యెహెఙ్కేలు ప్రవక్త చూసిన ప్రభువైన యేసు క్రీస్తు: డాక్టర్ పాల్ కట్టుపల్లి సందేశం

మీ బైబిల్ గ్రంథములో యెహెఙ్కేలు గ్రంథం 1 మొదటి అధ్యాయము నుండి కొన్ని మాటలు చూద్దాము: 

1. ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను.2. యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు.  బూజీ కుమారుడును 3. యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.

    ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు ఒక గొప్ప దర్శనం అనుగ్రహించాడు. అప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయస్సు.  ఆయన బబులోను దేశములో కెబారు నది ఒడ్డున ఉన్నాడు. ఇశ్రాయేలు దేశములో యొర్దాను నది ఒడ్డున ఉండవలసిన వ్యక్తి బబులోను దేశములో కెబారు నది ఒడ్డున ఎందుకు ఉన్నాడు? ఇది అర్ధం చేసుకోవాలంటేమనం కొంత చరిత్రలోకి చూడాలి.

   దావీదు, సొలొమోను లాంటి మహా మహులు పాలించిన ఇశ్రాయేలు దేశం వారి కుమారుల కాలములో రెండు ముక్కలు అయ్యింది. ఉత్తరాన ఇశ్రాయేలు దేశం, దక్షిణాన యూదా దేశం. అషూరు సామ్రాజ్యం చక్రవర్తులు రెండు దేశాలను వేధించారు. క్రీ.పూ 722 లో ఉత్తర దేశం అంతరించింది. అషూరు చక్రవర్తి సర్గోన్ దాని రాజధాని సమరయ ను ధ్వంసం చేశాడు. దక్షిణాన యూదా దేశం కూడా అషూరు రాజులకు చాలా కాలం బానిసగా ఉంది. 

    అహాజు రాజు అశూరు వారికి సామంత రాజుగా మారాడు. వారికి కప్పం కట్టాడు.అయితే, హిజ్కియా రాజు క్రీ.పూ 705 లో అషూరు వారికి ఎదురు తిరిగాడు.వారికి చెల్లించాల్సిన భత్యం చెల్లించలేదు.హిజ్కియా కుమారుడు మనష్షే ఆ పద్దతికి స్వస్తి పలికాడు. అషూరు వారితో తిరిగి శాంతి ఒప్పందం చేసుకొన్నాడు. ఆ తరువాత వచ్చిన యోషీయా రాజు హిజ్కియా వలె అషూరు వారికి ఎదురు తిరిగాడు. ఆ సమయములో ఐగుప్తు కూడా బలమైన దేశముగా ఎదిగింది. అషూరు తరువాత బబులోను రాజులు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించారు.ఒక వైపు ఐగుప్తు, మరొక వైపు బబులోను: ఈ రెండు బలమైన దేశాల మధ్య యూదా దేశం నలిగింది. కొంత కాలం ఐగుప్తు తో కలిశారు, కొంత కాలం బబులోను తో కలిశారు.చివరి 20 సంవత్సరాల్లో 6 సార్లు యూదా ప్రజలు ఈ ఒప్పందాలు మార్చుకొన్నారు. చివరకు క్రీ.పూ 586 లో యూదా దేశాన్ని బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ సమయములో యిర్మీయా, దానియేలు, యెహెఙ్కేలు ప్రవక్తలు జీవించారు.విగ్రహారాధన మానుకోండి, మారు మనస్సు పొందండి అని ఈ ప్రవక్తలు ప్రజలకు బోధించారు.      యెరూషలేము పతనం తరువాత యిర్మీయా ప్రవక్త యూదా ప్రాంతములోనే ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు.

    యెహెఙ్కేలు దానియేలు ప్రవక్తలు బబులోను దేశములో ఉండి దేవుని వాక్యం ప్రకటించారు. బబులోను వారు మూడు బృందాలుగా యూదులను చెర పట్టి తీసుకొని వెళ్లారు. మొదటి గుంపులో క్రీ.పూ 597 సంవత్సరం యెహెఙ్కేలు చెరపట్టి తీసుకొని వెళ్ళబడ్డాడు.

    దేవుడు తన ప్రజలను వారి కష్టాల్లో దర్శించాడు. తన ప్రవక్తలకు ఆయన తన దర్శనాలు అనుగ్రహించాడు. మోషే కు మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యిర్మీయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా ప్రవక్తకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యెషయా గ్రంథం 6 అధ్యాయములో మనం ఆ విషయం చూస్తాము. ఇక్కడ యెహెఙ్కేలుకు దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. బబులోను ను నెబుకద్నెజరు ఎంతో సుందరముగా తీర్చిదిద్దాడు. అక్కడ అనేక ఉద్యాన వనాలు నాటాడు. ప్రకృతి సౌందర్యముతో కూడిన చక్కటి ప్యాలస్ లు నిర్మించాడు. గొప్ప, గొప్పకళా ఖండాలు నిర్మించాడు. వాటి శిధిలాలు ఈ రోజుకు కూడా మనం చూడవచ్చు.

నెబుకద్నెజరు ఇష్టార్ దేవతకు ఒక గొప్ప ద్వారం నిర్మించాడు. దీనిని ఇస్టార్ ద్వారం అని పిలుస్తున్నాము. జర్మనీ దేశం రాజధాని బెర్లిన్ నగరములో ఉన్నటు వంటి పెర్గమాన్ మ్యూసియం లో ఇది భద్రపరచబడింది.నెబుకద్నెజరు క్రీ.పూ 575 లో దీనిని నిర్మించడం ప్రారంభించాడు. యెహెఙ్కేలు ఈ ద్వారాన్ని బబులోను లో ఉన్నప్పుడు చూసే ఉంటాడు.

    ఈ ద్వారం మీద అనేక జంతువుల బొమ్మలు గీయించాడు. ఈ జంతువులు బబులోను దేవతలు మారుడూక్, అదాద్ లకు చిహ్నములుగా ఉన్నాయి. చాలా మంది యూదులు – అబ్బా, ఇక్కడే చాలా బావుంది.మనం ఇక్కడే స్థిరపడుదాం అనుకొన్నారు.అక్కడ యూదా మతాన్ని వారు అవలంబించారు.బబులోను దేశములో ఉన్నప్పుడే ‘సినగాగ్’ అనే పదం మొదలయింది. యెహెఙ్కేలు గ్రంథములో మొదటి సారి ‘సినగాగ్’ అనే పదం మనం చూస్తున్నాము. ఈ సినగాగ్ లో పూర్వం వున్నట్లుగా బలులు, అర్పణలు, దేవుని మందసము ఉండవు. అక్కడ సమావేశాలు, ప్రసంగాలు మాత్రమే ఉంటాయి. 

    యెహెఙ్కేలు క్రీ.పూ 597 లో బబులోను చెరకు వెళ్ళాడు. యెరూషలేము పతనం క్రీ.పూ 586 లో జరిగింది. అంటే, బబులోను ఆయన 11 సంవత్సరాలు జీవించిన తరువాత యెరూషలేము నాశనం కావడం, దేవుని మందిరం అగ్ని ఆహుతి కావడం జరిగింది. ఆ 11 సంవత్సరాలు యిర్మీయా ప్రవక్త యూదా ప్రాంతములో దేవుని ప్రవక్తగా ఉంటే, యెహెఙ్కేలు బబులోను లో దేవుని ప్రవక్తగా ఉన్నాడు . 

    ఈ సంఘంటనల వెలుగులో మనం యెహెఙ్కేలు గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథమును మనం రెండు భాగాలుగా చూడవచ్చు. మొదటి భాగములో దేవుడు ఇశ్రాయేలీయులకు ఎందుకు అటువంటి దురవస్థ తెచ్చాడో యెహెఙ్కేలు మనకు తెలియజేశాడు.యూదా చేసిన పాపాలు దేవుని సన్నిధికి వెళ్లాయి. యెరూషలేము పతనానికి అప్పుడే బీజాలు పడ్డాయి. యెరూషలేమును ఎందుకు శిక్షించ వలసి వచ్చిందో దేవుడు యెహెఙ్కేలు చెప్పాడు: 

29. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

                 యెహెఙ్కేలు 22:29-31 

    మీరు దొంగతనాలు చేస్తున్నారు, దీనులను దరిద్రులను హింసించారు పరదేశులను బాధించారు, అందుకనే నా ఉగ్రత అగ్ని చేత నేను మిమ్మును దహించ వలసి వచ్చింది. ఈ రోజు ఇద్దరు కార్మికులు నా హాస్పిటల్ కి వచ్చారు. ఇద్దరికీ భుజాలు నెప్పులు. తీవ్రమైన నెప్పులతో వారు బాధ పడుతున్నారు. నేను వారి నొప్పి తగ్గించటానికి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు మీరు ఇంత బాధలో ఉన్నారు అని వారిని అడిగాను. నాలుగు సంవత్సరాల నుండి రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాము. ఒక్క రోజు కూడా సెలవు లేదు. మా భుజాలు బరువులు మోయ లేక నొప్పులు వస్తున్నాయి.అని వారు నాకుచెప్పారు.కొంత మంది వ్యాపారస్తులు డబ్బు సంపాదనే ధ్యేయముగా కార్మికుల రక్తాన్నిపీలుస్తున్నారు. అటువంటి అన్యాయాలనే దేవుడు ఈ యెహెఙ్కేలు గ్రంథములో ప్రశ్నించాడు. అందుకనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ యెహెఙ్కేలు గ్రంథాన్ని ఎంతో ఇష్టపడేవాడు. ఆయన అమెరికా దేశములో మానవ హక్కుల ఉద్యమం చేపట్టాడు.సమాజము లో అన్యాయాన్ని ప్రశ్నించాడు.

    దేవుడు తన సన్నిధిని కూడా యూదా వారి మధ్య నుండి తొలంగించాడు. 8 అధ్యాయములో మీరు చూస్తే, యెహెఙ్కేలు బబులోను లో ఉన్నాడు. అప్పటికి యెరూషలేము లో దేవుని మందిరం ఇంకా నిలిచే ఉంది. దేవుడు ఒక దేవదూతను పంపి యెహెఙ్కేలును బబులోను లో నుండి యెరూషలేములో ఉన్న దేవుని మందిరము దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ దేవుని మందిరములో జరుగుతున్న ఘోరాలు, పాపాలు, అవినీతి, అక్రమాలు, విగ్రహారాధన, అన్య బలులు యెహెఙ్కేలు కు చూపించాడు.

9 అధ్యాయము 3 వచనంలో చూస్తే, దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచివెళ్ళిపోతున్నది.ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చెను. 9:3 

అది ఎంత విచారకరమైన సంఘటన. అది ఎంత హృదయవిదారకమైన దృశ్యం. సొలొమోను రాజు ఆ ఆలయాన్ని ప్రతిష్టించినప్పుడు దేవుని మహిమ అందులోకి దిగివచ్చింది. ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించాడు. ఆ దేవుని మహిమ ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది. యాజకుడైన యెహేజ్కెలుకు ఆ దృశ్యం ఎంత బాధ కలిగించిందో మనం ఊహించ వచ్చు. ఆ ఆలయం కూడా త్వరలో అగ్నికి ఆహుతి కాబోతున్నది. ఇశ్రాయేలీయల మీదకు దేవుని శిక్ష వచ్చింది. వారిని శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. 18:23 లో మనం చూస్తే, 

దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

               యెహేజ్కెలు 18:23

    దేవుడు ఏమంటున్నాడంటే, దుష్టులు మరణం నొందుట చూసి నాకు ఏ మాత్రం సంతోషం కలుగదు.వారు తమ ప్రవర్తన సరిచేసుకోవడం నాకు సంతోషం.ఈ రోజు కూడా, పాపాత్ములను నరకానికి పంపించడం దేవునికి ఏ మాత్రం సంతోషం కలిగించదు. పాపాత్ములు తమ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువైన యేసు క్రీస్తు సిలువ దగ్గరకు వచ్చి రక్షణ పొందాలి, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించాలి అని దేవుడు కోరుకొంటున్నాడు. ఆ విధముగా  యెహేజ్కెలు మొదటి భాగములో దేవుడు తన ప్రజలను ఎందుకు శిక్షించాల్సి వచ్చిందో మనకు వివరించాడు.

   రెండవ భాగములో దేవుడు తన ప్రజలకు నిరీక్షణ, మారు మనస్సు, సంక్షేమము వాగ్దానం చేశాడు. మొదటి అధ్యాయము 16 ఆ దర్శనములో దేవుడు యెహేజ్కెలుకు చక్రాలు చూపించాడు.

20. ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.

    దేవుడు యెహెఙ్కేలు కు ఒక రథాన్ని,  చక్రాలు చూపించాడు.  మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడకు వస్తాను. నా సన్నిధి యెరూషలేము లో ఉంది కాబట్టి నేను యెరూషలేముకే పరిమితం అనుకోవద్దు. నేను సర్వ సృష్టికి దేవుణ్ణి. మీ కోసం బబులోను కూడా వస్తాను అనే సందేశం వారికి ఆ దర్శనములో దేవుడు ఇచ్చాడు.

   మైమోనిడిస్ గొప్ప యూదు తత్వవేత్త.ఆయన క్రీస్తు శకం 1138 – 1204 ల మధ్య ప్రస్తుత స్పెయిన్ దేశము ఉన్న ప్రాంతములో జీవించాడు. బైబిల్ మీద గొప్ప గ్రంథాలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేశములో గలిలయ సముద్రం ఒడ్డున టైబీరియస్ పట్టణములోఆయన సమాధి ఉంది. గ్రీకు తత్వవేత్తలు అడిగిన ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానము ఏమిటి? అనే ప్రశ్న ఆయనను వేధించింది. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలగు తత్వవేత్తలు మానవ జీవితాన్ని ప్రశ్నించారు. ఈ సృష్టిలో మనిషి స్థానం ఏమిటి? మనిషి జీవితానికి అర్ధం ఉందా? ప్రపంచ చరిత్రకు అర్థం ఉందా? సైన్స్ కి, ఫిలసోఫీ కి ఏమన్నా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు మైమోనిడిస్ సమాధానం ఇచ్చాడు. Guide to the Perplexed అనే పుస్తకం వ్రాశాడు. ‘ఆలోచించేవానికి మార్గదర్శి’. ఆ పుస్తకములో రెండు వాక్య భాగములను కేంద్రముగా చేసుకొన్నాడు.

     ఆదికాండము లో ఉన్న దేవుని సృష్టి. యెహెఙ్కేలు గ్రంథము లో ఉన్న దేవుని దర్శనం.ఆదికాండములో సృష్టికర్తగా ఉన్న దేవుడు, యెహెఙ్కేలు దర్శనములో ఒక రథం మీద మనకు కనిపిస్తున్నాడు. ఆది కాండములో ‘ఫిజిక్స్’ ఉంటే, యెహెఙ్కేలు గ్రంథము లో మెటా ఫిజిక్స్ ఉంది అన్నాడు. ఆదికాండములో సైన్స్ ఉంటే,  యెహెఙ్కేలు గ్రంథము లో ఫిలాసఫీ ఉంది అన్నాడు.ఆదికాండములో సృష్టికర్త గా కనిపిస్తున్న దేవుడు యెహెఙ్కేలు గ్రంథము లో ఒక రథం మీద మానవ చరిత్ర లోకి దూసుకు వస్తున్నాడు. ‘మనిషి అన్వేషణ కు అక్కడే సమాధానం ఉంది’ అన్నాడు మైమోనిడిస్. ఈ దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, తన ప్రజల మధ్యలోకి వచ్చి వారితో జీవించేవాడు.

    ఇశ్రాయేలీయులు ప్రపంచమంతా చెల్లాచెదురయిపోయారు. జీవం లేని మృత దేహం వలె అయిపోయారు.వారితో దేవుడు ఒక మాట అన్నాడు.37 అధ్యాయము, 14 వచనం చూద్దాము: 

13. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా 14. నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. యెహెఙ్కేలు 37:14 

   నేను సమాధులను తెరచి, సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పిస్తాను.ఈయన ఎంత శక్తి కలిగిన దేవుడో మీరు ఒక సారి ఆలోచించండి. ఏ మాత్రం నిరీక్షణ లేకుండా, మృతులుగా పడి ఉన్న ప్రజలకు దేవుడు తన నిరీక్షణ ఇచ్చాడు. వారిని తిరిగి చేర దీశాడు. పోయిన సారి నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు యెరూషలేము లో యాడ్ వాషెమ్ అనే మ్యూజియం కు వెళ్ళాను. రెండో ప్రపంచ యుద్ధములో మరణించిన యూదులకు స్మారక చిహ్నముగా అది నిర్మించబడింది. దాని ఎంట్రన్స్ లో ఉన్న ద్వారం మీద  యెహెఙ్కేలు వాక్యం చెక్కబడింది.

I will put my breath into you and you shall live again, and I will set you upon your own soil…

మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను

   మీ దేశానికి నేను మిమ్ములను తిరిగి తీసుకొని వెళ్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అంతే కాకుండా వారి స్వభావాన్ని మార్చి వేస్తాను అన్నాడు.

36 అధ్యాయం, 26 వచనం: 

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను,రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. యెహెఙ్కేలు 36:26 

   దేవుడు ఒక నూతన నిబంధన వారితో చేశాడు. దాని ప్రకారం వారికి నూతన హృదయం, నూతన స్వభావం ఇస్తాను అన్నాడు. 

   యెహెఙ్కేలు గ్రంథము నుండి ఈ రోజు కొన్ని సంగతులు మనం చూశాము. బబులోను దేశములో ఉన్న యెహేజ్కెలుకు దేవుడు కనిపించాడు. ఒక రథము మీద కనిపించాడు. దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఆయన యెరూషలేముకు పరిమితమైన దేవుడు కాదు. తన రథం మీద తన ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లే దేవునిగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. తన ప్రజల మధ్యలోకి దిగి వచ్చే దేవుడు ఆ దర్శనములో మనకు కనిపిస్తున్నాడు.ప్రభువైన యేసు క్రీస్తు మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు.

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. (యోహాను 1:12) 

   యెహెఙ్కేలు ప్రవక్త ఎదురుచూసిన రక్షకుడు ఈ యేసు క్రీస్తే. ఆయన శరీర ధారిగా మన మధ్యలోకి వచ్చాడు. దేవుని మహిమ ఆయన మోహములో మనం చూశాము. దేవుని మహిమ దేవుని మందిరాన్ని వదలి వెళ్లిపోయే విచారకరమైన దృశ్యాన్ని యెహెఙ్కేలు చూశాడు. అయితే సంతోషకరమైన వార్త ఏమిటంటే, దేవుని మహిమ మన ప్రభువైన యేసు క్రీస్తు నందు మన మధ్యలోకి దిగి వచ్చింది. 

   అక్కడ నాలుగు జీవులు మనకు కనిపిస్తున్నాయి. ఆ నాలుగు జీవులకు 4 ముఖాలు ఉన్నాయి. 

సింహం ముఖం

ఎద్దు ముఖం

మానవ ముఖం

పక్షి రాజు ముఖం 

10. ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.1:10 

   ఆ నాలుగు మొహల్లో మనకు యేసు ప్రభువు రూపం కనిపిస్తున్నది. సింహం ముఖములో ఆయన యూదా రాజ సింహముగా కనిపిస్తున్నాడు. ఆయన రాజ రికం అక్కడ కనిపిస్తున్నది. ఎద్దు ముఖములో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన దీనత్వం అక్కడ మనకు కనిపిస్తున్నది. మానవ ముఖములో ఆయన మానవత్వం మనకు కనిపిస్తున్నది. పక్షి రాజు ముఖములో ఆయన ఆకాశానికి చెందినవాడిగా మనకు కనిపిస్తున్నాడు. అంటే, ఆయన దైవత్వం మనకు కనిపిస్తున్నది. 

   అంటే, క్రొత్త నిబంధనలో ఉన్న నాలుగు సువార్తలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. 

మత్తయి సువార్త లో ప్రభువైన యేసు క్రీస్తు రాజుగా మనకు కనిపిస్తున్నాడు 

మార్కు సువార్తలో ఆయన సేవకునిగా మనకు కనిపిస్తున్నాడు 

లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారునిగా కనిపిస్తున్నాడు 

యోహాను సువార్తలో ఆయన దేవునిగా కనిపిస్తున్నాడు. 

   ఆ రక్షకుడైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి, పాప క్షమాపణ పొంది మీరు మారు మనస్సు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.

డాక్టర్ పాల్ కట్టుపల్లి 

Leave a Reply