ఈ రోజు క్రిస్మస్ సందర్భముగా మీకు ఒక ప్రేమ సందేశం అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈ క్రిస్మస్ సందర్భముగా, యేసు క్రీస్తు ప్రభువుకు ఇవ్వబడిన రెండు ముఖ్యమైన పేరులు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. మొదటి పేరు
Prince of Peace,
రెండవ పేరు
King of Righteousness
మొదటి పేరు యెషయా ప్రవక్త చేసిన ప్రవచనం లో నుండి వచ్చింది.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
ఆయన భుజముమీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడు
నిత్యుడగు తండ్రి
సమాధానకర్తయగు అధిపతి
అని అతనికి పేరు పెట్టబడును.
యెషయా 9:6
మనకు ఒక శిశువు జన్మించాడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఈ ప్రపంచము మొత్తం మన ప్రభువైన యేసు క్రీస్తు ను కాసేపైనా గుర్తు చేసుకొనే సమయం క్రిస్మస్.
క్రిస్మస్ ఎంతో గొప్ప రోజు. దేవుడు మానవునిగా ఈ భూలోకానికి వచ్చిన రోజు. అది ఎంతో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన రోజు. దేవుడు ఏమిటి? ఈ భూలోకానికి రావడం ఏమిటి? ఆలోచిస్తేనే మైండ్ బ్లాంక్ అవుతుంది.
దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న కు జవాబు ఇవ్వాలంటే, రెండు పదాలు తెలుసుకోవాలి.
Transcendence & Immanence
మొదటిగా Transcendence – ఆకాశం వైపు చూడండి. ఎన్నో కోట్ల నక్షత్రాలు, గలాక్షీ లతో ఈ విశ్వం నిండిపోయి ఉంది. ఈ విశ్వం బయట దేవుడు ఉన్నాడు. మనలో ఎవ్వరూ కూడా ఈ యూనివర్స్ అంచులకు కూడా వెళ్ళలేరు. మనం మన శక్తితో ఎప్పటికీ దేవుని సన్నిధిలోకి ప్రవేశించలేము. సమీపించలేని మహిమలో దేవుడు నివశిస్తున్నాడు. అది transcendence. ఆ తరువాత immanence. immanence అంటే ఏమిటంటే దేవుడు మనతో కలవాలని కోరుకున్నాడు. మనుష్యుల మధ్య నివసించాలని దేవుడు కోరుకున్నాడు.
క్రిస్మస్ కు ముందు అనేక సార్లు యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకు వచ్చాడు. వీటిని Pre-Incarnate Appearances of Christ అని పిలుస్తాము.Pre-Incarnate అంటే incarnation కి ముందు యేసు క్రీస్తు ప్రత్యక్షతలు. కన్య మరియ గర్భములో పడకమునుపు, మానవ శరీరం లేకుండా ఒక దేవ దూత రూపములో యేసు క్రీస్తు అనేక సార్లు ఈ భూమి మీదకు వచ్చాడు. అయితే మానవ శరీరములో దేవుడు మన మధ్యలోకి వచ్చింది మాత్రం క్రిస్మస్ రోజునే.
పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అదే. దేవుడు తన ప్రజల మధ్య నివాసము ఏర్పరచుకున్నాడు. క్రిస్మస్ రోజున జరిగింది అదే. దేవుడు మానవుల మధ్య జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక గుడారం లో ఆయన వచ్చాడు. ఆ గుడారం ఆయన మానవ శరీరమే.అది శాశ్వతమైనది. దేవుడు నిత్య నరుడు అయ్యాడు. Eternal Man.
The incarnation was the perfect immanence of God. Jesus Christ is the perfect immanence of God.
యేసు క్రీస్తు నందు దేవుడు మానవ రూపం ధరించుకొని మనకు అత్యంత సమీపములోకి వచ్చాడు. ఆయన మానవత్వం చూడండి. మనందరి లాగానే ఆయన కూడా ఒక తల్లికి జన్మించిన వాడే. మత్తయి 1:20-25; లూకా 2:1-7.
మనందరి లాగానే ఆయన కూడా ఒక వంశావళి కలిగి ఉన్నాడు. లూకా 3:23-38
మనందరి లాగానే ఆయన కూడా బాల్య దశ చూసినవాడే. లూకా 2:21-22
మనకు లాగానే ఆయనకు కూడా ఆకలి అయింది లూకా 4:2
మనకు లాగానే ఆయనకు కూడా దప్పిక అయింది లూకా 4:6-7
మనకు లాగానే ఆయన కూడా అలసిపోతూ ఉండేవాడు. యోహాను 4:6
మన లాగానే ఆయన నిద్ర పోయే వాడు. మార్కు 4:38
మన లాగానే ఆయన కూడా ఏడ్చి, కన్నీరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. యోహాను 11:35, మత్తయి 23:37
మన లాగానే ఆయన కూడా ఛలోక్తులు విసిరి నవ్వుకొన్న సందర్భాలు ఉన్నాయి. మత్తయి 23:24, యోహాను 21:5
మనకు లాగానే ఆయన శ్రమలు అనుభవించాడు మత్తయి 27:29
మనకు లాగానే ఆయన ఒంటరి తనం అనుభవించాడు మత్తయి 26:38
మనకు లాగానే ఆయన మరణం అనుభవించాడు మత్తయి 27:50
మన వలెనె సమస్త విషయములలో యేసు క్రీస్తు శోధించబడ్డాడు. అయితే
ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీ 4:15
ఆయనకు మనకు ఉన్న తేడా అదే. అన్ని విషయములలో యేసు క్రీస్తు మన లానే శోధించబడ్డాడు. అయితే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. తన జీవితం మొత్తములో ఒక్క పాపము కూడా చేయని మానవుడు ఒక్క యేసు క్రీస్తు మాత్రమే.
యేసు క్రీస్తు ప్రభువు తనకు తాను పెట్టుకొన్న పేరు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు – The Son of Man. సువార్తలలో 83 సార్లు ఆయన మనుష్య కుమారుడు అని పిలుచుకోవడం మనకు కనిపిస్తుంది. ఆయన మానవత్వం, దైవత్వం – రెండూ ఆ పేరులో ఉన్నాయి. దానియేలు గ్రంథము 7 అధ్యాయము 13,14 వచనాలు చూడండి. అక్కడ మనుష్య కుమారుడు మనకు కనిపిస్తున్నాడు. ఆయన నిత్య మహిమ కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. నిత్య మహిమ, ప్రభుత్వం, ఆధిపత్యం కలిగిన వాడు దేవుడు ఒక్కడు మాత్రమే.
మనుష్య కుమారుడు నిత్య మహిమ, ప్రభుత్వం, ఆధిపత్యం కలిగిన వాడు గా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. అంటే మనుష్య కుమారుడు దేవుడే. ఆ విధముగా యేసు క్రీస్తు మనుష్య కుమారుడు కావడములో ఆయన యొక్క మానవత్వం, దైవత్వం రెండూ మనకు కనిపిస్తున్నాయి. యేసు క్రీస్తు ను చూడడం గొప్ప భాగ్యం. బాప్తిస్మ మిచ్చే యోహాను యేసు ప్రభువును చూశాడు. ఇదిగో లోక పాపమును మోసికొను పోవు దేవుని గొఱ్ఱె పిల్ల అన్నాడు.
పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు మనకు కనిపిస్తారు.
అబ్రహాము
మోషే
దావీదు
యెషయా
యిర్మీయా
దానియేలు
యెహెఙ్కేలు
మొదలగు వారు యేసు క్రీస్తు రాబోవుచున్నాడు అని ఆయన గురించి ప్రవచించారు. అయితే యేసు క్రీస్తు ను తమ కన్నులతో చూసే భాగ్యం వారికి కలుగలేదు. యేసు క్రీస్తు తో కూర్చొని కాసేపు మాట్లాడే భాగ్యం వారికి కలుగలేదు. అది యోహానుకు కలిగింది. దేవుని కుమారుని చూస్తే భాగ్యం, ఆయనతో కాసేపు మాట్లాడే భాగ్యం అతనికి కలిగింది. ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం యోహానుకు కలిగింది. అందుకనే పాత నిబంధన ప్రవక్త లందరికంటే యోహాను గొప్ప వాడు. ఈ రోజు మనం కూడా ఆ ప్రవక్తల కంటే భాగ్యవంతులమే. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క పరిచర్య, ఆయన సిలువ, మరణం, మరణం నుండి తిరిగి సజీవునిగా తిరిగిలేచుట, ఆయన రక్తం చేత విమోచించబడుట, దేవుని నీతి ని పొందుట – అటువంటి గొప్ప భాగ్యములు మనకు లభించాయి. మనలను దేవుని నీతి లోకి మార్చడానికి దేవుడు చేసిన ప్రయత్నమే క్రిస్మస్. సెయింట్ అతనేసియస్ ఒక మాట అన్నాడు.
“Jesus was made man that we might be made god”మనుష్యులకు దేవుని రూపం ఇవ్వడానికి దేవుడు మానవ రూపం లో ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. అందుకనే జెకర్యా ప్రవక్త యేసు క్రీస్తు కు పెట్టిన పేరు నీతి గల రాజు. జెకర్యా 9:9
King of Righteousness
యెషయా ప్రవచనం మనం ఇంతకు ముందు మనం చూశాము. సమాధానకర్తయగు అధిపతి అని ఒక పేరు ఈ క్రిస్మస్ బేబీ కి ఇవ్వబడింది. ఈ క్రిస్మస్ బేబీ కి ఇవ్వబడిన పేరు Prince of Peace. ఆ రెండు పేరులు మనం గమనించాలి. Prince of Peace, King of Righteousness. ఈ ప్రపంచములో శాంతి లేదు. ఎందుకంటే దేవుని నీతి అందులో లేదు. నీతి లేకుండా శాంతి రాదు.
ఈ రోజు ఇశ్రాయేలు దేశం వైపు చూడండి. అక్కడ టెర్రరిస్టులు బీభత్సం సృష్టిస్తున్నారు. శాంతి లేదు, సమాధానం లేదు. చాలామంది తమ బిడ్డలను కోల్పోయారు. టెర్రరిస్టులు చాలా మంది పిల్లలను కిడ్నాప్ చేసుకొని బందీలుగా చేసుకొన్నారు. వారిని వేధిస్తున్నారు. రేప్ లు, మర్డర్ లు చేస్తున్నారు. వారిలో నీతి లేదు. దేవుడు వారి బాధ చూస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది. రెండు వేల సంవత్సరాల క్రితం మొదటి క్రిస్మస్ సమయములో హేరోదు రాజు కూడా అనేక మంది పిల్లలను చంపించాడు. అతనిలో దేవుని నీతి లేదు.
ఈ మధ్యలో నేను ఒక చిత్రం చూశాను. ఇటలీ దేశానికి చెందిన Guido Reni ఈ చిత్రం గీశాడు. అమాయకుల ఊచకోత Massacre of the innocents అని దానిని పిలిచాడు. ఇద్దరు సైనికులు చిన్న పిల్లలను వధించడం మనకు కనిపిస్తుంది. ఒక తల్లి తన బిడ్డతో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక సైనికుడు ఆమె జుట్టు పట్టుకొని ఆపుతాడు. మరొక సైనికుడు తన చేతిలో కత్తితో పిల్లల మీద విరుచుకుపడుతాడు. చంపబడిన ఇద్దరు పిల్లలు నేల మీద మనకు కనిపిస్తారు. ఒక తల్లి అక్కడ మోకరించి పరలోకం వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. పరలోకం నుండి ఇద్దరు దేవదూతలు ఈ ఘోరాలు చూస్తూ ఉంటారు. మనుష్యులను దేవుడు దేవదూతల వలె మంచి స్వభావముతో సృష్టించాడు. అయితే పాపము మనుష్యులను మృగముల వలె మార్చివేసింది. ఈ రోజు కూడా అనేక తల్లులు పరలోకం వైపు చూసి ఆర్తనాదాలు పెడుతూనే ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. క్రిస్మస్ లో మనిషి యొక్క అవినీతి, కఠినత్వం, దుష్టత్వం ఒక వైపు కనిపిస్తే, దేవుని యొక్క నీతి, మంచి తనం, సమాధానం మరొక వైపు కనిపిస్తున్నాయి. టెర్రరిస్టులను కూడా మార్చగలిగే రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు.
యేసు క్రీస్తు కు ఒక శిష్యుడు ఉండేవాడు. అతని పేరు ‘జెలోతే అనబడిన సీమోను’ (అపోస్తలుల కార్యములు 1:13) సైమన్ ది జెలట్. ఈయన ఒక టెర్రరిస్ట్. zealots అనే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కి చెందిన వాడు. యేసు ప్రభువును నమ్ముకొని, మారుమనస్సు పొంది ఆయన శిష్యుడు అయ్యాడు. యేసు క్రీస్తు ఇచ్చే నీతి ని పొంది, సీమోను శాంతిని పొందాడు.
నీతి లేకుండా ఎవరూ దేవుని యొద్దకు వెళ్ళలేరు. క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ దేశం రాణి. ఆమె లండన్ లో ఉన్న బకింగ్ హామ్ ఎంతో భద్రత మధ్య జీవిస్తూ ఉంటుంది. ఆ దేశ ప్రజలు వారి బాధలు ఆమెకు చెప్పుకొనే అవకాశం చాలా తక్కువగా ఉండేది. మైఖేల్ ఫాగిన్ అనే ఒక పౌరుడు ఉన్నాడు. తన బాధలు ఎలిజబెత్ రాణికి చెప్పుకోవాలని అతనికి అనిపించింది. ఆమె దగ్గరకు ఎలాగైనా వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు. బకింగ్ హామ్ ప్యాలస్ దగ్గరకు వెళ్ళాడు. భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి గోడల మీద పాకుకుంటూ పైపుల మీద ఎక్కుతూ ప్యాలస్ లోకి వెళ్ళాడు. నేరుగా ఎలిజబెత్ రాణి బెడ్ రూమ్ కి వెళ్ళాడు. ఆమె నిద్ర నుండి లేచి చూస్తే ఒక ఆగంతకుడు బెడ్ ప్రక్క కూర్చొని ఉన్నాడు. ఆమె షాక్ కి గురయ్యింది. ఆమె సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేలోపు మైఖేల్ ఫగన్ తన బాధలు ఆమెకు చెప్పుకొన్నాడు. ఒక మంత్రినో , ఒక ముఖ్యమంత్రినో , ప్రధాన మంత్రినో కలిసి మన బాధలు చెప్పుకొనే అవకాశం మనకు ఉండదు. అయితే దేవునితో, మన సృష్టికర్త తో మాట్లాడే అవకాశం మనకు యేసు క్రీస్తు వలన లభించింది. క్రిస్మస్ దేవుడు మన ముందు వేసిన మార్గం. ఆ మార్గము ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన
దేవుని సహవాసానికి మార్గం
దేవుని సమాధానానికి మార్గం
దేవుని పరిశుద్ధతకు మార్గం
దేవుని నివాసానికి మార్గం
దేవుడు ఇచ్చే శాంతికి మార్గం
దేవుడు ఇచ్చే రక్షణకు మార్గం
దేవుడు ఇచ్చే నిరీక్షణకు మార్గం.
యేసు క్రీస్తు నీతి సూర్యుడు. మలాకీ 4:2
క్రైస్తవ్యం లో రెండు ముఖ్య పండుగలు క్రిస్మస్, ఈస్టర్. ఈ రెండు పండుగలు సూర్యునితో ముడిపెట్టబడి ఉన్నాయి. మంచు, చీకటి ని తొలగించుకొని సూర్యుడు వచ్చే సమయం Winter Solstice. Winter Solstice సమయములో క్రిస్మస్ వస్తుంది. చీకటి తో నిండిపోయిన ఈ ప్రపంచములోకి యేసు క్రీస్తు ప్రభువు అడుగుపెట్టిన సమయం క్రిస్మస్. సూర్యుడు ఎంతో ప్రకాశవంతముగా వెలిగే సమయం Spring Equinox. Spring Equinox సమయములో ఈస్టర్ పండుగ వస్తుంది. మరణం తో నిండిపోయిన ఈ ప్రపంచములోకి దేవుని జీవం తెచ్చిన సమయం ఈస్టర్. దేవుని జీవపు వెలుగు ఈ మార్గములో మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు అనే దారిలో వెళ్లకపోతే దేవుని యొద్ద నుండి మీరు ఏమీ పొందలేరు.
మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా దేవుని తో మాట్లాడవచ్చు. ఈ మధ్యలో Are you there God?, It’s Me, Margaret అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లో మార్గరెట్ సైమన్ అని బాలిక మనకు కనిపిస్తుంది. ఆ అమ్మాయి వయస్సు 11 సంవత్సరాలు. ప్రతి రోజూ ఆ అమ్మాయి దేవునికి ప్రార్థన చేస్తుంది. Are you there God?, It’s Me, Margaret అంటూ తన ప్రార్థన ప్రారంభిస్తుంది. ప్రార్థనలో ఆ బాలిక తన బాధలు దేవునికి చెప్పుకొనేది. ఆ బాలిక వలెనె మనకు కూడా దేవునితో మాట్లాడాలని ఉంటుంది. మన బాధలు దేవునితో చెప్పుకోవాలని ఆశ ఉంటుంది. Are you there God?, It’s Me, పాల్ -అని నేను కూడా దేవునితో మాట్లాడే అవకాశం క్రిస్మస్ వలన నాకు లభించింది. Are you there God?, It’s Me, అక్కడ మీ పేరు పెట్టుకోండి. నాకు శాంతి కావాలి, అది ఎక్కడ దొరుకుతుంది? ప్రిన్స్ ఆఫ్ పీస్ – యేసు క్రీస్తు ప్రభువు దగ్గరకు మీరు రావాలి. ముందు దేవునితో మనకు శాంతి కావాలి.
రోమా పత్రిక 5:1 చూడండి. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
నీతి – శాంతి : ఈ రెండూ కలిసి వెళ్తున్నాయి. నీతి లేకుండా ఎవరికీ శాంతి ఉండదు. ఈ ప్రపంచములో ఏ వ్యక్తీ నీతి లేకుండా శాంతిని పొందలేడు. ఆ సత్యమే ఇక్కడ మనం చూస్తున్నాము.
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. ముందు విశ్వాసముతో నీతి మంతునిగా తీర్చబడు. ఆ తరువాత ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు శాంతిని మనకు ఇస్తున్నాడు. శాంతి కోసం మనం ఎవరి దగ్గరకూ పరుగెత్తాల్సిన అవసరం లేదు. నీతి కలిగిన రాజు మనకు శాంతిని ఇస్తాడు.
He is the King of Righteousness
శాంతి కావాలంటే ముందు నీతిని సంపాయించుకో. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచితే దేవుని ముందు మనం నీతి మంతులుగా తీర్చబడుతున్నాము. ఆ తరువాత దేవుని వాక్యం చదివితే దేవుని నీతి మనకు అర్థం అవుతుంది. నా నీతిని మన జీవితములో ఆచరిస్తే, మనకు శాంతి కలుగుతుంది. పాపము చేస్తే శాంతి ఉండదు, ఎందుకంటే పాపములో దేవుని నీతి ఉండదు. పాపములో అవినీతి, అశాంతి ఉంటాయి. పవిత్రతలో నీతి, శాంతి ఉంటాయి. శాంతి కోసం మనం ఎక్కడకూ పరుగెత్తవలసిన అవసరం లేదు. దేవుని నీతిని మన జీవితములో పొందితే దేవుడే గొప్ప శాంతిని మనకు ఇస్తాడు. క్రిస్మస్ మనకు ఇచ్చే సందేశం అదే. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు తన నీతిని, శాంతిని ఇస్తున్నాడు.
Jesus is the Prince of Peace,
the King of Righteousness
యేసు క్రీస్తు King of Righteousness నీతి కలిగిన రాజు ముందు ఆయన నీతిని పొందు. యేసు క్రీస్తు Prince of Peace శాంతి ఇచ్చే రాజు ఆయన ఇచ్చే శాంతిని పొందు. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుడు మీ జీవితములను తన శాంతితో, తన నీతితో, తన ఆశీర్వాదములతో తన ఆనందముతో నింపాలని మా ప్రార్థన. Merry Christmas.