యెహెఙ్కేలు ప్రవక్త: ఇశ్రాయేలు మీద రష్యా చేయబోయే యుద్ధం

Jerusalem, Israel – July 18, 2010: Soldier and Orthodox jews pray at the wailing wall. Jerusalem with people.

ఈ రోజు యెహెఙ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు ధ్యానము చేద్దాము.ఇక్కడరెండు వేల ఐదు వందల సంవత్సరముల క్రితం దేవుడు తన ప్రవక్త అయిన యెహెఙ్కేలు ద్వారా ప్రస్తుత ప్రపంచము గురించి తెలియ జేశాడు. అక్కడ రష్యా దేశము, మధ్య ప్రాశ్చ్యదేశాలు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడం మనం చూస్తున్నాము. 38:2 వచనము చూద్దాము.నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైన వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము (యెహెఙ్కేలు 38:2) (మే నెల, 2021) ఈ వారం మనం చూశాము. ఇశ్రాయేలు, గాజా ల మధ్య యుద్ధము జరిగింది. యెరూషలేములో టెంపుల్ మౌంట్ మీద అల్ అక్సా మసీదు ఉంది.అందులోకి ఇశ్రాయేలు పోలీసులు వెళ్లారు. మా మందిరములోకి పోలీసులు రావడం ఏమిటి? అని అక్కడ అల్లర్లు జరిగినవి. ఆ కొట్లాటలు చిలికి, చిలికి గాలి వానగా మారాయి. ఇశ్రాయేలు దేశం ప్రక్కన గాజా ప్రాంతము ఉంది. హమాస్ అనే ఒక తీవ్ర వాద పార్టీ ఇక్కడ పాలన చేస్తూ ఉంది. హమాస్ అనే పేరుకు ‘హింస’ అని అర్థం. K.A.పాల్ గారి వలె ప్రజా శాంతి పార్టీ అని మంచి పేరుతో పార్టీ పెట్టి సమాజములో శాంతి కోసం ప్రయత్నించాలి కానీ, ‘హింస’ అనే పేరుతో పార్టీ లు పెట్టడం మంచిది కాదు. అది కూడా హెబ్రీ భాషలో ‘హింస’ అనే పదముతో వారు ఈ పార్టీ పెట్టారు. 

    హెబ్రీ భాష మాట్లాడుకొనే యూదులను భయపెట్టాలి అని వారి ఉద్దేశ్యం. ఈ గాజా ప్రాంతము 40 కి.మీ పొడుగు, 12 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. 1967 లో జరిగిన 6 రోజుల యుద్ధములో ఇశ్రాయేలు దేశము గాజా ప్రాంతాన్ని ఈజిప్తు నుండి స్వాధీనం చేసుకొంది. 2005 లో ఇశ్రాయేలు ఈ ప్రాంతము నుండి వైదొలగింది. అప్పటి నుండి ఈ ప్రాంతము పాలస్తీనీయుల చేతిలో ఉంది. అక్కడ నుండి ఇశ్రాయేలు దేశము మీద వారు వేలాది బాంబులు, క్షిపణులు కుమ్మరించారు. అనేకమంది అమాయకులు ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతున్నారు. ఎందుకు ఈ మారణ హోమము? యెరూషలేము కోసము. 

    దేవుడు తన వాక్యంలో స్పష్టముగా చెప్పాడు.అబ్రహాము కు దేవుడు వాగ్దానం చేశాడు.అబ్రహాము జీవితములో రెండు సార్లు యెరూషలేము మనకు కనిపిస్తుంది.షాలేము రాజైన మెల్కిసెదెకు అబ్రాహామును యెరూషలేములో కలిసాడు.ఆదికాండము 14 అధ్యాయములో మనం ఆ సంగతులు చదువుతాము (ఆది14:18; కీర్తన76:2) యెరూషలేము రాజు మెల్కిసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ ప్రాంతమును దేవుడు అబ్రహాము సంతానమునకు ఇవ్వబోతున్నాడు.అక్కడ రాజ రికం కూడా మనకు కనిపిస్తున్నది.అబ్రహాము సంతానంలో పుట్టే రాజులకు యెరూషలేము రాజధానిగా ఉండబోతున్నది.రెండో సారి అబ్రహాము యెరూషలేము ఎప్పుడు వెళ్ళాడు? 

