నిర్గమ కాండము: డాక్టర్ పాల్ కట్టుపల్లి

Egyptmetropolitanmuseum11a.jpg

పరిచయం: ప్రాచీన చరిత్రలో ఐగుప్తు గొప్ప సామ్రాజ్యం. దాని చక్రవర్తి ఫరో క్రింద యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు బానిసత్వములో నలుగుచూ ఉన్నారు. ఆ సమయములో దేవుడు మోషే అనే ఒక సామాన్యుని ఏర్పరచుకొని అతని నాయకత్వములో తన ప్రజలయిన ఇశ్రాయేలీయులకు విడుదల అనుగ్రహించాడు. ఐగుప్తు ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట దేవుడు గొప్ప అద్భుత క్రియలు చేసి తన మహిమను చూపించాడు. ఐగుప్తు మీదకు 10 తెగుళ్లు పంపించాడు. ఎఱ్ఱ సముద్రాన్ని చీల్చి, తన ప్రజలను ఆరిన నేలమీద అరణ్యములోకి తీసుకువెళ్లాడు. 40 సంవత్సరాలు దేవుడు వారి ముందు నడిచాడు. వారి యొక్క భౌతిక, ఆత్మీయ అవసరాలు తీర్చాడు. వారికి తన పరిశుద్ధతను తెలియజేశాడు. వారికి తన ధర్మ శాస్త్రాన్ని ఇచ్చి, నైతిక విలువలు నేర్పి, నీతితో బ్రతకడం నేర్పించాడు. ఒక ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్య నిర్మించి, దేవుడు దానిలో తన ప్రజల మధ్య నివసించాడు.

రచయిత: మోషే

వ్రాయబడిన కాలము: క్రీ. పూ 1450 – 1410

వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము

ముఖ్య అంశాలు:

ఐగుప్తు లో బానిసత్వములో ఉన్న తన ప్రజల బాధ చూసిన దేవుడు

మోషేకు దేవుని పిలుపు

ఐగుప్తు ఎదుట దేవుడు చేసిన అద్భుతాలు

పస్కా పండుగ

ఎఱ్ఱ సముద్రము చీల్చబడుట

ఇశ్రాయేలీయులకు దేవుడు తన ధర్మ శాస్త్రం ఇచ్చుట

ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర

ప్రత్యక్ష గుడారము

ముఖ్య వ్యక్తులు: మోషే, ఫరో, ఫరో కుమార్తె, అహరోను, యెహోషువ, బెసలేలు

మోషే క్రీ.పూ 1525 లో జన్మించాడు. అనూహ్య పరిస్థితుల్లో ఫరో అంతఃపురములో చేరి, ఐగుప్తు సకల విద్యలు నేర్చుకొన్నాడు. ఫరో పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ చరిత్ర కారుల అంచనా ప్రకారం మోషే ఒకటవ తత్మోసు (Thutmose I), రెండవ తత్మోసు (Thutmose II), హత్సేపు సూటు రాణి (Hatshepsut), ఆమెన్ హోటేపు (Amenhotep II) ల క్రింద జీవించి ఉండ వచ్చును.

       క్రీ. పూ 1445 లో ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వము క్రింద ఐగుప్తు విడిచి వెళ్లారు (Exodus). మోషే తన 120 ఏళ్ళ జీవితమును 3 భాగాలుగా జీవించాడు. మొదటి 40 ఏళ్ళు ఐగుప్తు లో రాజ కుమారునిగా పెరిగాడు. రెండవ 40 ఏళ్ళు మిద్యాను అరణ్యములో అనామకునిగా జీవించాడు. మూడవ 40 ఏళ్ళు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయులకు నాయకత్వము వహించాడు. 120 ఏళ్ళ వయస్సులో మోషే నెబో పర్వతము మీద మరణించి, దేవుని చేత సమాధి చేయబడ్డాడు.

గ్రంథ విభజన:

  1. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు (1:1 – 12:30)
  1. ఇశ్రాయేలీయుల జనాభా పెరుగుదల, బానిసత్వము  (1)
  2. మోషేకు దేవుని పిలుపు, శిక్షణ (2,3,4)
  3. ఫరో ఎదుట ఐగుప్తు మీద 10 దేవుని తెగుళ్లు (5 – 11)
  4. పస్కా పండుగ (12)
  1. అరణ్యములో ఇశ్రాయేలీయులు (12:31 – 18:27)
  1. ఐగుప్తు నుండి నిర్గమం (13,14,15)
  2. అరణ్య యాత్ర (16,17,18)
  1. సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీయులు (19:1 – 40:38)
  1. ధర్మ శాస్త్రము అనుగ్రహించుట (19,20,21,22,23,24)
  2. ప్రత్యక్ష గుడారము యొక్క వివరణ (25,26,27,28,29,30,31)
  3. ఇశ్రాయేలీయుల అవిధేయత, విగ్రహారాధన (32)
  4. మోషేకు దేవుని ప్రోత్సాహం (33,34)
  5. ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణం (35,36,37,38,39,40)

ప్రవచనాలు:

  1. ఇశ్రాయేలీయుల విడుదల గురించి మోషేకు దేవుని ప్రవచనం (3:10)
  2. ఐగుప్తు మీదకు తెగుళ్లు వస్తాయి (7-12)
  3. ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడతాడు (15)
  4. పస్కా పండుగ రాబోయే దేవుని గొఱ్ఱెపిల్ల ను సూచించుచున్నది. (యోహాను 1:29)
  5. ప్రత్యక్ష గుడారము రాబోయే దేవుని నరావతారాన్ని సూచించున్నది (యోహాను 1:14)

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

  1. దేవునికి మాత్రమే చెందిన ‘నేను ఉన్నవాడను అను వాడను’ అనే పేరును తనకు అన్వయించుకొని ప్రభువైన యేసు క్రీస్తు తన దైవత్వాన్ని చాటుకున్నాడు (నిర్గమ 3:14; యోహాను 8:12)
  2. మోషే శరీర బానిసత్వం నుండి విడిపిస్తే యేసు క్రీస్తు ఆత్మీయ బానిసత్వం నుండి విడిపిస్తాడు.
  3. ధర్మ శాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృప,  సత్యము యేసు క్రీస్తు ద్వారా లభించినవి (యోహాను 1:17)
  4. ధర్మ శాస్త్రం మన మీదకు తెచ్చిన శాపాన్ని, శిక్షను యేసు క్రీస్తు తన సిలువకు కొట్టివేసాడు (గలతీ 3)
  5. పస్కా బలిపశువు యేసు క్రీస్తును సూచించుచున్నది. (1 కొరింథీ 5:8)
  6. ప్రత్యక్ష గుడారము యేసు క్రీస్తు తెచ్చే విమోచన కార్యమును సూచించుచున్నది (హెబ్రీ 9)
  7. రూపాంతరం కొండ మీద మోషే యేసు క్రీస్తు దర్శనం పొందాడు (మత్తయి 17). మోషే కంటే యేసు క్రీస్తు శ్రేష్ఠుడు. మోషే సేవకుడు, యేసు క్రీస్తు దేవుని ప్రియ కుమారుడు (హెబ్రీ 3)
  8. మోషే అరణ్యములో రాలిపోయాడు, యేసు క్రీస్తు నిత్యం మనలను నడిపించేవాడు (హెబ్రీ 4)
  9. అహరోను యాజక క్రమము కంటే మరి శ్రేష్ఠ మయిన యాజకత్వాన్ని యేసు క్రీస్తు మనకు ఇచ్చాడు (హెబ్రీ 7)

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

  1. బానిసత్వములో మ్రగ్గుచున్న తన ప్రజలను దేవుడు చూసాడు. మీ పరిస్థితులు దేవునికి తెలుసు.
  2. 20 లక్షల మంది ప్రజలను దేవుడు అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడు. ఆయనను నమ్మిన వారి అక్కరలు, అవసరతలు దేవుడు తీర్చుతాడు. దేవుడు మిమ్ములను పోషిస్తాడు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు
  3. తన ప్రజల కోసం దేవుడు అద్భుతాలు చేస్తాడు.
  4. దేవుని ధర్మ శాస్త్రం చదివి ఆయన నీతిని తెలుసుకొని, మనం మన జీవితాల్లో దానిని పాటించాలి.
  5. అరణ్యములో అవిధేయులయిన తన ప్రజలను దేవుడు శిక్షించాడు. దేవుని క్రమ శిక్షణ క్రిందకు రాకుండా మనం జాగ్రత్త పడాలి, విధేయత చూపించాలి.
  6. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో పదే, పదే ఐగుప్తును గుర్తుకుతెచ్చుకొని వాపోయారు. మన హృదయములోనుండి  ఈ లోక ఆకర్షణలను, వాంఛలను మనం తీసివేసు కొంటే మంచిది.
  7. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని పనిలో మనం నమ్మకముగా ఉంటున్నామా?

 

Introduction to Exodus: Paul Kattupalli

 

Leave a Reply