1 సమూయేలు: గ్రంథ పరిచయం

David Slaying Goliath

పరిచయం: సమూయేలు న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా విభిన్న భాద్యతలు నిర్వహించాడు. ఇశ్రాయేలీయుల మొదటి ఇద్దరు రాజులు – సౌలు, దావీదు లను సమూయేలు అభిషేకించాడు. సమూయేలు వృద్ధుడయినప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే వారు డబ్బుకు కక్కుర్తి పడి, లంచ గొండులుగా మారి, అన్యాయము, దురాశలతో  ప్రజలను దోచుకొనే అవినీతి తిమింగలాలుగా మారారు. ఇశ్రాయేలీయులు అప్పుడు సమూయేలు యొద్దకు వచ్చి, ‘సకల జనుల మర్యాద చొప్పున’ మాకు కూడా ఒక రాజును నియమించు అని కోరారు. సమూయేలు వారి విన్నపాన్ని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు, దేవుడు తన హృదయములోని బాధను సమూయేలుతో పంచుకున్నాడు. ‘వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు’ (8:7) అన్నాడు. తానే వారిని పాలించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ప్రజల కోరికను దేవుడు కాదనకుండా వారికి రాజును నియమించే భాద్యతను సమూయేలుకు  అప్పగించాడు. ఇశ్రాయేలు దేశము ‘దైవపాలన’ నుండి ‘రాజ పాలన’ కు మారింది. మానవ రాజ్య పాలన వలన వారికి ప్రయోజనం లేక పోగా నష్టమే కలిగింది.

     ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మొదట్లో మంచి ప్రవర్తన కలిగివున్నప్పటికీ, తరువాత దశలో దేవుని వెంబడించడం మానివేసాడు. అసూయ అతని జీవితాన్ని దహించివేసింది. చివరకు ఆత్మ హత్య చేసుకొని అవమానకరమైన రీతిలో జీవితం నుండి నిష్క్రమించాడు.

     ఇశ్రాయేలుకు అత్యంత గొప్ప రాజు దావీదును దేవుడు సిద్ధపరచాడు. సౌలు క్రోధం నుండి రక్షించుకోవటానికి దావీదు తన ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని పారిపోయాడు. దేవుడు తన బలమైన హస్తము క్రింద దావీదును కాపాడాడు.

రచయిత: మొదటి 24 అధ్యాయాలు సమూయేలు చేత వ్రాయబడి ఉండవచ్చు. ఆయన మరణము (25:1) తరువాత ఇతరులు వ్రాసి ఉండవచ్చు. ఈ పుస్తకాన్ని ఏ మానవ రచయిత  వ్రాసారో మనం ఖచ్చితముగా చెప్పలేకపోయినప్పటికీ ఇది పరిశుద్దాత్ముని చేత వ్రాయబడింది అని మనం రూఢిగా నమ్మవచ్చు.

వ్రాయబడిన కాలము: ‘యూదా రాజుల కాలము’ అని 1 సమూయేలు 27:6 లో వ్రాయబడింది. దీనిని బట్టి ఐక్య ఇశ్రాయేలు దేశము ఉత్తర, దక్షిణ దేశాలుగా విడిపోయిన తరువాత ఈ పుస్తకము వ్రాయబడి ఉండవచ్చు (క్రీ. పూ 931 – 722)

వ్రాయబడిన స్థలము: ఇశ్రాయేలు దేశము

ముఖ్య అంశాలు:

అంకితం: హన్నా తన అభిమాన కుమారుడైన సమూయేలును దేవుని కొరకు ప్రతిష్టించింది. మనం ప్రేమించేవి దేవుని కోసం ఇస్తున్నామా లేక మనకు పెద్దగా ఇష్టం లేనివి దేవునికి పంపిస్తున్నామా?

వేచిచూచుట: సమూయేలు చేత అభిషేకించబడిన తరువాత దావీదు మరో పది సంవత్సరాలు రాజ పీఠం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. దేవుని పనిలో ఓపిక, సహనం ఉండాలి. తొందర పాటు పనికిరాదు.

అసూయ: సౌలు దావీదును చూసి అసూయతో రగిలిపోయాడు. ఇతరులను చూసి అసూయ పడడం మనం మానుకోవాలి. ఇతరుల అభివృద్ధిని, సౌభాగ్యాన్ని హర్షించేవారముగా, ఆహ్వానించేవారముగా మనం ఉండాలి.

స్వార్ధం లేని ప్రేమ: దావీదు తన సింహాసనానికి పోటీ అని తెలిసి కూడా యోనాతాను తన తండ్రి ఆజ్ఞలను సహితం ధిక్కరించి దావీదును ప్రేమించాడు. మన స్వార్ధం చూసుకోకుండా మనం ఇతరులను ప్రేమించగలగాలి.

స్వంత ప్రణాళికలు: సౌలు దేవుని ఆజ్ఞ పాటించకుండా తన స్వంత ప్రణాళికలు తయారుచేసుకొని వాటిని అమలుచేశాడు. చివరకు తీవ్రముగా నష్ట పోయాడు. దేవుని మాట కాకుండా మన స్వంత ప్రణాళికలను పాటిస్తే నష్టపోయేది మనమే.

దేవుని సార్వ భౌమాధికారము: ఏలి, అతని కుమారులు, సౌలు మొదలగు వారు పతనం చెందినప్పటికీ దేవుడు తన అదృశ్య హస్తముతో తన దాసుడైన దావీదును, తన ప్రజలను నడిపించాడు.

ముఖ్య వ్యక్తులు: హన్నా, ఏలి, సమూయేలు, సౌలు, దావీదు, యోనాతాను

గ్రంథ విభజన:

సమూయేలు జననం (1,2)

సమూయేలుకు దేవుని పిలుపు (3)

సమూయేలు పరిచర్య (4-8)

సౌలు అభిషేకము (9-10)

సౌలు అధికారం (10-12)

సౌలు అవిధేయత (13-15)

దావీదు అభిషేకము (16)

దావీదు గొల్యాతు మీద విజయం (17)

దావీదు యోనాతాను స్నేహం (18)

దావీదు సౌలు నుండి పారిపోవుట (19-30)

సౌలు ఆత్మ హత్య (31)

ముఖ్య ప్రవచనాలు:

1 సమూయేలు 2:1-10: ‘మాసియాక్’ అనే హెబ్రీ పదము మొదటిసారి వాడబడింది. అంటే ‘మెస్సియ’, రాబోయే రక్షకుడు.

ప్రభువైన యేసు క్రీస్తు రూపం:

దావీదు జీవితం మొదలగుట ఈ పుస్తకములో చదువుతాము. ప్రభువైన యేసు క్రీస్తు దావీదు కుమారుడు అని పిలవబడ్డాడు. దావీదు దేవునిచేత ఎన్నుకోబడ్డాడు. యేసు క్రీస్తు దేవుని చేత పంపబడ్డాడు. సౌలు రాజు దావీదు ప్రాణాలు తీయాలని చూసాడు. హేరోదు రాజు యేసు క్రీస్తు ప్రాణాలు తీయాలని చూసాడు. దావీదు అనుచరులు సన్నిధిలోని రొట్టెలు తిన్నారు (1 సమూయేలు 21). యేసు క్రీస్తు శిష్యులు విశ్రాంతి దినమున వెన్నులు త్రుంచి తిన్నారు. దావీదు గొల్యాతును జయించాడు. యేసు క్రీస్తు మరణాన్ని జయించాడు. దావీదు తో దేవుడు నిబంధన చేసాడు. ఆ నిబంధన యేసు క్రీస్తులో నెరవేర్చాడు. దావీదు అనేక  ప్రవచన కీర్తనలు వ్రాసాడు, ఆ ప్రవచనాలు యేసు క్రీస్తు నెరవేర్చాడు.

మనం నేర్చుకోవలసిన పాఠాలు:

15:22: ‘తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పిం చుటవలన ఆయన సంతోషించునా?’ మనం ఇచ్చే కానుకలు కంటే మనం చూపించే విధేయతే దేవుని హృదయాన్ని సంతోషింపజేస్తుంది.

సమూయేలు న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా విభిన్న భాద్యతలు నిర్వహించాడు. దేవుడు నిన్ను అనేకరకాలుగా తన సేవలో వాడుకొనవచ్చునని గ్రహించావా?

‘సకల జనుల మర్యాద చొప్పున’ (1 సమూయేలు 1:5):  మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీయులు దేవుని కోరారు. అది దేవుని హృదయాన్ని బాధించింది (1 సమూయేలు 8:7-9). ఇతరుల వలె ఉండాలని సాతానుడు క్రైస్తవులను ఎప్పుడూ ఒత్తిడిచేస్తాడు . ఆ ఒత్తిడిని తట్టుకొని సత్యం కొరకు, దేవుని కొరకు ప్రత్యేక జనాంగముగా మనం ఉండాలి.

ఏలీ, ఆయన కుమారులు పాపము చేసి మృత్యువాత చెందారు. పాపము వలన వచ్చు జీతము మరణము అని మనం అర్ధం చేసుకోవాలి.

1 సమూయేలు 6:19: బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూసి మృత్యువాత చెందారు. దేవుడు, ఆయన వస్తువుల పట్ల గౌరవము ఉండాలి. అజాగ్రత్తగా, మనకిష్టం వచ్చినట్లు ఆయన సన్నిధిలో ప్రవర్తించకూడదు.

సౌలు దేవుని చేత ఎన్నుకోబడినప్పటికీ అవిధేయతతో దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. అవిధేయత వలన మనం దేవుడు మనకొరకు ఉద్దేశించినవి ఎన్నో కోల్పోతాము.

Introduction to First Samuel by Dr.Paul Kattupalli

Please make a donation to our ministry

$25.00

Leave a Reply