‘యెహెఙ్కేలు చెప్పిన సువార్త’

బైబిల్ గ్రంథములో యెహెఙ్కేలు గ్రంథం 36 అధ్యాయము లో నుండి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 24 వచనం నుండి కొన్ని మాటలు చూద్దాము. 

24. నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. 25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును,  మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.27. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.28. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును. యెహెఙ్కేలు 36 ఈ వాక్య భాగములో యెహెఙ్కేలు ప్రవక్త మనకు మంచి శుభవార్త తెలియజేశాడు. 

ఇందులో నుండి ఈ రోజు 12 సత్యాలు మీకు తెలియజేయాలని నేను ఆశ పడుతున్నాను. 

  1. పునరాగమనం 

మొదటిగా పునరాగమనం ఈ వాక్యభాగములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించుట మనకు కనిపిస్తుంది. ఈ మాటలు వ్రాయబడినప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను దేశములో బానిసలుగా ఉన్నారు. దేవుడు వారికి తన ప్రవక్త అయిన యెహెఙ్కేలు ద్వారా ఒక సువార్త పంపిస్తున్నాడు. ‘నేను మీ దగ్గరకు మరల వస్తాను. మిమ్ములను రక్షిస్తాను. దీనిని మనం ‘యెహెఙ్కేలు చెప్పిన సువార్త’ అని పిలుచుకోవచ్చు. యూదులకు, అన్యులకు దేవుడు ఒకే రకమైన సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తముగా నశించిన స్థితిలో ఉన్న యూదులను దేవుడు వారి పాపములలో నుండి రక్షించి, వారికి తన పరిశుద్ధాత్మను ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మనకు లభించిన సువార్త కూడా అదే. 

     జక్కయ్య ఇంటికి వెళ్లి యేసు ప్రభువు ఒక మాట అన్నాడు: ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను’. పాపములో నశించిన మనలను వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. యెహెఙ్కేలు అదే శుభవార్తను యూదులకు చెబుతున్నాడు: దేవుడు మరో సారి మీ దగ్గరకు వస్తాడు. మీ పాపముల నుండి మిమ్ములను రక్షిస్తాడు. పునరాగమనం లో మనకు కనిపించేది అదే. 

పునఃదర్శనం 

ఆ తరువాత పునః దర్శనం. 36:1-15 వచనాలు చూస్తే దేవుడు ఇశ్రాయేలీయుల శత్రువులకు తీర్పు తీర్చాడు. ఇశ్రాయేలు చుట్టూ అనేక శత్రు దేశాలు ఉన్నాయి. యూదులను బబులోను వారు శిక్షించడం చూసి వారు దేవునికి భయపడలేదు. మారు మనస్సు పొందలేదు. ‘మీ దేవునికి శక్తి లేదు. ఆయన వల్ల ఏమీ కాదు’ అని వారు దేవుని అపహాస్యం చేశారే కానీ మారు మనస్సు పొందలేదు. ఈ రోజు అలాంటి పరిస్థితే మనం చూస్తున్నాము. కరోనా పాండమిక్ చూసి దేవునికి భయపడి మారు మనస్సు పొందాలి అని మనం ఆశిస్తాము. అయితే చాలా మంది మారు మనస్సు పొందకపోగా, ‘దేవునికి కరోనా ను ఆపే శక్తి లేదు’ అని దేవుని అపహాస్యం చేస్తున్నారు. 23 వచనం చూడండి: 

“అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును”పునరుదర్శనం: దేవుడు మరో సారి దర్శనం ఇవ్వబోవుతున్నాడు. “అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును” ఇశ్రాయేలీయులకు దేవుడు తన దర్శనాన్ని మరొక సారి అనుగ్రహించాడు. 

పునరుద్ధరణ 

మూడవదిగా పునరుద్ధరణ. తన ప్రజలతో దేవుడు తాను చేసిన నిబంధనను దేవుడుపునరుద్దరించబోవుతున్నాడు. అది ఎంత మంచి వార్త! ఒక క్రొత్త నిబంధన దేవుడు వారితో చేశాడు. ఆ నిబంధన మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేరింది. ఇక్కడ మనకు దేవుని యొక్క నమ్మకత్వము కనిపిస్తున్నది. అబ్రహాము తో తాను చేసిన నిబంధనను దేవుడు మరచిపోలేదు. యాకోబుకు తాను చేసిన వాగ్దానాలను దేవుడు మరచిపోలేదు. మోషే ద్వారా తాను చేసిన క్రియలను దేవుడు మరచిపోలేదు. దావీదు ద్వారా తాను స్థిరపరచిన దేశాన్ని దేవుడు మరచిపోలేదు. ఇశ్రాయేలీయులు దేవుని మరచిపోయి, అన్య దేవతల వైపు వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మాత్రం తన ప్రజలను విడిచిపెట్టలేదు. దేవుని యొక్క మంచితనము మనకు ఇక్కడ కనిపిస్తున్నది. 

పునరేకీకరణ v.24 

ఆ తరువాత పునరేకీకరణ. 24 వచనం చూద్దాము: 24. నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆయా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశము లోనికి మిమ్మును రప్పించెదను. యెహెఙ్కేలు 36:24

దేవుడు చేసిన పునరేకీకరణ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. దేవుడు తన ప్రజలను వారి స్వదేశానికి తీసుకొని వెళ్తున్నాడు. అది ఆషా మాషీ విషయం కాదు. మీకు స్థలం ఉంటే దానిని రిజిస్ట్రేషన్ చేయించుకొంటారు, సరిహద్దులు వేయించుకొంటారు, దాని మీద ఒక కన్ను వేసి ఉంటారు. అన్ని చేసిన భూ కబ్జా దారులు ఆ స్థలము మీ దగ్గర నుండి దొంగిలించవచ్చు. భూ కబ్జాల వలన ఎంతో మంది తమ స్థలాలు కోల్పోయారు. ఆ స్థలం మీరు తిరిగి పొందాలంటే ఎంతో కష్టం. ఇశ్రాయేలీయులు తమ దేశం మొత్తం కోల్పోయారు. యిర్మీయా విధించిన 70 సంవత్సరముల శిక్ష ముగిసిన తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి తమ దేశానికి వెళ్లారు. దేవుని యొక్క శక్తి అక్కడ మనకు కనిపిస్తున్నది. ‘మా స్థలము మాకు ఇవ్వండి’ అని ఇశ్రాయేలీయులు అడిగితే తేరగా ఇవ్వటానికి అక్కడ ఎవరూ కాచుకొని కూర్చోలేదు. దేవుడు కోరెషు (సైరస్) చక్రవర్తి ద్వారా తన చిత్తాన్ని జరిగించి వారికి వారి దేశాన్ని అప్పగించాడు. 

    క్రీ. శ 70 తరువాత కూడా ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు దేశం నుండి ప్రపంచమంతా చెల్లాచెదురయ్యారు. రెండు వేల సంవత్సరాల తరువాత క్రీ. శ 1948 లో దేవుడు ఇశ్రాయేలీయులను మరోసారి ఇశ్రాయేలు దేశములో సమకూర్చాడు. రెండు సంవత్సరాలు మీ స్థలము మీరు పట్టించుకోకపోతే అది కబ్జా కు గురవుతుంది. ఇరవై సంవత్సరాల తరువాత మీ స్థలం కోసం మీరు వెళ్ళితే మీ వైపు చూసేది ఎవరు? రెండు వందల సంవత్సరాల తరువాత వెళ్ళితే మీ స్థలం మీకు దక్కుతుందా? రెండు వేల సంవత్సరాల తరువాత వెళ్ళితే, మీ స్థలం మీకు దక్కుతుందా? 

   ఈ రోజు మీరు ఇశ్రాయేలు దేశం వైపు చూడండి. యూదులు అక్కడకి తిరిగి వెళ్తున్నారు. ‘ఇది దేవుడు మా పితరులకు ఇచ్చిన స్థలం. మాకు తిరిగి ఇవ్వండి’ అంటున్నారు. అయితే, అరబ్బులు ఏమంటున్నారు? ‘ఇది మా స్థలం రా, మీకెందుకు ఇస్తాము రా. మర్యాదగా వెళ్లిపోండి, లేకపోతే ప్రాణాలు తీస్తాము’. అనేక శ్రమలు, హింస ను ఓర్చుకొని యూదులు ఇశ్రాయేలు దేశములో స్థిరపడడం మనం చూస్తున్నాము. దేవుని వాగ్దానము వలన పునరేకీకరణ జరుగుతున్నది. 

పునరుజ్జననం 

ఆ తరువాత పునరుజ్జననం. 25 వచనం: మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును. ఆ మాటలు మీరు గమనించండి. మీ అపవిత్రత నేను పోగొడతాను. మీ మీద శుద్ధ జలము చల్లుతాను. యోహాను సువార్త 3 అధ్యాయములో యేసు ప్రభువు నీకొదేముతో ఒక మాట అన్నాడు: నీకొదేము, ‘నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునుచూడలేవు’ దేవుని రాజ్యమును చూడాలంటే మనం క్రొత్తగా జన్మించాలి. దేవుడు ఆ పునర్జన్మ ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడు. నేను మీ మీద శుద్ధ జలము చల్లి మీ అపవిత్రత పోగొడతాను. 

పునరుజ్జీవం 

ఆ తరువాత పునరుజ్జీవం, ఎండిన ఎముకలను దేవుడు జీవముతో లేపాడు. ఆ తరువాత పునరుజ్జీవం. 26 వచనం చూద్దాము: నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపుగుండెను మీకిచ్చెదను.  

                       యెహెఙ్కేలు 36:26

దేవుడు వారికి క్రొత్త జీవమును ఇస్తున్నాడు. నూతన హృదయము, నూతన స్వభావము వారికి ఇస్తున్నాడు. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె వారికి ఇచ్చాడు. రాతి గుండె ఉంటే మనం దేనికీ స్పందించం, దేనికీ చలించం. అయితే మాంసపు గుండె ఉంటే, మన హృదయానికి స్పందన ఉంటుంది. ఆ హృదయములో జీవం ఉంటుంది. ఎందుకంటే, 27 వచనం నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.            యెహెఙ్కేలు 36:27

దేవుడు తన పరిశుద్దాత్మ ను వారికి అనుగ్రహించాడు. అంత కన్నా గొప్ప ఆస్తి మరొకటి లేదు. 

పునరావాసం: 

ఆ తరువాత పునరావాసం. 28 వచనం చూద్దాము: నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. 

  యెహెఙ్కేలు 36:28

ఇశ్రాయేలులకు దేవుడు వారి దేశములోనే వారికి పునరావాసం కల్పించాడు. ‘ప్రపంచమంతా వెళ్లిపోయారు కదా, ఎక్కడెక్కడికి వెళ్లిపోయారో అక్కడే సర్దుకోండి’ అని వారితో అనలేదు. అబ్రహాముతో నేను చేసిన వాగ్దానము ప్రకారం ఇశ్రాయేలు దేశములోనే నేను మీకు పునరావాసం కల్పిస్తాను. ఈ రోజు మీరు యెరూషలేము లో చూస్తే, అబ్రహాము తిరిగిన ప్రదేశములో, దావీదు తిరిగిన ప్రదేశములో, సొలొమోను తిరిగిన ప్రదేశములో యూదులు నివాసం చేస్తున్నారు. 

పునరుత్పాదన 

ఆ తరువాత పునరుత్పాదన

29 వచనం చూద్దాము:  మీకు కరవు రానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.దేవుడు యూదులకు మరొక వాగ్దానం చేసాడు. ఈ భూమి సేద్యము చేయబడుతుంది. ఎండి పోయిన మీ పొలాలు మరోసారి పంటలు పండిస్తాయి. కాలి  పోయిన మీ చెట్లు మరోసారి చిగురిస్తాయి. మీ చెట్ల పంటలను, భూమి పంటను నేను విస్తరింపజేసెదను. ఈ రోజు ఇశ్రాయేలు దేశం వ్యవసాయములో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానములో ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందే వ్యవసాయ పద్దతులను వారు కనుగొన్నారు. అయితే ఇది ఒక టీజర్ మాత్రమే. వెయ్యేళ్ళ పాలనలో అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు రాజ్యములో ఆ భూమి ఇంకా సారవంతముగా మారుతుంది. 

పునరాలోచన 31 

ఆ తరువాత పునరాలోచన.  31 వచనం చూద్దాము.  అప్పుడు మీరు మీ దుష్‌ ప్రవర్తనను, మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియ లను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

              యెహెఙ్కేలు 36:31

ఇశ్రాయేలీయులు పునరాలోచన చేయాలి అని దేవుడు అంటున్నాడు. నీ పాపమును చూసి నీవు అసహ్యించుకోవాలి. అని దేవుడు వారితో అంటున్నాడు. నువ్వు చేసిన పాపాలు అసహ్యించుకొంటున్నావా? నేను చేసిన పాపాలు ఎంత ఘోరమైనవి అనుకొంటున్నావా? లేక నేను చేసిన పాపాలు నన్ను  చాలా సుఖపెట్టాయి, నాకు చాలా సంతృప్తి నిచ్చాయి అని అనుకొంటున్నావా? నీవు చేసిన పాపములను బట్టి, నీ దోషములను బట్టి, నీ హేయ క్రియలను బట్టి సిగ్గుపడు, వాటిని అసహ్యించుకో అని దేవుడు ఈ వాక్యభాగములో మనతో అంటున్నాడు. 

పునరంకితం 

ఆ తరువాత పునరంకితం. 33 వచనం. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తాను. 

    యెహెఙ్కేలు 36:33

ఇశ్రాయేలీయులు చేయని పాపం లేదు, వారు పూజించని విగ్రహం లేదు, అయితే దేవుడు వారికి శుభవార్త చెప్పాడు: నేను మీ దోషములను తీసివేస్తాను. మీ అపవిత్రతను కడిగివేస్తాను మీ పాపములను నిర్మూలిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి పునరంకితం అయ్యే అవకాశం వారికి కలిగింది. ఇప్పుడు మనకు దేవుడు అదే అవకాశం ఇస్తున్నాడు. 

“యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల,ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును”

                                   1 యోహాను 1:7-9 

దేవుడు యేసు క్రీస్తు రక్తము వలన మన పాపములను కడిగి వేస్తున్నాడు. మనం మన పాపములు ఒప్పుకొంటే ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తున్నాడు. 

పునర్నిర్మాణం 

ఆ తరువాత పునర్నిర్మాణం. 33 వచనం చూద్దాము. నేను మీ పట్టణములలోమిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును. యెహెఙ్కేలు 36:33. దేవుడు పాడై పోయిన స్థలములు మరల కట్టేవాడు. బబులోను వారు యెరూషలేమును మొత్తం తగులబెట్టి వెళ్లారు. యూదులను బబులోనుకు బానిసలుగా తీసుకొనివెళ్ళారు. పాడై పోయిన స్థలముగా యెరూషలేము మారింది. అయితే దేవుడు దానిని వదలిపెట్టలేదు. దానిని తిరిగి నిర్మించటానికి తన సేవకులను పంపించాడు. దానిలో తిరిగి నివసించటానికి తన ప్రజలను తీసుకొని వచ్చాడు. నా పని అయిపొయింది, నాకు ఆశ లేదు, నాకు నిరీక్షణ లేదు, నాకు మార్గము లేదు, నాకు భవిష్యత్తు లేదు, అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే, దేవుడు పాడై పోయిన స్థలములు మరల కట్టేవాడు. మీ జీవితాన్ని తిరిగి నిర్మించే శక్తి దేవునికి ఉంది. ఒక క్రొత్త దేశాన్ని వారికి ఇచ్చాడు, ఒక క్రొత్త నగరాన్ని వారికి ఇచ్చాడు, ఒక క్రొత్త ఆలయాన్ని వారికి ఇచ్చాడు. యెహెఙ్కేలు 40-48 అధ్యయాలు మీరు చదవండి. యేసు క్రీస్తు పాలనలో నిర్మించబోయే గొప్ప దేవుని ఆలయం అక్కడ మనకు కనిపిస్తుంది. సొలొమోను గొప్ప ఆలయం కట్టాడు. అంత కంటే ఎంతో వైభవమైన నగరం దేవుడు కట్టబోవుచున్నాడు. అంత కంటే ఎంతో వైభవమైన ఆలయం కట్టబోవుతున్నాడు. అంత కంటే ఎంతో పవిత్రమైన యాజకులు దానికి ఇవ్వబోవుతున్నాడు. అంత కంటే ఎంతో మహిమ కలిగిన రాజును వారికి ఇవ్వబోవుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు సొలొమోను కంటే గొప్ప వాడు. (లూకా సువార్త 11:31)

పునరుత్తేజం 

చివరిగా పునరుత్తేజం. 35 వచనం చూద్దాము. యెరూషలేము స్వరూపాన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. ఏదెను వనము వలె నేను దానిని మారుస్తాను అంటున్నాడు. 38 వచనము. నియామకదినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను, వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

                  యెహెఙ్కేలు 36:35

దేవుని ఆరాధించే వారితో యెరూషలేము నిండిపోయింది. ఒక క్రొత్త ఉత్తేజం వారిని కమ్ముకొంది. దేవుని ఆరాధనతో ఆ ప్రదేశం నిండిపోయింది. దేవుని కీర్తనలతో ఆ నగరం నిండిపోయింది. 

మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దాని నగరులలో దేవుడాశ్రయముగ ప్రత్యక్షం బగుచున్నాడు రాజు లేకముగా కూడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్లిరి. రాజు లేకముగా కూడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్లిరి. మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవుని ఆరాధనతో ఆ రోజు యెరూషలేము నిండి పోబోవుచున్నది. 

ముగింపు: 

యెహెఙ్కేలు 36 అధ్యాయము నుండి ‘యెహెఙ్కేలు ప్రకటించిన సువార్త’ అనే అంశం ఈ రోజు మనం చూశాము. ‘యెహెఙ్కేలు ప్రకటించిన సువార్త’

1.పునరాగమనం 

2. పునః దర్శనం 

3. పునరుద్ధరణ 

4. పునరేకీకరణ 

5. పునరుజ్జననం 

6. పునరుజ్జీవం 

7. పునరావాసం 

8. పునరుత్పాదన  

9. పునరాలోచన 

10. పునరంకితం 

11. పునర్నిర్మాణం 

12. పునరుత్తేజం 

యెహెఙ్కేలు ఈ సువార్తను యూదులకు ప్రకటించాడు. అది మనకు కూడా సువార్తే. ఎందుకంటే క్రీస్తు నందు యూదులకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. సువార్త కేవలం ఆత్మ సంభందమైనదే కాదు. అది భౌతిక సంబంధమైనది. దేవుడు ఒక భౌతిక దేశాన్ని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ దేశములో ఒక రాజ్యము, అక్కడ ఒక ప్రజలు, వారికి ఒక మెస్సియా, వారికి ఒక గొప్ప ఆలయం, వారి చుట్టూ ఆశీర్వదించబడిన ప్రకృతి. అవన్నీ సువార్తలో భాగమే. ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత విమోచించ బడిన ప్రతి వ్యక్తికీ అందులో భాగం ఉంది. రక్షకుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి, మీరు ఆ ఆశీర్వాదాన్ని వ్యక్తిగతముగా పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply