ఎఱ్ఱ సముద్రము

MosesdividingtheredseaGettyImages-658600922.jpg

ఈ రోజు  నిర్గమ కాండము 14 అధ్యాయము నుండి ఎర్ర సముద్రము అనే సందేశాన్ని సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుచున్నాను. నిర్గమ కాండము 14 అధ్యాయము నుండి కొన్ని విషయాలు చూద్దాము. ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వములో ఐగుప్తు దేశము నుండి బయలుదేరారు. ఫరో పీడ వదిలింది, ఐగుప్తు దాస్యము ముగిసింది, ఇక మా ముందు ఉన్నవన్నీ మంచి రోజులే అని వారు సంతోషముగా బయలుదేరారు. అరణ్య మార్గములో వెళ్లారు. ఎఱ్ఱ సముద్రము వైపు దేవుడు వారిని నడిపించాడు. ఇంతలో ఫరో కి దురాలోచన వచ్చింది. లక్షల మంది బానిసలు లేకుండా ఈ ఐగుప్తు దేశము ఎలా నడుస్తుంది? మన జీవన విధానము కుంటుపడదా? మన ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలదా? అనుకొన్నాడు. ఐగుప్తు దేశము మీద దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షమున చేసిన గొప్ప కార్యాలను ఫరో ప్రత్యక్షముగా చూశాడు. ఫరో: దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నీ కళ్లారా చూశావు.అయినా కానీ నీకు బుద్ధి రాలేదా? నీ హృదయాన్ని కఠినము చేసుకున్నావు. నీవు చింతించాల్సింది దేవుని గురించి. ఇశ్రాయేలీయుల గురించి కాదు. ఈ దేవునికి వ్యతిరేకముగా నేను పనిచేశాను. నాకు చావు తప్పి కన్ను లొట్టపోయింది. ప్రాణాలతో బయటపడ్డాను చాలు అని ఫరో అనుకోలేదు. ఈ ఇశ్రాయేలీయులను వదలి వేసి తప్పుచేశాము. మన సైన్యాన్ని సిద్ధం చేయండి. మన దగ్గర ఉన్న 600 రథాలతో బయలుదేరండి. ఇశ్రాయేలీయలను పట్టుకొందాము, తిరిగి ఐగుప్తు తీసుకు వచ్చి వారి చేత వెట్టి పనులు చేయించుకొందాము అని ఫరో అనుకొన్నాడు. తన సైన్యముతో ఇశ్రాయేలీయులను వెంటాడాడు. 

     10 వచనము చూడండి. ఫరో గొప్ప సైన్యముతో వారి వైపుకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చూసి హడలెత్తిపోయారు.భయముతో వణకిపోయారు. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము సమస్యల వైపే చూస్తే కృంగిపోతాము. దేవుని వెలుగులో మన సమస్యను చూడాలి. మన సమస్య వెలుగులో 

దేవుని చూడకూడదు.

Do not interpret God in the

 presence of the difficulty, 

but Interpret the difficulty

 in the presence of God. 

నీ సమస్యని బట్టి దేవుని అర్ధం 

చేసుకోవద్దు, దేవుని బట్టి నీ సమస్యను

అర్ధం చేసుకో.

    ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్ధన చేశారు. కానీ వారు విశ్వాసముతో ఆ ప్రార్ధన చేయలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ జనము ముందు, పాస్టర్ల ముందు యేసు ప్రభువు బొమ్మల మీద ముద్దు పెట్టుకొంటాడు. అయితే ఆయన కు దేవుని మీద విశ్వాసము ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే ఆయన చేసే పనులు విశ్వాసులు చేసే పనులు లాగా ఉండవు. పైకి ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్ధన చేశారు. కానీ వారు విశ్వాసముతో ఆ ప్రార్ధన చేయలేదు. అవిశ్వాసముతో చేశారు. వారి అవిశ్వాసము వారి మాటల్లోనే కనిపిస్తున్నది. 11 వచనము. మోషే మీద వారికి కోపం మండింది. మోషే, యెంత పని చేశావయ్యా. ఐగుప్తులో సమాధులు లేవనా, ఈ అరణ్యములో చావటానికి మమ్ములను తెచ్చావు? ఐగుప్తు లో ఫరో క్రింద పనులు చేసుకొని, నాలుగు మెతుకులు తిని, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాము.

    మా జోలికి రావద్దయ్యా, మమ్మల్ని వదలి పెట్టు అంటే విన్నావా? దేవుడు, వాగ్దానాలు, వాగ్దాన దేశం అని చెప్పి మమ్మల్ని విసిగించావు, నీ మాటలతో ఈ అరణ్యానికి నడిపించావు. నీ దుంప తెగ, ఇప్పుడు మా ప్రాణాలే మిగిలేటట్లు లేవు. ఇక్కడ స్వేచ్చాజీవులుగా చావటం కంటే అక్కడ బానిసలుగా బ్రతకటం మేలు అన్నారు. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందో మీరొక సారి గమనించండి. దేవుని యొక్క గొప్ప కార్యాలను నిన్నటి దాకా చూశారు. నైలు నదిలో రక్తముగా మారుట చూశారు. ఐగుప్తీయుల మీద కప్పల దండయాత్ర, ధూళి, పేలు, ఈగల దండయాత్ర, పంటల నాశనము, తెగులు రావటం చూశారు; ఐగుప్తీయులను దేవుడు దద్దరులతో బాధించడం చూశారు. వారి మీద దేవుడు కురిపించిన వడగండ్లను చూశారు. మిడుతల దండయాత్ర చూశారు. ఆ దేశము మీద దేవుడు 3 రోజులు పెట్టిన చిమ్మచీకటిని చూశారు. ప్రథమ సంతానము మృత్యువాత పడటం చూశారు. దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసిన వీరు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ అరణ్యములో మమ్ములను చంపటానికే దేవుడు మమ్మలను ఇంత దూరము తీసుకువచ్చాడు. మన హృదయాల్లో ఉండే అవిశ్వాసమే మన చేత అలాంటి మాటలు అనిపిస్తుంది. మన హృదయాల్లో దేవుని మీద నమ్మకము ఉంటే మనము ఆ విధముగా ఆందోళన చెందము, గగ్గోలు పెట్టము.

     ఈ ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలీయుల అవిశ్వాసము మనము కనిపిస్తున్నది. యేసు ప్రభువు శిష్యులు గురించి మనకు తెలిసిందే. సిలువ దగ్గర వారి అవిశ్వాసము బయటపడింది. అది వారికి ఒక ఎఱ్ఱ సముద్రము వలె కనిపించింది. ఒకమ్మాయి పేతురు తో అంది: ‘నువ్వు, యేసు క్రీస్తు తో తిరిగిన మనిషివి కాదా?’ పేతురుకు ముచ్చెమటలు పట్టినవి. ‘నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకొంటున్నావు అమ్మా. యేసు క్రీస్తా? ఎవరాయన? ఆ పేరే నేను ఎప్పుడు వినలేదే. అమ్మ తోడు, ఆయన ఎవరో నాకు తెలియదు’ అన్నాడు. పేతురు యొక్క అవిశ్వాసము ఆయన ప్రవర్తనలో మనకు కనిపిస్తున్నది. ప్రభువైన యేసు క్రీస్తు మహిమను కళ్లారా చూశావు. ఆయన నీటినిద్రాక్షారసముగా మార్చటము చూశావు.

5 రొట్టెలు, రెండు చేపలు 5 వేల మందికి పైగా ప్రజలకు పంచటము చూశావు. 

దెయ్యాలను వెళ్లగొట్టడం చూశావు. 

తుఫానులు ఆపడం చూశావు. 

కుష్టు రోగులను స్వస్థపరచుట చూశావు. 

లాజరును సమాధిలో నుండి చూశావు. 

రూపాంతరపు కొండ మీద ఆయన దైవ మహిమను చూశావు.

అన్నీ చూసి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటున్నావు.

     పేతురు భయపడ్డాడు. అందుకనే ధైర్యముగా మాటలాడలేకపోయాడు. ఇక్కడ ఎఱ్ఱ సముద్రము ఒడ్డున ఇశ్రాయేలీయుల పరిస్థితి అలాగే ఉంది. వారు భయపడ్డారు. మోషే వారితో ఏమన్నాడంటే, 13 వచనము.

‘13. అందుకు మోషే భయపడకుడి,

 యెహోవా మీకు నేడు కలుగజేయు

రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; 

మీరు నేడు చూచిన ఐగుప్తీయులను 

ఇకమీదట మరి ఎన్నడును చూడరు. 

  1. యెహోవా మీ పక్షమున యుద్ధము

 చేయును, మీరు ఊరకయే 

యుండవలెనని ప్రజలతో చెప్పెను.’ 

భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు

రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; 

Fear ye not. Stand still, and

see the salvation of the LORD

భయపడకుడి. 

    విశ్వాసము, భయము రెండూ ఒక హృదయములో ఉండలేవు. భయం ఉంటే విశ్వాసము ఉండదు. విశ్వాసము ఉంటే భయం ఉండదు. అవి రెండూ కలిసి ఉండలేవు. ఇశ్రాయేలీయులు 

ఫరోను  చూసి భయపడ్డారు. దావీదు సౌలు ను చూసి భయపడ్డాడు. ఏలీయా యెజెబెలును చూసి భయపడ్డాడు. వారి అవిశ్వాసము భయాన్ని కలిగించింది. మోషే వారితో ఏమన్నాడంటే, 

Stand still, and see the salvation of the LORD

   ప్రశాంతముగా నిలబడండి చాలు, దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని మీ ముందు చేస్తాడు, ఈ రోజు మీకు కనిపించే ఈ ఐగుప్తీయులు మీకు ఇక ఎన్నడూ కనిపించరు. దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు. ఈ ఎఱ్ఱ సముద్రాన్ని రెండు పాయలుగా విడదీస్తాడు. ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపిస్తాడు. మోషే మాటలు ఇశ్రాయేలీయులకు నమ్మకాన్ని కలిగించాయి.

    అప్పుడు దేవుడు రెండు ఆశ్చర్య కార్యములు చేశాడు. ఇశ్రాయేలీయుల ముందు ఒక దేవదూత నడుస్తూ ఉన్నాడు. ఆ దేవ దూత వారి వెనుకకు వెళ్ళాడు. అప్పటి వరకు వారి ముందు ఒక మేఘ స్థంబము నడిచింది. ఆ మేఘ స్థంబము ఇశ్రాయేలీయుల వెనుకకు వెళ్ళింది. అది ఇశ్రాయేలీయులకు 

వెలుగును ఇచ్చింది. ఆ మేఘ స్థంబము ఇశ్రాయేలీయులను, ఐగుప్తీయులనుండి వేరు చేసింది. వారికి, వారి శత్రువుల మధ్య దేవుడు నిలబడ్డాడు. ఆ మేఘ స్థంబము మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. మనకు, మన పాపములకు మధ్య ఆయన నిలబడ్డాడు. మనకు, సాతానుకు మధ్య ఆయన నిలబడ్డాడు. మనకు, నరకానికి మధ్య ఆయన నిలబడ్డాడు. ఆ మేఘ స్థంబము వెలుగు ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా నేడు క్రీస్తు వెలుగు మనలను నడిపిస్తున్నది. 

     ఆ మేఘ స్థంబము అది ఒక స్థంబము, గాలికి, వానకు కొట్టుకుపోయేది కాదు. అది స్థిరమైనది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మన స్థంబము, ఆయన స్థిరమైన వాడు. ఎవ్వరూ కదల్చలేని వాడు. ఆ స్థిరమైన స్థంబము మీద నేడు మనము పటిష్ఠపరచబడ్డాము. ఇశ్రాయేలీయులకు కష్టాలు వచ్చినవి, 

సమస్యలు వచ్చినవి అయితే వారికి ఒక మేఘ స్థంబము అండగా నిలిచింది.  వారు ఆ మేఘ స్థంబాన్ని చూడకుండా ఫరోనీ, అతని సైన్యాన్ని చూశారు. అందుకనే వారి గుండె జారిపోయింది, అందుకనే వారు కంగారు పడ్డారు, బెంబేలెత్తారు. బబులోనులో దానియేలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ కష్టాల వైపు చూడకుండా ఆయన దేవుని వైపు చూశాడు.అందుకనే ఆయన అంత ధైర్యముగా బ్రతకగలిగాడు. అపొస్తలుడైన పౌలు అనేక కష్టాలు పడ్డాడు. అయితే ఆయన వాటన్నిటినీ అధికమించాడు. ఆనందముతో జీవించాడు. కష్టాల్లో ఉన్నప్పుడే పౌలు కు ప్రభువైన యేసు క్రీస్తు తన సహవాసాన్ని మెండుగా అనుగ్రహించాడు.అందువలనే పౌలు స్థిరమైన జీవితము జీవించగలిగాడు. 

     ఈ రోజు వార్తల్లో నేను చూశాను. చాలా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 మాక్స్ విమానాలను వాడడము మానుకొన్నాయి.సాంకేతిక సమస్యల వలన ఈ విమానాలు సముద్రములో, భూమి మీద కూలిపోవు చున్నాయి. వాటిని నడిపే ధైర్యం పైలట్లు చేయలేకపోవుతున్నారు. బోయింగ్ 737 మాక్స్ –  పేరులు మాత్రం బ్రహ్మాండమైన పేరులు పెడతారు. అయితే ప్రజలు వాటిల్లో ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. మానవులు కట్టే వాహనాలు బలహీనమైనవే. అవి మనల్ని కొన్ని సార్లు గమ్యము చేర్చలేకపోవచ్చు. అయితే ఈ మేఘ స్థంబము ను అనుసరించిన వారందరూ గమ్యము చేరారు. క్రీస్తు అనే ఈ వాహనం అంత స్థిరమైనది.

    మోషే ఎర్ర సముద్రము మీద చెయ్యి ఎత్తినప్పుడు దేవుడు ఎఱ్ఱ సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఇశ్రాయేలీయులు అప్పుడు ఆరిన నేల మీద నడచివెళ్లారు. సముద్రపు నీరు వారికి కుడి ప్రక్క ఎడమ ప్రక్క గోడల వలె నిలబడినాయి. దేవుడు చేసిన ఒక మహా అద్భుతము అది. కేవలము దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతము అది. ఈ రోజు నాస్తికులు ఏమంటారు అంటే, ఇశ్రాయేలీయులు దాటింది red sea కాదు, reed sea. వారు ఎఱ్ఱ సముద్రము కాదు, ఏదో బురదలో నడుచుకొంటూ వెళ్లారు.అంతే అంటారు. ఎఱ్ఱ సముద్రము 

చీల్చ బడింది అంటే దేవుడు ఉన్నాడని, ఆయన అద్భుతాలు చేయగలడని ఒప్పుకోవాలి. ఆ గొడవంతా ఎందుకు, వాళ్ళు దాటింది రెడ్ సీ కాదు, రీడ్ సి అంటే పోతుంది. బురదలో నడిచి సముద్రము చీలింది అని వారు భ్రమపడ్డారు అని నాస్తికులు నమ్ముతున్నారు. అయితే వారి అభిప్రాయము తప్పు. ఇది దేవుడు చేసిన గొప్ప అద్భుతము.

      Be Still and see the salvation of God. ప్రశాంతముగా నిలబడి చూడండి. దేవుడు గొప్ప

రక్షణ కార్యము చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు నిలబడి చూడటం తప్ప వారు చేయగలిగింది ఏమీ లేదు.ఫరోతో పోరాడే శక్తి కానీ, ఎఱ్ఱ సముద్రాన్ని దాటే శక్తి కానీ వారికి లేదు. ఒక మేఘ స్థంబముతో ఆయన వారిని ఫరో నుండి కాపాడాడు, ఇప్పుడు ఎఱ్ఱ సముద్రాన్ని చీల్చి ఆయన వారిని ఐగుప్తు నుండి శాశ్వతముగా వేరుచేస్తున్నాడు. ఎంత గొప్ప రక్షణ దేవుడు వారికి అనుగ్రహించాడో మీరొక సారి గమనించండి.  ఆ మేఘ స్థంబములో ప్రభువైన యేసు క్రీస్తు సిలువ, ఆ ఎఱ్ఱ సముద్రములో ఆయన సమాధి కనిపిస్తున్నాయి. ఆ ఎఱ్ఱ సముద్రము మన ముందు ఉంది. దానిని మనం దాటలేము. అది ఒక పాపపు సముద్రం, అది ఒక శాపపు సముద్రం, అది ఒక నరకపు సముద్రం. ఆయన సిలువ మీద మరణించి ఆ సముద్రాన్ని చీల్చాడు. గర్భాలయపు తెర నడిమికి చిరిగింది.ఇప్పుడు ఆరిన నేల మీద మనము దేవుని సన్నిధికి నడచివెళ్తున్నాము. రక్తమాంస ములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని వ్రాశాడు అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయములో. మన రక్త మాంసములతో ఎఱ్ఱ సముద్రాన్ని చీల్చే శక్తి మనకు లేదు. అది దేవుడు చేయాల్సిందే.

    ఎఱ్ఱ సముద్రం నీళ్లు ఇశ్రాయేలీయులకు కుడి ప్రక్క, ఎడమ ప్రక్క గోడల వలె నిలిచినవి. సముద్రము నీరు ఒక్క బొట్టు కూడా వారి మీద  పడలేదు, ఎఱ్ఱ సముద్రము నీరు ఒక్క బొట్టు కూడా వారి పాదాలను తాకలేదు. ఈ రోజు యేసు క్రీస్తు నందు ఉన్న మన మీద దేవుని తీర్పు ఒక్క బొట్టు కూడా పడదు, దేవుని శాపము ఒక్క బొట్టు కూడా పడదు, నరకపు శిక్ష ఒక్క బొట్టు కూడా పడదు, ఎందుకంటే సిలువ మీద ఆయన మరణించినప్పుడు దేవుని ఉగ్రత పాత్రను పూర్తిగా త్రాగివేశాడు. ఇశ్రాయేలీయులు ఎఱ్ఱ సముద్రాన్ని దాటి వెళ్లిన తరువాత ఐగుప్తీయులు కూడా అందులో ప్రవేశించారు. అయితే వారు బురదలో కూరుకుపోయారు. మోషే తన చెయ్యి చాపినప్పుడు సముద్రము నీళ్లు తిరిగి వచ్చినవి. వారిని ముంచివేసినవి. వారు జల సమాధి అయిపోయారు. ఇశ్రాయేలీయులు మాత్రం క్షేమముగా సముద్రాన్ని దాటారు. 

    హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11 అధ్యాయములో మనము చదువుతాము: 

విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు 

ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. హెబ్రీ 11:29 

ఐగుప్తీయులకు ఆ విశ్వాసము లేదు, వారు ఎఱ్ఱ సముద్రములో మునిగిపోయారు.

    ఇప్పుడు 1 కొరింథీ 10 అధ్యాయములో ఒక మాట చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ యేమని వ్రాశాడంటే, 

మన పితరులందరు మేఘము క్రింద నుండిరి. 

వారందరును సముద్రములో నడచిపోయిరి;

అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 

    ఇశ్రాయేలీయులకు ఒక ప్రక్క మేఘస్థంబము, మరొక ప్రక్క ఎఱ్ఱ సముద్రము ఉన్నాయి. ఆ మేఘ స్థంబము వారి శత్రువులనుండి వారిని కాపాడింది, ఆ ఎఱ్ఱ సముద్రము చీలిక వారిని ఐగుప్తు నుండి శాశ్వతముగా వేరు చేసింది. ఆ మేఘ స్థంబములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ, ఆ ఎఱ్ఱ సముద్రములో ఆయన సమాధి మనకు కనిపిస్తున్నాయి. పాపము, నరకము, సాతాను అనే మన శత్రువుల నుండి మనలను కాపాడింది ఆయన సిలువే. ఆయన మరణములో గుర్తించబడి మనము లోకము నుండి విడిపోయాము. ఆయన పునరుత్తానములో మనము ఆయన తో కూడా లేపబడ్డాము. బాప్తిస్మము అంటే అదే. అపోస్తలుడైన పౌలు ఇక్కడ అదే వ్రాస్తున్నాడు. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి.  వారు అరణ్యములో ప్రవేశించినప్పుడు దేవుడు వారిని సంరక్షించాడు. 

     ఈ రోజు ఎర్ర సముద్రము గుండా దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించి రక్షించాడో మనము చూశాము. ప్రభువైన యేసు క్రీస్తు సిలువ, ఆయన మరణము పునరుద్ధానము ఇప్పుడు మనలను రక్షిస్తున్నాయి.ఆయన దగ్గరకు వచ్చి మీరు రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశము.

Please Support Our Ministry through a Donation

$10.00

Leave a Reply