మత్తయి సువార్త పరిచయం: డాక్టర్ పాల్ కట్టుపల్లి 

ఈ రోజు క్రొత్త నిబంధన గ్రంథం లో మత్తయి సువార్త ను చూద్దాము. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త తో మొదలవుతుంది. ప్రభువైన యేసు క్రీస్తు జన్మ, జీవితం, బోధలు, మరణం, పునరుత్తానం – వీటిని గురించి తెలుసుకోవాలంటే మనం క్రొత్త నిబంధన లోని 4 సువార్తలు చదవాలి. మత్తయి,మార్కు,లూకా,యోహాను – ‘4 సువార్తలు మాకు సరిపోవు. మాకు ఇంకా ఎక్కువ సమాచారం కావాలి. అప్పుడే మేము యేసు క్రీస్తు గురించి ఆలోచిస్తాము’ అనే వారు ఉన్నారు. అయితే ఈ 4 సువార్తలు చాలు. మీరు యేసు క్రీస్తు గురించి 4 సువార్తలు చక్కగా చదివి అర్థం చేసుకొంటే ఆ సమాచారం చాలు. మీ పాపములనుండి మీరు రక్షింపబడాలంటే, మీ జీవితం ఆశీర్వదించబడాలంటే, దేవుని ప్రణాళిక మీకు అర్ధం కావాలంటే, పరిశుద్ధ జీవితం జీవించాలంటే, పరలోకానికి వెళ్లాలంటే, నరకం తప్పించుకోవాలంటే, ఈ 4 సువార్తలలో ఉన్న సమాచారం చాలు. 

మత్తయి సువార్త ను యేసు క్రీస్తు శిష్యుడు మత్తయి గారు, 

మార్కు సువార్తను యేసు క్రీస్తు శిష్యుడు పేతురు గారి అనుచరుడు మార్కు గారు, 

లూకా సువార్తను యేసు క్రీస్తు అపోస్తలుడు పౌలు గారి అనుచరుడు లూకా గారు, 

యోహాను సువార్తను యేసు క్రీస్తు శిష్యుడు యోహాను గారు వ్రాశారు. 

    ఈ నలుగురు యేసు క్రీస్తు జీవితకాలంలో జీవించి ఆయన గురించిన సమాచారం తమ వ్యక్తి గత అనుభవముల నుండి లేక ఇతరులు చెప్పిన సాక్ష్యా ధారముల మీద ఆధార పడి కానీ ఈ సువార్తలు వ్రాశారు. గ్రీకు చరిత్ర కారులో, రోమన్ చరిత్ర కారులో అటువంటి సాక్ష్యాధారాలు మనకు ఇవ్వలేరు. ప్రభువైన యేసు క్రీస్తుకు 12 మంది శిష్యులు ఉండేవారు. వారిలో మత్తయి ఒకడు. ఆయన ఒక టాక్స్ కలెక్టర్ గా పనిచేసేవాడు. టాక్స్ కలెక్టర్ అయ్యాడంటే కాస్తో, కూస్తో చదువుకొనే ఉంటాడు కదా. చదవటం, వ్రాయడం ఆయనకు తెలిసే ఉంటాయి. దేవుడు ఆయన ద్వారా ఈ పుస్తకం వ్రాయించాడు. ఆ రోజుల్లో యూదులు రోమన్లకు అనేక పన్నులు కట్టేవారు. ఒక ప్రక్క రోమన్ల పరాయి పాలన, మరో ప్రక్క వారు వేసే అధిక పన్నులు ప్రజలకు రోమన్ ప్రభుత్వం అంటే గొంతు దాకా కోపం ఉండేది. వారి క్రింద పనిచేసి, వారికి పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి వాళ్లంటే వారు అసహ్యించు కొనే వారు. టాక్స్ కలెక్టర్ అని చెబితే – ఈయన అవినీతి పరుడు అయి ఉంటాడు, అక్రమార్జన చేసి ఉంటాడు అని మనం అనుకోనక్కరలేదు. టాక్స్ కలెక్టర్ లలో కూడా నిజాయితీ గా పనిచేసే వారు చాలా మంది వుంటారు. మత్తయి అవినీతి పరుడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 

   అయితే ఆ రోజుల్లో టాక్స్ కలెక్టర్ లను యూదులు అసహ్యించుకొనేవారు. తన వృత్తికి గౌరవం లేదు అని మత్తయి గారికి తెలుసు. అయినప్పటికీ తన వృత్తి గురించి ఆయన చెప్పుకొన్నాడు. ‘నా బ్యాక్ గ్రౌండ్ ఇది. నన్ను యేసు క్రీస్తు రక్షించాడు’ అని ఆయన చెప్పుకొంటున్నాడు. అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్న దీనత్వం మనకు అక్కడ కనిపిస్తున్నది. ఒక రోజు యేసు ప్రభువు మత్తయి ఇంట్లో భోజనం చేశాడు. ‘మత్తయి, నువ్వు నన్ను వెంబడించు’ అని పిలిచాడు. వెంటనే మత్తయి యేసు ప్రభువు శిష్యుడు అయ్యాడు. ఈ మత్తయి సువార్త గురించి 7 సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 

క్రొత్త నిబంధన 

మొదటిగా క్రొత్త నిబంధన. మత్తయి సువార్తతో క్రొత్త నిబంధన గ్రంథం మొదలవుతుంది. పాత నిబంధన లో నుండి క్రొత్త నిబంధన లోకి ఇది మనకు మార్గం చూపిస్తుంది. యేసు క్రీస్తు ముందుగా యూదుల యొద్దకు పంపబడ్డాడు. నజరేతు వాడైన యేసు. ఈయన ఎవరు? పాత నిబంధనలోని ప్రవక్తలందరూ ఒక రక్షకుని గురించి ప్రవచించారు. దేవుడు ఒక మెస్సియా ను ఈ లోకానికి పంపిస్తాడు అని వారు చెప్పారు. వాటి నెరవేర్పే యేసు క్రీస్తు. 

    ఈ మధ్యలో నేను ఒక చోటకు వెళ్లాల్సి వచ్చింది. ఒక టాక్సీ మాట్లాడుకొన్నాను. ఆ టాక్సీ డ్రైవర్ తో నేను మాట్లాడు తున్నాను. ‘నువ్వు ఆత్మీయముగా ఎలా ఉన్నావు?’ అని అతని అడిగాను. ‘నేను దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను కానీ ఏ మతాన్నీ అవలంబించను. నేను యూదుడను’. నేను అతనితో చెప్పాను: ‘నీవు యూదుడవా, అయితే దేవుడు యేసు క్రీస్తు అనే రక్షకుని నీ కోసం పంపించాడు. అబ్రహాము, మోషే, దావీదు, యెషయా, యిర్మీయా ఆ ప్రవక్తలందరూ ఎదురు చూసిన రక్షకుడు యేసు క్రీస్తే’ అని అతనికి చెప్పాను. ఆ విధముగా నాకు ఎక్కడైనా యూదులు కనిపిస్తే నేను వారికి ఆ మాట చెబుతాను. ఇక్కడ మత్తయి తన సువార్త లో కూడా అదే లక్ష్యం పెట్టుకొన్నాడు: ఓ యూదు సోదరులారా, దేవుడు మీ ప్రవక్తల ద్వారా మీకు వాగ్దానం చేసిన రక్షకుడు ఈ యేసు క్రీస్తే. దాదాపు 129 సార్లు ఆయన పాత నిబంధనను ప్రస్తావించాడు. దేవుడు మీ పూర్వికులతో చేసిన వాగ్దానాలు, దేవుడు తన ప్రవక్తలకు చేసిన ప్రవచనాలు, తన ప్రజలతో చేసిన క్రొత్త నిబంధన ఈ యేసు క్రీస్తు నందు నెరవేరింది. 

క్రొత్త రాజు 

రెండోదిగా క్రొత్త రాజు మత్తయి సువార్తలో యేసు క్రీస్తు ప్రభువు ‘రాజుగా’ మనకు చూపించబడ్డాడు. ఈయన నీతి గల దేవుని రాజు. ‘యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు?’ అని తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు. మత్తయి యేసు క్రీస్తును ‘దావీదు కుమారుని’ గా చూపించాడు. దావీదు కుమారునిగా యెరూషలేములోని దావీదు సింహాసనము మీద కూర్చొనే అర్హత ఆయనకు మాత్రమే ఉంది. అప్పుడు యూదయను పాలిస్తున్న హేరోదు రాజుకు పాలించే హక్కు లేదు. హేరోదు దావీదు కుమారుడు కాదు. అతడు అబ్రహాము కుమారుడు కాదు. చాలా మంది ప్రాణాలు తీసి హేరోదు తన అధికారము నిలుపుకొన్నాడు. రాజ్యం కోసం భార్యను, కన్న బిడ్డలను కూడా చంపించిన వాడు ఈ హేరోదు. పరలోక మహిమ ను త్యాగం చేసి మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవుని రాజు యేసు క్రీస్తు. క్రీస్తు అనే ఈ రాజు హేరోదు  అటువంటి వాడు కాదు. ఆయన మనము ప్రేమతో ఆయన అధికారమును అంగీకరించాలి అని కోరుకొంటున్నాడు. 

    యూదులు నివసిస్తున్న యూదయ ప్రాంతము  రోమన్ సామ్రాజ్యములో ఒక భాగముగా ఉంది. వారంతా రోమన్ చక్రవర్తి బలపరచిన హేరోదు రాజు క్రింద అణిగి మణిగి జీవిస్తున్నారు. మేము ఈ బానిసత్వములో నుండి బయట పడాలి. మాకు స్వాతంత్రం కావాలి. మమ్ములను విడిపించే రాజు మాకు కావాలి. మమ్ములను రక్షించే మెస్సియా మాకు కావాలి. అని వారు ఎదురు చూశారు. మమ్ములను రోమన్ బానిసత్వం నుండి విడిపించు అని యూదులు యేసు క్రీస్తును అనేక సార్లు బలవంతం చేశారు. అయితే ఆయన వారి మాట వినలేదు. ఆయన ముందుగా వారి హృదయాలు మార్చాలి. ముందుగా వారి జీవితాలు మార్చాలి. యేసు క్రీస్తు మన హృదయానికి రాజుగా చేసుకోకుండా మన దేశానికి రాజుగా చేసుకోవడములో అర్థం లేదు. ఈ మెస్సియా బెత్లెహేము అనే గ్రామములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త ప్రవచించాడు. 

    ఆ ప్రవచనం ప్రకారమే ప్రభువైన యేసు క్రీస్తు బెత్లెహేము అనే గ్రామములో జన్మించాడు. ఈ రాజు పేదరికములో పుట్టాడు. ఆయన రాజ వంశములో పుట్టినప్పటికీ పశువుల తొట్టిలో పండుకోవలసి వచ్చింది. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన దేవుని రాజు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చాడు. మత్తయి సువార్త యొక్క ముఖ్య అంశం అదే. యేసు క్రీస్తు పరలోకం నుండి వచ్చిన రాజు గా మనకు ఈ సువార్తలో కనిపిస్తున్నాడు. 

క్రొత్త సందేశం (beatitudes) 

ఆ తరువాత ఈ మత్తయి  సువార్తలో ఒక క్రొత్త సందేశం వుంది. దీనిలో 60 శాతం యేసు క్రీస్తు ప్రభువు చేసిన ప్రసంగములతో నిండి ఉంది. 6 ముఖ్యమైన సందేశాలు యేసు క్రీస్తు ఈ సువార్తలో ఇచ్చాడు. 

  1. కొండ మీద ప్రసంగం (5-7 అధ్యాయాలు)
  2. అపోస్తలులకు బాధ్యతలు (10 అధ్యాయం) 
  3. దేవుని రాజ్యము గురించిన ఉపమానాలు (13 అధ్యాయం) 
  4. క్షమాపణ గురించి ప్రసంగం (18 అధ్యాయం) 
  5. పరిస్సయుల విమర్శ (23 అధ్యాయం) 
  6. ఒలీవల కొండ ప్రసంగం (24-25 అధ్యాయాలు) 

ఈ ప్రసంగాలు ఈ రాజు యొక్క వ్యక్తిత్వం, ఆయన నీతి, పరిశుద్ధత, ఆయన లక్ష్యాలు మనకు తెలియజేస్తున్నాయి. 

3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

5 సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.

7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.

ఎంతో రమ్యమైన ఈ కొండమీద ప్రసంగము మనకు ఇక్కడ కనిపిస్తున్నది. ‘హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు’. పోయిన వారం అమెరికా దేశములో సథరన్ బాప్టిస్ట్ డేనామినేషన్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ లో వారు 800 మంది పాస్టర్ల పేరులు వెల్లడించారు. వీరంతా చర్చి కి వెళ్లే మహిళల మీద అసభ్యముగా ప్రవర్తించడం, వారిని లైంగికముగా వేధించడం లాంటి పనులు చేశారు. 800 మంది పాస్టర్లు ఇలాంటి పనులు చేశారా అని ప్రపంచవ్యాప్తముగా అది సంచలన వార్త అయ్యింది. మాకు న్యాయము చేయండి అని వారి బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.హృదయ శుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా పాస్టర్లుగా, బిషప్ లుగా పనిచేయడం వలనే ఇలాంటి సంఘటనలు మన సంఘాల్లో పెరిగిపోతున్నాయి. యేసు క్రీస్తు ఒక క్రొత్త సందేశముతో ఈ లోకానికి వచ్చాడు. మీరు నా మాట చొప్పున నడచుకొంటే దేవుని నీతి మీ జీవితములో కనిపిస్తుంది. 

క్రొత్త రాజ్యం 

ఆ తరువాత, క్రొత్త రాజ్యం. మత్తయి తన సువార్త లో ‘దేవుని రాజ్యం’ అనే అంశం మీద కేంద్రీకరించాడు. మత్తయి 6:31-33 లో యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు: 

31 కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.              

32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.

                     మత్తయి 6

మనం ఎంతో సమయము ఈ లోక సంబంధమైన వాటి కోసం చింతిస్తూ బ్రతుకుతాము. నాకు ఆహారం ఎలా దొరుకుతుంది? నాకు నీరు ఎలా దొరుకుతుంది? నా ఇంటి పరిస్థితి ఏమిటి? నా వుద్యోగం పరిస్థితి ఏమిటి? వాటి గురించి విచారిస్తూ మనం ఆందోళన చెందుతూ ఉంటాము. అయితే యేసు ప్రభువు ఇక్కడ మనతో ఏమన్నాడంటే, మీరు ఆందోళన చెందవద్దు. దేవుని రాజ్యమును వెదకండి,దేవుని నీతిని వెదకండి మీ అవసరములు అన్నిటినీ దేవుడు తీరుస్తాడు. 

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

                  మత్తయి 5:44 

ఈ క్రొత్త రాజ్యములో చేరిన వారు తండ్రి అయిన దేవుని పిల్లులుగా ఉన్నారు. వారు శత్రువులను ప్రేమించాలి. హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. హింసించే వారి కోసం ఎలా ప్రార్థన చేయగలం? అని మనకు అనిపిస్తుంది. అయితే ప్రభువైన యేసు క్రీస్తు ఒట్టి మాటలు చెప్పలేదు. ఆయన జీవితములో ఆయన వాటిని పాటించాడు. సిలువ మీద ఆయనను రోమన్ సైనికులు ఎంతగా హింసించారో మనం వివరించలేము. అయితే ఆయన వారి కోసం కూడా ప్రార్థన చేశాడు. ఈ రోజు మిమ్ములను ఎవరైనా హింసిస్తూ ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. ఇది క్రొత్త రాజ్యం, దేవుని రాజ్యం. ఈ రాజ్య సంబంధులు అలా ఉండాలి. ఈ మధ్యలో అమెరికా దేశములో స్కూల్ షూటింగ్స్ పెరిగిపోయినాయి. టెక్సాస్ రాష్ట్రములో ఒక వ్యక్తి ఒక స్కూల్ లో ప్రవేశించాడు. 19 చిన్న పిల్లలను, ఇద్దరు టీచర్ లను విచక్షణ లేకుండా కాల్చివేశాడు. 

    ఆ తల్లిదండ్రులు చెప్పలేనంత వేదనకు గురయ్యారు.  ఆ స్కూల్ బయట వారు 21 మంది కొరకు 21 సిలువలు పాతారు. ఆ సిలువల మధ్యలో యేసు క్రీస్తు ఊహా చిత్రం ఒకటి పెట్టుకొన్నారు. వారి మాటల్లో ఎక్కడా ప్రతీకారం మనకు కనిపించదు. తమ బిడ్డలను చంపిన వారిని ఎవరైనా క్షమించగలరా? క్రైస్తవ విశ్వాసులు ఆ విధముగా చేశారు. మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనం చిన్న పిల్లల వలె మంచి మనస్సు కలిగిఉండాలి అని యేసు ప్రభువు చెప్పాడు. 

క్రొత్త ప్రజలు 

ఆ తరువాత మత్తయి సువార్తలో మనకు  ‘క్రొత్త ప్రజలు’ కనిపిస్తున్నారు. ‘సంఘము’ అనే మాట ఈ సువార్తలో మనకు కనిపిస్తుంది. 4 సువార్తలలో ‘సంఘము’ అనే మాట మత్తయి గారు మాత్రమే ఉపయోగించాడు. యేసు ప్రభువు పేతురు తో ఒక మాట అన్నాడు: ‘నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు’ 

                               మత్తయి 16:18 

‘సంఘము’ అంటే పిలువబడిన వారు. దేవుని చేత పిలువబడిన వారు. పాత నిబంధనలో అబ్రహాము తన దేశములో నుండి దేవుని చేత పిలువబడినాడు. ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీయులు దేవుని చేత పిలువబడిన వారు. ఇప్పుడు ‘క్రైస్తవ సంఘము’ కూడా దేవుని చేత పిలువ బడిన వ్యక్తుల సముదాయము గా ఉంది. అయితే క్రైస్తవ సంఘము యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో యూదులు, అన్య జనులు ఇద్దరూ దేవుని చేత పిలువబడిన వారుగా ఉన్నారు. బెత్లెహేములో యేసు క్రీస్తు ప్రభువు యూదుల రాజుగా జన్మించాడు. అయితే అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేము వెళ్లి క్రీస్తు శిశువును ఆరాధించి, పూజించి ఆయనకు కానుకలు సమర్పించారు. యేసు క్రీస్తు అన్యజనుల కోసం అద్భుతాలు చేశాడు (మత్తయి 8:5-13). 

తూరు, సీదోను లాంటి అన్యజనుల ప్రాంతాలకు వెళ్లి ఆయన వారికి సువార్త ప్రకటించాడు. (మత్తయి 15:21-28). ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి’ (మత్తయి 28:19) అని తన శిష్యులను యేసు క్రీస్తు ప్రపంచమంతా పంపించడం చివరి అధ్యాయములో మనకు కనిపిస్తుంది. యూదులు, అన్యులు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి ‘క్రైస్తవ సంఘము’ గా ఏర్పరచబడి క్రొత్త ప్రజలుగా చేయబడ్డారు. 

క్రొత్త ఆలయం 

దేవుని కొరకు ఒక క్రొత్త ఆలయం ప్రభువైన యేసు క్రీస్తు నిర్మించాడు. మత్తయి 21 లో మనం చూస్తాము. ఆ రోజుల్లో యెరూషలేములో గొప్ప ఆలయం ఉండేది. దానిలో జరుగుతున్న పనులు చూసి యేసు ప్రభువుకు చాలా కోపం వచ్చింది. ఆ దేవుని ఆలయాన్ని దాని నాయకులు ఒక వ్యాపార స్థలముగా మార్చివేశారు. డబ్బు సంపాదన తప్ప వారికి దేవుని మీద ఎలాంటి భయభక్తులు లేవు. దేవాలయం కు వచ్చే భక్తులను నిలువునా దోచుకొంటున్నారు. యేసు ప్రభువు వారి మీదకు వెళ్ళాడు. నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చివేశారు అని వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. ‘ఎంత ధైర్యం నీకు. నీ అంతు చూస్తాము’ అని వారు యేసు క్రీస్తును హత్య చేయాలని చూశారు కానీ తమ ప్రవర్తన మార్చుకోలేదు. మత్తయి సువార్త 24 లో మనం చూస్తే, అక్కడ యేసు ప్రభువు ఆ దేవాలయము కు అంతం పలికాడు. రాయి మీద రాయి కూడా లేకుండా ఈ ఆలయం కూల్చివేయబడుతుంది మత్తయి 24:2 అని ఆయన దానిని శపించాడు. క్రీ. శ 70 లో ఆ ఆలయం కూల్చివేయబడింది. 