     ఆదికాండము 22 అధ్యాయములో మనము చూస్తాము. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతము మీదకు వెళ్ళాడు. అక్కడ ఇస్సాకును అర్పించటానికి తన కత్తి ఎత్తాడు. దేవుడు అబ్రహామును చివరి నిమిషములో ఆపాడు.ఇస్సాకు స్థానములో ఒక పొట్టేలు ఆ బలి పీఠము మీద అర్పించబడింది. మన విమోచనకు అది సాదృశ్యముగా ఉంది. అదే మోరియా పర్వతము మీద మన విమోచన కొరకు యేసు క్రీస్తు ప్రభువు అర్పించబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గా ఆ యెరూషలేము పర్వతము మీద ఆయన మన కొరకు అర్పించబడ్డాడు. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడు.యేసు ప్రభువు సిలువ వేయబడిన ఆ ప్రదేశములో ఇప్పుడు బాంబుల వర్షం ఎందుకు కురుస్తూ వుంది? సిలువ సందేశాన్ని తిరస్కరించిన పాపాత్ములు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నారు. దేవుడు తన దాసుడైన అబ్రహాముకు ఇచ్చిన నగరము యెరూషలేము.యెరూషలేము అంటేనే ‘శాంతి నగరము’ అని అర్థము. the city of peace.ఆ శాంతి నగరములో ఈ రోజు ఎందుకు ఇంత అశాంతి నెలకొని ఉంది? యెరూషలేము చరిత్ర చూడండి.యెరూషలేముకు బైబిల్ గ్రంథములొ ఎంతో ప్రాముఖ్యత ఉంది.పాత నిబంధనలో యెరూషలేము 667 సార్లు, క్రొత్త నిబంధనలో139 సార్లు ప్రస్తావించబడింది.

     క్రీ.పూ 1050 లో దావీదు యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని ఇశ్రాయేలు దేశాన్ని పాలించాడు.ఆయన తరువాత ఆయన కుమారుడు సొలొమోను రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో కొండ మీద చక్కటి దేవుని మందిరాన్ని ఎంతో వైభవముగా, సౌందర్యముతో నిర్మించాడు. క్రీ.పూ 586 లో బబులోను వారు యూదా రాజ్యాన్ని నాశనం చేశారు. యెరూషలేమును తగలబెట్టారు. అక్కడ ఉన్న దేవుని మందిరాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశారు.బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వేలాది మంది యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళాడు. బబులోను లో ఉన్నప్పుడే యెహెఙ్కేలు ప్రవక్త ఈ గ్రంథాన్ని వ్రాశాడు.

   నేను నా ప్రజలను విడిచిపెట్టను, వారినిమరొకసారి యెరూషలేము తీసుకు వెళ్తాను.ఎండిన ఎముకల వలె వారు పడిఉన్నారు.వారికి మళ్ళీ జీవం పోస్తాను. వారు తిరిగి వారి తండ్రి అయిన అబ్రహాముకు నేను వాగ్దానము చేసిన దేశానికి వెళ్తారు.అక్కడ మళ్ళీ స్థిరపడతారు. యెహెఙ్కేలు చెప్పినట్లే యూదులు తిరిగి యెరూషలేము వెళ్లారు. స్థిరపడ్డారు, విస్తరించారు.రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారి మధ్య జీవించాడు.యెరూషలేము లో ఆయన అనేక అద్భుత కార్యములు చేశాడు. బేతెస్థ చెరువు దగ్గర పక్షవాయువు గలిగిన వ్యక్తిని స్వస్థపరచాడు. సిలోయము కోనేటి దగ్గర గ్రుడ్డి వానికి చూపును ఇచ్చాడు. ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. హోసన్నా, హోసన్నా కీర్తనలతో వారు ఆయనను మహిమ పరచారు.అక్కడ పస్కా పండుగను ఆచరించాడు.ఆయన సందేశాన్ని, రక్షణ కార్యాన్ని ప్రధాన యాజకులు వారు తిరస్కరించారు. ఆయనను సిలువ వేసి చంపారు. యెరూషలేములో ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు.

    యేసు ప్రభువు వారిని హెచ్చరించాడు. ‘రాయి మీద రాయి ఉండకుండా ఈ ఆలయము నిర్మూలించబడుతుంది’ అన్నాడు. క్రీస్తు శకం 70 సంవత్సరములో ఆయన చెప్పిన మాట నెరవేరింది. రోమా సైన్యము వచ్చింది, యెరూషలేము ను నాశనం చేసింది. దేవుని మందిరాన్ని తగుల బెట్టింది.యూదులను చెర పట్టి తీసుకొని వెళ్ళింది.ఈ రోజుకు కూడా యెరూషలేము వెళ్తే హేరోదు ఆలయము నకు చెందిన పెద్ద పెద్ద రాళ్లు అక్కడ మనకు కనిపిస్తాయి.రోమ్ నగరములో కూడా ‘ఆర్చ్ అఫ్ టైటస్’ అక్కడ మనకు కనిపిస్తుంది. యూదులను ఏ విధముగా చెరపట్టి తీసుకొని వెళ్లారో, యెరూషలేము పతనం, దీపస్థంభం దాని మీద మనం చూడవచ్చు. యూదుల మీద మేము సాధించిన విజయానికి ఇది చిహ్నము అని రోమన్ చక్రవర్తి డొమిషియన్ దానిని క్రీస్తు శకం 81 సంవత్సరములో నిర్మించాడు. రోమన్ల దెబ్బకు ప్రపంచమంతా యూదులు చెల్లాచెదురు అయిపోయారు.వారి భవిష్యత్తు ఏమిటి? దేవుడు యెహెఙ్కేలు ప్రవక్తకు తెలియజేశాడు. 37 అధ్యాయములో మనం చదువుతాము.

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగానుఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను.

                           యెహెఙ్కేలు 37:21-23

1948 లో ఆ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలు దేశము తిరిగి స్థాపించబడింది.రెండు వేల సంవత్సరముల తరువాత యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లారు.ప్రపంచ చరిత్రలోనే అది ఒక గొప్ప అద్భుతము.ఒక ప్రాంతము నుండి రెండు వేల సంవత్సరములు దూరం చేయబడి తిరిగి దానిని పొందిన ఏకైక ప్రజలు యూదులు మాత్రమే.

     దేవుని యొక్క మహా శక్తి వలన మాత్రమే అది సాధ్యపడింది.  ప్రపంచ చరిత్రఎన్నో మలుపులు తిరిగింది. అయినప్పటికీ యెరూషలేము దేవుని సార్వ భౌమాధికారము క్రిందే ఉంది.

కీర్తన 76 లో మనం చదువుతాము.

1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.2. షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.3. అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను

                                      కీర్తన 76

 షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.అక్కడ  ఆయన  తన గుడారము వేసుకొన్నాడు. అంటే ఆయన సన్నిధి ఉంది. అన్య జనులు యెరూషలేము మీదకు వెళ్లారు. ఐగుప్తు వారు, అశూరు వారు, బబులోను వారు, రోమీయులు యెరూషలేము మీద దాడులు చేసిన మాట వాస్తవమే.అది దేవుని అనుమతి ద్వారానే అది సాధ్యపడింది. దేవుని అనుమతి లేకుండా ఎవరూ యెరూషలేము మీద యుద్ధము చేయలేరు.అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను బబులోను వారు, రోమీయులు అగ్ని బాణములతో యెరూషలేము మీద విరుచుకు పడ్డారు. నేటి అగ్ని బాణములు మిస్సైలు బాంబులు, అణు బాంబులు… ఎన్నో కోట్ల రెట్లు శక్తి కలిగినవి.ఆధునిక ఇశ్రాయేలు దేశానికి ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ అంటే ఏమిటంటే, ఇశ్రాయేలు దేశము మీద ప్రయోగించబడే రాకెట్లు, మిస్సైల్ లను గాలి లోనే ఎదుర్కొని నిర్వీర్యం చేయడం. 2011 సంవత్సరములోఇశ్రాయేలు ఈ వ్యవస్థను నిర్మించింది. అప్పటి నుండి ఈ వ్యవస్థ అనేక దాడులను సమర్ధం గా ఎదుర్కొంది. ఇశ్రాయేలు దేశానికి బద్ద శత్రువులుగా ఉన్నదేశాలకు రష్యా దేశం తన టెక్నాలజీ పంపిస్తూ ఉంది. రష్యా దేశం తానే స్వయముగా ఇశ్రాయేలు దేశం మీద దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? యెహెఙ్కేలు ప్రవక్త ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. రష్యా దేశం ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వెళ్తుంది అని 2500  సంవత్సరములకు ముందే యెహెఙ్కేలు తెలియజేశాడు. 

   రష్యా దేశం ఎంతో శక్తి కలిగిన దేశం. ఇశ్రాయేలు దేశం కంటే 800 రెట్లు విస్తీర్ణం కలిగిన దేశము. దాని దగ్గర 20 లక్షల మంది సైనికులు ఉన్నారు.ప్రపంచం మొత్తము 14000 అణుబాంబులు ఉంటే, అందులో సగం కంటే ఎక్కువ 6400 ఒక్క రష్యా దగ్గరే ఉన్నాయి. ఇంకా 13000 ట్యాంకులు, 27,100 యుద్ధ వాహనాలు ఉన్నాయి.అంత శక్తివంతమైన దేశాన్ని ఇశ్రాయేలు వంటి బుల్లి దేశం ఎలా ఎదుర్కొనగలదు? రష్యా నాయకత్వములో అనేక దేశాలు ఇశ్రాయేలు మీద దురాక్రమణ కు పాల్పడతాయి అని యెహెఙ్కేలు ప్రవక్త 38 అధ్యాయములో మనకు తెలియజేస్తున్నాడు. రష్యా ఎందుకు ఇశ్రాయేలు మీద దాడి చేస్తుంది? 

11 వచనము చూద్దాము: 

నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలో నుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను.     యెహెఙ్కేలు 38 

రష్యా, దాని మిత్ర దేశాలు చిన్న దేశమైన ఇశ్రాయేలు మీదకు వెళ్తాయి. ఆ దేశాన్ని దోచుకోవటానికి, దానిని నిర్మూలించడానికి రష్యా, దాని మిత్ర దేశాలు ఈ పనిచేస్తాయి.‘వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై’ ఇశ్రాయేలు దేశం ఎంతో ఐశ్వర్యముతో నిండి ఉంది. వారు ఎన్నో పరిశ్రమలు పెట్టుకొన్నారు, ఎడారి లాంటి ప్రాంతాన్ని పచ్చటి తోటవలె  మార్చారు. అనేక టెక్నాలజీ కంపెనీలు పెట్టారు. సముద్రములోని ఉప్పు నీటిని మంచి నీటిగా  మారుస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ని పెంచారు. వాక్సిన్ తయారీలో ముందున్నారు. ఎంతో ఐశ్వర్యం ఆ దేశములో ఉంది. దానిని దోచుకోవడానికి ఈ దేశాలు వెళ్తున్నాయి. ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుంది? 

8 వచనంలో మనం చదువుతాము.ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించుజనులందరియొద్దకును నీవు వచ్చెదవు.ఇక్కడ  మీరు గమనిస్తే, ‘ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చెదవు’ ఇది 1948 తరువాతే ఇది సాధ్యము ఎందుకంటే ఆ సంవత్సరం తరువాతే యూదులు ఇశ్రాయేలు దేశం ఏర్పరచుకున్నారు. “ఇశ్రాయేలీయుల పర్వతములమీదనివ సించుటకై” 1967 లో ఆరు రోజుల యుద్ధం తరువాత పర్వతముల  మీద అధికారం యూదులకు వచ్చింది. అప్పటి నుండి యూదులు ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించడం ప్రారంభించారు. 

    యెహెఙ్కేలు 36-37 అధ్యాయాల్లో ఇశ్రాయేలు దేశం ఏర్పడుట గురించి యెహెఙ్కేలు ప్రవచించాడు. 40-48 అధ్యాయాల్లో వెయ్యేళ్ళ పాలన గురించి ప్రవచించాడు. మధ్యలో 38 అధ్యాయములో ఈ రష్యా యుద్ధం గురించి వ్రాశాడు. దీనిని బట్టి, 1967 కు వెయ్యేళ్ళ పాలనకు మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది అని మనకు అర్ధ మవుచున్నది. “ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.”ప్రస్తుతము యూదులు నిర్భయముగా నివసించే పరిస్థితి లేదు. వారు నిర్భయముగా ఎప్పుడు ఉంటారు? మత్తయి సువార్త 24 అధ్యాయములో యేసు ప్రభువు మనకు ఒలీవల కొండ ప్రసంగములో అనేక సంగతులు చెప్పాడు.

7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.15. కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక

                      మత్తయి 24

    ప్రపంచ అంతము లో జరుగబోయే కార్యాల గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యుద్ధాలు, హింస, అల్లర్లు, కరువులు, భూకంపాలు, రోగాలు ప్రపంచ మంతా విస్తరిస్తాయి. ప్రవక్తయైన దానియేలుద్వారాచెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూస్తారు. అంత్య క్రీస్తు ఆ పని చేస్తాడు. యెరూషలేము లో నిర్మించబడి దేవుని ఆలయములో అంత్య క్రీస్తు ఒక హేయవస్తువును ఉంచుతాడు. అంత్య క్రీస్తు 7 సంవత్సరాల పాలనలో కొంత కాలము యూదులతో  శాంతి ఒప్పందం చేసుకొంటాడు. దానియేలు గ్రంథం  9:27 లో మనం ఆ సత్యం చదువుతాము.  అతడు ఒక వారమువరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును; ఒక వారం.. అంటే 7 సంవత్సరములు అంత్య క్రీస్తు యూదులతో ఒప్పందం చేసుకొంటాడు. ఆ సమయములో ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసిస్తారు. అంత్య క్రీస్తు పాలనలో ఈ యుద్ధము జరుగుతుంది అని మనకు అర్ధం అవుతున్నది. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు దేశం ఎలా ఎదుర్కొంటుంది? బబులోను లో యెహెఙ్కేలు ఈ ప్రవచనం చేసినప్పుడు దానిని వినిన వారు ఎంతో ఆందోళన చెంది ఉంటారు. బబులోను వారు యెరూషలేము వచ్చి రచ్చ రచ్చ చేసి ఎంతో కాలం కాలేదు. దేవా, మా దేశాన్ని నీవు రక్షించలేవా? అనేప్రశ్న వారికి తప్పని సరిగా వస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక యూదులను వారి దేశములో నుండి ఎవ్వరూ వెళ్లగొట్టలేరు. 

18 వచనం చూద్దాము: 

ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.

                  యెహెఙ్కేలు 38:18-22

ఇక్కడ దేవుడు ఒక సూపర్ నాటురల్ వార్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రపంచం చూడనటువంటి గొప్ప యుద్ధము అప్పుడు జరుగుతుంది. ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు అగ్ని గంధకములు కురిపిస్తాడు. నిర్గమ కాండములో మనం చూస్తే దేవుడు ఐగుప్తు మీద తన తీర్పులు కుమ్మరించాడు. ఇశ్రాయేలీయులను కాపాడాడు, వారి శత్రువులను శిక్షించాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుంది. పరలోకములో నుండి తన తీర్పులను కుమ్మరిస్తాడు. ఇశ్రాయేలీయులను కాపాడుచూ వారి శత్రువులను కఠినముగా శిక్షిస్తాడు. మృతుల సంఖ్య ఎలా ఉంటుంది? 39 అధ్యాయము 11,12 వచనాలు చదువుదాము.ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులుపోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను.దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.

           యెహెఙ్కేలు 39:11,12

పాతి పెట్టడానికి  కూడా స్థలము లేదు. మృతులను పాతిపెట్టడానికే ఇశ్రాయేలీయులకు 7 నెలలు పట్టింది. ప్రపంచమంతా మైండ్ బ్లాక్ అయి కళ్లప్పగించి చూసే గొప్పవిజయాన్ని దేవుడు ఇశ్రాయేలు దేశానికి ఆ రోజు ఇస్తాడు.నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.

                     యెహెఙ్కేలు 38:23 

నిజముగా ఈయన ఎంత గొప్ప దేవుడు. రష్యా లాంటి ప్రపంచ శక్తి, తన మిత్ర దేశాలతో కలిసి వెళ్లి ఇశ్రాయేలు దేశము మీద దాడి చేస్తే, ఆ చిన్న దేశాన్ని తన ఆశ్చర్య కరమైన శక్తితో ఈ దేవుడు రక్షించాడు అని ప్రపంచ ప్రజలందరూ దేవుని మహిమపరుస్తారు. యెహెఙ్కేలు 38-39 అధ్యాయాల్లో మనం గ్రహించే సత్యం అదే. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచి పెట్టడు.విపత్కర సమయాల్లో కూడా ఆయన వారిని రక్షిస్తాడు.

   ఈ రోజు మన ప్రపంచములో ఎటు చూసినా ఎంతో అనిశ్చితి మనకు కనిపిస్తున్నది. ఏ రోజు ఏ దుర్వార్త వినాలో అనే భయాందోళన అన్ని ప్రాంతాల్లో ఉంది. తీవ్రవాదులు చాలా చోట్ల రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. క్రైస్తవులకు అనేక చోట్ల శ్రమలు కలుగుతున్నాయి. కరోనా లాంటి అంటు వ్యాధులు ప్రపంచాన్ని పీడిస్తున్నాయి.కరోనా తో బయటపడితే, వైట్ ఫంగస్ అని, బ్లాక్ ఫంగస్ అని క్రొత్త రోగాలు అంటుకొంటున్నాయి.అనేక మంది కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు.వందల మంది పాస్టర్లు చనిపోయారు.హాస్పిటల్ లో బెడ్ దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.ఆక్సిజన్ సిలిండర్ దొరకక రోగులు ఇబ్బంది పడుతున్నారు.వెంటిలేటర్లు లేవు, వాక్సిన్ లు లేవు.ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక ఆస్తి పాస్తులు అమ్ముకున్న వారిని నేను చూశాను. ఆందోళన తట్టుకోలేక అనేక మంది మానసిక రోగాలకు గురిఅవుతున్నారు.ఆత్మ హత్యలు చేసుకొంటున్నారు. నదుల్లో వందలాది మృత దేహాలు కొట్టుకురావడం మనం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనకు నిరీక్షణ ఎలా కలుగుతుంది? ఇలాంటి చీకటి రోజుల్లో కూడా మనం దేవుని యందు నిరీక్షణ  ఉంచవచ్చు. హెబ్రీ 13:8 లో మనం చదువుతాము: 

 Jesus Christ is the same yesterday, and today, and for ever.యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. 

                    హెబ్రీ 13:8

ప్రభువైన యేసు క్రీస్తు నిన్న, నేడు, ఎల్లప్పుడూ ఒక్కటే రీతిగా ఉండే దేవుడు. యుగయుగములకు మార్పు లేని దేవుడు. అలాంటి దేవుడు చేతిని పట్టుకొని మిమ్ములను నడిపిస్తూ ఉన్నాడు. మీరు దేనిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఆ రక్షకుని యొద్దకు వచ్చి, పాప క్షమాపణ పొంది, మీరు రక్షణ పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం

Leave a Reply