Christ in Psalm 23, Telugu, Part 1

23 వ కీర్తన ఈ రోజు మనం ధ్యానిద్దాం.

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

ఇది చాలా ప్రసిద్ధమయిన కీర్తన. ప్రతి ఒక్కరూ దీనిని కంఠస్తం చేస్తే మంచిది. కంఠస్తం చేసే సమయం నాకు లేదు బాబు అనే వారు వున్నారు.

టీచర్ గారు క్లాస్ లో పిల్లలకు పాఠం చెబుతున్నారంట. టీచర్ ఒక విద్యార్థికి ఒక ప్రశ్న వేసాడు. ఒరేయ్ రాజు, సంవత్సరములో 12 నెలలు వున్నాయి కదా.  బాగా చదువుకోవటానికి ఏ నెల మంచిది ?
రాజు లేచి, టీచర్ గారు ఆక్టోబ్రవరి అండి అన్నాడు.
టీచర్ గారికి కోపం వచ్చిందంట. ఆక్టోబ్రవరి నా, ఏంటి తమాషా గా ఉందా? ఆక్టోబ్రవరి అనే పేరుతో ఏ నెలా లేదురా,
రాజు అన్నాడంట, టీచర్ గారు, నా పాయింట్ కూడా అదే కదండీ, చదువు కోవ టానికి ఏ నెల మంచిదంటే ఏమి చెప్పను? అన్నాడంట.

ఆసక్తి లేనప్పుడు ఏ నెలా మంచిది కాదు; ఆసక్తి వున్నప్పుడు ఏ సమయమయినా మంచిదే. బైబిల్ కూడా అంతే; చదవాలని అనిపిస్తే ఏ సమయమయినా మంచి సమయమే. చదవకూడదనుకొంటే ఏ సమయం మంచి ది కాదు. ఉదయాన్నే చదువుదామా? ఇప్పుడు ఏమి చదువుతాము లేబ్బా, న్యూస్ పేపర్ తీసుకురా అనుకొంటాము. సాయంత్రం చదువుదామా? ఇప్పుడు ఏమి చదువుతాము లేబ్బా, కాసేపు TV చూద్దాం అనుకొంటాము.

మొదటి కీర్తనలో మనం చదువుతాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.(కీర్తన 1:2). Vision 2034 లో మనం చేస్తున్నది అదే.  ఇరవై సంవత్సరాల బైబిలు యాత్ర లో మనం వున్నాం.  ఈ జైత్రయాత్ర మరొక 16 సంవత్సరాలు మనం బైబిలు గ్రంధాన్ని పూర్తిగా ధ్యానం చేయబోవుచున్నాము. మీరు కూడా ఈ విజయ యాత్రలో పాల్గోవాలి. కొన్ని ముఖ్యమయిన బైబిలు వాక్యభాగాలు కూడా మీరు కంఠస్తం చేయండి. ఈ వారం మీరు 23 కీర్తన కంఠస్తం చేయండి. మీరు జీవితమంతా గుర్తుపెట్టుకోవలసిన కీర్తన ఇది.

మీరు ఇంట్లోవున్నా, ఆఫీస్ లో వున్నా, హాస్పిటల్ లో వున్నా, ఇంకెక్కడ ఉన్నా, ఏ సమయములో నయినా, ఎక్కడ అయినా మన హృదయాలను ఆదరించి, దీవించే కీర్తన ఇది.

యెహోవా నా కాపరి. The Lord is my Shepherd

బైబిల్ లో ఎంతో  మనోహరమయిన దృశ్యాల్లో ఒకటి కాపరి యొక్క కాపుదల. హేబెలు ఒక కాపరి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు  కాపరులు, మోషే ఒక కాపరి, దావీదు ఒక కాపరి. ప్రవక్తలలో చాలా మంది కాపరులు వున్నారు. చక్రవర్తులు కాపరులుగా పిలువబడ్డారు. యెషయా ప్రవక్త కోరెషు చక్రవర్తిని దేవుని కాపరి అని పిలిచాడు. యేసు ప్రభువు జన్మించినప్పుడు దేవ దూత ఆ శుభవార్తను ముందుగా గొర్రెల కాపరులకు తెలియజేశాడు. పరలోకం నుండి మన మధ్యలోకి ఒక కాపరి వచ్చాడు. ఇంతకు ముందు ఎంతో మంది కాపరులు వచ్చారు. బలహీనులయిన ఆ కాపరులందరిని దేవుడు ప్రక్కన పెట్టి, తానే ఒక కాపరిగా మన మధ్యకు వచ్చ్చాడు. యేసు ప్రభువు నేను గొర్రెలకు మంచి కాపరిని అని తనను తాను పిలుచుకొన్నాడు.

కీర్తన 22,23,24 ఈ మూడు కీర్తనలలో యేసు క్రీస్తు మనకు మూడు రకాలుగా కనిపిస్తున్నాడు.

రక్షకుడు, కాపరి, రాజు

గతం, వర్తమానం, భవిష్యత్తు

ప్రాణం, ప్రేమ, మహిమ

సిలువ, కాపరి కర్ర, కిరీటం

22 కీర్తనలో రక్షకుడిగా, 23 కీర్తనలో కాపరిగా 24 కీర్తనలో రాజుగా కనిపిస్తున్నాడు.

22 కీర్తనలో గతం, 23 కీర్తనలో ప్రస్తుతం,  24 కీర్తనలో భవిష్యత్తు వుంది.

22 కీర్తనలో యేసు క్రీస్తు మనకు తన ప్రాణం ఇచ్చాడు, 23 కీర్తనలో ఆయన మనకు ప్రేమ ఇస్తున్నాడు,  

24 కీర్తనలో ఆయన మనకు ఇవ్వబోయే మహిమ కనిపిస్తున్నది..

 1. వెర్నెన్ మేగీ అనే రచయిత ఏమన్నాడంటే, Cross, Crook, Crown క్రాస్ అంటే సిలువ, క్రూక్ అంటే

కాపరి కర్ర, క్రౌన్  అంటే కిరీటం.

22 కీర్తనలో యేసు క్రీస్తు సిలువతో, 23 కీర్తనలో కాపరి కర్ర తో,  24 కీర్తనలో కిరీటముతో మనకు కనిపిస్తున్నాడు.

రాబోయే రక్షకుడు తన ప్రజలకు ఒక కాపరిగా ఉంటాడు అని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు.

యెహేజ్కేలు 34: వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.నా సేవకుడయిన దావీదు? ఎవరీ దావీదు? దావీదు రాజు చనిపోయిన తరువాత 400 సంవత్సరాల కు యెహెఙ్కేలు ప్రవక్త ఈ మాటలు వ్రాసాడు. అంటే ఈ దావీదు దావీదు రాజు కాదు. ఈయన దావీదు కుమారుడయిన యేసు క్రీస్తు. (యిర్మీయా 30:9; హోషేయా 3:5; జెకర్యా 14:9)

యోహాను సువార్త మొదటి అధ్యాయములో మనం చదువుతాం: ఫిలిప్పు నతనయేలుతో ఏమన్నాడు? ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.

యోహాను 1:45 దావీదు ఈ కీర్తన వ్రాసాడు. దావీదు ఒక కాపరి. ఆయన కుమారుడయిన  యేసు క్రీస్తు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. 45 సెకండ్లలో ఈ కీర్తన చదవొచ్చు.

 1. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
 2. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
 3. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
 4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు.  నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
 5. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు.  నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది.
 6. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

ఈ 23 వ కీర్తనలో ఉన్న ప్రశస్తమయిన సత్యాలను కొన్నింటిని ఈ రోజు మనం చూద్దాం.

కాపరి యొక్క సంబంధం

 1. యెహోవా నా కాపరి,  కీర్తనలు 23:1

The Lord is my shepherd

ఈ కాపరి నా కాపరి

ఈ కాపరి మనతో వ్యక్తిగత సంబంధం పెట్టుకొంటున్నాడు . విశ్వమంతటిని సృష్టించిన దేవుడు మీతో, నాతో వ్యక్తిగతముగా సంబంధం పెట్టుకొంటున్నాడు. ఒక ముఖ్య మంత్రి మనల్ని గుర్తుపెట్టుకోడు. ముఖ్యమంత్రి దాకా ఎందుకు, ఒక MLA మనల్ని గుర్తుపెట్టుకోడు. అయితే సృష్టికర్త మనల్ని గుర్తుపెట్టుకొంటున్నాడు.

కీర్తనలు 100:3 : యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము  ఆయన మేపు గొఱ్ఱెలము.

కీర్తనలు 95:4-6 కూడా చూద్దాం

భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.5. సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.6. ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

యెషయా 43:1: అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలిచే గొప్ప కాపరి. ప్రతి గొర్రెతో వ్యక్తిగత సంబంధం పెట్టుకొనే  గొప్ప కాపరి. ఎంత ప్రశస్తమయిన సత్యం. పైపైన కాకుండా ఈ సత్యాన్ని మనం నిజముగా నమ్మితే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. మనకుండే భయాలు, ఆందోళనలు, అభద్రతలు, సంశయాలు, అవన్నీ ఒక్క క్షణములో మాయమయిపోతాయి. అయితే మనం చేసే పెద్ద తప్పు అదే. యెహోవా నా కాపరి అని గోడల మీద వ్రాసుకొంటాం. కేలండర్ ల మీద వ్రాసుకొంటాం. కారుల మీద వ్రాసుకొంటాం. సమాధుల మీద వ్రాసుకొంటాం. కానీ మన గుండె లోతుల్లో ఆ సత్యాన్ని పూర్తిగా నమ్మం. మనకొక కాపరి ఉన్నాడు అన్న సత్యం మరచిపోతాము. అందుకనే భయం, అభద్రత, ఆందోళన మన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. దావీదు నిర్భయముగా తన జీవితాన్ని ఎదుర్కొన్నాడు, ఎందుకంటే ‘దేవుడు నా కాపరి’ అని నిజముగా నమ్మాడు. పాటలు పాడి, వాయిద్యాలు వాయించి ఊరుకోలేదు. తన హృదయములో ఆ సత్యం నమ్మాడు. ఆ ప్రశ్న మీరు వేసుకోండి: దేవుడు నా కాపరి, మీకు నిజంగా నమ్మకం ఉందా? ఈ గుండెల్లో ఆ నమ్మకం ఉందా? పై పై మాటలు చెబుతున్నారా?

కాపరి యొక్క సమస్తం

యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ కాపరి వద్ద ఉంటే మీకు ఇక ఎటువంటి లోటు ఉండదు. సమస్తం ఆయనే చూసుకొంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా చిన్నతనములో యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు అని నేను చదువుతా ఉండేవాణ్ణి. ‘లేమి’ అనే మాటకు అర్ధం నాకు తెలియదు. ‘లేమి’ అంటే కొరత అని అర్ధం. Dr.Robert C.McQuilkin ఏమన్నాడంటే , ‘The Lord is my shepherd; that’s all I want’

దేవుడు నా కాపరి, నాకు కొరత లేదు.  

యేసు ప్రభువు ఏమన్నాడు?

మత్తయి సువార్త 6:31 : కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.32. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.

ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని విచారించబాకండి, ఆందోళన చెందబాకండి. మీకొక గొప్ప కాపరి వున్నాడు. ఆయన మీకు సమస్తం అనుగ్రహిస్తాడు. అపొస్తలుడయిన పౌలు ఏమన్నాడు?

ఫిలిప్పీయులకు 4:19 : కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈయన భూమ్యాకాశాలను సృష్టించిన గొప్ప కాపరి. తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చే గొప్ప కాపరి.

కాపరి యొక్క సమృద్ధి

 1. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జేయు చున్నాడు

మంచి కాపరి తన గొర్రెలను పచ్చిక ఉన్న స్థలాలకు తీసుకొనివెళ్ళాడు. వాటిని చక్కగా మేపాడు. వాటి ఆకలి తీర్చాడు. ఆ పచ్చిక  బయళ్లలో ఆ గొర్రెలు పండుకొని విశ్రాంతి తీసుకొంటున్నాయి. నా ఇల్లు ఎలా వుంది, నా పొలం ఎలా వుంది, నా వుద్యోగం ఎలా వుంది, నా బ్యాంకు బాలన్స్ ఎలా వుంది, వాటి మీద నా సమృద్ధి ఆధారపడి లేదు.

నా కొక కాపరి వున్నాడు. I have a shepherd

యేసు క్రీస్తు మన సమృద్ధిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈ కాపరి దగ్గర మన ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది. చెడ్డ కాపరుల దగ్గర గొర్రెలకు విశ్రాంతి ఉండదు. యెహెఙ్కేలు గ్రంధం లో కొన్ని వచనాలు చూద్దాం.

యెహోవా సెలవిచ్చున దేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱలను మేపరు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొఱ్ఱెలు పర్వతము లన్నిటి మీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.  యెహేజ్కేలు 34:1-6

చెడ్డ కాపరులు తమ కడుపు నింపుకోవడమే కానీ గొర్రెలను పట్టించుకోరు. వారు భక్షిస్తావున్నారు. మంచి కాపరి చేసే పనులు వారు చేయరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు. వారి దగ్గర వుండే గొర్రెలకు విశ్రాంతి లేదు. అవి చెదరిపోయినాయి. పర్వతాల మీద, కొండల మీద తిరుగులాడుతున్నాయి. అడవి మృగాలకు ఆహారమయి పోతావున్నాయి.

మంచి కాపరి తన గొర్రెలను పచ్చిక  బయళ్లలో మేపుచున్నాడు. అవి పండుకొని విశ్రాంతి తీసుకొంటున్నాయి. కాపరి యొక్క సమృద్ధి వలన వాటికి విశ్రాంతి దొరికింది. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సమృద్ధిలోనుండే మన హృదయాలకు విశ్రాంతి; మన ఆత్మలకు విశ్రాంతి. ఈ రోజు చాలా మందికి విశ్రాంతి లేదు; వారు అటూ ఇటూ పరుగెడుతూ వున్నారు. క్రీస్తు యొక్క సమృద్ధి మీద ఆధారపడకుండా వారు తమ మీద తాము ఆధారపడుచున్నారు. తమ స్వంత ఆలోచనలు, తమ స్వంత నమ్మకాల మీద ఆధారపడుచున్నారు. అందుకనే వారికి నిశ్చయత లేదు, ఆనందం లేదు, విశ్రాంతి లేదు. మత్తయి సువార్త 11 అధ్యాయములో మనం చదువుతాం. యేసు ప్రభువు  ఏమన్నాడంటే,

మత్తయి సువార్త 11:28: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. ఈ కాపరి దగ్గరి విశ్రాంతి వుంది; ఎందు కంటే, మనకు కావాల్సిన పాప క్షమాపణ, నిత్య జీవం, దేవునితో సహవాసం ఆయన దగ్గర సమృద్ధిగా వున్నాయి.

కాపరి యొక్క సమాధానం

శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He leadeth me beside the still waters  

ఈ కాపరి యొద్ద సమాధానం వుంది. శాంతి కరమయిన జలముల యొద్ద ఆయన తన గొర్రెలను నడిపిస్తున్నాడు. మానవ జాతి శాంతి కోసం ఆరాట పడుతూ వుంది. అమెరికా, నార్త్ కొరియా ఇద్దరి దగ్గర అణుబాంబులు వున్నాయి. వీరిద్దరూ శాంతి కోసం ప్రయత్నాలు చేస్తూవున్నారు. ఇంకా అనేక దేశాల మధ్య శాంతి లేదు. నోబెల్ శాంతి బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తానేవున్నారు. శాంతి ఒప్పందాలు చేసుకొంటూనే వున్నారు. అయితే శాంతి లేదు.

ఇంగ్లాండ్ ప్రక్కన ఐర్లాండ్ అని ఒక ద్వీపం వుంది. ఈ ద్వీపం లో వుండే ప్రజలు చాలా కిరాతకంగా చంపుకొంటా వుండేవాళ్ళు. గొడ్డళ్లు తీసుకొని నరుక్కుంటా వుండేవాళ్ళు. ఐదో శతాబ్దములో సెయింట్ పాట్రిక్ ఈ ద్వీపానికి వెళ్ళాడు. యేసు క్రీస్తు దగ్గరకు రండి, మీ ఆయుధాలు ప్రక్కన పెట్టండి అని పాట్రిక్ ఐర్లాండ్ వాసులకు బోధించాడు. ‘ఏంటి, ఆయుధాలు ప్రక్కన పెట్టాలా, ఏంటయ్యా, నువ్వు చెప్పేది?’ అని పాట్రిక్ ని వారు వ్యతిరేకించారు.ఎందుకంటే, హింస లేకుండా బ్రతకలేని సంస్కృతి లో వాళ్ళు ఉండేవారు. పాట్రిక్ వారికి చాలా సంవత్సరాలు యేసు క్రీస్తు సువార్త ను బోధించిన తరువాత వారు మారుమనస్సు పొందారు. తమ ఆయుధాలు ప్రక్కన పడేసి, శాంతి మార్గాన్ని ఎంచుకొన్నారు.

తూర్పు యూరప్ లో గాథ్స్ అనే తెగల ప్రజలు ఉండేవారు. రోమన్ సామ్రాజ్యాన్నే కూలదీసిన చరిత్ర వీరికి వుంది. చాలా క్రూరమయిన మనుష్యులు. Ulfilas, ఊల్ఫీలస్ అనే సువార్తికుడు వీరి దగ్గరకు వెళ్ళాడు. వారి కోసం గాథిక్ భాషలో అక్షరాలు సృష్టించి బైబిలు గ్రంధాన్ని గాథిక్ భాషలోకి అనువాదం చేసాడు. ఈ గాథ్ తెగల  వాళ్ళు యేసు క్రీస్తును నమ్ముకొని తమ హింసను వదిలేశారు. శాంతి మార్గాన్ని ఎన్నుకొన్నారు. యేసు క్రీస్తు శాంతికరమయిన జలముల యొద్ద మనలను నడిపించే కాపరి.

రోమన్ సామ్రాజ్యం గురించి చరిత్ర కారుడు Will Durant యేమని వ్రాసాడంటే, “turned from Caesar preaching war to Christ preaching peace, from incredible brutality to unprecedented charity 

సమాధాన కర్త, The Prince of Peace ఆయన పేరు. (యెషయా 9:6).

మనిషికి, మనిషికి మధ్య సమాధానం ఉండాలంటే, ముందు మనిషికి దేవునికి మధ్య సమాధానం రావాలి. యేసు క్రీస్తు చేసింది అదే. మనిషికి, దేవునికి మధ్య పాపం పెద్ద అగాధాన్ని సృష్టించింది. ఈ పాపం శత్రుత్వాన్ని రగిలించింది. ఈ పాపం దేవుని ఉగ్రతను మన మీదకు తీసుకువచ్చింది. మన కాపరి ఆ ఉగ్రతను భరించాడు.

జెకర్యా గ్రంధములో మనం చదువుతాం: జెకర్యా 13:7

ఖడ్గమా, నా గొఱ్ఱెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము.

మన మీదకు రావాల్సిన ఖడ్గం మన కాపరి మీద పడింది.

బైబిలు వ్యాఖ్యాత Warren Wiersbe వ్రాసాడు, “Under the Law of Moses, the sheep died for the shepherd; but under grace, the Good Shepherd died for the sheep (John 10:1-11)

పాత నిబంధనలో కాపరి కోసం గొర్రెలు చనిపోయినాయి. క్రొత్త నిభందనలో గొర్రెల కోసం కాపరి చనిపోయాడు. ఆ సిలువ నుండి ఇప్పుడు మనకు శాంతి జలాలు, జీవ జలాలు ప్రవహిస్తున్నాయి. యోహాను సువార్త 4 అధ్యాయములో మనం సమరయ స్త్రీ ని చూస్తాం. యాకోబు బావి దగ్గర ఆమె నీరు తోడుకోవటానికి వెళ్ళింది. యేసు ప్రభువు ఆమెతో ఏమన్నాడంటే, ‘ఆ నీరు నీకు సరిపోదు. నిత్య జీవాన్ని నీ కిచ్చే జీవ జలాలు నేను నీకు ఇస్తాను’ అన్నాడు. అప్పటి వరకు ఆమెకు శాంతి లేదు. యెషయా గ్రంధములో మనం చదువుతాం: వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. యెషయా 49:10

ఎండమావులను వెదుకుతూ సమరయ స్త్రీ తన జీవితాన్ని గడిపింది. ఆమె ఆకలి తీరలేదు, ఆమె దప్పిక తీరలేదు. యేసు క్రీస్తు ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ కాపరి దగ్గర సమరయ స్త్రీ శాంతిని పొందింది, నిత్య జీవాన్ని పొందింది. అప్పటి వరకు శాంతి లేకుండా ఆమె తిరుగుతావుంది. యేసు క్రీస్తు ప్రభువు శాంతి కరమయిన జలముల యొద్దకు ఆమెను నడిపించాడు. జీవజలముల యొద్దకు ఆమెను నడిపించాడు.

ప్రకటన గ్రంధం 7 అధ్యాయములో మనం చదువుతాం: ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. ప్రకటన గ్రంథము 7:17

కాపరి యొక్క సంధానం

 1. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు

He restoreth my soul

కాపరి ఆత్మలను restore చేస్తున్నాడు. Restoration జరుగుచున్నది. రెస్టోరేషన్ అంటే తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించటం. సంధానం చేయటం. కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదకుచున్నాడు. పాత నిబంధన మొత్తం దేవుడు చేసింది అదే. ఇశ్రాయేలీయులు బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు యెహెఙ్కేలు ప్రవక్త ద్వారా ఏమన్నాడు?

యెహేజ్కేలు 34

 1. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును 15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు 16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును

గాయపడిన గొర్రెలను మనం ఇక్కడ చూస్తున్నాము. మనం పాపం చేసినప్పుడు మనకు గాయాలవుతాయి. పాపం యొక్క పర్యవసానాలు మనం తప్పించుకొలేము. అయితే దేవుని ప్రేమ ఎలా ఉందో మీరు చూడండి. తప్పిపోయిన, గాయపడిన గొర్రెల కోసం ఆయన వెదుకుచు వచ్చాడు. ఆ గొర్రెలు నశించిన స్థితిలో ఆయనకు కనిపించినాయి (మత్తయి సువార్త 10:6)

యేసు ప్రభువు ఏమన్నాడు?

 1. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను (లూకా 19:10)

మన పాపాల్లో నశించిన గొఱ్ఱెలము మనమే. మనలను వెదకి రక్షించటానికి వచ్చిన కాపరి యేసు క్రీస్తు. కాపరి లేని గొఱ్ఱెలముగా తప్పిపోయిన మనలను చూసి ఆయన కనికరబడ్డాడు.

మార్కు సువార్త 6:34: యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతు లను బోధింప సాగెను.

లూకా సువార్త 15 లో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక కాపరికి 100 గొర్రెలు వున్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయింది. ‘ఒకటిగా, పోతే పోనియ్, ఇంకా 99 గొర్రెలు నాకు వున్నాయి, చాలు’ అని కాపరి అనుకోలేదు. తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం కాపరి వెదుకుకొంటూ వెళ్ళాడు. అది దొరికినప్పుడు దానిని భుజాల మీద వేసుకొని, ఇంటికి వెళ్ళాడు. తన స్నేహితులను, చుట్టుపక్కల వారిని ఇంటికి పిలిచి సంతోషించాడు. తప్పి పోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి సంబరపడ్డాడు.
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. He restoreth my soul

మన ఆత్మలను సంధానం చేసి, దేవునితో అనుసంధానం చేసే కాపరి. 23 కీర్తనను ఈ రోజు మనం ధ్యానించాం.

కాపరి యొక్క సంబంధం, సమస్తం, సమృద్ధి, సమాధానం, సంధానం ల గురించి మనం ధ్యానించాము.

ఈ గొప్ప కాపరి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, మీరు రక్షణ పొందాలి అన్నదే నేటి మా ప్రేమ సందేశం.

డాక్టర్ పాల్ కట్టుపల్లి

Leave a Reply