పరిచయం: న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలు దేశము చాలా అల్లకల్లోల పరిస్థితులలో చిక్కుకొంది. దేవుని ఎడల విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఆ రోజుల్లో ఎలీమెలెకు అనే వ్యక్తి బేత్లెహేము నుండి బ్రతుకు తెరువు కోసం మోయాబు దేశము వెళ్ళాడు. అక్కడ ఆయన, ఆయన ఇద్దరు కుమారులు మృత్యువాత పడ్డారు. ఆయన భార్య నయోమి, ఇద్దరు కోడళ్ళు ఓర్పా, రూతు లు అనాథలయ్యారు. వార్తి జీవితాలను చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో నయోమి, రూతులు బేత్లెహేము తిరిగివెళ్ళారు.
పేదరికములో నయోమి, రూతు జీవితాలు ఈడ్చుకొనివెళ్లుచున్నారు. ఒక రోజు పెరిగె ఏరుకొనుటకు వెళ్లిన రూతు కు భూస్వామి బోయజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అడ్డంకులను అధిగమించి బోయజు రూతును వివాహము చేసుకొన్నాడు. పేదరికంలో మ్రగ్గుతున్న ఈ అన్యురాలైన విధవరాలి జీవితములో బోయజు వెలుగులు నింపాడు. దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించాడు. వారి సంతానంలో నుండి దావీదు లాంటి మహారాజులు జన్మించారు. రాబోయే రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు కూడా వారి వంశములోనే జన్మించాడు.
అవిశ్వాసముతో ఇశ్రాయేలు దేశం నిండి ఉన్నప్పుడు నయోమి, రూతు, బోయజులు దేవుని వెంబడించారు. దేవుడు వారి దుర్భరపరిస్థితులను మార్చి వారికి ఆనందాన్ని అనుగ్రహించాడు. ఒక మనోహరమైన ప్రేమ కథను రూతు గ్రంధములో దేవుడు మన కోసం లిఖించాడు.
రచయిత: యూదుల చరిత్ర ప్రకారం సమూయేలు. కానీ ఖచ్చితముగా చెప్పలేము.
వ్రాయబడిన కాలము: సమూయేలు, దావీదుల కాలములో వ్రాయబడి ఉండవచ్చును (క్రీ. పూ 1070 – 970).
వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము
ముఖ్య అంశాలు:
విశ్వాసము: విశ్వాసముతో తనను వెంబడించే వారిని దేవుడు వదిలిపెట్టడు. వారిని తన సన్నిధి, ఆనందముతో నింపుతాడు.
అన్యజనులు: రూతు అన్యురాలు అయినప్పటికీ దేవుడు ఆమె విశ్వాసాన్ని అంగీకరించాడు. యూదులయినా, అన్యులయినా తన వద్దకు వచ్చే వారిని దేవుడు ఆహ్వానిస్తాడు.
నమ్మకత్వము: రూతు-నయోమి లు గడ్డు పరిస్థితులలో కూడా వారి నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదు. కష్టాలను తట్టుకొంటూ ఒకరి కొకరు అండగా నిలబడ్డారు.
మహిళలు: రూతు, ఎస్తేరు – బైబిల్ లో స్త్రీ పేరు మీద ఉన్న రెండు పుస్తకాలు. వీరిద్దరే కాకుండా తనను నమ్మిన ప్రతి మహిళ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరచాడు. పురుషులు అయినా, స్త్రీలు అయినా దేవునికి సమానమే. దేవుడు పక్షపాతి కాడు.
గుణవతి అయిన భార్య: సామెతలు 31 లో వివరించబడిన గుణవతి అయిన భార్య లక్షణాలు రూతులో కనిపిస్తున్నాయి. ఆమె భర్తకు ఆమె మీద నమ్మకము ఉంటుంది, ఆమె సోమరి కాకుండా పనిచేస్తుంది,
తన ఇంటి వారి అవసరాలు పట్టించుకొంటుంది. తన పిల్లలను సంరక్షిస్తుంది.
ప్రేమ: నయోమి, రూతు ల మధ్య అత్తా కోడళ్ల మధ్య ఉండవలసిన ప్రేమ బంధం, బోయజు, రూతుల మధ్య భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ బంధము మనకు కనిపిస్తున్నాయి. వరుడు అయిన యేసు క్రీస్తు కూడా తన వధువు అయిన క్రైస్తవ సంఘమును ప్రేమించాడు.
విమోచన: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రూతును ధనవంతుడైన బోయజు విడిపించాడు. పాపములో నశించిన మనలను యేసు క్రీస్తు విమోచించాడు.
జీవిత పరిస్థితి: నిరాశతో జీవితాలను సాగదీస్తున్న నయోమి, రూతులకు దేవుడు గొప్ప ఆనందాన్ని అనుగ్రహించాడు. మన జీవిత పరిస్థితులను మార్చే శక్తి దేవునికి ఉంది.
ముఖ్య వ్యక్తులు: ఎలీమెలెకు, నయోమి, రూతు, బోయజు, దావీదు
గ్రంథ విభజన:
నయోమి దుఃఖము (1:1-5)
నయోమి, రూతు మోయాబు నుండి బేత్లెహేము కు ప్రయాణం (1:6-22)
రూతు, బోయజు పొలములో కలిసి కొనుట (2)
రూతు, బోయజు ల మధ్య ప్రేమ (3)
రూతు, బోయజు ల వివాహము (4:1-12)
నయోమి ఆనందం (4:13-17)
దావీదు వంశావళి (4:18-21)
ముఖ్య ప్రవచనాలు:
రాబోయే రక్షకుడు బేత్లెహేములో జన్మిస్తాడు. యూదా గోత్రములో దావీదు సంతానంలో జన్మిస్తాడు. దేవుడు తన విమోచన ప్రణాలికను యేసు క్రీస్తు జననమునకు వేల సంవత్సరాల క్రితమే ఆచరణలో పెట్టడము ఇక్కడ కనిపిస్తున్నది. రూతు, బోయజులు ఆ పొలములో కలిసికొనుట దేవుని ప్రవచన కార్యక్రమములో భాగమే. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ కథ కూడా రూతు-బోయజుల ప్రేమ కథ వలె బేత్లెహేములోనే మొదలయ్యింది.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం:
రూతు గ్రంధములో ముఖ్య మైన మాట ‘విమోచించే బంధువు’. హెబ్రీ భాషలో హగ్గోయిల్ (Haggoel). ఇంగ్లీష్ భాషలో The Kinsman-Redeemer. బోయజు రూతుకు విమోచించే బంధువు అయ్యాడు. ప్రభువైన యేసు క్రీస్తు మనకు విమోచించే బంధువు అయ్యాడు. అన్యురాలయిన రూతును బోయజు దేవుని ఇంటిలో చేర్చాడు. దేవునికి దూరముగా ఉన్న మనలను యేసు క్రీస్తు దేవుని ఇంటిలో చేర్చాడు. మోయాబీయులు శాపగ్రస్తులు. మోయాబీయురాలయిన రూతు శాపము నుండి బోయజు ఆశీర్వాదములోనికి వెళ్ళింది. పాపము, శాపముల క్రింద ఉన్న మనకు యేసు క్రీస్తు దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. సంతానము లేని రూతు బోయజుతో పరిణయం తరువాత సంతానము పొందింది. మనము కూడా యేసు క్రీస్తు వలన ఆత్మ సంభందముగా ఫలభరితులము అయ్యాము. పేద ఇంటి రూతు ధనవంతుడైన బోయజు ఇంటికి చేరింది. మనలను ధనవంతులను చేయుటకు ధనవంతుడైన క్రీస్తు పేదవాడు అయ్యాడు. “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” ( 2 కొరింథీ 8:9). యేసు క్రీస్తు ప్రభువు వంశావళిలో రూతు పేరు నమోదు అయ్యింది (మత్తయి 1:5). మనము కూడా యేసు క్రీస్తు సహోదరులము అయ్యాము. రూతును బోయజు విమోచించాడు. మనలను యేసు క్రీస్తు విమోచించాడు. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది (ఎఫెసీ 1:7).
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
-విశ్వాసములేని న్యాయాధిపతుల కాలములో జీవించినప్పటికీ నయోమి, రూతు , బోయజులు దేవుని విశ్వసించి వెంబడించారు. విశ్వాసము లేని నేటి సమాజములో మనం దేవుని పట్ల విశ్వాసం, నమ్మకము కలిగి ఆయనను వెంబడిస్తున్నామా?
-రూతును వివాహము చేసుకొనుటకు బోయజు త్యాగము చేసాడు కానీ కట్న కానుకలు కోరలేదు. నేటి తరములో వివాహ సమయములో, ఆ తరువాత కట్న కానుకల కోసం వధువును వేధించే దురలవాట్లు ఉన్నాయి. ఈ చెడు సాంప్రదాయాలను మనం వదలిపెట్టామా?
-బోయజు రూతు ల మధ్య ఒక పవిత్ర వివాహ బంధము నెలకొంది. వారి మధ్యలో ఒక ప్రేమ సహవాసం మొదలయ్యింది. మనలో వివాహం చేసుకొన్న వారు – భర్తలు, భార్యలు – తమ వివాహములో ప్రేమ, పవిత్రత ఉన్నాయో లేదో పరిశీలించుకొంటున్నామా?
-అత్తా కోడళ్ల ప్రేమ బంధం: కోడళ్లను వేధించే అత్తలు, అత్తలను రాచిరంపాన పెట్టే కోడళ్ళు మన సమాజములో చాలా మంది ఉన్నారు. రూతు తన అత్త నయోమి కోసం తన స్వజనులను త్యాగము చేసి ఆమెకు అండగా ఉంది. నయోమి తన కుమారుని మరణము తరువాత కూడా రూతు యొక్క యోగ క్షేమాలను పట్టించుకొంది. రూతు, నయోమి ల వలే మనం జీవిస్తున్నామా?
Ruth: Introduction by Paul Kattupalli

Please make a donation to our ministry
We are sustained by donations averaging about $20. Only a tiny portion of our readers give. Please support us to keep us online and growing. Thank you.
$20.00