గెలాపగోస్ దీవుల పక్షులు, జంతువులు డార్విన్ సిద్ధాంతమును ఎలా నీరు కార్చుతాయి?

    ఈ దీవులలో, వాటి చుట్టూ ఎన్నో జాతుల పక్షులు మనకు కనిపిస్తాయి. సముద్రములోని పరిస్థితులకు, దీవుల మీద పరిస్థితులకు ఇవి అలవాటు పడ్డాయి.1835 లో చార్లెస్ డార్విన్ ఈ దీవులకు వచ్చినప్పుడు ఆయన పక్షులను అధ్యయనము చేయుటకు కొన్ని రోజులు కేటాయించాడు. దీవులలో పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. వాటి ప్రభావము వలన ఈ పక్షులు ఏ విధముగా జీవ పరిణామము చెందాయో డార్విన్పరిశీలించాడు.

    ఈ దీవులలో పక్షులు ఎంతో విస్తరించాయి. మనము హోటల్ లో కూర్చుంటే, మన టేబుల్స్ మీద, ప్లేట్ ల మీద అవి వాలుతూ ఉంటాయి. దీవుల మధ్య వందల మైళ్ళు అవి ఎగురుచూ ప్రయాణిస్తాయి. సముద్ర తీరాల్లో నడుచుకొంటూ నేను కొన్ని పక్షులను చూశాను. సముద్రపు తరంగాలు తెచ్చే చేపలు, విత్తనాలను ఇవి ఆహారముగా తీసుకొంటాయి. దీవుల యొక్క అడవులలోనేను కొన్ని రోజులు ఈ పక్షులను పరిశీలించాను.

   ఈ ప్రాంతములో అనేక డార్విన్స్ ఫించేస్ (డార్విన్ చిన్న పక్షులు) లను నేను చూశాను.అవన్నీ ఒకే ప్రాంతములో నివసిస్తున్నప్పటికీ అవి అనేక మార్పులకు గురయ్యాయి. నాకు కుడిప్రక్క పక్షులకు పొడుగాటి ముక్కులు ఉంటే, ఎడమ ప్రక్క పక్షులకు పొట్టి ముక్కులు ఉన్నాయి. ఈ పక్షులలో జరిగిన జీవ పరిణామము చూసే డార్విన్ తన సిద్ధాంతాన్ని వ్రాసాడని మనము వింటుంటాము. అనేక మంది ఇక్కడ రీసెర్చ్ చేయుటకు వస్తారు. వీరిలో ముఖ్యలు పీటర్ అండ్ రోజ్ మేరీ గ్రాంట్. ఈ దంపతులు డాఫ్ని మేజర్ అనే దీవి మీద ఉండే పక్షులను అధ్యయనం చేస్తున్నారు. ఆ దీవిని కూడా చూద్దాము. ఒక బోటులో బయలుదేరి నేను డాఫ్ని మేజర్ దీవికి వెళ్ళాను. ఈ దీవి శాంటా క్రజ్ దీవికి దగ్గరలో ఉంటుంది. దాని మీద చెట్లు కనిపించవు. ఈ దీవి చిన్నది. ఒక కిలో మీటరు పొడుగు, 120 మీటర్లు ఎత్తు ఉంటుంది.

    ఈ దీవుల మీద డార్విన్ ఫించెస్ తో పాటు ఫ్రీ గేట్ పక్షులు, బ్లూ ఫుటెడ్ బూబీలు, మార్టినిలు మనకు కనిపిస్తాయి. గెలాపగోస్ దీవులలో సేకరించిన పక్షులను డార్విన్ ఇంగ్లాండ్ దేశానికి తీసుకువెళ్లాడు. ఆ పక్షులను జాన్ గూల్డ్ అనే శాస్త్రవేత్త పరిశీలించి ఏ జాతి పక్షి ఏ విధముగా మార్పు చెందిందో తెలియజేశాడు.మోకింగ్ బర్డ్ విషయానికి వస్తే ఆ పక్షి మూడు దీవుల్లో మూడు రకాలుగా మారింది అని జాన్ గూల్డ్ తెలియజేశాడు. జీవులలో మార్పు జరుగదు అని ఆ రోజుల్లో ప్రజలు భావించేవారు. వాటిలో మార్పు జరుగుతుంది అని తెలుసుకొని నప్పుడు డార్విన్  కి గొప్ప కనువిప్పు కలిగింది. ఆయన డార్విన్ ఫించెస్ అనే చిన్ని పక్షులను కూడా సేకరించాడు. దక్షిణ అమెరికా నుండి ఒక జాతి పక్షి గెలాపగోస్ దీవులకు వచ్చింది. అది 13 జాతులుగా ఈ దీవులలో పరిణామము చెందిది అని డార్విన్, అతని అనుచరులు ప్రతిపాదించారు.

    ప్రిన్స్  టన్ యూనివర్సిటీ కి చెందిన పీటర్ గ్రాంట్, ఆయన భార్య రోజ్ మేరీ గ్రాంట్ గత 30 సంవత్సరాలుగా డాఫ్ని మేజర్ దీవి మీద రీసెర్చ్ చేస్తున్నారు. వీరు డార్విన్ ఫించెస్ పక్షుల మీద వారి రీసెర్చ్ ని కేంద్రీకరించారు. ఈ డాఫ్ని దీవి మీద 4 జాతుల డార్విన్ ఫించ్ పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల యొక్క ముక్కులు రకరకాల సైజులలో ఎందుకు ఉన్నాయో తెలుసుకోవాలన్నదే వారి యొక్క రీసెర్చ్ ప్రధానాంశము.

    1973 లో ఈ దంపతులు ఈ దీవికి వచ్చినప్పుడు ఇక్కడ కరువు వచ్చింది. ఆ కరువు వలన పక్షులలో 85 శాతము చనిపోయినవి.1975 నుండి 1978 వరకు వర్షపాతము దాదాపుగా లేదు. ఆ సమయములో పక్షుల యొక్క ముక్కు సైజు చాలా తొందరగా మారిపోయింది. కరువు వలన పక్షులన్నీ చిన్న చిన్న మెత్తని గింజలను తినివేశాయి. అప్పుడు పెద్ద గింజలు మాత్రమే మిగిలాయి. అవి గట్టిగా ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద గింజలు, ఈ గట్టి గింజలు… వాటిని తినగలిగిన పక్షులు మాత్రమే బ్రతికినవి. వాటిని తినలేనివి చనిపోయినవి.పెద్ద, పెద్ద గింజలు పగుల గొట్టి తినే శక్తి పెద్ద పెద్ద ముక్కులు ఉన్న పక్షులకు మాత్రమే ఉంది. చిన్న చిన్న ముక్కులు గల పక్షులకు ఆ శక్తి లేదు. అందువలన ఆ చిన్ని ముక్కులు గల పక్షులు అంతరించిపోయినవి. పెద్ద పెద్ద ముక్కులు గల పక్షులు జీవించి కరువును తట్టుకొన్నాయి. వాటి సంతానానికి కూడా ముక్కులు పెద్దగా ఉన్నాయి. 1978 కల్లా పక్షుల యొక్క ముక్కు సైజు పెరిగింది.

    1983 లో మళ్ళీ వర్షాలు బాగా పడటం మొదలయ్యింది. అప్పుడు పంటలు బాగా పండినవి. చిన్ని చిన్ని గింజలు, మెత్తగా ఉండే గింజలు విపరీతముగా పెరిగినవి. ఆ సమయములో చిన్ని చిన్ని గింజలు తినగలిగిన పక్షులు బ్రతికినవి. అంటే చిన్ని చిన్ని ముక్కులు గల పక్షులు ఆ పరిస్థితిలో విస్తరించాయి. పెద్ద ముక్కులు ఉన్న పక్షులకు ఆ పరిస్థితి ఇబ్బందిగా మారింది. చిన్ని చిన్ని గింజలు తినలేక అవి కష్టాలు పడ్డాయి, వాటి సంఖ్య తగ్గిపోయింది.చిన్ని, చిన్ని ముక్కులు గల పక్షులు చిన్ని చిన్ని గింజలు తిని విస్తరించినవి.అంటే, కరువు వచ్చినప్పుడు పెద్ద ముక్కులు గల పక్షుల సంఖ్య పెరిగింది. వర్షాలు వచ్చి, పంటలు పండినప్పుడు చిన్ని చిన్ని ముక్కులు గల పక్షుల సంఖ్య పెరిగింది. గ్రాంట్ దంపతులు కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఆ మార్పులు గమనించారు. పక్షుల యొక్క ముక్కుల సైజు పెరగటం, తగ్గటము వాళ్ళ కళ్లెదుటగానే జరిగింది. డార్విన్ వాదులు ఏమన్నారంటే, జీవ పరిణామము ఎంతో వేగముగా జరుగుతున్నది కాబట్టి కేవలము 200 సంవత్సరాల్లోనే ఒక జాతి మరొక జాతిగా మారుతుంది. డార్విన్ ఈ దీవులకు వచ్చి దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ క్రొత్త జాతులు ఏమీ పుట్టలేదు. కరువు వస్తే ముక్కు సైజు పెరగటం, వర్షాలు వస్తే ముక్కు సైజు తగ్గటం అది ఒక వలయము వలె ఉంది, స్ట్రెయిట్ లైన్ లాగా జీవపరిణామము ఇక్కడ జరుగుట లేదు. ఈ పక్షులు పక్షులు గానే ఉన్నాయి కానీ ఏనుగులో, పులులో, సింహాలో అయిపోలేదు.

   డార్విన్ ఇక్కడకు వచ్చినప్పుడు 13 జాతుల ఫించెస్ పక్షులు ఈ దీవులలో ఉంటే, ఈ రోజు కూడా 13 జాతుల ఫించెస్ పక్షులే ఉన్నాయి. డార్విన్ వాదులు ఈ రోజు యేమని ప్రచారము చేస్తున్నారు? ఈ ఫించెస్ పక్షులను చూడండి. జీవ పరిణామము జరిగింది అనుటకు ఈ పక్షులే ఆధారము. ఒక జాతి జంతువులు మరొక విభిన్న జాతిగా కాలముతో మారిపోతాయి అనుటకు ఇదే సాక్ష్యము అని వారు అంటున్నారు. అయితే మీరు గమనించండి. డార్విన్ వాదానికి ఈ పక్షులలో ఎలాంటి ఆధారము లేదు. వాస్తవానికి ఈ పక్షులు డార్విన్ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపిస్తున్నాయి. వాటి సైజు పెరగటం, తగ్గటం, పెరగటం, తగ్గటం అలా కొద్ది పాటి మార్పులే జరుగుతున్నాయి కానీ క్రొత్త, క్రొత్త జాతులు ఆవిర్భవించలేదు.

    ఇక్కడ అనేక ఇగ్వానా లు కూడా మనకు కనిపిస్తాయి.ఇవి పెద్ద పెద్ద బల్లులు లాంటి జంతువులు. ఇవి చూడటానికి భయంకరముగా ఉంటాయి. ఈ దీవులలో ఉండే పరిస్థితులకు అవి ఎంతో చక్కగా మార్పులు చెందాయి. ఇంతకు ముందు అడాప్టివ్ రేడియేషన్ గురించి మనం చెప్పుకొన్నాము. జీవులలో వాటి యొక్క పరిస్థితులను బట్టి కలిగే మార్పులను అడాప్టివ్ రేడియేషన్ అని పిలుస్తాము. ఈ ఇగ్వానా లు గెలాపగోస్దీవులలో అనేక మార్పులకు గురైనాయి. ఒకొక్క దీవిలో ఒక్కొక్క రకము ఇగ్వానాలను మనము చూస్తాము. ఇవి చూడటానికి వికృతముగా కనిపించినా ఇవి సాధుజీవులు. శాఖాహారం తీసుకొంటాయి.ఇవి భూజంతువులుగా, నీటి జంతువులుగా మార్పు చెందినాయి. నీటిలో జీవించే వాటిని మెరైన్ ఇగ్వానా లు అని పిలుస్తున్నాము.సముద్రములో జీవించే ఏకైక బల్లి ఇదే.ఇవి 44 రకాలుగా మార్పు చెందినాయి.వాటియొక్క నల్లచర్మము వేడిని పీల్చుకొనుటకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే చల్లటి నీటిలో ఈదిన తరువాత ఈ వేడి వాటికి వెచ్చదనం ఇస్తుంది.వాటి తల మీద తెల్లని ఉప్పు పేరుకుపోయి మనకు కనిపిస్తుంది.అవి సముద్రములో ఉండుట వలన వారి శరీరాల్లోకి ఎంతో ఉప్పు చేరుతుంది. ఆ ఉప్పు ను రక్తము నుండి, శరీరమునుండి బయటికి పంపుటకు ఇగ్వానాలకు ప్రత్యేకమైన గ్రంథులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇగ్వానా లు చూడటానికి వికృతముగా ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క గొప్ప జ్ఞానము వాటిలో మనము చూస్తున్నాము. ఏ జీవికి కావలసిన గ్రంధులు దేవుడు ఆ జీవిలో పెట్టాడు.

   ఈ దీవులలో నాకు ఆసక్తి కలిగించిన మరొక జంతువు తాబేలు. ప్రపంచములోనే అతి పెద్ద తాబేళ్లను నేను ఇక్కడ చూశాను. ఇవి 170-180 సంవత్సరాలు జీవిస్తాయి. అంటే చార్లెస్ డార్విన్ ఇక్కడకు వచ్చి చూసిన తాబేళ్లలో కొన్నిటిని మనము ఇక్కడ ఇప్పుడు కూడా చూడవచ్చు. డార్విన్ తనతో పాటు కొన్ని తాబేళ్లను ఇంగ్లాండ్ దేశమునకు తీసుకువెళ్లాడు. గెలాపగోస్ దీవులలో 7 దీవులలో ఈ తాబేళ్లను మనము చూస్తాము.స్పానిష్ భాషలో గెలాపగోస్ అంటే తాబేలు అని అర్ధము. ఒక దీవిలో తాబేళ్లకు మరొక దీవిలో తాబేళ్లకు రూపములో తేడాలు ఉన్నాయి. ఎత్తయిన దీవులలో తాబేళ్లు సైజులో పెద్దగా ఉన్నాయి.వాటి వీపు మీదఉండే చిప్ప బలముగా గుండ్రముగా ఉంటుంది. దిగువన ఉండే దీవులలో తాబేళ్ల సైజు చిన్నగా ఉంది.వాటి వీపు మీద వుండే చిప్ప టోపీ ఆకారములో ఉంది. తాబేలు వీపు మీద ఉన్న చిప్పను చూసి అది ఏ దీవికి చెందినదో చెప్పవచ్చు. చార్లెస్ డార్విన్ ఈ దీవులు సందర్శించినప్పుడు ఇక్కడ గవర్నర్ ఆయనతో ఏమన్నాడంటే, ‘తాబేలు రూపము చూసి అది ఏ దీవికి చెందినదో మేము చెప్పగలము’. ఒక్క ఇసబెలా దీవి మీదే 5 రకాల తాబేళ్లు కనిపిస్తాయి. అవి అగ్ని పర్వతాలు, లావా భూములలో వేరు చేయబడిఉన్నాయి. ఒక్క దీవిలోని తాబేలు లాంటి జంతువు ఏ విధముగా మార్పు చెందుతుందో మనము ఇక్కడ చూస్తున్నాము.     దాదాపు 15 జాతుల తాబేళ్లు ఈ దీవులలో మనకు కనిపిస్తాయి. కొన్ని అంతరించిపోగా ఇప్పుడు 11 జాతులు మాత్రమే జీవిస్తున్నాయి.అడాప్టివ్ రేడియేషన్ తాబేళ్లలో కూడా మనము చూస్తున్నాము. ఎత్తైన ప్రదేశాల్లో ఉండే తాబేళ్లు పెద్ద సైజులోకి మారినాయి. దిగువ ప్రదేశాల్లో వుండే తాబేళ్లు తక్కువ సైజులో వున్నాయి.వాటి వీపు మీద వున్న చిప్ప రూపము, సైజు కూడా మారుతూ ఉంది. ఇవి శాఖాహారులు. గడ్డి, కాక్టస్ చెట్లు, బెర్రీ కాయలు, ఆరంజి కాయలు తిని ఇవి బ్రతుకుతాయి. ఇవి నీరు లేకుండా, ఆహారము లేకుండా ఒక సంవత్సరము దాకా జీవించగలవు. ఇప్పుడు ఈ దీవుల మీద తాబేళ్లను ఉత్పత్తి చేసి వాటి సంఖ్యను అభివృద్ధి చేస్తున్నారు.

   గాలాపగోస్ చుట్టూ పసిఫిక్ మహా సముద్రము ఉంది. ఈ సముద్రములో ఉండే జీవుల్లో జీవ పరిణామము ఎలా జరిగిందో మనము కొంత సేపు చూద్దాము. ఇక్కడ సముద్ర తీరాల్లో సీ లయన్ లను కూడా నేను చూశాను. ఒక చక్కటి సీ లయన్ సముద్రము ఒడ్డున పరుగెత్తడము ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక్కొక్కటి దాదాపు 200 కేజీల బరువు ఉంటుంది.గెలాపగోస్ దీవులు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ధ్రువ ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.అనేక ప్రాంతాలలో ఇవి అనేక రకాలుగా మనకు కనిపిస్తాయి.సముద్రములో 10-15 కిలోమీటర్లు ఇవి ఈదగలవు.  చేపలు వీటికి ప్రధాన ఆహారము. ఎల్ నినో ప్రభావము వాతావరణములో మార్పుల వలన చేపలు తగ్గిపోయినప్పుడు సీ లయన్ ల శరీరము సైజు కూడా తగ్గుతుంది.వాతావరణములో మార్పుల వలన డార్విన్ ఫించెస్ పక్షుల సైజు తగ్గడం, పెరగడం మనం చూశాము.అదే మార్పు సీ లయన్ లలో కూడా మనము చూస్తున్నాము.

    శాంటా క్రజ్ ద్వీపము, షాన్ క్రిస్టోబల్ ద్వీపముల దగ్గర పసిఫిక్ సముద్రములో కొన్ని షార్కు చేపలను కూడా నేను దగ్గరగా గమనించాను. ఈ షార్కులు మనుష్యుల మీద దాడి చేసి గాయపరచిన సందర్భాలు ఉన్నాయి. వీటికి దగ్గరగా ఈత వేసే తప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.ప్రత్యేకమైన దుస్తులు వేసుకొని, నీళ్లల్లో కూడా వీడియోలు తీయగలిగే GoPro కెమెరా తీసుకొని నేను వీటి మధ్యలోకి వెళ్ళాను. అంత దగ్గరగా షార్క్లను చూడడము నాకు ఒక గొప్ప అనుభూతి కలిగించింది. దాదాపు 37 జాతుల షార్క్ లను మనం గెలాపగోస్ ద్వీపాల చుట్టూ చూడగలము.  ఈ షార్క్ ల శరీరము ఎముకలతో కాకుండా కార్టిలేజ్ తో  చేయబడింది. అందుకనే అవి తమ శరీరాన్ని సుళువుగా మెలికలు తిప్పుకొంటూ ఈదగలవు. ఈ షార్క్ లలో కూడా అడాప్టివ్ రేడియేషన్ మనము చూడగలము. సముద్రములో పరిస్థితులనుబట్టి ఒక జాతి షార్క్ అనేక జాతులుగా మారుతున్నాయి.

They are not Darwin’s finches, they are God’s finches.

ఒక రోజు నేను శాన్ క్రిస్టోబల్ దీవిలో  ఇంటెర్ప్రెటేషన్ (interpretation) సెంటర్ కి వెళ్ళాను.  interpretation…మనము దేనినైనా గమనిస్తే దానిని ఏ విధముగా అర్ధము చేసుకొంటాము? ఈ గెలాపగోస్

దీవులలో డార్విన్ అనేక విషయాలు చూశాడు. ఆయన వాటిని ఎలా ఇంటర్ప్రెట్ చేశాడు? తాను చూసిన వాటిని ఎలా అర్ధము చేసుకొన్నాడు?

పక్షుల ముక్కులు చూశాడు. అవి అనేక సైజులలో ఉండడము గమనించాడు.

తాబేళ్లను చూశాడు. అవి అనేక సైజులలో ఉండడము చూశాడు.

ఇగ్వానాలను చూశాడు. అవి అనేక సైజులలో ఉండడం గమనించాడు.

మార్పు జరిగింది. అయితే ఆ మార్పు కి ఒక హద్దు ఉంది.

డార్విన్ చేసిన మోసము ఏమిటంటే – మార్పులకు హద్దు ఉండదు అన్నాడు.

    చిన్న చిన్న మార్పులే కాలక్రమేణా పూర్తి విభిన్న జంతువులను సృష్టిస్తాయి అన్నాడు. అయితే ఆ సిధ్ధాంతానికి ఈ గెలాపగోస్ దీవులలో కానీ ప్రపంచములో మరెక్కడా ఆధారాలు లేవు. డార్విన్ గమనించిందే నేను గమనించాను.ఒకే జాతి పక్షులలో కొన్నిటి ముక్కు పొడవుగా ఉంది, కొన్నిటి కుక్కు పొట్టిగా ఉంది.

190 ఏళ్ళ క్రితము డార్విన్ చూసిన డార్విన్ ఫించెస్ పక్షులు పక్షులుగానే ఉన్నాయి.

ఆయన చూసిన తాబేళ్లు తాబేళ్ళుగానే ఉన్నాయి.

ఆయన చూసిన ఇగ్వానా లు ఇగ్వానాలు గానే ఉన్నాయి.

ఆయన చూసిన సీ లయన్ లు సీ లయన్ లు గానే ఉన్నాయి.

ఆయన చూసిన షార్క్ లు షార్క్ లు గానే ఉన్నాయి.

డార్విన్ చెప్పినట్లు ఒక జాతి జంతువులు క్రొత్త జాతిని సృష్టించడము మనకు కనిపించడము లేదు.

    డార్విన్ సిద్ధాంతములో సృష్టికర్త లేడు. అందులో సృష్టికర్త ఈ ప్రపంచాన్ని పట్టించుకోడు. బైబిల్ దానిని ఒప్పుకోదు. మన సృష్టికర్త మనలను పట్టించుకొనే దేవుడు. డార్విన్ సిద్ధాంతములో మానవ జన్మ ఒక ఆక్సిడెంట్. దేవుడు యిర్మీయాతో నీ తల్లి గర్భములో నువ్వు రూపింప బడకమునుపే నువ్వు నాకు తెలుసు

అన్నాడు. డార్విన్ సిద్ధాంతములో దేవుడుకి మన గురించి ఏమీ తెలియదు.

యేసు ప్రభువు ఏమన్నాడు? మీ తలవెండ్రుకలు లెక్కించబడినవి.

మన తల మీద ఎన్ని వెండ్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు.

   డార్విన్ ఫించెస్ పక్షులను మనము ఈ దీవులలో చూశాము. డార్విన్ సిద్ధాంతములో ఆ పక్షులకు సృష్టికర్త లేడు, దేవుడు లేదు, పోషకుడు లేడు, సంరక్షకుడు లేడు.

యేసు ప్రభువు యేమని చెప్పాడు?

మత్తయి సువార్త 10:29 – 31

రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా;

అయినను మీ తండ్రి సెలవు లేక

వాటిలో ఒకటైనను నేలను పడదు.

మీ తలవెండ్రుకలన్నియు

లెక్కింపబడియున్నవి

గనుక మీరు భయపడకుడి;

మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.

 

   డార్విన్ సిద్ధాంతములో పిచ్చుకలకు సృష్టికర్త లేదు. ప్రకృతి కరుణిస్తే అవి బ్రతుకుతాయి.ప్రకృతి ప్రతికూలంగా మారితే అవి చనిపోతాయి. వాటికి సంరక్షకుడు లేడు. అయితే యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఆ పిచ్చుకలకు సంరక్షకుడు ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి వాటికి ఆహారము ఇస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్క పిచ్చుక కూడా నేల మీద పడదు. దేవుని దృష్టిలో ఆ పిచ్చుకల కంటే మీరు ఎంతో విలువైన వారు. మీ తల ఉండ్రుకలు దేవుడు లెక్కపెట్టాడు.కాబట్టి భయపడవద్దు అన్నాడు. జీవ పరిణామ వాదులు ఈ పిచ్చుకలకు డార్విన్ ఫించెస్, డార్విన్ పిచ్చుకలు అని పేరు పెట్టారు. అయితే వాటికి దేవుని పిచ్చుకలు అని పేరుపెట్టాలి.

They are not Darwin’s finches, they are God’s finches

ఎందుకంటే వాటిని సృష్టించి, పోషించేది దేవుడే.

సృష్టికర్త ఈ సత్యములతో మీ మేథస్సు, హృదయ ద్వారాలు తెరచి ప్రభువైన యేసు క్రీస్తు రక్షణ మీకు అనుగ్రహించును గాక!

 

పాల్ కట్టుపల్లి MD

Leave a Reply