క్రైస్తవ సంఘము యొక్క గొప్ప తనము

ఈ రోజు ఎఫెసీ పత్రికలో నుండి ఒక  ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఎఫెసీ పత్రికలో మన ప్రభువైన యేసు క్రీస్తు కేంద్ర స్థానములో మనకు కనిపిస్తున్నాడు. ఆయన స్థాపించిన క్రైస్తవ సంఘము కూడా కేంద్ర స్థానములో మనకు కనిపిస్తుంది. ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? అనే అంశం కూడా ఈ పత్రికలో ప్రముఖముగా మనకు కనిపిస్తుంది. 

   అపోస్తలుడైన పౌలు మహాశయుడు ఈ పత్రికలో 10 పదాలు ఆయన ఉపయోగించాడు. ఈ పదాలు వినడానికి దగ్గర గా ఉంటాయి. 

Synezoopoiesen: క్రీస్తుతో కలుపబడి మనం బ్రతికించబడ్డాము. 

Synegeiren: క్రీస్తుతో కలుపబడి మరణం నుండి లేపబడ్డాము. 

Synekathisen: క్రీస్తుతో కలుపబడి కూర్చుండబెట్ట బడ్డాము 

Sympolitai: పరిశుద్ధులతో కలిసి దేవుని ఇంటిలో చేర్చబడ్డాము

Synarmologoumene: క్రీస్తులో మనమందరం చక్కగా అమర్చబడ్డాము 

Synoikodomeisthe: క్రీస్తులో మనమందరం చక్కగా కట్టబడుతున్నాము 

Syssoma: క్రీస్తు శరీరమందు  సాటి అవయవ ములు గా ఉన్నాము. 

Synkleronoma: క్రీస్తుతో కలిసి మనం సమాన వారసులం

Symmetocha: క్రీస్తులో కలిసి వాగ్దానములో పాలివారము అయ్యాము 

Symbibazomenon: క్రీస్తు నందు మనం అతికించబడ్డాము 

   ఈ పదాల్లో 10 అమూల్య మైన సత్యాలు ఆయన బోధించాడు. ఈ 10 పదాలు నేటి సందేశములో మనం చూద్దాము. 

మొదటిగా synezoopoiesen συνεζωοποίησεν అంటే క్రీస్తుతో కలుపబడిన జీవం మనం కలిసి బ్రతికించబడ్డాము. 

2:4 క్రీస్తుతో కలుపబడి మనం బ్రతికించబడ్డాము. συνεζωοποίησεν

  మరణములో ఉన్న మనకు దేవుడు జీవం ఇవ్వాలని కోరుకున్నాడు. జీవం అనేది దేవుడు ఇచ్చేది. ఈ ప్రపంచములో ఎక్కడ జీవం కనిపించినా అది దేవుని యొద్ద నుండి వచ్చినదే. వైరస్లు, బాక్తీరియాలు,పురుగులు, చేపలు, తిమింగిలాలు, పక్షులు, జంతువులు, చెట్లు, మానవులు – వీటన్నిటిలో జీవం మనకు కనిపిస్తుంది. ఆ జీవం వాటిలో సృష్టించింది దేవుడే. ఆ జీవం వాటిలో కొనసాగించేది కూడా దేవుడే. దేవుని శక్తి వలన మాత్రమే సమస్త జీవం ఉనికిలో ఉంది. దేవుని శక్తి లేకుండా ఒక్క క్షణం కూడా మీరు జీవించలేరు. ఆ దేవుని శక్తి క్రీస్తుకు జీవం ఇచ్చింది. ఆయన జీవముతో కలపబడిన జీవం మనకు కూడా ఇవ్వబడింది. 

Synezoopoiesen అంటే అదే. క్రీస్తు కు ఇవ్వబడిన జీవం, క్రీస్తుతో కలుపబడిన జీవం దేవుడు మీకు ఇచ్చాడు. క్రీస్తుకు బెస్ట్ క్వాలిటీ జీవం ఇచ్చి, మనకు తక్కువ క్వాలిటీ జీవం ఇవ్వలేదు. 

అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. ఎఫెసీ 2:4 

దేవుడు కరుణాసంపన్నుడై యుండి – దేవుడు ఎంతో కరుణ, ఎంతో కనికరం, ఎంతో ప్రేమ లతో నిండిఉన్న వాడు. 
మన స్థితి ఎలా ఉంది?

 మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉన్నాము. అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు తన కరుణ, మహా ప్రేమ చేత బ్రతికించాడు. 

ఎలా బ్రతికించాడు? 

 క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే యేసు క్రీస్తు ను మరణం నుండి ఏ దేవుని శక్తి జీవం లోకి లేపిందో, అదే శక్తి మనలను కూడా చచ్చిన స్థితిలో నుండి బ్రతికించింది. 

ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.

                 2 కొరింథీ 5:21

   పాపమెరుగని ఆయన మనకోసము పాపముగా చేయబడ్డాడు. సిలువ మీద ఆయన వ్రేలాడుతున్నప్పుడు దేవుడు మనందరి పాపములను యేసు క్రీస్తు మీద మోపాడు. ఆయన మనతో ఏకమయ్యాడు. మనతో కలిసి మరణాన్ని ఆయన రుచి చూశాడు. అప్పుడు ఏమైంది? 

దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును  మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసిమన అపరాధములనన్నిటిని క్షమించి,ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను

                 కొలొస్సయులకు 2:14,15 

    మన పాపములు మన మీద ఋణముగా ఉన్నాయి. మనకు విరోధముగా ఉన్నాయి. మనకు అడ్డముగా ఉన్నాయి. అయితే దేవుడు ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు.దాని మీద ఉన్న రాతలను తుడిచివేశాడు. మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేశాడు. మన అపరాధముల నన్నిటిని క్షమించి వేశాడు. మనలను క్రీస్తుతో కూడా జీవింప జేశాడు. 

కొట్టి, 

తుడిచివేసి, 

ఎత్తివేసి 

క్షమించి 

జీవింపజేసాడు. 

మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. కొలొస్సయి 3:3

Synezoopoiesen en theo. మనకు ఇవ్వబడిన జీవం ఎక్కడ ఉంది? అది దేవుని యందు దాచబడి ఉన్నది. నా జీవం తరిగిపోతుందేమో, నా జీవం ఆవిరి అయిపోతుందేమో,  నా జీవం సాతానుడు దొంగిలిస్తాడేమో అని నేను ఆందోళన చెందాల్సిన అవసరం ఇక లేదు. ఎందుకంటే అది దేవుని యందు దాచబడి ఉంది. 

రెండవదిగా synegeiren

synezoopoiesen అంటే క్రీస్తు తో కలుపబడిన జీవం. synegeiren అంటే క్రీస్తుతో కలుపబడిన పునరుత్తానం -raised together with Christ 2:4. 

συνήγειρεν – synegeiren: క్రీస్తుతో కలుపబడి మరణం నుండి లేపబడ్డాము. ఆ తరువాత ఎఫెసీ 2:7 వచనం మీరు చూడండి. క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.

           ఎఫెసీ 2:7

   దేవుని జీవం మన మీదకు వచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు synegeiren జరిగింది. మనం క్రీస్తుతో కలుపబడి బ్రతికించబడ్డాము. యేసు క్రీస్తు ప్రభువు యొక్క మరణం, పునరుత్తానము లలో మనం ఏకం చేయబడ్డాము. ఆయన జీవములో కూడా మనం ఏకం చేయబడ్డాము. synegeiren అంటే క్రీస్తుతో కలుపబడి లేపబడుట. 

    ‘యేసు క్రీస్తూ, ముందు నీ సంగతి చూద్దాము, తరువాత నిన్ను నమ్ముకొన్న వారి గురించి ఆలోచిద్దాము’ అని దేవుడు అనలేదు. ‘నేను నిన్ను మరణము నుండి లేపుతున్నాను. నీతో కలిపే నిన్ను విశ్వసించిన ప్రతివారినీ లేపుతున్నాను’ అన్నాడు. 

    జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు ప్రేమ చేత మిమ్ములను క్రీస్తు లో ఏర్పరచుకున్నాడు. రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు నందు మిమ్ములను మరణము నుండి జీవము లోకి లేపాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? 

అదే  synekathisen

synezoopoiesen: క్రీస్తు తో కలుపబడి జీవము పొందుట 

synegeiren: క్రీస్తుతో కలుపబడి లేపబడుట 

synekathisen: క్రీస్తుతో కలుపబడి కూర్చుండబెట్టుట 

ఎఫెసీ 2:7 Seated us together with Christ 

συνεκάθισεν: synekathisen: క్రీస్తుతో కలిసి పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాము. 

