రాధా మనోహర్ దాస్ అజ్ఞానం

ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. అందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వెబ్ సైట్ www.doctorpaul.org ని దర్శించండి. నేను వ్రాసే కామెంటరీ మీరు మా వెబ్ సైట్ లో చదువ వచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాద కరముగా ఉంటే దీని బ్రాడ్ కాస్టింగ్ కి సహకరించండి. ఇప్పటికే మాకు ఆర్ధిక సహకారం అందిస్తున్న వారికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు, 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకొంది అంటే అది మీ ప్రార్థనల యొక్క గొప్పతనమే. 

    సాతానుడు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ దేవుడు తన విశ్వసనీయతను మనకు చూపించాడు. ఆయన నమ్మదగిన వాడు అని మనకు నిరూపించాడు. దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. రాధా మనోహర్ దాస్ వ్యాఖ్యలు :  ఈ మధ్యలో ఒక మత గురువు బైబిల్ ని, క్రైస్తవ విశ్వాసులను విమర్శిస్తూ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రశ్నలకు ఈ రోజు కార్యక్రమం లో జవాబులు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. మొదటి ప్రశ్న 

పాస్టర్లు ముష్టి కోసం కక్కుర్తి పడుతున్నారా? 

ఈయన గారు రాజమండ్రి వెళ్లడంటా. ట్రైన్ దిగి కారు దగ్గరకు నడచి వెళ్తున్నాడంట. ఒక కుష్టు రోగి బిక్షమెత్తు కొంటూ కనిపించిందట. ఆమెకు ఈయన వంద రూపాయలు కానుక ఇచ్చాడంట. నీ పేరు ఏమిటి అని ఆమెను అడిగాడు. నా పేరు ‘సంతోషమ్మ’ అని చెప్పిందంట. నీకిచ్చిన దానిలో చర్చి లో  పాస్టర్ కి ఏమన్నా ఇస్తావా? అని అడిగాడంట. ‘మా పాస్టర్ గారికి దశమ భాగం ఇస్తానండి’ అని ఆమె చెప్పిందంట. 

       రాధా మనోహర్ దాస్ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ‘పాస్టర్లు ఇలా ముష్టి కోసం కక్కుర్తి పడతారు. చివరకు కుష్టు రోగులను కూడా వదలి పెట్టరు’ ని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

          రాధా మనోహర్ దాస్ ఆ కుష్టు రోగి మీద ప్రేమతో ఆమెకు భిక్షం వేసినట్లుగా లేదు. క్రైస్తవులను విమర్శించడానికి ఒక వీడియో తీసుకొందాం, ఒక సెల్ఫీ తీసుకొందాం అని ఆమెకు ఈయన భిక్షం వేశాడు. ఇలాంటి పనులు చేయొద్దు అని యేసు ప్రభువు మనకు స్పష్టముగా చెప్పాడు. 

 నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును

                 మత్తయి సువార్త 6:3 – 4 

    ఎవరికైన ధర్మం చేసేటప్పుడు రహస్యముగా చేయి. ఎంత రహస్యముగా చేయాలంటే, నీ కుడి చెయ్యి చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. నువ్వు చేసేది దేవుడు చూస్తున్నాడు. దేవునికి కనబడే ధర్మము చేయి. మనుష్యులకు కనిపించే ధర్మం చేయవద్దు. ఈయన వలె వీడియో లు తీసుకొని సోషల్ మీడియా లో పోస్ట్ చేసుకొందాం. సెల్ఫీ లు తీసుకొని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకొందాం – అది కాదు. ఈ సంతోషమ్మ చర్చి కి వెళ్లి కానుక ఇవ్వడములో ఎలాంటి తప్పు లేదు. ప్రతి వారూ తమకు కలిగిన దానిలో నుండి దేవునికి ఇవ్వాలి. ఒక రోజు యేసు ప్రభువు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ధన వంతులు ఎంతో డబ్బు కానుక పెట్టెలో వేస్తూ ఉన్నారు. అయితే ఒక బీద విధవరాలు రెండు కాసులు మాత్రమే కానుక పెట్టెలో వేసింది. యేసు ప్రభువు ఆమెను చూసి ఏమన్నాడు?  ఆ ధనవంతులు అందరి కంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది. వారందరి దగ్గర చాలా డబ్బు ఉంది. అందులో నుండి వారు కొంత ఇచ్చారు. కానీ ఈమె తన పేదరికం లో నుండి, తన జీతములో ఎక్కువ భాగం దేవునికి ఇచ్చింది అని చెప్పాడు. ఈ కుష్ఠ రోగి సంతోషమ్మ దేవునికి కానుక ఇస్తే, యేసు ప్రభువు సంతోషిస్తాడు. 

  పాస్టర్లను విమర్శించడం మంచి పద్దతి కాదు. మనం చర్చి లో వేసే కానుక మొత్తం పాస్టర్ గారి జేబులోకి వెళ్లిపోదు. చర్చి ని నడిపించాలంటే చాలా ఖర్చులు ఉంటాయి. కరెంటు బిల్లు ఉంటుంది, వాటర్ బిల్లు ఉంటుంది, భోజనాలు పెట్టాల్సి ఉంటుంది, పేదలకు కానుకలు ఇవ్వాల్సి ఉంటుంది, స్టాఫ్ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, కారు ఉంటే అందులో పెట్రోలు కొట్టించడానికి డబ్బులు కావాలి. సౌండ్ సిస్టం కి డబ్బులు కావాలి. కాబట్టి సంతోషమ్మ వేసే కానుక మొత్తం పాస్టర్ గారు తినేస్తున్నాడు అని అనుకోవడం పొరపాటు. రాధ మనోహర్ దాస్ గారు ఇలాంటి దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. 

గొఱ్ఱెల దేశాల్లో నేరాలు ఎక్కువా? 

   ఈయన చేస్తున్న మరొక ఆరోపణ ఏమిటంటే, గొఱ్ఱెల దేశాల్లో, అంటే క్రైస్తవులు ఎక్కువగా ఉండే దేశాల్లో పాపాలు ఎక్కువగా జరుగుతాయి, వ్యభిచారం ఎక్కువగా ఉంటుంది, మర్డర్ లు ఎక్కువగా ఉంటాయి అని ఆయన అంటున్నాడు. ఈ ఆరోపణల్లో పస ఉందా? మొదటిగా, బైబిల్ యేమని చెబుతుందంటే, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;

            ఆదికాండము 5:1 

   దేవుడు మనిషిని తన స్వరూపములో సృష్టించాడు. అంటే మనిషి మీద దాడి చేస్తే, దేవుని స్వరూపము మీద దాడి చేసినట్లే. 

మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించివారికి నరులని పేరు పెట్టెను.

           ఆదికాండము 5:2 

  అంటే పురుషులను, స్త్రీలను ఇద్దరినీ దేవుడు తన స్వరూపములో సృష్టించాడు. ఒక స్త్రీని మనం వ్యభిచారంలోకి దింపినా, లేక అత్యాచారం చేసినా అది దేవుని స్వరూపమును పాడు చేసినట్లే. టెన్ కమాండ్మెంట్స్ చూడండి. ఆ పది ఆజ్ఞలు గమనించండి. 

నరహత్య చేయకూడదు

వ్యభిచరింపకూడదు.

దొంగిలకూడదు.

నీ పొరుగువానిమీద 

అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

 (నిర్గమ కాండము 20:13-16)

ఆ బైబిలు సత్యాలు మనం పాటిస్తే, 

నరహత్యలు ఉండవు, 

వ్యభిచారం ఉండదు, 

దొంగతనములు ఉండవు, 

అబద్ధసాక్ష్యము లు ఉండవు. 

   క్రైస్తవులు అయినా లేక క్రైస్తవేతరులు అయినా  ఈ దేవుని సత్యాలు పాటించకపోతే వారి సమాజం పాడైపోతుంది అని మనం గమనించాలి. ఇంకొక విషయం మనం గమనించాలి. పౌర హక్కులకు విలువ ఉన్న దేశాల్లో కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతాయి. పేదలు, బలహీన వర్గాల వారు, దళితులు మన దేశములో ఎన్నో అత్యాచారాలకు, హింస కు, హత్యలకు గురవుతూ వుంటారు. వారు పోలీస్ స్టేషన్ కి వెళ్తే చాలా సార్లు FIR కూడా రిజిస్టర్ కాదు. అమెరికా లాంటి దేశాల్లో పేద ప్రజల మీద దాడులు జరిగినా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేస్తారు. మన దేశములో నేరాలు చేసే  ధనవంతులు యెంత మందికి శిక్ష పడుతుంది? ఎంత కాలం జైల్లో వుంటారు? వై యస్ వివేకానంద రెడ్డి గారిని దారుణముగా చంపి 5 సంవత్సరాలు దాటి పోయింది. ఆయన హత్యకు  ప్రణాళిక వేసిన వారిలో, అంటే ప్రధాన నిందితుల్లో  ఒక్కడన్నా జైలుకి వెళ్లాడా? డబ్బు, పలుకుబడి ఉంటే దర్జాగా బయట తిరగవచ్చు అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. అమెరికా లో నేరస్తులు ఆస్తి, అంతస్తులతో సంబంధం లేకుండా శిక్షలకు గురవుతున్నారు. 

   ఆవు మాంసం తిన్నాడని, మోసుకెళ్తున్నాడని మన దేశములో చాలా చోట్ల ముస్లిముల మీద, దళితుల మీద దాడులు జరిగాయి. దాడులు చేసిన వారిలో ఎంత మంది మీద FIR లు నమోదు చేశారు? ఎంత మందికి శిక్ష పడింది? ఎంత మంది జైలుకు వెళ్లారు? పౌర హక్కులకు భంగం కలగటం తరుచుగా జరుగుతుంది. ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. మహమ్మద్ ప్రవక్తను దూషించారు అని క్రిమినల్ కేసులు పెట్టడం ఇస్లామిక్ దేశాల్లో తరచుగా జరుగుతుంది. పాకిస్తాన్ లో చాలా మంది క్రైస్తవులు మరణ శిక్ష కూడా ఎదుర్కొంటున్నారు. క్రైస్తవ దేశాల్లో మతా చారాలను, మత విశ్వాసాలను  బట్టి చట్టాలు చేయరు. దాని వలన పౌర హక్కులకు విలువ ఉంటుంది. వాటికి భంగం కలిగితే పోలీసులు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి, క్రైస్తవ దేశాల్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోవటం పొరపాటు. 

దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, 

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.

           రోమా 3:23 

ఏ బేధం లేదు, ఈ ప్రపంచములో మనం ఏ దేశములో ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ఏ జాతి వారమైనా మనమందరం పాపములో చిక్కుకొని ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. 

 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.

          రోమా 3:24 

   గుడ్ న్యూస్ ఏమిటంటే, మన పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రభువు సిలువ వేయబడి మన మీదకు రావలసిన శిక్షను ఆయన భరించి మనలను విమోచించాడు, విడిపించాడు. కాబట్టి, రాధా మనోహర్ దాస్ గారు క్రైస్తవులను పాపాత్ములు అని నిందించడం మంచి పద్దతి కాదు. రక్షణ పొందకపోతే మన మందరం దేవుని దృష్టిలో నశించిన స్థితిలో ఉన్న వారమే. ఆ సత్యం ఆయన గ్రహించి మారుమనస్సు పొందితే మంచిది. తరువాతి ప్రశ్న: 

బైబిలు పనికిమాలిన  పుస్తకమా? 

     రాధా మనోహర్ దాస్ గారు బైబిలు గ్రంథం పనికిమాలిన పుస్తకం అని ఒక తీవ్ర విమర్శ చేశాడు. కోట్లాది మంది దేవుని వాక్యం గా నమ్మి, ప్రేమించే గ్రంథం గ్రంథం. అలాంటి గ్రంధమును పనికిమాలిన పుస్తకం అని పిలవడం మంచి పద్దతి కాదు. ఈ ప్రపంచమును ఎంతో బాగుచేసిన గ్రంథం బైబిలు. బైబిలు దేవుని చేత వ్రాయబడిన గ్రంథం. అలాంటి గ్రంథం మరొకటి లేదు. దాని ప్రభావం ఈ ప్రపంచము మీద ఎంతో పడింది. 

పౌర హక్కులు: 

    ఒక దేశములో ప్రజలందరికీ సమానత్వం, ఒకే రకమైన పౌర హక్కులు ఉండాలి అని మనం నమ్ముతాము. ఈ నమ్మకం బైబిలు లో నుండి వచ్చిందే. అందరూ దేవుని స్వరూపములో సృష్టించబడి, మొదటి మనుష్యులు ఆదాము, హవ్వ అనే దంపతుల నుండి వచ్చిన వారే అని నమ్మకం అందరికీ సమాన హక్కులు ఉండాలి అనే నమ్మకానికి దారి తీసింది. అందుకనే క్రైస్తవ దేశాల్లో మతము ఆధారముగా పౌర హక్కులు వుండవు. 

కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి. మార్కు సువార్త 12:17

    యేసు ప్రభువు చెప్పాడు. కైసరువి కైసరుకు – అంటే ప్రభుత్వానికి ఇవ్వవలసినవి  ప్రభుత్వానికి ఇవ్వు. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వు. ఈ గొప్ప సత్యం సామాజిక శాస్త్రానికి, రాజకీయ శాస్త్రానికి, రాజ్యాంగ శాస్త్రానికి పునాది వంటిది. అన్నీ ప్రభుత్వానికి చెందితే, మానవ ప్రభుత్వము ఒక నియంతృత్వ వ్యవస్థ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు కమ్యూనిస్ట్ దేశాల్లో జరుగుతుంది అదే. 

    అన్నీ చర్చి కి చెందితే, చర్చి లేక మతాధికారులు నియంతృత్వ వ్యవస్థ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు అనేక ఇస్లామిక్ దేశాల్లో ఆ పరిస్థితి ఉంది. అయితే, యేసు క్రీస్తు ప్రభువు చెప్పినది ఏమిటంటే, ప్రభుత్వానికి ఇవ్వవలసినవి ప్రభుత్వానికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి. ఆ గొప్ప సత్యం భారత దేశం సహా అనేక దేశాల యొక్క రాజ్యాంగములకు పునాది వేసింది. 

     నాస్తికులు నిర్మించే దేశాల్లో మానవ హక్కులకు విలువ లేకుండా పోయింది. ఉదాహరణకు, క్రైస్తవ సత్యాన్ని తిరస్కరించి ప్రభుత్వం ఏర్పరచుకొన్న సోవియెట్ యూనియన్ చరిత్ర చూడండి. అక్కడ పౌర హక్కులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వమును ప్రశ్నించిన వారిని గులాగ్ జైల్లో వేసి హింసించారు, హతం చేశారు. లక్షల మందిని కమ్యూనిస్టులు దారుణముగా చంపివేశారు. అలాంటి పరిస్థితుల్లో రష్యా దేశములో చాలా మంది ప్రజలు బైబిల్ గ్రంథాలు రహస్యముగా సేకరించి చదువుకొనే వారు. దేవుని వైపు చూచుచూ వారు నిరీక్షణ పొందేవారు. కొంతమంది బైబిలు సత్యాలను నవలలుగా వ్రాశారు. 

    Yevgeny Zamyatin యవజని జామ్య టిన్ (1884 – 1937). ఆయన ఒక పాస్టర్ గారి కొడుకు. We అనే నవల వ్రాశాడు. అందులో మనుష్యులకు పేరులు ఉండవు. నంబర్లు మాత్రమే ఉంటాయి. ఒక స్పేస్ ఇంజనీర్ ఉంటాడు. ఆయన పేరు D – 503. ఆయన ఆలోచనలను కూడా ప్రభుత్వం నియంత్రిస్తూ ఉంటుంది. ఆయన చేసే ప్రతి పనినీ ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడే ప్రతి మాటా ప్రభుత్వం వింటూ ఉంటుంది. ఆయన, ఆయన భార్య ఇంట్లో మాట్లాడుకొనే సంభాషణలను కూడా ప్రభుత్వం సీక్రెట్ గా వింటూ ఉంటుంది. ఆ నగరం చుట్టూ ఒక గ్రీన్ వాల్ ఉంటుంది. లోపల పచ్చదనం ఉండదు కానీ బయట మాత్రమే పచ్చదనం ఉంటుంది. 

    అంటే ఇది ఏదెను వనమునకు పూర్తిగా వ్యతిరేకమైనది. ఏదెను వనము సర్వస్వము పచ్చగా, స్వేచ్ఛతో నిండిఉంటే, కమ్యూనిస్టులు నిర్మించిన ఈ వనం బయట గోడ మాత్రమే పచ్చగా ఉంటుంది. లోపల మాత్రం నియంతృత్వం, బానిసత్వం రాజ్యమేలుతూ ఉంటాయి అనే భావం జామ్య టిన్ ఆ నవలలో తెలియజేశాడు. ఆ నవల చదివి ప్రజలు ఎక్కడ మాకు తిరుగబడతారో అని జోసెఫ్ స్టాలిన్ లాంటి వారు ఆందోళన చెందారు. 

     జామ్య టిన్ వ్రాసిన నవలను వారు బ్లాక్ లిస్ట్ లో చేశారు. సోవియెట్ యూనియన్ నిషేధించిన మొదటి పుస్తకం అదే. బైబిల్ కనిపించినా, బైబిల్ ప్రేరేపిత నవలలు, పుస్తకాలు కనిపించినా నియంతలు వణకిపోయే వారు. జామ్య టిన్ బైబిలు సత్యాలు ఆధారముగా అంత గొప్ప నవల వ్రాశాడు. కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఎలా వచ్చింది? బైబిలు వలనే. 

ఆ తరువాత బైబిల్ సైన్స్ యుగానికి కూడా పునాదులు వేసింది. ఈ విశాల విశ్వం దేవుని చేత సృష్టించబడింది. అది దేవుని నియమాల మీద పనిచేస్తుంది అని బైబిల్ బోధించింది. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలం అనే భావన బైబిల్ కలిగించింది. 

   సైన్స్ కి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్తలు – బ్లెయిస్ పాస్కల్, ఫ్రాన్సిస్ బేకన్, గలీలియో గాలిలీ, గ్రెగర్ మెండల్, హెన్రియెట్టా లెవిట్, సర్ ఐసాక్ న్యూటన్, చార్లెస్ బాబేజ్, జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్, జేమ్స్ జౌల్, జోహనెస్ కెప్లెర్, జోసెఫ్ లిస్టర్, లియోనార్డో డావిన్సి, కారోలస్ లిన్నేయస్, లార్డ్ కెల్విన్, లూయీ పాశ్చర్, మైఖేల్ ఫారడే, జేమ్స్ ఇర్విన్, రెనె డెకార్ట్, రాబర్ట్ బాయిల్, విలియం హెర్స్చాల్, విలియం హార్వే – ఈ గొప్ప శాస్త్రవేత్తలు బైబిల్ చదివి ప్రేరేపించబడిన వారే. 

     దేవుడు సృష్టించిన ఈ విశ్వాన్ని మనం అర్థం చేసుకోగలం అని వారు బలముగా నమ్మారు. ప్రకృతి మీద రీసెర్చ్ చేశారు. భౌతిక నియమాలను కనుగొన్నారు. దేవుని స్తుతించారు. బైబిల్ ని చాలా బాగా స్టడీ చేసారు. సర్ ఐజాక్ న్యూటన్ బైబిల్ మీద కామెంటరీ లు కూడా వ్రాశాడు. ఫ్రెడరిక్ నీచే అనే ప్రసిద్ధ నాస్తికుడు ఉండేవాడు. ఆయన గొప్ప ఫిలొసొఫర్ కూడా. ఆయన సైన్స్ ని తిరస్కరించాడు. ఎందుకంటే, క్రైస్తవ్యం, బైబిల్ ఈ ప్రకృతి కొన్ని నిర్దిష్ట మైన నియమముల మీద ఆధారపడి నడుస్తుంది అని బోధించాయి. ఈ విశ్వము కు ఒక ఆర్డర్ ఉంది అని బైబిల్ బోధించింది. ఆ భావనలో నుండే సైన్స్ పుట్టింది. నేను క్రైస్తవ్యాన్ని, బైబిల్ ని తిరస్కరిస్తున్నాను. వాటి నమ్మకాల మీద నుండి పుట్టింది కాబట్టే నేను సైన్స్ ని కూడా తిరస్కరిస్తున్నాను. అని ఆ నాస్తికుడు అన్నాడు. ఆ విధముగా నాస్తికులు కూడా బైబిల్ లేకపోతే సైన్స్ పుట్టేది కాదు అని ఈ రోజు ఒప్పుకొంటున్నారు.

    తరువాత, బైబిల్ ప్రజల సంక్షేమానికి పునాదులు వేసింది. ఈ రోజు ప్రజా సంక్షేమం, ప్రజా సంక్షేమం అని రాజకీయ పార్టీలు పోటీ పడి మరీ సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే ఈ భావజాలం క్రైస్తవ్యం నుండే పుట్టింది అని మనం గ్రహించాలి. ఒక రోజుల్లో పేదరికం ఒక శాపం అని భావించేవారు. అది ఒక కర్మ ఫలం అని అనుకునేవారు. మదర్ థెరెసా కలకత్తా నగరం వెళ్లి అక్కడ రోడ్ల మీద పడి ఉన్న వారికి సేవ చేస్తూ ఉండేది. అనాథలు, అభాగ్యులు కూడా దేవుని చేత ప్రేమించబడిన వారు. వారికి మనం సహాయం చేయాలి అని ఆమె అనేక సేవా కార్యక్రమాలు ఆ నగరములో చేపట్టింది. 

   అయితే కొంతమంది ఆమె చర్యలను అడ్డుకొన్నారు. వారి కర్మ అలా కాలింది, పూర్వ జన్మలో చేసిన పాపాల ఫలితం వారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వారికి సహాయం చేస్తే వారి మోక్షానికి అడ్డుపడ్డట్టే అని వారు వాదించారు. అయితే మదర్ థెరెసా ఆ మాటలు వినలేదు. వీరు దేవుని చేత ప్రేమించబడిన వారు. వారికి మనం సహాయం చేయాలి. పూర్వ జన్మ, పునర్జన్మ లు అనే నమ్మకాల్లో సత్యం లేదు అని ఆమె నమ్మింది. మంచి సమరయుడు కథ ఆమె చెబుతూ ఉండేది. ఆ కథ బైబిల్ లో నుండి వచ్చిందే. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణిస్తూ ఉంటాడు. మార్గ మద్యములో ఆయన దొంగల చేతికి చిక్కుతాడు. వారు ఆయన డబ్బులు, వస్తువులు దోచుకొంటారు. బాగా కొట్టి రోడ్డు ప్రక్కన పడవేసి వెళ్ళిపోతారు. 

    చాలా మంది ఆ కొనప్రాణము తో ఉన్న వ్యక్తిని చూస్తారు కానీ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయరు. నాకెందుకులే వీడి గొడవ అని వారు చూసి చూడనట్లు వెళ్ళిపోతారు. అయితే ఒక సమరయుడు అతని చూసి, అతని మీద జాలిపడి, అతని దగ్గరకు వెళ్లి, అతని గాయాలు కట్టి అతని ఒక హాస్పిటల్ లో చేర్చుతాడు. ఆ మంచి సమరయుని వలె మనం కూడా ఆపదల్లో ఉన్న వారికి, సహాయం చేయాలని యేసు ప్రభువు బోధించాడు. 

    ఈ బైబిల్ కథ చేత ప్రేరేపించబడి కొన్ని వేల హాస్పిటల్స్ నిర్మించడం జరిగింది. కొన్ని వేల హాస్టల్స్ నిర్మించడం జరిగింది. అనాథ శరణాలయములు, ఓల్డ్ ఏజ్ హోమ్ లు ప్రారంభించడం జరిగింది. కొన్ని దేశాల్లో ప్రభుత్వములు గుడ్ సమారిటన్ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ప్రాణాపాయములో ఉండి హాస్పిటల్ కి వెళ్తే అతని ఆర్థిక పరిస్థితి పట్టించుకోకుండా అతనికి లేక ఆమెకు సహాయం చేయాలి. వారి దగ్గర డబ్బులు లేకపోయినా వారికి వైద్య సహాయం అందించాల్సిందే. ఆ విధముగా బైబిల్ ప్రజా సంక్షేమానికి ఎంతో ఉపయోగ పడింది. ఆ విధముగా బైబిల్ సత్యాలు మన ప్రపంచానికి ఎంతో మేలు చేశాయి. ఈ సత్యాలు మనం గ్రహించాలి. ప్రభువైన యేసు క్రీస్తు ను నమ్ముకొని పాప క్షమాపణ పొంది, రక్షణ పొందాలి. అదే నేటి మా ప్రేమ సందేశం.  

Leave a Reply