పరిచయం: బైబిలు గ్రంథములోని మొదటి పుస్తకం ఆదికాండము. ఇది బైబిల్ లో అత్యంత ముఖ్యమయిన పుస్తకము, ఎందుకంటే మానవుల మయిన మనం ఈ భూమి మీదకు ఎలా వచ్చామో, ఎలా విస్తరించామో, ఎందుకు మనం ఈ భూమి మీద ఉన్నామో, మానవ జాతి భవిష్యత్తు ఏమిటో ఈ పుస్తకము మనకు తెలియజేయును.
సర్వ శక్తి మంతుడయిన దేవుడు ఈ విశ్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించాడు. భూమి మీద మానవులను ప్రత్యేకముగా సృష్టించాడు. డార్విన్ చెప్పినట్లు మనం జంతువులలో నుండి ఉద్బవించలేదు. దేవుడు తన రూపములో మనలను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని, అర్ధం చేసుకొనవలసిన అత్యంత ముఖ్యమయిన సత్యం. సమస్త సిద్ధాంతాలకు ఇది మూల సత్యము.
పరిపూర్ణుడిగా సృష్టించబడిన మానవుడు పాపము చేసి శాపగ్రస్తుడయినాడు. పాపములో పడిపోయిన మానవ జాతిని విమోచించుటకు దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని పిలిచి అతని ద్వారా, అతని సంతానము ద్వారా మానవ జాతిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ పుస్తకములో జరిగిన సంఘటనలు మధ్య ప్రాచ్యములో మొదలయినాయి. కనానులో (ప్రస్తుత ఇశ్రాయేలు దేశము, పరిసర ప్రాంతములు), ఐగుప్తులో కొనసాగినాయి.
రచయిత: మోషే. ఈ పుస్తకంలోని సంఘటనలు మోషే జీవితానికి అనేక వేల సంవత్సరాలకు ముందే జరిగినవి. ఆదాము మొదలుకొని అనేక మంది వ్రాసిన చరిత్రను మోషే సేకరించి తుది రూపములో వ్రాసి ఉండవచ్చు. లేదా మోషే 40 రోజులు దేవునితో గడిపినప్పుడు దేవుడు ఈ పుస్తకం మొత్తం మోషేకు చెప్పి ఉండవచ్చు. ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించిన దినాల్లో మోషే ఈ పుస్తకం వ్రాసి ఉండవచ్చు. ఏ విధముగా వ్రాయబడినప్పటికీ, పరిశుద్ధాత్ముడు ఈ పుస్తకాన్ని మోషే ద్వారా వ్రాయించాడని క్రొత్త నిబంధన ద్రువీకరించుచున్నది (మత్తయి 8:4; లూకా 24:27,44)
వ్రాయబడిన కాలము: క్రీస్తు పూర్వము 1445 – 1405
వ్రాయబడిన స్థలము: సీనాయి అరణ్యము
ముఖ్య అంశాలు:
- దేవుడు ప్రత్యేకముగా ఈ విశ్వాన్ని, సౌర కుటుంబాన్ని, మానవులను, జంతువులను సృష్టించాడు.
- దేవుడు తన రూపములో మానవులను సృష్టించాడు.
- ఆదాము, హవ్వలు దేవుని ఆజ్ఞను మీరుట వలన మానవ జాతిలో పాపము, వేదన, మరణము ప్రవేశించాయి.
- మానవులతో సహవాసము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు.
- దేవుడు అబ్రాహాము అనే వ్యక్తిని పిలిచి అతని ద్వారా, అతని సంతానము ద్వారా తన ప్రణాళికలను నెరవేరుస్తున్నాడు.
ముఖ్య వ్యక్తులు: దేవుడు, సాతాను, ఆదాము, హవ్వ, కయీను, హేబెలు, నోవహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, యాకోబు, యోసేపు
గ్రంథ విభజన:
- విశ్వ సృష్టి (1:1 – 1:25)
- మానవుని సృష్టి (1:26 – 2:25)
- మానవ పతనం (3-5)
- జల ప్రళయం (6-9)
- మానవ జాతుల విస్తరణ (10 – 11)
- అబ్రహాము జీవితము (12 – 25:18)
- ఇస్సాకు జీవితము (25:19 – 28:9)
- యాకోబు జీవితము (28:10 – 36:43)
- యోసేపు జీవితము (37 – 50)
ప్రవచనాలు:
- ఒక స్త్రీ ద్వారా, సాతానుని జయించి మానవ జాతిని విమోచించే రక్షకుడు జన్మిస్తాడని దేవుడు ఆదికాండము 3:15 లో వాగ్దానము చేశాడు.
- అబ్రహాము ద్వారా మానవ జాతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు’ (12:2)
- మన స్థానములో అర్పించబడే దేవుని గొఱ్ఱెపిల్ల ను దేవుడే పంపిస్తాడు (ఆది 22; యోహాను 1:29)
- రక్షకుడు యూదా గోత్రములో జన్మిస్తాడు (ఆది 49:10)
ప్రభువైన యేసు క్రీస్తు రూపం:
- ఆదికాండములో కనిపిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తే అని క్రొత్త నిబంధన ద్వారా గ్రహిస్తున్నాము (యోహాను 1:1; కొలొస్సయిలకు 1:16; 1 కొరింథీ 8:6)
- స్త్రీ ద్వారా దేవుడు వాగ్దానము చేసిన రక్షకుడు యేసు క్రీస్తే (ఆది 3:15; గలతీ 4:4)
- ‘నిప్పును, కట్టెలును ఉన్నవి గానీ, దహన బలికి గొఱ్ఱెపిల్ల ఏది?’ అని ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును మోరియా పర్వతము మీద అడిగాడు. లోక పాపమును మోసికొని పోవుటకు వచ్చిన దేవుని గొఱ్ఱెపిల్ల యేసు క్రీస్తే (ఆది 22; యోహాను 1:29)
- తన వారిని రక్షించుటకు యోసేపు ముందుగా ఐగుప్తుకు పంపబడినట్లు, యేసు క్రీస్తు మన రక్షణ కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు
- ఆదికాండములో మానవ జాతి మీదకు వచ్చిన పాపము, శాపము, శిక్షలను దేవుడు యేసు క్రీస్తు నందు తీసివేస్తాడు. దేవుని ఎదుట నుండి వెళ్లగొట్టబడిన మానవులను యేసు క్రీస్తు విమోచించి, జీవ వృక్షము యొద్దకు నడిపించాడు (ఆది 3; ప్రకటన 22)
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
- ఆదియందు దేవుడు అనే వాక్యముతో ఈ గ్రంధము మొదలవుతుంది. అన్నిటికంటే ముందు ఉన్న వాడు దేవుడు. మానవుల అభిప్రాయాల కంటే దేవుని వాక్యము ముఖ్యమయినది.
- డార్విన్ వాదులు, నాస్తికులు చెప్పినట్లు ఈ విశ్వము, మానవ జాతి దేవుడు సృష్టించకుండా వచ్చినవి కావు.
- దేవుడు తన ఆజ్ఞలను మానవునికి ఇచ్చాడు. వాటిని తెలుసుకొని, పాటించుట మన విధి.
- దేవుడు మన సృష్టికర్త, మన సంరక్షకుడు, విమోచకుడు, నిరీక్షణ.
- దేవుడు మనతో సంబంధం పెట్టుకొని మనతో ఒక ప్రేమపూర్వక సహవాసాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు.
- దేవుడు తన రూపములో మనిషిని సృష్టించి ప్రతి వ్యక్తికీ గుర్తింపును, ఘనతను, గౌరవాన్ని, హక్కులను, స్వేచ్ఛను, సమానత్వాన్ని ఇచ్చాడు.
- పాపము వలన వచ్చు జీతము మరణము అని 3 అధ్యాయములో గ్రహిస్తున్నాము.
- దేవుడు పాపాన్ని ఉపేక్షించడు, తగిన కాలములో పాపాత్ములను శిక్షిస్తాడు అని జల ప్రళయం, సొదొమ, గొమొఱ్ఱ ల మీదకు వచ్చిన అగ్ని ప్రళయం మనకు తెలియ జేస్తాయి.
- దేవుడు అబ్రహాము, అతని సంతానమయిన యూదులను తన కొరకు ఏర్పరచుకున్నాడు.
- దేవుడు మన కొరకు ప్రభువైన యేసు క్రీస్తు అనే రక్షకుని వాగ్దానము చేసి పంపించాడు.
- ఆదికాండము అంటే ప్రారంభము, హెబ్రీ భాషలో బెరిషిత్. సమస్తాన్ని ప్రారంభించిన దేవుడే, సమస్తాన్ని నిర్వహించుచు, వాటిని తన టైం టేబుల్ ప్రకారము ముగిస్తాడు. ఆ సత్యాన్ని గ్రహిస్తే మన జీవితాలకు కావలసిన ప్రోత్సాహం, నిరీక్షణ కలుగుతాయి.
- విశ్వము మొత్తానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్న దేవుడే, మీ జీవితానికి కూడా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు.