మరో నూతన సంవత్సరములో మనం ప్రవేశించాము. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మిమ్ములను తన కృపలో మెండుగా నడిపించాలని మా ప్రార్థన. నూతన సంవత్సరము సందర్భముగా మీకు ఒక ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము లో నుండి ఒక మాట చూద్దాము.
క్రీస్తుయేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి,పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
ఎఫెసీ 2:6-7
యేసు క్రీస్తు నందు దేవుడు అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును మనకు చూపించాడు. ఈ సంవత్సరం మొత్తం మీరు గుర్తుపెట్టుకోవలసిన గొప్ప సత్యం ఇక్కడ ఉంది. దేవుని యొక్క అత్యధికమైన కృపా మహదైశ్వర్యము మీకు అందుబాటులో ఉంది. గ్రీకు భాషలో పౌలు గారు ఏమని వ్రాశాడంటే,
ὑπερβάλλον πλοῦτος τῆς χάριτος
ὑπερβάλλον πλοῦτος τῆς χάριτος
Hyperballon: hyperbole
Hyperballon అనే పదం ఆయన వాడాడు. ఇందులో నుండి hyperbole అనే
ఇంగ్లీష్ పదం వచ్చింది. అంటే అతిశయోక్తి అని అర్థం. మన సంభాషణల్లో అప్పుడప్పుడూ మనం అతిశయోక్తులు ఉపయోగిస్తూ ఉంటాము. మా ఇంట్లో విందు చేస్తే వూరు మొత్తం వచ్చింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా పరుగెత్తాను, నీ కోసం సముద్రం ఈదుతాను. గొప్పలు చెప్పుకోవటానికి మనం అతిశయోక్తులు వాడుతూ ఉంటాము. దేవుడు అలాంటి పని చేయడు. హైపర్ బోళా – దేవుని విషయములో సత్యమే.
దేవుడు ఎప్పుడూ లేనిది ఉన్నట్లు గా చేసి గొప్పలు చెప్పుకోడు.
ὑπερβάλλον πλοῦτος τῆς χάριτος
దేవుడు అత్యధికమైన కృపను తన బిడ్డల పట్ల చూపిస్తున్నాడు. అత్యధికమైనవి దేవునికే సాధ్యం. పౌలు గారు నాలుగు సార్లు ఆ మాట వాడాడు.
అత్యధికమైన మహిమ (2 కొరింథీ 3:10)
అత్యధికమైన మహాత్యము (ఎఫెసీ 1:18)
అత్యధికమైన జ్ఞానం (ఎఫెసీ 3:19)
అత్యధికమైన కృప (2 కొరింథీ 9:14)
దేవుడు అత్యధికమైన మహిమ కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ మహిమ ఇంకెవ్వరికీ ఉండదు. అత్యధికమైన మహాత్యము కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ మహాత్యము ఇంకెవ్వరికీ ఉండదు. అత్యధికమైన జ్ఞానం కలిగిన వాడు.ఆయన కన్నా ఎక్కువ జ్ఞానం ఇంకెవ్వరికీ ఉండదు. అత్యధికమైన కృప కలిగిన వాడు. ఆయన కన్నా ఎక్కువ కృప ఇంకెవ్వరికీ ఉండదు. ఈ అత్యధికమైన కృప వలన దేవునికి మన ఎడల దయ కలిగింది.
ఈ కృప ఏమి చేసింది? క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండ బెట్టింది. దేవుని కృపకు దేవుని శక్తి జోడయ్యింది. మీ తల వెండ్రుకలలో ఒక్కటి కూడా నాశనం కాదు అని యేసు ప్రభువు అన్నాడు. ఆ మాట మీరు నమ్మవచ్చు ఎందుకంటే దేవుడు అత్యధికమైన శక్తి కలిగిన వాడు.దేవుని కృప ఎలాంటిది? అత్యధికమైన దేవుని కృపామహదైశ్వర్యం కృప చూపించుటలో దేవుడు ఐశ్వర్యవంతుడు.
ఎఫెసీ పత్రికలో 4 సార్లు దేవుని ఐశ్వర్యం గురించి మనం చదువుతాము.
ఎఫెసీ 1:7 దేవుని కృపామహదైశ్వర్యము Riches of His Grace
ఎఫెసీ 2:7 దేవుని కరుణా మహదైశ్వర్యము Riches of His Mercy
ఎఫెసీ 3:17 దేవుని మహిమైశ్వర్యము Riches of His Glory
ఎఫెసీ 3:10 క్రీస్తు ఐశ్వర్య ము Riches of Christ
మొదటిగా కృప చూపించుటలో దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎంత చక్కటి మాటలు!
దేవుని కృపామహదైశ్వర్యము, దేవుని కరుణా మహదైశ్వర్యము, దేవుని మహిమైశ్వర్యము, క్రీస్తు ఐశ్వర్య ము
దేవుని కుమారుడు తన రక్తం ఎందుకు చిందించాడు? మనకు విమోచన ఎలా దొరికింది? మన అపరాధములకు క్షమాపణ ఎలా కలిగింది?
దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి. ఇంగ్లీష్ లో మంచి అర్థం ఉంది.
The Riches of His Grace
The riches of His grace
which He lavished upon us
తన కృపా మహదైశ్వర్యము మన మీద కుమ్మరించాడు. lavish ఎవరన్నా మంచి పార్టీ ఇస్తే, భలే లావిష్ గా చేశావే అంటాము. ఎవరన్నా మంచి విందు చేస్తే, చాలా లావిష్ గా చేశావే అంటాము. దేవుడు చాలా లావిష్ గా మన మీద తన కృపను కుమ్మరించాడు.
దేవుడు మన పట్ల చూపే కృపలో ఐశ్వర్య వంతుడు. సర్వ కృపానిధియగు దేవుడు (1 పేతురు 5:10)
యేసు క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు (యోహాను 1:14).
ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృప పొందాము (యోహాను 1:16).
దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు (హెబ్రీ 2:9). కృప తో పాటు దేవుని సమాధానం మనకు లభించింది (రోమా 1:3).
కృప వలన దేవుని విమోచన మనకు లభించింది, మనం ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడ్డాము (రోమా 3:24; గలతీ 2:21; 5:4; తీతు 3:6).
కృప వలన మనకు నిత్య జీవం లభించింది (రోమా 5:21).
క్రీస్తు కృపను బట్టి మనలో ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు (గలతీ 1:6).
కృప చేత మనం రక్షించబడ్డాము. మనలను రక్షించింది దేవుని కృపే (ఎఫెసీ 2:5).
ప్రభువైన యేసు క్రీస్తు ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ దేవుడు ఈ కృప అనుగ్రహిస్తున్నాడు (ఎఫెసీ 6:24). ఈ లోకములో విశ్వాసికి తోడుగా ఉండేది దేవుని కృపే (కొలస్సి 4:18)
కృప వలన మనకు దేవుని శాంతి లభించింది (1 థెస్సలొనీక 1:1).
పౌలు గారు దీవించేటప్పుడు కృపయు, సమాధానమును మీకు కలుగును గాక (2 థెస్సలొనీక 1:2; 1 తిమోతి 1:2; ప్రకటన 1:5) అని అంటాడు. ఎందుకంటే కృప లేకుండా సమాధానం లేదు.
ఈ క్రొత్త సంవత్సరములో ప్రతి రోజూ శాంతి మీకు ఉండాలంటే, దేవుని కృప మీద మీరు ఆధారపడాలి, ఎందుకంటే దేవుని కృప లేకుండా ఎవరికీ సమాధానం ఉండదు, శాంతి ఉండదు.
భార్య భర్తల మధ్య ఉండే వైవాహిక జీవితం కూడా ఒక కృపా వరమే (1 పేతురు 3:7). క్రొత్త సంవత్సరములో భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుందా? భార్య భర్తల మధ్య ఉండే వైవాహిక జీవితం కూడా ఒక కృపా వరమే. భార్య భర్తల మధ్య ప్రేమానుబంధాలు సరిగ్గా ఉండాలన్నా వారు దేవుని కృప మీద ఆధార పడాలి.
విశ్వాస జీవితము అంటే దేవుని కృప యందు అభివృద్ధి చెందటమే (2 కొరింథీ 8:7).
క్రైస్తవ విశ్వాసి ప్రతి రోజూ దేవుని యొక్క సర్వ సమృద్ధి పొంది, దేవుని మహిమ కొరకు జీవించడానికి దేవుడు సమస్త విధములైన కృపను విస్తారముగా వారికి ఇస్తున్నాడు. (2 కొరింథీ 9:8).
తరువాత దేవుడు కరుణలో ఆయన ఐశ్వర్యవంతుడు
అందుకనే మన పాపములలో చచ్చినవారమై మనం ఉండినప్పుడు మన యెడల దేవుడు మహా ప్రేమ ను చూపించాడు. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృప చేత మనలను రక్షించాడు. చచ్చిన వారి దగ్గరకు వెళ్లాలంటే సామాన్యమైన విషయం కాదు. ‘గబ్బు, గబ్బు – దుర్వాసన. నేను అటు రాను’ అని మనం అంటాము. అలాంటి వారి దగ్గరకు నేను వెళ్లడం ఎందుకులే అని మనం సమర్ధించుకొంటాము. చచ్చిన స్థితిలో ఉన్న వాని దగ్గరకు వెళ్లాలంటే ఎంతో కరుణ ఉండాలి. కరుణా సంపన్నుడై ఉండాలి.
Θεὸς πλούσιος ὢν ἐν ἐλέει
థియాస్ ప్లూసియస్ ఆన్ ఎన్ ఏలియై
దేవుడు అబ్రహాము ను కరుణించాడు (ఆదికాండము 24:12,14). అబ్రహాము చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము, నేను నిన్ను, నీ సంతానాన్ని కరుణించాలని కోరుకొన్నాను. అబ్రహాము ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. నేను చచ్చే స్థితిలో ఉన్నాను దేవా. నాకు సంతానము ఏమిటి? నువ్వు నన్ను ఎన్నుకోవడం ఏమిటి? నా సిట్యుయేషన్ హోప్లెస్ ఉంది. నాకు నిరీక్షణ లేదు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని మీకు అనిపిస్తూ ఉండవచ్చు. అబ్రహాము అలానే అనుకొన్నాడు. అయితే అబ్రహాము కు నిరీక్షణ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కరుణ చూపించడములో ఐశ్వర్యవంతుడు. దేవా, నన్ను కరుణించు అని మనం వేడుకొంటే ఆయన తప్పని సరిగా మనలను కరుణించి మనకు నిరీక్షణ ఇస్తాడు.
మూడవదిగా దేవుని మహిమైశ్వర్యము 3:17 Riches of His Glory
πλοῦτος τῆς δόξης
πλοῦτος τῆς δόξης
మహిమలో దేవుడు ఐశ్వర్యవంతుడు. మహిమ అంటే మనం వెలుగు, కాంతి ని ఊహించుకొంటాము. అయితే దేవుని మహిమ అంటే వెలుగు మాత్రమే కాదు. యెషయా ప్రవక్తకు దేవుని మహిమ ఎలా కనిపించింది? దేవుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉండుట ఆయన చూశాడు. లైట్లు వేసుకోవడం కాదు. అధికారం ఉండాలి. దేవుడు పరలోకములో నాలుగు లైట్లు వేసుకొని కూర్చోలేదు. ఆయన అత్యున్నత సింహాసనమందు కూర్చొని ఉన్నాడు. అది ఆయన మహిమ. సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉంది (యెషయా 6:3). దేవుని మహిమ ను చూసి యెషయా వణకి పోయాడు. నేనెంత పనికిరాని వాణ్ని అని ఆయన అనుకొన్నాడు (యెషయా 6:5). దేవుని మహిమ ఆయన ప్రత్యేకత, ఘనత, అధికారం, పరిశుద్ధత, సృజనాత్మకత ల కలయిక గా చెప్పుకోవచ్చు. దేవుని మహిమ నిత్యమూ ఉండేది (కీర్తన 104: 31).
మీ భవిష్యత్తును తన మహిమతో నింప గలిగే శక్తి దేవునికి ఉంది. మీ భవిష్యత్తు దేవుని మహిమతో నిండి ఉంది. ఈ క్రొత్త సంవత్సరములో ప్రతి రోజును మీరు దేవుని మహిమతో నింపుకోవాలి.
నాలుగవదిగా, క్రీస్తు ఐశ్వర్యం 3:10 శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము
The Unfathomable Riches of Christ
πλοῦτος τοῦ Χριστοῦ
πλοῦτος τοῦ Χριστοῦ
అంటే క్రీస్తు ఐశ్వర్యం. దేవుని కృపామహదైశ్వర్యం దేవుని కరుణా మహదైశ్వర్యం
దేవుని మహిమైశ్వర్యము ఆ మూడూ క్రీస్తు ఐశ్వర్యము లో నుండే మనకు లభించాయి.
మన జీవితాల్లో ఉండే ఆత్మీయ దరిద్రం పోవాలంటే మనం క్రీస్తు ఐశ్వర్యము లో నుండి ప్రతి రోజూ మనకు కావలసినవి పొందుతూ ఉండాలి. క్రీస్తు ఐశ్వర్యము వలన నాకు ప్రయోజనం ఏమిటి? అని మీరు ప్రశ్నించవచ్చు.
వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును,స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. కొలొస్సయి 2:2-3
సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము క్రీస్తు యొక్క ఐశ్వర్యం గ్రహించడములోనే మన ఐశ్వర్యము ఉంది. ఆ గ్రహింపు లేకపోతే మనకు జ్ఞానం ఉండదు, ఐశ్వర్యం ఉండదు. ఆ గ్రహింపు మనకు ఉంటే ఏమి జరుగుతుంది?
ప్రేమయందు అతుకబడి దేవుని ప్రేమ యందు మీరు అతికించబడతారు. దేవుని ప్రేమ యందు అతికించబడడం కంటే గొప్ప భాగ్యం మీ జీవితానికి మరొకటి ఉంటుందా? అంతే కాకుండా మన హృదయములకు ఆదరణ కలుగుతుంది.
πᾶν πλοῦτος τῆς πληροφορίας
pan ploutos tes plerophorias
All Riches of the Full Assurance
ఈ క్రొత్త సంవత్సరములో మీకు కావలసినది అదే.
Full Assurance
Full Confidence
Full Hope
మీరు మార్కెట్ కి వెళ్లారు. షాపింగ్ చేద్దాము అనుకొన్నారు. వంకాయలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ, మిరపకాయలు ఒక కేజీ,10 కిలోలు బియ్యం కొనాలనుకొన్నారు. మీ జేబులో రెండు వేల రూపాయలు వున్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఆ విషయము మీకు తెలిస్తే మీరు ఆ కూరగాయలు ధైర్యముగా కొనుక్కొంటారు. ఆ విషయము మీకు తెలియకపోతే. ఆ వంకాయలు, మిరపకాయలు చూసినప్పుడు మీకు భయం వేస్తుంది. నేను వాటిని కొనలేను. నాకు ఆ శక్తి లేదు అని మీరు అనుకొంటారు. మీ జేబులో రెండు వేల రూపాయలు ఉన్నాయండి అని నేను మీకు చెబితే మీరు వాటిని చూసుకొని ధైర్యముగా షాపింగ్ చేస్తారు. దేవుడు మనతో అంటున్నది అదే. నేను నీ జేబులో క్రీస్తు ఐశ్వర్యం పెట్టాను. ధైర్యముగా బ్రతుకు.
ఈ లోకములో నీకు కలిగే బాధలు, శ్రమలు, కష్టాలు, అప్పులు, నిరాశ, నిస్పృహలు, ఆందోళన, అనారోగ్యం వాటిని చూసి కృంగిపోకు’ అయితే సాతానుడు ఆ మాట మనకు చెప్పడు. నీ దగ్గర దరిద్రం తప్ప ఏమీ లేదు. నీ భవిష్యత్తు చీకటితో నిండి ఉంది. దేవుడు నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు వేస్ట్. నీ జీవితం వేస్ట్ అని అంటాడు. అయితే సాతాను చెప్పే మాటలు మనం వినకూడదు. దేవుడు మనతో ఏమంటున్నాడంటే, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యముతో జీవించు.
πᾶν πλοῦτος τῆς πληροφορίας
pan ploutos tes plerophorias
All Riches of the Full Assurance అంటే అదే.
plerophorias అంటే యేసు క్రీస్తు ప్రభువు నందు దేవుడు మనకు ఇచ్చిన ఐశ్వర్యం చొప్పున మన జీవితములో ప్రతి రోజునూ దేవుని కృపతో, కరుణతో, మహిమతో నింపుకొంటూ ధైర్యముగా, నిశ్చయతతో జీవించడం.
సకలైశ్వర్యము
మీ క్రొత్త సంవత్సరములో ఏమి జరుగుతున్నది? నాకేమి కలుగ బోతున్నది? నేనేమై పోతాను అని అయోమయం జగన్నాధం లాగా బ్రతకవద్దు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము తో బ్రతుకు.πληροφορίας తో బ్రతుకు. అంటే దేవుడు ఇచ్చే అభయం ఇక నేను దేని గురించి విచారించనవసరం లేదు. ఆ శారీరక అవసరాల గురించి నేను విచారించాను. ఎందుకంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు నా రక్షణ గురించి నేను విచారించాను. ఎందుకంటే దేవుడు తన కృపలో ఐశ్వర్యవంతుడు నా ఆత్మ గురించి నేను విచారించను. ఎందుకంటే దేవుడు తన శక్తిలో ఐశ్వర్యవంతుడు. నా అజ్ఞానము గురించి నేను విచారించను. ఎందుకంటే దేవుడు తన జ్ఞానములో ఐశ్వర్యవంతుడు. నా బలహీనతల గురించి నేను విచారించను. ఎందుకంటే దేవుడు తన మహిమలో ఐశ్వర్యవంతుడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రకృతి సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలు, కుటుంబ సంబంధమైన అవసరాలు, సంఘ సంబంధమైన అవసరాలు, ఉద్యోగ సంభందమైన అవసరాలు, ప్రతి అవసరం ఆయన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. ఈ క్రొత్త సంవత్సరములో దేవుడు మీ జీవితములను తన ఐశ్వర్యముతో, ఆశీర్వాదముతో, ఆనందముతో పరిశుద్ధాత్మ సహవాసముతో నింపాలని మా ప్రార్ధన. అదే మా ప్రేమ సందేశం.