Introduction to the Book of Job by Dr.Paul Kattupalli
పరిచయం:
పాతనిబంధనలో యేసు క్రీస్తు యొక్క శ్రమల సహవాసములో గడిపిన భక్తుడు యోబు. యోబు తన బిడ్డలను, ఆస్తులను, ఆరోగ్యమును కోల్పోయి వర్ణించలేనంత మానసిక, శారీరక శ్రమలకు గురయ్యాడు. అయితే, ‘దేవుని శపించి, చనిపో’ అని భార్య ఇచ్చిన సలహాను ప్రక్కన పెట్టి దేవుని మీద విశ్వాసముతో, నిరీక్షణతో, ధైర్యముతో జీవించాడు. శ్రమ పొందే వాని జీవితములో – దేవుడు, సాతానుడు, కుటుంబం, స్నేహితులు – వారి పాత్రలు, ప్రభావం ఎలా ఉంటాయో యోబు గ్రంథములో చూస్తాము.
యోబును ఓదార్చుటకు వచ్చిన ముగ్గురు స్నేహితులు ఏడు రోజులు మౌనముగా ఉన్నారు. వారు నోరు తెరచి చేసిన ప్రసంగాల వలన యోబు కు మరింత విచారము కలిగించారు. వారి అజ్ఞానములో నుండి వచ్చిన వివరణలు యోబు ను ఆదరించలేకపోయాయి. యోబు శ్రమలకు అసలు కారణము ఏమిటో ఈ గ్రంథములో ఎక్కడా మనకు కనబడకపోవటం ఈ గ్రంథము యొక్క విశేషము. చివరి అధ్యాయములో యోబు తనను తాను దేవునికి సమర్పించుకొని, తగ్గించుకొనుట మనం చూస్తాము. దేవుడు అతని స్నేహితులను గద్దించుట కూడా మనకు కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వారి సలహాలు, అభిప్రాయాల కంటే, మన స్వంత వివరణలు, హేతు వాదాల కంటే, దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకొని సమర్పించుకొనుటయే ఈ పుస్తకము యొక్క ముఖ్య పాఠము.
రచయిత: యోబు లేక పేరు తెలియని రచయిత
వ్రాయబడిన కాలము: అబ్రాహాము లేక మోషే లేక సొలొమోను కాలము
వ్రాయబడిన స్థలము: మధ్య ప్రాచ్యము
ముఖ్య అంశాలు:
1.శ్రమలు: దేవుని పిల్లలకు కూడా శ్రమలు వస్తాయి. యోబు ఎంతో నీతిమంతుడు అయినప్పటికీ శ్రమపెట్టబడ్డాడు.
2.మానవ వివరణలు: యోబు స్నేహితులు తమ అజ్ఞానములో నుండి అనేక వివరణలు ఇచ్చారు. అవి నిష్ప్రయోజనమైనవి అని చివరకు తేలింది. మన చుట్టూ ఉన్న వారు ఇచ్చే అభిప్రాయాలను మనము దేవుని వాక్యము వెలుగులో చూడాలి.
3.దేవుని జ్ఞానము: మానవ విశ్లేషణలు, వివరణలు, అభిప్రాయాల కంటే దేవుని జ్ఞానము ఎంతో ఎత్తైనది
4.దేవుని మీద నమ్మకం: యోబు చివరకు దేవుని మీద నమ్మకముంచాడు. మన జ్ఞానము, మన అభిప్రాయాలు, మన భావోద్వేగాల కంటే దేవుని మీద నమ్మకముంచుట ముఖ్యము.
ముఖ్య వ్యక్తులు: దేవుడు, సాతాను, యోబు, అతని కుటుంబం, అతని స్నేహితులు
గ్రంథ విభజన:
I .యోబు శ్రమలు (1:1 – 2:13)
II.యోబు విలాపం (3:1-26)
III.యోబు – అతని ముగ్గురు స్నేహితులు (4:1 – 27:23)
మొదటి సంభాషణ (4:1 – 14:22)
1.ఎలీఫజు మొదటి ప్రసంగము (4:1 – 5:27)
2.యోబు మొదటి ప్రత్యుత్తరము (6:1 – 7:21)
3.బిల్డదు మొదటి ప్రసంగము (8:1 – 22)
4.యోబు రెండవ ప్రత్యుత్తరము (9:1 – 10:22)
5.జోఫరు మొదటి ప్రసంగము (11:1-20)
- యోబు మూడవ ప్రత్యుత్తరము (12:1 – 14:22)
రెండవ సంభాషణ (15:1 – 21:34)
1.ఎలీఫజు రెండవ ప్రసంగము (15:1-35)
2.యోబు నాలుగవ ప్రత్యుత్తరము (16:1 – 17:16)
3.బిల్డదు రెండవ ప్రసంగము (18:1-21)
4.యోబు ఐదవ ప్రత్యుత్తరము (19:1-29)
5.జోఫరు రెండవ ప్రసంగము (20:1-20)
6.యోబు ఆరవ ప్రత్యుత్తరము (21:1-34)
మూడవ సంభాషణ (22:1 – 27:23)
1.ఎలీఫజు మూడవ ప్రసంగము (22:1 – 30)
2.యోబు ఏడవ ప్రత్యుత్తరము (23:1 – 24:25)
3.బిల్డదు మూడవ ప్రసంగము (25:1-6)
4.యోబు ఎనిమిదవ ప్రత్యుత్తరము (26:1 – 27:23)
IV.యోబు ప్రసంగాలు (28:1 – 31:40)
1.మొదటి ప్రసంగము (28:1-28)
2.రెండవ ప్రసంగము (29:1-25)
3.మూడవ ప్రసంగము (30:1-31)
4.నాలుగవ ప్రసంగము (31:1-40)
V.ఎలీహు ప్రసంగము (32:1 – 37:24)
VI.దేవుని ప్రసంగము – యోబు ప్రత్యుత్తరము (38:1 – 42:6)
VII.యోబు కోల్పోయినవి మరల పొందుట (42:7-17)
ముఖ్య ప్రవచనాలు:
యోబు 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
యోబు 19:26-27 ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను
23:10-11 నేను నడచుమార్గము ఆయనకు తెలియును.ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
ప్రభువైన యేసు క్రీస్తు రూపం: యోబు లాంటి నీతి మంతుడు అన్ని కష్టాలు ఎందుకు పొందాడు? తన కష్టాలలో సమాధానాలను వెతుకుతూ దిగ్భాoతి చెందకుండా యోబు తనను తాను దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. మన రక్షకుడైన యేసు క్రీస్తు కూడా యోబు కంటే ఎంతో ఎక్కువగా శ్రమపెట్టబడిననూ దేవుని ఉగ్రత పాత్రను మన పక్షమున త్రాగి, దేవుని చిత్తమునకు విధేయుడయ్యాడు. యోబు తాను కోల్పోయినవన్నీ తిరిగి పొందాడు. యేసు క్రీస్తు ఇంతకు ముందు తనకు ఉన్న దైవిక మహిమను తిరిగి పొందాడు (ఫిలిప్పీ 2:1-11)
మనం నేర్చుకోవలసిన పాఠాలు:
-యోబు లాంటి నీతిమంతునికే కష్టాలు వచ్చాయి. మానవ జీవితములో ప్రతి వ్యక్తికీ ఏదో ఒక కష్టము, శ్రమ ఎప్పుడో ఒకసారి రాక మానవు.
-యోబు ఎందుకు శ్రమపెట్టబడ్డాడో యోబు గ్రంథములో దేవుడు ఎక్కడా మనకు చెప్పలేదు. మన జీవితములో వచ్చే శ్రమలకు మనకు దేవుడు వివరణ ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ మనం దేవుని జ్ఞానము, ప్రేమ, విశ్వసనీయతలను నమ్మి ఆయనను హత్తుకోవాలి. విధేయతతో ఆయనను వెంబడించాలి.
-దేవుడు విశ్వ సృష్టిలో ఉన్న తన జ్ఞానాన్ని చూడమని యోబును కోరాడు (38 అధ్యాయము). మనము కూడా సృష్టిలో, బైబిలులో దేవుని జ్ఞానమును చూడవలసి ఉంది. మానవ ఫిలాసఫీ కంటే దేవుని జ్ఞానము విలువైనది, శ్రేష్టమైనది.

Feed a Hungry Child with as little as $10 per month
Give a helping hand to feed the hungry children and to provide them health care and education
$10.00