ఈస్టర్ సందేశం 2024: డాక్టర్ పాల్ కట్టుపల్లి 

ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేరు మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని కృప యందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాము. అందరికీ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వెబ్ సైట్ www.doctorpaul.org ని దర్శించండి. నేను వ్రాసే కామెంటరీ మీరు మా వెబ్ సైట్ లో చదువ వచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దీని బ్రాడ్ కాస్టింగ్ కి సహకరించండి. ఇప్పటికే మాకు ఆర్ధిక సహకారం అందిస్తున్న వారికి మా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. 

   ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు, 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకొంది అంటే అది మీ ప్రార్థనల యొక్క గొప్పతనమే. సాతానుడు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ దేవుడు తన విశ్వసనీయతను మనకు చూపించాడు. ఆయన నమ్మదగిన వాడు అని మనకు నిరూపించాడు. దానిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ రోజు ఈస్టర్ సందర్భముగా మీకు ఒక ప్రేమ సందేశం అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 12 అధ్యాయములో నుండి కొన్ని వచనములు చదువుదాము. 

   కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4 ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 5 యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమి్మ బీదలకు ఇయ్యలేదనెను.

  6 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.7 కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనినుంచుకొననియ్యుడి;8 బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.9 కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని,యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.10 అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక11 ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

     యేసు క్రీస్తు ప్రభువు జీవితములో చివరి వారములో జరిగిన ఒక సంఘటన గురించి ఇక్కడ మనం చదువుతున్నాము. పస్కా పండుగకు 6 రోజులు ముందు యేసు క్రీస్తు ప్రభువు బేతనియ అనే గ్రామమునకు వెళ్ళాడు. ఇది యెరూషలేము నగరమునకు దగ్గరలో ఉంది. ఆ ఊరిలో మరియ, మార్త, లాజరు అనే కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు యేసు ప్రభువు, ఆయన శిష్యుల కొరకు ఒక విందు చేశారు. చాలా రిస్క్ తీసుకొన్నారు. 

   ఎందుకంటే అప్పటికే ప్రధాన యాజకులు, పరిసయ్యులు – యేసు క్రీస్తును ఎలా గయినా చంపాలి, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలిసిన వారు ఆ సమాచారం మాకు ఇవ్వండి అని ప్రకటన చేశారు. యేసు క్రీస్తు మీద వారు ఒక మరణ శాసనం వ్రాశారు. అలాంటి సమయములో మరియ, మార్త యేసు ప్రభువును తమ ఇంటికి ఆహ్వానించి, ఆయన కొరకు ఒక విందు చేశారు. ఎవరన్నా ఏమను కొంటారేమో, ఈ యేసు క్రీస్తు వలన మనకు ఏమన్నా సమస్యలు వస్తాయేమో అని వారు ఆందోళన చెంది సంకోచించలేదు. 

    ఆయన మీద ప్రేమతో వారు రిస్క్ తీసుకొన్నారు. ఆయన మీద కృతజ్ఞతతో వారు ఒక విందు చేశారు, ఎందుకంటే వారి సోదరుడైన లాజరును యేసు ప్రభువు మృతులలో నుండి లేపాడు. ఈ రోజు మనం కూడా యేసు క్రీస్తును బట్టి సిగ్గు పడకూడదు. ఆయనను మన ఇంటి లోకి, మన జీవితములోకి ఆహ్వానించడానికి మనం సిగ్గుపడకూడదు. లాజరు ను మరణం నుండి లేపినట్లుగా, పాపములో మరణించిన మనలను ఆయన దేవుని జీవముతో లేపాడు. లాజరు సిగ్గుపడకుండా, భయపడకుండా, ‘ప్రభువా, మా ఇంటికి రా, మా ఆతిథ్యం స్వీకరించి’ అని ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. మనం కూడా ఈ ఈస్టర్ సందర్భముగా దేవుని కుమారుణ్ణి మన ఇంటికి ఆహ్వానించాలి. ఆయన ఘనపరచాలి. ఇక్కడ ఉన్న వ్యక్తులను మీరు గమనించండి. మొదటిగా మార్త ను గమనించండి. 

     మార్త ఉపచారము చేసెను. యోహాను 12:2 

  అక్కడ జరిగిన విందుకు ఆమె ఏర్పాట్లు చేసింది. ఆమె ఉపచారము చేసింది. యేసు క్రీస్తు ప్రభువు కొరకు శ్రమపడడం ఒక ఆశీర్వాదం అని ఆమె అనుకొంది. ఆయన జీవితం నుండి ఆమె నేర్చుకొన్న పాఠాల్లో అది ఒకటి. 

 మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను. మత్తయి 20:28 

   యేసు క్రీస్తు ప్రభువు సేవ చేయించు కోవడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన సేవచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించడానికి విమోచకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మార్త ఆ సత్యం గ్రహించి వారికి సేవ చేయడం ఇక్కడ చూస్తున్నాము. ఆ తరువాత అక్కడ మనకు మరియ కూడా కనిపిస్తున్నది. ఆమె ఏమి చేసింది. మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను.  యోహాను 12:3 

   మరియ రెండు మాటలు చెప్పి వదిలేయలేదు. బావున్నారా? ఆరోగ్యం బావుందా? అని రెండు కుశల ప్రశ్నలు వేసి వదలి పెట్టలేదు. యేసు క్రీస్తు ప్రభువును ఆమె ఆరాధించింది. గొప్ప ఆరాధన ఆమె చేసింది. పరిమళ సువాసనతో కూడిన ఆరాధన ఆమె చేసింది. మన జీవితానికి ఒక అర్థం ఇచ్చేది ఆరాధనే. ఈ మధ్యలో బార్బీ సినిమా లో ఒక పాట వచ్చింది. 

What I was made for

What was I made for?

When did it end? All the enjoyment

I’m sad again, don’t tell my boyfriend

It’s not what he’s made for

What was I made for?

Think I forgot how to be happy

Something I’m not, but something I can be

Something I wait for

Something I’m made for

Something I’m made for

What were you made for? 

మీరు ఎందుకు సృష్టించబడ్డారు? 

You are made for worship 

ఈ ప్రపంచం ఏమని చెబుతుంది? 

నువ్వు చేయబడింది ఎందుకంటే, 

నువ్వు సుఖ పడాలి 

నువ్వు నీ కోరికలు తీర్చుకోవాలి 

నువ్వు ధనవంతుడవు కావాలి 

నువ్వు నీ లక్ష్యాలు చేరుకోవాలి. 

అయితే వాటి కోసం మీరు చేయబడలేదు. 

మీరు చేయబడింది దేవుని కొరకు. 

మీరు చేయబడింది దేవుని మహిమ కొరకు. 

Something I’m made for

Something I’m made for

ఆ Something ఏమిటంటే 

దేవుని మహిమ పరచుట 

దేవుని చిత్తం చేయుట 

దేవుని ఆరాధించుట. 

మరియ చేసింది అదే. 

ఆమె దేవుని మహిమ పరచింది 

దేవుని చిత్తం చేసింది 

యేసు క్రీస్తు ప్రభువును ఆరాధించింది. 

ఈ ఈస్టర్ దినాన మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని – దేవుని ఆరాధించడమే. మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొని యేసు ప్రభువుకు పూసింది. మనం చేసే ఆరాధన దేవునికి పరిమళ వాసనగా ఉంటుంది. 

    ప్రత్యక్ష గుడారములో ఒక ధూప వేదిక ఉండేది. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించక మునుపు అక్కడ నిలబడి దేవుని ఆరాధించేవాడు. ఆ ధూప వేదిక మీద నుండి సువాసనలు ప్రత్యక్ష గుడారమును నింపేవి. మరియ ఆ అత్తరు పూసి ఆరాధన చేసినప్పుడు ఆ ఇల్లు మొత్తం సువాసనతో నిండింది. యేసు క్రీస్తు ప్రభువు ఆ సువాసన ను ఆనందించాడు. మనం ఆరాధన చేసే ప్రతి గడియను దేవుడు ఆస్వాదిస్తాడు. ఆనందిస్తాడు. యేసు ప్రభువు శిష్యులకు మరియ ను చూసినప్పుడు కోపం వచ్చింది. 

   ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? ఏంటండీ ఈమె, ఇంత విలువైన అత్తరు క్రీస్తుకు పూసింది? దాని విలువ 300 దేనారాలు. అంటే ఒక సంవత్సరము ఆదాయం. అంత డబ్బు వేస్ట్ చేస్తావా? అని మరియను తప్పు పట్టాడు. మన దగ్గర ఉన్న విలువైనవి దేవుడు కోరుకొంటున్నాడు. మన విలువైన సమయం, మన విలువైన కానుకలు, మన విలువైన టాలెంట్స్, మన విలువైన ఆరాధన ఆయన కోరుకొంటున్నాడు. మనం విలువ లేనివి మనకు అనవసరమైనవి దేవునికి ఇవ్వకూడదు. నాకు టైం ఉంటే వస్తాలే, నాకు పని లేపనప్పుడు చర్చి కి వస్తాలే అని చాలా మంది అంటూ ఉంటారు. అది సరైన ఆరాధన కాదు. ఆ సత్యం శిష్యులకు అర్ధం కాలేదు. అయితే మరియకు అర్థం అయింది. 

