని శక్తిని, జ్ఞానమును మనకు చూపిస్తున్నాయి.
పౌలు గారి మాటలు మీరు గమనించండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను జగదుత్పత్తి….. విశ్వము కూడా సృష్టించబడినదే అనే సత్యము అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి వస్తువు సృష్టించబడవలసినదే. దానంతటికి అదే ఉనికి లోకి రాలేదు. ఒక మనిషి తనను తాను సృష్టించుకోలేడు. ఒక వస్తువు కూడా తనను తాను సృష్టించుకోలేదు. ఈ యూనివర్స్ కూడా తనను తాను సృష్టించుకోలేదు. దేవుని యొక్క గొప్ప శక్తి దాని సృష్టిలో, నిర్మాణములో, పనుల్లో మనకు కనిపిస్తున్నది. ఈ సృష్టి ని చూసినప్పుడు దానిలో ఆయన యొక్క అపరిమితమైన, మనం ఊహించలేనంత మన జ్ఞానమునకు అందనంత శక్తి అందులో మనకు కనిపిస్తుంది. ప్రతి టెలిస్కోప్, ప్రతి మైక్రోస్కోప్, ప్రతి సాటి లైట్, ప్రతి తుఫాను, ప్రతి భూకంపం దేవుని శక్తిని మనకు చూపించేవే. ఒక పెద్ద తుఫాను వస్తే . దాని ఉదృతికి పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జి లు, గోడలు పేక ముక్కల్లాగా కూలిపోతాయి.
వరద నీటిలో మొసళ్ళు, పాములు ఇళ్లల్లో ప్రవేశిస్తాయి. ప్రకృతి సృష్టించిన భీభత్సం తట్టుకోలేక పారిపోదాము అని ప్రయత్నిస్తే బ్రిడ్జిలు కూలిపోతాయి. మనకు ఎంతో శక్తి ఉంది అని మనకు అప్పుడప్పుడూ అనిపించవచ్చు. దేవుడు ఒక చిన్న తుఫాను మన వైపుకు పంపిస్తే మనం బెంబేలెత్తిపోతాము. ఆ నిత్య శక్తిని చూడు అని అపోస్తలుడు మనతో అంటున్నాడు. ప్రకృతి కి నిత్య శక్తి లేదు. laws of థెర్మోడైనమిక్స్ చెప్పేది అదే. ప్రకృతిలో ఉన్న ఉపయోగకరమైన శక్తి రోజు రోజుకూ తగ్గిపోతున్నది. అయితే దేవుని శక్తి మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఆ దేవుని శక్తి మన యొద్దకు ఎలా వచ్చిందో అపోస్తలుడు వివరిస్తున్నాడు. యేసు క్రీస్తు నందు దేవుని శక్తి మానవులకు కనిపించింది.
ప్రభువైన యేసు క్రీస్తు చేసిన ప్రతి అబ్దుత కార్యములో దేవుని శక్తి స్పష్టముగా మనకు కనిపించింది. ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలు వేలాది మందికి పంచాడు అంటే అది దేవుని శక్తే.
ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అంటే అది దేవుని శక్తే
ఆయన పుట్టు గ్రుడ్డి వానికి కంటి చూపు ఇచ్చాడు అంటే అది దేవుని శక్తే
ఆయన చనిపోయిన వారిని లేపాడు అంటే అది దేవుని శక్తే.
ఆయన తుఫానులు ఆపాడు అంటే అది దేవుని శక్తే
బంగాళా ఖాతములో అల్ప పీడనం వస్తే దానిని మనం ఆపగలమా?
ఒక తుఫాను ను ఆపే శక్తి మనకు ఉందా?
ఆయన తుఫానులు ఆపాడు అంటే అది దేవుని శక్తే
యేసు క్రీస్తు ను సమాధి లో నుండి బయటికి తెచ్చింది ఆ దేవుని శక్తే (రోమా 4:17) ఆ శక్తే మనలను మన పాపముల నుండి రక్షించింది. సాతాను అంధకార బంధముల నుండి ఆ శక్తి మనలను రక్షించింది. యేసు క్రీస్తు సువార్తలో ఆ శక్తి ఉంది. రోమా పత్రిక 1: 16 కూడా చూడండి.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
రోమా పత్రిక 1: 16
ఇందులో నేను సిగ్గు పడటానికి ఏమీ లేదు. నమ్మక ముంచిన ప్రతి వ్యక్తినీ రక్షించగలిగే దేవుని శక్తి యేసు క్రీస్తు సువార్తలో ఉంది. సృష్టిలో కనిపిస్తున్న దేవుని శక్తే యేసు క్రీస్తు సువార్తలో కూడా పనిచేసింది. యేసు క్రీస్తు సువార్త కార్యము ను దేవుడు ఎంతో కాలం ముందే ప్రారంభించాడు. అబ్రహాము, శారా లు సువార్త ప్రణాళికలో భాగస్తులే. లేని వాటిని ఉన్నట్టు గానే పిలిచే శక్తి దేవునికి ఉంది (4:17). అబ్రహాము, శారా లను దేవుడు పిలిచాడు. మీ ఇద్దరికీ నేను ఒక కొడుకు ను ఇస్తాను అని దేవుడు వారితో అన్నాడు. ఆ మాట విని వారు నవ్వుకొన్నారు. ‘పండు వృద్దాప్యములో మేము ఉన్నాము, కాటికి కాళ్ళు చాపుకొని బ్రతుకు తున్నాము. మాకు బిడ్డ ఎలా పుడతాడు? అని వారు దేవుని ప్రశ్నించారు.
అయితే దేవుడు లేని వాటిని ఉన్నట్టు గానే పిలిచేవాడు. దేవుని శక్తి అబ్రహాము, శారాలను కమ్ముకొంది. వారికి ఒక బిడ్డ జన్మించాడు. అబ్రహాము దేవుని శక్తిని చూశాడు. దేవుని మాటను నమ్మాడు. ఒక బిడ్డ కు జన్మనిచ్చే శక్తి అబ్రహాము, శారాలకు లేదు. వారికి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు.
అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను (రోమా 4:21-22). దేవుడు వాగ్దానము చేస్తే దానిని నెరవేర్చే శక్తి ఆయనకు ఉంది అని అబ్రహాము గ్రహించాడు (రోమా 4:21) అపోస్తలుడు ఈ పత్రికలో ఆ సత్యము మనకు ఎలా వర్తిస్తుందో తెలియజేశాడు. అబ్రహామును రక్షించిన దేవుని శక్తి – అదే దేవుని శక్తి ఈ రోజు మనలను రక్షించింది.
మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనము….
మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.
రోమా 4:24-25
మనలను మనం రక్షించుకునే శక్తి మనకు లేదు. ఏల యనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను.
రోమా 5:6
మన మింక బలహీనులమై యుండగా… మనిషి తన బలహీనతలను గుర్తించ లేని స్థితిలో ఉన్నాడు. నాకేమి తక్కువ? నాకు రక్షకుడు అక్కర లేదు నన్ను నేను రక్షించుకోగలను అని మనిషి అనుకొంటున్నాడు. తన బలహీనత గుర్తించలేక మనిషి ఆ విధముగా అసత్యాన్ని నమ్ముతున్నాడు. అయితే ఏల యనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను.
రోమా 5:6
అపోస్తలుడు దేవుని శక్తిని అర్థం చేసుకొన్నాడు. ఆయన మాటలు గమనించండి: ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. రోమా 15:18
గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను – వీటి గురించి తప్ప ఇంకే విషయముల గురించి నేను మాట్లాడను అని ఆయన అంటున్నాడు. నా గురించి నేను మాట్లాడుకోవడం దండగ. నేను బలహీనుణ్ణే. దేవుని శక్తిని మీరు చూడండి అని ఆయన అన్నాడు. దేవుని శక్తి తప్ప తనలో ఏమీ లేదని పౌలు గారు గుర్తించాడు.
1 అధ్యాయము 20 వచనం, దేవుని ‘నిత్య శక్తి’ దేవునికి నిత్య శక్తి ఉంది. రక్షణ కు అది కూడా చాలా ముఖ్యం. ఈ రోజు మనలను రక్షించే శక్తి దేవునికి ఉంది, సరే కానీ ఇంకో పది వేల సంవత్సరాల తరువాత మనలను రక్షించే శక్తి దేవునికి ఉంటుందా? ‘నా పని అయిపొయింది, నేను ఇక మిమ్ములను రక్షించలేను’ అని దేవుడు మనతో అంటాడా? పౌలు మనతో ఏమంటున్నాడంటే, దేవుడు అలా మనతో అనడు, ఎందుకంటే ఆయన నిత్య శక్తి కలిగి ఉన్నాడు. ఒక మనిషికి శక్తి ఎప్పుడూ ఒకే లాగా ఉండదు. యౌవనంలో ఉండే శక్తి వృధ్యాప్యము లో ఉండదు. కాలముతో మనిషి శక్తి తగ్గిపోతుంది. అయితే దేవుని శక్తి ఏ మాత్రం తగ్గదు. ఆ నిత్య శక్తి మనలను రక్షించింది.
దేవుని శక్తి లేకుండా మనిషికి రక్షణ లేదు. ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే (మత్తయి 19:26) అన్నాడు. యేసు ప్రభువు ఒక ధనవంతుడు పరలోకములో ఎలా ప్రవేశించగలడు? అనే ప్రశ్నకు అక్కడ జవాబు ఇచ్చాడు. ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుని శక్తి లేకుండా ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందలేడు. రక్షణ పొందుట మనుష్యులకు అసాధ్యము. అన్ని మతాలు ఒక్కటే, ఏ మతమైనా మనలను రక్షించగలదు అనే వారు మనకు తరచూ కనిపిస్తూ వుంటారు. వారు నశించిన పాపి యొక్క స్థితి గమనించలేని స్థితిలో ఉన్నారు.
సాతాను శక్తిని అధికమించే శక్తి ఎవరికి ఉంది? పాప కూపము క్రింద ఇరుక్కుపోయిన మనిషిని బయటికి తీయాలంటే ఎంత శక్తి కావాలి? ఆ శక్తి ఎవరికి ఉంది? నరకము వైపు దూసుకొని వెళ్తున్న ఒక పాపిని రక్షించే శక్తి ఎవరికి ఉంది? యేసు క్రీస్తును మరణం నుండి జీవము లోనికి తెచ్చే శక్తి ఎవరికి ఉంది? (2 కొరింథీ 13:4. ఎఫెసీ 1:20) ఆ శక్తి కేవలం దేవునికి మాత్రమే వుంది. 1:16 చూడండి.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి,మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.యేసు క్రీస్తు ను నమ్మే ప్రతి వ్యక్తిని రక్షించ గలిగే దేవుని శక్తి సువార్తలో ఉంది. నన్ను నేను రక్షించుకోగలను అనే వ్యక్తి రక్షణ ఎంత శక్తితో కూడుకొన్న వ్యవహారమో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏ మతమైనా ఒక్కటే అనే వ్యక్తి రక్షణ ఎంత శక్తితో కూడుకొన్న వ్యవహారమో అవగాహన స్థితిలో ఉన్నాడు.
ఒక పెద్ద బోయింగ్ విమానం బోయింగ్ 747 ప్రయాణము చేయాలంటే ఎంతో ఫ్యూయల్ కావాలి. దాని ట్యాంక్ లో 2 లక్షల లీటర్లు పెట్రోలు పోయాలి. దానిని గాలిలోకి లేపటానికే 19,000 లీటర్ల (5000 గాల్లోన్స్) పెట్రోలు కావాలి. ఒక బోయింగ్ 747 ఒక్క సారి గాలిలోకి లేవటానికే 19,000 లీటర్ల పెట్రోలు కావాలి. ఒక పైలట్ పెట్రోలు లేక ఆవేదన చెందుతూ ఉన్నాడు అనుకొందాము. నా విమానం లో పెట్రోలు ఎవరు పోస్తారు అని ఆ పైలట్ మిమ్ములను అడిగాడు అనుకొందాము. మీరు ఆ పైలట్ కి సహాయము చేయాలి అని అనుకొన్నారు. ‘పైలట్, నా కారులో చాలా పెట్రోలు వుంది. మొత్తం 60 లీటర్లు ఉంది. మొత్తం పెట్రోలు నీకిస్తాను. వెళ్లి నీ విమానం నడుపుకో’ అని మీరు అన్నారు. ఆ పైలట్ మీతో ఏమంటాడు. నాకు సహాయం చేయాలి అని మీకు అనిపించింది. కృతఙ్ఞతలు. నువ్వు ఇచ్చే 60 లీటర్లు నా విమానము లోకి సరిపోదు. నువ్వే ఇచ్చే పెట్రోలు అరంగుళం కూడా నా విమానమును గాలిలోకి లేపలేదు అంటాడు. ‘60 లీటర్ల పెట్రోలు నా కారులో పోస్తే నేను ఎంతో దూరం ప్రయాణించగలను’ అని మనం అనుకోవచ్చు. అయితే అది ఒక విమానము నకు సరిపోదు.
‘నన్ను నేను రక్షించుకొంటాను’ అనే వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. రక్షణ కార్యము ఎంత శక్తితో కూడుకొన్న పనో తెలియని స్థితిలో ఆ పాపి ఉన్నాడు. మన పాపముల భారము నుండి మనలను రక్షించే శక్తి మనకు లేదు. సాతాను శక్తి ని ఎదిరించే శక్తి మనలో లేదు. నరకము శక్తి నుండి మనలను కాపాడుకొనే శక్తి మనకు లేదు. ఎల్లకాలం భద్రపరచుకొనే శక్తి మనకు లేదు. దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించాల్సిందే. యేసు క్రీస్తు ప్రభువు యొక్క శక్తిని మనం ఆశ్రయించాల్సిందే. ఆ గొప్ప శక్తిని మీరు ఆశ్రయించాలి. యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ మీరు పొందాలి.
6.God of Preparation
God of Preparation, ఆయన సిద్ధపరచుచున్న దేవుడు. ఎంతో ఆలోచించి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం తన కార్యములు చేస్తాడు.
రోమా పత్రిక 5:12 నుండి చదువుదాము.
ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
ఆదాము రాబోవువానికి గురుతై యుండెను. ఆదాము పాపము చేసినప్పుడు మానవ జాతి మొత్తము పాపము క్రిందకు వచ్చింది. పాపము ద్వారా మరణము ఈ లోకములోకి ప్రవేశించింది. అయితే దేవుడు మనలను పాపములో, శాపములో, మరణములో విడిచిపెట్టలేదు. ఆదాము రాబోవువానికి గురుతై యుండెను. ఆ రాబోవు వాడు ఎవరంటే, మన ప్రభువైన యేసు క్రీస్తే.
ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మానవులను రక్షించాలి అని దేవుడు అప్పటి నుండే ఒక ప్లాన్ వేసుకొన్నాడు. అనేక మంది వ్యక్తులను దేవుడు పిలిచాడు. అనేక కార్యాలు ఆయన చేసాడు. అనేక పద్ధతులు ఆయన నియమించాడు. అవన్నీ దేవుడు సిద్ధము చేసిన రక్షణ కార్యములో భాగమే.
అబ్రహాము వెళ్లి శారా ను కలవడం అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే. యాకోబు రాహేలును కలిశాడు. అది ప్రమాదవశత్తు జరిగింది కాదు.
అది దేవుని ఏర్పాటే. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రి కావడం –
అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
మోషే ఒక శిశువుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తె అతని ఒక నదిలో కనుగొంది.
అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలు గూడాచారులకు యెరికో గోడ మీద ఆశ్రయం ఇచ్చింది.
అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
ఏలీయా ప్రవక్త తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. తరువాత అగ్ని రథము పరలోకము నుండి వచ్చింది. ఒక సుడిగాలి ఏలీయా ను పరలోకానికి తీసుకు వెళ్ళింది. అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
బెత్లెహేము పొలములో రూతు అని విధవరాలు బోయజును కలిసింది. అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
దావీదు అనే గొఱ్ఱెల కాపరి ఇశ్రాయేలు కు రాజు అయ్యాడు. అది ప్రమాదవశత్తు జరిగింది కాదు. అది దేవుని ఏర్పాటే.
అవన్నీ దేవుడు సిద్ధపరచిన కార్యాలే. యేసు క్రీస్తు రాకడ కొరకు దేవుడు ఆ వ్యక్తులను, సంఘటనలను సిద్ధం చేశాడు. తార్సు వాడైన సౌలు క్రైస్తవులను హింసించడానికి దమస్కు వెళ్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు అతనికి ప్రత్యక్షమై అతని ఆపాడు. సౌలు పౌలు గా మారి సువార్తికుడు అయ్యాడు. అది దేవుని ఏర్పాటే. ఈ రోజు నేటి ప్రపంచములో మీరు జీవిస్తున్నారు. యేసు క్రీస్తు సువార్త మీరు విన్నారు. అది దేవుని ఏర్పాటే. ఆయన సిద్ధపరచే దేవుడు. A God of Preparation. ఆయన సిద్ధపరచే కార్యాలు మనకు చాలా సార్లు కనిపించకపోవచ్చు.
16 అధ్యాయములో ఒక మాట చూద్దాము.
రోమా పత్రిక 16 :25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు: యూదులు మాత్రమే కాకుండా, అన్యజనులు కూడా నన్ను తెలుసుకోవాలి అని యేసు క్రీస్తు ప్రభువు కోరుకున్నాడు. అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము: ఏంటి ఈ మర్మం. అది క్రైస్తవ సంఘం. యూదులను, అన్య జనులను యేసు క్రీస్తు నందు కలపాలి. వారిని ఆశీర్వదించాలి అని దేవుడు దీనిని సిద్ధపరచాడు. యూదులను, అన్యులను దేవుడు ఒక చోటకు చేర్చడం – చాలా మందికి మింగుడు పడలేదు. అపోస్తలుడైన పేతురు గారికి దేవుడు దర్శనం ఇచ్చిన తరువాతే ఆయన అన్యుడైన కొర్నేలీ ఇంటికి వెళ్ళాడు. యూదు నాయకులు పౌలు సువార్తను ఆ కారణముగానే తిరస్కరించారు. అన్యజనులను దేవుని ఆలయములో నికి తీసుకు వచ్చాడు అనే నిందను పౌలు మీద వేసి ఆయన ప్రాణం తీయడానికి వారు ప్రయత్నించారు. దేవుని ప్రణాళికలను నిర్వీర్యం చేయడానికి మనుష్యులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే దేవుడు సిద్ధము చేసిన వాటిని ఎవరూ ఆపలేరు.
7.God of Promise
రోమా 1 అధ్యాయము, 4 వచనం
దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. సువార్త యాదృచ్చికముగా మనకు లభించలేదు. తన పరిశుద్ధ లేఖనముల యందు దేవుడు ప్రవక్తల ద్వారా యేసు క్రీస్తు గురించి వాగ్దానం చేశాడు.
యేసు క్రీస్తు బెత్లెహేము గ్రామములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త చెప్పాడు. మీకా 5:2
ఆయన కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు అని యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా 7:14
ఆయన యాకోబు సంతానము లో జన్మిస్తాడు అని బిలాము ప్రవచించాడు సంఖ్యా కాండము 24:17
ఆయన యూదా గోత్రములో జన్మిస్తాడు అని యాకోబు ప్రవచించాడు. ఆదికాండము 49:10
ఆయన దావీదు సంతానములో జన్మిస్తాడు అని నాతాను ప్రవచించాడు.
2 సమూయేలు 7:12-13
ఆయన సిలువ వేయబడతాడు అని దావీదు, యెషయాలు ప్రవచించారు (కీర్తన 22; యెషయా 53)
ఆయన సమాధి చేయబడి, మరణము నుండి తిరిగిలేస్తాడు అని దావీదు ప్రవచించాడు. కీర్తన 16:10
ఈ ప్రవచనాలు మొత్తం ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుడు నెరవేర్చాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అనేక గొప్ప బహుమానాలు అపోస్తలుడు వివరించాడు. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. రోమా 9:4-5
దేవుడు అనేక గొప్ప ఆశీర్వాదాలు యూదులకు ఇచ్చాడు. ఈ రోజు చాలా దేశాల్లో అంటి సెమిటిజం పెరిగిపోతున్నది. ఎందుకని? దేవుడు యూదులను తన కార్యకర్తలుగా ఉపయోగించుకొంటున్నాడు అనే సత్యము వారు గ్రహించలేక పోతున్నారు.
వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను.
దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానములు నెరవేర్చాలంటే ఎంతో శక్తి ఉండాలి. సాతానుడు దేవుని వాగ్దానములు నిరర్థకము చేయటానికి శతవిధాలా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అయితే దేవుని శక్తి ముందు సాతాను పప్పులు ఉడకలేదు.
16 అధ్యాయములో ఇంతకు ముందు మనం ఒక మాట చూశాము.
అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుప బడియున్నది
రోమా 16:25
ప్రవక్తల లేఖనముల వెనుక నిత్య దేవుని ఆజ్ఞ ఉంది. మానవులు కానీ, దేవదూతలు కానీ, సాతాను కానీ, అతని దురాత్మల సమూహములు కానీ వారందరూ సృష్టించబడిన వారే. ఈ నిత్య దేవుని ముందు, ఆయన గొప్ప శక్తి ముందు వారి ఆటలు సాగవు.
హేరోదు ఎంతో ప్రయత్నించాడు. ఓడిపోయాడు.
పిలాతు ఎంతో ప్రయత్నించాడు. ఓడిపోయాడు.
అన్న, కయప – ప్రధాన యాజకులు ఎంతో ప్రయత్నించారు. ఓడిపోయారు.
ఎందుకంటే వారు దేవుని వాగ్దానములను అడ్డుకోలేరు.
‘వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడు అని స్థాపించబడ్డాడు’రోమా 15:8
యేసు క్రీస్తు నందు నెరవేరిన దేవుని వాగ్దానములు మీరు గమనించండి. దేవుడు సత్యవంతుడు అనే సత్యము మనకు అర్ధం అవుతుంది. He made extraordinary promises and he fulfilled them with his extraordinary power and truthfulness. దేవుడు గొప్ప వాగ్దానములు చేసాడు. తన గొప్ప శక్తితో వాటిని నెరవేర్చాడు. సత్యవంతుడు అని స్థాపించుకొన్నాడు.
8.God of Perseverance
ఆయన పట్టువదలని దేవుడు
రోమా పత్రిక 11 అధ్యాయము చూడండి. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా వెంబడిస్తున్నాడో అపోస్తలుడైన పౌలు మనకు వివరించాడు. ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మనం యూదుల పట్ల దేవునికి గల ప్రణాళిక లను అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ప్రపంచములో పెరిగిపోతున్న ఒక ప్రధాన సమస్య antisemitism. యూదు ద్వేషం. విచారకరముగా కాన్యే వెస్ట్ లాంటి కొంత మంది క్రైస్తవులు కూడా ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రతి అసత్యము ఎప్పటికో ఒకప్పుడు ఎవరో ఒకరిని బాధిస్తుంది. కాబట్టి మనం సత్యం తెలుసుకోవడం ముఖ్యం. రోమా పత్రిక 11 అధ్యాయములో మనం చూస్తే, అక్కడ పౌలు గారు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు ఇశ్రాయేలీయులను లేక యూదులను విసర్జించాడా? విసర్జించలేదు అని పౌలు గారు స్పష్టముగా మనకు తెలియజేశాడు. 10:21
ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో అవిధేయత చూపించారు. అయితే దేవుడు తన చేతులు చూచుకొని వారిని వెంబడించాడు. ఇశ్రాయేలు ప్రజలు తనకు ఎంత దూరముగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు ఓర్పుతో వారిని వెంబడించుట మనం గమనిస్తాము. దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు.
తన కుమారుడైన యేసు క్రీస్తును వారి యొద్దకు పంపాడు. సువార్తలలో చదివితే, యేసు క్రీస్తు ప్రభువు ఇశ్రాయేలు దేశం నలుమూలలా తిరిగి దేవుని సువార్త ప్రకటించడం మనము చూస్తాము. వారి కోసము ఆయన తీవ్రమైన వేదనతో ప్రార్ధన చేయడం మనం చూస్తాము. యెరూషలేము ను చూసి యేసు ప్రభువు కన్నీరు కార్చడం మనం చూస్తాము. అంత వరకు నిజమే కానీ యేసు క్రీస్తును సిలువ వేసిన తరువాత దేవుడు యూదులను విడిచివేశాడు అనే వారు చాలా మంది మనకు కనిపిస్తారు. అయితే అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రికను యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన తరువాతే రచించాడు అని మనం గమనించాలి. రోమా 11 అధ్యాయములో ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. ఆయన కొన్ని ఉదాహరణలు మనకు తెలియజేశాడు. మొదటిగా నన్ను చూడండి అని పౌలు అంటున్నాడు.
11:1
దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.యేసు క్రీస్తు తన మహిమతో పౌలుకు ప్రత్యక్షం అయ్యాడు. పౌలు తో ఆయన మాట్లాడాడు. ఆ గొప్ప ప్రత్యక్షత వలన పౌలు రక్షించబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆ విధముగానే ప్రత్యక్షమై వారిని రక్షిస్తాడు. జెకర్యా గ్రంథం స్టడీ చేసినప్పుడు మనం ఆ సత్యం చూశాము.
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచు తారు
జెకర్యా 12:10
దేవుడు తన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినప్పుడు యూదులు తాము పొడిచిన యేసు క్రీస్తు ప్రభువును చూస్తారు, తెలుసుకొంటారు అని జెకర్యా ప్రవక్త తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశములో ఈ రోజు నెంబర్ 1 సెర్చ్ టర్మ్ ఏమిటంటే ‘యేసు క్రీస్తు’. ఆ దేశములో ప్రజలు ఇంటర్నెట్ లో ఎక్కువగా వెదుకుతున్న పేరు ‘యేసు క్రీస్తు’. రక్షకుడైన యేసు క్రీస్తు గురించి తెలుసుకోవాలని ఎంతో మంది యూదులు ఈ రోజు ఆసక్తి చూపిస్తున్నారు.
రెండో ఉదాహరణ: ఏలీయా ప్రవక్త. ఏలీయా ప్రవక్తను యెజెబెలు రాణి వెంటాడి వేధించింది. ఏలీయా ఎంతో నిరాశ చెందాడు. ‘ఇంత పెద్ద దేశములో నేను ఒక్కడినే దేవుని వెంబడిస్తున్నాను. అందరూ అన్య దేవతల వైపు వెళ్లిపోయారు’ అని ఏలీయా అనుకొన్నాడు. దేవుడు ఏలీయా తో ఒక మాట అన్నాడు. ‘ఏలీయా నీతో పాటు 7000 మంది వ్యక్తులు నన్ను వెంబడిస్తున్నారు’ నేను ఒక్కడినే మిగిలిపోయాను అని ఏలీయా అనుకొన్నాడు. అయితే ఇంకా 7000 మంది దేవుని ప్రజలు ఆ దేశములో ఉన్నారు అని దేవుడు ఏలీయాతో అన్నాడు. అయ్యో, నేను ఒక మైనారిటి అని మనకు అనిపించవచ్చు. అయితే కోటాను కోట్ల మంది ప్రజలు ఈ రోజు యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు. లక్షల మంది యూదులు ఈ రోజు యేసు క్రీస్తును వెంబడిస్తున్నారు.
మూడో ఉదాహరణ: అన్యజనులు
రోమా 11:12
ఇశ్రాయేలీయులకు రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. అన్యజనులు – దేవుని జ్ఞానం ఏ మాత్రం లేని వారు, వారికి దేవుని వాగ్దానాలు లేవు, వారికి దేవుని ధర్మశాస్త్రం లేదు, దేవుని ఆలయం లేదు, దేవుని ప్రవక్తలు లేరు దేవుడు పిలిచిన పితరులు లేరు దేవుడు ఇచ్చిన దేశం వారికి లేదు. అటువంటి అన్యజనులనే క్షమించి, రక్షించిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిచిపెడతాడా? దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తిగలవాడు (రోమా 11:23)
ఇశ్రాయేలీయులను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి వుంది. అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.11:25. అన్యజనుల ప్రవేశం ముగిసిన తరువాత దేవుడు వారి యొక్క కఠిన మనస్సు తీసివేస్తాడు.
నాలుగో ఉదాహరణ: పితరులు. దేవుడు ఇశ్రాయేలీయుల పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లకు ఇచ్చిన వాగ్దానాలు మరచిపోతాడా? వారితో ఆయన నిత్య నిబంధనలు చేశాడు. వాటిని బట్టి కూడా దేవుడు ఇశ్రాయేలీయులను వదలి పెట్టడు.
ఐదో ఉదాహరణ: దేవుడు ఇశ్రాయేలీయులను వదలి పెట్టడు అనడానికి ఐదవ కారణం ఏమిటంటే దేవుడే. చరిత్ర లోకి చూడండి. ఎన్ని సార్లు దేవుడు తన విశ్వస నీయత కాపాడుకున్నాడు? ఇశ్రాయేలీయులు దేవునికి దూరముగా వెళ్లిపోవడం, పతనం కావడం, మళ్ళీ దేవుడు వారిని తన యొద్దకు చేరదీయడం…. కొంత కాలం తరువాత వారు తిరిగి విగ్రహారాధన, అన్య దేవతల వైపు వెళ్లిపోవడం, మళ్ళీ దేవుడు వారిని చేరదీయడం. ఐగుప్తు లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన దాసుడైన మోషే ని వారి యొద్దకు పంపాడు.
కనాను లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు. బబులోను లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపాడు. రోమ్ లో వారు దేవుని మరచిపోయారు. దేవుడు తన అపోస్తలులను వారి యొద్దకు పంపాడు. ఆ విధముగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎప్పుడూ వదలి పెట్టలేదు అని మనం గమనించాలి.
9.God of Peace
తరువాత దేవుడు సమాధాన కర్త గా మనకు కనిపిస్తున్నాడు. ఆయన శాంతి ని మనకు ఇచ్చేవాడు. ఆయన God of Peace. దేవుడు శాంతిని కోరుకొనేవాడు అనే సత్యము అపోస్తలుడు మనకు బోధిస్తున్నాడు.
మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. రోమా 1:3
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.కీర్తన 29:11
దేవుడు తన ప్రజలను శాంతి తో ఆశీర్వదిస్తున్నాడు.
యేసు క్రీస్తు ప్రభువు కు ఇవ్వబడిన ఒక పేరు – సమాధాన కర్త.
Prince of Peace, యెషయా 9:6
యేసు క్రీస్తు రాజ్యాంగములో ఒక ముఖ్యమైన అంశం శాంతి, సమాధానం.
సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:9
ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చే శాంతి ఈ లోకసంభంద మైనది కాదు. యోహాను సువార్త లో మనం చదువుతాము. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14:27
నేను మీకు ఇచ్చే శాంతి ఈ లోకం మీకు ఇవ్వలేదు. శాంతి ఎలా పొందగలం? అనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. దానికి చాలా రకాల సమాధానాలు మనం వింటూ ఉంటాము. కాసేపు యోగా చేయి, మెడిటేషన్ చేయి, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ మత్తు మందు వాడు ఈ పుస్తకము చదువు, ఈ క్లబ్ కి వెళ్ళు, ఈ పుణ్య యాత్ర చేయి, ఈ విరాళం ఇవ్వు ఈ దాన ధర్మాలు చేయి. యేసు క్రీస్తు ఇచ్చే శాంతి అది కాదు. రోమా పత్రికలో దేవుడు ఇచ్చే శాంతి ఎలా మనం పొందగలమో వివరించాడు. 4 రకాలుగా ఈ శాంతి మనకు వస్తుంది.
Positional Peace
రోమా 5:1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందముముందు మనం దేవునితో సమాధానం పొందాలి. ఇది ఎలా వస్తుంది? ఇది మనం యేసు క్రీస్తు ను నమ్మటం వలన వస్తుంది. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు మనం దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడుతున్నాము. అప్పుడే మనకు శాంతి వస్తుంది.
నీతి లేకుండా శాంతి రాదు. శాంతి ఒక ప్రదేశం కాదు, అది ఒక వ్యక్తి. యేసు క్రీస్తు నందు రక్షించబడిన వారు నీతి మంతులుగా తీర్చబడుతున్నారు. వారు దేవునితో సమాధాన పరచబడుతున్నారు. Peace is not about a place, it is about a person, Lord Jesus Christ.
రెండవది Practical Peace
రోమా 8:5-6 వచనాలు
శరీరాను సారమైన మనస్సు మరణము;ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము, అశాంతి మనకు కలిగిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ కు లోబడితే మనకు దేవుని జీవం, దేవుని శాంతి దొరుకుతాయి. శాంతి పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చే ఒక కానుక (గలతీ 5:22)
Galatians 5:22 says that peace is a gift of the Holy Spirit.
రోమా 14:17 కూడా చూద్దాము. దేవుని రాజ్యము భోజన మును, పానమును కాదు గాని, నీతియుసమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ కు లోబడి జీవించడమే. అందులో నీతి, సమాధానము, ఆనందం ఉన్నాయి. ఆ మూడూ కలిసివెళ్తున్నాయి. వాటిని మనం విడదీయలేము. దేవుని నీతి తో జీవించే వ్యక్తి దేవుని సమాధానం కలిగి ఉంటాడు. దేవుని ఆనందం కలిగి ఉంటాడు. దేవుని నీతి సమాధానం కలిగిస్తుంది. అలా కాకుండా మనం పాపాన్ని వెంబడిస్తే మనకు శాంతి ఉండదు.
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. 1 థెస్స 5:23
సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.సామెతలు 12:20
There is no peace unto the wicked Isaiah 48:22
Work of righteousness is peace Isaiah 32:17
Mercy and truth are met together
Righteousness and peace have kissed each other. Psalm 85:10
కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము.
కీర్తన 34:14
కీడు చేసే వ్యక్తికి శాంతి ఉండదు. దేవుని మీద ఆధారపడి, మంచి చేసే వారికే శాంతి దొరుకుతుంది. ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా 26:3
తన మీద ఆధారపడి జీవించేవారికి దేవుడు పూర్ణ శాంతి ని ఇస్తున్నాడు.
మూడవది
Protective Peace
Romans 16:20, Ephesians 6:15
యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచి మనం దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడి దేవుని శాంతి పొందాము. మనం పరిశుద్ధాత్మ కు లోబడి జీవిస్తూ పరిశుద్ధాత్ముడు ఇచ్చే శాంతి పొందుతాము. అయినప్పటికీ సాతాను మనలను వదలి పెట్టడు. సాతాను అనేక రూపాల్లో అనేక పనుల ద్వారా మన జీవితాల్లో శాంతి లేకుండా చేయాలని ప్రయత్నిస్తాడు.
రోమా 16:20
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఆ మాటలు గమనించండి. సమాధాన కర్తయగు దేవుడు సాతానును ఈ కాళ్ళ క్రింద త్రొక్కించును. ఈ సమాధానం మనకు కావాలంటే మనం దేవుని శక్తి మీద ఆధారపడాలి. సాతానును మనం మన స్వంత శక్తితో ఎదుర్కోలేము. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి.
తలకు రక్షణ శిరస్త్రాణం
ఛాతీకి నీతి అనే వస్త్రం
నడుముకు సత్యం అనే దట్టి
ఒక చేతిలో విశ్వాసము అనే డాలు
మరొక చేతిలో దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం
పాదములకు సమాధాన సువార్త
వల్లనైన సిద్ధ మనస్సు అనే చెప్పులు తొడుగుకోవాలి.
సాతానుని ఎదుర్కోవాలంటే అవన్నీ విశ్వాసి ధరించాలి.
విశ్వాసి దేవుని శాంతి అనే చెప్పులు తోడుకొన్నాడు. అవి లేకుండా ఏ విశ్వాసి ముందుకు నడవలేడు. దేవుని శాంతి మనకు లేకపోతే సాతాను ను ఎదుర్కొని ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేయలేము. అందుకనే దేవుడు మనకు సమాధాన సువార్త వలన వచ్చే సిద్ధ మనస్సు అనే చెప్పులు ఇచ్చాడు. వాటిని మనం వేసుకొని నడవాలి.
Political Peace Romans 12:17-21 John 16:33, Isaiah 54:10
నాలుగవదిగా ఇతరులతో సమాధానం
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
రోమా 12:18
మన సమాజం కూడా మన శాంతికి భగ్నం కలిగించవచ్చు. సాధ్యమైనంత వరకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు అని అపోస్తలుడు వ్రాసాడు. అనేక ప్రదేశాల్లో క్రైస్తవులకు హింస కలుగుతుంది. వారికి శాంతి ఉందా? శ్రమల్లో ఉన్న వారికి కూడా దేవుడు తన శాంతిని ఇస్తాడు. రోమా పత్రికలో నుండి దేవుని గురించి కొన్ని సత్యాలు ఈ రోజు మనం చూశాము. దేవుని శాంతి మనం ఎలా పొందగలం? ముందు మనం యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచి దేవుని ఎదుట నీతి మంతులముగా తీర్చబడాలి. తరువాత పరిశుద్ధాత్మ కు లోబడి జీవించాలి. మూడవదిగా దేవుడు ఇచ్చే రక్షణ వస్త్రాలు ధరించి సాతానును ఎదుర్కోవాలి.
6 దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఫిలిప్పి 4:6-7
1 పేతురు 3:11 అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
10.God of Plurality
దేవుడు ఒక్కడే. అయితే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ దైవిక త్రిత్వం రోమా పత్రికలో మనకు స్పష్టముగా కనిపిస్తుంది. రోమా పత్రిక 1:4-5 వచనాలు చూడండి.
4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను.5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రోమా 1:4-5
ఈ పత్రిక ప్రారంభములోనే దైవిక త్రిత్వం మనలను ఏ విధముగా రక్షించారో అపోస్తలుడు వివరిస్తున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వస్తాడు అనే విషయం తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు సువార్త పౌలు కల్పించింది కాదు. అది క్రైస్తవ నాయకులు కల్పించింది కాదు. అది దేవుడు పాత నిబంధనలోనే వాగ్దానం చేసిన శుభవార్త.
ఈ శుభవార్త ఏమిటి? యేసు క్రీస్తు శరీరధారిగా దావీదు సంతానములో పుట్టాడు. దైవిక త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. తండ్రి, కుమారుడు అంటే – కుమారుడు తండ్రి లో నుండి వచ్చాడు అని కాదు. కుమారుడైన దేవుడు కూడా తండ్రి వలె నిత్యుడైన దేవుడే. ఆయన శక్తి, ఆయన ప్రేమ పరిపూర్ణమైనదే.
అయితే దైవిక త్రిత్వము లోని రెండవ వ్యక్తి మానవ రూపములో జన్మించాడు కాబట్టి ఆయనకు కుమారుడు అనే పేరు వచ్చింది. దైవిక త్రిత్వము లో ఎంతో పరిపూర్ణమైన, అపురూపమైన ప్రేమ బంధం ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరిని ఒకరు ఎంతో ప్రేమించుకోవటం, ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకోవటం, ఒకరికి ఒకరు సేవ చేసుకోవడం, ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం బైబిల్ లో అనేకసార్లు మనకు కనిపిస్తుంది. సృష్టికార్యములో ముగ్గురు వ్యక్తులుకలిసి పనిచేశారు. ఇశ్రాయేలు చరిత్రలో ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేశారు.
ఇప్పుడు యేసు క్రీస్తు సువార్త లో కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నారు. యేసు క్రీస్తు సువార్త కోల్పోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించేది. మనిషితో దేవుడు సంబంధం కోల్పోయాడు. ఆ సంబంధం తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. దైవిక త్రిత్వము లోని ముగ్గురు వ్యక్తులు ఆ పనిలో కలిసి పనిచేయడం యేసు క్రీస్తు సువార్తలో కనిపించే అపురూపమైన దృశ్యం.
5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగా పుట్టాడు అని పౌలు ఇక్కడ వ్రాశాడు. దైవిక త్రిత్వము లోని రెండవ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుగా దావీదు వంశములో పుట్టాడు. రెండవ కీర్తనలో మనం చదువుతాము
నీవు నా కుమారుడవు
నేడు నిన్ను కనియున్నాను
కీర్తన 2:7
ఆ మాటలు యేసు క్రీస్తు జన్మ గురించే. ఆ తరువాత మాటలు మీరు గమనించండి: యేసు క్రీస్తు మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని ఎలా నిరూపించబడింది? ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు కాబట్టి.
పరిశుద్ధమైన ఆత్మనుబట్టి… యేసు క్రీస్తు తిరిగి లేచాడు. ఇక్కడ దైవిక త్రిత్వము లోని మూడవ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్దాత్ముడు యేసు క్రీస్తు జీవితములో ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు.
కన్య మరియ గర్భము దాల్చింది పరిశుద్దాత్మ వలనే.
యేసు క్రీస్తు సాతాను శోధనలు ఎదుర్కొంది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు అనేక అద్భుత కార్యాలు చేసింది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు మరణం నుండి తిరిగి లేచింది పరిశుద్ధాత్మ వలనే.
యేసు క్రీస్తు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. పరిపూర్ణముగా దేవుడు
పరిపూర్ణముగా మానవుడు. ఆ విధముగా క్రైస్తవ సువార్తలో త్రియేక దేవుని సమైక్య పరిచర్య మనకు కనిపిస్తుంది. వారి మధ్య లో కనిపించే చక్కని అనుబంధము మానవ సంభందాల్లో కూడా వుంటే ఎంతో మంచిది. మనకు అనేక సంబంధాలు ఉంటాయి. భార్య భర్తలు,తండ్రి పిల్లలు, తల్లి పిల్లలు,అన్నదమ్ములు,అక్క చెల్లెల్లు,తాత మనుమళ్ళు ,స్నేహితులు,బంధువులు,యజమాని ఉద్యోగులు,ప్రభుత్వ అధినేతలు – వారు పాలించే వారు ఈ సంబంధాలన్నిటిలో త్రియేక దేవుని ఆదర్శముగా ఉంటే, మన ప్రపంచము ఎంతో బాగుంటుంది. మనం పెట్టుకొనే ప్రతి సంబంధానికి ఆదర్శం దేవుడే.
11.God of Progress
ఆ తరువాత He is a God of Progress. నిజమైన ప్రోగ్రెస్ దేవుని వలనే వస్తుంది. అది వ్యక్తిగత వికాసం కావచ్చు లేక సామాజిక వికాసం కావచ్చు – అవి దేవుని వలన మాత్రమే వస్తాయి. ఈ రోజు మన ప్రపంచములో ఉన్న ఒక నమ్మకం ఏమిటంటే, దేవుడు లేకుండా మనం ప్రగతి సాధించగలం. ప్రజలు దేవుని మీద నమ్మకం కోల్పోతే మన సమాజములో ప్రగతి వస్తుంది అని చాలా మంది మేధావులు అంటూ వుంటారు. అయితే రోమా పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మనుష్యులు దేవునికి దూరముగా వెళ్లి పోయినప్పుడు వారు చెడిపోతారే కానీ బాగుపడరు అని అపోస్తలుడు అయిన పౌలు గారు వ్రాశాడు. వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టములను పూజిస్తారు. తుచ్ఛమైన అభిలాషలకు వారు లొంగిపోతారు. వారి శరీరాలను అపవిత్రం చేసుకొంటారు. భ్రష్టమైన మనస్సు పొందుతారు.దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, తల్లిదండ్రులకు అవిధేయులయిపోతారు
3 అధ్యాయము కూడా చూడండి.
మనుష్యులు దేవునికి దూరముగా వెళ్ళిపోతే వారు పలికి మాలిన వారు అయిపోతారు. వారి నోరు తెరచిన సమాధి. మోసము, శాపం, పగ వారి మాటల్లో ఉంటుంది.వారి పాదములు రక్తము చిందించుటకు పరిగెడుతాయి.శాంతి మార్గము వారికి కనిపించదు.
రోమా 3:10-18
ఆ విధముగా దేవునికి దూరముగా వెళ్లే కొద్దీ సమాజం పాడైపోతుందే కానీ బాగుపడదు అని అపోస్తలుడైన పౌలు 2 వేల సంవత్సరాల క్రితమే రాశాడు. 12,13 అధ్యాయములు చూడండి. దేవుని యొద్దకు వచ్చే వారు నిరీక్షణతో జీవిస్తారు, దేవుని ఆనందం వారిలో ఉంటుంది. వారు దీవిస్తారే కానీ శపింపరు. వారు సమాధానముతో జీవిస్తారు. పగ తీర్చుకోకుండా క్షమిస్తారు, కీడు చేయడం వారిలో కనిపించదు. వారు తమ శరీరములను దేవుని మహిమ కొరకు సమర్పిస్తారు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, కలహము, మత్సరం వారిలో కనిపించవు. పన్నులు చెల్లిస్తారు , ప్రేమతో జీవిస్తారు. He is a God of Progress. నిజమైన ప్రగతి దేవుని వలనే వస్తుంది.
12.God of Perdition
ఆ తరువాత He is a God of Perdition. He is a God of Perdition.దేవుడు ఉగ్రత చూపించే వాడు.
రోమా 1:18
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని కోపం గురించి పౌలు మనలను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని కోపం గురించి, దేవుని తీర్పు గురించి, నరకం గురించి, నిత్య దండన గురించి మాట్లాడడం అంత పాపులర్ కాదు. ‘దేవుని ప్రేమ గురించి చెప్పు చాలు. నరకం గురించి మాట్లాడొద్దు’ అనే వారే ఎక్కువగా ఉంటారు.
అయితే పౌలు ఈ పత్రికలో దేవుని కోపం గురించి వివరముగా ప్రస్తావించాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా దేవుని ఉగ్రత గురించి, తీర్పు గురించి, నరకం గురించి అనేకసార్లు మనలను హెచ్చరించాడు. బైబిల్ లో అందరికంటే ఎక్కువగా నరకంగురించి బోధించింది యేసు క్రీస్తు ప్రభువే. అందువలన, ‘నరకం లేదు అనడం యేసు క్రీస్తును అబద్ధికునిగా చేయడమే. పాప క్షమాపణ పొందిన వారిని రక్షిస్తున్న దేవుడే దానిని పొందని వారిని కఠినముగా శిక్షిస్తున్నాడు.
నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అయితే జలప్రళయములో నోవహు కుటుంబం మినిహాయించి మిగిలిన వారి నందరినీ దేవుడు భూమి మీద నుండి తుడిచిపెట్టాడు. దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. సొదొమ, గొమొఱ్ఱా రెండు నగరాల్లోని ప్రజలందరినీ అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. దేవుడు మోషేను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రక్షించాడు. ఫరో ని, ఐగుప్తీయులను శిక్షించాడు. అతని సేనలను ఎఱ్ఱ సముద్రములో కల్పివేసాడు. దేవుడు రాహాబు ను, ఆమె ఇంటి వారిని రక్షించాడు. యెరికో పట్టణములో మిగిలిన వారిని హతం చేశాడు. కొంత మందిని రక్షించాడు, కొంత మందిని శిక్షించాడు. మీరు ఏ గ్రూప్ లో వున్నారు? శిక్షించబడే గుంపు లో ఉన్నావా? లేక రక్షించబడే గుంపులో ఉన్నావా?
పౌలు యొక్క హెచ్చరిక మనం జాగ్రత్తగా వినాలి
రోమా 1:18
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది అని ఆయన అంటున్నాడు. దేవుని కోపం నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరూ రారు. దేవుని ఉగ్రత నుండి పాపిని రక్షించే శక్తి ఎవరికీ ఉండదు. పాపాన్ని ఎంతో ద్వేషించే ఈ పరిశుద్దుడైన దేవుని ఉగ్రత నుండి మనం ఎలా రక్షించబడతాము? పౌలు మనకు ఒక శుభవార్త చెబుతున్నాడు.
రోమా 5:8-9
8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. రోమా 5
యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారిని దేవుడు రక్షిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని ఉగ్రత లో నుండి తప్పించుకొంటారు. రక్షణ పొండనివారు దేవుని ఉగ్రత కుమ్మరించబడే పాత్రలుగా ఉంటారు (రోమా 2:5)
దేవుడు అసహ్యించుకొనేది ఒక్క పాపం మాత్రమే. ఇంకా దేనిని దేవుడు అసహ్యించుకోడు. ఆయన ఉగ్రత పాపాత్ముల మీదకు దిగివస్తుంది ఎందుకంటే
He is a God of Perdition. ఆయన ఉగ్రత చూపించే దేవుడు
13.God of Paternity
A God of Paternity. దేవుడు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినవారిని తనకు పిల్లలుగా చేసుకొన్నాడు. దేవునికి మనకు ఇలాంటి సంబంధం సాధ్యమేనా? అని మనకు అనిపించవచ్చు. మనలాంటి వారు దేవుని కుమారులు ఎలా కాగలరు?
రోమా 8:15 చూడండి:
15 ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొంది తిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము.దేవుడు మనకు దత్తపుత్రాత్మను ఇచ్చాడు. ఆ ఆత్మ చేత నడిపింపబడేవారందరూ దేవుని కుమారులు అయ్యారు. దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు. మనలను అడాప్ట్ చేసుకొన్నాడు. ఇప్పుడు మనం ‘అబ్బా, తండ్రీ’ అని దేవుని పిలువవచ్చు. ‘అబ్బా, తండ్రీ’ అని ‘నాయనా, తండ్రీ’ అని యేసు ప్రభువు దేవుని పిలవడం క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది (మార్కు 14:36). ఈ రోజు అటువంటి యోగ్యత దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనలను దత్తత తీసుకొన్నాడు.
మెఫీబోషెతు కుంటివాడు. పైసా సంపాదన లేదు. ఆయన యోనాతాను కుమారుడు. దావీదు రాజుకు మెఫీబోషెతు మీద జాలి కలిగింది. తన మిత్రుడైన యోనాతానును బట్టి మెఫీబోషెతు ను దావీదు దత్తత తీసుకొన్నాడు. అప్పటి నుండి మెఫీబోషెతు దావీదు కుమారుడు అయ్యాడు. దావీదు అంతఃపురంలో నివసించాడు. దావీదు కుటుంబములో సభ్యుడు అయ్యాడు. వారి తో కలిసి జీవించాడు. వారితో కలిసి భోజనం చేసాడు. దావీదును డాడీ అని పిలిచే యోగ్యత అతనికి కలిగింది. ‘ఎవడ్రా నీకు డాడీ, కుంటి వాడా?’ అని దావీదు ఎప్పుడూ అతని కించపరచలేదు. తన ఇతర కుమారుల వలె మెఫీబోషెతు ను కూడా ఒక కుమారునిగా చూశాడు. దేవుడు కూడా మనలను దత్తత తీసుకొన్నాడు. ఇప్పుడు మనం దేవుని కుటుంబములో చేరబడ్డాము.
దేవుని పిల్లలం అని పిలువబడ్డాము. దేవుని వారసులం అయ్యాము. దేవుని సహవాసం లో పాలివారమయ్యాము. ‘డాడీ’ అని దేవుని పిలిచే యోగ్యత మనకు లభించింది. ‘ఎవడ్రా, నీకు డాడీ, పాపాత్ముడా’ అని దేవుడు మనలను కించపరచడు. దేవుని సహవాసం మాత్రమే కాకుండా దేవుని స్వాస్థ్యము కూడా విశ్వాసులకు ఇవ్వబడింది.
17 వచనంలో ఏమంటున్నాడంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినవారికి దేవుడు తన కుటుంబములో స్థానం కల్పిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారికి తన ఆస్థి లో కూడా భాగం ఇస్తున్నాడు. దేవుడు యేసు క్రీస్తు ప్రభువుకు ఇచ్చిన వాటన్నిటిలో ఇప్పుడు విశ్వాసులకు భాగం దొరికింది. యేసు క్రీస్తు పొందిన మహిమ, ఘనత విశ్వాసులకు కూడా దక్కుతుంది. ఈ సత్యం తెలుసుకొన్న విశ్వాసి ఈ ప్రపంచములో ఎలాంటి సమస్యలైనా ధైర్యముగా ఎదుర్కొంటాడు.
18 వచనంలో పౌలు ఏమంటున్నాడంటే మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.ఈ రోజు మనకు ఎదురయ్యే ఎలాంటి శ్రమ అయినా చిన్నదే ఎందుకంటే దేవుని ఇంటిలో ఉన్న దేవుని కుమారులకు, కుమార్తెలకు దేవుడు గొప్ప మహిమను ఇవ్వబోతున్నాడు.
He is a God of Paternity. మనలను పిల్లలనుగా చేసుకొన్న దేవుడు. యేసు క్రీస్తు నందు మనలను క్షమించడమే కాకుండా మనలను దత్తత తీసుకొని, తన సహవాసము మనకు ఇచ్చి, మనలను తన వారసులనుగా
చేసుకొని మనకు తన ఆస్థిలో భాగం ఇచ్చిన దేవుడు.
14.God of Pity
God of Pity: దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఈ రోమా పత్రికలో దేవుని ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో వివరముగా వ్రాశాడు.
రోమా 5:8 చూద్దాము.
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
రోమా 5:8
ఆ మాటలు మీరు గమనించండి. మనము పాపములో ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించాడు. యేసు క్రీస్తు ప్రభువు సిలువ మీద మన పాపముల కొరకు చనిపోవడం దేవుడు మన మీద ప్రేమతో చేసిన త్యాగం. దేవుని స్వభావం గురించి బైబిల్ లో రెండు అతి ముఖ్యమైన మాటలు ఉన్నాయి.
మొదటిది దేవుడు పరిశుద్ధుడు
(లేవీయకాండము 19:2)
రెండవది దేవుడు ప్రేమామయుడు
(1 యోహాను 4:8)
దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ కలిగినవాడు. రాత్రి నేను నిర్గమ కాండము 22:19 లో ఒక మాట చదివాను. మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.బైబిల్ లో ఇలాంటి మాటలు ఉన్నాయి ఏమిటి అనే వారు కూడా ఉన్నారు. ఈ రోజు మన సమాజములో మృగ సంయోగం చేయటం ఎంతో జుగుప్సా కరమైన పని గా మనం చూస్తాము. అయితే దేవుడు లేకపోతే ఏదైనా చెల్లుతుంది. ఈ ప్రపంచములో దేనినైనా ఇష్టపడేవారు కొంతమందైనా వుంటారు. ఇశ్రాయేలీయుల చుట్టు ప్రక్కల జీవిస్తున్నవారు అటువంటి పాపములు చేస్తున్నారు. ఉదాహరణకు, గ్రీకు మతములో మినోటార్ మనకు కనిపిస్తుంది. మినోటారు లో సగం మనిషి, సగం ఎద్దు కనిపిస్తారు. ఈ మినోటారు ఎలా జన్మించింది? క్రేతు అనే ద్వీపములో మినోస్ అనే రాజు ఉన్నాడు. ఆయనకు పాసిఫె అనే భార్య ఉంది. వారు సముద్ర దేవుడు పోసైడాన్ ను ఆరాధిస్తున్నారు. ఈ పోసైడాన్ ఏమి చేశాడు? పాసిఫె ఒక ఎద్దుతో ప్రేమలో పడేటట్లు చేస్తాడు. వారికి కలిగిన సంతానమే ఈ మినోటార్. ప్రాచీన మతాలు అటువంటి పాపాలను ప్రోత్సహించేవి. ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న ప్రజలు అటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. దేవుడు వారితో ఒక మాట అన్నాడు. మీరు ఆ పాపాలు చేయవద్దు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్దులుగా ఉండండి.
భారత దేశము సుప్రీమ్ కోర్టులో ఇప్పుడు స్వలింగ సంపర్కులు వివాహాలు చేసుకోవచ్చా అనే అంశం మీద సుదీర్ఘ చర్చ నడుస్తూ ఉంది. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ క్రింద స్వలింగ వివాహాలు చట్టబద్దం చేద్దాము అని సుప్రీమ్ కోర్టు ప్రయత్నిస్తూ ఉంది.వివాహం అంటే ఏమిటి? దాని ఉద్దేశ్యం ఏమిటి? వాటిని తెలుసుకోవాలంటే మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. బైబిల్ ప్రకారం వివాహం అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ ల మధ్య దేవుని సమక్షములో చేసుకొనే ఒక శాశ్వతమైన పరిశుద్ధమైన నిబంధన.
ఇద్దరు పురుషుల మధ్య, ఇద్దరు స్త్రీ ల మధ్య అది సాధ్యపడదు. ఈ ప్రపంచ పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. వాటి మీద మన నమ్మకాలు ఆధారపడకూడదు. దేవుని వాక్యం ఏమని చెబుతున్నది అని మనం ఎప్పుడూ చూసుకొంటూ ఉండాలి.
దేవుని పరిశుద్ధతలో నుండి వచ్చినవే ఆయన ఆజ్ఞలు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక సత్యం ఏమిటంటే దేవుని పరిశుద్దత, దేవుని ప్రేమ పరస్పర విరుద్ధమైనవి కావు. అవి రెండూ విడదీయలేనివి. చిన్నప్పుడు మనకు ఫిజిక్స్ క్లాస్ లో ఎలక్ట్రో మాగ్నెటిజం గురించి చెప్పేవారు. ఎలక్ట్రిసిటీ లో నుండే మాగ్నెటిజం వస్తుంది. మాగ్నెటిజం లో నుండే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ప్రకృతిలో అవి రెండూ విడదీయరానివి గా ఉన్నాయి. దేవుని లో మనకు కనిపిస్తున్న ప్రేమ, పరిశుద్ధత లు కూడా అటువంటివే. దేవుని ప్రేమలో నుండే పరిశుద్ధత వచ్చింది. దేవుని పరిశుద్ధత లో నుండే ప్రేమ వచ్చింది. అవి రెండూ దేవుని స్వభావం యొక్క రెండు ముఖాలే.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి విడిపించబడి అరణ్య మార్గములో ప్రయాణించారు. సీనాయి కొండ వద్ద దేవుడు వారికి పది ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వారికి తన పరిశుద్ధత గురించి చెప్పాడు. ఎందుకంటే దేవుడు వారిని ప్రేమించాడు. యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పాడు: మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు గైకొనండి. దేవుని పరిశుద్ధతను ప్రేమించకుండా మనం దేవుని ప్రేమించలేము. దేవుడు తన పరిశుద్దతను మనకు చెప్పకుండా మనలను ప్రేమించలేడు. దేవుడు తన పరిశుద్ధత లేకుండా మనలను ప్రేమించలేడు. తన ప్రేమ లేకుండా మనలను పరిశుద్ధ పరచలేడు. ఆ రెండూ మన జీవితాల్లో ఒకేసారి పనిచేస్తాయి.
ప్రేమించే తల్లిదండ్రులు పిల్లలకు అనేక నియమాలు పెడతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతారు: ఆ పని చేయొద్దు, అటువైపు వెళ్లొద్దు, అటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకని? తమ పిల్లలను ప్రేమిస్తారు కాబట్టే ఆ నియమాలు వారి మీద పెడతారు. ‘అంకుల్, చాలా మంచోడు. మనము ఏమి చేసినా ఏమీ అనడు.
వెరీ నైస్’ అని మనం అనుకొంటాము. అది పొరపాటు. ‘నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకురా. నేను నిన్ను ఏమీ అనను’ అని ప్రేమించే ఏ తల్లిదండ్రులు పిల్లలతో అనరు. నా దగ్గరకు వచ్చే పేషెంట్ లకు నేను చెబుతూ వుంటాను. ‘సిగిరెట్లు త్రాగటం మానివేసెయ్. అవి నీ ఆరోగ్యానికి మంచిది కాదు’ మాకు క్లాస్ పీకబాగు అనుకొనే వాళ్ళు వుంటారు. వారికి ఏమీ చెప్పకపోతే వెరీ నైస్, వెరీ గుడ్ మానెరెడ్ అనుకొనే వారే ఎక్కువ. చాలా మంది నాస్తికులకు దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు వారు ఇష్టపడరు, దేవుని పరిశుద్ధతను వారు ఇష్టపడరు. దేవుడు ‘వద్దు, వద్దు’ అని చెప్పడం వారికి ఇష్టం ఉండదు.
దేవుడు ‘వద్దు’ వద్దు అని మనకు ఎందుకు చెబుతాడంటే మనం మన స్వంత మార్గాల్లో నడిస్తే శాపం, నాశనం, నరకం మనకు లభిస్తాయి. దేవుని మార్గములో నడిస్తే ఆశీర్వాదం, నిత్య జీవం, పరలోకం మనకు లభిస్తాయి. రక్షించబడిన వారిని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ సత్యము కూడా మనకు బోధించాడు.
రోమా 8:35
క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను, హింసయైనను కరవైనను, వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?
రోమా 8:35
యేసు క్రీస్తు ప్రభువు ప్రేమ నుండి ఏదీ మనలను వేరు చేయలేదు. రోమా పత్రిక 8 అధ్యాయములో అపొస్తలుడైన పౌలు విశ్వాసికి దేవుడు ఇచ్చే భద్రత గురించి వ్రాశాడు. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచే ప్రతి వ్యక్తికీ దేవుడు నిత్యమైన భద్రత కల్పించాడు. దేవుడు నిత్యమైన ప్రేమతో మనలను ప్రేమించాడు కాబట్టే మనకు నిత్యమైన భద్రత లభించింది. దేవుని ప్రేమ మారేది అయితే మనకు నిత్య జీవం, నిత్య భద్రత లభించేవి కావు. మన జీవితములో పరిస్థితులు మారుతూ ఉంటాయి. అయితే దేవుడు మన పట్ల చూపించే ప్రేమ ఎప్పటికీ మారదు. He is a God of Pity. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆ తరువాత
15.God of Participation
God of Participation. ఇంగ్లీష్ భాషలో రెండు చక్కటి పదాలు ఉన్నాయి.
Transcendence and Immanence.
Transcendence అంటే ఏమిటంటే దేవుడు తన సృష్టికి వేరుగా ఉన్నాడు. వాటన్నిటి కంటే ఎత్తుగా ఉన్నాడు . యిమ్మనెన్సు అంటే ఏమిటంటే దేవుడు మనతో కలిసి నడుస్తున్నాడు. దేవుడు అంటే ఒక ఆలోచన కాదు. దేవుడు అంటే ఒక ఫిలాసఫీ కాదు.
దేవుడు అంటే ఒక వ్యక్తి. ఆయన మన జీవితాల్లో ఆసక్తి కలిగిఉన్నాడు. ఆది కాండము 3 అధ్యాయములో చూడండి. దేవుడు ఏదెను వనములో మనుష్యులతో కలిసి నడిచాడు.
ఆది కాండము 5 అధ్యాయములో చూడండి. దేవుడు హనోకు తో కలిసి నడిచాడు. తాను ఇష్టపడే మనుష్యులతో దేవుడు కలిసి నడుస్తున్నాడు. వారితో ఆయన సహవాసం చేస్తున్నాడు.
యేసు క్రీస్తు నందు దేవుడు మానవ రూపం దాల్చి ఈ భూమి మీద మనతో కలిసి నడిచాడు. ఈ రోజున ప్రతి విశ్వాసిలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని గా దేవుడు మనతో కలిసి నడుస్తున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుతాడు. ఈ పరిశుద్ధాత్ముడు భూమి మీద మనం ఉన్నంత కాలం మనతో కలిసి ఉంటాడు. ఆయన మనతో కలిసి నడుస్తాడు. మనం ఆయనకు విధేయత చూపిస్తే అన్ని సందర్భాల్లో ఆయన మనలను నడిపిస్తాడు.
రోమా 8:14 చూడండి.
దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. దేవుని ఆత్మతో నడిచేవారందరూ దేవుని కుమారులే, కుమార్తెలే. పరిశుద్ధాత్మ మన పక్షమున విఙ్ఞాపణ చేసే వానిగా వున్నాడు. పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమా 8:26
మనకు దేవుడు ఎంత గొప్ప భాగ్యము ఇచ్చాడో ఇక్కడ కనిపిస్తుంది. జీవితమంతా మనతో కలిసి నడుస్తూ, మనతో కలిసి జీవిస్తూ, మన పక్షమున విఙ్ఞాపణ చేసే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ తరువాత దేవుడు
16. God of Purpose
దేవుడు లక్ష్యముతో పనిచేసేవాడు. పర్పస్ లేకుండా దేవుడు ఏ పనీ చేయడు. మానవ జాతిని సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. నన్ను సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. నిన్ను సృష్టించడములో దేవునికి ఒక పర్పస్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది. అందుకనే వ్యక్తి పూజ చేయకుండా మనం దేవుని మహిమ పరచాలి. ఈ మధ్యలో హైదరాబాద్ లో పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. అది 125 అడుగుల ఎత్తులో ఆ నగరాన్ని ఆక్రమించుకొని ఉంది. ఈ రోజు అంత పెద్ద గాంధీ విగ్రహం లేదు. రైట్ వింగ్ వచ్చేసి వల్లభాయ్ పటేల్, లెఫ్ట్ వింగ్ వచ్చేసి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొంటున్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. కులమత, ప్రాంత, భాషా బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉండాలి అని భారత రాజ్యాంగములో ఆయన సమానత్వం పునాదిని వేశాడు.
మానవులందరూ సమానులే అనే సత్యము దేవుని యొద్ద నుండి వచ్చింది. అది బైబిల్ లో నుండి వచ్చింది. అమెరికా, జర్మనీ లాంటి క్రైస్తవ మూలాలు ఉన్న దేశాలు తమ రాజ్యాంగాలు క్రైస్తవ భావ జాలము ఆధారముగా వ్రాసుకొన్నాయి. అంబేద్కర్ వారి బాటలో నడిచాడు.
కాబట్టి సమానత్వం అనే సత్యము దేవుని యొద్ద నుండి వచ్చింది. గాంధీ అయినా, అంబేద్కర్ అయినా బైబిల్ సత్యాలనే పరోక్షముగా భారత దేశానికి బోధించారు. మనం దేవుని మహిమ పరచాలి కానీ వ్యక్తులకు విగ్రహాలు కట్టి వ్యక్తి పూజ చేయకూడదు. కాబట్టి అంబేద్కర్ కి విగ్రహాలు కట్టడం మానుకోండి. ఆ డబ్బుతో యేసు క్రీస్తు సువార్త ప్రకటించండి. దేవుని దృష్టిలో అది విలువైనది. మనుష్యులకు విగ్రహాలు కట్టి మనం దేవుని మహిమపరచలేము. దేవుని లక్ష్యాలు వాటి వలన నెరవేరవు.
రోమా 8:28 చూద్దాము.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
రోమా 8:28
ఆ మాటలు మీరు గమనించండి. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.దేవుడు ఇశ్రాయేలీయులను ఒక లక్ష్యముతో పిలిచాడు. వారు ఏర్పరచబడిన జనం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ దేశముగా పిలువబడ్డారు. ఈ రోజున విశ్వాసులు కూడా అంతే. దేవుడు వారిని రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డారు.
ప్రతి విశ్వాసి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు. మన ప్రపంచములో ఎంతో మంది కి దిశ ఉండదు. మా జీవితానికి అర్థం ఏమైనా ఉందా? అని వారు వ్యధ చెందుతూ వుంటారు. మన సమాజములో ఎంతో మంది డిప్రెషన్ కు గురవుతూ ఉన్నారు. నేను చేసే పనులకు అర్థం లేదు అని మనకు అనిపించవచ్చు. అయితే దేవుని చిత్తములో మనం చేసే ప్రతి పనీ దేవుని దృష్టికి విలువైనదే. పౌలు ఆ సత్యం ఇక్కడ మనకు బోధిస్తున్నాడు.
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పునపిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
గ్రీకు ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఒక వస్తువు కు 4 కారణాలు ఉంటాయి అన్నాడు.
ఉదాహరణకు ఒక కుర్చీ గురించి ఆలోచించండి.
మొదటిది Formal Cause అన్నాడు. అంటే దాని రూపం. కుర్చీ ని చూస్తే అది ఒక కుర్చీ అని మనకు అర్ధం అవుతుంది. అది
Formal Cause. రెండోది మెటీరియల్ కాస్. అంటే అది దేవుని చేత నిర్మించబడింది? కుర్చీ చెక్కతో నిర్మించబడింది. అది మెటీరియల్ కాస్.
మూడోది Efficient Cause. అంటే కుర్చీ ఎలా ఉనికి లోకి వచ్చింది. ఒక వడ్రంగి ఆ కుర్చీని చేశాడు. అది efficient cause.
నాలుగవది final cause. కుర్చీ ఎందుకు చేయబడింది? దాని పర్పస్ ఏమిటి?
ఎవరో ఒకరు కూర్చోవటానికి అది చేయబడింది. కుర్చీ దాని మీద అది కూర్చోలేదు. దాని పర్పస్ దానిలో లేదు. ఎవరో ఒకరు కూర్చోటానికి అది చేయబడింది. అదే విధముగా మన పర్పస్ మనలో లేదు. వడ్రంగి ఒక ఉద్దేశ్యముతో కుర్చీని సృష్టించాడు. దేవుడు కూడా ఒక ఉద్దేశ్యముతో మనలను సృష్టించాడు. అరిస్టాటిల్ నాలుగు కారణాలు మనిషి సృష్టిలో కూడా కనిపిస్తాయి.
మొదటిగా formal cause. దేవుడు మనకు ఒక రూపం ఇచ్చాడు. తన స్వరూపములో మనలను సృష్టించాడు.
రెండోది material cause. రక్త మాంసములతో దేవుడు మనలను సృష్టించాడు.
మూడోది efficient cause. మనలను సృష్టించింది దేవుడే.
నాలుగవది final cause. తన మహిమ కొరకు దేవుడు మనలను సృష్టించాడు. మన పట్ల ఆయన పర్పస్ అదే.
సమస్తమును ఒక లక్ష్యముతో నెరవేర్చగలిగే పర్పస్ దేవుడు మన పట్ల కలిగివున్నాడు. హేరోదు రాజు యెరూషలేము లో దేవాలయం పునరుద్ధరించాడు. దానిని ఎంతో వైభవముగా నిర్మించాడు. ఎంతో ధనం దాని కోసం ఖర్చు పెట్టాడు. అయితే ఆయన లక్ష్యం ఏమిటి? ప్రజల ముందు తన ఇమేజ్ బాగుండాలి, తన రాజ్యం సుస్థిరం కావాలి, ఆర్ధిక పరిస్థితి బాగుండాలి. దేవుని మహిమ కోసం నేను ఈ దేవాలయం కట్టాలి అని హేరోదు ఎప్పుడూ అనుకోలేదు. దీనిని చూసి జనం నా పేరు చెప్పు కోవాలి అని హేరోదు అనుకొన్నాడు. అతనికి దేవుని మీద ఎలాంటి భక్తి, ప్రేమ లేవు. దేవుని మీద ప్రేమతో, భక్తితో మనం దేవుని కార్యాలు చేయాల్సి ఉంది. తోల్కియన్ వ్రాసిన Lord of the Rings లో ఒక రింగ్ ఉంటుంది. ఆ ఉంగరం ఎవరికి ఇవ్వబడుతుందో తెలియదు.
ఫ్రొడో ఏమంటాడంటే, ఆ రింగ్ నా దగ్గరకు రాకపోయి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. అప్పుడు గండాల్ఫ్ ఒక మాట అంటాడు. ‘దానిని నీవు నిర్ణయించలేవు. నీకు ఇవ్వబడిన సమయములో ఏమి చేయగలవో అదే నీవు నిర్ణయించగలవు’ ఫ్రొడో వలె మనం కూడా ఈ పరిస్థితి నాకు రాకపోతే ఎంత బాగుండు అను కొంటాము. అయితే మనం గండాల్ఫ్ మాట వినాలి. దేవుడు తన రింగ్ మనకు పెట్టాడు. ఆయన ఏ పరిస్థితుల్లో మనలను నడిపించినప్పటికీ, సమస్తమును ఒక పర్పస్ ప్రకారం మనకు మేలు కలుగుటకే ఆయన చేస్తాడు.
యేసు క్రీస్తు ప్రభువు లక్ష్యం ఏమిటి? సువార్తలు చదవండి. ఆయన జీవితం సిలువ వైపు సాగింది. సిలువ వేయబడటానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చాడు.
సిలువ వేయబడడం ఎంతో భయంకరమైన శిక్ష. అయితే అందులో నుండి కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేసాడు.
యేసు క్రీస్తు మరణములో నుండి మనకు జీవం లభించింది
యేసు క్రీస్తు దుఃఖంలో నుండి మనకు ఆనందం లభించింది
యేసు క్రీస్తు నరకములో నుండి మనకు పరలోకం లభించింది.
యేసు క్రీస్తు శాపములో నుండి మనకు ఆశీర్వాదం లభించింది.
యేసు క్రీస్తు నష్టం లో నుండి మనకు లాభం లభించింది.
దేవుడు ఆ విధముగా సిలువ నుండి మనకు అనేక ప్రయోజనాలు కలిగించాడు. సమస్తము సమకూర్చి జరిగించే ఆలోచన, శక్తి ఆయనకు ఉన్నాయి.
5:5-8
5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది.
5:6 ఏల యనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.
7 నీతి మంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.
8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
17.God of Philanthropy
దేవుడు తన ప్రజల అవసరాలు తీర్చేవాడిగా ఈ పత్రికలో మనకు కనిపిస్తున్నాడు.
రోమా పత్రిక 15 అధ్యాయం చూడండి:
25 అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.
26 ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.
27 అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు.
క్రీస్తు శకం 58 వ సంవత్సరములో పాలస్తీనా ప్రాంతములో ఒక కరువు వచ్చింది. యెరూషలేములో ఉన్న యూదు క్రైస్తవులు పేదరికములో ఉన్నారు. వారికి హింసలు కూడా కలిగాయి. వారికి సహాయము చేద్దాము రండి అని అపోస్తలుడైన పౌలు మాసిడోనియా, అకయ ప్రాంతములలోని క్రైస్తవులైన అన్యజనులకు విజ్ఞప్తి చేశాడు. ‘అన్యజనులైన మీరు యూదులకు అచ్చివున్నారు. రక్షణ యూదులలో నుండియే వచ్చింది. పితరులు, ప్రవక్తలు, అపోస్తలులు, రక్షకుడైన క్రీస్తు అందరూ యూదులే. వారి నుండి మీరు ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులు పొందారు కదా! వారికి శరీర సంబంధమైన మేలులు చేసి మీ కృతజ్ఞత తెలుపుకోండి’ అని పౌలు వారికి విజ్ఞప్తి చేశాడు.
పౌలు మనవి విని అన్యజనులు యూదులకు సహాయం పంపారు. దేవుడు ఆజ్ఞలు, నిబంధనలు చేసే వాడు మాత్రమే కాదు. ఆయన తన ప్రజల శారీరిక అవసరాలు కూడా పట్టించుకొంటాడు.
18.God of Providence
రోమా పత్రిక 13 అధ్యాయం నుండి కొన్ని మాటలు చూద్దాము. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.కాబట్టి అధికారమును ఎది రించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందు దువు.నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.సమస్త ‘అధికారము’ దేవునికి చెందినదే. దేవుడు ఈ అధికారమును కొన్ని వ్యవస్థలకు కూడా ఇచ్చాడు. మానవ ప్రభుత్వం వాటిలో ఒకటి. మనుష్యుల యొక్క సంక్షేమం కొరకు దేవుడు ప్రభుత్వ వ్యవస్థ ను ఏర్పాటు చేశాడు. సమాజములో ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వ వ్యవస్థకు లోబడి ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నివసించిన ప్రాంతములో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలకు లోబడి జీవించాడు. ‘కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడి’ అని ఆయన బోధించాడు (మత్తయి 22:21). ఆయన ప్రభుత్వానికి పన్నులు చెల్లించాడు. రోమన్ గవర్నర్ పాంటియస్ పైలట్ ఇచ్చిన అన్యాయపు తీర్పును కూడా ఆయన ఎదిరించకుండా ఓర్పుతో స్వీకరించాడు.
యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు, అపోస్తలులు కూడా ప్రభుత్వమునకు లోబడి జీవించారు. యూదయ లో అస్తవ్యస్థ పరిస్థితులు ఉండేవి. అపోస్తలుల కార్యములు 5 అధ్యాయములో ఆ విషయం మనకు అర్థం అవుతుంది. యూదులలో ఉన్న తీవ్రవాదులు, హింసా వాదుల గురించి గమలియేలు చెప్పాడు. ధూదా అనే వ్యక్తి 400 మందిని పోగు చేసి ఒక ఉద్యమం నడిపాడు. గలిలియా ప్రాంతానికి చెందిన యూదా అనే వ్యక్తి రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఒక పోరాటం చేశాడు. వీరిద్దరూ నశించారు. సికారా అనే ఉగ్రవాదులు కూడా ఉండేవారు. వారు కత్తులు తీసుకొని ప్రభుత్వ అధికారులను, రోమన్ సైనికులను పొడుస్తూ ఉండేవారు.
అయితే పౌలు తీవ్ర వాదం ను ప్రోత్సహించలేదు. ప్రభుత్వము నకు లోబడి జీవించాడు. మనము కూడా ప్రభుత్వము నకు లోబడి జీవించాలి.
19.God of Pleasure
దేవుడు ఆనందించేవాడు. ఆనందం అందరికీ పంచేవాడు. మన సమాజములో చాలా మందికి ఆనందం లేదు. డిప్రెషన్ పెరిగిపోతూ ఉంది. ఆత్మ హత్యలు చేసుకొనే వారు పెరిగిపోతున్నారు. వారికి నిరీక్షణ ఎలా దొరుకుతుంది? రోమా పత్రిక 15 అధ్యాయము నుండి 13 వచనం చూద్దాము:
కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. రోమా 15:13
దేవుడు సమాధాన కర్త, ఆదరణ కర్త, నిరీక్షణ కర్త. నిరీక్షణ లేకుండా ఎవరూ ఆనందముగా ఉండలేరు. నిరీక్షణ దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఆనందం దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. చాలా మంది ఏమనుకొంటారంటే, దేవుని దగ్గర ఎలాంటి ఆనందం, సంతోషం వుండవు. నాకు ఉన్న కాస్త ఆనందం కూడా దేవుడు పాడుచేస్తాడు అనుకొంటారు. అయితే అది తప్పు అభిప్రాయం.
దేవుడు సంపూర్ణమైన ఆనందముతో నిండిఉన్నాడు. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య సంపూర్ణమైన ఆనందం ఉంది. తండ్రి, కుమారుడు అంటే తండ్రి కి కుమారుడు పుట్టాడు అని కాదు. అవి ఒక సంబంధాన్ని మనకు తెలియజేస్తున్నాయి. నూతనముగా పుట్టిన బిడ్డ రెండు నెలల వయస్సు నుండి నవ్వటం ప్రారంభిస్తుంది. తల్లి మొహం చూసి ఆ బిడ్డనవ్వుతుంది. Joy is interpersonal. ఆనందం అనేది వ్యక్తుల మధ్య ఉండేది. దైవిక త్రిత్వం లోని ముగ్గురు వ్యక్తుల మధ్య ఆ ఆనందం మనం చూస్తాము.
