ఇశ్రాయేలు – హమాస్ యుద్ధం: బైబిలు ప్రవచనముల నెరవేర్పు   

     ఈ రోజు ఇశ్రాయేలు మీద యుద్ధం  బైబిలు ప్రవచనాల నెరవేర్పు అనే అంశం మీద మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ వారం ఉగ్రవాద సంస్థ హమాస్ ఇశ్రాయేలు దేశములో యూదుల మీద విరుచుకుపడింది. దాదాపు వెయ్యి మంది యూదులను తీవ్రవాదులు ఊచకోత కోశారు. ఇంకొక 200 మందిని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లారు. 1948 లో ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు మృత్యువాత పడడం ఇదే మొదటి సారి. ఆడ, మగపెద్ద, చిన్న అనే తేడా లేకుండా టెర్రరిస్టులు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపివేశారు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూ ఉంది. ఆ బిడ్డను లాక్కుని తల్లి ముందే పొడిచి చంపారు. ఒక నిండు గర్భిణీ ఇంట్లో కూర్చొని ఉంది. ఆమె గర్భాన్ని పొడిచి, బిడ్డను బయటికి లాగి చంపారు. 

    ఒక తాత తన మనుమని తీసుకొని పార్కుకు వెళ్ళాడు. ఆ తాతను మనుమని ముందే చంపివేశారు. ఆ బాలుని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. కాలేజీ విద్యార్థులు శాంతి కోసం ఒక మ్యూజిక్ ఫెస్టివల్ పెట్టుకొన్నారు. టెర్రరిస్టులు వెళ్లి అక్కడ 260 మందిని క్రూరముగా చంపివేశారు. ఒక మహిళ తన కారులో తన ముగ్గురు బిడ్డలను తీసుకొని వెళ్ళింది. ఆమె, ఆమె బిడ్డల మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. తల్లుల కోసం కొడుకులు గాలిస్తున్నారు. 

   వారి యొక్క కవల పిల్లలను రక్షించుకోవడానికి ఒక భార్య భర్తలు తుపాకులు తీసుకొని ఉగ్రవాదులతో పోరాడారు. 7 గురు టెర్రరిస్టులను చంపి, ఆ పోరాటంలో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక టెర్రరిస్ట్ ఒక యువకుని, అతని గర్ల్ ఫ్రెండ్ ని కాల్చి చంపాడు. ఆ యువకుని ఫోన్ తీసుకొని చంపడం  వీడియో తీసి ‘నీ కొడుకుని ఎలా చంపానో చూడు’ అని ఆ యువకుని తల్లికి వీడియో పంపాడు. 

    ఈ టెర్రరిస్టులు 200 మంది చిన్నపిల్లలను కూడా చంపివేశారు. అప్పుడే పుట్టిన పసి బిడ్డలు సహితం  బుల్లెట్ల వర్షానికి గురయ్యారు. వారి హృదయములో ఎంత దుష్టత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు దేశములో ఇప్పుడు ఎటు చూసినా శవాల గుట్టలు, ఆర్తనాదాలు, మిలిటరీ ట్యాంకులు, సైరెన్లు, నిండిపోయిన హాస్పిటళ్లు, కిక్కిరిసిన బ్లడ్ బ్యాంకులు మనకు కనిపిస్తున్నాయి. 

   ఈ టెర్రరిస్టులు అధునాతన తుపాకులు వాడారు. వారు ఇశ్రాయేలు దేశము మీదకు పంపిన మిస్సైల్ లు చాలా వేగముగా దూసుకువచ్చాయి. వారు పారా గ్లైడర్లు సహాయముతో ఇశ్రాయేలు దేశములోకి ప్రవేశించారు. దేశ రక్షణ కోసం ఇశ్రాయేలు దేశం ఐరన్ డోమ్ లేక ఇనుము గుమ్మటం ఏర్పరచుకొంది. దీనిని కూడా టెర్రరిస్టులు చేధించారు. 

   ఇశ్రాయేలు దేశం మిలిటరీ  ప్రపంచములోనే గొప్ప మిలిటరీ లలో ఒకటి. వారి సైనికులు ఎంతో చురుకుగా వుంటారు. ఇశ్రాయేలు దేశం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఎంతో శక్తి వంతమైనది. ఇశ్రాయేలు దేశం అధునాతన డ్రోన్ లు ఎప్పుడూ గాజా ప్రాంతము మీద ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అయితే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ దాడులను ముందుగా పసిగట్టలేకపోయాయి. గాజా ప్రాంతము నుండి ఈ టెర్రరిస్టులు ఇశ్రాయేలు దేశం లోకి విరుచుకు పడ్డారు. 