   యేసు క్రీస్తు ప్రభువు ఇక కొద్ది రోజుల్లో సిలువవేయబడతాడు అని ఆమె గ్రహించింది. ఆమె ఎంతో సమయం యేసు క్రీస్తు దగ్గర కూర్చొని ఆయన బోధించిన సత్యాలు అర్థం చేసుకొంది. మనకు పాప క్షమాపణ కలుగ వలెనంటే, మనం రక్షణ పొందాలంటే దేవుని కుమారుడు సిలువ వేయబడాల్సిందే, రక్తం చిందించాల్సిందే, వేరొక మార్గం లేదు. ఈ సత్యం యేసు క్రీస్తు ప్రభువు అనేక సార్లు బోధించినప్పటికీ, శిష్యులు దానిని గ్రహించలేకపోయారు. ఆయన రోమన్లను చిత్తు చేసి యెరూషలేములో తన రాజ్యం స్థాపిస్తాడు అని వారు కోరుకున్నారు. ఆయన సిలువ వేయబడతాడు అంటే వారు ఒప్పుకోలేదు. మరియ చేసిన పనులు చూసి వారు షాక్ తిన్నారు. 

    ఆమె మూడు పనులు చేసింది. మొదటిగా, అతి ఖరీదైన సెంట్ బాటిల్ పగుల గొట్టి యేసు ప్రభువుకు పూసింది. రెండోదిగా తన తల వెండ్రుకలు ఆమె విప్పింది. ఒక యూదు స్త్రీ అటువంటి పని చేయదు. తల వెండ్రుకలు గౌరవానికి చిహ్నముగా వున్నాయి. మరియ తన తల వెండ్రుకలు విప్పింది. మూడోదిగా పాదాలు తుడిచింది. అది బానిసలు చేయాల్సిన పని. యేసు ప్రభువు మీద భక్తితో మరియ తన అంతస్తు ను, స్థాయిని చూసుకోలేదు. క్రీస్తుకు బానిస అయ్యింది. తన ఆస్తి, అంతస్తు, గౌరవం అన్నిటినీ క్రీస్తు కొరకు ఆమె త్యాగం చేసింది. 

   ఆమెను చూసి యూదా ఇస్కరియోతు కు కోపం వచ్చింది. యేసు క్రీస్తు భూలోక రాజ్యం సంపాదించుకొంటే మంచిది. నేను కూడా ఆయన ప్రక్కన ఉంటే డబ్బు సంపాయించుకోవచ్చు అనుకొన్నాడు. యేసు ప్రభువు భూలోక సంబంధమైన అధికారం, అంతస్తు, ఆస్తులు తిరస్కరించడం చూసి యూదా ఇస్కరియోతు భంగపడ్డాడు. యేసు క్రీస్తు నమ్ముకొని వస్తే, ఏమి సంపాయించుకోలేకపోయానే అని ఆయన అనుకొన్నాడు. అందుకనే తన అక్కసును వెంటనే బయటపెట్టుకొన్నాడు. 

   మరియమ్మ, ఎందుకమ్మా, అంత ఖరీదైన సెంట్ బాటిల్ వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుల తో మనం పేదలకు ఎంతో సేవ చేయొచ్చు అని ఇస్కరియోతు యూదా అన్నాడు. 

6 వచనం. 

వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండి నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. యోహాను 12:6 . అది అసలు సంగతి. నిజముగా పేదల మీద ప్రేమతో యూదా ఆ మాటలు అనలేదు. మరియమ్మ ఆ డబ్బులు కానుకగా ఇస్తే దానిని దొంగిలిద్దాము అని అతని దురాశ. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అవినీతి కి పాల్పడ్డాడు అని అరెస్ట్ చేశారు. ఒక రోజుల్లో ఆయన అవినీతికి వ్యతిరేకముగా ఉద్యమాలు చేశాడు. పోరాటాలు చేశాడు. నిరాహార దీక్షలు చేశాడు. అన్నా హజారే శిష్యుడిని అని చెప్పుకొన్నాడు. పబ్లిక్ సర్వీస్ అంటే డబ్బులు సంపాయించుకోవడానికి కాదు. దేవుని సేవ అంటే డబ్బులు సంపాయించుకోవడానికి కాదు. అయితే యూదా ఇస్కరియోతు ఆ విధముగా ఆలోచించాడు. యేసు ప్రభువు వెంటనే యూదా ఇస్కరియోతు ను గద్దించాడు. 

నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి. యోహాను 12:7 

   దుర్మార్గులు యేసు ప్రభువును అరెస్ట్ చేసే సమయం ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఆయన శరీరం ఈడ్వబడుతుంది, రక్త సిక్తమవుతుంది, వారు ఆయన మీద ఉమ్మి వేస్తారు. వారి దుర్గంధం మధ్యలో మరియ పూసిన అత్తరు ఆయనకు ఉపశమనం ఇస్తుంది. మరియ, ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసింది అని యేసు ప్రభువు అన్నాడు (మత్తయి 26:12) 

బీదలెల్లప్పుడు మీతో కూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.

           మత్తయి 26:11 

   మరియ అతి శ్రేష్టమైన ఆరాధన తో యేసు క్రీస్తు ప్రభువును మహిమ పరచింది. ఈ ప్రపంచములో ఏదీ కూడా ఆరాధన కంటే శ్రేష్టమైనది కాదు. పేదల సంక్షేమం గురించి మనం యేసు క్రీస్తు ప్రభువుకు బోధించాలా? పేదలకు సేవ చేయడం మంచిదే కానీ మన ఆరాధన కంటే అది గొప్పది కాదు. ఆరాధన కంటే ఏదీ గొప్పది కాదు. సువార్త చెప్పడం, ఆత్మలను రక్షించడం, సంఘాలు నిర్మించడం, అన్నదానాలు చేయడం, బైబిలు ధ్యానం చేయడం అవి మన ఆరాధనకు ప్రత్యామ్న్యాయం కాదు. మరియ ఆ సత్యం తెలుసుకొని యేసు ప్రభువును ఆరాధించింది. యేసు ప్రభువు ఆమె భక్తిని మెచ్చుకొని, ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు.

సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. మత్తయి 26:13 

మరియ ఆ రోజున ఆ పని చేసి ఉండకపోతే, ఈ రోజు ఆమె ఎవరికీ తెలిసి ఉండేది కాదు. రెండు వేల సంవత్సరముల తరువాత ఈ రోజు మనం ఆమె గురించి మాట్లాడుకొంటున్నాము అంటే అది ఆమెకు దేవుడు ఇచ్చిన గుర్తింపే. మనం దేవుని ఆరాధించినప్పుడు ఆయన మనకు గుర్తింపు ఇస్తాడు. దేవుని ఆరాధించినప్పుడే మనిషికి విలువ ఈస్టర్ మనకు ఇచ్చే కానుక అదే. God gives us significance. That is the gift of Easter. 

   ఈ ప్రపంచములో మనకు ఎలాంటి గుర్తింపు ఉన్నప్పటికీ మరణం దానిని తీసుకొని వెళ్ళిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు పెద్ద, పెద్ద గుంటలు త్రవ్వి మనుష్యులను పాతి పెట్టారు. కోవిడ్ వచ్చినప్పుడు మనం చూశాము. వేలాది మృతదేహాలను గంగా నదిలో పడవేశారు. మనిషికి ఏమైనా విలువ ఉందా? అని మనకు అనిపిస్తుంది. ఆ దృశ్యాలు గుర్తుకు వచ్చినప్పుడు రుడ్యార్డ్ కిప్లింగ్ వ్రాసిన ఒక పద్యం నాకు గుర్తుకు వస్తుంది. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఒక నావలిస్ట్, కవి, కథల రచయిత. 1865 – 1936 ల మధ్య ఆయన జీవితం గడిచింది. 1914 – 1918 ల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఆయన జాగ్రత్తగా గమనించాడు. రుడ్యార్డ్ కిప్లింగ్ గారి కుమారుడు జాన్ కిప్లింగ్ యుద్ధములో చనిపోయాడు. వేలాది మంది సైనికులు ఆ యుద్ధానికి వెళ్లి, ప్రాణాలు కోల్పోవడం ఆయన హృదయాన్ని కదిలించింది. అనేక మంది తల్లి దండ్రులు సముద్రం ఒడ్డున నిలబడి తమ బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. వారు పడే బాధను కిప్లింగ్ ఒక పద్యములో వివరించాడు. 

Have you news of my boy Jack?

Not this tide.

“When d’you think that 

he’ll come back? 

Not with this wind blowing, 

and this tide. 

‘Oh, dear, what comfort can I find?” 

None this tide, 

nor any tide, 

Except he did not shame his kind—

Not even with that wind

 blowing, and that tide. 

ఒక సముద్రములో ఎగిసి పడే తరంగాలు ఎప్పటి కప్పుడు కనుమరుగు అయ్యేటట్లు మనం ప్రేమించేవారు వారు కూడా కనుమరుగవుతున్నారు అనే భావం ఆ కవితలో చెప్పాడు. వేలాది సిలువల ముందు నిలబడి తన బిడ్డ సమాధి ఎక్కడో తెలియని పరిస్థితి ఒక తల్లికి వస్తే ఎలా ఉంటుంది? ఆమె ఒక సమాధుల తోటలోకి వెళ్తుంది. అక్కడ వేలాది బ్లాక్ సిలువలు పాతి పెట్టబడి ఉంటాయి. తన బిడ్డ సమాధి ఎక్కడో తెలియక ఆ తల్లి బాధ పడుతూ ఉంటుంది. అక్కడ ఒక తోట మాలి చెట్లు పాతుతూ ఉంటాడు. ఆమె అతని దగ్గరకు నడిచి వెళ్తుంది. ఆ తోట మాలి ఆమెను అడుగుతాడు. ‘ఎవరి కోసం వెదుకుతున్నావు అమ్మా?’ ‘లూటి నెంట్ మైఖేల్ టర్రెల్’ 

   ఆ తోట మాలి ఎంతో జాలితో ఆమె వైపు చూశాడు. నా వెంట రామ్మా, నీ కొడుకు సమాధి చూపిస్తాను అని ఆమెను తీసుకు వెళ్లి ఆమె కొడుకు సమాధి ఆమెకు చూపించాడు అంట. ఆమె కొంత సేపు అక్కడ గడిపి ఆ సమాధుల తోట నుండి ఇంటికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆ తోట మాలి చెట్లు పాతుతూ ఉండడం గమనించింది. 

  ఆ కథలోని తోట మాలి ఎవరంటే, మన ప్రభువైన యేసు క్రీస్తే. మరణం తో నిండి పోయిన ఈ భూమి మీద దేవుని జీవాన్ని పాతి, మొలికెత్తించ డానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి సమాధి ఎక్కడ ఉందో ఆయనకు తెలుసు. లాజరు సమాధి ఎక్కడ ఉందో ఆయనకు తెలుసు. ఆ సమాధి దగ్గరకు వెళ్లి, లాజరూ, బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు మరణం నుండి లేచి దేవుని జీవముతో బయటికి నడిచి వచ్చాడు. ఇప్పుడు ఆ విందులో యేసు ప్రభువు ప్రక్కన లాజరు కూర్చుని వున్నాడు. 

    లాజరు ను చూద్దామని జనం ఎగబడ్డారు. మరణం నుండి లేచి ఇప్పుడు భోజనం చేస్తున్నాడా? ఆమ్మో అని వారంతా ఆశ్చర్యపోయారు. మన ప్రభువైన యేసు క్రీస్తు ఆశ్చర్యకరుడు (యెషయా 9:6). కొంత కాలం తరువాత లాజరు చనిపోయాడు. ఈ రోజు లాజరు గారికి రెండు సమాధులు ఉన్నాయి. ఒకటి బేతని గ్రామములో ఉంది. మరొకటి సైప్రస్ లో కిటియన్ అనే ఊరిలో ఉంది. బేతనీ లో ఉన్న ది ఖాళీ సమాధి. 

సైప్రస్ లో ఉన్నది  నిండిన సమాధి. రెండు సమాధులు ఉన్న వ్యక్తి ఈ ప్రపంచములో ఎవరైనా ఉన్నారా? క్రీస్తు నందు మరణించిన ప్రతి వ్యక్తికీ రెండు సమాధులు ఉంటాయి. ముందు ఆ సమాధి నిండుగా ఉంటుంది. మరణముతో నిండి ఉంటుంది. అయితే యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు, ఆయన పిలుపును అందుకొని ఆ విశ్వాసి మరణం నుండి తిరిగి లేచి క్రీస్తుతో కలిసి పరలోకం వెళ్తాడు. 

    అప్పుడు ఆ విశ్వాసికి ఈ ప్రపంచములో మిగిలేది ఒక ఖాళీ సమాధి మాత్రమే. ఈస్టర్ గురించి ఈ రోజు మనం కొంతసేపు ధ్యానించాము. మరణాన్ని జయించి తిరిగి లేచిన మహిమ గల రాజుగా మన ప్రభువైన యేసు క్రీస్తు ఈస్టర్ లో మనకు కనిపిస్తున్నాడు. ఈస్టర్ ఇచ్చే దేవుని నిశ్చయత, నిరీక్షణ, ఆదరణ మీరు మీ జీవితములో పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం.

Leave a Reply