తండ్రి అయిన కుమారుడైన దేవుని వైపు చూసి ఆనందిస్తాడు (మత్తయి 12:18, యెషయా 42:1)
ఇదిగో ఈయన నా సేవకుడు … ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు
మత్తయి 12:18, యెషయా 42:1
అవి తండ్రి తన కుమారుని గురించి ఆనందముతో చెప్పిన మాటలు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని వైపు చూసి ఆనందించాడు. (మత్తయి 11:25)
కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందించాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు లేకుండా మనం దేవుని ఆనందం పొందలేము. పరిశుద్ధ ఆత్మ అనే పేరు వింటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఆయన వలన నాకు ఆనందం ఉండదు అని చాలా మంది అనుకొంటారు. అయితే పరిశుద్ధ ఆత్మ దేవుని ఆనందము మనకు ఇచ్చేవాడు. (కొలొస్స 1:6) అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి. అపోస్తలులు కార్యములు 13:52
యేసు ప్రభువు శిష్యులు ఆనంద భరితులుగా జీవించారు. ఎందుకని? వారు పరిశుద్ధాత్మ చేత నిండి ఉన్నారు. ఆ విధముగా దేవుడు సంపూర్ణమైన ఆనందముతో నిండిఉన్నాడు. దేవుడు ఆనందించేవి అనేకం ఉన్నాయి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.
కీర్తన 37:23
తన ప్రజలను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు (కీర్తన 5:4) దుష్టులు మరణము నొందుటచేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
యెహెఙ్కేలు 18:23
దుష్టులు నాశనం అయిపోవటం చూసి దేవుడు ఆనందించే వాడు కాదు. వారు కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి రక్షించ బడితే ఆయనకు ఆనందం కలుగుతుంది. పీటర్ లొంబార్డ్ గొప్ప క్రైస్తవ వేదాంతి. ఆయన ఇటలీ దేశములో జన్మించాడు. 12 నుండి 16 శతాబ్దాల వరకు ఆయన వ్రాసిన sentences గ్రంధం గొప్ప కామెంటరీ గా ఉండేది.ఈ Sentences లో 4 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకములో లొంబార్డ్ దైవిక త్రిత్వం గురించి వ్రాశాడు. అందులో ఆయన యేమని వ్రాశాడంటే, దైవిక త్రిత్వము మాత్రమే మానవులకు నిజమైన ఆనందం ఇవ్వగలరు. దేవునికి వెలుపల ఉన్నవన్నీ ఆ ఆనందం వైపు మనలను నడిపించడానికే చేయబడ్డాయి. రెండవ పుస్తకములో సృష్టి గురించి వ్రాశాడు. ఇది దేవుడు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము (కీర్తన 118:24)
దేవుడు సృష్టించినవి అన్నీ ఆనందము ఇవ్వటానికే సృష్టించబడ్డాయి. మనుష్యులను దుఃఖపరచడానికి, ఏడ్పించడానికి దేవుడు ఒక్కటి కూడా చేయలేదు. దేవుడు చేసిన సృష్టి మొత్తం ఆనందం కొరకే అని పీటర్ లోమ్బార్డ్ అన్నాడు. దేవుడు చేసిన పరలోకం కూడా ఆనందముతో నిండి ఉంది. C.S.Lewis గారు అన్నాడు:
Joy is the serious business of heaven
C.S.Lewis
పరలోకం యొక్క ఉద్దేశ్యం ఆనందం పంచడానికే. దేవుడు చేసిన దేవదూతలు కూడా ఆనందం పంచే వారిగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవదూతలు ఆనందముతో దేవుని స్తుతించి ఆ శుభవార్తను గొఱ్ఱెల కాపరులకు తెలియజేశారు. యేసు క్రీస్తు ప్రభువు ఆదివారం ఉదయం మరణం నుండి తిరిగి లేచినప్పుడు ఆ శుభవార్తను దేవదూతలు ఆయన సమాధి వద్దకు వెళ్లిన స్త్రీ, పురుషులకు తెలియజేశారు. (మత్తయి 28:8) ఎవరైనా రక్షణ పొందితే దేవదూతలు ఆనందము వ్యక్తం చేస్తారు. (లూకా 15:7).
చెరసాలలో నుండి ఒక దేవదూత పేతురు గారిని విడిపించాడు. ఆయనను చూసి ఒక చిన్న పిల్ల ఎంతో సంతోషించింది (అపో కార్య 12:14) ఆ విధముగా దేవుని వ్యక్తిత్వం, దేవుడు చేసిన సృష్టి, దేవుడు చేసిన పరలోకం, దేవదూతలు – వాటన్నిటిలో ఆనందం మనకు కనిపిస్తుంది. ఆనందం రెండు రకాలుగా ఉంది. ప్రకృతి సంబంధమైన ఆనందం. ఆత్మ సంబంధమైన ఆనందం. మొదటిది ప్రకృతి సంబంధమైన ఆనందం. ‘నాకు ఆనందం కలిగించేవి చాలా ఉన్నాయి లేవయ్యా. దేవుడు, బైబిల్ నాకు అక్కర లేదు’ అనే వారు ఉన్నారు. అయితే వారు గ్రహించాల్సిందే ఏమిటంటే, వాటన్నిటిని సృష్టించింది దేవుడే. చక్కటి సూర్యోదయం, పర్వత శిఖరాలు, అరణ్యాలు, నదులు, చెట్లు, జంతువులు, ఆహారం, నీరు మీ పిల్లలు, మీ స్నేహితులు – మీకు ఆనందం ఇచ్చేది ఏదయినప్పటికీ అది దేవుని యొద్ద నుండి వచ్చినదే. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6 అధ్యాయములో వ్రాశాడు: ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము.
1 తిమోతి 6 :17
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. ఇలాన్ మస్క్ ప్రపంచములో అందరికంటే ధనవంతుడు. ఈ మధ్యలో ఆయన, ‘నేను పనిలో ఆనందం వెతుక్కొంటాను’ అన్నాడు. పనే మాకు దైవం, పనే మాకు ఆనందంఅని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని అనుమతి లేకుండా మీరు ఒక్క రోజు కూడా పనిచేయలేరు. అమెజాన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ 500 మిలియన్ డాలర్లతో ఒక పెద్ద ప్లెషర్ బోట్ కొనుక్కున్నాడు. ఆ పెద్ద పడవలో వందల మంది సేవకులు వుంటారు. దేవుని అనుమతి లేకుండా ఒక్క రోజు కూడా జెఫ్ బెజోస్ ఆ పడవలో గడపలేడు. చాలా మంది ఏమనుకొంటున్నారు? నేను ఎంజాయ్ చేసేవి చాలా వున్నాయి నాకు దేవుడు అక్కర లేదు.
పౌలు ఏమంటున్నాడంటే, అవి అస్థిర మైనవి. ‘సుఖముగా అను వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమ్మిక యుంచుము’ మిమ్మును సుఖపెట్టే ప్రతిదీ, మీరు ఎంజాయ్ చేసే ప్రతి వస్తువు, మిమ్మును సంతోషపెట్టే ప్రతి రిలేషన్ షిప్, దేవుని యొద్ద నుండి వచ్చినదే. ప్రకృతి సంబంధమైన ఆనందం ఆత్మ సంబంధమైన ఆనందమునకు ఒక ఛాయగా ఉంది.
యేసు క్రీస్తు ప్రభువు చేసిన మొదటి అద్భుతంఏమిటి? నీటిని ద్రాక్షరసముగా ఆయన మార్చాడు. మనిషి జీవితాన్ని మధురముగా మార్చడానికి, వారికి దేవుని ఆనందం ఇవ్వడానికే ఆయన వచ్చాడు.
ఒక చల్లటి పానీయం మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మనకు జీవజలం.
ఒక మంచి విందు భోజనం మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మనకు జీవాహారం.
మంచి విశ్రాంతి మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు మన ఆత్మలకు విశ్రాంతి.
ఒక మంచి స్నేహితుడు మీకు సంతోషం ఇవ్వవచ్చు. యేసు క్రీస్తు నిజమైన స్నేహితుడు.
మనకు ఆనందం ఇచ్చే ప్రకృతి సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన కొనసాగింపే యేసు క్రీస్తు. అందుకనే పాత నిబంధనలో కూడా యేసు క్రీస్తు సాదృశ్యాలు చాలా ఆనందకరమైనవి మనకు కనిపిస్తాయి.
ఉదాహరణకు పస్కా పండుగ లో ఒక మంచి విందు మనం చూస్తున్నాము. అది యేసు క్రీస్తుకు సాదృశ్యం.
ద్రాక్ష రస పాత్ర దేవుని ఆనందముకు గుర్తుగా ఉంది. అది యేసు క్రీస్తుకు సాదృశ్యం.
ఇశ్రాయేలీయులు దేవుడు పెట్టిన ఎన్నో పండుగలు ఆనందముతో చేసుకొనేవారు. అవన్నీ యేసు క్రీస్తును సూచిస్తున్నాయి.
అరణ్యములో వారి దాహం తీర్చడానికి దేవుడు వారి యొద్దకు మధురమైన నీటిని ఒక నదిగా పారించాడు. ఆ నది యేసు క్రీస్తుకు చిహ్నముగా ఉంది.
వారికి ఆకలి వేసినప్పుడు దేవుడు మన్నా ను వారి మీద కురిపించాడు. అది వారి ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టింది. ఆ మన్నా కూడా క్రీస్తుకు సాదృశ్యమే. ప్రకృతి సంబంధమైన వాటితో ఆగిపోవద్దు. దేవుడు ఇచ్చే ఆత్మ సంభందమైన ఆనందం కూడా మనం పొందాలని దేవుని ఉద్దేశ్యం. ఈ ప్రకృతి సంబంధమైన ఆనందం దేవుడు అందరికీ ఇచ్చాడు. రెండవది ఆత్మ సంబంధమైన ఆనందం. ఈ ఆనందం మీకు కావాలంటే మీరు యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు రావాలి.
20.God of Praise
God of Praise father praises the son, son praises the father, Holy Spirit
ఆనందమునకు మరొక గొప్ప రహస్యం దేవుని స్తుతించుట. లూకా సువార్త 24 అధ్యాయం చదవండి. యేసు క్రీస్తు శిష్యులు ఎంతో ఆనందముతో ఉన్నట్లు మనం చదువుతాము. వారు దేవుని స్తుతించుట మనకు అక్కడ వారు దేవుని స్తుతిస్తూ ఆనందం పొందారు. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి;ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
1 థెస్సలొనీక 5:16-18
ఆనందం, ప్రార్ధన, కృతజ్ఞతా స్తుతులు – ఈ మూడూ కలిసి వెళ్లడం మనం ఇక్కడ చూస్తున్నాము. అవి నిత్య కృత్యాలుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఎల్లప్పుడూ… సంతోషముగా ఉండు
ఎడతెగక….ప్రార్థన చేస్తా ఉండు
ప్రతి విషయములో… కృతజ్ఞతా స్తుతులు చెల్లించు.
మా అమ్మ రాజా బాబు గారు ఎప్పుడూ స్తుతి గీతాలు వింటూ ఉండేది. అవి వింటే నాకు ఆనందం కలుగుతుంది అని ఆమె చెబుతూ ఉండేది. దేవుని స్తుతించడములో ఎంతో ఆనందం ఉంది. చక్కటి క్రైస్తవ గీతాలు, సంగీతం వింటూ వుండండి. మీకు ఎంతో ఆనందం కలుగు తుంది. యేసు క్రీస్తు ప్రభువు ఇచ్చే ఈ గొప్ప ఆనందం మీకు కలుగాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.