దేవుని చేత ఎన్నిక చేయబడుట

Election – ఎన్నిక చేయ బడుట 

ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములో మనకు కనిపించే గొప్ప సత్యాల్లో ఒకటి దేవుని చేత ఏర్పరచుకొనబడుట. ఎఫెసీ 1:5-6 వచనములు చదువుదాము. 

మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.జగత్తు పునాది వేయబడకమునుపే, దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 17 లో ఒక మాట అన్నాడు: జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను 17:24 

    దేవుడు ఈ ప్రపంచం పునాది వేయబడక మునుపే ప్రభువైన యేసు క్రీస్తును ప్రేమించాడు. అంటే యేసు క్రీస్తు భూమి మీద జన్మించక మునుపే దేవుని చేత ప్రేమించబడ్డాడు. 

  మనం కూడా ఈ భూమి మీద జన్మించకమునుపే దేవుడు మనలను ప్రేమించాడు. అయితే యేసు క్రీస్తు కు మనకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే. ఆయన భూమి మీద జన్మించక మునుపే పరలోకములో ఉన్న వాడు. మనం అలా కాదు. మనం భూమి మీద జన్మించక మునుపు మనకు ఉనికి (existence) లేదు. 

రోమన్, గ్రీకు దేవతలు 

   దేవుని యొక్క గొప్ప లక్షణం అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. క్రైస్తవ్యం లో  దేవుడు ఒక్కడే. ఆయన మానవ జాతికి వేరుగా ఉన్న వాడు. ఈ ఊరిలో ఒక రకముగా, ఇంకో ఊరిలో మరొక రకముగా ఆయన ఉండడు. ఆయన స్వభావంలో మార్పు లేదు. అయితే గ్రీకు, రోమన్ దేవతలు అలా కాదు. ఈ ఊరు నాది, ఆ ఊరి నీది అంటూ వారు రకరకాలుగా ఉంటారు. వారు మనుష్యులతో కలిసి పోయి ఉంటారు. మనుష్యులను భార్యలుగా, భర్తలుగా చేసుకొని మనుష్యులతో కలిసి ఈ దేవతలు ఉంటారు. అయితే క్రెస్తవ్యం బోధించే దేవుడు మనుష్యులతో కాపురం చేసే వాడు కాదు. 

     ఈ పురాతన మతాలను మిస్టరీ మతాలు అన్నారు. డేమేటర్ ఒక మిస్టరీ దేవత. డయోనైసస్ ఒక మిస్టరీ దేవత. ఈ దేవతల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రజలు జోతిష్యులను ఆశ్రయించేవారు. ఈ దేవతలకు అనేక పూజలు, బలులు, అర్పణలు వారు చేస్తుండేవారు. వాటి ఎదుట ఉత్సవాలు చేస్తూ ఉండేవారు. ఈ ఉత్సవాల్లో తినడం, త్రాగడం, డాన్సులు వేయడం, లైంగిక కార్యాలు ఉండేవి. వీళ్ళు చేసే పనులు చూడలేక రోమన్ సెనెట్ క్రీస్తు శకం 186 లో డయోనైసస్ ఆరాధన ను అరికట్టే చర్యలు తీసుకొంది. 

     అపోస్తలుడైన పౌలు ఎఫెసు వెళ్ళేటప్పటికి ఆ ప్రాంతం మొత్తం అర్తెమి దేవత ఆరాధనలో మునిగిపోయి ఉంది. పౌలు గారు సువార్త ప్రకటించి ఆ ఊరిలో గొప్ప మార్పు తెచ్చాడు. అక్కడ విగ్రహాలు అమ్మే వ్యాపారస్తులకు పౌలు మీద చాలా కోపం వచ్చింది. ‘ఈ విగ్రహాలు ఒట్టివే. వాటిని నమ్మవద్దు. జీవం కలిగిన దేవుని వైపు తిరగండి’ అని పౌలు ప్రకటించడం వలన వారి విగ్రహాలు కొనే వారు లేరు. పూలు, విగ్రహాలు అమ్మే చోట నిలబడి గమనించండి. వారు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. 

పౌలు వలన వారి వ్యాపారం దెబ్బతింది. ‘ఎఫెసీయుల అర్తెమి దేవత మహా గొప్ప దేవత’ అని వారు పెద్దగా కేకలు వేశారు. పౌలు గారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తప్పించుకున్నాడు. 

   నేను ఎఫెసు వెళ్ళినప్పుడు ఈ అర్తెమి దేవత ఆలయం ఉన్న చోటికి వెళ్ళాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లర్ మాత్రం అక్కడ మిగిలి ఉంది. 

అవకాశం, విధి 

   chance (అవకాశం), fate (విధి)  పురాతన ప్రజల జీవితాలను శాసిస్తూ ఉండేవి. ఛాన్స్ అంటే టైకే (tyche) . విధి అంటే హాయ్ మార్ మేనె (Heimarmene). దేవతల కంటే బలమైన శక్తులుగా ప్రజలు వీటిని చూసేవారు. విధి ఎలా వుంది? నా తల రాత ఎలా ఉంది? అని వారు విచారిస్తూ ఉండేవారు. మా విధి ని మార్చుకోవాలి అని వారు ఈ మిస్టరీ మతాల్లో చేరి, దేవతల సహాయం కూడా తీసుకొనేవారు. అనేక ఫిలాసఫర్లు, అనేక మతాలు, అనేక తీర్ధ యాత్రలు, అనేక బలులు ఈ తల రాత మార్చడానికి వారు వాడేవారు. 

   అటువంటి వారికి అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసు పత్రిక వ్రాశాడు. నా ఛాన్స్ ఏమిటి? నా ఫేట్ ఏమిటి? నా తల రాత ఏమిటి? నా విధి ఎలా ఉంది? అని మీరు పరుగెత్తవలసిన అవసరం లేదు. మీరు జగత్తు పునాది వేయకమునుపే దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఈ ప్రపంచము సృష్టించబడక మునుపే మీరు దేవుని చేత ప్రేమించబడినవారు. అది ఎంత గొప్ప సత్యమో మీరొక సారి ఆలోచించండి.  ఈ దేవుడు అంత గొప్ప వాడు. 

  మనిషి బైబిల్లో దేవుని కూడా చిన్నగా మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎఫెసు లో మరియమ్మ ఆరాధన కూడా మొదలయ్యింది. ఎఫెసీయుల దేవతల రూపములోనే మరియమ్మ గారిని కూడా ఒక దేవతగా మార్చివేశారు. అటువంటి పిచ్చి పనులకు మనం దూరముగా ఉండాలి. 

అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యభాగములో ఉపయోగించిన రెండు పదములు మీరు గమనించండి. 

Exelexato ἐξελέξατο

Proorisas προορίσας

   Exelexato అంటే నిర్ణయించుట; Proorisas అంటే ఏర్పరచుకొనుట.  

జగత్తు పునాది వేయకమునుపే అంటే ఈ విశ్వమును సృష్టించక మునుపే, దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నందు మిమ్ములను నిర్ణయించుకున్నాడు. ఏర్పరచుకున్నాడు. 

   ఈ సత్యాలు అర్థం చేసుకోవటం కష్టమే. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. శామ్యూల్ కి 5 సంవత్సరములు. శారా కి 3 సంవత్సరములు. ఈ మధ్యలో నేను వారికి కొన్ని ఫోటోలు చూపిస్తున్నాను. అవి మేము గలాపగోస్ దీవులలో ఒక బీచ్ లో తీసిన ఫోటోలు. 2019 లో ఆ ఫోటోలు నేను తీశాను. శామ్యూలు  ఆ ఫోటోలు చూస్తూ ఉన్నాడు. శారా ఆ ఫోటోలు చూస్తూ ‘నేను ఎక్కడ ఉన్నాను, డాడీ నన్ను అడిగింది.‘శారా, నువ్వు అప్పటికి ఇంకా పుట్టలేదు’ అని చెప్పాను. 

‘నేను పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాను?’ అని అడిగింది. మూడు సంవత్సరాల పిల్ల చాలా ఆసక్తి కరమైన ప్రశ్న అడిగింది. 

ఆ ప్రశ్న నాకు ఆసక్తి కలిగించింది. 

మీరు పుట్టక మునుపు మీరు ఎక్కడ ఉన్నారు? 

తల్లి గర్భములో పడక మునుపు మీరు ఎక్కడ ఉన్నారు? 

మీ శరీరం లేనప్పుడు, మీ ఆత్మ లేనప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 

మీరు దేవుని మైండ్ లో ఉన్నారు. మీరు దేవుని హృదయములో ఉన్నారు. 

జగత్తు పునాది వేయబడక మునుపే అంటే ఈ ప్రపంచం ఉనికి లోకి 

రాకమునుపే, ఈ విశ్వం ఉనికి లోకి రాక మునుపే దేవుడు మిమ్ములను చూసాడు. 

ఈ ప్రపంచములో మీరు పుట్టడం ఆక్సిడెంట్ కాదు. 

మీరు దేవుని నమ్ముకోవడం ఆక్సిడెంట్ కాదు. 

Exelexato అంటే దేవుడు మిమ్మును నిర్ణయించుకున్నాడు. 

Proorisas అంటే దేవుడు మిమ్మును ఏర్పరచుకొన్నాడు. 

  మొదటి నుండి దేవుడు నిర్ణయాలు తీసుకోవడం, ఏర్పరచుకోవడం చేస్తూనే ఉన్నాడు. ఈ విశ్వాన్ని సృష్టించాలి అని దేవుడు ఒక నిర్ణయం తీసుకొన్నాడు. దేవుడు ఆ నిర్ణయం తీసుకోపోతే ఈ ప్రపంచం ఉండేది కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. 

  ఈ ప్రపంచం సృష్టించిన తరువాత మనిషిని సృష్టించాలి అని దేవుడు నిర్ణయం తీసుకొన్నాడు. దేవుడు ఆ నిర్ణయం తీసుకోపోతే మనుష్యులు ఉండేవారు కాదు. మనం ఉండేవాళ్ళం కాదు. 

 దేవుడు ఎన్నిక చేసుకునేవాడు. 

దేవుడు ఆదామును ఎన్నుకున్నాడు. 

హేబెలు ను ఎన్నుకున్నాడు. 

నోవహు ను ఎన్నుకున్నాడు. 

ఈ ప్రపంచములో ఉన్నారు. 

వారిలో నోవహును ఎన్నుకున్నాడు. 

అబ్రాహామును ఎన్నుకున్నాడు. కోట్లమంది ప్రజలు ఈ ప్రపంచములో వున్నారు.

వారిలో దేవుడు అబ్రాహామును ఎన్నుకున్నాడు.కోట్ల మంది ప్రజలు అబ్రహాముకు చాలా మంది కుమారులు ఉన్నారు కానీ దేవుడు  ఇస్సాకును ఎన్నుకున్నాడు. 

ఇస్సాకు కుమారుల్లో యాకోబును ఎన్నుకున్నాడు. 

ఆయన 12 కుమారులను ఎన్నుకున్నాడు. వారిలో నుండి ఇశ్రాయేలీయులు వచ్చారు. 

భూమి మీద ఎంతో మంది వున్నారు. వారినే ఎందుకు ఎన్నుకున్నాడు? 

ఇశ్రాయేలీయుల గొప్ప తనం ఏమీ లేదు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు అంతే. 

మోషే ను ఎన్నుకున్నాడు. అది ఆయన  గొప్పతనం కాదు. అది దేవుని చిత్తం. అది దేవుని ఇష్టం. 

సమూయేలు, సౌలు, దావీదు, సొలొమోను, యెషయా, యిర్మీయా, దానియేలు, యెహెఙ్కేలు….

వారందరూ దేవుని చేత ఎన్నుకోబడ్డారు. 

   యేసు క్రీస్తు ప్రభువు కూడా పండ్రెండు మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఈ ప్రపంచములో కోట్లమంది జనం వున్నారు. వారిలో నుండి ఆ పండ్రెండు మందిని దేవుడు కోరుకున్నాడు. 

ఇల్లు ప్లాన్ 

ఒక ఇల్లు మీరు కట్టాలంటే ముందు ఒక ప్లాన్ గీసుకొంటారు. 

ఇన్ని పునాదులు వేద్దాము. 

ఇన్ని తలుపులు పెట్టుకొందాము. 

ఇన్ని ఇటుకలు కావాలి 

ఇంత సిమెంట్ కావాలి 

ఇక్కడ లివింగ్ రూమ్ ఉండాలి

ఇక్కడ వంటగది ఉండాలి 

ఇక్కడ బెడ్ రూమ్ ఉండాలి అని 

పక్కాగా ప్లాన్ వేసుకొని పని మొదలు పెడతారు. 

దేవుడు కూడా పక్కాగా ఒక ప్లాన్ గీసుకొని తన పని మొదలు పెట్టాడు. 

   ప్రకటన గ్రంథం 21 అధ్యాయములో మనం చదువుతాము. పరలోక దేశానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఈ పండ్రెండు గుమ్మముల మీద యాకోబు కుమారులు 12 మంది పేరులు దేవుడు వ్రాయించాడు. 

రూబేను, షిమ్యోను, లేవి, యూదా, 

దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, 

ఇషాకారు,జెబూలూను, యోసేపు, బెన్యామీను 

   ఈ పండ్రెండు మంది పేరులు మాత్రమే నేను నా ఇంటి ద్వారముల మీద వ్రాస్తాను అన్నాడు. ఆ పండ్రెండు మంది పేరులే ఎందుకు వ్రాశావు. నా పేరు కూడా వ్రాయి అని దేవుని మనం అడగలేము. 

   పరలోక దేశానికి 12 పునాదులు కూడా  ఉన్నాయి. ఆ పునాదుల మీద పండ్రెండు మంది అపోస్తలుల పేరులు దేవుడు వ్రాశాడు. 

పేతురు, యాకోబు, యోహాను 

అంద్రెయ,ఫిలిప్పు, బర్తొలొమయి, 

మత్తయి, అల్ఫాయ కుమారుడగు యాకోబు, తోమా,

 తద్దయి, సీమోను, మత్తీయ – 

    ఈ పండ్రెండు మంది పేరులు దేవుడు పరలోకం పునాదుల మీద వ్రాశాడు. 

పాత నిబంధన మొత్తం యాకోబు యొక్క పండ్రెండు కుమారుల మీద వ్రాయబడింది. 

క్రొత్త నిబంధన మొత్తం యేసు ప్రభువు పండ్రెండు మంది శిష్యుల మీద వ్రాయబడింది. 

క్రొత్త నిబంధన దేవుని ఇంటికి పునాది. 

పాత నిబంధన తలుపులు లాంటిది. 

  ఈ ఇంటిని  ఎలా కట్టాలో, అందులో  ఏది ఎక్కడ ఉండాలో అందులోకి  ఎవరిని ఆహ్వానించాలో దేవునికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఈ భూలోక సంబంధమైన ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. 

   మొన్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్ జరిగే రోజు, సమయం, స్టేడియం, ఏ జట్టులో ఎవరు ఆడతారు, ఎవరు ఎంపైర్ లు గా వుంటారు? అవన్నీ ముందుగా నిర్ణయించబడ్డాయి.  భారత జట్టులో ఎవరు ఆడేది ముందుగా నిర్ణయించబడుతుంది. ‘నేను కూడా ఆడుతాను’ అని మనం బ్యాట్ తీసుకొని వెళ్తే మనల్ని లోపలికి రానివ్వరు. సెలెక్ట్ చేయబడిన వారికి మాత్రమే మైదానం లోకి అడుగు పెట్ట గలరు. దేవుడు కూడా తన జట్టులో ఆడేది ఎవరో ముందుగా నిర్ణయిస్తాడు. కెప్టెన్ పిలుస్తాడు: ఈ ఓవర్ నువ్వు బౌలింగ్ చేయి. ఇప్పుడు నువ్వు బాటింగ్ చేయి. దేవుడు కూడా ఎవరు తన తరుపున పని చేయాలో నిర్ణయిస్తాడు.

    దేవుడు ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఎన్నుకొంటాడో మనం ఊహించలేము. ఆయన నిర్ణయాలు మనకు మిస్టరీ గా ఉంటాయి. ప్రతి విషయం అర్ధం చేసుకోవాలని మనం పట్టుబట్టకూడదు.    మానవ స్వభావం దానికి ఒప్పుకోదు. ప్రతిదీ నాకు తెలియాల్సిందే అని మనం పట్టుబట్టకూడదు. 

  ఆల్బర్ట్ అయిన్స్టెయిన్ లాంటి సైంటిస్టులు థియరీ అఫ్ ఎవిరి థింగ్ అనే సిద్ధాంతమును ప్రతిపాదించారు. థియరీ ఆఫ్ ఎవిరి థింగ్ – ప్రతి దాని గురించి నాకు తెలియాల్సిందే.  అలాంటి వ్యక్తితో దేవుడు ఏమంటాడంటే, you just scratched the surface. You just scratched the surface. నీకు తెలిసింది చాలా తక్కువ. నువ్వు తెలుసుకోవలసినది ఎంతో వుంది. నువ్వు తెలుసుకోగలిగింది చాలా తక్కువ. 

    కాబట్టి మనకు తెలిసింది, మనం తెలుసుకోగలిగింది చాలా తక్కువ. ఎందుకంటే మనకు ఎన్నో పరిమితులు వున్నాయి. 

   మన సంతోషం మన జ్ఞానం మీద ఆధారపడి వుండకూడదు. ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ గొప్ప సైంటిస్ట్. థియరీ ఆఫ్ రెలెటివిటీ అనే గొప్ప సిద్ధాంతమును ఆయన కనుగొన్నాడు. ఆయన వ్రాసింది అర్థం చేసుకోవాలంటేనే ఎంతో సైంటిఫిక్ మైండ్ ఉండాలి. మాథెమాటిక్స్ లో, ఫిజిక్స్ లో ఎంతో ట్రైనింగ్ ఉంటే తప్ప అవి అర్థం కావు. ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ సిద్ధాంతాలు ఎంతో సంక్లిష్టమైనవి. ఒక సారి ఆయన భార్య ఎల్సా ను ఒక జర్నలిస్ట్ అడిగాడు. మీ భర్త ఐన్స్టెయిన్ వ్రాసిన థియరీ ఆఫ్ రెలెటివిటీ

 మీకు అర్థం అయిందా?. ఆమె యేమని సమాధానం ఇచ్చిందంటే, that is not required for my happiness. నా సంతోషానికి అది అవసరం లేదు. 

   ఆమె ఐన్స్టెయిన్ తో కలిసి జీవించడములోనే సంతోషం పొందింది. ఆయన సైంటిఫిక్ సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి అని ఆమె బుర్ర చించుకోలేదు. ఈ రోజు మనం కూడా దేవునితో కలిసి ప్రయాణించడములోనే మన ఆనందం పొందాలి. దేవుని మిస్టరీ లు ఛేదించడములో మనకు విశ్రాంతి ఉండదు. 

   చంద్రుని మీదకు వెళ్లాలంటే, క్వాంటమ్ ఫిజిక్స్ అక్కర లేదు. యూనివర్స్ యొక్క వేవ్ ఫంక్షన్ తెలుసుకోవలసిన అవసరం లేదు. న్యూటన్ సిద్ధాంతాలు తెలుసుకుంటే చాలు. అదే విధముగా పరలోకం వెళ్లాలంటే, బైబిల్ లో ఉన్న అన్ని మిస్టరీ లు మనము 

అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. ఒకాయన ఏమన్నాడంటే

 if you reject the doctrine of election, you will lose your soul. If you try to understand it, you will lose your mind. 

ఈ సత్యాన్ని తిరస్కరిస్తే నీ ఆత్మను కోల్పోతావు.

ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే నీ బుర్ర కోల్పోతావు. 

నేను చెప్పేదేమిటంటే, ఈ సత్యాన్ని తిరస్కరించబాకండి. దీనిని పూర్తిగా 

అర్థం చేసుకోవాలని ప్రయత్నించబాకండి. 

నీ ఆత్మను కోల్పోవద్దు,నీ బుర్ర కోల్పోవద్దు, నీ హృదయములో దేవుని ప్రేమించు చాలు. 

 అవిశ్వాసులు కూడా ఈ సత్యం వలన దేవుని నిందించకూడదు. ‘దేవుడు నాకు అన్యాయం చేశాడు. నన్ను ఎన్నుకోలేదు’ అని మనం అనకూడదు. 

  ‘నిన్ను నేను ఎన్నుకోలేదు’ అని దేవుడు నీకు చెప్పాడా? 

‘నేను నిన్ను ఎన్నుకోలేదు, నా దగ్గరకు రాబాకు’ అని దేవుడు నీతో అన్నాడా? నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను’ అని యేసు ప్రభువు చెప్పాడు. దేవుడు నన్ను ఎన్నుకోలేదు, అందుకనే నేను దేవుని దగ్గరకు రావటల్లేదు అని ఎవరూ అనకూడదు. 

   నువ్వు వచ్చావా? దేవుని స్తుతించు. నీవు దేవుని చేత ప్రేమించబడ్డావు. దేవుని చేత నిర్ణయించబడ్డావు. దేవుని చేత ఏర్పరచుకోబడ్డావు. దేవుని చేత పిలువబడ్డావు. దేవుని చేత విమోచించబడ్డావు. ఎఫెసీ పత్రిక ప్రారంభములో కనిపిస్తున్న ఈ గొప్ప సత్యం మనం అర్థం చేసుకోవాలి. 

Leave a Reply