   ఈ రక్తపాతాన్ని అడ్డుకోవడానికి ఇశ్రాయేలు దేశం వెంటనే నడుం బిగించింది. 3 లక్షల మంది రిజర్వు సైనికులను అది రంగం లోకి దింపింది. గాజా ప్రాంతము లో 28 ఊరులను ఖాళీ చేశారు. ఈ రక్త పాతం చూసినప్పుడు నాకు యేసు ప్రభువు, ఆయన  చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన యెరూషలేము ను చూసి కన్నీరు పెట్టాడు. 

     ఆయన సిలువ మోసికొని వెళ్తున్నపుడు యెరూషలేములో అనేక మంది రొమ్ము కొట్టుకొనుచూ ఏడ్చారు. యేసు ప్రభువు వారిని చూసి ఒక మాట అన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

             లూకా 23:28 

యెరూషలేము మీదకు, ఇశ్రాయేలు మీదకు రాబోయే శ్రమలను యేసు ప్రభువు ముందే చూశాడు. అందుకనే వారితో ఆ మాట అన్నాడు. మనిషి హృదయం ఎంతో దుష్టత్వం తో నిండి ఉంది అని యేసు ప్రభువు చెప్పాడు. దురాలోచనలు, నరహత్యలు మనిషి హృదయములో నుండే వస్తాయి.  మత్తయి 15:19  అని అని ఆయన చెప్పాడు. మన హృదయాలు మారాలి. యేసు క్రీస్తు రక్తం చేత కడుగబడాలి మారు మనస్సు పొందాలి. లేకపోతే మన పాప హృదయము లో సాతానుడు కాపురం పెడతాడు. ఆ సాతానుడు మనతో భయంకరమైన పాపాలు చేయిస్తాడు. 

    మత్తయి సువార్త 24 అధ్యాయములో యేసు ప్రభువు చేసిన ఒలీవల కొండ ప్రసంగం గురించి మనం చదువుతాము. ప్రపంచ పరిస్థితులు చివరి దినాల్లో క్షీణిస్తాయని ఆయన స్పష్టముగా మనకు తెలియజేశాడు.ఈ టెర్రరిస్టులు దేవుని సత్యము ను తిరస్కరించారు. యేసు క్రీస్తు సువార్తను వారు వ్యతిరేకించారు. దేవుని భయం వారికి ఏ మాత్రం లేదు. అందుకనే వారు రక్తపాతం చేయడానికి ఎప్పుడూ ఆరాట పడతారు. 

ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? 

   దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

           కీర్తన 122:6 

యెరూషలేము యొక్క క్షేమము కొరకు, ఇశ్రాయేలు దేశం యొక్క భద్రత కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.యెరూషలేము ను దేవుడు ప్రేమించాడు. మనం కూడా దానిని ప్రేమించాలి అని దేవుడు కోరుకొంటున్నాడు. యూదులను దేవుడు ఏర్పరచుకున్నాడు. పితరులు వారి వారే. ప్రవక్తలు వారి వారే. మనం చదివే బైబిలు మొత్తం వ్రాసింది వారే. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కూడా యూదుడే. దేవుడు ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క రూపములో,ఒకే ఒక్క చోట మానవ శరీరములో ఈ లోకానికి వచ్చాడు. అది రెండు వేల సంవత్సరాల క్రితం ఒక యూదుని రూపములో ఇశ్రాయేలు దేశములో. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు

    ఈ రోజున టెర్రరిస్టులు నెత్తురు పారిస్తున్న ప్రదేశాలలో ఒక రోజుల్లో అబ్రహాము గారు తిరిగాడు. దేవుని ప్రవక్తలు తిరిగారు. యేసు క్రీస్తు ప్రభువు తిరిగాడు. గాజా ప్రాంతం నుండి టెర్రరిస్టులు దాడులు చేసిన ప్రాంతాలు మీరు ఒక సారి చూడండి. 

   బెయేర్షెబా: ఆ పట్టణములో అబ్రహాము గారు జీవించాడు. ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన మనుమడు యాకోబు లతో దేవుడు ఆ ఊరిలో మాట్లాడాడు. 

అష్కేలోను: ఆ పట్టణమును యెహోషువ జయించాడు (యెహోషువ 13:3). యూదా గోత్రం వారు అక్కడ జీవించారు. 

అష్డోదు: ఆ పట్టణములో దేవుని మందసము కొంత కాలం ఉంది (1 సమూయేలు 5:5) 

లాకీషు: బబులోను వారు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు చివరిగా అక్కడ తల దాచుకున్నారు. 

హెబ్రోను: ఆ పట్టణములో అబ్రహాము జీవించాడు. ఆయన, ఆయన కుమారుడు, ఇస్సాకు, ఆయన మనుమడు యాకోబు, వారి భార్యలు శారా, రిబ్కా, లేయా లు ఆ ఊరిలో సమాధి చేయబడ్డారు. దావీదు ఆ ఊరిలోనే ఇశ్రాయేలీయులకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. 

   ఆ విధముగా దేవుని ప్రజలు జీవించిన పట్టణాల్లో ఈ రోజు టెర్రరిస్టులుహత్యాకాండలు చేస్తున్నారు. అది ఎంతో విచారకరం. మనం ఈ పట్టణాల కొరకు ప్రార్థన చేయాలి. ఈ సంఘటనలు చూస్తే మనకు బాధ కలగడం సహజమే. కానీ మనం నిరుత్సాహ పడకుండా దేవుని వాక్యం ధ్యానించాలి. బైబిలు ప్రవచనాల వెలుగులో మనం ఈ ప్రపంచాన్ని చూడాలి. 

   మోసెస్ మైమోనిడిస్ (1138 – 1204) ఒక యూదు తత్వవేత్త. దేవుని ప్రజలు శ్రమలలో ఉన్నప్పుడు ఏమి చేయాలి అనే అంశం మీద ఆయన ధ్యానం చేశాడు. The Guide for the Perplexed అనే పుస్తకం వ్రాశాడు. కలవరం చెందినవారికి మార్గదర్శి – ఈ పుస్తకములో ఆయన ప్రతి వ్యక్తీ రెండు బైబిలు సత్యాలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. 

మొదటిగా ఆదికాండము: ఆ పుస్తకం దేవుడు మన సృష్టికర్త అనే సత్యం మనకు బోధిస్తుంది. 

రెండవదిగా యెహెఙ్కేలు గ్రంథం: ఆ పుస్తకం దేవుడు తన ప్రజలను దర్శించేవాడు అనే సత్యం మనకు బోధిస్తుంది. Physics & Metaphysics

ఆదికాండము ఫిజిక్స్: ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది, ఎలా మొదలయ్యింది అనే సత్యం అది మనకు తెలియజేస్తుంది. యెహెఙ్కేలు గ్రంథం – మెటా ఫిజిక్స్ అంటే అది రియాలిటీ. రియాలిటీ ఏమిటంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడూ వదిలిపెట్టడు. ఈజిప్ట్ లో ఇశ్రాయేలీయులు బానిసత్వములో ఉన్నారు. దేవుడు వారిని దర్శించాడు. మండుచున్న పొదలో మోషే కి ప్రత్యక్షమై ఆయనను తన ప్రవక్తగా పిలిచాడు. నిర్గమ కాండము 3:4-9 

    బబులోను వారు ఇశ్రాయేలీయుల మీద దాడులు చేస్తున్నప్పుడు దేవుడు యిర్మీయా ప్రవక్తకు ప్రత్యక్షమయ్యాడు. యిర్మీయా 1:4-8. యెహెఙ్కేలు ప్రవక్తను కూడా చూడండి. క్రీస్తు పూర్వం 597 వ సంవత్సరం. నెబుకద్నెజరు చక్రవర్తి వచ్చి తన బబులోను సైన్యం వచ్చి ఆయనను బబులోను కు బలవంతముగా ఈడ్చుకు వెళ్ళాడు. వేలాది మంది యూదులతో ఆయన బబులోను లో బందీగా ఉన్నాడు. యెరూషలేము కు దూరముగా శత్రువుల దేశములో ఆయన తల దాచుకొని ఉన్నాడు. 11 సంవత్సరముల తరువాత యెరూషలేము ను నాశనం చేశారని, దేవుని ఆలయమును ధ్వంసం చేశారని యెహెఙ్కేలు కు తెలిసింది.  ఆ సమయములో దేవుడు యెహెఙ్కేలు కు తన దర్శనం ఇచ్చాడు. ఒక రథం మీద దేవుడు ప్రయాణిస్తూ యెహెఙ్కేలు కు కనిపించాడు. ఆ రథం యొక్క చక్రాలు స్పష్టముగా ప్రవక్తకు కనిపించాయి. నా ప్రజలు ఎక్కడ ఉన్నా, నేను వారి దగ్గరకు వస్తాను అనే సందేశం అందులో ఉంది. కాబట్టి మైమోనిడిస్ చెప్పినట్లు, మనకు ఫిజిక్స్ అండ్ మెటఫీసిక్స్ రెండూ కావాలి. 

ఆదికాండము లో ఫిజిక్స్ – దేవుడు మన సృష్టికర్త 

యెహెఙ్కేలు గ్రంథం లో మెటఫీసిక్స్  – దేవుడు మనం ఎక్కడ ఉన్నా మన యొద్దకు వస్తాడు. ఆధునిక ప్రపంచం ఈ రెండు గొప్ప సత్యాలు మరచిపోయింది. అందుకనే మన ప్రపంచం ప్రస్తుత దుస్థితి లో ఉంది. 

     యెహెఙ్కేలు దుర్భర స్థితిలో ఉన్నాడు. యెహెఙ్కేలు అనే పేరుకు ‘దేవుడు శక్తి ఇచ్చేవాడు’ అని అర్థం. దేవుడు తన దర్శనములు ఆయనకు ఇచ్చి ఆయనను బలపరచాడు. ఆయనకు నిరీక్షను ఇచ్చాడు. దేవుడు ఆయనకు జరుగబోయే ప్రపంచ సంఘటనల గురించి ముందుగానే తెలియజేసాడు. యూదా దేశం వారు చేసిన పాపములను బట్టి నాశనము చెందుతుంది, శత్రువులు దానిని శిక్షిస్తారు అని దేవుడు యెహెఙ్కేలు కు తెలియజేశాడు. యెహెఙ్కేలు గ్రంథం 4-24 అధ్యాయాలు. 

అయితే నేను మీతో ఒక  నిత్య నిబంధన చేసి, దాని స్థిరపరుస్తాను. యెహెఙ్కేలు గ్రంథం 16:60 

యెహెఙ్కేలు గ్రంథం 33-48 అధ్యాయాలు మనం చదివితే దేవుడు ఇశ్రాయేలు కు ఇచ్చిన నిరీక్షణ మనకు అర్థం అవుతుంది. ప్రపంచ మంతా చెదరి పోయిన మిమ్ములను నేను తిరిగి ఇశ్రాయేలు దేశం తీసుకు వస్తాను అని దేవుడు వారికి చెప్పాడు. 

యెహెఙ్కేలు గ్రంథం 20:33-34 

ఒక క్రొత్త కాపరి ని నేను మీకు ఇస్తాను అన్నాడు. యెహెఙ్కేలు గ్రంథం 34:11-31 

నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆయా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించె దను. యెహెఙ్కేలు గ్రంథం 36:24 

     అయితే ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది. యెహెఙ్కేలు తన దర్శనములో ఒక లోయను చూశాడు. ఆ లోయ ఎన్నో ఎముకలతో నిండిపోయివుంది. ఆ ఎముకలు అన్నీ ఎండి పోయి, జీవం లేకుండా పడిపోయి ఉన్నాయి. అయితే దేవుని స్వరం విని ఆ ఎముకలు జీవం పొందాయి. జీవాత్మ వాటిలో ప్రవేశించి అవి జీవులుగా లేచి నిలబడ్డాయి. ఆ ఎముకలు ఇశ్రాయేలు దేశమునకు సాదృశ్యముగా ఉన్నాయి. దేవుడు వారికి క్రొత్త జీవముతో పాటు, క్రొత్త స్వభావం ఇస్తాను. క్రొత్త స్వభావం ఇస్తాను. క్రొత్త దేశం ఇస్తాను అన్నాడు. నేను మీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం కలుగ జేస్తాను అన్నాడు. యెహెఙ్కేలు గ్రంథం 36:26 

   యెహెఙ్కేలు 40-43 అధ్యాయాలు మనం చదివితే దేవుడు ఒక క్రొత్త ఆలయం వారికి ఇస్తాను అన్నాడు. 40-48 అధ్యాయాలు చదివితే ఒక క్రొత్త రాజ్యం వారికి ఇస్తాను అన్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన ఆ గొప్ప ప్రవచనాలు సమీప భవిష్యత్తులో నెరవేరుతాయి. 

నూతన జీవం 

నూతన నిబంధన 

నూతన కాపరి 

నూతన దేశం 

నూతన ఆలయం 

నూతన రాజు 

నూతన రాజ్యం 

హల్లెలూయ. దేవుని శక్తి అలాంటిది. మన ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుడు నూతన జీవం, నూతన నిబంధన, నూతన కాపరి వారికి ఇచ్చాడు. నూతన దేశం కూడా వారికి ఇచ్చాడు. 

   2600 సంవత్సరముల క్రితం దేవుడు చేసిన ఆ ప్రవచనం 1948 లో నెరవేరింది. ప్రపంచ మంతటి నుండి యూదులు తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేశం తిరిగి స్థాపించారు. నూతన రాజ్యం, నూతన ఆలయం కూడా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నందు వారికి ఇస్తాడు. అయితే ముందుగా వారికి కొన్ని శ్రమలు వస్తాయి. యెహెఙ్కేలు 38 – 39 అధ్యాయాలు చదవండి. అక్కడ ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు దేశం మీదకు యుద్ధానికి వెళ్తాయి అని వ్రాయబడింది. ఆ దేశాల పేరులు మనం చూస్తే గోగు, మాగోగు, రోషు, మెషెకు, తుబాలు

పారసీకదేశము, కూషు పూతు 

ఆధునిక ప్రపంచములో ఈ దేశాలు ఏమిటంటే గోగు, రోషు అంటే ప్రస్తుత రష్యా దేశం 

మాగోగు అంటే ప్రస్తుతం నల్ల సముద్రం దగ్గర ఉన్న దేశాలు. కజకస్తాన్, కిర్గికిస్తాన్,ఉజ్బేకిస్తాన్, టర్క్ మెనిస్థాన్, తజికిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు. ఇవి పూర్వం సోవియెట్ యూనియన్ లో భాగముగా ఉన్న దేశాలు. 

మెషకు, తూబాలు అంటే టర్కీ దేశం 

పారశీక దేశం అంటే ఇరాన్ 

కూషు దేశం అంటే సుడాన్ 

పూతు దేశం అంటే ప్రస్తుత లిబియా, అల్జీరియా, ట్యునీషియా 

     ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు గమనిస్తే ఈ దేశాలు ఇప్పటికే ఇశ్రాయేలు దేశమును నాశనం చేస్తాము అని ప్రతిజ్ఞ దేశాలు గా ఉన్నాయి. వీటికి రష్యా దేశం నాయకత్వం వహిస్తుంది అని యెహెఙ్కేలు ప్రవక్త చెప్పాడు. హమాస్ టెర్రరిస్టులకు తుపాకులు, బాంబులు, గ్రెనేడ్లు, మిస్సైళ్లు, డ్రోన్లు రష్యా దేశము అందిస్తున్నది. ఇరాన్ దేశం కూడా వారికి డబ్బు, ఆయుధాలు సమకూరుస్తున్నది. ఇశ్రాయేలు దేశం ఇప్పటి వరకు చేసిన అన్ని యుద్ధాల్లో రష్యా, ఇరాన్ దాని శత్రువులకు ఆర్థిక, సైనిక సహకారం అందిస్తూ వచ్చాయి. 

    1967 ఆరు రోజుల యుద్ధములో రష్యా ఇశ్రాయేలు దేశమును ఆక్రమించాలని చూసింది. అయితే అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ అమెరికా యుద్ధ నౌకను ఇశ్రాయేలు వైపు పంపించడం చూసి రష్యా వెనక్కు తగ్గింది. అదే విధముగా 1973 లో యోమ్ కిప్పుర్ యుద్ధం జరిగింది. ఆ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన ఉదయం  ఈజిప్ట్, సిరియా దేశాలు అకస్మాత్తుగా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశాయి. ఈజిప్టు వెనుక సోవియెట్ యూనియన్, ఇశ్రాయేలు వెనుక అమెరికా దేశం అప్పుడు ఉన్నాయి. సోవియెట్ యూనియన్,  అమెరికా దేశంమధ్య ఇశ్రాయేలు విషయములో అణ్వస్త్ర యుద్ధం జరిగే పరిస్థితులు అప్పుడు వచ్చాయి. 

     యోమ్ కిప్పుర్ యుద్ధం జరిగిన 50 వార్షికోత్సవం సందర్భముగా హమాస్ టెర్రరిస్టులు ఇశ్రాయేలు మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూడా రష్యా, ఇరాన్ దేశాలు ఇశ్రాయేలు శత్రువులకు మద్దతు పలుకుతున్నాయి. ఈ రెండు దేశాలు, వాటి మిత్రులు కలిసి ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తాయి అని యెహెఙ్కేలు ప్రవక్త 2600 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆ ప్రవచనం బట్టి రష్యా, ఇరాన్, దాని మిత్ర దేశాలు ఇశ్రాయేలు దేశం మీద సమీప భవిష్యత్తులో పూర్తి స్థాయి యుద్ధం చేసే అవకాశం ఉంది. అయితే యెహెఙ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు విజయాన్ని వాగ్దానం చేశాడు. 

యెహెఙ్కేలు గ్రంథం 11:23 లో ఒక మాట చూద్దాము. 

మరియు యెహోవా మహిమ పట్టణములోనుండి పైకెక్కి పట్టణపు తూర్పుదిశనున్న కొండకుపైగా నిలిచెను.

     యెహెఙ్కేలు గ్రంథం 11:23

   దేవుని మహిమ యెరూషలేము లో ఉన్న దేవాలయమును విడిచి తూర్పు దిశన ఉన్న కొండ మీద నిలిచింది. యెరూషలేములో దేవుని ఆలయము ఉన్న ప్రాంతము ప్రక్క కిద్రోను లోయ ఉంది. దానికి తూర్పున ఒలీవల కొండ ఉంది. ఈ ఒలీవల కొండ మీద దేవుని మహిమ నిలిచింది. దేవుని మహిమ దేవాలయమును విడిచి వెళ్లపోవడం యెహెఙ్కేలు చూసాడు. యెరూషలేము ను విడిచి వెళ్లిపోవడం ఆయన చూసాడు. అయితే అది ఒలీవల కొండ మీద కాసేపు నిలబడడం కూడా ఆయన గమనించాడు. 

    600 సంవత్సముల తరువాత యేసు ప్రభువు రూపములో దేవుని మహిమ యెరూషలేముకు తిరిగి వస్తుంది. ఒలీవల కొండ మీద నిలబడుతుంది అనే దానికి అది సంకేతముగా వుంది.దేవుడు చేసిన ప్రవచనాల్లో ఈ ఒలీవల కొండకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ ఒలీవల కొండ మీద నిలబడిన దేవుని మహిమ మన ప్రభువైన యేసు క్రీస్తే. 

   ఒలీవల కొండ మీద కూర్చొని ఆయన ప్రపంచ అంతం ఎలా ఉంటుందో తన శిష్యులకు చెప్పాడు. మీరు యుద్ధములను గూర్చియుయుద్ధ సమాచారములను గూర్చియువినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. మత్తయి 24:6 

యుద్ధాలు, కరువులు, వేదనలు, భూకంపాలు, మహా శ్రమలు ఇశ్రాయేలు దేశము మీదకు, ప్రపంచము మీదకు విరుచుకు పడతాయి. అయితే చివరకు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోనుఆకాశ మేఘారూఢుడై తిరిగి వస్తాడు 

     మత్తయి 24:30 

      ఒలీవల కొండ మీద కూర్చుని ప్రభువైన యేసు క్రీస్తు ఆ చక్కటి వాగ్దానం చేసాడు. సిలువ వేయబడి, మరణించి తిరిగిలేచిన తరువాత ఆయన ఒలీవల కొండ మీద నుండి పరలోకం తిరిగివెళ్ళాడు. దేవదూత శిష్యులకు చెప్పాడు. ఆయన తిరిగి అదే ఒలీవల కొండ మీద పాదం మోపి ఈ ప్రపంచము నకు తిరిగి వస్తాడు. దేవుని రాజ్యం అప్పుడు ఈ భూమి మీద పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఉగ్రవాదం, యుద్ధాలు, కరువులు, రక్తపాతం, హత్యాకాండలు ఆయన రాజ్యములో ఉండవు. 

    కాబట్టి ఈ రోజు ఇశ్రాయేలు దేశం లో జరుగుతున్న హింస ను చూస్తే మనకు బాధ, నిరాశ కలుగడం సహజమే. అయితే దేవుని ప్రవచనాలు మనం గమనిస్తే మనకు ధైర్యం, నిరీక్షణ కలుగుతాయి. అదే నేటి మా ప్రేమ సందేశం. పరలోకమందున్న మా తండ్రీ, మీ రాజ్యం వచ్చుగాక నీ నామము మహిమ పరచబడుగాక ఇశ్రాయేలు దేశములో శాంతిని నెల కొలపండి. బాధిత కుటంబాలను ఆదరించండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. 

Leave a Reply