      క్రీస్తుయేసునందు మనలను పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను. అక్కడ synekathisen మనకు కనిపిస్తుంది. పరలోకమందు దేవుడు మనలను క్రీస్తుతో కలిపి కూర్చుండబెట్టాడు. 

    నాకు అలా అనిపించటల్లేదే? నాకు భూమి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది అని మీరు అనవచ్చు. శరీర సంబంధముగా మీరు భూమి మీదే ఉన్నారు. అయితే ఆత్మసంబంధముగా మీరు పరలోకములో ఉన్నారు. అక్కడ యేసు క్రీస్తు ప్రభువుతో కలిసి మీరు కూర్చొని ఉన్నారు. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు? 

మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. 

          కొలొస్సయులకు 3:1 

మనకు ఇవ్వబడిన జీవం ఏ కొండ మీదో, ఏ చెట్టు మీదో, ఏ మేఘములోనో లేదు. అది పరలోకములో ఉంది. దేవుని కుడిపార్శ్వమున, యేసు క్రీస్తుతో కలిసి మనం కూర్చొని ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువు కూర్చొని ఉన్నాడు. మన రక్షణ కార్యమును ఆయనసంపూర్తి చేశాడు. సమాప్తము అని ఆయన సిలువ మీద కేక వేసినప్పుడే మనకు సంపూర్ణమైన పాప క్షమాపణ లభించింది. దేవుడు మన ఆత్మలను సంపూర్ణముగా రక్షించాడు. ఇప్పుడు మనం కూడా క్రీస్తుతో కలిసి కూర్చొని ఉన్నాము. 

    యేసు క్రీస్తు ప్రభువు వలె మనం కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. మన రక్షణ విషయములో మనం ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనలను క్రీస్తుతో కలిపి పరలోకములో కూర్చుండబెట్టాడు. 

    లూకా సువార్త 22 లో యేసు క్రీస్తు ప్రభువును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయనను ద్వేషించే వారు కొంతమంది అక్కడ మంట వేసుకొని చలి కాచుకొంటూ ఉంది. పేతురు వెళ్లి వారి మధ్యలో కూర్చున్నాడు. ఒక అమ్మాయి ఆయన్ని చూసి, ‘నువ్వు యేసు శిష్యుడివి కదా?’ అని అడిగింది. పేతురు గారు యేమని చెప్పాడు, ‘అమ్మాయి, ఏమి మాట్లాడుతున్నావు? ఆయనకు నాకు సంబంధం లేదు అన్నాడు. 

       మనం ఎక్కడ కూర్చొని ఉన్నాము అని మరచిపోతే అలాంటి పరిస్థితులే వస్తాయి. మనం ఎక్కడ కూర్చునిఉన్నా, మనం క్రీస్తుతో కలిసి పరలోకములో కూర్చొని ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకొంటే మనం ఎప్పుడూ ఆయనను తృణీకరించము. 

Synezoopoiesen,

Synegeiren, 

Synekathisen – 

ఆ మూడూ, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. 

Synezoopoiesen – మనకు క్రీస్తుతో కలిసిన జీవం ఇచ్చాడు 

Synegeiren – మనలను క్రీస్తుతో కలిపి లేపాడు 

Synekathisen – మనలను క్రీస్తుతో కలిపి కూర్చుండబెట్టాడు. 

sympolitai -citizens together with the saints 2:19. συμπολῖται: sympolitai: 

కలిసి పొందిన పౌరసత్వం. పరిశుద్ధులతో కలిసి దేవుని ఇంటిలో చేర్చబడ్డాము 

కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.

                ఎఫెసీ 2:19 

   దేవుడు మనలను క్రీస్తుతో మాత్రమే కాకుండా ఇతర పరిశుద్ధులతో కూడా కలిపాడు. Sympolitai అంటే అదే.

ఇక మనం పరజనులం కాదు. ఇక మనం పరదేశులం కాదు.  ఇక మనం అన్యజనులం కాదు 

   యేసు క్రీస్తు రక్తము వలన మనమందరం ఏకం చేయబడ్డాము. దేవుని యొక్క ఏక పట్టణములోకి మనం నడిపించబడ్డాము. దేవుని యొక్క ఏక ఇంటిలోకి మనం నడిపించబడ్డాము. మీరు ఆవైపు కూర్చోండి. మీరు ఈ వైపు కూర్చోండి అని దేవుడు తన ప్రజలను వేరుగా కూర్చోబెట్టడం లేదు. క్రీస్తు నందు వారందరిని కలిపాడు.ఇప్పుడు విమోచించబడిన దేవుని ప్రజలు ఒకటే కుటుంబమునకు చెందినవారు,  ఒకటే పట్టణమునకు చెందినవారు. ఒకటే పౌర సత్వం కలిగిన వారు.

 Sympolitai – politai, politics అనే పదం అందులో నుండే వచ్చింది. ఈ దేశములో పౌరులు అందరికీ రాజ్యాంగం ఒకే రకమైన రాజకీయ హక్కులు ఇచ్చింది. ఈ దేశములో పుట్టావా? లేక ఈ దేశం పౌర సత్వం తీసుకొన్నావా? అప్పుడు నువ్వు ఎక్కడ పుట్టావు,ఎక్కడ పెరిగావు? ఏ భాష మాట్లాడుతున్నావు? అవి అన్నీ అనవసరం. ఈ దేశ రాజ్యాంగం నీకు సమాన హక్కులు కల్పించింది. పరలోక దేశములో దేవుడు కూడాతన బిడ్డలందరికీ ఒకే రకమైన రాజకీయ హక్కులు ఇచ్చాడు. వారు ఏ దేశములో పుట్టారు, ఏ భాష మాట్లాడారు అనేది దేవుడు చూడడం లేదు. క్రీస్తు నందు జన్మించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యములో పౌరుడే. sympolitai అంటే అదే. దేవుడు మనందరికీ ఇచ్చిన పౌరసత్వం. 

తరువాత 

synarmologoumene- కలిసి అమర్చబడ్డాము 

ఎఫెసీ 2:21; 4:16 – రెండు చోట్ల ఈ మాట ఆయన వాడాడు. 

-joined together with God’s building 2:21. συναρμολογουμένη

synarmologoumene: క్రీస్తులో మనమందరం చక్కగా అమర్చబడ్డాము 

ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.

                ఎఫెసీ 2:21 

   ఒక బిల్డింగ్ కట్టబడాలంటే ఇటుకలు, కిటికీలు, తలుపులు – అవి చక్కగా అమర్చబడాలి. ఒక మైక్ పనిచేయాలంటే అనేక వస్తువులు చక్కగా అమర్చబడాలి. మీ మైక్రోఫోన్, దాని వైరు, ఆమ్ప్లిఫైర్, సౌండ్ బాక్సులు, ఎలక్ట్రిక్ అవుట్ లెట్ లు, స్విచ్ లు – అవన్నీ చక్కగా అమర్చబడాలి. లేకపోతే మైక్ పనిచేయక పోగా షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది.  ఒక కార్పెంటర్ టేబుల్ లేక కుర్చీ చేస్తే అన్నిటినీ కొలతలతో సహా జాగ్రత్తగా చెక్కుతాడు. అప్పుడే ఆ చెక్క ముక్కలు ఒకదానితో ఒకటి చక్కగా అమర్చబడుతాయి. లేకపోతే ఆ కుర్చీ మీద మీరు కూర్చోలేరు. ‘దీని మీద కూర్చుంటున్నాను, ఇది విరిగి పోతే, నా నడుము విరిగిపోతుంది’ ఆ కుర్చీ మీద కూర్చోవటానికి మీరు భయపడతారు.

     మీ ఇల్లు కూడా, మీ ఇష్టం వచ్చినట్లు ఇటుకలు పేర్చుకొంటూ పోతే, ఎక్కడ పడితే అక్కడ పిల్లర్లు, ఎక్కడపడితే అక్కడ గోడలు కట్టుకొంటూ పోతే ఆ ఇల్లు మీకు పనికి రాదు. అది కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నా దగ్గర సిమెంటు, ఇటుక రాళ్లు ఉన్నాయి అని ఎక్కడ పడితే అక్కడ పిల్లర్లు, ఎక్కడ పడితే అక్కడ కిటికీలు పెట్టి కడితే, చూసిన వారు ఏమంటారు? ఎవరు ఈ ఇల్లు కట్టింది? తలా తోక లేకుండా కట్టాడు’ అంటారు. ప్రతిదీ చక్కగా అమర్చబడాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక పటిష్టమైన, చూడ ముచ్చటైన, సుస్థిరమైన ఇల్లు కట్టుకోగలరు.

   దేవుడు కూడా తన ప్రజలను చక్కగా అమర్చి తన ఇల్లు కట్టుచున్నాడు. ఆయనకు ఒక ప్లాన్ వుంది. ఏ వస్తువును ఎక్కడ అమర్చాలో ఆయనకు తెలుసు. ప్రతి రాయినీ దేవుడు చక్కగా చెక్కి తన ఇంటిలో దానిని అమర్చుతున్నాడు.  ఆ ఇంటిలో పేతురు గారిని ఎక్కడ వుంచాలో, పౌలు గారిని ఎక్కడ వుంచాలో దేవునికి తెలుసు. దేవా, నన్ను అక్కడ ఉంచు, ఇక్కడ పెట్టు’ అని మనం దేవుని మీద బలవంతం చేయకుండా, ‘దేవా, నన్ను ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చు’ అని మనం దేవుని ఇంటి నిర్మాణములో భాగం కావాలి. 

synoikodomeisthe 

Synarmologoumene అంటే కలిపి అమర్చుట 

Synoikodomeisthe (συνοικοδομεῖσθε) అంటే కలిసి నిర్మించబడుట 

-being built together with other parts of God’s building 2:22

συνοικοδομεῖσθε: synoikodomeisthe

క్రీస్తుతో కలిసి మనము దేవుని నివాస స్థలముగా కట్టబడ్డాము. 2:22 చూడండి. 

ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:22 

  synoikodomeisthe అంటే కలిసి కట్టబడుట. దేవుడు ఎందుకు మనందరినీ చక్కగా అమర్చుతున్నాడు? ఎందుకంటే దేవుడు తన నివాసమును నిర్మిస్తున్నాడు. ఇది ఆత్మ మూలముగా జరుగుతున్నది. పరిశుద్ధాత్ముడు నిర్మించేవాడు. ఆదికాండము మొదటి 

అధ్యాయములో మనం చదువుతాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 

                            ఆదికాండము 1:2

భూమి నిరాకారముగా, శూన్యముగా, చీకటితో నిండిఉండినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఈ ప్రపంచములో జీవ రాశిని సృష్టించాడు. ఈ ప్రపంచము ఆత్మ సంబంధమైన నిరాకారం, ఆత్మ సంబంధమైన శూన్యం, ఆత్మ సంభందమైన చీకటి తో నిండి ఉన్నప్పుడు, దేవుని కొరకు ఒక నూతన సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యములు 2 అధ్యాయము లో చూడండి. ప్రపంచములో అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారు యెరూషలేములో కూడి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడువారి మీద కు దిగి వచ్చాడు. అప్పటి నుండి ఆయన దేవుని కొరకు ఒక నివాస స్థలమును నిర్మిస్తున్నాడు. యేసు క్రీస్తు రక్తము చేత కడుగబడిన ప్రతి విశ్వాసి ఆ ఇంటిలో ఒక రాయిగా చేర్చబడ్డాడు. 

  విశ్వాసులకు అనేక వరములు ఇచ్చేది పరిశుద్ధాత్ముడే (1 కొరింథీ 12:8-9).

పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తాము. 

పరిశుద్ధాత్మతో దేవుని స్తుతిస్తాము (1 కొరింథీ 14:15). 

దేవుని క్రియలను మనలో ప్రారంభం చేసేది పరిశుద్ధాత్ముడే (గలతీ 3:3). 

మనకు నిరీక్షణ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే (గలతీ 5:5). 

మనలను నడిపించేది పరిశుద్ధాత్ముడే (గలతీ 5:18). 

మనలను జీవింపజేసేది పరిశుద్ధాత్ముడే (గలతీ 5:25). 

మనలో దేవుని ప్రేమను పెంచేది పరిశుద్ధాత్ముడే (కొలొస్స 1:8). 

ఆత్మ పూర్ణులై ఉండుడి (ఎఫెసీ 5:18). 

       కాబట్టి ఈ రోజు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. విశ్వాసులందరినీ కలిపి దేవుని కొరకు ఒక ఆలయముగా ఆయన నిర్మిస్తున్నాడు. 

synoikodomesthe అంటే అదే తరువాత . 

syssoma 

అంటే కలిసి పనిచేసే అవయవములు. ఎఫెసీ 3:6 -members together with each other in the body. 

σύσσωμα syssōma -క్రీస్తు శరీరములో కలిసి పనిచేసే అవయవములు joint – body 

ఒక శరీరమందలి సాటి అవయవ ములు అయ్యాము. Synarmologoumene, synoikodomeisthe వాటి కంటే ఇది ఇంకా మంచి పోలిక. గోడ లో ఉండే ఇటుకలు అమర్చబడి ఉంటాయి. అవి ఒక దానికి ఒకటి సహాయపడవు. ప్రతి ఇటుక ప్రక్క ఇటుక కొరకు ఏ పనీ చేయదు. అయితే మన శరీరం అలా కాదు. అవయవాలు ఒక దానికి ఒకటి సహకరించుకొంటాయి. 

   విశ్వాసులముగా మనం క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. ఆ శరీరములో వేరు వేరు అవయవములుగా మనం ఉన్నాము (1 కొరింథీ 12:27). అవయవములు అనేకము. అవి చేసే పనులు అనేకం. అయితే శరీరం ఒక్కటే. క్రీస్తు ఒక్కడే (1 కొరింథీ 12:12). మన శరీరములో ఒక్కొక్క అవయవమునకు ఒక్కొక్క పని ఉంటుంది. బ్రెయిన్ ఆలోచనలు చేస్తుంది. ప్లాన్లు చేస్తుంది. మాటలు మాట్లాడిస్తుంది. హార్ట్ శరీరమంతా రక్తం పంపిస్తుంది. కిడ్నీలు శరీరములో ఉండే చెడు ద్రవాలను, పదార్ధాలను విసర్జించే పని చేస్తాయి. లివర్ మనం తినేది అరగడం లో, ప్రోటీన్లు చేయడములో ఉపయోగపడుతుంది. కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి. ఇలా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పనిచేస్తూ తన ప్రత్యేకతను కాపాడుకొంటున్నది. 

  బ్రెయిన్ లేక పోతే నాకేమిటి అని హార్ట్ అనుకోకూడదు. హార్ట్ లేకపోతే నాకేంటి అని లివర్ అనుకోకూడదు. లివర్ లేకపోతే నాకేమిటి అని కిడ్నీ అనుకోకూడదు. బ్రెయిన్ లేకుండా హార్ట్ పనిచేయలేదు. హార్ట్ లేకుండా కిడ్నీ పనిచేయలేదు. అవన్నీ కలిస్తేనే శరీరం. మనం కూడా ఆయన లేకపోతే ఏమిటి? ఈమె లేకపోతే ఏమిటి? అని అనుకోకూడదు. 

   మనం అందరం కలిస్తేనే క్రీస్తు శరీరం (రోమా 12:4-5). కొంతమంది ని సువార్తికులుగా, కొంతమంది ని సంరక్షకులుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని పరిచారకులుగా దేవుడు పిలిచాడు. మన శరీరములో ప్రతి దాని పనులు నిర్దేశించేది మన తలకాయ. మన శిరస్సు. సంఘం అనే ఈ శరీరానికి శిరస్సు యేసు క్రీస్తే (కొలొస్సయి 1:18). మనమందరం కలిసి ఒక్క పరిశుద్ధాత్ముని వలన, ఒక్క శరీరములో, ఒక్క శిరస్సు క్రింద పనిచేసే అవయవములు అయ్యాము. syssoma అంటే అదే . 

     ‘నీ మొహం బాగుంది, నీ ముక్కు బాగుంది’ అంటారు కానీ, ఎవరూ నీ లంగ్స్ చాలా బావున్నాయి, నీ లివర్ చాలా బావుంది, నీ కిడ్నీస్ చాలా బావున్నాయి’ అని ఎవరూ అనరు. ముఖ్యమైన పనులు చేసే అవయవాలు ఎవరికీ కనిపించవు. 

   ఒక విశ్వాసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరికీ కనిపించడు. మరొక విశ్వాసి భోజనాలు సిద్ధం చేసింది. ఆమె ఎవరికీ కనిపించదు. ఆమె పడేకష్టం ఎక్కువ మందికి కనిపించక పోవచ్చు. అయితే వారు పడే శ్రమను దేవుడు చూస్తున్నాడు. నన్ను ఎవరూ మెచ్చుకోవడం లేదు అని వారు నిరుత్సహ పడనవసరం లేదు. చాలా క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు క్యాస్ట్ ఫీలింగ్ తో వర్గాలు గా విడిపోయి ఉన్నారు. కులాలు, కులాలుగా గ్రూపులు పెట్టుకొంటున్నారు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. శరీరమొక్కటే, ఆత్మయు ఒక్కడే  అని పౌలు గారు వ్రాశాడు(ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం, 4 వచనం). క్రైస్తవ సంఘం ఒక్కటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే – మనమిక గ్రూపులు పెట్టుకోకూడదు. ఆ తరువాత 

synkleronoma 

కలిపి వారసత్వం 

heirs together with Israel. συνκληρονόμα : synklēronoma

 క్రీస్తుతో కలిసి మనం సమాన వారసులం joint-heirs 

3:6 లో చూడండి. 

ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులు అవుతున్నారు. 

              ఎఫెసీ 3:6 

   దేవుడు, “ముందు యూదులకు పంచి పెట్టి, మిగిలినవి మీకు ఇస్తాలే” అని మనతో అనడం లేదు. యూదులతో కలిపి మీకు వారసత్వం ఇస్తున్నాను. క్రీస్తుతో కలిపి మీకు వారసత్వం ఇస్తున్నాను. 

     మనం దేవుని వారసులం అయ్యాము. క్రీస్తు తోడి వారసులం అయ్యాము (రోమా 8:17). ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. నువ్వు ఏమిటి? నువ్వు దేవుని వారసుడివి అవ్వటం ఏమిటి? అని మనలను ఎగతాళి చేసే వారు కూడా ఉంటారు. అయితే ఇది నిజం. నువ్వు దేవునితో వారసుడివి అయ్యావు. నువ్వు దేవుని వారసురాలవు అయ్యావు. క్రీస్తుతో వారసులు అయ్యారు. 

    అన్యజనుల మైన మనలను క్రీస్తు నందు యూదులతో సమాన వారసులనుగా చేశాడు. యూదులు మనతో కలవడానికే ఇష్టపడ్డారు. వారసత్వం సంగతి తరువాత. వారు మనం కనిపిస్తేనే మొహం దాచుకొంటారు. పేతురు గారిని అన్యజనుల దగ్గరికి పంపాలి అని దేవుడు అనుకొన్నాడు. ఆయన ఏమనుకొన్నాడంటే, ‘నేను యూదుడను. దేవుడు ఏమిటి నన్ను అన్యుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు?’ దేవుని చిత్తము ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆ సత్యము తెలుసుకొన్న తరువాత ఆయన ఏమని వ్రాశాడంటే, 

    ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. 

                    1 పేతురు 3:9 

       ఎంతో గొప్ప ఆశీర్వాదములకు దేవుడు మనలను వారసులనుగా చేశాడు. మనకు ఎవరన్నా కీడు చేస్తే మనం ప్రతి కీడు చేయకూడదు. ‘నాకు టైం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తాను’ అనకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఎవరన్నా మనలను బూతులు తిడితే మనం తిరిగి వారిని బూతులు తిట్టకూడదు. వారిని మనం దీవించాలి అని పేతురు గారు మనకు చెప్పాడు. 

   అబ్రహాము ఎంతో ధనవంతుడు. అతని కుమారుడు ఇస్సాకు, అతని మనుమడు యాకోబు సమాన వారసులు అయ్యారు (హెబ్రీ 11:9). మనం కూడా దేవునితో సమాన వారసులం అయ్యాము. క్రీస్తుతో సమాన వారసులం అయ్యాము. యూదులతో సమాన వారసులం అయ్యాము. 

ఆ తరువాత 

symmetocha 

ఎఫెసీ 3:6 -sharers together with each other in the promise 

συμμέτοχα : symmetocha joint -partakers 

క్రీస్తులో కలిసి వాగ్దానములో పాలివారు 

symmetocha అంటే joint -partaker 

వారసులు అంటే synkleronoma. 

పాలివారు అంటే symmetocha. 

   వారసులకు పాలి వారికి ఒక తేడా ఉంది. వారసుడు అంటే అది చట్ట ప్రకారం. పాలి వాడు అది క్రియాపూర్వకం. మా నాన్న నాకు పల్లెకోన లో ఒక ఎకరం పొలం ఇచ్చాడు. కానీ అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. చట్ట ప్రకారం ఆ పొలం నాదే. కానీ క్రియా పూర్వకము గా నేను దానిని సేద్యం చేయడం కానీ, పంటలు వేయడం కానీ చేయడం లేదు. వాటి ఫలాలు నేను పొందడం లేదు. అయితే దేవుడు ఇచ్చే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అలాంటివి కాదు. వాటికి మనం వారసులం, వాటిలో మనం పాలివారం. బోయజు పొలములో రూతు పాలిభాగం పొందింది. రూతు వారసురాలు అయ్యింది. సహవాసం కూడా పొందింది.   మీరు, మీ భార్య లేక భర్త ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ మీరు ఒక వైపు ఉంటే మీ భాగస్వామి మరొక వైపు ఉంది లేక ఉన్నాడు. భాగ స్వామ్యం ఉంటే సరిపోదు, సహవాసం ఉండాలి. దేవుడు యూదులతో పాటు మనకు కూడా సహవాసం ఇచ్చాడు. 

అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు

                     రోమా 15:27 

synkleronoma: అంటే భాగస్వామ్యం 

symmetocha: అంటే సహవాసము 

ఆ మూడు పదాలు మనం గమనించాలి. 

Synkleronoma 

Syssoma 

Symmetocha 

Synkleronoma, Joint Heirs: సమాన వారసులం 

Syssoma, Joint Body: సమాన అవయవములము 

Symmetocha, Joint Partakers: సమాన పాలివారం 

ఆ తరువాత 

Symbibazomenon 

-held together with each oter in Christ’s body 

συμβιβαζόμενον symbibazomenon

being held together 

ఎఫెసీ 4:15-16 చూద్దాము. 

ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలోఎదుగుదము.ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందుతనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.

                ఎఫెసీ 4:15-16 

ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి

అమర్చబడి – అతుకబడి 

Joined Together – Held together

Synarmologoumenon అంటే అమర్చబడుట 

Symbibazomenon అంటే అతికించబడుట 

    నా చేతిలో ఇక్కడ ఒక ఎముక(humerus), ఇక్కడ రెండు ఎముకలు (radius and ulna) ఉన్నాయి. ఇవి పక్క పక్కన ఉంటే సరిపోదు. అమర్చబడి ఉంటే సరిపోదు. అతికించబడాలి. అప్పుడే నేను ఈ జాయింట్ ని వాడుకోగలను. 

ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.

               కొలొస్సయి 2:19 

    శిరస్సు మూలముగా సర్వ శరీరం కీళ్ల చేత, నరముల చేత పోషించబడి అతుకబడాలి. అప్పుడే అందులో జీవం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. 

     దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు ప్రక్క ప్రక్కన కూర్చుంటే సరిపోదు. పోషించబడాలి, అతికించబడాలి, జీవముతో నిండి ఉండి, అభివృద్ధి చెందాలి. క్రైస్తవ సంఘము గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఉపయోగించిన 

10 పదాలు ఈ రోజు మనం చూశాము. 

Synezoopoiesen

Synegeiren

Synekathisen

Sympolitai 

Synarmologoumene

Synoikodomeisthe

Syssoma

Synkleronoma

Symmetocha

Symbibazomenon 

sy, sy,sy,sy,sy,sy,sy,sy,sy,sy,కలిసి, కలిసి,కలిసి,కలిసి,కలిసి,కలిసి,కలిసి

  1. Synezoopoiesen: క్రీస్తుతో కలుపబడి మనం బ్రతికించబడ్డాము. 
  2. Synegeiren: క్రీస్తుతో కలుపబడి మరణం నుండి లేపబడ్డాము. 
  3. Synekathisen: క్రీస్తుతో కలుపబడి కూర్చుండబెట్ట బడ్డాము 
  4. Sympolitai: పరిశుద్ధులతో కలిసి దేవుని ఇంటిలో చేర్చబడ్డాము
  5. Synarmologoumene: క్రీస్తులో మనమందరం చక్కగా అమర్చబడ్డాము 
  6. Synoikodomeisthe: క్రీస్తులో మనమందరం చక్కగా కట్టబడుతున్నాము 
  7. Syssoma: క్రీస్తు శరీరమందు  సాటి అవయవ ములు గా ఉన్నాము. 
  8. Synkleronoma: క్రీస్తుతో కలిసి మనం సమాన వారసులం
  9. Symmetocha: క్రీస్తులో కలిసి వాగ్దానములో పాలివారము అయ్యాము
  10. Symbibazomenon: క్రీస్తు నందు మనం అతికించబడ్డాము 

ఆ విధముగా ప్రభువైన యేసు క్రీస్తుతో మీరు కలుప బడ్డారు. ఇతర విశ్వాసులతో కలుపబడ్డారు. దేవుడు ఈ సత్యములను మన జీవితములకు ఆశీర్వాదకరముగా చేయును గాక. 

Leave a Reply