ఆగస్టు 30, క్రీ.శ 70 యేసు క్రీస్తు చేసిన  ప్రవచనం నెరవేరింది. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, 

ఆగస్టు 30, క్రీస్తు పూర్వం 586 – మొదటి దేవుని ఆలయం నిర్మూలించబడింది. 

ఆగస్టు 30, క్రీ. శ  70 లో రెండవ ఆలయం నిర్మూలించబడింది. 

   దాని స్థానములో యేసు క్రీస్తు ఒక సజీవమైన దేవుని ఆలయం నిర్మిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడిన ప్రతి విశ్వాసి ఈ ఆలయములో ఒక సజీవమైన రాయిగా ఉన్నాడు. మత్తయి అసలు పేరు లేవీ (మార్కు 2:14) అతడు మారు మనస్సు పొందినప్పుడు యేసు క్రీస్తు అతనికి ‘మత్తయి’ అనే పేరు పెట్టాడు. మత్తయి అనే పేరుకు ‘దేవుని కానుక’ అని అర్థం. gift of God ఎంత చక్కని పేరు. అందులో దేవుని కృప మనకు కనిపిస్తున్నది. దేవుని కృప ఉచితముగా దేవుడు మనకు ఇచ్చిన కానుక. 

దేవుడు తన కృప చేత మనలను రక్షించి ఈ క్రొత్త ఆలయము లోనికి మనలను నిర్మిస్తున్నాడు. ఏ ప్రపంచ శక్తీ, ఏ మానవ శక్తి, ఏ సాతాను శక్తి, ఏ నరక శక్తి ఈ క్రీస్తు ఆలయమును కూల్చివేయలేవు. పాతాళ లోక ద్వారములు కూడా దీని ఎదుట నిలబడ లేవు. అంత శక్తి ఈ క్రొత్త ఆలయము నకు ఉంది. 

క్రొత్త ఆరాధన 

చివరిగా క్రొత్త ఆరాధన ఈ సువార్త లో మనకు కనిపిస్తుంది. 

ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన

ఉందునని చెప్పెను.

                     మత్తయి 18:20 

ఆరాధన అంటే పెద్ద పెద్ద కొండల మీదకు వెళ్ళాలి. పెద్ద పెద్ద ఆలయాల్లో కి వెళ్ళాలి బలులు, అర్పణలు చేయాలి యాగాలు, యోగాలు చేయాలి అని చాలా మంది అనుకొంటారు. అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరు మీద కూడుకొంటారో నేను వారి మధ్యన ఉంటాను అని యేసు ప్రభువు ఇక్కడ మనతో అంటున్నాడు. 

ఏ సమయములో నైనా, ఏ ప్రదేశములో నైనా మనం యేసు క్రీస్తును ఆరాధన చేయవచ్చు. అది దేవునికి ఇంపైన సువాసనగా వుంది. మత్తయి సువార్త లో నుండి ఈ రోజు మనం ఏడు సంగతులు చూసాము. 

క్రొత్త నిబంధన 

క్రొత్త రాజు 

క్రొత్త సందేశం 

క్రొత్త రాజ్యం 

క్రొత్త ప్రజలు 

క్రొత్త ఆలయం 

క్రొత్త ఆరాధన 

రక్షకుడైన క్రీస్తు యొద్దకు వచ్చి మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం. 

Leave a Reply