22 వ కీర్తనలో క్రీస్తు, డాక్టర్ పాల్ కట్టుపల్లి

christinpsalm22.png

Christ in Psalm 22, Part 3 (Telugu), by Paul Kattupalli

22 వ కీర్తనలో క్రీస్తు, డాక్టర్ పాల్ కట్టుపల్లి

Part 1

Part 2

22 వ కీర్తనలో దావీదు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ శ్రమలను కళ్లకు కట్టినట్లు చక్కగా వివరించాడు. పండ్రెండు సత్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి.

A Scream

A Snub

A Spectacle

A Slaughter

A Sacrifice

A Sponge

A Spear

A Skeleton

A Shroud

A Synthesis

A Sketch

A Song

A Scream

నా దేవా, నా దేవా నన్నెందుకు చేయి విడచితివి అని యేసు క్రీస్తు సిలువ మీద పెట్టిన కేక

A Snub

వారు ఆయనను తృణీకరించారు

A Spectacle

వారు ఆయనను అపహాస్యం చేశారు

A Slaughter

వారు ఆయనను గాయపరచారు

A Sacrifice

ఆయన మనకోసం తన ప్రాణం అర్పించాడు

A Sponge

ఆయన మనకోసం దప్పిక గొన్నాడు

A Spear

ఆయన మనకోసం పొడవబడ్డాడు

A Skeleton

ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు

A Shroud

ఆయన వస్త్రాల కోసం వారు చీట్లు వేసుకొన్నారు

మిగిలిన మూడు విషయాలు ఈ రోజు చూద్దాం

A Synthesis

A Sketch

A Song

A Synthesis

  1. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి.
  2. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము  చేసెదరు.

ఇక్కడ మొదటగా యూదులు దేవుని స్తుతిస్తున్నారు; ఆ తరువాత అన్య జనులు దేవుని స్తుతిస్తున్నారు. గొప్ప  Synthesis ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఒక గొప్ప కలయిక

యేసు క్రీస్తు సిలువ ద్వారా దేవుడు యూదులను, అన్యులను ఏకం చేస్తున్నాడు. దేవునికి, మనకు మధ్య వున్నవైరం తో పాటు, యూదులకు, అన్యజనులకు మధ్య వున్న వైరం కూడా తీసివేయగల శక్తి యేసు క్రీస్తు సిలువ ద్వారా కలిగింది.

దావీదు ఈ 22 కీర్తన వ్రాసాడు. భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని దావీదు యేసు క్రీస్తు ద్వారా యూదులకు మాత్రమే కాక, అన్య జనులకు కూడా జీవము గల దేవుని ఆరాధించే భాగ్యం కలుగుతుంది.

సువార్త యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు కూడా లభిస్తాయి. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు: భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వ దించబడతాయి. (ఆదికాండము 12:3).

ఆ వాగ్దానం యేసు క్రీస్తునందు నెరవేరింది. గలతీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడయిన పౌలు గారు వ్రాసాడు:

సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెను. (గలతీ 2:8)

దేవుని కృప మనకు ఇక్కడ కనిపిస్తున్నది. యూదులకు సువార్త ప్రకటించటానికి ఆయన పేతురు గారిని సిద్ధపరచాడు. అన్యజనులకు సువార్త ప్రకటించటానికి పౌలు గారిని సిద్ధపరచాడు.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడయిన పౌలు ఎంతో  చక్కగా ఈ కలయికను వివరించాడు.

  1. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
  2. ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత  మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
  3. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,16. తన సిలువవలన

ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

  1. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
  2. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము.
  3. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు

ఎఫెసీ 2: 13 – 19

యేసు క్రీస్తు సిలువ ద్వారా దేవుడు అన్యజనులు, యూదులకు మధ్య వున్న శత్రుత్వాన్ని ఏ విధముగా తీసివేసాడో అపొస్తలుడయిన పౌలు ఇక్కడ ఎంతో  చక్కగా వివరించాడు. యూదులకు, అన్యజనులకు మధ్య ఎంతో శత్రుత్వం ఉండేది, ఇంకా వుంది. ఈ విషయాన్ని రెండు భాగాలుగా మనం చూద్దాం.

మొదటిగా, గతం

దేవుడు యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ద్వారా యూదులు తమ చుట్టూ వుండే అన్యజనులకు వెలుగుగా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. అయితే ధర్మశాస్త్రం వెలుగుగా కాకుండా యూదులకు, అన్యులకు మధ్య ఒక అడ్డుగోడలా మారింది. ధర్మ శాస్త్రం నీడలో యూదులు అనేక సాంప్రదాయాలు, పద్ధతులు ఏర్పరచుకున్నారు.

యేసు క్రీస్తు ఈ లోకములో వున్న రోజుల్లో యెరూషలేములో గొప్ప దేవుని ఆలయం ఉండేది. ఆ ఆలయం ఆవరణలో యూదులకు, అన్యులకు మధ్య ఒక సరిహద్దు ఉండేది. ‘ఈ సరిహద్దు దాటిన అన్యుడికి మరణ శిక్ష ఖాయం’ అనే హెచ్చరిక దాని మీద వ్రాసి ఉంచారు.

అపొస్తలుల కార్యముల గ్రంధం 21 అధ్యాయములో వ్రాయబడిన ఒక సంఘటన మీకు నేను వివరిస్తాను. అక్కడ పౌలు గారు యెరూషలేములో ఒక అన్యజనుడితో కలిసి తిరుగుతూ యూదులకు కనిపించాడు. ఆ తరువాత ఆయన ఒక్కడే దేవుని ఆలయములోకి ప్రవేశించాడు. ఆయన అన్యజనుడిని కూడా ఆలయములోకి తెచ్చాడని వారు పొరబడ్డారు. ‘దేవుని ఆలయములోకి ఒక అన్యుణ్ణి ఎందుకు తెచ్చావురా’ అని ఆయన మీద అరచి, దౌర్జన్యానికి దిగారు. ఆయనను చంపాలని ప్రయత్నించారు. రోమన్ సైనికులు కలుగజేసుకొని పౌలు గారి ప్రాణాలు కాపాడారు. యూదులకు, అన్యులకు మధ్య యెంత ద్వేషం నెలకొని ఉందో  ఈ సంఘటనలో మనం అర్ధం చేసుకోవచ్చు. యూదులు, అన్యులను అంత దూరముగా ఉంచేవారు.

పౌలు గారు ఇక్కడ అన్యులతో ఏమంటున్నాడంటే,  మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసాడు. ఇప్పుడు దేవుని ఇంటిలో మనం ఏకమయ్యాం. క్రీ. శ  70 లో యెరూషలేములో యూదుల ఆలయాన్ని రోమన్లు కూల్చివేశారు. మానవులు కట్టే ఆలయాలు మనుష్యుల్ని విడతీసినాయి. మనుష్యుల మధ్య విరోధాలను, వర్గ పోరాటాలను, వైషమ్యాలను, పగను, ద్వేషాన్ని, హత్యాకాండలను అవి ప్రోత్సహించినాయి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు యేసు క్రీస్తు సిలువ దగ్గరకు రావాలి.

అన్య జనుల యొక్క పాపం, అన్యజనుల యొక్క శాపం, అన్య జనుల యొక్క విగ్రహారాధన, అన్యజనుల యొక్క భక్తిహీనత యేసు క్రీస్తు తీసివేసాడు.

యేసు క్రీస్తు మన సమాధానం Christ Our Peace అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది.

రెండవడిగా, ప్రస్తుతం

యూదులకు, అన్యజనులకు మధ్య నేటి ప్రపంచములో కూడా ఎంతో ద్వేషాన్ని మనం చూస్తున్నాం. ఇరాన్ లాంటి దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని రూపు మాపుతాము అంటూ ప్రతిజ్ఞలు చేస్తావున్నాయి. యూదులకు, అన్యజనులకు మధ్య యెరూషలేములో మాత్రమే కాకుండా ప్రపంచం లో చాలా చోట్ల సమాధానం లేదు. గాజా, వెస్ట్ బ్యాంకు లాంటి ప్రాంతాల్లో పెద్ద గోడలు వీరు తమ మధ్య కట్టుకున్నారు. ఆ మధ్య గోడలు పోవాలంటే ఆ ద్వేషం పోవాలంటే యేసు క్రీస్తు దగ్గరకు, ఆయన సిలువ దగ్గరకు వచ్చి, ఆయన రక్తము చేత కడుగబడి, మారుమనస్సు పొందాలి అని  పౌలు గారు వ్రాసాడు.

గలతీ పత్రిక 3 అధ్యాయములో ఆయన వ్రాసాడు: ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.గలతీ 3:28
A Sketch

కీర్తన 22:31 చూద్దాం.

  1. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి  ప్రచురపరతురు.

ఆయన దీనిని చేసెను – He hath done this

ఇది దేవుడు చేసిన ప్రణాళిక. దేవుడు గీసిన స్కెచ్. 118 వ కీర్తనలో మనం చదువుతాము.

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.కీర్తన 118:24

దేవుడు తన జ్ఞానం చొప్పున ఈ రోజును నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు?  జగత్తు పునాది వేయబడక మునుపే

మొదటి పేతురు పత్రికలో మనం చదువుతాం : అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను. మొదటి పేతురు పత్రిక 1:19,20

He was foreordained before the foundation of the world

అమూల్యమయిన రక్తము చేత మనం విమోచించబడ్డాము . J. R. R Tolkien అని ఒక గొప్ప రచయిత ఉండేవాడు. Lord of the Rings  లాంటి గొప్ప పుస్తకాలు ఆయన వ్రాసాడు. Red Book of Westmarch అనే ఒక ఊహాతీత పుస్తకం ఆయన వ్రాసాడు. ఆ పుస్తకం అన్ని పుస్తకాలకు మాతృక అని ఆయన చెప్పేవాడు. బైబిల్ ని Red Book of God  అని మనం చెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు యొక్క అమూల్యమయిన రక్తం దాని యొక్క ప్రధాన అంశం. దేవుని ప్రణాళికలన్నిటికి అది మాతృక.

పాపం, మరణం, దుర్మార్గం – దేవుడు వీటిని ఎలా జయిస్తాడు? యేసు క్రీస్తు ద్వారా.

ఆయన సిలువ ద్వారా పాపాన్ని జయించాడు;  

ఆయన పునరుద్ధానం  ద్వారా మరణాన్ని జయించాడు;

ఆయన రాకడ ద్వారా దుర్మార్గాన్ని(evil) జయిస్తాడు.

సిలువ లాంటి అంత్యంత క్రూరమయిన శిక్ష నుండి కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చగలడు. విక్టర్ ఫ్రాంకెల్ ‘జీవిత అర్ధం కోసం మనిషి అన్వేషణ’ అనే పుస్తకం వ్రాసాడు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం సమయములో Auschwitz అనే ఒక చాలా కఠిన మయిన చెరలో వుంచబడ్డాడు. అందులో కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు అని ఆ పుస్తకములో వ్రాసాడు. Man’s Search for meaning  ‘జీవిత అర్ధం కోసం మనిషి అన్వేషణ’ అని ఆ పుస్తకానికి పేరు పెట్టాడు. కొన్ని కోట్ల ప్రతులు ఆ పుస్తకం అమ్ముడుపోయింది. దేవుడు మనం వెళ్లే భాధాకరమయిన పరిస్థితులలో కూడా తన చిత్తాన్ని మన జీవితములో నెరవేరుస్తాడు అని ఆ పుస్తకములో ఆయన వ్రాసాడు.

ఒక కాలేజీ విద్యార్థిని ఇటీవల నా దగ్గరకు వచ్చింది. ‘నీకు ఎలా సహాయం చేయగలను’ అని ఆ సోదరిని నేను అడిగాను.  ఆ అమ్మాయి ‘నేను త్రాగుడుకు బానిసనయ్యాను’ అని చెప్పింది. ‘రోజుకు యెంత త్రాగుతావు’ అని నేను ఆమెను అడిగాను. ‘రోజూ సాయంత్రం ఒక ఫుల్ బాటిల్ త్రాగుతాను’ అని చెప్పింది. ‘దాదాపు పది సంవత్సరాలు త్రాగుడుకు అలవాటు పడ్డాను’ అని చెప్పింది. నేను ఆ సోదరికి యేమని చెప్పానంటే, ‘దేవుడు నీ ముందు బంగారం లాంటి భవిష్యత్తు పెట్టాడు. నీ జీవితాన్ని మద్యం మీద వ్యర్థం చేయిబాకు’. మద్యం అనే కాదు, అది ఏ వ్యసనం అయినప్పటికీ, సిగరెట్లు, గంజాయి, హెరాయిన్, ఓపియేట్లు, పోర్నోగ్రఫీ, ఇంకేదయినప్పటికీ – దేవుని ప్రేమ, దేవుని నీతి  మనలను వాటినుండి విడిపిస్తుంది. దేవుడు మన జీవితానికి ఒక ప్లాన్ వ్రాసాడు. ఒక స్కెచ్ గీశాడు. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ క్రింద, పరిశుద్దాత్మ యొక్క అధికారం క్రింద దేవుడు తన ప్రణాళికలను మన జీవితములో నెరవేరుస్తాడు. దేవుని ప్రణాళిక అంటే కొంతమంది భయపడతారు.

‘ఆమ్మో, దేవుని ప్రణాళికా? దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం ఆ తలకాయ నొప్పి నాకెందుకు లేవయ్యా?’ అనే వాళ్ళు చాలా మంది వున్నారు. అయితే దేవుని ఆజ్ఞలు మన మంచికే. అధిక వేగముతో వాహనాలు నడపబాకండి అని చట్టం చేస్తే, ఆ చట్టం ప్రాణాలు కాపాడటానికి ఉద్దేశించినదే.

పది ఆజ్ఞలు మన శ్రేయస్సు కోసం ఇచ్చినవే. దేవుడు నర హత్య  చేయవద్దు అన్నాడు, ఎందు కంటే, మనిషి ప్రాణాలు కాపాడటానికి; దేవుడు దొంగతనం చేయవద్దు అన్నాడు, ఎందు కంటే, మనిషి సంపద కాపాడటానికి; దేవుడు వ్యభిచారం చేయవద్దు అన్నాడు, ఎందు  కంటే, వివాహ వ్యవస్థ ను కాపాడటానికి. కుటుంబ వ్యవస్థను కాపాడటానికే. దేవుని ఆజ్ఞలు మన కంటికి కొన్నిసార్లు కంటగింపుగా ఉండవచ్చు; అయితే అవి మన శ్రేయస్సు కోసం, మన భద్రత కోసం, మన మంచి కోసం ఉద్దేశించినవే.

ఒకసారి నేను టీ తాగుదామని ఒక స్టాల్ లోకి వెళ్ళాను. టీ  ఆర్డర్ చేసాను. టీ ఇస్తా, ఆ స్టాల్ యజమాని, ‘ఫ్రెష్ గా, లడ్డులు చేస్తున్నాను, తింటారా’ అన్నాడు. ‘తీసుకురా’ అని చెప్పాను. రెండు లడ్డులు తెచ్చి నా ముందు పెట్టాడు. మనోడు లడ్డులు ఎలా చేస్తాడో చూద్దాం. అని లోపలికి చూసాను. మనోడు పిండి పిసుకు తున్నాడు, మధ్య, మధ్యలో ఒళ్ళు గోక్కుంటున్నాడు, మళ్ళీ పిండి పిసుకుతున్నాడు. మధ్య, మధ్యలో ముక్కు తుడుసు కొంటున్నాడు. మళ్ళీ పిండి పిసుకుతున్నాడు. చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకొంటున్నాడు, మళ్ళీ పిండి పిసుకుతున్నాడు. ఆ లడ్డులు అక్కడే వదలివేసి, నేను బయటకి వచ్చాను. సబ్బుతో చేతులుకడుక్కో, గ్లోవ్స్ వేసుకో అప్పుడు పిండి పిసుకు. మనం రూల్స్ పెట్టుకొంటాము. ఎందుకంటె పరిశుభ్రత కోసమే. మన ఆరోగ్యం కోసమే. మనకు పరిశుభ్రత యెంత ముఖ్యమో, దేవుని పరిశుద్ధత అంత ముఖ్యం.

పరిశుభ్రత మన శరీరానికి ఆరోగ్యం అయితే, పరిశుద్ధత మన ఆత్మకు ఆరోగ్యం.

A Song

చివరిగా A Song

కీర్తన 22:25 చూద్దాం:

  1. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను. ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. ఈ కీర్తన ఒక పాటతో, ఆరాధనతో ముగుస్తావుంది. ఈ కీర్తన సిలువ శ్రమలతో మొదలయ్యింది. వర్ణనాతీతమయిన క్రీస్తు శ్రమలు ఈ కీర్తనలో మనం చూసాం.

అయినప్పటికీ ఈ కీర్తన ఒక పాటతో ముగించబడినది.  మత్తయి సువార్త 26:30 లో మనం చదువుతాం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి. మత్తయి సువార్త 26:30

మొదటి ప్రపంచ యుద్ధములో ఒక బ్రిటిష్ సైనికుడు పోరాడుచు వున్నాడు. Trench warfare జరుగుతా వుంది. పెద్ద, పెద్ద గోతులు త్రవ్వుకొని సైనికులు యుద్ధములో పోరాడుచూ వున్నారు. ఈ బ్రిటిష్ సైనికుడు ఈ గోతుల్లో ఉండి  ఆ యుద్ధం యొక్క అరాచకత్వం గమనించాడు. చుట్టూ బురద, దోమలు, తుపాకులు, బాంబుల మోతలు, గాయాలతో సైనికులు పెట్టే  కేకలు, వారు ప్రాణాలు కోల్పోతూ చేసే అరణ్య రోదన – వాటిని చూసి ఈ బ్రిటిష్ సైనికుడు చలించిపోయాడు. అప్పటి వరకు ఒక నాస్తికుడు గా వున్న ఈ సైనికుడు ఆలోచించడం ప్రారంభించాడు. యుద్ధం అయిపోయిన తరువాత లండన్ కి రైలు బండిలో వెళ్లుచున్నాడు. దారిలో దేవుని యొక్క ఉనికిని, మంచితనాన్ని గ్రహించాడు. యేసు క్రీస్తును తన రక్షకునిగా నమ్ముకొన్నాడు. ఆయన పేరేంటంటే, C.S.Lewis క్రైస్తవ్యాన్ని సమర్దించి, బలపరచే అనేక పుస్తకాలు C.S.Lewis వ్రాసాడు. . కొన్ని కోట్ల మంది ఆయన వ్రాసిన పుస్తకాలు చదివి మేలుపొందారు. మొదటి ప్రపంచ యుద్ధములాంటి ఘోరమయిన మారణ హోమం లో కూడా దేవుడు తన రక్షణ కార్యాన్ని జరిగించి మంచి చేసాడు.

సిలువ లాంటి ఘోరమయిన శిక్ష నుండి కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. C.S.Lewis, Surprised By Joy  అనే పుస్తకం వ్రాసాడు. దేవుడు ఆయనకు ఆనందం అనుగ్రహించాడు. ఇక్కడ, 22 కీర్తన కూడా భాదతో మొదలయి, ఆనందముతో ముగుస్తావుంది. ఆ ఆనందముతో వారు పాటలు పాడి, దేవుని ఆరాధిస్తావున్నారు. ప్రకటన గ్రంధం 5 అద్యాయములో మనం చూస్తాం. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై  నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని  క్రొత్తపాట పాడుదురు. ప్రకటన 5:6-12

పరలోకములో జరుగుచున్న ఆరాధన ఇక్కడ మనం చూస్తావున్నాం. వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ మనకు కనిపిస్తావుంది. ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసు క్రీస్తే. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లుగా వుంది. సిలువ వేయ బడిన యేసు క్రీస్తు మనకు కనిపిస్తావున్నాడు. ప్రపంచమంతటి నుండి వచ్చిన గొప్ప సమూహం అక్కడ మనకు కనిపిస్తావుంది. వారు ఏమి చేస్తావున్నారంటే, నీ రక్తముతో మమ్ములను విమోచించావు అని ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిస్తావున్నారు.

రక్షించబడిన వ్యక్తి ఆరాదించకుండా ఉండలేడు, ఉండలేదు .

22 కీర్తన మనం ధ్యానించాము.

12 విషయాలు మనం చూశాము.

A Scream

A Snub

A Spectacle

A Slaughter

A Sacrifice

A Sponge

A Spear

A Skeleton

A Shroud

A Synthesis

A Sketch

A Song

యేసు క్రీస్తు సిలువ, రక్షణ ఆనందం, ఆరాధన మనకు ఇక్కడ కనిపించాయి.

మీరు కూడా యేసు క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి, మీ పాపాలు ఒప్పుకొని, రక్షణ ఆనందం పొంది, ఆరాధనలో పాల్గొనాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం.

మీ మిత్రుడు,

పాల్ కట్టుపల్లి

Leave a Reply