యాకోబు నిచ్చెన 01/15/2024

ఈ రోజు ఆదికాండము లో నుండి యాకోబు నిచ్చెన అనే ప్రేమ సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 28 వ అధ్యాయము లో నుండి ఒక వాక్య భాగం చదువుదాము. 

      10 యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు11 ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.12 అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.13 మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.14 నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.15 ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 16 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని17 భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు; 18 పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.19 మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. 

    ఈ వాక్యభాగములో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఒక నిచ్చెన ఆయనకు చూపించాడు. నిచ్చెన మన జీవితాల్లో అనేక పనులకు ఉపయోగపడుతుంది. మన జీవితములో ఎదుగుదలకు కూడా అది చక్కటి సాదృశ్యముగా ఉంది. నా చిన్న తనములో పాములు – నిచ్చెనలు అనే గేమ్ ఆడేవాళ్లము. ఒక చిన్న గోళీ ఉండేది. దాని మీద  0,1,2,3,4 అని నంబర్లు వేసి ఉండేవి. 1 పడితే ఒక అడుగు ముందుకు వేస్తావు. 2 పడితే 2 అడుగులు ముందుకు వేస్తావు. నువ్వు వెళ్లిన గడి లో నిచ్చెన ఉంటే పైకి వెళ్తావు. నువ్వు వెళ్లిన గడిలో పాము ఉంటే క్రిందకి వెళ్తావు.పైన గమ్యం ఉంటుంది. దానిని చేరిన వాడు విజేత. చివరి గడి కి చేరిన వాడు ఆ గేమ్ లో గెలుస్తాడు. మధ్యలో అనేక పాములు, నిచ్చెనలు దాటుకొంటూ వెళ్ళాలి. ఆ గోళీ పైకి ఎగరవేస్తాము. ఏ నంబర్ పడుద్దో చెప్పలేము.ఆ నెంబర్ ని బట్టి మనం ఇంకో గడికి వెళ్తాము. అక్కడ పాము ఉందో, నిచ్చెన ఉందో. ఇంకో రెండు గడులు దాటితే విజయం వస్తుంది. అప్పుడు కూడా గోళీ మనలను పాము నోట్లో పడేయొచ్చు. అప్పుడు అట్టడుగుకు వెళ్తావు. పైకి వెళ్ళేదాకా అనుమానమే. చివరి విజయము సాధించేవరకూ అంతా అనుమానమే. 

       2006 లో నాకు అమెరికా లో ఉద్యోగం పోయింది. పెట్టే బేడా సర్దుకొని మా ఇంటికి వచ్చా. మా నాన్న షాక్ కి గురయ్యాడు. మా నాన్న అడిగాడు, ‘అరే, ఏమయ్యింది రా, నువ్వు అమెరికా లో వుద్యోగం లో ఉండాల్సినవాడివి. ఇంటికి వచ్చేశావు ఏంటి?’ నేను ఏమి చెప్పానంటే, ‘మనం ఆడుకొంటామే, పాము- నిచ్చెన గేమ్ అలా అయ్యింది నా పరిస్థితి. ఒక రాంగ్ స్టెప్ వేశాను. పాము నోట్లే పడ్డాను. ఉద్యోగం, గిద్యోగం మొత్తం పోయినవి’. 

  జీవితము మనకు చాలా సార్లు ఆ విధముగా అనిపించవచ్చు. నా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో? పాము నోట్లో పడతానో, నిచ్చెన ఎక్కుతానో? ఎవరికి తెలుసు? మనలను ఎప్పుడు మింగుదామా అని సాతానుడు నిరంతరము మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అయితే దేవునికి స్తోత్రం. మనం అభద్రతా భావముతో, నిరీక్షణ లేకుండా బ్రతక వలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన ముందు ఒక నిచ్చెన వేశాడు. అది క్రీస్తు అనే నిచ్చెన. 

   మనం ఆడుకొనే గేమ్ లో ఎన్నో నిచ్చెనలు ఉంటాయి. అయితే దేవుడు ఒకే ఒక నిచ్చెన వేశాడు. ఏ నిచ్చెన ఎక్కితే ఎక్కడికి పోతానో అనే అనుమానము ఇక్కడ లేదు. ఈ నిచ్చెన ఎక్కితే మనం పరలోకం లో దేవుని సన్నిధికి వెళ్తాము. యాకోబు నిద్ర లేచి, ‘ఇది దేవుని స్థలము. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోకపు గవిని’అన్నాడు. తన తలగడ గా చేసుకొన్న రాయి ని అక్కడ నిలబెట్టి దాని మీద నూనె పోశాడు. దానికి బేతేలు అని పేరుపెట్టాడు. నిచ్చెన క్రీస్తుకు సాదృశ్యముగా ఉంటే, నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా ఉన్నది. 

యోహాను 1:51 

       యోహాను సువార్త మొదటి అధ్యాయములో నతనయేలు యేసు ప్రభువు ను కలుసుకున్నాడు. నాకు నువ్వు ముందే తెలుసు అని యేసు ప్రభువు చెప్పిన మాటకు నతనయేలు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు: నతనయేలు, నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. ఆకాశము తెరువబడుట, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుట, దిగుట చూస్తావు’ అన్నాడు. 

      ఆదికాండము 28 లో యాకోబు చూసిన దర్శనం నా యందు నెరవేరుతుంది అని యేసు క్రీస్తు ప్రభువు ఇక్కడ తన శిష్యులతో అంటున్నాడు.  దేవునికి మనకు మధ్య నిచ్చెన గా ఉండాలంటే ఆ వ్యక్తి దేవుడై ఉండాలి, మానవుడై ఉండాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఎలా మొదలవుతుంది? ఎలా ముగుస్తుంది? 

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను.ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను. యోహాను 1:1,14

   దేవుని సముఖములో ఉన్న దైవిక వ్యక్తి, దేవునికి మానవులకు మధ్య ఒక నిచ్చెన అయ్యాడు. 

ఆ నిచ్చెన దగ్గర దేవుని విశ్రాంతి: 

ఆ నిచ్చెన దగ్గర విశ్రాంతి ఉంది. యాకోబు విశ్రాంతి తీసుకొంటున్నాడు. అతడు నిద్ర పోతున్నప్పుడు దేవుడు ఈ నిచ్చెన అతనికి చూపించాడు. ఆ నిచ్చెన దేవుడు ఏర్పాటుచేసింది. యాకోబు ప్రయాస అందులో లేదు. ఈ రోజు మనిషికి విశ్రాంతి లేదు, ‘నా నిచ్చెన నేనే వేసుకొంటాను. క్రీస్తు అనే నిచ్చెన నాకు అక్కర లేదు’ అని మనిషి అనేక నిచ్చెనలు వేసుకొంటాను. నువ్వు చేసుకొనే నిచ్చెన నిన్ను పరలోకం చేర్చలేదు. బాబెలు గోపురం మాదిరి అది అయిపోతుంది. బాబెలు గోపురం

 కట్టే మనుష్యులు ఏమన్నారు? ‘దీనిని మేము పరలోకం దాకా కడుతున్నాము’ అన్నారు. కొన్ని రోజుల తరువాత వారంతా అయోమయం, గందరగోళం లో చిక్కుకున్నారు. మనం స్వంత నిచ్చెనలు వేసుకొంటే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మనకు మనశాంతి ఉండదు, మన ఆత్మలకు విశ్రాంతి ఉండదు. 

     ఎఫెసీ 2:1 మీఅపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

ఆ నిచ్చెన దగ్గర దేవుని రక్షణ: 

ఆ నిచ్చెన సురక్షితమైనది:దేవుడు ఈ నిచ్చెన వేసి యాకోబును రక్షించాడు. ఈ మధ్యలో నేను వార్తల్లో చదివాను. ఒక వ్యక్తి ఓడలో వెళ్తున్నాడు. కాలు జారీ సముద్రములో పడిపోయాడు. దాదాపు 10 గంటలు సముద్రములో అలల మధ్య బిక్కు బిక్కు మంటూ గడిపాడు. ఏ అల నన్ను ముంచివేస్తుందో, ఏ తిమింగలం నన్ను మింగివేస్తుందో, ఏ షార్క్ నన్ను నమిలి వేస్తుందో అనే భయముతో గడిపాడంట. ప్రాణాలు మీద ఆశలు వదిలేసుకొన్నాడంట. అయితే అప్పుడు మేఘముల మధ్య ఒక హెలికాప్టర్ కనిపించింది. అతనికి సమీపములోకి వచ్చింది. అతనికి ఒక నిచ్చెన వేసింది. ఆ నిచ్చెన ఎక్కి అతను హెలికాప్టర్ లో కూర్చుని ఒడ్డుకు చేరాడు. 

     మనం కూడా సాతాను సముద్రము లో చిక్కుకొన్న అభాగ్యులమే. ఆ సముద్రము ఒక లోతైన అగాధం. అందులో పాపము, మరణము, దేవుని శిక్ష ఉన్నాయి. అందులో చిక్కుకొన్న మనకు నిరీక్షణ లేదు.అయితే దేవుడు మనకు క్రీస్తు అనే నిచ్చెన వేసి పాప సముద్రములో నుండి మనలను రక్షిస్తున్నాడు. ఈ నిచ్చెన సురక్షిత స్థలానికి మనలను చేరుస్తుంది. 

ఆ నిచ్చెన దగ్గర దేవుని భద్రత: 

ఆ నిచ్చెన బలమైనది: మనకు జెర్రీ సావేజ్ గారు అని ఒక మిషనరీ వస్తూ ఉండేవాడు. అమెరికా లో నేనొక సారి ఆయన ఇంటికి వెళ్ళాను. అది మూడు  అంతస్తుల భవనం. ఆయన ఇంటి కప్పు మీద  ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది. మా ఇంటి కప్పు మీద ఎక్కి ఆ చెట్టు కొమ్మ క్రింద పడేయగలవా? నేను ఈ నిచ్చెన ఎక్కలేను అన్నాడు.  సరే బ్రదర్ అని నేను ఆ నిచ్చెన ఎక్కడం ప్రారంభించాను. అయితే అది మధ్యలోకి వెళ్లేసరికి ఊగడం ప్రారంభించింది. ఇంకో అడుగు వేస్తే విరిగిపోతుందేమో అనే అనుమానం కలిగించింది. ‘ఇలాంటి బలహీనమైన నిచ్చెన ఇచ్చావు ఏంటి బ్రదర్’ అని నేను మనస్సులో అనుకుంటున్నాను. ‘అలాంటి నిచ్చెన ఇచ్చి అంత ఎత్తుకు ఎందుకు పంపిస్తున్నావు?’ అని జెర్రీ సావేజ్ గారి భార్య ఆయనకు చివాట్లు పెట్టింది. ‘మంచి పని చేసావు అమ్మా. నేను మొహమాటముతో చెప్పలేని మాటలు నువ్వు చెబుతున్నావు. చాలా మంచి దానివి’ అని నేను నా మనస్సులో అనుకొన్నాను. 

  ‘ఇంకో అడుగు వేస్తే విరిగి పోతుందేమో’  అనిపించే  నిచ్చెన మనకు అనవసరం. దాని వలన మనకు టెన్షన్ పెరిగిపోతుంది. అది విరిగి పోతే కాలో చేయో నడుమో విరిపోతుంది. ప్రాణాలు కూడా పోతాయి. అలాంటి నిచ్చెన ను ముక్కలు చేసి పొయ్యిలో వేసుకోవటం మంచింది. దేవుడు అలాంటి నిచ్చెన మన ముందు వేయలేదు.క్రీస్తు అనే నిచ్చెన బలహీనమైనది కాదు. ఇది చాలా బలమైనది. మీరు వేసే ప్రతి అడుగూ ధైర్యముగా వేయవచ్చు. ఎందుకంటే ఈ నిచ్చెన చాలా స్థిరమైనది. అది ఎంతో శక్తి కలిగిన నిచ్చెన. గాలికి వానకు పడిపోయే నిచ్చెన కాదు. ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. రోమా 5:6 

   ఆ నిచ్చెన పరలోకమును అంటుకొంటున్నది: యాకోబు చూసిన నిచ్చెన ఒక కొన భూమి మీద ఉంది, మరొక కోన పరలోకములో ఉంది నువ్వు చేసే నిచ్చెన బలహీనమైనది, కృంగిపోయేది, విరిగిపోయేది, వంగిపోయేది, కూలిపోయేది. అందులో నీకు భద్రత ఉండదు. 

ఆ నిచ్చెన దగ్గర దేవుని సన్నిధి: 

    తరువాత ఆ నిచ్చెన దగ్గర దేవుని సన్నిధి ఉంది. యాకోబు చూసిన నిచ్చెన పైన దేవుడు ఉండి అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో అంటున్నాడు ‘యాకోబూ, ఇదిగో నేను నీకు తోడై వుంటాను. నీవు వెళ్లే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. నేను నీకిచ్చిన మాట నెరవేర్చేవరకు నేను నిన్ను విడిచిపెట్టను’. ఇంటి నుండి పారిపోతున్న యాకోబుకు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేసాడో మీరు గమనించండి. నిరీక్షణ లేని మనకు కూడా దేవుడు క్రీస్తు నందు తన నిరంతర సహవాసం అనుగ్రహించాడు.  నిచ్చెన పైనుండి దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు పండుకొన్న స్థలము నీకు ఇస్తాను. ప్రపంచ ప్రజలందరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారు. క్రీస్తు అనే నిచ్చెన దేవుని ఆశీర్వాదాన్ని మొదటిగా యాకోబుకు, అతని సంతానానికి వచ్చింది. వారి ద్వారా ప్రపంచ ప్రజలందరికీ ఇవ్వబడింది. 

   యాకోబు నిద్ర లేచి తన తలగడ రాయి ని చూసి, ఇది దేవుని మందిరం అని పిలిచాడు. దానికి బేతేలు అని పేరు పెట్టాడు. దాని మీద నూనె పోశాడు. నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యముగా ఉన్నాడు. విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రింప బడి ఉన్నారు’ (ఎఫెసీ 4:30) అని వ్రాశాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4 అధ్యాయములో. 

ఆ నిచ్చెన దగ్గర దేవుని కట్టడ: 

   యాకోబు ముందు దేవుడు ఒక్క నిచ్చెనే వేసాడు. ‘ఏ నిచ్చెన అయినా సరే నేను అంగీకరిస్తాను’ అని దేవుడు అనలేదు. పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకము నకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.యోహాను 3:13

అపోస్తలుడైన పౌలు గారు వ్రాశాడు తిమోతి కి వ్రాసిన మొదటి పత్రికలో. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను.

               1 తిమోతి 2:5-6 

కేవలం ఒక్క మధ్యవర్తి. మానవులకు మానవుడిగా కనిపిస్తున్నాడు. దేవునికి దేవునిగా కనిపిస్తున్నాడు. అది కేవలం యేసు క్రీస్తు ప్రభువు కు మాత్రమే సాధ్యము, ఎందుకంటే ఆయన దైవ నరుడు. సంపూర్ణముగా దేవుడు. సంపూర్ణముగా మానవుడు. 

  నేనే మార్గమును సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.యోహాను 14:6. దేవుని యొద్దకు వెళ్లాలంటే మరొక నిచ్చెన లేదు. 

ఆ నిచ్చెన దగ్గర దేవుని సహకారం: 

తరువాత ఈ నిచ్చెన దగ్గర దేవుని సహకారం ఉంది. 

      యాకోబు చూసిన నిచ్చెన లో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అది విశాలమైన నిచ్చెన. ఈ నిచ్చెన వద్ద దేవదూతలు పరిచర్య, సహవాసం మనకు కనిపిస్తున్నాయి. యేసు క్రీస్తు అనే నిచ్చెన వద్ద కూడా దేవ దూతల పరిచర్య మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు జన్మ, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన పునరుత్తానము, ఆయన పరలోకం తిరిగి వెళ్లిపోవడం – వాటన్నిటిలో దేవదూతలు పాలుపంచుకున్నారు. దేవదూతల సహకారం కూడా క్రీస్తు అనే నిచ్చెన దగ్గర విశ్వాసికి ఇవ్వబడింది. నశించిన పాపి రక్షణ పొందితే దేవుని దూతలు సంతోషిస్తారు (లూకా 15:10). దేవదూతలు మన పాపముల నుండి మనలను  రక్షించలేరు. ధర్మ శాస్త్రము దేవదూతల ద్వారా నియమింపబడెను అని చదువుతాము గలతీ పత్రిక 3:19 లో. 

ధర్మ శాస్త్రము మన ఆత్మలను రక్షించలేదు. దేవదూతలు మన ఆత్మలను రక్షించలేరు. మనం యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే రక్షణ పొందగలం. దేవదూతలు మనలను పరలోకం తీసుకువెళ్ళలేరు. క్రీస్తు అనే నిచ్చెన మనం ఎక్కాల్సిందే. అయితే వారు ఆ నిచ్చెన కు రెండు వైపులా నిలబడి దేవుని ప్రజలను పరలోకానికి ఆహ్వానిస్తారు. రక్షణ పొందిన వారికి వారు పరిచారం చేస్తారు. సేవ చేస్తారు. (హెబ్రీ 1:14) 

యాకోబు నిచ్చెన అనే అంశం ఈ రోజు మనం చూశాము. 

   తన తండ్రి ఇంటి నుండి పారిపోవుతున్న యాకోబు కు దేవుడు ప్రత్యక్షమై ఒక నిచ్చెన ను ఆయనకు చూపించాడు. పైన ఉన్న దేవుడు క్రింద ఉన్న మానవుడు వారిద్దరినీ ఆ నిచ్చెన కలిపింది. ఆ నిచ్చెన యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉంది. ఆయన మనలను దేవునితో కలిపిన మధ్యవర్తి. దేవుని రక్షణ, దేవుని సన్నిధి, దేవుని సహవాసం,దేవుని భద్రత,దేవుని సహకారం. యేసు క్రీస్తు ప్రభువు వలన మనకు లభించాయి. వాటిని మీరు కూడా పొందాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply