రాధా మనోహర్ దాస్ అవివేకం: క్రీస్తు అద్భుతాలు నిజముగా జరిగాయా? 

   ప్రేమ సందేశం వీక్షిస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ దేవుని కృప యందు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. బైబిల్ స్టడీ చేసే వారు మా వెబ్ సైట్ దర్శించండి. www.doctorpaul.org మా వెబ్ సైట్ లో మీరు నేను వ్రాసే బైబిల్ కామెంటరీ ఎప్పటికప్పుడు చదువవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దీని బ్రాడ్ కాస్టింగ్ కి సహకరించండి. ఇప్పటికే మాకు సహాయం చేస్తున్నవారికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించాలని మా ప్రార్ధన. 

    విమర్శకులకు జవాబులు అనే శీర్షిక మనం చూస్తున్నాము. క్రైస్తవ్యాన్ని విమర్శించే వారు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఈ రోజు చూద్దాము. మొదటి ప్రశ్న: బైబిలు లో యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలు నిజముగా జరిగినవా? చాలా మంచి ప్రశ్న. బాబూ గోగినేని, రాధా మనోహర్ దాస్, కరుణా కర్ సుగ్గున – వీరు ముగ్గురూ చేసే విమర్శ ఏమిటంటే బైబిల్ లో ఉన్న అద్భుత కార్యాలు కలిపించి వ్రాసినవే. ఈ విమర్శ గురించి కొంత సేపు చూద్దాము. 

   రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన 37 అద్భుతాలు క్రొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి. ఆయన ఒక పెండ్లి ఉత్సవానికి వెళ్లి నీటిని ద్రాక్షా రసముగా మార్చాడు. 

5000 మంది ప్రజలకు ఆకలి వేస్తె 5 రొట్టెలు, 2 చేపలు తీసుకొని వాటితో 5000 మంది ఆకలి తీర్చాడు. 

ఒక రోజు తుఫాను వచ్చింది. ఆయన తుఫాను ను గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. 

లాజరు అనే మనిషి చనిపోయి 4 రోజులు అయింది. యేసు ప్రభువు మాట విని లాజరు సమాధిలో నుండి బయటికి నడచి వచ్చాడు. 

గ్రుడ్డి వారికి చూపు ఇచ్చాడు. 

కుంటివారు నడిచేటట్లు చేశాడు. 

కుష్ఠ రోగులను స్వస్థ పరచాడు. 

అవి మనకు ఫాంటసీ గా కనిపిస్తాయి. ఒక మాటతో తుఫాను ఆపడం ఏమిటి? ఉమ్మి వేసి గ్రుడ్డి వాడికి చూపు ఇవ్వటం ఏమిటి? అయితే మనకు ఫాంటసీ గా అనిపించే పనులు ఆయన ప్రాక్టీకల్ గా చేసి చూపించాడు. అందుకనే ఆయన ఫెంటాస్టిక్ సేవియర్. ఆశ్చర్యకరుడైన రక్షకుడు. ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు? 

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2 అధ్యాయం చూడండి. 

ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను, నానావిధములైన అద్భుతములచేతను,వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.

ఆ మాటలు మీరు గమనించండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? ఆ రక్షణ ఎలా మొదలయ్యింది? యేసు ప్రభువు బోధనలతో ఆరంభం అయ్యింది. ఎలా మహిమపరచబడింది? దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నా నా విధములైన అద్బుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత సాక్ష్యమిచ్చాడు. దేవుడు సాక్ష్యమిచ్చాడు. ఈ యేసు క్రీస్తు చెప్పే మాటలు నమ్మండి. ఆయన చెప్పేది సత్యము. ఆయన మార్గములో నడవండి. దేవుడు సాక్ష్య మిచ్చు చుండగా వినిన వారిచేత మనకు దృఢ పరచెను. యేసు క్రీస్తు చేసిన ఆ గొప్ప అద్భుతాలు చూసిన వారు ఈ బైబిలులో వాటి గురించి వ్రాశారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం, వాటిని చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం వీటిని నమ్మి మనం యేసు క్రీస్తును నమ్ముకొన్నాము. యేసు క్రీస్తు శిష్యులు ఇచ్చిన ఆ సాక్ష్యం ఎంతో గొప్పది. ఎందుకంటే వారు తమ ప్రాణాలు కూడా క్రీస్తు కోసం అర్పించారు. 

యేసు క్రీస్తు ఒక ఫ్రాడ్, యేసు క్రీస్తు ఒక అబద్దం అని వారు అనుకొంటే – ఈ క్రీస్తు కోసం నా జీవితం పాడు చేసుకోవడం ఎందుకు? ఈ క్రీస్తు కోసం నా ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి? అని చల్లగా జారుకొనేవారు. అయితే వారు ఆవిధముగా చేయలేదు. క్రీస్తు కోసం ఎంతో రిస్క్ తీసుకొన్నారు. ఆయన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎన్నో కష్టాలు ఓర్చుకొన్నారు. ప్రాణం పోయినా సరే క్రీస్తును వదిలిపెట్టం అన్నారు ఎందుకంటే మరణం నుండి తిరిగి లేచిన యేసు క్రీస్తును వారు సజీవముగా చూశారు కాబట్టే. 

   డేవిడ్ హ్యూమ్ అని ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. ఆయన 1711 – 1776 ల మధ్య స్కాట్లాండ్ దేశములో జీవించాడు. ఆయన ఏమన్నాడంటే, బైబిల్ లో వ్రాసిన అద్భుతాలు జరిగి వుండే అవకాశం లేదు. ఆయన రెండు కారణాలు చెప్పాడు. మొదటిది, అబ్దుతాలు ప్రకృతి నియమాలకు వ్యతిరేకం. యేసు క్రీస్తు చేసినట్లుగా చెబుతున్న అద్భుత కార్యాలు నిజముగా జరిగి ఉంటే అవి ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లే. ఆ అవకాశం లేదు అన్నాడు. 

   రెండోదిగా, ఇప్పుడు మనకు అలాంటి అద్భుతాలు జరుగుతున్నట్లు కనిపించదు. కాబట్టి ఈ అద్భుతాలు పూర్వము కూడా జరిగే అవకాశం లేదు. దీనిని యూనిఫార్మిటీ ప్రిన్సిపల్ అన్నాడు. ఆ రెండు విషయాల్లో డేవిడ్ హ్యూమ్ పొరబడ్డాడు. ఎందుకంటే, మాథెమాటిక్స్ లో ప్రాబబిలిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ప్రకృతి నియమములో 3 గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి. 

Symmetry 

Information 

Probability 

   ప్రతి ప్రకృతి నియమములో ఈ మూడు లక్షణాలు మనకు కనిపిస్తాయి. మూడోది మీరు గమనించండి. Probability అంటే ఛాన్స్. ఎంత ఛాన్స్ ఉంది? మన జీవితములో ప్రతి అంశములో ఈ ఛాన్స్ లేక ప్రాబబిలిటీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ స్కూల్ లో సీట్ వస్తుంది? ఛాన్స్ 

అసలు స్కూల్ కి వెళ్లగలవా? ఛాన్స్ ఏ ర్యాంక్ వస్తుంది? ఛాన్స్ 

నీకు ఉద్యోగం వస్తుందా? ఛాన్స్ 

నీకు పెళ్లి అవుతుందా? ఛాన్స్ 

నీకు పిల్లలు పుడతారా? ఛాన్స్ 

నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఛాన్స్ 

ఆ విధముగా ఛాన్స్ లేక ప్రాబబిలిటీ మన జీవితములో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రకృతి నియమాలు కూడా ప్రాబబిలిటీ క్రింద పనిచేయాల్సిందే. మనం ఒక నాణెం తీసుకొని టాస్ వేస్తాము. బొమ్మా? బొరుసా? నీకు తెలియదు. నాకు తెలియదు. బొమ్మ పడుతుందో, బొరుసుపడుతుందో మనం ఖచ్చితముగా చెప్పలేము. అదే మీరు ఒక లక్ష సార్లు టాస్ వేయండి. బొమ్మ పడటానికి 50 పెర్సెంట్ ఛాన్స్ ఉంటుంది. బొరుసు పడటానికి 50 పెర్సెంట్ ఛాన్స్ ఉంటుంది. నువ్వు టాస్ వేసుకొంటూ పోతే, ఆ ఛాన్స్ ను కూడా మనం ఖచ్చితముగా కొలవవచ్చు. దీనిని Law of Large Numbers అని పిలిచారు. రాబోయే రెండు నెలల్లో తుఫాను వచ్చే అవకాశం ఉందా? రాబోయే సంవత్సరములో ఆర్థిక రంగము ఎలా ఉంటుంది? వచ్చే ఎన్నికలో ఎవరు గెలుస్తారు? వీటన్నిలో మనం ప్రాబబిలిటీ నియమములు ఉపయోగిస్తాము. 

   బ్లెయిస్ పాస్కల్ అని గొప్ప మేధావి ఉండేవాడు. ఆయన 1623 నుండి 1662 సంవత్సరముల మధ్య జీవించాడు. ఆయన ఈ ప్రాబబిలిటీ సైన్స్ కి తండ్రి లాంటి వాడు.  ఆయన దేవుని ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్నకు ఒక సమాధానము ఇచ్చాడు. 

4 అవకాశాలు ఉన్నాయి. 

దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు. 

నువ్వు నమ్మావు, నువ్వు నమ్మలేదు 

మొదటి ఛాయిస్ దేవుడు లేడు, నువ్వు నమ్మావు. నీకు కొంత నష్టము జరుగుతుంది. 10 పెర్సెంట్ లాస్. 

రెండో ఛాయిస్ దేవుడు లేడు, నువ్వు నమ్మలేదు, నీకు కొంత లాభం ఉండొచ్చు. 100 పెర్సెంట్ లాభం. 

మూడో ఛాయిస్ దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మావు. దీని వలన నీకు ఎంతో లాభం. 

నువ్వు పరలోకం వెళ్తావు, నిత్య జీవం పొందుతావు. 

నాలుగో ఛాయిస్ దేవుడు వున్నాడు. నువ్వు నమ్మలేదు. ఆ ఛాయిస్ నువ్వు చేస్తే 

నువ్వు తీవ్రముగా నష్టపోతావు. దేవుని తీర్పు పొందుతావు. నిత్య నరకానికి వెళ్తావు. 

పాస్కల్ గారు చేసిన ఈ వాదనను పాస్కల్స్ వేజర్ అని పిలిచారు. 

   అయితే, దేవుడి తో జూదం ఆడు అని పాస్కల్ బోధించలేదు. ఆయన దేవుని సేవ చేయడానికి సైన్స్ ని కూడా వదలి పెట్టివెళ్లిన వాడు. ఆయన చాలా గొప్ప సైంటిస్ట్ గా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ వాటన్నిటినీ యేసు ప్రభువు కొరకు వదలి పెట్టినవాడు. ‘దేవుడు వ్యక్తుల దేవుడు. He is a God of Persons. ఆయన వ్యక్తులతో స్నేహం చేసేవాడు. వ్యక్తులను ప్రేమించేవాడు. వ్యక్తులతో సహవాసం చేసేవాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ఆయన తనను తాను పిలుచుకొన్నాడు. పాస్కల్ ప్రవేశపెట్టిన ప్రాబబిలిటీ అనేక శాస్త్రాల్లో ఈ రోజు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంది. 

   థామస్ బేయిస్ అని ఒకాయన ఉండేవాడు. ఆయన 1701 – 1761 సంవత్సరముల మధ్యలో జీవించాడు. ఆయన ఒక ప్రెస్బిటేరియన్ చర్చి పాస్టర్. మాథెమాటిక్స్ లో చాలా గొప్ప మేధావి. ఆయన బేయిస్ థీరమ్ అని ఒక సిద్ధాంతము కనిపెట్టాడు. దీని ప్రకారం ఛాన్స్ ఒక్కటే మనం పరిగణన లోకి తీసుకోకూడదు. అనేక ఇతర కారణాలను కూడా మనం పరిగణన లోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు ఉంటే, వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, మనం ఇతర విషయాలు కూడా చూడాలి. వారి వయస్సు ఎంత? వారి బరువు ఎంత? దురలవాట్లు ఏమన్నా ఉన్నాయా? అవన్నీ తెలుసుకోవాలి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో వయస్సు ఎక్కువ, బరువు ఎక్కువ దురలవాట్లు ఎక్కువ ఉన్న వ్యక్తికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే బెయిస్ థీరమ్. 

    ఈ రోజు సైన్స్, పాలిటిక్స్, మెడిసిన్, ఎకనామిక్స్ – వీటన్నిటిలో బెయిస్ థీరమ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. డేవిడ్ హ్యూమ్ విమర్శలకు సమాధానం చెప్పడానికే థామస్ బెయిస్ ఈ థీరమ్ తయారు చేశాడు. థామస్ బెయిస్ చనిపోయిన తరువాత ఆయన పరిశోధన డాక్టర్ రిచర్డ్ ప్రైస్ చేతిలోకి వెళ్ళింది. ఆయన బెయిస్ థీరమ్ ను ఇంకా వృద్ధి చేశాడు. ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలను కూడా మనం ఆ విధముగానే చూడాలి. ఆయన శిష్యులు చెప్పిన సాక్ష్యమును మనం పరిగణన లోకి తీసుకోవాలి. వారు పొరబాటు పడే ఛాన్స్ ఉందా? 

వారు సత్యము చెప్పారు అనడానికి ఛాన్స్ ఎంత? వారు అబద్దాలు చెప్పారు అనడానికి ఛాన్స్ యెంత? వారు మోసము చేశారు అని చెప్పడానికి ఛాన్స్ యెంత? వారు పొరబాటు పడే ఛాన్స్ లేదు. యేసు క్రీస్తు ప్రభువు మరణములో నుండి తిరిగి లేచిన తరువాత 40 రోజుల పాటు, వివిధ ప్రాంతాల్లో 500 కంటే ఎక్కువ మందికి కనీసం 8 సార్లు కనిపించి, వారితో మాట్లాడాడు. వారితో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారితో కలిసి నడిచాడు. వారు ఆయనను పట్టుకొని చూశారు. థామస్ అయితే ఆయన గాయాలు కూడా తాకి చూశాడు. 

    వారు అబద్ధాలు చెప్పడం మనకు ఎక్కడా కనిపించదు. వారు మోసాలు చేయడం బైబిల్ లో ఎక్కడా మనకు కనిపించదు. ఆ విధముగా బెయిస్ థీరమ్ ను మనం పరిగణన లోకి తీసుకొంటే, యేసు క్రీస్తు శిష్యులు ఇచ్చిన సాక్ష్యం పరిశీలిస్తే, యేసు క్రీస్తు చేసిన అబ్దుతాలు సత్యమైనవే అని మనం నిర్ధారణకు రావచ్చు. డేవిడ్ హ్యూమ్ చేసిన మరొక విమర్శ ఏమిటంటే, బైబిల్ లో ఉన్న అద్భుత కార్యాలు ప్రకృతి నియమాలకు విరుద్ధము కాబట్టి అవి జరిగి ఉండవు, అంటే కాకుండా అబ్దుతాలు ఒక్కసారే జరిగిన కార్యాలు, వాటిని నమ్మలేము అన్నాడు. ఆయన ఇచ్చిన ఉదహరణ ఏమిటంటే, 

సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు. సూర్యుడు రేపు ఉదయం కూడా ఉదయిస్తాడు అని మనం అనుకొంటాము ఎందుకంటే వేల సంవత్సరాల పాటు సూర్యుడు ప్రతి ఉదయం ఈ భూమి మీద ఉదయించాడు. ఎప్పుడూ జరిగేవి మాత్రమే జరిగినట్లు. అప్పుడప్పుడూ జరిగే అద్భుతాలు మనం నమ్మలేము అన్నాడు. అయితే డేవిడ్ హ్యూమ్ వాదన హేతుబద్దమైనది కాదు. 

   సూర్యుడు గురించి మనం ఆలోచిస్తే, సూర్యుడు పుట్టింది ఒక్కసారే, ఒక్కసారే కదా అని సూర్యుడిని నేను నమ్మను అని అంటామా? సూర్యుడు పుట్టడం నీవు చూడలేదు. అంత మాత్రాన సూర్యుడు లేడు అనవుకదా? సూర్యుడు, సౌర కుటుంబము, గ్రహాలూ వాటి ఆర్బిట్స్ ఇవన్నీ దేవుని జ్ఞానం మనకు తెలియజేస్తున్నాయి. సర్ ఐజాక్ న్యూటన్ చెప్పింది అదే. మన సౌర కుటుంబం దేవుని అద్భుత సృష్టే. దేవుడు అనేక రకాలైన ప్రకృతి నియమాలను సృష్టించి ఉంటాడు. ఆ నియామాలను మనం ఎక్సపెరిమెంట్స్ చేసి తెలుసుకోవాలి అని న్యూటన్ అన్నాడు. 

    ప్రకృతి నియమాల్లో మూడు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అని ఇంతకు ముందు మనం చెప్పుకొన్నాము. 

Symmetry,

Information, 

Probability 

   ప్రకృతి నియమాలు కూడా ప్రాబబిలిటీ ని బట్టి నడవాల్సిందే. అవి ఏ పరిస్థితుల్లో ఏ విధముగా ప్రవర్తిస్తాయి అని మనం ఆలోచించాలి. అవి ఎవరూ కదిపించలేని అబ్సొల్యూట్స్ కాదు. 

   చార్లెస్ బాబేజ్ అని గొప్ప సైంటిస్ట్ ఉండేవాడు. 1792 – 1871 ల మధ్య ఆయన ఇంగ్లాండ్ దేశములో జీవించాడు. మొదటి కంప్యూటర్ ని ఆయన రూపొందించాడు. కంప్యూటర్ చేయడం అంటే సాధారణ విషయం కాదు కదా. సుత్తినో, చాంతాడు నో కనిపెట్టడం తేలిక. ఇంకెవ్వరికీ కంప్యూటర్ అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో కంప్యూటర్ ని నిర్మించాలంటే ఎంతో జ్ఞానం కావాలి. మాథెమాటిక్స్, ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ అవన్నీ తెలిసి ఉండాలి. చార్లెస్ బాబేజ్ అంత గొప్ప మేధావి. 

ఆయన కంప్యూటర్ నమూనా చేసిన తరువాత 100 సంవత్సరాలకు మిగతా ప్రపంచం కంప్యూటర్ చేసింది. మిగతా ప్రపంచము కన్నా ఆయన ఆలోచనలు వంద సంవత్సరాలు ముందు ఉన్నాయి. 

   ఆయన డేవిడ్ హ్యూమ్ ని తప్పు పట్టాడు. ఆయన ఏమన్నాడంటే, ‘యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘించి నట్లు కాదు. దేవుని నియమాలు మనకు తెలిసిన ప్రకృతి నియమాల కన్నా ఇంకా ఉన్నతముగా ఉంటాయి.’ 

ఆ మాట నాకు నచ్చింది. ఎందుకంటే బైబిలు బోధించేది కూడా అదే. ప్రకృతి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఈ శాటిలైట్లు, రాకెట్లు, విమానాలు చూసి మనం మనకు చాలా తెలుసు అనుకొంటాము. అయితే మనకు తెలియని దానితో పోలిస్తే మనకు తెలిసింది చాలా తక్కువ. మన యూనివర్స్ లో డార్క్ మేటర్ ఎక్కువగా ఉంది. దాని గురించి మనకు పెద్దగా తెలియదు. డార్క్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంది. దాని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 

మనం ప్రకృతి నియమాలు కొన్ని తెలుసుకొని దేవుడు వాటిని ఉల్లంఘించలేడు అని అనుకోకూడదు. దేవుడు కావాలంటే వాటిని కొంత సేపు స్తంభింపజేసి తన కార్యాలు చేయ గలడు. 

సర్వ లోకాన్ని సృష్టించిన వాడు సముద్రాన్ని చీల్చలేడా? 

సూర్యుణ్ణి సృష్టించిన వాడు సూర్యుణ్ణి ఆపలేడా? 

రక్తాన్ని సృష్టించిన వాడు రక్తస్రావం ఆపలేడా? 

జీవాన్ని సృష్టించిన వాడు మరణాన్ని జయించలేడా? 

కోట్లాది నక్షత్రాలను సృష్టించిన వాడు ఒక నక్షత్రాన్ని బేత్లెహేము పంపలేడా? ప్రకృతి క్రింద దేవుని పెట్టవద్దు. దేవుని క్రింద ప్రకృతిని పెట్టు. డేవిడ్ హ్యూమ్ చేసిన వాదన అసంబద్ధమైనది. యేసు ప్రభువు చేసిన అద్భుతాలు ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లు కాదు. ఆయన ప్రకృతి కంటే శక్తి కలిగిన వాడు. 

బ్లెయిస్ పాస్కల్, 

థామస్ బెయిస్, 

డాక్టర్ రిచర్డ్ ప్రైస్ 

సర్ ఐజాక్ న్యూటన్, 

చార్లెస్ బాబేజ్ – ఈ గొప్ప సైంటిస్టులు కూడా యేసు ప్రభువు చేసిన అద్భుతాలు నమ్మదగినవి అని చెప్పారు. ఇంతకు ముందు మనం హెబ్రీయులకు వ్రాసిన పత్రిక లో ఒక మాట చూశాము. 

ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,దేవుడు తన చిత్తానుసారముగాసూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను,వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.దేవుడు సూచకక్రియలను, మహత్కార్యములను,అద్భుతములను,ఎందుకు చేశాడంటే, రక్షణ సువార్తను స్థిరపరచడానికే. ఆ గొప్ప రక్షణను మీరు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply